గత సంవత్సరం జనవరిలో ‘జ్ఞాపకాల సంతకం’ కవితా సంపుటితో సాహితీ జగత్తులోకి అడుగుపెట్టిన ధూళిపా ళ అరుణగారు కవయిత్రిగా, కథారచయితగా, వ్యాసరచయితగా, పలు విధాలుగా ప్రవర్ద మానమవుతున్నారు. ఇటీవల ఆవిష్కరించిన ఆమె కవితా సంపుటి ‘చేతనా శిల్పం’లో 71 కవితలకు స్థానం కల్పించారు. ఈ కవితలలో అధిక భాగం స్త్రీ కేంద్రీకృతంగానే ఉన్నాయి. ఆమె స్త్రీగా, స్త్రీ సమస్యలన్నింటినీ తానుగా అనుభూతి చెంది, అనుభవించిన ఆవేదనలను అవమానాలను అక్షరబద్ధం చేశారని పిస్తుంది. స్త్రీలలో చైతన్యాన్ని, మనోధైర్యాన్ని నింపడమే కాకుండా, తన ఆత్మవిశ్వాసాన్నికూడా ధీమాగా ప్రకటించు చుకున్నారు.
‘శాపమే మరి’ కవితలో “కానీ ఇప్పటికీ /అర్థం చేసుకోలేక పోతున్నా/ నీవు లేక గౌరవం/ ఎందుకు లేదని/ నాకు నేనుగా ఎదిగిన వ్యక్తిత్వం ఏదని”/ అంటూ సమాజాన్ని ఆవేదనతో సూటిగా ప్రశ్నిస్తున్నారు .”చంపే దుర్మార్గం నీలో ఉంటే/ నీ వంశప్రాణాన్ని/ నిలిపే త్యాగం ఆమె”/ “కండలు తిరిగిన దేహబలం నీకుంటే/ నీ తోడుగా మెదిలే/ ఆత్మస్థైర్యం ఆమె/ సమస్త అధికారపు/ చీకటి నీవైతే/ నీకోసం అన్ని వదిలిన/ కాంతిరేఖ ఆమె”/ అని స్త్రీల త్యాగాన్ని ఎలుగెత్తి చాటారు.
పచ్చి నిజం కవితలో మనిషి ఎలా ఉంటే విజయతీరాలను చేరుతాడో విడమరిచి చెబుతూ, పరుగులు తీయకుండా చీకట్లను చీల్చుకొని వెళ్లాలని, పట్టింపులు పట్టుదలలకు పోవద్దని, ఆలోచనలతో మార్గాన్ని ఎంచుకోవాలని, అప్పుడే విజయం చేరువవుతుందని హితవు పలుకుతూ, “వ్యక్తిత్వాన్ని కోల్పోనంత వరకే” అని ఓ మంచి సూచన కూడా చేస్తారు.
‘మట్టి సంబంధం’ ‘ఎడతెగని దుఃఖం’ కవితలలో ప్రకృతి వైపరీత్యాలవల్ల అస్తవ్యస్త మైన పరిస్థితులను, జీవితాలను ఆర్ద్రంగా వివరిస్తూ, “మట్టి సంబంధమే మనిషికి/ మనుగడైన మృత్యువైన”/ “ఇప్పుడక్కడ నేల/ ఎడతెగని దుఃఖాన్ని తాగుతోంది/ చెదురుముదురుగా పరుచుకున్న/ దేహ భాగాలకుప్పల నడుమ/ మిగిలిన ప్రాణాలు/ వెతుక్కుంటున్నాయి/ అంతు చిక్కని ఉదయాన్ని”/ ఇలా బాధను వ్యక్తపరుస్తూ తాత్వికత ధోరణినీ కనబరుస్తారు. కాటికాపరి జీవితాన్ని కథావస్తువుగా తీసుకున్న మరో కవిత “చస్తూ బతకడమే” లో కూడా ఇదే తాత్వికత మనకు కనిపిస్తుంది.
ఛీ ముసలితనమా!, ప్రేమ నీ ఆనవాలు ఎక్కడ ,అమ్మ మన్నించు, నిర్జీవ కళారాశి ,మొదలైన కవితల్లో పాఠకుల హృదయాలను రసార్ద్రం చేయగలిగిన భావనలు మనల్ని కదిలిస్తాయి.

అరుణ కవితలు సాగే ప్రవాహం, మళ్లీమళ్లీ, కరువు తీరిన నిద్దర, ఆహా ఎంత భాగ్యం, వీటిల్లో కవయిత్రి భావుకత పరిమళిస్తుంది. ఇంకెప్పుడూ, రాజ్యాంగం ,అవే ఆరు, అదే తంతు, కవితల్లో సామాజిక సృహ చైతన్యం కనిపిస్తాయి. కవితా స్రష్ట ‘కవిత కవిని హృద్యంగా వర్ణించిన కవిత.
ఐదు పదుల వయసులో సాహితీ ప్రపంచంలోకి అడు గినప్పటికీ, వడివడిగా పరుగులు తీస్తున్నారు అరుణగారు.
ఉపన్యాసకురాలిగా 25 సంవత్సరాల బోధనానుభవం, సాహిత్యంపట్ల గల మక్కువను ఆమె భావ సౌందర్యంలో, శబ్ద సౌందర్యంలో, మనం గమనించవచ్చు. ఎంత ఇష్టమో!కవితలో తనకు సాహిత్యం పట్లగల తపనను ‘విశ్వవేదికపై భాషాపదముద్రికలు చేక్కాలని’ ఆశించారు. ‘ఒకటే పోరు’ కవితలోనూ అదే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఇలా తన నీడైనా అక్షరాన్ని పట్టుకొని, అన్నింటినీ స్పృశిస్తూ, కాలంతోపాటు నడుస్తుంది అరుణ. ఆమె కోరుకున్నట్లుగానే ఎప్పటికీ ఆమె కలం ఎదవాకిళ్లను తడుపుతూనే ఉండాలని ముందు ముందు మరిన్ని మంచి కవితలతో మనల్ని అలరిస్తారని ఆశిస్తూ, అరుణకు అభినందనలు తెలుపుతున్నాను.
