ఇదొక అపురూపమైన క్షణం

కవిత నా బంగారు చెల్లెలు. అల్లరి పిల్ల. అసాధ్యురాలు. నా చెల్లెలు అని పొగడ్డం కాదు గానీ చిన్నప్పటి నుంచీ ప్రతిభా పాటవాలు కనబరుస్తూ చదువులో, ఆటలలోనూ చురుకుగా చలాకీగా ఉండేది. తనతో కలసి కొంత సేపు గడిపిన వారినెవరినైనా ఇట్టే ఆకట్టుకోగల వ్యక్తిత్వం కలది. ఎవర్నైనా సునాయాసంగా స్నేహం చేసుకోగలదు. పట్టువదలని ఆడ విక్రమార్కుడిలాగ అనుకున్నది సాధించడం కోసం ఎంతటి కఠినమైన ప్రయత్నమైనా చేయడానికి వెనుకాడదు. చేపట్టిన అన్ని పనులలో ఉన్నతమైన ఫలితాలను చేజిక్కించుకుంది. చిత్రకళలో మంచి ప్రతిభ ఉందని తెలుసుగానీ, ఇప్పుడు ఎంత చక్కటి కవిత్వాన్ని రాసిందో చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు.

సమత                 కుందుర్తి కవిత

తాతగారి ఫ్రీవర్స్ ఫ్రంట్ పనుల రిత్యా మేమిద్దరం చాలా ఉత్సాహంగా సభల్లో పాల్గొనేవారం. ప్రతీ ఆదివారం నాన్నతో శీలావీ గారింటికి వెళ్ళడం, ఒక వేడుకలా ఉండేది. సుభద్ర గారు మమ్మల్ని సొంత మనుషుల్లా చూసేవారు. అక్కడంతా సాహిత్య చర్చలు జరిగేవి. బహుశా అప్పుడే మా కవిత పసి హృదయంపై ఒక చెరగని ముద్ర పడి ఉంటుంది. అలా తాతగారి రచనాత్మక అంశ తనకి దక్కిందని చెప్పొచ్చు. సరిగా జ్ఞాపకం లేదు గానీ, 8-9 ఏళ్ళప్పుడు అనుకుంటా తను మొదటి కవిత రాసింది. అది చదివి నేను నివ్వెరపోయాను. శీలావీ దంపతులు చాలా మెచ్చుకోవడం కూడా బాగా గుర్తు. నాన్న కళ్ళలో రవ్వంత గర్వం కూడా అప్పుడే చూశాను. ఆయన మాచేత ఈనాడు పేపరో, లేదా ఏదన్న పుస్తకమో, పద్యాలో కవితలో చదివించాలని, పాడించాలని చాలా అనుకునేవారు. తాతగారి రికార్డింగు వాయిసు తరచుగా వినిపించేవారు. ఇవన్నీ కవితలో మరింత ఉత్సాహం కలిగించి ఉండాలి. తర్వాత చదువులవల్ల, పెళ్ళి వల్లా కొంత ఈ వ్యాసంగం తగ్గింది. సింగపూర్ వెళ్ళినా కవిత ఇల్లు చూస్తే తన కళాత్మకతని ఎంత జాగ్రత్తగా దాచుకుందో   అనిపిస్తుంది. పండుగలకి తాను వేసే ముగ్గులేమీ పెద్ద పెద్ద కవితలకు తీసిపోవన్నంతగా బాగుంటాయి. పిండివంటలు చేయడం ఒకెత్తు, వాటిని అందంగా రీల్స్ చేయడం ఇంకా గొప్ప. అక్కడి తెలుగు కార్యక్రమాలకి వక్తగా వ్యవహరించింది కూడా. తెలుగు భాష కోసం తీసిన షార్ట్ ఫిల్మ్ లో ఎంతో బాగా చేసి అందర్నీ మెప్పించింది.

నాన్నగారు పోయాక అమ్మే ఫ్రీవర్స్ ఫ్రంట్ బాధ్యత తీసుకుంది. అందుకు శీలావీ దంపతుల తోడ్పాటు మరువలేనిది. ప్రతీ ఏడు డిసెంబరులో కార్యక్రమం జరిపేవాళ్ళం. ఎందుకంటే కవితకప్పుడే ఇండియాకొచ్చేందుకు వీలు కుదురుతుంది. తనకి దొరికిన అతి తక్కువ సమయంలో సాహిత్యకారుల్ని అందర్నీ కలుస్తుంది. ఈరోజు సాహిత్యం కోసం తనతో కలసి నిస్వార్థంగా పనిచేసే ఒక పేద్ద మిత్రబృందం ఉన్న సంగతి నాకు చాలా బాగా తెలుసు. అందులో ఇరవయ్యేళ్ళ కుర్రాళ్ళు మొదలు అరవై ఏళ్ళ నిత్య యవ్వనవంతులూ ఉన్నారు. కరోనా సమయంలో ఫ్రీవర్స్ ఫ్రంట్ కార్యక్రమం ఆన్లైన్ లో జరిపాం. అది కవిత ఆలోచనే కాదు, మా మరిది శ్రీనివాస్ తోడ్పాటు కూడా. అతనూ ఎంతో మంచి రచయిత. కవిత ఎంతో అభిరుచి గల వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందింది.

కవిత మొదట్లో తను రాసిన కవితల్ని మాకూ, సుభద్ర గారికే పంపేది. చాలా అచ్చయ్యాయి. అందరి మన్ననలు పొందేవి. ఇప్పుడు ఊపిరి సలపని ఇల్లూ, ఉద్యోగ బాధ్యతల్లో ఉండీ పుస్తకం తెస్తోంది. తనకు దొరికిన వీలును కవిత చాలా సద్వినియోగం చేసుకుంటోంది.

నాకు రాయడం రాదు గానీ కవిత్వం చదువుతాను. కవిత రాసినవి చదువుతోంటే వాటిలోని భావజాలం అర్థమవుతోంది. ఉపమానాలూ ప్రతీకలూ లాంటి పదాలు నాకు సరిగా తెలీదు గానీ, ఒక స్త్రీ జీవితంలో బయటకు చెప్పలేని అనేక విషయాలని కవిత సులువుగా చెప్పడం బాగా నచ్చింది. అవి చాలా శక్తివంతమైన ప్రభావం కలిగిస్తాయి. భిన్నంగా ఉన్నాయి.

కవిత చిన్నప్పటి నుంచీ గారాబంగా పెరిగింది. ఇప్పుడు తన బలం తనకే తెలీనట్టు ఇంటి పనులతోబాటు తాతగారి కవిత్వోద్యమాన్నీ మోసేస్తోంది. ఫ్రీవర్స్ ఫ్రంట్ పేర కుందుర్తి పేరా సుభద్ర గారితో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి బహుమతులిస్తోంది. కుందుర్తి పేరును చిరస్థాయిగా నిలబెడుతోంది. చాలా గర్వంగా ఉంది నాకు. మేం కూడా కలసి ఎంత పని చేసినా తన ప్రయత్నాలవల్లే ఇదంతా జరుగుతోంది. కవిత చుట్టూ ఉన్నవాళ్ళంతా కూడా తనకి సహాయంగా ఉంటారు. పాఠకుల అభిమానం ఉంది. తాతా నాన్నా సరేసరి.

మా కవిత పుస్తకం కోసం తమ సమయం వెచ్చించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతున్నాను. శీలా సుభద్రాదేవి గారికి మరిన్ని ఎక్కువ చెబుతున్నాను.

కవితా, ఈ పుస్తకం మొదటిదే కావచ్చు, నువ్ మరిన్ని పుస్తకాలు అచ్చు వేసుకోవాలి. నీ పేరు సార్థకం చేసుకోవాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. ఎక్కడున్నా తాత, నాన్న కలిసి ఒక చోట కూర్చుని ఇదంతా గమనిస్తూనే ఉంటారు. ఒక్కో కవితా చదువుతూ ఉబ్బి తబ్బిబ్బైపోతుంటారు. నేను మాత్రం తక్కువనుకుంటున్నావా. నా సంతోషానికి ఈ క్షణాన హద్దుల్లేవు తెలుసా !

ప్రేమతో–

అక్క
సమత
14.11.2024

Written by samata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

॥॥ ఇంతేకదా॥॥

ఈ తరానికో రోజు