దొరసాని

ధారావాహికం – నాల్గవ భాగం

 

              లక్ష్మీమదన్

జరిగిన కథ

ఎయిర్పోర్ట్ కు వెళుతున్న నీలాంబరి కి తన పెయింటింగ్ బ్రష్లు కలర్స్ మర్చిపోయారని అనుకుంటుంది అప్పుడు ఆమె భర్త భూపతి ఆమె ఇష్టాన్ని గౌరవిస్తానని అందుకే అవి తాను పెట్టానని చెప్తాడు …
ఎయిర్పోర్టులో తన చిన్ననాటి స్నేహితురాలు కలుస్తుంది ఆమెది తన పక్క సీటు కావడంతో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేస్తారు అమెరికాకు వెళ్లిన తర్వాత అక్కడి వాతావరణం లో ఎలా ఇమద గలిగిందో తర్వాత భాగంలో చదవండి

కారు వెళ్తుంటే బయటకు చూస్తూ కూర్చుంది నీలాంబరి విశాలమైన రోడ్లు ఇరువైపులా చక్కని చెట్లు ఎంతో అందంగా ఉన్నాయి అమెరికాలోని రోడ్లు… ఇంటింటికి మధ్యలో ఎంతో దూరం ప్రతి ఇంటి చుట్టూ చక్కని చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్లుగా ఉన్నాయి…

ఇల్లు వచ్చింది కారు ఆగగానే ముందుగా కూతురు అల్లుడు కారు దిగి నీలాంబరిని దిగమన్నారు మెల్లగా లగేజ్ అంతా తీసుకొని ఇంట్లోకి వెళ్లారు ఇల్లు ఎంతో అందంగా ఉంది అక్కడ అంతా చెక్కతో నిర్మిస్తారు కదా… సెంట్రల్ ఏసి అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు… ఇల్లంతా పరిచిన కార్పెట్.. ఎన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్న పల్లెటూరులోని అనుభూతి ఉంటుందా అందులో మన భారత దేశంలో ఎన్నో గొప్ప వనరులు ఉన్నాయి ఎంతో అందమైన సంస్కృతి మనది ప్రతి ఇంట్లో నోములు వ్రతాలు పేరంటాలకు వెళ్లడం తాంబూలాలు తీసుకోవడం.. ఇలా మనుషులు తీరిక లేకుండా ఉన్నా కూడా మనసు ఎంతో ఉద్దేశం గా ఉంటుంది…

ప్రతి పండగ మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది ప్రకృతి మనం ఒక్కటేనని చాటి చెబుతుంది ఆ పండగ కోసం చేసుకున్న వంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి అలా కష్టపడి అన్ని పిండి వంటలు వండుకొని నైవేద్యం చేయడము వ్రతాలు చేసుకోవడం చక్కగా పట్టు చీరలు కట్టుకొని నగలు పెట్టుకొని తాంబూలాలకు వెళ్లడం నలుగురిని పిలుచుకొని వారికి మనకు ఉన్నది పంచడం ఇలా ఎంతో అనుభూతి ఉంది…

దాదాపు ఉదయం 10:00 కావస్తుంది…

” అమ్మ మేము ఆఫీస్ కి వెళ్ళాలి ఉదయం పర్మిషన్ తీసుకొని ఎయిర్పోర్టుకు వచ్చాము.. మూడు గంటల వరకు వచ్చే ప్రయత్నం చేస్తాము.. ఈ పూటకి బ్రేక్ ఫాస్ట్ బ్రెడ్ బటర్ టోస్ట్ చేస్తాను అన్నది అలేఖ్య.

ప్రయాణం చేసి అలసటలో ఉన్న నీలాంబరి “సరే నీ ఇష్టం నేను వెళ్లి స్నానం చేసి వస్తాను” అని తనకోసం ఏర్పాటుచేసిన గదిలోకి వెళ్ళింది లోపలికి అలేఖ్య వచ్చి..

” అమ్మా! ఇదిగో ఇది గీజర్ స్పీచ్ టబ్లో మాత్రమే చేయాలి నీళ్లు ఏమాత్రం బయటపడకూడదు అదిగో నీకు అవసరం ఉన్న సోప్స్, షాంపూలు అక్కడే ఉన్నాయి” అని చెప్పింది.

“ఏంటో ఇక్కడ పద్ధతులు అలవాటు పడాలంటే కొంచెం కష్టమే చక్కగా గద్దేపీట వేసుకొని బాత్రూం లో కూర్చుని వేడి నీళ్లు గంగాళంలో పనివాళ్ళు ఏర్పాటు చేస్తే హాయిగా పోసుకోవడం మాత్రమే తెలుసు… తప్పదు అలవాటు పడాలి. ఇక్కడ నేను దొరసానిని కాదు కదా అయినా నా కూతురు అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయింది అలాగే నేను కావాల్సిందే” అని అనుకున్నది.

స్నానం చేసి సింపుల్ గా ఉండే నారాయణపేట కాటన్ చీర కట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది…. అప్పటికే తినేసిన అలేఖ్య మరియు అల్లుడు సుదీర్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు…

” తలుపులు జాగ్రత్తగా వేసుకో… మేము వీలైనంత తొందరగా వస్తాము రేపు ఎల్లుండి శని ఆదివారాలు సెలవే ఇక్కడి పద్ధతులు అన్ని నీకు అలవాటైపోతాయి” అని చెప్పి వాళ్ళు వెళ్లిపోయారు.

ఆకలి కన్నా ఎక్కువ నిద్ర ముంచుకుని వస్తుంది నీలాంబరి కి.. ప్లేట్ లో ఉన్న బ్రెడ్ తీసుకొని కొంచెం కొరికి చూసింది…. అసలు తనకు ఇలాంటి తిండ్లు పడవు… ఇంట్లో అయితే ఎక్కువగా వంట మనిషి అల్పాహారంగా ఉప్పుడు, పిండి తపాలా రొట్టె లేదా అట్లు పోస్తుంది ఒక్కొక్కసారి అవి కూడా తాను తినదు పెరటి తోటలో కాసిన జామ పండ్లు అరటి పండ్లు మాత్రమే తింటుంది.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు ఎక్కువగానే తీసుకుంటుంది నీలాంబరి.

నామ మాత్రంకు తిన్నానని అనిపించి వెళ్లి మంచం మీద పడుతుంది రోజంతా ఏసి గాలి అలవాటులేని నీలాంబరి కొంచెం ఇబ్బందిగా అనిపించిన అలసట వల్ల నిద్ర పట్టేసింది … రెండు మూడు గంటలు నిద్ర పోయిన తర్వాత అకస్మాత్తుగా మెలకువ వచ్చింది… కళ్ళు తెరిచి ” మహీ! ఓ మహేశ్వరి! దొరవారు వచ్చారా భోజనం సిద్ధం చేసావా నేను వచ్చేస్తున్న టేబుల్ మీద అన్ని పెట్టేసేయ్” అని చెప్పింది.. కానీ అవతల నుండి ఏసమాధానం రాకపోయేసరికి కళ్ళు తెరిచి చూసింది అయ్యో నేను ఉన్నది అమెరికాలోనా.. అని మెల్లగా లేచింది… అవునూ.. కూతురు అల్లుడు భోజనానికి వస్తానన్నారు మరి వంట ఎవరు చేస్తారు.. అని అనుకొని కూతురి ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేసింది…

” అలేఖ్యా! మీరు భోజనానికి ఇంటికి వస్తారు కదా మరి వంట సంగతి ఏమిటి” అని అడిగింది..

“అమ్మా! మూడు రోజుల కింద చేసిన సాంబారు బెండకాయ కూర ఫ్రిడ్జ్ లో ఉంది అన్నము ఒకటి వండేసేయ్ అవి వేడి చేసుకుని తిందాము” అని చెప్పింది అలేఖ్య..

ఒక్కసారి కళ్ళు తిరిగినట్లు అయింది నీలాంబరికి… “ఏమిటి మూడు రోజుల కింద చేసినవి వేడి చేసుకుని తినాలా? అక్కడ వండిన గంట తర్వాతే ఇంట్లో ఎవరు మూతినము.. అలాంటిది మూడు రోజుల కింద పదార్థాలు తినాలా!”

తాను సరిగా వినలేదేమో అని “అలేఖ్యా! ఏమిటన్నావు సాంబారు బెండకాయ మూడు రోజుల క్రిందిదా” అన్నది

” అవునమ్మా ఇక్కడ ఇది మామూలే అక్కడి లాగా ఎప్పటికప్పుడు వేడిగా చేసుకోవడం మిగిలితే పని వాళ్ళకి ఇచ్చేయడం అలా ఉండదు అయిపోయే వరకు తినాల్సిందే” అని చెప్పి బియ్యం ఎక్కడున్నాయో చెప్పింది.

వంటింట్లోకి వెళ్లిడబ్బాలన్నీ వెతికి బియ్యం తీసుకొని కుక్కర్లో కడిగి పెట్టింది తనకు వంట చేయడం అంతగా రాదు కానీ కొన్ని వంటలు మాత్రమే భర్తకు ఇష్టమైనవి నేర్చుకుంది … కానీ కొన్ని వంటలు ఇంట్లో మహేశ్వరి చేసేటప్పుడు చూసింది కాబట్టి కొంత అవగాహన ఉంది కానీ వంట చేసింది ఎప్పుడూ లేదు.

సింకులో చూస్తే బోలెడు గిన్నెలు ఉన్నాయి.. సరే ఎవరైనా పని వాళ్లు వచ్చి కడుగుతారేమో అనుకుంది…

కాసేపట్లో అలేఖ్య సుధీర్ వచ్చారు.. “పడుకుని లేచావా! రాత్రి పగలు తేడా ఉంటుంది కదా.. రెండు మూడు రోజుల వరకు నిద్ర సరిపోనట్టుగా ఉంటుంది దీన్నే జట్లాగ్ అంటారు .. సరే నేను సాంబారు కూర వేడి చేస్తాను భోజనం చేద్దాము… ముగ్గురు కంచాలలో వడ్డించుకుని కూర్చున్నారు….

నీలాంబరికి మాత్రం మూడు రోజుల క్రితం కూరలు అంటే అసహ్యం వేసింది అందుకే “నాకు ఇప్పుడు కూరలు తినాలని లేదు “అని చెప్పి తను వెంట తెచ్చిన పచ్చళ్ళు వేసుకొని తిన్నది.

ఆ విషయం కూతురికి అర్థం అయింది” రాసరికపు అలవాట్లు అప్పుడే పోవులే అని మనసులో అనుకుంది నాకెన్నాళ్లు పట్టింది సర్దుకోవడానికి అయినా తనకు అవసరం లేదు నాలుగు రోజుల ఉండి వెళ్లిపోయే తను ఎందుకు అలవాటు చేసుకోవాలి? పాపం అమ్మకి కష్టమే ఇక్కడ” అని అనుకుంది.

భోజనాలు చేసిన తర్వాత వెళ్లి పడుకుంది నీలాంబరి… అలేఖ్య వంటిల్లు శుభ్రం చేసి గిన్నెలన్నీ కడిగేసి అమ్మ పడుకున్న గదిలోకి వెళ్ళి ంది అక్కడ తల్లిని చూసి ఆశ్చర్య పోయింది…

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పృథ్వి విలాపం

జ్ఞానసరస్వతి