ఇంతవరకు జరిగిన కథ:
ఆమని మనవడి పుట్టినరోజు వేడుకకు హాజరైన మైథిలి, మాలినిలు ఆ వేడుక పూర్తి కాగానే అదే ఊళ్లో ఉంటున్న పద్మిని ,హాసిని ,చంద్రికలను కలుస్తారు. వీరంతా ఒకప్పుడు విజయవాడలో ఒక ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో కలిసి పని చేసినందున వీరి మధ్య గాఢమైన స్నేహం అల్లుకుంటుంది. పద్మిని, హాసిని ,చంద్రికలకు ప్రభుత్వ కొలువులు దొరకటంతో వారు ఆయా ఊళ్లకు వెళ్లిపోతారు. ఉద్యోగాలపోటీని తట్టుకోలేని మైధిలి ,ఆమని, మాలినిలు అవే ప్రైవేటు ఉద్యోగాలతో కుస్తీ పడుతుంటారు . గట్టి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత ఉన్న మైధిలి కూడా అలాంటి అవకాశాన్ని దొరకపుచ్చుకోలేక ఇటు ఇంట్లోనూ అటు సమాజంలోనూ వివక్షకు గురవుతుంది .ఏ కాలమైతే ఆమని భర్త రామారావు గారిని ఉన్నతమైన మనిషిగా మలిచిందో అదే కాలం మాలిని పట్ల నిర్దాక్షిణ్యంగా పసుపు కుంకుమలకు దూరం చేసి పరోక్షంగా ఒంటరిని చేయటం , హాసిని పట్ల ఆమె భర్త ప్రవర్తించే వైఖరిలాంటి దుఃఖపూరిత విషయాలు తెలుసుకున్న మైధిలి బాధతో కదిలిపోతుంది. మేమంతా నీకు అండగా ఉంటామని ధైర్యం చెప్తారు హాసినికి మిత్రురాండ్రంతా
ఇక చదవండి
మేము వడ్డించుకుందామనే లోపులోనే అన్నయ్యగారు కొన్ని పదార్థాలు, అమని కొన్ని పదార్థాలు మా ప్లేట్లలో వడ్డించి, వాళ్ళు వడ్డించే పదార్థాలకి నో చెప్పే అవకాశం లేకుండా చేశారు మొత్తానికి ఇద్దరూ కలిసి. సరదాగా కబుర్లాడుకుంటూ భోజనం ముగించాము. రామారావు అన్నయ్యగారు జోక్స్ కట్ చేస్తూ, తనకు ఉద్యోగం వచ్చిన కొత్తలో జరిగిన కొన్ని సంఘటనలు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుకున్నాం. మా టీచింగ్ పీరియడ్‌లో చూడటమే ఆయనని. సరదాగా మాట్లాడ్తారు రామారావు అన్నయ్య అని మాలిని చెబ్తుండగా, చాలాసార్లు వినివున్నాను గానీ, ఇంత క్లోజ్‌గా, సరదాగా స్వంత అన్నయ్యలాగా మాట్లాడటం చూస్తుంటే ఆ అభిమానానికి నా కండ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. అది వారికంట కనపడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించాను నేను.
మాలిని వాళ్ళ కొడుకు, కోడలు ఉండేది, ఆమని వాళ్ళు ఉండేదీ అదే ఊరు. కానీ నేనే చాలా సంవత్సరాల తర్వాత కలిసి, చూస్తున్నందువల్లనో ఏమో… నిన్నటికి నిన్న పద్మిని దంపతులు, చంద్రిక వాళ్లింటో, వారు చూపించిన అభిమానం, మాలిని వాళ్ళ కొడుకు, కోడలు నన్ను రిసీవ్ చేసకుని అక్కున చేర్చుకున్న తీరు… ముఖ్యంగా మా అందరి పిల్లలు (ఒక్క హాసినికి మినహాయించి) మా కాలేజీలోనే, అంటే మేము పని చేసిన కాలేజీ విద్యార్థులవ్వటం వల్ల అప్పట్లో మేడమ్ అని సంభోదించినా, అప్పుడప్పుడు ఫోన్లలో పలకరింపు ద్వారా ఆంటీగా మారిపోయా. ఈరోజు అది నన్నెంతో సంతోషానికి అంతకు మించిన సంతృప్తిని మూటకట్టించింది. ఇలాంటి స్నేహితులుంటే చాలుగదా! వీరి ముందు సొంత చుట్టాలైనా బలాదూరే నన్పించింది. ఇదేమాట మాలినితో అంటే ‘‘అంతేనబ్బా’’ అంది తను కూడా.
ఓ గంట కూర్చున్నాక, బస్టాండుకు బయల్దేరాను నేను, అందరి దగ్గరా సెలవు తీసుకుంటూ. మాలిని, ఆమని ఇద్దరూ బస్టాండుకు వచ్చి, బస్ వచ్చేవరకు నిరీక్షించి, రాగానే నన్ను బస్సెక్కించి జాగ్రత్త అని చెప్పి, బైబై చెబుతూ, ఆటోలో వాళ్ళిద్దరూ వారి వారి ఇండ్లకు వెనుతిరిగారు.
***
ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. మా జీవితాలు పరచిన ఎర్ర తివాచీలు అసలే కావు. ఇంటా, బయటా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ముఖ్యంగా కుటుంబ విషయాల్లో ఎన్నో ఢక్కా మొక్కీలు తిని పడిలేస్తూ, లేస్తూ పడుతూ… ఇదిగో ఈనాటికి అన్ని బాధ్యతలూ తీరిపోయాయి కాబట్టి నిన్నటి పుట్టినరోజు వేడుకని అంత ఆనందమయం చేసుకోగలిగాము.
టిక్కెట్ అన్న కండక్టర్ పిలుపుతో మనీ పర్సు తెరచి సరిపడా డబ్బులిచ్చి టికెట్ తీసుకొని, పర్సులో పెట్టి విండోకి దగ్గిరగా జరిగి కూర్చున్నాను.
వాతావరణం ఎంతో ఆహ్లాదంగా అనిపించసాగింది. కిటికీలోంచి చల్లని గాలి మొహానికి తాకి, నా ఆహ్లాదానుభూతిని అది రెట్టింపు చేసింది.

ఆమని అందమైన పేరు. కానీ పేరుకీ, జీవితానికీ ఎటువంటి లంకె కుదరదు ఒక్కోసారి. కాలం కుదిపే కుదుపులకు అతీతులం కాదెవరమూ. వాటిని తట్టుకుని నిలబడేదే గదా జీవితమంటే.
ఒకరకంగా చెప్పాలంటే మా ఫ్రెండ్సందరి పేర్లూ చాలా సౌందర్యవంత మైనవే. అలా సాగిపోవాలనే ఆశతోటి మా తల్లిదండ్రులు చిన్నతనంలో పెట్టినవే. కానీ మానవుడు తలచేదొకటి, జీవితంలో జరిగేది వేరొకటి. అందరమూ ఈ కాలచక్ర భ్రమణంలో ఎదురయ్యే కష్టాలతో ఈడ్వబడుతూ అప్పుడప్పుడూ అతిథుల్లా పలకరించే సంతోషాలను బూస్టింగ్‌లా భావిస్తూ గెలుస్తూ ఓడిపోతూ, కొన్నాళ్ళు ఓడిపోతూ, గెలుస్తామనే ఆశతో కొన్నేళ్ళు… గెలుపు, ఓటముల కలయికే జీవితమనే యదార్థాన్ని జీర్ణం చేసుకుంటూ కాలంతో నడిచిన వసంతాలు కొన్ని.
ఏంటో ఈమధ్య బాగా వేదాంతం పుట్టుకొస్తోంది నాలో. ఇది వయసుతో పాటు ఆపాదింపబడినదా లేక జీవిత వాస్తవాల నుండి ఎగజిమ్మిన లావాలా చిలకరింపా? ఏదో మొత్తానికి వాటన్నింటినీ తట్టుకుంటూ, ఒకరకంగా చెప్పాలంటే మొండిగా అధిగమిస్తూ… ఇవాళ ఇలా నిలబడిగలిగాం మేమంతా. ఇంటింటికో చరిత్ర అన్నట్లుగా ఒక్కో కుటుంబానిది ఒక్కోగాథ. ఒక్కొక్కసారి జీవితంలో తెలుపు, నలుపుల మలుపులు. ఈనాటికీ చదరంగంలాంటి జీవిత పాఠాల, గుణపాఠాల గడులను నేర్పు అనే ఓర్మితో, ఒంటపట్టిన పాఠాలను నెమరువేస్తూ బంధాలను నిలుపుకుంటూ, గుణపాఠాల బడిలో ఇంకా నిత్య విద్యార్థులుగానే వెలుగుతూ అవసరమైన అంశాలను సేవ్ చేసుకుంటూ మనోవ్యాధికి గురిచేసి కుంగుబాటుని రానివ్వగల సంఘటనలను మొదడు నుండి డిలీట్ చేసుకుంటూ… అప్పుడప్పుడూ ఇదిగో ఇలా ఈ స్నేహ పరిమళాలను రీఛార్జ్ చేసుకుంటూ బ్రతుకు బ్యాటరీని వెలిగించుకుంటున్నాం.
మధ్యలో ఏదో ఊరొచ్చింది. పల్లీలు అమ్మేవాడి కేకలు చెవిలో ఘొల్లు మంటుంటే, ఆలోచనలతో ఓ కునుకు తీసిన నాకు గబుక్కున మెలకువ వచ్చింది.
మనసు మాయలమారి పుట్ట అంటారు చాలామంది. మనకు కోరికలను చుట్టేసి మనచుట్టూ మాయలనే పుట్టలాగా చుట్టగల నేర్పరి. కానీ నేను అనుభవాల పుట్ట, అల్లరి పుట్ట, జ్ఞాపకాల మాళిగ అని కూడా అంటాను, ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.
మనం ఖాళీగా ఉన్నామని పసిగడితే చాలు ఒక్కో జ్ఞాపకాన్ని గాని, ఒక్కో సంఘటననుగాని మనమీదకు అస్త్రంగా సంధించి చోద్యం చూస్తూ మన మానసిక బలాబలాలను లెక్కగట్టే ఓ గొప్ప యంత్రమే మన మనసు.
వ్యసనాలు కొక్కేనికి తగిలించే చొక్కాలు కావు. అవి మనుష్యుల్ని రాపాడిరచి, చీడపురుగులై వ్యక్తిత్వాలను నిలువెల్లా కూల్చేస్తాయి. ముందు సరదాగానే మొదలవుతాయి. తర్వాత అలవాట్లుగా మారి కూర్చుంటాయి. వాటికి బానిసలుగా మారిన వారితో అనుక్షణం దాసోహం చేయించుకుంటాయి. చిత్తు చిత్తు చేస్తాయి జీవితాలను. ఒక్కరితోపోదు ఈ పీడ. చెట్టు వేళ్లను పెకిలిస్తే, ఇక చెట్టుకున్న కొమ్మలేం పచ్చగా ఉంటాయి? పూలేం పూస్తాయి? కాయలేం కాస్తాయి? చివరికి అంతా నాశనమే. వ్యసనాల బారినపడిన కుటుంబాలదీ అదే పరిస్థితి. మేల్కొంటే జీవితం మధ్య పేజీలో ఉన్నా ఆనందమే అంతటా. జీవితం వంద పేజీల పుస్తకమైతే మా జంటలన్నీ సెంటర్ పేజీని క్రాస్ చేసిన చదువరులమే!
ఆమధ్య పురా స్నేహితురాలు కలిసింది. తనపేరు సువర్ణ. ఇంచుమించు నా వయసే. మనసు మాణిక్యం. పేరుకు తగ్గట్టే పసిడి వర్ణం, గులాబీ వర్ణం రెండూ కలిపితే ఏర్పడే మేనిఛాయ తనది. పెద్ద పెద్ద కండ్లు. తీర్చినట్లుండే కనుబొమ్మలు. ఇంద్రధనువులా వంపు తిరిగి నల్లగా ఉంటాయి. వంకీల జుత్తు. పోనీ వేసుకుంటుంది. చేతినిండా మట్టిగాజులు. మాటలో సౌమ్యం. నడతలో నమ్రత. చీరకట్టులోనైనా, డ్రెస్‌లోనైనా తిరిగి చూడాలనిపించే అందమైన, ఆకర్షణీయమైన రూపం. నవ్వినపుడు తళుక్కుమనే పలువరుసని చూస్తే దానిమ్మ గింజలు కూడా అలుగుతాయేమో నన్పిస్తుంది. మా ఇద్దరిదీ ఒకేవూరు. వారి శ్రీవారిది, మా శ్రీవారిదీ ఒకటే డిపార్టుమెంటు అవ్వటం మూలంగా తరచుగా అనేకంటే దాదాపు అన్ని పెండ్లిళ్లల్లో, వేడుకల శుభసమయాల్లో కలుస్తుంటాం. అలా పరిచయం కాబడ్డ మేము క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోవటానికి ఎన్నో రోజులు పట్టలేదు.
తరచుగా కలిసినపుడు, అదే చాలా ఏండ్ల నాటి సుపరిచయమై కష్టసుఖాలను మనసు విప్పి చెప్పుకునే స్థాయికి ఎదిగేట్టు చేసింది. అలాగే సంత రోజుల్లో కూడా కూరగాయలు కొనుక్కోవటానికి వెళ్లినపుడు లేదా ఏదైనా షాపింగ్ సమయాల్లో కలిసేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్లం.
అప్పుడప్పుడు ఫోన్లలో పలకరింపులు, ఛాటింగ్‌లు ఉండనే ఉంటాయి. ఒకసారి కలిసినపుడు… ఎప్పుడూ కలివిడిగా, సందడిగా తిరిగే తను ముక్తసరిగా మొహంలో ఏదో చెప్పనలవికాని బాధ గూడు కట్టుకున్నట్లు కనిపిస్తే, నేనే అడిగాను ‘ఏంటి సువర్ణా ఇలా ఉన్నావు? మొహంలో హుషారు కనబడట్లేదేంటి? పిల్లలకేమన్నా ఒంట్లో బాగోలేదని కబురొచ్చిందా?’ అన్నా. ‘ఊహూ…’ అంటూ తల అడ్డంగా ఊపింది కాదన్నట్లుగా.
‘మరి మీ వారికి ఏమైనా అనారోగ్యమా’? అని అడిగా.
దానికీ కాదని మళ్లీ తల అడ్డంగా ఊపింది. ఈసారి తన కండ్లలో సన్నని నీటిపొరను చూశాను. ఎందుకో నా మనసు కలుక్కుమంది. ఆనోటా, ఈనోటా వాళ్లింటాయన గురించి విన్నాను. తర్వాత ఒకరిద్దరి ద్వారా తెలిసినది ‘నిజమే… సువర్ణ వాళ్ళాయన చాలా అనుమానం మనిషి’ అని. నాకెందుకో బాగా డౌట్ వచ్చింది. ఆ హాల్లో సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. బాగా పరిచయస్తులవ్వటంతో మేము అంటే నేను, సువర్ణ ముందుగానే వెళ్ళాము. ఆలస్యంగా వెళితే బాగోదని. ఈ వ్రతం, పెట్టుబడులు అవ్వీ ఇవ్వీ అయ్యేటప్పటికి కనీసం గంటన్నర పైచిలుకే పట్టేట్లుంది. ఇక లాభం లేదు. తన మనసెందుకో బాగా బాధపడుతోందని అర్థమైంది. కనుక్కోవాలనుకున్నాను. అది గృహప్రవేశ ఫంక్షను. అంతకుముదే అవతలి రూంలో గణపతి హోమం చేశారు. ఇవతలి రూంలో వ్రతం పెట్టుకున్నారు. దీపారాధన వెలిగించబడి ఉన్నది గదా స్వామి వారి మంటపం ముందు ఫ్యాన్లు బంద్ చేసేశారు. నిజంగా ఆ హోమపు పొగ ఇవతలికి కూడా బాగా వస్తోంది. ఈ వంకతో తనని ‘కాసేపు అటు బైట కూర్చుందాం రా… పొగ తగ్గాక లోపలికి వద్దాంలే’ అంటే, సరేనని తల ఊపింది.
గట్టిగా అడిగితే చాలు ఆ కన్నీటి కుండలైన ఆ కండ్ల నుండి ధారగా మారటానికి సిద్ధంగా ఉన్నాయి కన్నీళ్ళు. నెమ్మదిగా తన భుజం చుట్టూ లాలనగా నా రెండు చేతులను చుడుతూ ‘ఏమైంది?’ అని అడిగా. ఇక నీవు చెప్పకపోతే ఊరుకోనన్నట్లుగా చూశాను. చెప్పకపోతే వదిలేలా లేదనుకుంది కాబోలు, అటూ ఇటూ తటపటాయిస్తూ చూసింది నాల్గువైపులా భీత హరిణిలా.
గృహ యజమాని, భార్య, వారి పిల్లలు వ్రతం చేసుకుంటున్నారు బుద్ధిగా దగ్గిర బంధువులని పిలవబడే వాళ్ళు వారి చుట్టూ జంపఖానాల మీద కొందరు మోకాళ్లనొప్పి, నడుము నొప్పి బాధితులు కుర్చీలలో కూర్చుని శ్రద్ధగా స్వామివారి కథను వింటన్నారు. మగవాళ్ళు బైట వరండాలో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు.
‘మనవేపు ఎవరూ చూడట్లేదుగాని, ఏంటమ్మాయి ఈరోజు చాలా మూడీగా ఉన్నావు’ అని నిలేశా. ఏ ఇంటిలోనైనా ఉత్తరం సందు వదులుతారు గదా. అలానే ఉంది ఆ ఇంటికి కూడా. అక్కడే సేఫ్ అని నే అటుదారి తీశా, కుర్చీ తీసుకుని, నాతోపాటే తానూ తన కుర్చీ తెచ్చుకుంది అక్కడికి.
గతంలో చిన్ని చిన్ని విషయాలు చెప్పి బాధ పడేదికానీ, దానిని మించిన బాధ పడ్తోందీరోజు అన్పించింది తన వాలకం చూస్తుంటే. కండ్లనిండా ధారగా కురుస్తున్న కన్నీటిని కర్చీఫ్‌తో అద్దుకుంటూ, సన్న గొంతుకతో, కేవలం నాకు మాత్రమే వినపడేటట్లుగా లో గొంతుకతో చెప్పటం ప్రారంభించింది. మా కష్టసుఖాలేవి కలబోసుకున్నా అవి మా కడుపులోనే ఉంటాయి. ఒకరిమీద మరొకరికి అలాంటి నమ్మకం ఉంది మాకు ఇప్పటికీ, ఎప్పటికీ. అది మాకు బాగా తెలుసు.
‘‘నేను రోజూ యోగా క్లాస్‌కి తెల్లవారురaామునే వెళ్తాను కదా!’’ అంది దుఃఖాన్ని తమాయించుకుని.
‘‘అవునూ’’ అన్నాను. తను, నేనూ యోగా క్లాసులో కూడా తను ముందు వెళితే, నా మ్యాట్‌ను ప్రక్కనే వేసి ఉంచేది. అలాగే ఒకవేళ నేను ముందుగా వెళ్ళినపుడు నా ప్రక్కనే తనకు మ్యాట్ వేసి ఉంచేదాన్ని. దాదాపు రెండేళ్లు యోగా క్లాస్ మేట్స్‌మి కూడా. తర్వాత నాకు కొంచెం అనారోగ్యంగా ఉండటంతో ఒక సంవత్సరం అయిపోతుంది వెళ్ళక. ఇంట్లోనే ప్రాణాయామం చేస్తాను. రోజూ సాయంత్రాలు యాభై నిముషాలు తగ్గకుండా నడుస్తాను. నా జ్ఞాపకాలకు బ్రేక్ వేస్తూ తనను ‘తర్వాతేం జరిగింది?’ అన్నా కండ్లతోటే.
యోగా సెషన్లో చివరిరోజు వార్షికోత్సవం లాగా చేస్తారు. బాగా అనుభవజ్ఞులైన యోగా టీచర్ జిల్లా కన్వీనర్‌గా పిలువబడే యోగా గురువు ఒకరిద్దరు హాజరవుతారు. యోగాపట్ల మీమీ స్పందన తెల్పండి అని అందరితో మాట్లాడిస్తారు. అందరితో అదే హాలులో ఆటలాడిస్తారు. మెమొరీ పవర్ పెంచేవీ, ఐక్యతను వృద్ధి చేసేలాంటి వాటితోటి. మధ్యలో ఆధ్యాత్మిక విషయాలను మన మనసులలో పదిలం చేసుకునే దిశగా భగవంతుని మీద ఉండే కీర్తనలు, పాటల కేసట్లను పెట్టి మనల్ని కండ్లు మూసుకోమని సూచనలిస్తూ భజనలు చేయిస్తారు. నిజంగా ఎంతో పారవశ్యంతో కూడిన ఆధ్యాత్మికానందాన్ని పోగు చేసుకుంటాం ఈ కార్యక్రమం ద్వారా. ఆరోజు ఫలహారం అందరికీ అక్కడే సమకూర్చబడుతుంది. మనల్నే పండ్లు తెమ్మంటారు. కొంతమంది ఆరోజు డ్రైఫ్రూట్స్ లాంటివి కూడా తెస్తారు. ఆ హాలే క్యాంటీన్. మనమే కుక్స్. మనం తెచ్చినవే వెరైటీ టిఫిన్స్. మధ్యలో ఒక గంట స్వల్ప విరామం కేటాయిస్తారు. అక్కడ నీనా అనే తేడాగానీ ఉచ్ఛ, నీచ, ఆడ, మగ బేధాలేవీ ఉండవు. ఉండేదల్లా అంతా ఒకే కుటుంబమనే సద్భావన మాత్రమే. అందరూ తెచ్చిన పండ్లన్నీ ముక్కలుగా కోసి, ఎంతమంది ఉంటే అంతమందికి ప్లేట్లలో పంచుతారు. వండిన ఆహార పదార్థాలు టిఫిన్‌కు నిషిద్ధం ఆరోజు. ఒకరోజు ముందే ఈ విషయాన్ని సూచిస్తూ మీతోపాటుగా ఇంకో ఇద్దరికి సరిపడా పండ్లు తెమ్మని చెబుతారు. కోసిన ఆ పండ్ల ముక్కలన్నీ కలిపితే బోల్డవుతాయి. అందరి కడుపునిండగా ఇంకా కొన్ని పదార్థాలు మిగిలిపోతే ఇంటికొచ్చేటప్పుడు ఎవరికి కావాలంటే వారిని తినమంటారు. ఎవరైనా కొబ్బరినీళ్ళు తెచ్చినా, ఫ్రూట్స్ సలాడ్స్ లాంటివి తెచ్చినా, వాటినీ గ్లాసుల్లో పోసిస్తారు అందరికీ. ఇలా బ్రేక్‌గా ఇచ్చిన గంట సమయం సరదా సరదా కబుర్లతో ఇట్లే గడిచిపోతుంది. టాయిలెట్స్‌కి వెళ్లొచ్చేవారు వెళ్లొస్తారు. అందరం అక్కయ్య, అన్నా, తమ్ముడు, చెల్లి లాంటి ఆప్యాయతా పూర్వక పిలుపులే. ట్రైనర్స్‌ని గురువుగారని సంబోధిస్తాం. వాలంటీర్లను చిన్న గురువుగారంటాం నవ్వుతూ. ఎక్కడా ఎలాంటి అమర్యాద పూర్వక వాతావరణాన్కిగానీ తావుండదు. యోగా హాల్ అంటే పవిత్ర దేవాలయం. మధ్య మధ్యలో గురూజీల ప్రసంగాలు ఉంటాయి. వాటి తర్వాత మరికొన్ని యోగాసనాలు, తర్వాత మళ్లీ ఏవైనా రెండు ఆటలు, మళ్లీ స్పీచ్, స్పందనలు ` ఇలా ఒకదాని తర్వాత మరో అంశం నిర్వహింపబడుతూ ఎక్కడా బోర్ అనేదానికి తావులేకుండా ఆరోజు మరపురాని రోజుగా మలుస్తారు యోగా గురువులు.
ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన యోగా ఈ చివరిరోజు మాత్రం దాదాపు ఇదంతా పూర్తయ్యేసరికి పదకొండున్నర, పన్నెండు అలా అయిపోతుంది. చెప్పలేదు కదూ! సాధకులందరూ గురూజీని దుశ్శాలువాతో సన్మానించి మెడలో పూలదండను సమర్పిస్తారు. కొంతమంది వారి వారి శ్రద్ధాసక్తుల మేరకు నూతన వస్త్రాలు కూడా సమర్పించటం కద్దు. కానీ ఈ వస్త్ర సమర్పణ అనేది అనివార్యం కాదు. మరి నాకేం గురుదక్షిణ ఇస్తారు? మీరంతా అని గురువుగారు అడిగిన ప్రశ్నకు సాధకులంతా తమకు తోచిన రీతిలో సమాధానమిస్తుంటే ఆయన నవ్వుతూ ఇవన్నీ ఏమీ వద్దు! మీరు నేర్చుకున్న ఈ యోగావిద్యను మీ వంతుగా మరో ఇద్దరికి పరిచయం చేయండి. ఒకవేళ కుదరక రోజూ క్లాసుకు హాజరవ్వకలేకపోయినా మీరు ఈ నేర్చుకున్న క్రియలను అభ్యాసం చెయ్యండి. సంపూర్ణ ఆరోగ్యంతో
ఉండండని దీవిస్తారు. ఎంతోమంది బాబాల పేరుతో, స్వామీజీల పేరుతో ఫలాపేక్షతోటే నడుస్తున్న నేటి సమాజంలో ఎటువంటి స్వలాభాన్ని ఆశించకుండా మరో ఇద్దరికి మీ వంతుగా నేర్పండని కోరటమే గురుదక్షిణ అని చెప్పిన సంస్కారవంతమైన ఈ యోగా గురుపరంపర యొక్క విలువలను ఆచరించి, తరించటమే తప్ప ఏమిచ్చి కొనుక్కోగలం. ఈ యోగ కుటుంబం నేర్పిన నిస్వార్థ పూరితమైన కుటుంబిక సంస్కారాలను ఎన్ని లక్షలు పెట్టినా కొనగలమా?
‘గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన’ అన్న రీతిగా కొంతమంది యోగా చేసేవారిని చులకనగా చూస్తూ, పొద్దున్నే వెళ్తున్నారంటే ఏదో కూడని పనికే
వెళ్తున్నారనే కాలం. ఇలాంటి పచ్చకామెర్ల రోగులను ఏ వైద్యుడు బాగుచేయగలడు? ఏ గురువులు సంస్కారాలనందివ్వగలరు? ఏ ఉపాధ్యాయుడు సత్ప్రవర్తన గురించి బుర్రకెక్కేట్టు పాఠాలు బోధించగలడు? పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకలతో పోవాల్సిందే. సరిగా ఇలాంటి కోవలోకే వచ్చే ఓ ఆణిముత్యం సువర్ణ వాళ్ల పతిదేవుడని తెలిసింది తను వెళ్లబోసుకున్న విషయాలు ద్వారా.
‘‘అతగాడి మనస్తత్వమిదేనని తెలుసుగదా మొదట్నుంచి? నువ్వెందుకు అతిగా బాధపడుతున్నావ్?’’ అన్నా.
‘‘అదికాదు మైథిలీ… యోగాసనాలు అన్నీ అయిపోయిన తర్వాత శవాసనం వేయమంటారు గదా, నాదసలే వంకీల జుట్టు, లేచినపుడు కొద్దిగా జుట్టు చెదురుతుంది గదా! పోనీకి పెట్టిన క్లిప్పు తీసేస్తా, శవాసనం వేసినపుడు. అందుకు అనుమానపు చూపులు వెళ్ళగానే. ఒక్కోరోజు మరీ గుర్రుగా ఉంటాడని చెప్పింది’’ వాపోతూ.
‘‘ఏం చెబితే అర్థమవుతుంది అతనికి? ఎలా చెబితే అర్థమవుతుందో? నాకేం అర్థం కావట్లేదు. ఒక్కోసారి బాగా ఏడుపొచ్చేస్తుంటుంది’’ అని చెబుతుంటే నాకు చాలా బాధ అన్పించింది సువర్ణను చూడగానే.
‘‘మొన్న వారం రోజుల క్రితం యోగా సెషన్ పూర్తయింది మైథిలీ. ఎప్పటిలాగే వార్షికోత్సవంలాగా చేస్తారు గదా ముగింపు పండుగంటూ. నీకు తెల్సు గదా..’’ అంది. ‘‘అవును’’ అన్నాను.
నేనైతే నాకున్న ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల మానివేశానుగానీ, సువర్ణ మానకుండా వెళుతూనే ఉంది యోగా క్లాసులకు.
ఇలాగా మాకీరోజు సెషన్ చివరి రోజు. లేటవుతుంది. మధ్యాహ్నం పన్నెండయి పోతుందని చెప్పిందట భర్తతో. సరేనని అన్నాడట. వాళ్ళకు జావ తాగే అలవాటు, టిఫిన్ తినగానే. తనొక్కడే గదాని వదిలెయ్యలేదు మైథిలీ. ఇడ్లీ వేసి హాట్ ప్యాక్‌లో సర్దా. పల్లీ చట్నీ కూడా చేశా తినలేరని. పక్కనే కొరప్పొడి డబ్బా
ఉండనే ఉంటుంది ఎప్పుడూ. జావచేసి ఫ్లాస్కులో పోశా. అన్నీ ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టానని చెబితే సరేనన్నారు.
వాళ్ళకు పెరడు పెద్దది. పూలమొక్కలవీ బాగా ఉంటాయి. రోజూ ఊడుపు ఎక్కువే. అయినా ఏనాడు విసుగు కనిపించదు తన మొహంలో ఎప్పుడైనా అటుగా వెళ్లినపుడు వాళ్లింటికి వెళ్లటం అలవాటే నాకు. ఏ సమయంలో చూసినా చాలా
శుభ్రంగా ఉంటుంది వాకిలి గాని, పెరడుగానీ. ఇలా ఎలా సాధ్యమని అడిగితే, రెండుపూటలా శుభ్రంగా ఊడుస్తానని చెప్తే, నాకెంతో ముచ్చటేసేది. అట్లా అన్ని పనులూ చేసి, తనను ఉదయం తినటాన్కి, తాగటాన్కి కావలసినవి సిద్ధం ఏసి చెప్పి వచ్చినా ఆరోజు ‘‘ఏంటే ఇంత ఆలస్యమయింది? ఆ జుట్టంతా రేగిపోయి
ఉందేంటి? ఎక్కడ పడుకుని వచ్చావు ముండా’’ అని బూతులు తిడుతూ గొంతును పిసకబోయాడట. తన మెడచుట్టూ బిగుసుకుంటూన్న వాడి రెండు చేతులనూ ఎట్లాగో బలవంతంగా విడదీసుకుని నేను గదిలోకి పోయి చాలాసేపటిదాకా తలుపులేసుకున్నా భయంతోటి’’ అని సువర్ణ చెప్తుంటే తనగుండె వేగంగా ఎగిరిపడటాన్ని గమనించా. మొహమంతా బాధతోటి వివర్ణమైపోయింది.
‘‘ఇంతకుముందు అనుమానంగా చూసేవాడు, కోపంతో టీకప్పు విసిరేసేవాడు, టీ బోగోలేదంటూ. కూరలు ఎంత రుచిగా వండినా కుదరలేదు, నీ ధ్యాస ఎక్కడ ఏడుస్తోందని చాలా చులకన చేసి మాట్లాడేవాడట. అప్పుడు పిల్లలుండేవారట. ఎందుకు డాడీ అనవసరంగా మమ్మీని తిడుతున్నారని పిల్లలు గట్టిగా నిలదీస్తే, తన గదిలోకి పోయి ఆరోజంతా అలకపాన్పు ఎక్కేవాడట. ఎన్నిసార్లు పిలిచినా భోజనానికి రాకపోతే, చివరికి తనే ఉసూరనిపించి భోజనం ప్లేట్లో పెట్టి, గదిలో టీపాయ్ మీద పెట్టి వచ్చేదట. సువర్ణ మంచినీళ్లు, పెరుగు, రసంతో సహా. మళ్ళీ మధ్యలో తనెళ్లి కనబడితే ఎక్కడ మధ్యలో అహంతో చెయ్యి కడిగేసుకుంటాడోననే జాలితో. ఇదిగో ఇదే వీక్‌పాయింట్ ఆడాళ్లందరిదీ. మన తప్పులేకుండా తిట్లుపడటం, ప్రతి చిన్నదానికి సాకులు పెట్టి హేళనగా మాట్లాడే మాటల్ని భరించటం. మన కుటుంబాలే ఇలా ఏడ్చాయా? లోకంలో ఉన్న కొంపలన్నీ ఇట్లాగే తగలడ్డాయా? లేదా మన కొంపల్లోనే ఇలా ఉంటాయా అన్పిస్తుంటుంది ఒక్కోసారి ఇలాంటివన్నీ వింటుంటే.
మళ్ళీ సువర్ణ ఏమనేదో తెలుసా ‘‘మైథిలీ… ప్లేటు మొత్తం ఖాళీ చేసేశాడు, ఒక్క చుక్క కూడా విడవకుండా పెరుగు మొత్తం తాగేసేవాడట. దొంగపిల్లి నాకినట్లుగా వుండేదట ఆ ఖాళీ అయిన పెరుగు కప్పును చూస్తుంటే అని చెప్పి నవ్వేది తర్వాత. అది దొంగపిల్లి కాదు, బలిసిన పెద్ద గండుపిల్లి. జంగు పిల్లి’’ అని నేను తిట్టుకునేదాన్ని మనసులో.
‘‘ఆకలైతే వాడే తింటాడులే అని ఈసారి నేనేం పట్టించుకోలేదు. ఈరోజు నా ధర్మంగా నేను అన్నం, కూరా వండి పెట్టాను టేబుల్ మీద. నన్ను నేను సమాదాయించుకుంటూ చెయ్యని తప్పుకు నేనెందుకు కడుపు మాడ్చుకోవాలని ఓ రెండు ముద్దలు పెట్టుకుని తిని చెయ్యి కడుక్కున్నాను. ఈసారి నాకు తినమని కూడా అడగాలనిపించలేదు. నా దారిననే వెళ్ళి పిల్లల రూమ్‌లో పడుకున్నాను. తర్వాత రెండు రోజులదాకా నాకు చాలా డిప్రెషన్‌లాగా అనిపించింది’’ అంటూ ఎంతో బాధతో చెబుతుంటే నా ప్రాణం విలవిలలాడిపోయింది తన బాధాపూరితమైన మాటలు వింటుంటే.
‘‘మరి ఆ రెండు రోజులూ ఏం చేశాడు మీ ఆయన? తిండి తిన్నాడా? లేదా’’ అని అడిగా… ఒకింత బాధతో మిళితమయిన కోపంతో’’
‘‘ఆ… ఎందుకు తినలా! శుభ్రంగా మెక్కాడు. నంగనాచిలా ఆ మరుసటిరోజే చికిన్ తెచ్చి, నాకు కనబడేటట్లు టేబుల్ మీద పెట్టాడు. వండు అన్నట్టు. నా బాధను, కోపాన్ని తమాయించుకుని వండి పెట్టాను. శుభ్రంగా తిన్నాడు సిగ్గులేకుండా’’ అన్నది. తన మనసు ఎంత వేదనకు గురయితే ఈ మాట వచ్చిందోనని అనుకున్నా.
‘‘మరి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా? మానేశావా యోగాకి వెళ్ళటం? మీ ఇంటి దగ్గర ఉన్న విమలా, రత్నమ్మ గార్లతో కలిసేగా వెళ్ళేది, వచ్చేదీ’’ అన్నా.
‘‘అవును, అయినా వాడికి అనుమానం పొరలు కమ్మి, కండ్లు కనబడని గుడ్డోడవుతాడు. అదే మావాడి స్పెషాలిటీ’’ అంది విరక్తిగా.
‘‘ఆ… ఎందుకులే పెంటగోల అని మానేశాను. యోగాకు వెళ్లట్లేదంది. ఇట్లా బాధపెట్టి బెదిరించి, మాన్పించాలనేగా వాడి ప్లానంతా. వాడనుకున్నది సాధించుకున్నాడు. చివరికి నన్ను నాల్గు గోడలకి బందీ చేసి’’ అన్నది మళ్ళీ కోపంగా.
ఇదివరకు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంతలో కొంతవరకు నయం. ఆలోచించేవాడు మాట వదలాలంటే. ఇప్పుడు వాళ్ళిద్దరూ బెంగుళూరులో
ఉంటన్నారుగా ఉద్యోగాల్లో. ఇక వీడు మరీ పేట్రేగిపోతున్నాడు. ఒక్కోసారి ఏం వాగుతున్నాడో కూడా తెలవట్లేదు. ఆనోటికి హద్దూపద్దూ ఉండట్లేదని వాపోయింది సువర్ణ.
అందంగా పుట్టడం సువర్ణ చేసుకున్న పాపమా? అందంగా ఉన్న తమ కూతుర్ని, ఉద్యోగస్తుడూ… లక్షణంగా పెండ్లాన్ని చూసుకుంటాడని నమ్మి ఇతగాడికిచ్చి కట్టబెట్టిన తల్లిదండ్రులదా?
మగడు ఏదన్నా పడుండాలి. వాడికి కోపమొస్తే భరించాల్సిందేనమ్మా అంటూ సాగదీసే సదరు అత్తగారి టెంపరితనమా?
నిజంగానే ‘కాకి ముక్కుకు దొండపండు’ అనే సామెతకు నూటికి రెండొందల శాతం కరెక్టు సువర్ణ భర్తగారి విషయంలో. నాకు ఆ పేరెత్తి ఇదీ అని చెప్పాలన్నా కంపరమెత్తుతుంది ఇప్పటికి కూడా.
ఇలా చాలా విషయాలు తెలుస్తుంటాయి అప్పుడప్పుడు తన ద్వారా. అందుకే నాకు సువర్ణ భర్త అంటే ఏవగింపు. తను కూడా ఇంతకు మునుపు ఎంత బాధలో ఉన్నా మా ఆయన, మావారు అని సంబోధించేది నాతో మాట్లాడేటప్పుడు. ఎంత బాధ సలుపుతుంటే, మనసులో ఎంత విరక్తి పుడితే వాడు, వీడు అని తిడ్తుంది భర్తను. నాకు తప్పులేదనిపించింది. మరి తక్కువ పనులు చేశాడావాడు అని పిలవబడుతున్న సదరు సువర్ణ గారి మొగుడుగారు.
నువ్వు తెల్లగానే ఉంటావు గదా, నీకెందుకు క్రీములు, పౌడర్లు అని సాధించేవాడట. కొత్త బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేడట. మంచిగా తల దువ్వి జడ వేసుకున్నా అనుమానమేనట… ఎవరన్నా ఇంటికి అతిథులు వస్తే, అందులో
వాళ్ళు పురుష పుంగవులైతే తనను మంచినీళ్ళు కూడా తేనీయడట. ఒకసారి అలాగే టీ పెట్టి పట్టుకెళితే, నానా బూతులూ తిట్టాడట వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఇక అప్పట్నుంచి అతగాడికే టీ కప్పులు ట్రేలో పెట్టి అందిస్తే తీసుకెళ్లి వాళ్లకిస్తాడట. దొడ్లో అంట్లు తోముతుంటుంటే రోజూ కుర్చీ వేసుకుని కూర్చొని, ఆ సమయానికి పేపరో, పుస్తకమో చదువుకుంటున్నట్లు నటిస్తాడట. మొదట్లో అర్థమయ్యేది కాదట సువర్ణకు. దొడ్డివైపు తలుపులు వేసేవుంటాయట. తియ్యరట ఎప్పుడూ. అయినా వాడికి అనుమానమేనట. ఒకసారి పౌడర్‌లో సున్నం కలిపాడట. మామూలుగా రోజూ రాసుకున్నట్లు రాసుకుంటే, మొహమంతా పొక్కిపోయి ఎలర్జీ వచ్చి, ఆసుపత్రికి వెళితే ఆ పౌడరును చూసి అందులో సున్నం కలిసిందని చెప్పారట డాక్లర్లు. మళ్ళీ ఇంకోసారి స్ప్రే బాటిల్లో హ్యాండ్ వాష్ లాంటిది కలిపాడట. ఇదీ వాడి నిర్వాకమేనని తెలిసి వాళ్ళ పెద్దబ్బాయికి చూపిస్తే ‘నిజమే మమ్మీ ఇందులో హ్యాండ్ వాష్ కలిపాడు అని తండ్రిని ఛీత్కరించుకున్నాడట.’ వాళ్ళ డాడీ వెలగబెట్టే నిర్వాకాలన్నీ తెలుసు పిల్లలకు. వాళ్ళేం చిన్నవాళ్ళు కాదుగా! అందుకే ఏదన్నా శుభకార్యానికి వెళ్ళాలంటే ఆ… డాడీ ఎందుకు మమ్మీ? మనమే వెళ్లొద్దాం అంటారట. తండ్రి అంటే అతను చేసే పనుల వల్ల ఎంత విలువ తగ్గిపోతోంది తండ్రిగా తనకు అని ఒక్కోసారి చెప్పి నిట్టూరుస్తూంటుంది సువర్ణ.
‘ఇన్ని చేస్తున్నా, మావారంటే నాకు చాలా ఇష్టం మైథిలీ’ అంటుంది నాతో ఒక్కోసారి.
‘‘కానీ నా ప్రేమను గుర్తించడు. ఎప్పుడు సందు దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటాడు సూటీ పోటీ మాటలు వదలటానికి’’ అన్నది మళ్ళీ.
నమ్మకం లేనిచోట ప్రేమ ఉండదంటారు నిజమే. భార్యమీద, ఆమె నడత మీద అస్సలు ఏమాత్రం నమ్మకం లేదు. అందుకే అంత ఆవేదన సువర్ణకు.