సర్‌ అక్బరు హైదరీసతి గంభీరోపన్యాసము

స్త్రీల పౌరసత్వముల నొసగవలయునని తీర్మానింపబడుట

1-11-1927 నాటి గోల్కొండ పత్రిక లో వచ్చిన వ్యాసం ఇది.
స్త్రీ ల కు పౌరసత్వం ఇవ్వాలి అని ప్రతిపాదన చేసారు. ఆ వార్త మోసుకొచ్చిన విశేషాలు తరుణి పత్రిక పాఠకుల కోసం-
-డాక్టర్ కొండపల్లి నీహారిణి
తరుణి సంపాదకురాలు

 

హైదరాబాదు ఇజూరు 24. నేడు ఉదయము 10 గంటలకు హైదరాబాదు రాష్ట్ర మహిళా మహాసభ సర్‌ అక్బర్‌ హైదరీసతి యాజమాన్యమున సమావేశమైనది.

వలీయద్ధౌలాసతి ఆహ్వాన సంఘ పక్షమున ప్రతినిధులకు ప్రేక్షకులకు స్వాగతమొసగుచు నగర ప్రముఖురాండ్రే కాక, రాజవంశ సభ్యురాండ్రును సమావేశమునందు పాల్గొనుటచే సభాప్రాముఖ్యత అధికమై యున్నదనియు, ఈ సమావేశమునకు సర్‌ అక్బర్‌ సతి యధ్యక్షత వహించుట సభ యొక్క సుకృతమనియు నుడివిరి.

సర్‌ అక్బర్‌ సతి అధ్యక్షోపన్యాసమునందు ”ప్రపంచమునందు నేడు జరుగుచున్నట్టియు నేడు భారతదేశమునందు, హైదరాబాదులో జరుగుచున్నట్టి పరివర్తన వలన మన బాధ్యత అధికమగుచున్నవి. మన విధ్యుక్త ధర్మములను అత్యంతోత్సాహముతోను దూరదృష్టితోను నిర్వర్తించవలయును. ఆధునిక విద్య మన మనోవృత్తికి, మాతృవిధులకు యెంతవర కనుకూలముగానున్నదో పరీక్షింపవలయును, పరీక్షలందు కృతార్థులగుట, గ్రంథములను పఠించుట మాత్రమే సరిపోదు. మన ప్రభుత్వము స్త్రీవిద్యకై యెన్నియో యేర్పాట్లను చేసినది కాని మన ఆవశ్యకతలన్నియు సరిగా గ్రహించలేదు. ప్రభుత్వము మన కాంక్షలను శ్రద్ధతో గమనించ సిద్ధముగానున్నది. గృహపరిశ్రమలను అభివృద్ధినొందుట కవసర విధానముల నవలంభించవలయును. ఈ ఆశయ సిద్ధికై మన సంఘపక్షమున గృహపరిశ్రామిక వస్తువులనన్నిటిని విక్రయపరుచు ఏర్పాటు చేయవలయును. మితవ్యయమును అలవరచుకొన వలయును. మన ప్రాచీన నాగరికతను సభ్యతను విసర్జించగూడదు. మనము ”మేంసాహెబా”లమై మన వంశమును జాతిని సంస్కరింపజాలము. మన నాగరికతను, సభ్యతను స్థిరపరచుచు, నాగరిక భార్యలమై, నాగరిక సోదరీమణులమై, నాగరిక తల్లులమై అభివృద్ధి నొందిజాలెదము” అని నుడివిరి.

మహాసభయందు మొత్తము 16 తీర్మానములు అంగీకరించబడెను. వితంతూద్వాహ శాసనమును అంగీకరించినందుకు మాన్యశ్రీ నిజాంప్రభువు గారికి కృతజ్ఞతనర్పించుచు, ఈ శాసనము నాచరణరూపమును దాల్చునట్లు చేసి ఆచార శృంఖములను త్రుంచివేయుటకై హిందూ జాతిని కోరితి. రెండవ తీర్మానమునందు బాల్యవివాహములను అరికట్టుటకై దేశీయులు పూనుకొనవలయునని కోరబడెను. సంస్థానమందలి గ్రామములందు వైద్యశాలలు లేకుండుటచే బీదజనులకు కష్టము కలుగుచున్నది. కావున గ్రామ వైద్యశాలలను, ముఖ్యంగా స్త్రీలకు వైద్యశాలలు స్థాపింపబడవలయునని ప్రభుత్వమును కోరితి. మరియొక తీర్మానముందు శ్రీ వైద్య రంగారెడ్డిగారలు హిందూ వారసత్వమును గూర్చి సవరణలు ప్రతిపాదించినందుకు అభినందనములొసగుచు పురుషులకు, స్త్రీలకు సమానాధికారములు సిద్ధించు సమస్య, సంస్థాన హిందువులందరిపైనను శాసనము ఏకరీత్యా వర్తించు సమస్యలను గూర్చి వీరి సూచనలందు విశాలత్వము నొసంగవలయుండసియు సూచింప బడెను. భిక్షావృత్తి నిరోధము, విద్యా వ్యాప్తి, నర్సరీ పాఠశాలా స్థాపన, మద్యపాన నిరోధము, శిశు సంరక్షక చట్టము నాచరణలో నుంచుటకు గూర్చిన తీర్మానములును అంగీకరింపబడెను. ఇంకొక తీర్మానము నందు స్త్రీల పౌరసత్వములను సంపూర్ణముగా అంగీకరించవలయుననియు శాసనసభయందును, పురపాలక సంఘమందును ఎన్నికలు జరుగు మరి యితర సంఘములందును స్త్రీలకు సరియగు ప్రాతినిధ్యత ప్రసాదింపబడ వలయుననియు కోరబడెనె.

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

పోపుల డబ్బా