హరి చందన-5వ భాగం

సాంఘిక నవల

నిద్ర పట్ట బోతుంటే శైలజ కాల్.
“ఏమిటే మొద్దూ!నువ్వూ అర్దరాత్రి దాకా పడుకోవు. నన్నూ పడుకోనివ్వవా?” విసుక్కుంది చందన.
“అదికాదే…. మొన్న చెప్పానుగా…. ఆఫీసులో…..”
“ఆఫీస్ విషయాలు… అయిపోయాయి. మిగిలినవి రేపు…”
“ప్లీజ్ ప్లీజ్ … నామాట వినవే…. మా బుజ్జీ కదూ…”
“సరే.. చెప్పేడు…” విసుక్కుంటూనే సెల్ చెవి దగ్గర పెట్టుకుంది.
********************

లంచ్ బ్రేక్ లో డైనింగ్ హాల్ కి వెళ్లి కూర్చుంది చందన. కాసేపటికి శ్యామల తన టిఫిన్ బాక్స్ తో వచ్చి కూర్చుంది.
“చందూ!అ రోజు పార్క్ లో కలిశాక నువ్వు మళ్ళీ నాతో మాట్లాడలేదు. నా గురించి చెప్పలేదని కోపం వచ్చిందా?”
“ఛ ఛ!అదేమీ లేదు. మమ్మీకి ఫివర్.అందుకే తొందరగా ఇంటికి వెళ్లిపోతున్నా. ఇంటి పనులతో కొంచెం బిజీ. అందుకే లంచ్ బ్రేక్ లో కూడా నిన్ను కలవడం కుదరలేదు.”
“సారీ చందూ!అదొక పీడ కల. మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకోవడం ఇష్టం లేక చెప్పలేదు ”
“ఇట్స్ ఓకే..నువ్వు చెప్పలేదని నేనేమీ ఫీల్ అవడం లేదు.. ఫీల్ అయి ఉంటే.. ఇదేనానువ్వు నాతో స్నేహానికిచ్చే విలువ అంటూ నిష్టూరంగా..”
“థాంక్యూ చందూ నన్ను అర్ధం చేసుకున్నందుకు. పద టైమ్ అయింది.” లేచివెళ్ళి చెయ్యి కడుక్కుని, బేగ్ తీసుకుంది.
**************——–*-
“ఓయ్….. ఇంతసేపు ఏంటే…. తలుపు తియ్యడానికి?… కడుపునిండా మెక్కి హాయిగా నిద్దరోతున్నావా, నిద్ర మొహం దానా!” తలుపు తియ్యగానే తిట్లు మొదలెట్టాడు మోహన్.
” ఇప్పుడురాత్రి పదకొండు అయింది.. పడుకోకుండా నీలాగా
బలాదూర్ తిరిగి రమ్మంటావా? “కోపంగా అంది శ్యామల.
“ఏంటే.. నోరు లేస్తోంది? నేను మగాణ్ణి.. నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా. నీ బాబుగాడి సొమ్మేమీ ఖర్చు పెట్టడం లేదుగా.”
“నీ సంపాదన మాత్రమే కాక నా సంపాదన కూడా ఖర్చు చేస్తూ పీకల దాకా తాగి వస్తున్నావ్… సిగ్గులేదూ!..అర్ధరాత్రి ఈ గొడవ ఏంటీ..? నోరు మూసుకుని పడుకో.. అత్తయ్య, పిల్లాడు నిద్ర లేస్తారు”.
” నేను మగాణ్ణి.. నాకెందుకే సిగ్గు…ఆడదానివి. నువ్వు సిగ్గు ఎగ్గూ వదిలేసి ఆఫీస్ లో అడ్డమైన ఎదవలతో రాసుకుని పూసుకుని తిరిగుతూ….. ”
“నోర్ముయ్! పిచ్చిపిచ్చిగా వాగవంటే పళ్ళు రాలగొడతా ”
” నన్ను కొడతావే…. నీయమ్మ….నిన్ను చంపేస్తానే…… “మోహన్ చెయ్యి శ్యామల చెంపను తాకే లోపలే అతని చెంప చెళ్ళుమంది.
భయంతో కళ్ళు మూసుకున్న శ్యామల, గబుక్కున కళ్ళు తెరిచింది.
అత్తగారు తయారమ్మ రౌద్రమూర్తిలా ఇద్దరి మధ్య నిలబడి ఉంది.
“సిగ్గులేదురా దౌర్భాగ్యుడా! కోరి చేసుకున్నావ్ బంగారం లాంటి బిడ్డ. సంతోషంగా ఉండక దాన్నెవత్తినో పెట్టుకుని సహజీవనం అంటూ దీని సంపాదనే కాక చివరికి.. ఇవాళ ఉదయం దీని తాళి కూడా తీసికెళ్ళావ్. ఇంక అది నీ భార్య కాదు. దీని తాళి తెంపి, నిన్నునువ్వే చంపుకున్నావ్. వెళ్ళు, ఇంక నీకు,దీనికి సంబంధం లేదు. …..త్రాష్టుడా! అసలు ఆడదంటే ఆట బొమ్మ అనుకుంటారేoదుకురా మీ మగగాడిదలు.. ఆడది లేకపోతే ఒక్క క్షణం కూడా గడవదురా మీకు. ఆఫీస్ లో అడ్డమైన ఎదవలతో తిరిగేది అయితే నీ చేత దెబ్బలు, తిట్లు పడుతూ ఇన్నాళ్లు నీ దగ్గరే ఎందుకు పడుంటుందిరా దరిద్రుడా? తన ఉద్యోగం తనకి ఉంది, ఎప్పుడో ఎవడితోనో జంప్ అయిపోయి, నీ చావు నువ్వు చావు అని చెప్పేది.ఆ అమ్మాయి మoచిది కనుక నిన్ను భరిస్తోంది. .. ఏంటీ.?… అది ఈ ఇంట్లోంచి పోవాలా? నేను చెప్తున్నా.. ఇంట్లోనుంచి పోవాల్సింది నువ్వు. ఈఇంటికి అద్దె కడుతోంది తను. వెళ్ళు… వెంటనే ఈ ఇంట్లోనుంచి వెళ్ళు. మళ్ళీ ఈ గడపలో కాలు పెట్టావంటే నేనే నిన్ను చంపి, జైలుకి వెడతా. అస్సలునువ్వు పుట్టలేదనుకుంటా.. నువ్వు దాని మెడలో కట్టిన తాళి నువ్వే తీసేసి, నువ్వు చచ్చిన వాడితో సమానమని నువ్వే నిరూపించుకున్నావు ఫో బయటికి .”కొడుకుని బయటికి నెట్టి తలుపులు మూసేసింది తయారమ్మ.
“అత్తయ్యా!”
“ఈ పని నేనెప్పుడో చెయ్యాల్సిందమ్మా.. లేట్ గా అయినా చెయ్యాల్సిన పని చేశాను.”శ్యామల కళ్ళు తుడిచి,”ఇకనుంచి నేను అత్తగారిని కాదు, అమ్మని.. నాకొడుకు ఇక్కడ లేడు కదా అని నన్ను కూడా వెళ్లిపొమ్మని అనకు… నీకు అత్తగా, అమ్మగా వద్దనుకుంటే నా మనవడికి ఆయా అనుకో.ఒకవేళ నువ్వు పొమ్మంటే ఏ అనాధఆశ్రమానికో వెడతాను గానీ, వాడి దగ్గరకి మాత్రం వెళ్ళను. వెళ్లి ఆ దరిద్రం అంతా చూడలేను “శ్యామల తల నిమిరిందావిడ.
ఆవిడ గుండెల్లో తల దాచుకుని గుండె బరువు దించుకుంది.”
శ్యామల మెసేజ్ ఆగిపోవడంతో వాస్తవం లోకి వచ్చింది చందన.
“మై గాడ్!ఇంత దుర్మార్గుడా ఆ మురళీ మోహన్.. పాపం శ్యామల… అసలు..” సెల్ రింగ్ అవుతుంటే ఆలోచనలు ఆపి, చూసింది….. శ్యామల.
“శ్యాము! నీ మెసేజ్ చదివాను. ఐ యామ్ సారీ!
ఏవో మనస్పర్థలు వచ్చి విడిపోయారనుకున్నాను గానీ, మరీ ఇంత దుర్మార్గం అనుకోలేదు. ఛ!భార్య, చక్కని బిడ్డ ఉండగా…
మరో స్త్రీతో సహజీవనం… ఊహించుకోడానికే కంపరంగా ఉంది.
మన వివాహ వ్యవస్థ, సంస్కృతి, సంప్రదాయం… అన్నీ గాలికి వదిలేసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు, విదేశీ అలవాట్లతో
కాపురాల్ని కూలదోసుకోవడం…..”
“సాటి ఆడవాళ్ళే పరపురుషునితో.. అదీ పెళ్లయిన వాడితో రహస్యంగా….రహస్యం ఏంటిలే.. అప్పుడు అందరికీ తెలిసిపోయింది. నేను లీగల్ గా విడాకులు తీసుకుని ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేశాను. అత్తయ్యని కొడుకు దగ్గరకి వెళ్ళమంటే… మనవడికి ఆయాగా నైనాఉంటా అన్నారు , నాకు పెద్ద దిక్కుగా ఇక్కడే ఉంటానoటే కాదనలేకపోయాను ”
“మంచిపని చేశావు. కొడుకు అలాంటివాడు అయినoదుకు ఆవిడ లోలోపల ఎంతో బాధ పడుతుంటారు. నువ్వు కూడా కాదంటే.. పాపం!”
“సరేలే!ఇదొక శాంపిల్ మాత్రమే.. రోజు ఇలాంటివే ఏదో ఒక సంఘటన….ఫ్రెండ్ వి నీకు నా విషయాలు వేరేవారి ద్వారా తెలిసి, నన్నెక్కడ తక్కువగా…”
“ఛ ఛ!అలా ఎన్నటికీ జరుగదు శ్యామూ! పాత విషయాలన్నీ కెలికి నిన్ను బాధ పెట్టానేమో ”
“నువ్వేమి అడగలేదుగా నేనే చెప్పాను. అత్తయ్య వింటే మరిచిపోయిన గాయం మళ్ళీ రేగుతుందని ఫోన్ లో చెప్పకుండా మెసేజ్ పెట్టాను. ఇక్కడే నా రూమ్ లోనే పడుకుంటారు కదా!
అత్తయ్య పడుకున్నారని ఇప్పుడు హాల్లోకి వచ్చి మాట్లాడుతున్నాను ”
“అవును. అర్ధమైంది. గుడ్ నైట్.. ఇవన్నీ ఆలోచించకుండా నిద్ర పో. రేపు మళ్ళీ ఆఫీస్ లో పని చేసుకోవాలి కదా.” సెల్ ఆఫ్ చేసింది.

ఈ విషయాలన్నీ హరి కూడా చెప్పాడు.
“శ్యామల ట్రాన్స్ఫర్ అయి వెళ్ళగానే నేను ఎమ్మెస్ చెయ్యడానికి అమెరికా వెళ్ళాను. రాగానే, ఇక్కడ సొంతం గా ఆఫీస్ ఓపెన్ చేశాను కొంత మంది స్టాఫ్ ని చేర్చుకున్నా. ఆ బిజీలో
ఆ విషయం దాదాపుగా మరిచి పోయాను.పార్క్ లో నీతో మురళీని చూసినప్పుడు గుర్తుకొచ్చింది” అని, హరి చెప్పడం గుర్తుకొచ్చింది.
ఇప్పుడు ఆ పార్ట్నర్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిందేమో. మళ్ళీ శ్యామల వెనక పడ్డాడు. ఆ రోజు పార్క్ నుంచి వెళ్ళిపోతూ, మళ్ళీ కలుస్తానని అన్నాడుగానీ, హరి తన నిర్వాకం అంతా బయట పెట్టి ఉంటాడని సిగ్గుపడి ఉంటాడు అందుకే మళ్ళీ కనిపించలేదేమో….
( సశేషం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

యూరోప్ ట్రిప్ – 23 

నదీమతల్లి – 5వ భాగం