చేయూత

కథ

అమ్మ ఆరోగ్య పరిస్థితి దిగులు పుట్టిస్తున్నది. పట్నం వెళ్లి వైద్యం చేయించాలంటే చేతిలో చిల్లిగవ్వలేదు. ఇంట్లో అందరి కడుపులు నిండాలంటేనే గగనమవుతున్నది. వృత్తిరీత్యా పగటివేష కళాకారులం మేము, జనం నోట ” పైటేష గాళ్లు అనడం రివాజు. రామాయణ భాగవతాది పురాణ ఇతిహాసాలను ఆయా పాత్రలకు అనుగుణంగా వేషధారణతో జనులకు మన సంస్కృతిని దగ్గర చేరుస్తూ,వారందించే పారితోషకాలు, ఆర్థిక సహాయ సహకారాలతో జీవనం సాగిస్తుంటాం.

మా తాతల తరాల నుండి, మా పెద్దలకు పాఠశాల విద్యాభ్యాసం లేదు కానీ, పరంపరగా వస్తున్న కథాంశాలను కేవలం వినికిడితోనే ఒక ప్రత్యేక శైలిలో మలుచుకుని స్పష్టంగా క్షుణ్ణంగా రాగయుక్తంగా వాద్యగానాలతో నటిస్తుంటాం. కొన్ని కుటుంబాలు కలిసి సమిష్టిగా బంధుత్వపు వరుసలు కలుపుకొని ఒకే కుటుంబంగా సంపాదన కానీ, కష్ట సుఖాలు గానీ కలిసి పంచుకునే వాళ్ళం కూడా. ఆయా పర్వదినాలలో అర్ధనారీశ్వరుడు, దశావతారాలు, రామాయణ గాధలను మనసుకు హత్తుకునేట్లు కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శిస్తూ ఆ ఇంటి యజమానుల పెద్దలను గుర్తు చేస్తూ వారి వంశ ప్రతిష్టలను కీర్తిస్తూ దీవెనలతో ఆనందింప చేసేవాళ్లం. మా దీవెనలు ఫలిస్తాయని జనంలో గట్టి విశ్వాసం కూడా ఉండేది. ప్రహ్లాదుడు, ధ్రువుడు, సత్యహరిశ్చంద్రుని కుమారుడు లోహితాసుడు పాత్రలను చిన్నపిల్లలుగా మేము నటించేవాళ్ళం మా పాత్రలకు తగ్గ పాటలు పద్యాలు రాగయుక్తంగా అనర్గళంగా పాడుతూ అభినయించేవాళ్లం. అలాంటి తర్ఫీదు మాకు మా పెద్దలు ఇచ్చేవారు. పిట్ట కొంచెం కూత ఘ నం అంటూ ముచ్చట పడుతూ కామందుల లోగిళ్ళలో మాకు ఘనంగా పారితోషికాలు ఇచ్చేవారు.
ఇలాంటివే తోలుబొమ్మలాటలు, హరికథలు బుర్రకథలు జానపదాలు జనాన్ని అలరించేవీ, మన ఆచార వ్యవహారాలకు దగ్గరగా తీసుకెళ్లేవి. ధనుర్మాసపు మసక వెలుగులో కళ్లాపు చల్లి ముగ్గులు తీర్చిన ముంగిళ్ళలో హరి నామాన్ని కీర్తిస్తూ హరిదాసులు ఇంటింటికి తిరిగి దోసెడు ధాన్యం స్వీకరించి దీవెనలు అందిస్తూ పల్లె కే శోభ తెచ్చేవారు. మన సంస్కృతికి ఊపిరి పోస్తూ అప్పట్లో జనాలకు అందిస్తున్న కాలక్షేపాలు, ఆట విడుపులివి.
మారుతున్న కాలానికి నాందిగా మాలో కూడా కొంత మార్పులు వచ్చాయి. కేవలం వేషాలకే పరిమితం కాకుండా మాకు చదువుకునే అవకాశం కలిగించారు. క్రమంగా రేడియోలు, సినిమాలు, ఫోన్లు ఆ తర్వాత టీవీలు. ఇకఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు ఎవరికి వారికి ఒక సొంత ప్రపంచాన్ని సృష్టించాయి. ఈ మార్పులతోజనంలో ఆదరణ తగ్గిపోయి వెలిసిపోయిన రంగుల లాంటి ఈ కళలను, నలుగురితో కలిసి కొత్త ప్రపంచాన్ని చూస్తున్న మా తరం పిల్లలు కూడా ముఖాలకు రంగులేసుకుని ఇళ్లిళ్లు తిరగడానికి ఇష్టపడడం లేదు. మా వాళ్ళందరూ తలకొక మార్గంలో బ్రతుకుతెరువు సాగించడం మొదలుపెట్టారు. నేనూ ఆ వేటలోనే ఉన్నాను. జీవితమే ఈ కళలకు అంకితంచేసుకుని ఇన్ని రోజులు గౌరవంగా జీవితాలు గడిపిన మా తాతయ్య, నాన్న వంటి వారు మరో పని చేతకాక, చేయలేక నలిగిపోతున్నారు.
ఆరు నెలలుగా ఇంట్లో కూడా చెప్పకుండా నేను చేస్తున్న ప్రయత్నాలకు ఈరోజు ఒక ఆధారం దొరికినట్లు అయింది. నాతో పాటు చదువుకున్న పెద్దిరెడ్డి గారి అబ్బాయి శ్రీరామ్ ను అనుకోకుండా కలవడం జరిగింది పొలం పుట్ర కవులు కి ఇచ్చేసి పెద్ద కుటుంబాలన్నీ మార్పు కోరుకుంటున్న పిల్లలను అనుసరించి టౌన్లకు, నగరాలకు వెళ్లిపోయారు. అక్కడే బిజినెస్ లు ఫ్యాక్టరీలు పెట్టారు. నా పరిస్థితి కొత్తగా చెప్పుకునే పనేమీ లేకుండా శ్రీరామ్ ని కలిసిన వెంటనే, నాకు, నాన్నకుఉపాధి కల్పించడమే కాకుండా ఉండేందుకు వసతి కూడా ఉచితంగా కల్పించాడు. టౌన్ కు మారిపోయాము. రెండు నెలలుగా ఉద్యోగానికి కూడా అలవాటు పడిపోయాను నాన్న కూడా భేషజం లేకుండా యదార్ధాన్ని గ్రహించగలిగి కొత్తగా చేరిన పనికి అలవాటు పడుతున్నాడు. చాన్నాళ్ల తర్వాత ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. ఇక అమ్మకు కూడా శ్రీరామ్ వాళ్ళ పరపతితో వైద్యం జరుగుతున్నది అమ్మ ముఖంలో మళ్లీ ఆనందం చూస్తున్నాను . నా వెనుక పిల్లలిద్దరిని నెమ్మదిగా మళ్లీ స్కూల్ కి పంపించాలిక, ముసురుకున్న చీకట్లు ఒక్కసారిగా వెలుగు నింపుకున్నట్లు మోస్తున్న భారం తేలిక పడినట్లు అయింది. దైవం మానుష రూపేణ అన్నట్లుగ, దేవుడు నా మొరాలకించి శ్రీరామ్ రూపంలో మాకు చేయూతనిచ్చాడన్న నమ్మకం నాకు బలపడింది.
అంతా స్థిమితపడ్డాము అనుకున్నా తాతయ్య ఉదాసీనత మనసుకు కలుక్కుమనిపిస్తున్నది . ఈరోజు తాతయ్య తో మాట్లాడాలనుకున్నాను. ఆ రాత్రి భోజనాలు అయ్యాక వరండా మెట్ల పైన కూర్చున్న తాతయ్య పక్కన వెళ్లి కూర్చున్నాను. తాతయ్యా! ఊ కొట్టాడే తప్ప సంభాషణ పెంచలేదు నేనే పూనుకొని తాతయ్యా, మారుతున్న కాలంతో పాటు మనమూ మారవలసి ఉంటుంది కదా, వంశాచారంగా ఇంతకాలం ఈ కళలతోనే బ్రతుకుతెరువు వెతుక్కున్నాం కానీ, తరాల అంతరాలు ఏర్పడుతున్న ఈ స్థితిలో కొత్త మార్గం వెతుక్కోక తప్పదు కదా, దేశ సంస్కృతిని చాటి చెప్పే ఈ కళలను అరుదైన సందర్భాలలో గుర్తు చేసుకుంటూ పురస్కారాలు అందుకోవడమో లేదా పండగ పబ్బాలలో గానీ ముఖానికి రంగు వేసుకునే అవసరమే రావడం లేదు. మనసుపెట్టి మనదైన శైలిలో చాటి చెప్పే కథాంశాలను ప్రస్తుతం వినే వారెవరు? ఆనందించే వారెవరు? ఆ రోజుల్లో పల్లెలు పచ్చగా ఉన్నన్నాళ్ళు మనము సేదతీరాము. ఇప్పుడు ఊర్లు, టౌన్లకు నగరాలకు దేశ విదేశాలకు వలస వెళ్లిపోయాయి. మనల్ని పోషించే మహారాజ పోషకులూ మరుగయ్యారు. అంతేగాక మనలో ఎంతమందిమి ఈ వృత్తిలో మిగిలి ఉన్నామో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, అందరూ వాళ్ళ లాగా వాళ్ల పిల్లలు కష్టపడకూడదని ఎవరికి తోచిన దారి వారు వెతుక్కుంటున్నారు.
నీ చేయి పట్టుకుని నడిచి వచ్చిన ఈ దారి నాకు చాలా ప్రీతికరం తాతయ్యా, గత చాన్నాళ్లుగా ఒంటిపై సొమ్ములు , ఇంట్లో వస్తువులు అన్నీ అంగట్లో చేరిపోయాయి. ప్రతిరోజూ ఒక పరీక్షగా గడుపుతూ వచ్చాము కదా! ఆపైన ఇక ఏం మాట్లాడాలో తోచక మౌనంగా ఉండిపోయాను. కాసేపు మౌనంగా గడిచిన తర్వాత తాతయ్య నా తలపై చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని నిజమేరా, ఇవన్నీ గమనించలేకపోయాను కానీ చాదస్తులను కానురా, నువ్వు మమ్మల్ని నొప్పించకూడదని ఇన్నాళ్లు ఓపికగా భరించావు నీలా ఆలోచించగలిగి ఉంటే మీ నాయనమ్మను అనారోగ్యానికి బలి చేసి ఉండేవాడను కాదయ్యా, ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా మనసు కృంగిపోతున్నది అంతే, నీవు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు, పద లోపలికి వెళ్లి పడుకుందాం ఉదయాన్నే లేచి నువ్వు పనిలోకి వెళ్ళాలి కదా అంటూ, నా చేయి ఆసరాగా చేసుకుని తాతయ్య లోపలికి నడిచాడు. మా పాలిటి దేవుడై చేయూతనందించి ఈ ఊబిలో నుంచి బయట పడవేసిన శ్రీరామ్ కు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, రేపటి సూర్యోదయాన్ని తలచుకుంటూ తృప్తిగా నిద్రలోకి జారిపోయాను.

Written by Polamreddy Vijayalaxmi

పొలంరెడ్డి విజయలక్ష్మి శ్యామదాసిగా , రచనా ప్రపంచానికి పరిచయం అయ్యాను. ప్రత్యేకించి విద్యార్హత ఏమి లేదు వానాకాలం చదువు మాత్రమే. యదార్ధాన్ని పునాదిగా , నా అనుభవాలు , నా చుట్టూ జరిగే వాస్తవాలు, నా మనోభిలాషను తృప్తిపరస్తూ, అక్షర రూపంలో సహృదయులైన మీవంటి ప్రోత్సహకులు చెంత చేరి ప్రాణం పోసుకున్నాయి. అలా ఊపిరందుకున్న రచనలు, నవవ్యాస మాలిక , కొత్త కథలు, గుర్తుకొస్తున్నాయి, ప్రియమైన నీకు, కథలు, లోగిలి, ధీర. మరికొన్ని మంత్లీ మ్యాగజైన్ లో కూడా ప్రచురింపబడ్డాయి. వేదం, వేదాంతం, బ్రతుకు బాసటగా నిలిచే అన్నమయ్య కీర్తనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం, రోజు వాకా పాఠంగా నేర్చుకోవడం అతి ముఖ్యమైన దినచర్య.

పూర్తి పేరు : పొలంరెడ్డి విజయలక్ష్మి
కలం పేరు: శ్యామదాసి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చివరకు మిగిలేది

హోమ్ టూర్