అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత రాజమండ్రి గామన్ బ్రిడ్జి దగ్గర విశాఖపట్నం వెళ్లే బస్సు ఆగింది.
లగేజీ చేత పట్టుకొని దిగింది ప్రసన్న.
అప్పటిదాకా బాగా ఉన్నా ఆకాశం ఉన్నట్టుండి మేఘాలు కమ్మి ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురవటం ప్రారంభించింది. దానికి తోడు ఒకటే హోరుగాలి. ఆ వర్షంలో ఎటు వెళ్లాలో తెలియడం లేదు. బస్సు వెళ్ళిపోయింది. ప్రసన్న కొవ్వూరులో ఉన్న తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ అందరూ కలిసి పెళ్లికి వెళ్తున్నారు.
అక్కడ ఎటువంటి ఆటోలు కార్లు కనిపించలేదు. ఒక గట్టుమీద బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. తన స్నేహితురాలు రమణి బస్సు దిగగానే ఆటో పంపిస్తానంది.
రెండుసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు.
అరగంట గడిచింది అంతా నిర్మానుష్యంగా ఉంది. ఏం చేయాలో తోచడం లేదు ఇప్పుడు ఎలా వెళ్లాలి ఈ గాలి వానలో అనుకుంటూ అలాగే ఏమైనా ఆటోలు అటువైపుగా వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నది. వర్షం పెద్దది కావడంతో తడిసిపోతున్నది. ఎదురుగుండా బ్రిడ్జి దగ్గర అంతా కంకర ఇసుక పోసి రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. అరగంట తర్వాత ఒక రిక్షా వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి దిగాడు. ఏమ్మా రిక్షా కావాలా అన్నాడు. గుడ్డిలైట్లో వెళ్తురులో అతని ముఖం చూసింది. ముఖమంతా నల్లని మచ్చలు నుదుటిమీద కాలిన గాయం, ఆ చలికి తట్టుకోలేక నోట్లో బీడీ ఎర్రగా కాలుతూ కనిపిస్తున్నది. మాసిపోయిన బనియన్ మీద ఎర్రతువాల. గళ్ళ లుంగి కట్టుకొని ఉన్నాడు
. రిక్షా కావాలా అమ్మ అన్నాడు. పైన టాప్ సరిగా లేదు అంతా పాత రిక్షా లాగా ఉంది. ఇందులో ఎక్కితే సరిగ్గా చేరుకుంటాను లేదో. ఎందుకులే మరి కాసేపు ఉంటే ఏదైనా వాహనం ఇటు రావచ్చు అనుకుని ఎదురుచూస్తున్నది.
అతడు మళ్ళీ వచ్చాడు. ఎక్కడికి వెళ్లాలో చెప్పండమ్మా. నా రిక్షాలో తీసుకువెళ్తాను. ఈ సమయంలో మరి ఏ ఆటోలు ఇటువైపుకు రావు అన్నాడు. ఇంతసేపు వానలో ఉండి తడుస్తూ ఆ రిక్షాలో వెళ్లడం కన్నా మరి కాసేపు ఇక్కడే ఉంటే మంచిది. అతని మీద నమ్మకం కుదరలేదు ప్రసన్నకి. మనిషిని చూసి అతను మంచివాడు కాదని అంచనా వేసింది. నాలుగు గంటల సమయంలో అటుగా వెళుతున్న ఓ కారు వచ్చి ఆగింది. ఎక్కడికి వెళ్లాలి. అడ్రస్ చెప్పమన్నాడు కార్ డ్రైవర్. ఆ చీకట్లో కారులో ఎవరున్నారో తెలియలేదు.
కొవ్వూరు సాయిబాబా గుడి దగ్గర అని చెప్పింది. ఎక్కమంటూ వెనక డోర్ తీసి ఆ కారులో ఉన్న ఒక ముసలాయన
ఆ కారులో ఉన్న ముసలావిడను అక్కడ దింపేసి ప్రసన్న ఎక్కించుకొని కారు బయలుదేరింది.
ఆ ముసలామె ఆపండి ఆపండి అంటూ అరుస్తున్న వాళ్లు వినిపించుకోకుండా వెళ్ళిపోయారు.
రిక్షా అతను మళ్ళీ వచ్చాడు.
ఆ ముసలామె ఆ కారులో ఒక అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళిపోయారు.
నన్ను బలవంతంగా ఇక్కడ దింపారు. నేను రాజమండ్రి వెళ్ళాలి అన్నది దీనంగా.
అప్పుడు అర్థమైంది రిక్షావాలాకి. ఆ అమ్మాయి ఇందాకటినుంచి తన రిక్షాలో ఎక్కమంటే ఎక్కలేదు. ఎక్కడికి వెళ్లాలో ఏమో. ఆడపిల్ల. వాళ్ళు ఏం చేస్తారో. ఆ పిల్లను సరిగ్గా తీసుకువెళ్తారో లేదో. ఈరోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదు అంటూ బాధపడ్డాడు.
ఆ ముసలామను చూసి ఈ వర్షంలో మీరు మాత్రం ఎలా వెళ్తారు వాన తగ్గేవరకు ఇక్కడే కూర్చోండి. వర్షం వెలిశాక నేను నా రిక్షాలో తీసుకువెళ్తానన్నాడు.
రిక్షావాలా కి అనుమానం వచ్చింది. అమ్మ మీరు ఇక్కడే ఉండండి. నేను వచ్చేవరకు ఎటు వెళ్ళవద్దు. అంటూ తన రిక్షా ఎక్కి వేగంగా తొక్కుకుంటూ బయలుదేరాడు. అతడు ఆలోచన నిజమైంది. వాళ్లు సాయిబాబా గుడి దగ్గరికి తీసుకు వెళ్లకుండా ఒక పాడుబడిన స్కూలు దగ్గర కారు ఆపారు.
ఆ అమ్మాయి వదలండి వదలండి. నన్నేం చేయొద్దు అంటూ పెద్దగా కేకలు వేస్తున్నది. కారులో ఉన్న మరో ఇద్దరు ఆమె నోరు గట్టిగా మూసేశారు. ఒకడు కదలకుండా పట్టుకున్నాడు. బయట చీకటి వర్షం తోడైనాయి. అనవసరంగా వీళ్ళ కారులో ఎక్కి ప్రమాదంలో చిక్కుకున్నాను. ఆ రిక్షా ఎక్కిన బాగుండేదేమో అనుకున్నది ప్రసన్న. అంత దూరంలో రిక్షా ఆపాడు. ఆ వర్షంలోనే తడుస్తూ వెనకనుంచి కారు దగ్గరగా వెళ్లి చేతిలో ఉన్న కర్రతో వెనక అద్దాలు మీద గట్టిగా కొట్టాడు. అద్దాలు బళ్ళున బద్దలైనాయి. కారులో ఉన్న నలుగురు డోర్ తీసుకొని బయటికి వచ్చారు.
ఆడపిల్లని మోసం చేయడానికినా ఇక్కడికి తీసుకువచ్చారు. ఇప్పటికే పోలీసులు మీకోసం బయలుదేరారు అనగానే వాళ్లలో భయం మొదలైంది. కారున అక్కడ వదిలి నలుగురు పారిపోయారు.
ప్రసన్న అతనికి రెండు చేతులెత్తి నమస్కరించింది. దేవుడు లాగా వచ్చి నా ప్రాణాన్ని మానాన్ని కాపాడావు నిజంగా నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీ రిక్షా ని నిన్ను చిన్నచూపు చూసినందుకు నాకు గుణపాఠం నేర్పేడా దేవుడు. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
చూడమ్మా మనుషుల రూపాన్ని చూసి మోసపోతారు. వారి మనసుల్లో ఏమంటుందో తెలుసుకోలేరు. పదమ్మ మా ఇంటికి వెళదాం అన్నాడు.
ప్రసన్న మాట్లాడకుండా వచ్చి అతని రిక్షా ఎక్కింది. తిరిగి గామన్ బ్రిడ్జికి దగ్గరకు చేరుకున్నారు.
ఆ ముసలామె అక్కడే కూర్చుని ఉంది.
అమ్మ నిన్ను మీ ఇంటి దగ్గర దింపమంటావా అన్నాడు రిక్షావాలా.
అమ్మాయి. నిన్ను ఆ పోకిరి వెధవలు ఏమైనా చేశారా. నిన్నలా తీసుకు వెళ్తుంటే నాకు చాలా భయం వేసిందనుకో. వాళ్లు నిన్ను ఏం చేస్తారో నని కంగారు పడ్డాను. పెద్దదాన్ని వాళ్ళని ఎదిరించే శక్తి నాకు లేదు. ఎలాగైనా ఆ భగవంతుడు నిన్ను కాపాడాలని కోరుకున్నాను. దేవుడు నీకు మేలు చేశాడు. ఈ రిక్షా అబ్బాయి రాకపోతే నీ గతి ఏమై ఉండేది ఒక్కసారి ఆలోచించమంది. నిజమే బామ్మ. మీరు చెప్పింది నిజమే. అతను తన రిక్షా ఎక్కమని అడిగినా నేనే ఒప్పుకోలేదు. ఆ డొక్కు రిక్షాలో వెళ్లడం ఇష్టం లేక పోయింది. నా హోదాకి తగినట్లు కారులో వెళ్లాలనుకున్నాను.
అన్నా నన్ను క్షమించు. నీ అవతారాన్ని చూసి నువ్వు ఒక రౌడీ వో గూండావు అనుకున్నాను. నీ ముఖం చూస్తే నాకు అలా అనిపించింది. నువ్వే నన్ను తీసుకెళ్లి మోసం చేస్తావని భయపడ్డాను. నిజంగా నువ్వు నా పాలిట దేవుడివి. ఆపద్బాంధవుడులా వచ్చి రక్షించావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నువ్వే కనుక రాకపోయి ఉంటే నా బతుకేమైపోయి ఉండేది అంటూ బాధపడింది.
మీ ఆడపిల్లలంతా ఇంతేనమ్మ. సూటు బూటు దాబూ ధర్పం చూసి మోసపోతారు. మనిషి అందవికారకంగా ఉన్నంత మాత్రాన వాడు చెడ్డవాడని ఎలా అవుతాడు. అందుకే ఆడపిల్లలు తొందరగా మోసపోవడం జరుగుతున్నది . ఇప్పటికైనా చెబితే నేను మీ ఇంటి దగ్గర దింపుతానన్నాడు. చూడమ్మాయ్ నిన్ను చూస్తుంటే నా మనవరాలు గుర్తుకు వస్తున్నది. నీలాగా అందంగా ఉంటుంది. బాగా చదువుకున్నది. డబ్బున్న వాడినని చెప్పి దాన్ని మోసం చేసి వలలో వేసుకున్నాడు. ఆ పిల్ల వాడితో వెళ్లిపోయింది. ఆరు నెలలు గడిచాక వాడి మోజు తీరింది. వాడు ఒక దౌర్భాగ్యుడని తెలిసింది. పైసా సంపాదన లేదు. ఆస్తి ఉన్నదని నమ్మించాడు. ఆ పిల్లని నాన్న చిత్ర హింసలు పెట్టేవాడు. ఆ బాధను భరించలేక నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుంచి వాళ్ళమ్మ పిచ్చిది అయిపోయింది. నేను ఎలా చెప్తున్నానని అనుకోకు . ఆడపిల్లల తల్లిదండ్రులు కళ్ళ ముందు తమ పిల్లల జీవితాలు నాశనమైపోతుంటే చూస్తూ ఎలా ఉండగలరు. కడదాకా వాళ్ళ కలల్ని కూల్చకూడదమ్మా. చిన్నప్పుడు పట్టుకున్న ఆ చేతుల్ని వదిలి ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోవడం న్యాయమా. నా మనవరాలకి జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదు అని నీతో చెప్పాను. ఆడపిల్లవు జాగ్రత్తగా ఉండమ్మా అంటూ తన గుండెల్లో దాగిన బాధని వెళ్ళబోసుకుంది.
ప్రసన్న బామ్మ గారికి రెండు చేతులెత్తి నమస్కరించింది. మీ ఇద్దరిని చూస్తుంటే ఆపద్బాంధవుల్లా ఉన్నారు. పరాయి మనిషి ఆపదలో ఉంటే మనకెందుకులే అనుకోకుండా నాకు హితోపదేశం చేశారు. నేను నిజంగా అదృష్టవంతురాలిని. అన్న నన్ను రాజమండ్రి బస్టాండ్ లో దింపు. నేను బస్సు ఎక్కి మా ఊరు వెళ్ళిపోతాను అన్నది.
వాళ్ళింటికి వెళ్ళవా అమ్మ అన్నాడు.
ఇప్పుడు నాకు వెళ్లాలనిపించడం లేదు. నేను ఇంటికి వెళితేనే మంచిది అన్నది.
ఆ ముసలామె తో పాటు ప్రసన్నని ఆ రిక్షాలో ఎక్కించుకొని బస్టాండులో దిగబెట్టారు.
పది నిమిషాల్లో గుంటూరు బయలుదేరి పోతున్న బస్సు రెడీగా ఉన్నది.
నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను బామ్మ అంటూ బస్సు ఎక్కి కూర్చున్నది.
ప్రసన్న మనసు ఇప్పుడు వర్షం వెలిసిన ఆకాశం లాగా ఉన్నది.
మనసు కూడా ప్రశాంతంగా ఉంది.
బామ్మ చెప్పిన మాటలు నిజంగా వినకపోయి ఉంటే తన జీవితం బుగ్గిపాలయ్యేది.
ఆ మోసగాడి మాటలు నమ్మి స్నేహితుల పెళ్లి కోసం వచ్చి అతనితో కలిసి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నది.
కొన్నాళ్ళుగా ప్రేమ ప్రేమ అంటూ వెంటపడ్డాడు.
అమ్మానాన్న తనకోసం కష్టపడి చదివించి ఇంత దాన్ని చేశారు.
సంవత్సరం క్రితం ప్రేమించిన వాడితో తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లిపోవడం న్యాయమా.
నిజంగా అతను మంచివాడైతే మా ఇంటికి వచ్చి అమ్మానాన్నలతో మాట్లాడి మా పెళ్లి జరిపించమని అడిగేవాడు.
నన్ను ఒంటరిగా రమ్మన్నప్పుడే ఆలోచించ లేకపోయాను. అతని నమ్మి వెళ్లి ఉంటే నిజంగా నేను మోసపోయేదాన్ని.
తల్లిదండ్రుల్ని మోసం చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగి ఉండేది. అమ్మానాన్న నన్ను క్షమించండి. ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఆడపిల్లవు జాగ్రత్తగా ఉండు. ఎవరిని బడితే వాళ్ళని నమ్మకు అంటూ ఎన్నోసార్లు చెప్పారు.
ప్రేమ మైకంలో పడి మీ మాటలు పెడచెవిన పెట్టాను. నాలాంటి ఆడపిల్లలు ఊహల్లో తేలిపోయి బతుకుతారు. నిజమైన ప్రేమ అనుకుంటారు. నా కళ్ళు తెరిపించారు. ఆపద్బాంధవులు నా కంట పడకపోతే నిజంగా నేను మోసపోయి నరకం అనుభవిస్తూ బలి అయిపోయి ఉండేదాన్ని. మీకు గర్భసోకాన్ని మిగిల్చేదాన్ని. నేను చాలా అదృష్టవంతురాలిని. మీ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను. ప్రసన్న జరిగింది ఆపద్బాంధవుల వల్ల ప్రమాదం నుంచి బయటపడినందుకు సంతోషించింది.
కూతురు ఇంటికి రాగానే అమ్మా వచ్చావా అంటూ తల్లిదండ్రి వాకిట్లోనే ఎదురు చూశారు.
ఇలాంటి వాళ్లని నేను మోసం చేయాలి అనుకున్నా. ఇంకెప్పటికీ ఏ తప్పు చేయకూడదని మనసులోని నిర్ణయించుకుంది ప్రసన్న.
రచన : తాటికోల పద్మవతి- గుంటూరు
సెల్ నెం. 94417 53376