బడి పిల్లలకు కానుక నవ్వండెహే బాలల హాస్య నాటకాలు

తెలుగు నాటకం ఆవిర్భవించిన తర్వాత 50 ఏళ్లకు నాటిక పుట్టింది .స్వరూపాన్ని బట్టి దృశ్య నాటకం ,పద్య నాటకం ,గేయ నాటకం ,నృత్య నాటకం ,వీధి నాటకం, శ్రావ్య నాటకం మొదలైన అనేక రూపాలలో నాటకాలు మనకు కనిపిస్తాయి. తక్కువ సమయంలో అందరిని ఆకట్టుకునేలాగా చేసిన రచన ప్రదర్శించినటువంటి ప్రదర్శన బాలల నాటిక అనిపించుకుంటుంది.
బాలల నాటికలు వినోదం కోసం ప్రదర్శించడం ఒకరకమైతే బాలలు మాత్రమే ప్రదర్శించడం మరోరకం . తెలుగు సాహిత్యంలో బాలనాటికల సాహిత్యం చాలా తక్కువ. ఈ పరిణామం లో ఒక పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న కళామాధవి గారు తన ప్రస్థానంలో పిల్లల చేత తను రచించి ప్రదర్శించిన నాటికలను “నవ్వండెహే బాలల హాస్య నాటకాలు” పేరుతో తీసుకురావడం హర్షించదగిన విషయం.

కళా రామలక్ష్మి ప్రచురణల ద్వారా వెలువడిన పుస్తకం ఏప్రిల్ 4 2025న రవీంద్రభారతిలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఉదయ సాహితి తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో ఆవిష్కరింపబడింది. “నవ్వండెహే” హాస్య నాటకాలు నాటక రంగ పరంగా నాటకాలు అని చెప్పినప్పటికీ ఇవన్నీ కూడా బాలలు ప్రదర్శించినటువంటి నాటికలు. రచయిత్రి కళా మాధవి గారు సెయింట్ జోసెఫ్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయిని సుందరి గారు ప్రోత్సాహంతో పాఠశాలలోని సాంస్కృతిక కార్యక్రమాలలో కళా మాధవి గారు పలు నాటికలను విద్యార్థుల చేత ప్రదర్శింప చేశారు ఆ నాటికలు తెలుగు విభాగం అధిపతి డాక్టర్ అరుంధతి మేడం గారి ఆధ్వర్యంలో నాటికలు రాసి ప్రదర్శించాలనే సంకల్పంతో మొదట స్వయంగా రచించి ఆ నాటికలను ప్రదర్శించడం మొదలుపెట్టారు మాధవి గారు. ఇది ఒక ఆహ్వానించదగిన పరిణామం . ఇంతకుముందు రచించి ప్రాచుర్యంలో ఉన్న నాటికలను వేయడం ఒక ప్రయత్నం .తానే స్వయంగా రచించి వేయడం మరో ప్రయత్నం. ఇందులో రెండవ దానిపై శ్రద్ధ పెట్టడం వల్ల కొత్త నాటికల్ని సృజించే అవకాశం కలిగింది మాధవి గారికి.వినూత్న హాస్య నాటికల పుస్తకం కూడా మన మధ్య చేరింది.
మాధవి గారు తను పనిచేసిన పాఠశాలలో 10 దాకా నాటకాలు వేయించారు “అమృత విలాస్ ఫలహార శాల” నాటిక వేయించినప్పుడు అద్భుతమైన స్పందన లభించింది నాటక రచయిత్రిగా మాధవి గారికి పిల్లల చేత బాగా చేయించావన్న ప్రశంస లభించింది అది ప్రోత్సాహకంగానూ పనిచేసింది. పాఠశాల వార్షికోత్సవంలో “యమలోకం లో సినీ హంగామా” అనే నాటికను వేయించడం దీనిని చూసిన సినీ నటులు ఆలీ మెచ్చుకోవడం చాలా సంతోషమని తన ముందుమాటలో వివరించారు మాధవి గారు.
డాక్టర్ అరుంధతి గారు హెచ్ ఓ డి , శ్రీమతి కళ్యాణి గారు, డాక్టర్ కొండపల్లి నిహారిణి గారు ( అదే పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయురాలు) తప్పనిసరిగా ఇది పుస్తక రూపం దాల్చాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయడం దానికి అక్షర రూపం పుస్తక రూపం కలిగించడానికి కుటుంబ సభ్యుల సహకారం తోడైంది . పుస్తకానికి ప్రొఫెసర్ నిత్యానంద రావు గారు , పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు కళాభివందనములు తెలుపుతూ ప్రత్యేకించి “యమలోకంలో సినీనటుల హంగామా”ను హాస్యస్పూరకంగా అద్భుతంగా రచించారన్నారు. నాటికలు సంఘటనాశ్రయ మైనప్పుడు వాటికి ఆహ్లాదకరమైన సంభాషణలు సమకూరినప్పుడు మరింత రక్తి కట్టిస్తాయని , మాధవి గారు సునాయాసంగా ఆ పని చేశారని ప్రశంసించారు.
డాక్టర్ కొమండూరి అరుంధతి గారు ద్వాదశ రూపకాలతో రూపుదిద్దుకున్న ఈ హాస్య నాటికలను అలవోకగా వేయించిన మాధవి గారిని ప్రశంసిస్తూ మరిన్ని నాటకాలు రావాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు బడి పిల్లలకు భలే నాటకాలు అంటూ డాక్టర్ కొండపల్లి నిహారిణి గారు మాధవి గారి నాటికల్ని పేరుపేరునా గుర్తుచేస్తూ మాధవి గారు ఉపాధ్యాయురాలుగా విద్యార్థుల్లో మంచి మార్పు కోరుకుంటున్నారని అన్నారు. రచయిత్రి నాటికలో వస్తువు మంచిదైతే ప్రదర్శన సులభం అవుతుంది ఈ రెండింటిని సమపాలలో నడిపించి ఈ పుస్తకం వెలువరించడం ఆనందదాయకం అన్నారు.
పుస్తకంలో 12 నాటికలు ఉన్నాయి అందర్నీ ఆకట్టుకుని అనేక ప్రశంసలు అందుకొన్న నాటిక “యమలోకంలో సినీ హంగామా” ప్రసిద్ధ చలనచిత్ర ప్రముఖుల సమ్మేళనం యమలోకంలో జరిగినట్లుగా నరక లోకంలో ఒకరి తర్వాత ఒకరు యమధర్మరాజు చిత్రగుప్తుడు కాకుండా ఎస్పీబీ ,సిరివెన్నెల ,కృష్ణ ,శోభన్ బాబు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు ,ఎన్.టి.రామారావు ,సూర్యకాంతం శ్రీదేవి ,తెలంగాణ శకుంతల ,సావిత్రి వీరంతా వచ్చి ఒకరినొకరు కలిసి సంభాషించడం వారి వారి ప్రత్యేకతలను తెలియచెప్పడం చివరికి యమలోకాన్ని రంజింప చేయడానికి స్వర్గలోకం నుంచి వచ్చామని చెప్పడం ఆద్యంతం అందరినీ ఆకట్టుకునే నాటిక.
“కౌశికా మజాకా”నాటికలో మనం ఏ పని చేసినా మనసుపెట్టి చేయాలి. ఏకాగ్రత చాలా ముఖ్యం ఆ ఏకాగ్రత లేకపోతే చేసే పని సరిగా చేయలేను ఈ సందేశంతో రాజు, మంత్రి ,సైన్యాధికారి గురువుగారు ,కౌశికుడు ,యువకులు ఈ పాత్రలతో “కౌశికా
మజాకా” నాటికను రచించారు మాధవి గారు . తపస్సు చేసుకోవడానికి వచ్చిన కౌశికుడు విద్యారణ్య గురువుగారి వద్ద విద్య ముగిశాక తపస్సు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు అదే సమయంలో రాజుగారు మంత్రితో కోశాధికారి మరణించారని అతని స్థానంలో వేరొకరిని నియమించడానికి గురువుగారి సలహాలు అడుగుతారు గురువుగారు కొందరిని పిలిచి వారికి కొన్ని పనులు శ్రద్ధగా చేయమని నిర్దేశిస్తారు. వారు ఆ పనులు ఎంతవరకు చేసారో చెప్పలేక పోతారు అక్కడే తపస్సు చేసుకుంటున్న కౌశికుడు గురువుగారు అడిగిన లెక్కను తూచా తప్పకుండా వివరిస్తారు రాజుగారికి కౌశిక్ తగిన కోశాధికారి అని నిరూపిస్తాడు అద్యంతం ఆసక్తికరంగా సందేశాత్మకంగా సాగిన నాటిక ఇది.
“సమవర్తి సమయస్ఫూర్తి “నాటిక శీర్షికలోనే సమయస్ఫూర్తి దాగి ఉంది దాని ప్రకారం పొరపాట్లు మానవ సహజం అనుకుంటాం సర్వసాధారణంగా కానీ పొరపాట్లు యమలోకంలోనూ జరగవచ్చు అన్నదానికి నిదర్శనం ఈనాటిక యమధర్మరాజు వద్దకు మరణించిన వారంతా రావడం చిత్రగుప్తుడు వారు చేసిన తప్పుల్ని వివరించడం తద్వారా రకరకాల తప్పులు చూపించడం తెలివిగా ప్రకటించడం ఒక విషయమైతే యమకింకర్లు పొరపాటున ఒక వ్యక్తిని తీసుకురావడానికి బదులుగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న మరొక యువకుడిని తీసుకురావడం ఆ తప్పును యమధర్మరాజు సరి చేయడం చాలా గొప్ప మలుపుగా కనిపిస్తుంది.

“సువర్ణ మామిడి ఫలములు” శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తిమ్మరసు మంత్రి కొలివై ఉండగా మామిడి ఫలములు అడిగిన రాజమాత కోరిక తీరకుండానే విష్ణు సాయుజ్యం పొందడం తెలిసి రాయలవారు చింతిస్తారు ఆ బాధలో సభకు వచ్చిన ప్రతిపండితుడికి సువర్ణ మామిడి ఫలం బహుమతిగా ఇస్తానని ప్రకటిస్తారు ఆ సందర్భంగా జరిగిన ఉదంతంగా నాటికగా మలిచి అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు దురాశకు పోతే దుఃఖం ఎదురవుతుందన్న నీతిని కూడా ఇందులో తెలియజేశారు.

“ఆపన్న హస్తాలు” బస్తీలో ఉండి గుడిసెలో ఉన్న కుటుంబం పిల్లలు వారి దీనస్థితిని చూసి వారికో మార్గం కలిగించే దిశలో స్వర్గసీమ అపార్ట్మెంట్లో మురళి గారి ఇంట్లో చర్చ జరుగుతుంది ఆ కుటుంబానికి ఎలా సహాయపడాలి అని మనసుంటే మార్గం ఉంటుంది అంటారు పెద్దలు మంచి మనసు కలిగిన కుటుంబం మరో పేద కుటుంబానికి సహాయపడే విషయం వారి అపార్ట్మెంట్ మీటింగ్లో చర్చించి అందరిపై భారం పడకుండా చేసిన ఆలోచనకు ప్రతిరూపం ఆపన్న హస్తాలు నాటిక. సహాయం చేయాలంటే ప్రతిసారి డబ్బు చేతిలో ఉండనవసరం లేదు ముందు మంచి మనసు ఉండాలి ఆ మనసుపెట్టి ప్రయత్నం చేయాలి అని నిరూపించిన నాటిక ఇది.

అమృత విహార్ ఫలహారశాల – సమాజంలో ఉన్న కొన్ని సమస్యలను చమత్కారంగా చూపించడంలో సఫలీకృతులయ్యారు మాధవి గారు సీనయ్య అనే వ్యక్తి ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకొని పక్కన కనిపించే అమృత విహార ఫలహారశాలలో తినాలనుకుంటాడు ఏటీఎం పనిచేయక డబ్బు చేతికి రాక ఆకలికి హోటల్లో తిని సర్వర్ గా పని చేసిన సన్నివేశాలు తను చూసిన వాటిపట్ల సీనయ్య అమాయకపు స్పందన అందరినీ ఆలోచింపచేస్తాయి. ఆనందంగా నవ్వుకునేలా కూడా చేస్తాయి ఈనాటిక చాలా సహజంగా పని చేయక మొరాయించే ఏటీఎంలు , ఆకతాయి పిల్లలు సెల్ఫీ మోజులో అమ్మాయిల ప్రవర్తన ఈ సమస్యలు అందరికీ అర్థమయ్యే రీతిలో చూపించారు రచయిత్రి.
“వైకుంఠం ఆసుపత్రి” అనేది చిన్ననాటిక సాధారణంగా మనము డాక్టర్ శీను అతని దగ్గరికి పేషెంట్లు రావడం వారిని డాక్టర్ ప్రశ్నలు వేయడం ఒక్కోసారి ఆపరేషన్ చేసి కత్తెరలు మర్చిపోవడం మంచి దృశ్యాలను ఊహించుకుంటాం కానీ ఇక్కడ దృశ్యం వేరు డాక్టర్ పేరు కైలాసం ఆస్పత్రి పేరు వైకుంఠం కాంపౌండర్ పేరు వడ తమాషాగా ఉంటాయి ఈ పాత్రల మధ్య జరిగిన సంభాషణలు వారి వద్దకు వచ్చిన పేషంట్ల సమస్యలు చూపించడంలో హాస్యం ఉట్టిపడేలా సన్నివేశాలను రూపొందించారు రచయిత్రి ప్రతి పాత్ర ఆసక్తికరంగా ఆహ్లాదంగా నవ్వుకునేలా ఉండడం ఈనాటిక ప్రత్యేకత!
“హ్యాపీ హోమ్ ” మనం బిజీ బిజీ ప్రపంచంలో చిన్ననాటి ఆటలు పాటలు మాటలు మర్చి పోతున్నాం అంతెందుకు మానవత్వం అనేది పక్కన పెడుతున్నాం. మానవ సంబంధాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు .వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఈనాటికలో తాతయ్య సత్యనారాయణ, నానమ్మ, రుక్మిణి మనవరాలు సింధూర ,సుస్మితలతో పాటు వారి స్నేహితులు గీత శ్రావణి కూడా చేరి ఆటలు మాటలు మధ్యలో వైకుంఠపాళీ ఆటలు ఆడిస్తూ గెలుపు ఓటములు సహజమని పట్టుదలతో పైకి ఎదగాలని ప్రయత్నం చేయకూడదని సందేశాలిస్తూ తాతయ్య చేత చెప్పించిన నాటిక ఇది. మంచి మంచి మాటలు తాతయ్య గారి ద్వారా చెప్పిస్తారు రుక్మిణి , హరీష్ కూడా పెద్దలు చెప్పిన నీతి మాటలు మర్చిపోకూడదని చెప్తుండగా ఊరి నుంచి వచ్చిన సింధూర సుస్మితల తల్లి అభిజ్ఞ తను వెళ్ళిన మీటింగ్ చాలా బాగా జరిగిందని తన ప్రాజెక్టు బెస్ట్ ప్రాజెక్టుగా ఎంపికైందని తనకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చిందని ఆనందంతో భర్తకి చెబుతుంది మీ సహకారంతోనే నేను ఇలా ఎదిగానని అత్తమామలతో అంటుంది అందరూ సంతోషంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలి అప్పుడే అది హ్యాపీ హోమ్ అవుతుందని నాటికలో అద్భుతమైన సందేశాన్ని అందించారు రచయిత్రి.
ఏ ఇల్లాలైన ఇతర కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటే ఆ కుటుంబం సాఫీగా సాగిపోతుందని ఎటువంటి కష్టసుఖాలనైనా అక్కడే పరిష్కరించుకోవచ్చు అని చెప్పే ప్రయత్నం చేశారు రచయిత్రి.

“గురుభ్యోనమః ” సమాజంలో గురుస్థానం ఎన్నటికీ నిలిచి ఉంటుంది గురువు తన విద్యార్థులకు విషాన్నిద్దేశం చేస్తాడు అది గ్రహించిన విద్యార్థి తన జీవితాన్ని ఉన్నతమైన దశకు చేరుకునేందుకు ప్రయత్నిస్తాడు ఈనాటికలో ఒక రాఘవయ్య మాస్టారు గారు ఉంటారు ఆయన శిష్యుడు కలెక్టర్గా ఎదుగుతాడు.
ఆ విషయం తెలియక ఆ కలెక్టర్ ఆఫీస్ కి ఒక పని మీద రాఘవయ్య మాస్టారు అతని మనవరాలు లక్ష్మి వెళ్తారు అక్కడికి వెళ్ళగానే కలెక్టర్ గారు మాస్టర్ గారిని గుర్తుపట్టి పాదాభివందనం చేస్తారు చిన్నతనంలో బడిలో మాస్టారు తో అనుభవం గుర్తుచేసుకొని ఆ అనుభవమే తనను విద్యపై మొగ్గు చూపేలా చేసిందని చెప్పడం మాస్టారు గారి పని చేసి పెడతానని చెప్పడం నాటిక ఇతివృత్తం ఇంతకీ ఏ అనుభవం అన్నది నాటిక చదివితేనే తెలుస్తుంది సమాజంలో గురువు తన విద్యార్థుల కోసం ఎలా తాపత్రయపడతాడు అన్నది విడమర్చి చూపిన నాటిక గురుభ్యోన్నమః.

“తస్మాత్ టెక్నాలజీ “ ఒకపక్క హాస్యం మరోపక్క కమ్యూనికేషన్ గ్యాప్ రెండింటిని మేళవించి అర్థం కాని భాషలో ఊహించి అర్థం చేసుకున్న చిన్ని తమాషా అయిన నాటిక ఇది నిజానికి స్కిట్ లాంటిది మరికొన్ని చేర్చి ఉంటే మరింత హాస్యం పడేది అనిపించినటువంటి నాటిక. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి ఒక డాక్టరు హాస్పిటల్ వాతావరణంలో ఒకరు ఒక ధనవంతుడిలా ఉన్న వ్యక్తిని స్పృహ తప్పి ఉండగా తీసుకొస్తారు అతన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు ఆగుదామని డాక్టరు కాంపౌండరు ఆశపడుతారు కానీ వారి ఆశలన్నీ అడియాసలు చేస్తూ అతడు తన ఆస్తులన్నీ పరామర్శించడానికి వచ్చిన కుటుంబ సభ్యులకు పంచి పెట్టడం కలవరపెడుతుంది వారి కలవరం , కుటుంబ సభ్యుల ఆందోళన చాలా సహజంగా చిత్రీకరించారు. ఈ నాటికలో కొసమెరుపు అందర్నీ ఆకట్టుకోవడం మాత్రమే కాదు మనసారా నవ్వుకునేలా చేస్తుంది. హాస్యం పండించడంలో తన రచన ప్రతిభను కనబరిచారు రచయిత్రి మాధవి గారు ఈ నాటికలో.

చివరి నాటిక కొండను తట్టి ఎలుకను పట్టిన ఈనాటికలో నేటితరం బాలబాలికలకు ఏదేదో చేసేయాలని ఆరాటం కానీ ఆ ఆరాటానికి తగిన అనుభవం పనితనం లేకపోవడం గురించి రచించినటువంటి నాటిక
ఈ 12 నాటికలు కళా మాధవి గారు అటు హాస్యాన్ని ఇటు సందేశాన్ని అందించే దిశలో రచించి భావితరాల వారికి ఇటువంటి నాటికల పుస్తకాలు మరెన్నో రావాల్సిన బాటను వేశారు వారి కలం నుంచి మరెన్నో నాటికలు రావాలని ఆశిద్దాం

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నైతికత

నదీమ తల్లి-1