రాగ మాలకు ఊరికి వెళ్ళినప్పటి నుండి మోహన్ గుర్తుకు వస్తాడు.ఊళ్లో చదువు కూడా సాగదు.అనుకోకుండా మోహన్ వస్తాడు.రాగ మాలకు సంతోషం కలుగుతుంది
తరువాత….
“అమ్మా! ఇక్కడ చదువు సాగడం లేదు. నేను టౌన్ కి వెళ్ళిపోతాను. ఎగ్జామ్స్ లో ఏమీ రాయలేను ఇలా అయితే”అన్నది రాగమాల తల్లితో.
“సెలవుల్లో ఇక్కడే ఉంటావు అనుకున్నాను. అప్పుడే వెళ్ళి పోతావా? అయినా అక్కడ ఒక్క దానివి ఎలా ఉంటావు?”అన్నది రాగమాల తల్లి.
“పక్కన ఒక అమ్మాయి ఉంటుందని చెప్పాను కదా! అదే వనజ, తను మన ఇంట్లోనే పడుకుంటుంది. ఆమె వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, అస్సలు చదవనివ్వరని మనింట్లో నే ఉంటుంది .అందులో వాళ్ళ అమ్మ వాళ్ళు దగ్గర లేరు కదా! నా దగ్గరకు వచ్చి అక్కా! అంటూ సంతోషంగా ఉంటుంది .పక్కనే బామ్మగారు వాళ్లు కూడా ఉంటారు. వాళ్లు కూడా ఎప్పుడూ చూస్తూనే ఉంటారు”అన్నది రాగమాల.
అక్కడికి వచ్చిన దక్షిణామూర్తి గారు ..
“అక్కడికే వెళ్లి చదువు కొనీలే! ఇప్పుడు ఇంటి నిండా జనం ఉన్నారు. అందులో మొన్ననే అన్నయ్య కూతురు వచ్చింది. దాని పిల్లలు నలుగురు ఇంత అల్లరిలో అది ఎలా చదువుకుంటుంది? ఇంకా ఎగ్జామ్స్ కి ఇరవై రోజుల సమయం కూడా లేదు”అన్నారు.
“సరే !అయితే ఎప్పుడు వెళ్తావు? పచ్చళ్ళు ,పొడులు అన్ని ప్యాక్ చేసి పెడతాను .తీసుకొని వెళ్ళు. మళ్లీ సరిగా వండు కుంటావో లేదో?”అన్నది రాగమాల తల్లి.
“సరే” అని రాగమాల తన బట్టలు సర్దుకుంది. “సాయంత్రం బస్సుకు వెళ్ళిపోతామ్మ”అని చెప్పింది.
ఇంతలో రాగ మాల నాయనమ్మ కు ఆరోగ్యం బాగాలేదు.ఆమె రాగ మాలను విడిచి ఉండటం లేదు.అందుకని ఆమెకు తగ్గాక బయలుదేరింది.
మరి ఇంటర్లో ఉన్నప్పుడు ఊరి నుండి వెళ్లడానికి ఎంతో బాధపడేది. ఒక పని పిల్లవాడు వచ్చి, బస్సు ఎక్కించి వెళ్లేవాడు. ఒక్కొక్కసారి బస్సు వచ్చినా ఎక్కకుండా మళ్ళీ ఇంటికి వచ్చేది.
కానీ డిగ్రీకి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెండ్స్ అవడం మూలాన, అలవాటు అయ్యింది. అయినా కూడా రాత్రులు రాగమాల తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకునేది.
సాయంత్రం రాగమాల రిక్షాలో వెళ్లి, బస్సు ఎక్కింది. టౌన్ కు చేరుకునే వరకు ఏడు గంటల సమయం అయ్యింది. వెంటనే పక్కనే ఉన్న వనజను పిలిచింది.
“అక్క! వచ్చావా? నాకు కూడా నువ్వు ఊరికి వెళ్ళినప్పుటి నుండి బెంగగా ఉంది. నీ దగ్గర ఉంటే సంతోషంగా ఉంటుంది”అన్నది వనజ వాళ్ల పిన్ని ఇచ్చిన బజ్జీల పొట్లం చేతిలో పెట్టి.
“ఇదేంటి! పిన్ని ఏం పంపించింది? పిన్ని పాపం నా కోసం ఏదో ఒకటి పంపిస్తుంది. రేపు వచ్చి కలుస్తా”అన్నది రాగమాల.
ఇంతలో ఎదురు ఇంట్లో ఉండే ఐదవ తరగతి చదువుకునే అబ్బాయి వచ్చాడు. వాడు కూడా ఎప్పుడు రాగమాల దగ్గరే ఉంటాడు. చదువులో ఏదైనా డౌట్ వస్తే చెప్పించుకుంటాడు. ముందు గదిలో పడుకుంటాడు .ఇంత మంది రాగమాలను చూసుకోవడానికి ఉన్నారు. అందుకే దక్షిణామూర్తి గారికి బెంగ లేదు.
ఇక్కడ మోహన్ కి కూడా చదువు సాగడం లేదని టౌన్ కు బయలుదేరాడు. రాగమాల వస్తుందని అతను ఊహించలేదు. అతను టౌన్ కు వచ్చేసరికి రాత్రి 9 గంటలు అయింది.
ఉదయము పది గంటలకు సైకిల్ తీసుకొని రాగమాల ఇంటి వైపు వచ్చాడు. తలుపు తీసి ఉండడం చూసి “అదేంటి రాగమాల వచ్చిందా ఏంటి?”అంటూ సంతోషంగా సైకిల్ ఆపి లోపలికి వచ్చాడు.
రాగమాల కిరోసిన్ స్టవ్ మీద టమాటో కూర వండు కుంటుంది.
సరాసరి లోపలికి వచ్చిన మోహన్ “ఏంటి వచ్చేసావా”? అన్నాడు సంతోషంగా.
“అవును, అక్కడ చదువుకోవడం కుదరడం లేదు. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి .అసలు సిలబస్ ఏమాత్రం కంప్లీట్ కాలేదు. అందుకే ఇక్కడికి వచ్చి సీరియస్గా చదువుదామనుకుంటున్నాను”అన్నది రాగమాల.
“నాపరిస్థితి కూడా అంతే. అదీ కాక ఒక చిన్న వాదన జరిగింది మా ఇంట్లో”అన్నాడు మోహన్.
“దేని గురించి?”అని అడిగింది టమాటా శాకంలో ఉప్పు, కారం వేస్తూ..
“చెప్తాను కానీ, ఏం వండుతున్నావ్?’అన్నాడు మోహన్.
“తొందరగా అవుతుందని టమాటా శాకం చేస్తున్నాను”అన్నది రాగమాల.
“నాకు టమాట అంటే చాలా ఇష్టం. రోజు తినమన్నా తింటాను”అన్నాడు మోహన్.
“నిజమా? అసలు మా ఇంట్లో ఎక్కువగా టమాటా చేయనే చేయము. మరి తినేసేయ్ ఇక్కడే”అన్నది రాగమాల.
“తింటే పర్వాలేదా? ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో”? అన్నాడు మొహన్ తటపటాయిస్తూ..
“అన్నం తింటే ఎవరేమనుకుంటారు? అయినా ఇక్కడ ఎవరున్నారని? పక్క వాళ్ళందరికీ నువ్వు మాకు బంధువైతావని తెలుసు .అందులో చూడడానికి నువ్వు కొంచెం మా అన్నయ్య లాగే ఉంటావు. కాబట్టి ఎవరూ ఏమీ అనుకోరు తిను”అంటూ ప్లేట్లో కొంచెం అన్నం, టమాటా శాకం పెట్టి ఇచ్చింది రాగమాల.
ప్లేట్ తీసుకొని గబగబా తినసాగాడు మోహన్.
“నచ్చిందా నీకు? నేను ఇప్పుడిప్పుడే వంటలు చేస్తున్నాను”అన్నది రాగమాల.
“నాకు టమాటా ఎలా చేసినా ఇష్టమే! కానీ బాగుంది”అంటూ కొంచెం తిన్నాడు.
ఇంత లోపల పక్కింట్లో ఉండే ఉదయ్ తమ్ముడు సంజయ్ తో పాటు మోహన్ తమ్ముడు రఘు వచ్చాడు. అప్పుడప్పుడు సంజయ్ తో పాటు రఘుకు కూడా రాగమాల ఇంటికి రావడం అలవాటే, అతను కూడా అక్క అని పిలిచేవాడు. ఆ స్త్రీట్లో చిన్న వాళ్లందరికీ రాగమాల అక్క అయిపోయింది.
లోపలికి వచ్చిన రఘు వాళ్ళ అన్న ఇక్కడ అన్నం తినడం చూసి ఆశ్చర్యపోయాడు.
“ఇక్కడున్నా వేంటి అన్నయ్య? రాగమాల అక్క నీకు తెలుసా?”అన్నాడు ఆశ్చర్యంగా.
రాగమాల కూడా కొంచెం టెన్షన్ పడింది.
“అవును, మా నాన్న కోసం అప్పుడప్పుడు వచ్చేవాడు. నేనే తిన మన్నాను”అన్నది రాగమాల.
“అయినా నువ్వు ఎప్పుడు వచ్చావు రా? నేను రాత్రి వచ్చాను నువ్వు నాతో పాటు రాలేదు కదా”అన్నాడు మోహన్ తమ్ముడు రఘుతో.
నేను పొద్దున్న బస్సుకి బయలుదేరాను. డైరెక్ట్ గా సంజయ్ దగ్గరికి వచ్చాను. ఈవినింగ్ మళ్లీ వెళ్ళిపోతాను”అన్నాడు రఘు ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే.
ఆ పెట్టిన రెండు ముద్దలే కంగారుగా తిన్నాడు మోహన్. ఇంకా ప్లేట్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు.
“అయ్యో! పాపం అన్నం పూర్తిగా తినకుండానే వెళ్ళిపోయాడు మోహన్. అయినా ఈ రఘు ఇప్పుడే రావాలా? అనుకుంది రాగమాల.
అసలు రఘు అప్పుడప్పుడు అక్క అంటూ వస్తాడని విషయము మోహన్ కి చెప్పడం మర్చిపోయింది. అయినా మరీ ఎక్కువసార్లు అతను రాలేదు.
ఇంతకీ ఇంట్లో జరిగిన వాదన ఏంటో రాగమాలకి మోహన్ చెప్పకుండానే వెళ్ళిపోయాడు.
భోజనం చేసి రాగమాల చదవడం మొదలు పెట్టుకుంది. వనజ స్కూల్ కి వెళ్ళిపోయింది. సాయంత్రం అయ్యేసరికి చాలా సిలబస్ కంప్లీట్ చేసింది.
“హమ్మయ్య!ఇక్కడ చదవగలుగుతానని నమ్మకం వచ్చింది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా రోజు చదువుకోవాలి”అనుకుంది రాగమాల.
అలా ఒక వారం గడిచింది. రిలాక్స్ కోసం బయట మెట్ల పైన కూర్చుంది రాగమాల. పక్కింటి ముందు మోహన్ సైకిల్ ఆగి ఉంది.
“ఇది మోహన్ సైకిల్ లాగా ఉంది. ఇక్కడ ఉందేంటి?” అనుకుంది రాగమాల.
ఇంతలో ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చాడు మోహన్.
“ఏంటి వీళ్లింటికి వచ్చావు నువ్వు?”అని అడిగింది రాగమాల.
“ఇంట్లోకి పద చెప్తాను”అని లోపలికి వచ్చాడు మోహన్.
“ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో ముందు”అని చేతిలో న్యూట్రిన్ చాక్లెట్ పెట్టాడు.
“ఏంటి చిన్న పిల్లాడి లాగా చాక్లెట్స్ కూడా తింటావా నువ్వు?’అన్నది రాగమాల.
“ఎప్పుడో ఒకసారి తింటాను. ఇప్పుడైతే నీకోసమే తీసుకొచ్చాను. ఇంతకీ విషయం చెప్పలేదు కదూ! మా ఇంట్లో డబ్బు సంపాదించడం గురించి చిన్న వాదన జరిగింది .అందుకని నేను నా ఫీజులకు నేనే సంపాదించుకుంటాను అని ఛాలెంజ్ చేసి వచ్చాను. అందుకే ఈ వారం రోజులుగా ఏదైనా ట్యూషన్ చెప్పుదామని తిరిగాను. అందుకే నీకు కనిపించలేదు. ఈరోజు నుండే వీళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాను. నా ఫీస్ కి సరిపోతాయి”అన్నాడు మోహన్.
ఆశ్చర్యపోయింది రాగమాల.
“ఇటు చదువుకుంటూ, అటు ట్యూషన్స్ చెప్తే, నీకు టైం ఎలా సరిపోతుంది ?అయినా ఇంత చిన్న వయసులోనే సంపాదించాలా?”అన్నది రాగమాల ఆశ్చర్యంగా.
“సంపాదించింది ఖర్చు పెట్టుకుంటేనే డబ్బు విలువ తెలుస్తుంది”అన్నాడు మోహన్ నవ్వుతూ.
అలా అంత చిన్న వయసులో అంత పరిణితి మోహన్ కి కలిగింది.
ఒకపక్క రాగ మాల మరొక పక్కన మోహన్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఒకరోజు గ్రామర్ అర్థం కాలేదని రాగమాల అడిగితే మోహన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు.
ఆ సమయంలో రెండు సార్లు రాగమాల చేతులు పట్టుకున్నాడు మోహన్. ఆ విషయం నచ్చలేదు రాగమాలకి. కోపంగా పక్కకు వెళ్ళిపోయింది.
అది గమనించిన మోహన్..
“నేను వెళ్తున్నాను” అంటూ వెళ్ళిపోయాడు.
“పొరపాటు చేసింది తనే, మళ్లీ తానే కోపంగా వెళ్ళిపోయాడు. ఇదేమి మెంటాలిటీ? కనీసం సారి అయినా చెప్పాలి కదా”అని కోపంగా అనుకున్నది రాగమాల.
ఒక మూడు రోజుల వరకు మోహన్ కనిపించలేదు. రాగమాలకు బాధ కలిగింది.
“అనవసరంగా అపార్థం చేసుకున్నానేమో?’అని అనుకున్నది.
ఒక రోజు సూర్య ఇంటికి వచ్చాడు.
“ఏంటి సూర్యన్న! రావడమే మర్చి పోయావు? మీ ఫ్రెండును నాకు అప్పగించి ఆ తలనొప్పిని నాకు అంటించావా”? అన్నది రాగమాల.
“అదేం కాదు. నేను ఊరికి వెళ్లాను. రాత్రి వచ్చాను. ఎందుకు తలనొప్పి అంటున్నావు? వాడు ఏదైనా అన్నాడా?”అన్నాడు సూర్య.
“చా,చా! ఏమి అనలేదు ఊరికే అన్నాను”అన్నది రాగమాల.
“ఇదిగో ఈ బుక్కు నీకు ఇవ్వ మని ఇచ్చాడు”అని కెమిస్ట్రీ బుక్ ఇచ్చాడు సూర్య.
“ఓ ఇంకా అలక పోలేదన్నమాట”అని మనసులో అనుకొని ఆ పుస్తకం తీసుకుంది.
కాసేపు కూర్చొని అన్నం తినేసి, సూర్య వెళ్ళిపోయాడు.
బుక్కు తెరిచి చూసిన రాగమాలకి అందులో ఒక కవర్ కనిపించింది.
ఆ కవరు తెరిచి చూస్తే అందులో ఒక ఉత్తరం ఉంది.
ఆ ఉత్తరంలో తనకి రాగమాల పట్ల ఉన్న ప్రేమ గురించి వ్యక్త పరిచి ఉంది.
రాగమాలకి అసలు ఏం చేయాలో పాలు పోలేదు. ఉత్తరం ఒకటికి నాలుగు సార్లు చదువుకున్నది. ముత్యాల లాంటి అక్షరాలతో ఎంతో అందంగా ప్రేమను వ్యక్త పరిచాడు మోహన్.
ఆరోజు రాత్రి వనజ వచ్చినా కూడా ఎక్కువగా మాట్లాడలేదు రాగమాల.
“అక్క ఏమైంది కామ్ గా ఉన్నావు?”అని అడిగింది వనజ.
“కొంచెం తలనొప్పిగా ఉంది. నువ్వు చదువుకొని తర్వాత పడుకో. నేను కాసేపు పడుకుంటాను సరేనా”అన్నది రాగమాల.
అలాగే భోజనం చేయకుండా పడుకుంది. రకరకాల ఆలోచనలు తల నిండా తిరుగుతున్నాయి. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. కానీ ఆ రాత్రంతా ఆలోచిస్తే తనకి కూడా మోహన్ అంటే అదే భావన ఉన్నట్లు అర్థం అయింది.
రెండు రోజుల తర్వాత మోహన్ ఇంటికి వచ్చాడు.
ఇద్దరి మధ్య ఏమీ జరగనట్లుగా మామూలుగానే మాట్లాడుకున్నారు.
రాగమాల కూడా చాలా ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చి, తాను కూడా ఒక ఉత్తరం రాసి మోహన్ కి ఇస్తూ..
“నీలాగా నేను ఉత్తరాలను ఎవరితోనో పంపించను .ఇంటికి వెళ్ళాక చదువుకో”అని చెప్పింది.
ఆశ్చర్యంగా ఆ ఉత్తరాన్ని తీసుకున్నా డు మోహన్.
అసలు ఎవరితోనూ మాట్లాడని రాగమాల మొహన్ తో మాట్లాడటం విచిత్రం. అందులో వెంటనే ఉత్తరానికి సమాధానం ఇవ్వడం ఇంకా ఆశ్చర్యకరమైన విషయం.
కానీ చాలా ధైర్యంగా ఉంది రాగమాల .
ఆ రోజు నుండి ఇద్దరు రోజు ఒక లెటర్ రాసుకొని, ఒకరికి ఒకరికి ఇచ్చుకునే వాళ్ళు. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయని రాగమాల తల్లి వచ్చింది.
ఎంత ఎగ్జామ్స్ బిజీగా ఉన్నా, ఒక పేజీ లెటర్ అయినా రాసుకునే వాళ్ళు మోహన్ ,రాగ మాల.
రాగ మాల తల్లి వచ్చిందని తెలుసుకున్న శుభశ్రీ ఒక రోజు వచ్చి..
“మా అమ్మ మిమ్మల్ని రమ్మని చెప్పింది” అన్నది.
ముందే రాగ మాల చెప్పడం వల్ల వాళ్ళ గురించి తెలిసింది రాగ మాల తల్లికి.
రాగ మాల తల్లి ఉండటం వల్ల మోహన్ తక్కువగా వస్తున్నాడు.ఒక రోజు రాగ మాల తల్లిని మోహన్ వాళ్ళింటికి తీసుకెళ్లాడు.
రాగ మాల తల్లిని వాళ్ళింట్లో కి పంపించి రాగ మాల దగ్గరకి వచ్చాడు.
“చాలా చిన్న లెటర్స్ వ్రాస్తావు ఎందుకు? రోజంతా ఎదురు చూస్తూ ఉంటా,నువ్వేమో నాలుగు లైన్లు రాస్తావు”అన్నాడు మోహన్
“నీకేంటి! ఇంట్లో వండి పెడితే హాయిగా తిని తిరుగు తావు.నేను పనులు చేసుకోవాలి.మళ్ళీ చదువుకోవాలి”అన్నది రాగ మాల.
తొందరగా మోహన్ వెళ్లి పోతే బాగుండు,బోలెడంత సిలబస్ ఉంది.ఏదైనా అంటే అలుగుతాడు ” అని అనుకుంది రాగ మాల.
రాగ మాల వాళ్ళమ్మ వచ్చే ముందు ఇంటికి వెళ్లి పోయాడు.
అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయగలిగింది.కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రం అర్థం కావడం లేదు రాగ మాలకు.అనురాగ్ తో కూడా చెప్పించుకుంది.అయినా భయంగా ఉంది.
తెల్లవారి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉందనగా మోహన్ ఇంటికి వచ్చాడు.
అక్కడే ఉన్న రాగమాల తల్లి”రా మోహన్ !”అని పిలిచింది.
లోపలికి వచ్చిన మోహన్ రాగ మాల తో “రేపు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యావా?” అని అడిగాడు.
“నాకు ఎంత చదివినా ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థం కావడం లేదు.నేను నెక్ట్ ఇయర్ రాస్తాను ” అన్నది రాగ మాల.
“నిజంగా అంటున్నావా” అని గట్టిగా అడిగాడు మోహన్ .
“అవును! రాయను” అన్నది .
“నిజంగానే! నువ్వు రాయవా? పిచ్చా నీకు? రాయ గలుగు తావు. ఎందుకు ఎగ్జామ్ మిస్ చేసు కుంటావు?”అన్నాడు మోహన్.
“లేదు నేను రాయలేను. నాకు అసలే కాన్ఫిడెన్స్ లేదు. ఆ తర్వాత ఉన్న ఎగ్జామ్ కి కూడా ప్రిపేర్ కాలేను. ప్లీజ్ మోహన్! నన్ను బలవంతం చేయకు”అని చెప్పింది రాగ మాల.
అక్కడే ఉన్న తల్లి వసుంధరకు ఈ విషయం అర్థం కాలేదు. ఆమె ఏమీ అడగలేదు.
ఇద్దరికీ టీ పెట్టి తీసుకుని వచ్చింది వసుంధర.
“అమ్మ బాగుందా”అని అడిగింది వసుంధర మోహన్ ను
“బాగుంది” అని సమాధానం చెప్పి “వెళ్ళొస్తానని” వెళ్ళిపోయాడు మోహన్.
తెల్లవారి ఆర్గానిక్ కెమిస్ట్రీ పేపర్. పది గంటలకి ఎగ్జామ్ మొదలవుతుంది.
మరుసటి రోజు ఎగ్జామ్ కి రాగ మాల చదువుకుంటూ కూర్చుంది. చివరి ఎగ్జామ్ బాటనీ. తర్వాత ప్రాక్టికల్స్ మొదలవుతాయి.
పదకొండు గంటల ప్రాంతంలో తలుపు తట్టిన చప్పుడు వినిపించింది.
“ఈ టైం లో ఎవరు వచ్చారో? ఎగ్జామ్ కు చదువుకోవాలి”అనుకుంటూ తలుపు తీసింది రాగమాల.
తలుపు తీయగానే మోహన్ కనిపించాడు. ఆశ్చర్య పోయింది రాగ మాల.
“అదేంటి పరీక్షకు వెళ్ళ లేదా? పోస్ట్ పోన్ అయ్యిందా ఏంటి?”అన్నది రాగమాల ఆత్రుతగా.
“లోపలికి రానిస్తావా? ముందు కొంచెం మంచి నీళ్లు ఇవ్వు”అని అడిగి లోపలికి వచ్చి కూర్చున్నాడు.
వసుంధర కూరగాయల కోసం మార్కెట్ కు వెళ్ళింది.
లోపలికి వచ్చి కూర్చున్నాక, మంచి నీళ్ళు తాగాడు మోహన్.
“ఇప్పుడు చెప్పు నాకు చాలా కంగారుగా ఉంది”అన్నది రాగ మాల.
“నేను కాలేజీ వరకు వెళ్లాను. ఎగ్జామ్ టైం అయ్యి లోపలికి వెళ్లే సమయానికి, నువ్వు రాయకుండా నాకు రాయాలనిపించలేదు. అందుకే వెనక్కి వచ్చేసాను”అన్నాడు మోహన్.
ఒక్కసారిగా ఆశ్చర్య పోయింది రాగ మాల.
తేరు కొనడానికి కొంచెం సమయం పట్టింది.
తర్వాత మెల్లగా అడిగింది.
“నాకోసం నువ్వు ఎగ్జామ్ రాయకపోవడం ఏంటి? నాకు ఇదేమి నచ్చలేదు”అన్నది బాధగా రాగమాల.
“ఇందులో నచ్చకపోవడం ఏంటి! ఇద్దరం కలిసి రాద్దాం. దీన్ని అంత సీరియస్గా తీసుకోకు .సరే నేను వెళ్తున్నాను .ఇంటికి వెళ్లి రేపటి ఎగ్జామ్ కోసం చదువుకుంటాను. నువ్వు కూడా బాగా చదువుకో”అంటూ వెళ్లిపోయాడు.
కాసేపటి వరకు అలా అయోమయంగానే ఉన్నది రాగమాల. తర్వాత చదువుకోవడం మొదలు పెట్టింది.
అలా థియరి ఎగ్జామ్స్ మొత్తం అయిపోయాయి. ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ మరో వారంలో ఉన్నాయనగా, రివిజన్ కోసం క్లాసెస్ పెట్టారు.
రమణి గారి నాన్న గారు బోటనీ లెక్చరర్.కొన్ని ముఖ్యమైన స్లైడ్స్ చూపించారు. “అవి ఎగ్జామ్ లో గుర్తుంచుకోవడం కష్టం”. అని అందరికీ చెప్పి,” చాలా జాగ్రత్తగా ఇప్పుడే చూడమని, పదేపదే చెప్తే, అన్నిటినీ గుర్తుంచుకుంది రాగ మాల.
బయటకు వచ్చిన మోహన్ “నాకైతే ఒక్కటి కూడా గుర్తులేదు” అన్నాడు.
“ఎగ్జామ్లో గుర్తొస్తాయి లె,ఇప్పటి నుండి ఆలోచించకు” అన్నది రాగ మాల.
అన్ని ప్రాక్టికల్స్ అయిపోయాయి.చివరిది బోటనీ. పరీక్షలు అనగానే మోహన్ ముఖం భయంతో ఎర్రబడుతుంది.అసలే తెల్లగా ఉండే ముఖం మందారంలా అవుతుంది.ఎగ్జామ్ రాసి వెళ్ళాకే స్నానం చేసి తింటాడు.
రాగ మాలకు అంత భయం లేదు.కానీ మోహన్ ను చూశాక తనకు అలాగే మొదలయ్యింది.
ప్రాక్టికల్ ఎగ్జామ్ లో స్లైడు గుర్తు పట్టి, దానికి సంబంధించిన విషయం రాయాలి.ముందు రాగ మాల వంతు అయ్యాక ,వెనక మోహన్ వచ్చే వాడు..
“ఆ స్లైడ్ ఏంటి?” అని అడిగే వాడు.ఒక్కొక్క స్లైడ్ పేరు సార్ కి విన బడకుండా చెప్పి వెళ్ళేది రాగ మాల.
అలా పరీక్షలు అయిపోయాయి.
ఇక రాగ మాల ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయం కాలేదు.ఇల్లు ఖాళీ చేయాలి.వసుంధర ,రాగ మాల ఉన్న కొద్ది సామాను పాక్ చేస్తుంటే, మోహన్ వచ్చాడు.తాను కూడా కొంచెం సహాయం చేశాడు.
వసుంధరకు మోహన్ ను చూస్తే సంతోషంగా అనిపించింది.అన్ని ప్యాక్ చేశాక రాగ మాల,వసుంధర స్నానం చేసి ఊరికి వెళదాం అనుకున్నారు.
“అమ్మా! సబ్బులేదు.ఎలా స్నానం చేద్దాం?”అన్నది రాగ మాల.
అది విన్న మోహన్ నేను తెస్తా! ఏం సబ్బు తేవాలి” అన్నాడు.
“చంద్రిక” అని చెప్పింది రాగ మాల.
“చంద్రిక సబ్బు ఇష్టమా నీకు?” అన్నాడు మోహన్
“అవును” అని నవ్వింది రాగ మాల.
వసుంధరను,రాగ మాలను బస్సు ఎక్కించి ఇంటికి వెళ్లి పోయాడు మోహన్.
సశేషం