పెళ్లిలో నీలాంబరి, అలేఖ్య మరియు సౌందర్యలహరి ముగ్గురు మెరిసిపోతూ అందరి కళ్ళకి ఎంతో అందంగా కనిపించారు.
తమ్ముడి పెళ్లి వేడుకను ఎంతో ఇష్టంగా తిలకిస్తూ, తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ అందరినీ పలకరిస్తూ తిరిగింది అలేఖ్య.
నవ్వుల ఒడి బాలసదనం నుండి పిల్లలు మరియు పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు వచ్చారు. ఆ ప్రాంగణమంతా చిన్న పిల్లలతో కళకళలాడింది. పిల్లల తల్లిదండ్రుల కళ్ళలో ఎంతో సంతోషం కనిపించింది. మా కోసం ఇంత చేస్తున్న నీలాంబరి గారి ఇంటి పెళ్లి మాఇంటిపెళ్లి అన్నట్లుగా అనుకున్నారు ఊరి వాళ్లంతా.
ఎంతోమంది ప్రముఖులు కూడా వివాహానికి హాజరయ్యారు. ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. ఊళ్లో వాళ్లు కూడా ఎంతో సహాయ సహకారాలను అందించారు.
ఈసందర్భంగా నీలాంబరి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు చేత అందరికీ మొక్కలను పంపిణీ చేయించింది. ఎక్కువగా కొబ్బరి, జామ చెట్లను ఇప్పించింది. తోచినంతగా అందరికీ తాంబూలంలో నూలు వస్త్రములను బహూ కరించింది. ఇలా పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది.
పెళ్లి తర్వాత జరిగే స్థాళిపాకం, నాగవల్లి కార్యక్రమం ఎంతో చక్కగా జరిగింది. నాగవల్లి కార్యక్రమంలో చాలామంది ముత్తైదువలు మంగళ గౌరీ వ్రతం ఉద్యాపన చేసుకుంటారు. ఒక కొత్త ఇత్తడి లేదా యధాశక్తిని అనుసరించి, ఒక గిన్నె తీసుకొని అందులో 33 అరిసెలను ఉంచుతారు.ఒక చిన్న మంగళసూత్రము దానికే తొడిగిన చిన్న మెట్టెలు, నల్లపూసలు గూర్చి దానితో పాటుగా చీర ,రవికల బట్ట పండ్లను పెట్టి పెళ్ళికూతురికి వాయనంగా ఇస్తారు. పెళ్లి తర్వాత ఐదేళ్లు చేసుకున్న మంగళ గౌరీ వ్రతానికి ఇది ఉద్యాపన అన్నమాట.
అలా నీలాంబరి మంగళ గౌరీ ఉద్యాపన చేసుకున్నది.
ఇంటిముందు వెనక వేసిన పచ్చని పందిళ్లలో అందరికీ భోజనాలు వడ్డించారు. అందరికీ మోతుకు ఆకుతో పచ్చని విస్తర్లు కుట్టించారు.
వంటలకు, వడ్డించడానికి ఎంతోమందిని ఏర్పాటు చేసినా కూడా, స్వయంగా దగ్గర బంధువులు వడ్డిస్తే ఆ ఆప్యాయత వేరు. అలా పెళ్లి కోసం వచ్చిన దగ్గరి బంధువుల పిల్లలందరూ, తలా ఒక పదార్థం పట్టుకొని వడ్డిస్తున్నారు.
భోజనం చేస్తూ పెళ్లి పాటలు మధ్య మధ్యలో పాడుకుంటున్నారు. కొంతమంది పద్యాలను పాడుతున్నారు. నిదానంగా జరుగుతున్న భోజనాల కార్యక్రమంలో తినేవారికి తెలియకుండా, విస్తట్ల లో లడ్డూలు వేసేస్తున్నారు వడ్డించే అమ్మాయిలు.
” ఏంటే పిల్ల! ఇన్ని లడ్డు లేసావు” అని అంటే..
” మెల్లగా తినండి అమ్మమ్మ. ఇంకొక పాట పాడితే అరిగిపోతుందిలే” అని గడుసుగా జవాబు చెబుతున్నారు ఆ పిల్లలు.
” మీ పెళ్లి అయితే కానీ మీకు తెలుస్తుందిలే. ముక్కుకుతాడేసే మొగుళ్ళు రావాలి మీకు'” అని పెద్దవాళ్లు పరాచకం ఆడితే..
” నేర్పడానికి మీరు ఉన్నారుగా అమ్మమ్మ” అని చెణుకులు అందించారు పిల్లలు. అలా సరదాగా జరిగిపోతున్నాయి భోజనాలు.
పెళ్ళికాని అమ్మాయిలు చక్కగా ఓణీలు, పరికిణీలు కట్టుకొని జడగంటలు వేసుకొని సాంప్రదాయంగా తయారై పెండ్లి ఇంటికి వన్నె తెచ్చారు. వాళ్లందరూ వచ్చిన వాళ్ళను వరుసలతో పిలుస్తూ, కొసరి కొసరి వడ్డిస్తూ పెళ్లి భోజనానికి మరింత రుచిని తీసుకొచ్చారు.
ఎన్నో రోజులకు కలుసుకున్న బంధువులు తనివితీరా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. పెద్దవాళ్లు వాళ్ళ వయసును కూడా మరిచిపోయి పెళ్లి కార్యక్రమాన్ని తిలకిస్తూ చక్కని విందును ఆరగిస్తూ, వారి వయసును మరిచిపోయి పిల్లలతో పాటు నృత్యాలలో కూడా పాల్గొంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు.
ఎక్కడ చూసినా సంబరం కానవస్తుంది. వచ్చినవాళ్లు కొత్త జంటను ఆశీర్వదిస్తూ నీలాంబరి, భూపతి అందించిన బహుమతులను తీసుకొని ఆనందంగా ఇళ్లకు తరలి వెళ్తున్నారు.
బాజాలు, భజన్త్రీలు, పెళ్లి భోజనాలు, పట్టుచీరలు ,నగలు బహుమతులు ఇవన్నీ ఎన్ని ఉన్నా, వధూవరుల కళ్ళల్లో ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమ అనే మెరుపు నక్షత్రాలను మించిపోయింది.
ఇంచుమించు బంధుమిత్రుల భోజనాలు అందరివి అయిపోయిన తర్వాత వధూవరులకు, వీరి తల్లిదండ్రులకు మరియు దగ్గర బంధువులకు ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేశారు.
వెండి కంచాలలో భోజనం వడ్డించినా, వెన్నలాంటి మనసు కావాలి. వెన్నెల లాంటి జీవితం ఉండాలి.
పసుపు పిండితో చక్కని ముగ్గు వేసి, అందరికి పీటలు వేసి పచ్చటి ఆకులలో భోజనం వడ్డించారు.
పెళ్లి భోజనంలో వధూవరులు ఒకరికొకరు తీపి తినిపించుకోవడం ఆనవాయితీ. దీనిని ఎంగిలి బంతులు అని కూడా అంటారు.
వరుసైన వాళ్లు పరాచకాలను ఆడుతూ, వారిని ఒకరికొకరు తినిపించుకోమని ప్రోత్సహిస్తుంటారు. ఒకరికొకరు సిగ్గుపడుతూ తినిపించుకోవడం అదొక వేడుక.అదే కాకుండా ఒకరి పేర్లు ఒకరితో చెప్పించడం. ఇదంతా అలేఖ్య దగ్గరుండి చేయించింది. సౌందర్య లహరి అయితే మామ, అత్త ఒడిలో కూర్చుని మురిసిపోతుంది.
తెల్లవారి సౌదామిని పుట్టింట్లో సత్యనారాయణ వ్రతం. అక్కడ ఏర్పాట్ల కోసం సౌదామిని తల్లిదండ్రులు ముందుగానే వాళ్ల ఊరికి వెళ్ళిపోయారు.
విజయమ్మ అందరికీ బొట్టు పెట్టి సత్యనారాయణ వ్రతానికి రావాలని ఆహ్వానించింది.
అందరూ పెళ్లి జరిగిన అలసటతో ఒకింత విశ్రాంతి తీసుకున్నారు.
తెల్లవారి ఉదయం భూపతి కుటుంబం మొత్తం వనపర్తికి బయలుదేరారు. బంధువులకి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది కాకుండా దగ్గరి బంధువులను మాత్రమే పిలుచుకున్నారు. అమ్మాయి తరపు వాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదని నీలాంబరి ఉద్దేశం.
దాదాపు పన్నెండు గంటల ప్రాంతంలో వనపర్తి లోని సౌదామిని ఇంటికి చేరుకున్నారు.
ఇంటి ముందుకు కారు వచ్చి ఆగగానే, ఇంట్లో నుండి విజయమ్మ రవీంద్ర మరియు ఇంకా కొంతమంది బంధువులు బయటకు వచ్చారు.
విజయమ్మ ఎర్ర నీటితో వధూవరులకు దిష్టి తీసింది. ఆ తర్వాత హారతి ఇచ్చి, వధూవరుల పేర్లు చెప్పించి అందరిని ఇంట్లోకి ఆహ్వానించారు. అందరూ ఎవరికి కేటాయించిన గదులలోకి వాళ్ళు వెళ్లిపోయారు.
సౌదామినిని దగ్గరికి తీసుకుంది విజయమ్మ.
” నిజానికి నువ్వు ఇక్కడ పెళ్లి జరిగి గోపాలపురం వెళ్లాల్సింది. కానీ మీ అత్తగారి కోరిక మేరకు అక్కడే జరిపించాము. కానీ పెళ్లిలో వచ్చిన జనం చూశాక అంత మందిని మనం తట్టుకోవడం కష్టమే అనిపించింది. ఏదైనా ఆవిడ మనసు చాలా మంచిది. అందరి గురించి నిశితంగా ఆలోచించే తత్వం” అంటూ దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది విజయమ్మ.
ఈరోజు అందరూ విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం. అందరూ ఫ్రెష్ అయి వస్తే, అందరికీ భోజనాలు వడ్డిస్తాము” అని చెప్పారు విజయమ్మ, రవీంద్ర.
అందరూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చారు. సౌదామిని బంధువులు కొంతమంది ఇంట్లో ఉన్నారు.నీలాంబరి వాళ్ళ కుటుంబం కొద్ది మంది మాత్రమే వచ్చారు. మిగతా బంధువులు తెల్లవారి వ్రతానికి హాజరవుతామని చెప్పారు.
అందరికీ హాల్లో భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ భోజనాలు చేసిన తర్వాత, ఆ రోజంతా విశ్రాంతి తీసుకున్నారు.
తెల్లవారి ఉదయం తొందరగా నిద్ర లేచి, వధూ వరులు పట్టు బట్టలు కట్టుకున్నారు. ఇంట్లో అందరూ కూడా తయారయ్యారు. వాళ్ళ ఇంటి ఆనవాయితీ ప్రకారం గ్రామ దేవతకి పూజ చేయించాల్సి ఉంటుంది.
మేళ తాళాలతో అమ్మవారికి వస్త్రములు తీసుకొని సౌదామిని తల్లిదండ్రులు మరియు నీలాంబరి భూపతి గుడికి వెళ్లారు. అక్కడ పూజలు చేయించి, అమ్మవారికి వస్త్రములు సమర్పించి, ఇంటికి తిరిగి వచ్చారు.
సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. చక్కని మంటపము, చుట్టూ అరిటాకులతో పందిరి వేసి, పూలమాలలతో తోరణాలు కట్టి ,పెద్ద సత్యనారాయణ స్వామి ఫోటో ముందుగా ఉంచి, లోపల వస్త్రము పరిచి అందులో బియ్యం పోసి, దానిపై కలశం నుంచి పూజారి గారు వీరి కోసం ఎదురుచూస్తున్నారు.
ఇంటికి వచ్చిన కొత్త జంటకు నూతన వస్త్రములు బహుకరించింది సౌదామిని తల్లి. నూతన వస్త్రములు కట్టుకొని పెళ్లి బొట్టు పెట్టుకుని, బాసింగం కట్టుకొని, పీటల మీద కూర్చున్నారు సౌదామిని మరియు సాగర్.
సౌదామిని తరపు బంధువులు అందరూ వీరి జంటను చూసి ఎంతో ముచ్చట పడ్డారు. ఎంతో మంచి ఇంటికి సౌదామినిని ఇస్తున్నారని అందరూ మాట్లాడుకున్నారు. ఈ మాటలు వింటున్న విజయమ్మ రవీంద్ర సంతోషానికి హద్దులు లేవు. ఎవరికైనా ఆడపిల్ల మంచి ఇంటికి వెళ్లాలని ఉంటుంది కదా!
చక్కగా పూజారిగారు సత్యనారాయణ వ్రతం చేయించారు నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజ తర్వాత వినాయకుడి పూజ తర్వాత యధావిధిగా సత్యనారాయణ వ్రతము ఐదు కథలను వినిపించారు.
అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రత కథను విని భక్తి పారవశంతో మునిగిపోయారు. వ్రతము అయిన తర్వాత బ్రాహ్మణులకు సంభావన, వాయనము, తాంబూలం ఇప్పించారు.
ఆ తర్వాత స్వామివారి తీర్థ, ప్రసాదములను అందరికీ వినియోగం చేసి, చక్కని భోజనాలను వడ్డించారు.
ఇలా ఎంతో వైభవంగా వ్రతము జరిగి, అందరూ భోజనాలు చేసి ఆరోజు సాయంత్రం మళ్లీ గోపాలపురానికి చేరుకున్నారు నీలాంబరి కుటుంబం.
వధూవరులు ఇంట్లోకి వచ్చిన తర్వాత కోడలు గృహప్రవేశం అనే పద్ధతి ప్రకారం కోడలికి చీర సారే పెట్టి , వధూవరులతో పూల చెండు ఆట ఆడించారు.తర్వాత నీటి బిందెలో ఉంగరం వేసి, ఆట ఆడించారు. ఇవన్నీ పెళ్లికూతురు భయం మొహమాటం పోగొట్టడానికి చేసే చిన్న చిన్న సరదాలు.
అందరూ పడుకున్న తర్వాత నీలాంబరి మరియు భూపతి ఇంటి పెరట్లో కూర్చుని మాట్లాడుకున్నారు.
” నీలా! ఇంత విచిత్రంగా జరిగాయి కదా మన ఇంట్లో సంఘటనలు. నువ్వు అమెరికా వెళ్లడం ఏమిటి! అక్కడ నీ చిత్రలేఖనానికి ఎంతో విలువ దక్కి నువ్వు అనుకున్న బాలసదనంకు ఏర్పాట్లు జరగడం ఏంటి, చుట్టం చూపుగా వచ్చిన సౌదామిని మన హాస్పిటల్ లో డాక్టర్ గా చేయడానికి ఒప్పుకోవడం మరియు సాగర సౌదామిని మధ్య ప్రేమ కలగడం, ఇదంతా తలుచుకుంటుంటే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. మన ఇంటికి ఇంత మంచి కోడల్ని పంపించినందుకు దేవుడికి మనం ఎప్పుడు కృతజ్ఞతలు తెలపాల్సిందే! ఏమంటావు”? అన్నాడు భూపతి.
” నా మనసులో ఏముందో అదే మీరు చెప్పారు. నేను ఇంకా ఇంతకన్నా చెప్పేది ఏముంది! నిజంగా ఒక అద్భుతమే జరిగిందండి. మన ఇంటికి తగిన కోడలు మనకు వచ్చింది. అలేఖ్య సుధీర్ కూడా ఇండియాకి వస్తే బాగుండేది! వాళ్ల ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయో తెలియదు” అన్నది నీలాంబరి.
“మెల్లిగా అన్ని జరుగుతాయి నీలా! ఇవన్నీ మనం ఊహించామా! అలాగే మనకు ఏది ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. మనం కూడా అందరికీ మంచి చేయాలని కోరుకుంటాము. అందులో నీ మనసు ఇంకా మంచిది? అందుకే అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఏమీ ఆలోచించకు. కర్తవ్యం నిర్వహిస్తే చాలు ఫలితం అదే వస్తుంది అదే భగవద్గీత సారాంశం” అన్నాడు భూపతి.
” అవునండి నాకు ఇంకా ఏ చింతా లేదు. అంతా పిల్లలు చూసుకుంటారు మీరు ఎలాగూ రాజకీయం వైపు వెళతాను అంటున్నారు. చాలా బిజీ అయిపోతారు.నేను మీకందరికీ ఏ విధమైన సహాయ సహకారాలు అందివ్వాలో అవి ఇస్తాను. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి” అన్నది నీలాంబరి.
ఇద్దరు అలా ఎంతో సేపు మాట్లాడుకున్నారు. వీరి ఆనందాన్ని పంచుకుంటూ చందమామ కూడా మబ్బుల్లో నుండి తొంగి తొంగి చూస్తూనే ఉన్నాడు.
ఇంట్లో పెళ్లి అయిన తర్వాత జరిగే వేడుకలు అన్ని చక్కగా జరిగిపోతున్నాయి. దగ్గరి వాళ్ళు ఇంకా కొందరు ఇంట్లో ఉన్నారు.
గుడిలో పూజ చేయించే ముఖ్యమైన కార్యక్రమం ఒకటి మిగిలిపోయింది. వారి పూర్వీకులు కట్టించిన గుడి కాబట్టి అక్కడ అభిషేకం పూజ చేయించాలని అనుకున్నారు.
శివాలయం అంతా ప్రశాంతతకు మారు పేరులా ఉంది. ఆ పరిసరాలలో నీలాంబరి ఎప్పుడు ఒక అద్భుత భావనను చవిచూస్తుంది.
ఇంట్లో మనము దేవుడి పూజ పారాయణము చేసుకున్నా కూడా, గుడిలో దొరికే ప్రశాంతత వేరు. దేవాలయాలు అనేటివి ఒక ఆధ్యాత్మిక వనాలు.
అక్కడ చేసే ప్రతిష్ట కారణంగా గుడి ద్వారం లోపలికి ప్రవేశించగానే స్థాపించిన ధ్వజస్తంభం ఒక ప్రకంపన మనకు తెలియజేస్తాయి.
ఏ గుడికి వెళ్ళినా మనకు మనసు ప్రశాంతత కలిగిస్తుంది. ఒక సానుకూల దృక్పథాన్ని తెలియజేస్తుంది. అందుకే మనం ఆలయంలో ఎంతసేపు కూర్చున్నా కూడా మనకు విసుగనిపించదు. మనసు మరింత తేజవంతం అవుతుంది.
నీలాంబరి కుటుంబ సమేతంగా వెళ్లి ఆలయంలో అభిషేకాలు పూజలు నిర్వహించి ఇంటికి వచ్చింది.
ఇంతలో పదహారవ పండగ కార్యక్రమం రానే వచ్చింది. సౌదామిని పుట్టింటి వాళ్లు నీలాంబరి కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించారు.
అందరూ కలిసి పదహారవ పండగ కార్యక్రమానికి వెళ్లారు.
ముత్తయిదువులందరూ కలిసి పసుపుతాడుకు నల్లపూసలు పగడాలు, ముత్యాలు మరియు పుస్తెలు గూర్చి సౌదామిని మెడలో వేశారు.
సౌభాగ్యంగా ఉండాలని పెద్ద మనసుతో అందరూ దీవించారు. మన హిందూ ధర్మంలో ఏపని చేసినా, దాని వెనుక ఒక నిర్దిష్టమైన కారణం ఉంటుంది.ఇవన్నీ మన ఆరోగ్యానికి భవిష్యత్తుకి ఉపయోగపడేవి. అందుకే అన్ని దేశాలు భారత దేశాన్ని గౌరవిస్తున్నారు. మన విలువలను మనం కాపాడుకొని నలుగురికి స్ఫూర్తిగా నిలిస్తే అదే మన వ్యక్తిత్వాన్ని కాపాడుతుంది.
ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత గోపాలపురం చేరుకున్నారు నీలాంబరి కుటుంబం.
మెల్లగా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు.
సౌదామిని ఎప్పటిలా బాలసదనం పనులు చూసుకుంటుంది.
సాగర్ తాను అనుకున్నట్లుగా వ్యవసాయ రంగంలో దిగిపోయాడు. అందులోని మెలకువలు నేర్చుకొని అభివృద్ధి దిశగా సాగిపోతున్నాడు. తాను చేయడమే కాకుండా మరెందరికో స్ఫూర్తిగా నిలిచాడు.
ఇక అలేఖ్య మరియు సుధీర్ కూడా భారతదేశానికి వచ్చి వారికి తగిన ఉద్యోగం చూసుకొని అందరితో కలిసి సంతోషంగా ఉంటున్నారు.
భూపతి గారు రాజకీయంలో చాలా బిజీగా ఉండిపోయి ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో నిమగ్నమైపోయాడు.
ఇక నీలాంబరి సౌందర్యలహరిని చూసుకుంటూ తనతో సమయం గడుపుతూ, అన్నింట్లో తనదైన ముద్ర వేస్తూ అందరికీ సహాయకారిగా ఉంది.. ఎవరికి ఏదైనా సలహా అవసరం పడితే నీలాంబరి కావాల్సిందే.
నీలాంబరి తన కుటుంబాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది నలుగురికి ఉపయోగపడేలా తయారు చేసుకుంది. అందుకే ఆమె ఎప్పటికీ దొరసానిగా ఉండిపోతుంది. ప్రజల గుండెల్లో దేవతగానే నిలిచింది.
ఎప్పటిలా గుడికి వెళ్లడానికి కచ్చరం వచ్చి గడి ముందు ఆగింది.
కచ్చరం వెళ్లి సరాసరి శివాలయం ముందు ఆగింది. అక్కడ ఉన్న వాళ్లంతా నీలాంబరి దొరసాని దిగుతుందని ఎదురుచూస్తున్నారు. పూజారి గారు కూడా బయటకు వచ్చారు.
అందులో నుండి దిగిన స్త్రీని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కట్టు బొట్టు నడత అన్ని నీలాంబరి లాగే ఉన్నాయి. ఆమె అలా నడుస్తూ శివాలయం మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళింది.
ఆమెను చూసిన పూజారి గారు..
” అమ్మా! అచ్చం మీరు నీలాంబరిగారి లాగే అనిపించారు.మిమ్మల్ని చూసి ఎన్నో ఏళ్లుగా నీలాంబరి గారిని చూస్తున్నా కూడా పోల్చుకోలేకపోయాను.
ఈ ఊరికి ఎనలేని సేవలు చేయడానికి మీఅత్తగారి రూపంలో మళ్లీ మీరు వచ్చారు” అంటూ ఎంతో సంతోషంగా మాట్లాడాడు పూజారి.
అక్కడున్న వాళ్లంతా కూడా వచ్చిన మహిళ నీలాంబరి కాదని సౌదామిని అని గుర్తించడానికి ఒకింత సమయం పట్టింది.
అలా అత్తకి దగ్గ కోడలిగా సౌదామిని చిన్న దొరసానిగా మారిపోయింది. ఈ పిలుపు ప్రజల గుండెల్లో నుండి వచ్చి గౌరవంగా పిలవడం తప్ప, బలవంతంగా పిలిపించుకోవడం కానే కాదు.
అలా గోపాలపురం ప్రజలు ఆ చుట్టుపక్కల గ్రామాలు వీరి సేవలతో తరించిపోతున్నాయి..
సమాప్తం
అభిప్రాయం:
తరుణి పాఠకులను అలరించిన ” దొరసాని” నవల పూర్తి అయ్యింది అని తెలియజేయడం సంతోషంగా ఉంది. అత్తగారు దొరసాని, కోడలూ దొరసాని!! ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది కథ. కానీ దొరసాని అనే పదం గర్వానికి చిహ్నం కాదని, గ్రామప్రజల గుండె ల్లో నిలిచిన గౌరవ సంబోధన అని ఆ ఊరి కథ తెలియజేస్తుంది. అత్తగారింటికి, గ్రామానికి మంచి కీర్తి ని తెచ్చే అర్హత ను ఈ ఆధునిక లోకపు అమ్మాయి తన తలకెత్తుకున్నదనీ ఈ నవలలోని కథ చక్కని సందేశాన్ని ఇచ్చింది. మనుషుల మధ్య ఆర్థిక వ్యత్యాసాలున్నంత మాత్రాన హార్థిక వ్యత్యాసాలుండవద్దనే భావాన్ని వ్యక్తపరుస్తూ రచయిత్రి లక్ష్మీ మదన్ చక్కని నవలను అందించారు. నవ్యత అనేది సంప్రదాయాలకు గొడ్డలి పెట్టు కాకూడదని ఈ నవల సారాంశం. అత్యాధునిక కాలంలో అంత చదువుకున్న అమ్మాయి ఇట్లా పల్లెలనూ, ప్రజలనూ అభిమానించి, వాళ్ళకు సేవ చేయాలనుకోవడం అనే అంశం ఈ నవలకు మరో గొప్ప చేర్పు. సరళమైన భాష, సద్భావ వ్యక్తీకరణ తో సాగిన కథాగమనమూ ఈ నవలా రచన నిర్మాణ శైలికి నిదర్శనంగా నిలుస్తుంది. “దొరసాని” నవల కథానాయిక పరంగా నడిపిస్తూ స్త్రీ జాతికే వన్నె తెచ్చిన రచయిత్రి లక్ష్మీ మదన్ మనందరి అభినందనలకు పాత్రురాలు.
” త్వరలో మరో మంచి కథాంశంతో రచించిన నవలతో రచయిత్రి లక్ష్మీ మదన్ మనముందుకు రానున్నారు అని తెలియజేస్తున్నాం ”
– డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక ఎడిటర్.