మోహన్ మరియు సుశీలల 60వ పెళ్లి రోజుకు సరిగ్గా మూడు రోజులు ముందు, మోహన్‌కు ఒకే రోజు రెండుసార్లు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయనను కొంతకాలం ఆసుపత్రిలో ఉంచి డిశ్చార్జ్ చేశారు.ఆయన మాట్లాడలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు.మరోసారి స్ట్రోక్ వస్తే ప్రాణాపాయం తప్పదని డాక్టర్లు చెప్పేశారు.పెళ్లి రోజుకని వచ్చిన కొడుకులు గిరి, రుద్రాక్ష సహాయం ఉండడంతో సుశీల అప్పటికీ ధైర్యంగానే ఉంది, కానీ ‘వారు తిరిగి వెళ్ళిన తర్వాత ఎలా?’ అన్న దిగులు ఆమెను బాధించసాగింది.
అరవై సంవత్సరాల క్రితం, మోహన్ ఒడిశాలోని రాయగడ అనే చిన్న ఊరిలో స్కూల్ టీచర్‌గా పనిచేసేవాడు.
అతను ఇంటికి దూరంగా ఉంటూ, వంట చేతకాక ఇబ్బంది పడుతున్నాడని తల్లిదండ్రులు మోహన్‌కు చిన్న వయస్సులోనే సుశీల తో పెళ్లి ఖాయం చేశారు. పెద్దలు పెళ్లి నిశ్చయించడంతో మోహన్ మరియు సుశీల ఒకరినొకరు ఫోటోలోనే చూసుకున్నారు.
పెళ్ళి ముస్తాబులో అందంగా, ఒడ్డూ పొడుగ్గా ఉన్న మోహన్ పక్కన చామనఛాయ రంగుతో సన్నగా, పీలగా ఉన్న సుశీలను చూసి కళ్యాణ మండపంలో కొందరు ఆమెను ‘కాకి ముక్కుకు దొండ పండు’ అని ఎగతాళి చేయడాన్ని గమనించిందిసుశీల. కానీ మోహన్ మరియు అతని తల్లిదండ్రులు ఆమెను వారి ఇంటికి ఆప్యాయంగా ఆహ్వానించి, ఆమెకు కొత్త వాతావరణంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు.సుశీల కూడా కొన్ని రోజులలోనే అత్తారింట్లో అందరితో ప్రేమగా ఉంటూ ఆమె పేరును సార్థకం చేసుకుంది.
పెళ్లయిన కొద్ది రోజులకి మోహన్ మరియు సుశీల రాయగడలో కొత్త కాపురం పెట్టారు. గడచిన అరవై ఏళ్లలో ఎన్నో కష్టాలు, సుఖాలు పంచుకుని ఇద్దరు పిల్లలని పెంచి పెద్ద చేసి, పెళ్లిళ్లు చేశారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు, వీరిద్దరూ స్వంత ఊరు అయిన విజయనగరం మీద ఉన్న మక్కువతో వారి పాత ఇంటిని బాగుచేసుకుని స్థిరపడ్డారు. తమ రిటైర్మెంట్ను ఆస్వాదిస్తూ, ఇద్దరూ అక్కడ జరిగే సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో కూడా వారి వంతు సహాయం అందిచేవారు.
ఇన్నాళ్ళూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా నడుస్తూ తిరుగుతున్న మోహన్, బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నడవలేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యాడు.సుశీల అనునిత్యం మోహన్ కు సేవ చేయడంలో మునిగిపోయింది.దానితో ఆమె కొన్ని రోజులకే నీరసపడి, కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటం ప్రారంభించాయి.కొడుకు కోడళ్ళు సాయం చేస్తామన్నా వినకుండా ఆమె రాత్రింబవళ్ళు సేవ చేసేది.

ఇక పిల్లలు తిరిగి వెళ్ళే సమయం కావడంతో,వారికి తల్లిదండ్రులను ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వదిలి వెళ్ళాలో అర్థం కాక,చివరికి గిరి ఒక నిర్ణయానికి వచ్చి తల్లి వారిస్తున్నా,ఒక మంచి ఏజెన్సీ నుండి తండ్రి సేవ కోసం రోజంతా ఉండే కేర్‌టేకర్‌ను కుదిర్చి,”అమ్మా, నాన్నని చూసుకోవడానికి ఒక కేర్‌టేకర్‌ను కుదిర్చాను.ఆయన పేరు కిట్టు, నాన్నకు సేవ చేస్తాడు.మేము వెళ్ళాక నీకు సాయంగా కూడా ఉంటాడు.ఆయన ఉంటే మేము కూడా నిశ్చింతగా ఉంటాము.ఆయన ఏజెన్సీ నుండి వస్తాడు కాబట్టి ఎలాంటి బెంగా ఉండదు.మేము మళ్ళీ వీలైనంత త్వరగా వస్తాము,” అని ధైర్యం చెప్పాడు.
సుశీల మనసులో బాధను దిగమింగుకొని పిల్లలకు వీడ్కోలు పలికింది.కిట్టు రాకతో సుశీలకు పనితో పాటు ఒంటరితనం కూడా తగ్గింది.కిట్టు మోహన్ సేవతో పాటు సుశీలకి ఇంటి పనులలో కూడా సహాయపడేవాడు.మోహన్ని తరుచుగా ఆసుపత్రికి తీసుకొనివెళ్ళి చూపించేవారు. కానీ ఆయనలో పెద్ద మార్పు ఏమీ రాలేదు.మెల్లగా మోహన్ తిండి కూడా తగ్గింది, రోజు మొత్తానికి ఒక కప్పు జావ పట్టడం కష్టం అయ్యేది.ఆ స్థితిలో మోహన్ని చూసి సుశీల తన బాధను అణచుకుని ధైర్యంగా, చిరునవ్వుతో అతని ముందు కూర్చొని, సాయంత్రం పూట భగవద్గీత, భాగవతం చదివి వినిపించేది.
ఒక రోజు సాయంకాలం, సుశీల భగవద్గీతలోని ఒక శ్లోకం – ‘దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్’ – చదివి దాని అర్థాన్ని వివరిస్తూ, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, తగిన ప్రదేశంలో, సమయంలో మరియు యోగ్యులైన వారికి దానం చేయడమే సాత్త్విక దానమని చెబుతుండగా, మోహన్ ఆమెతో ఏదో చెప్పాలని ప్రయత్నించాడు, కానీ అతని కళ్ళ నుండి నీరు తప్ప నోట మాట రాలేదు.ఆయన చేస్తున్న సంజ్ఞలు అర్థం చేసుకున్న సుశీల ఆయన కళ్ళు తుడుస్తూ “మీరు ధైర్యంగా ఉండండి, మనం తీసుకున్న నిర్ణయంలో ఏ మార్పు ఉండదు, మీ కోరిక తప్పక తీరుస్తాను” అని ఆయనను ఓదార్చింది.
అదే రోజు రాత్రి, మోహన్ నిద్రలోనే ప్రశాంతంగా కన్ను మూసి, అనంత లోకాలకు పయనమయ్యారు.
సుశీల ఉప్పొంగుతున్న కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేస్తూ, ఫోన్ అందుకుని గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి విషయం చెప్పి, మోహన్ పేరు మరియు మిగిలిన వివరాలు ఇచ్చి, వారు చెప్పిన సూచనలు తీసుకుంది. తరువాత పిల్లలకు మరియు బంధుమిత్రులకు వార్త తెలియజేసింది.
కిట్టు వచ్చిన బంధువుల సహాయంతో మోహన్ పార్థివ దేహాన్ని ఐస్ బాక్స్ లో భద్రపరిచాడు. మరునాడు సాయంత్రం చేరిన గిరి, రుద్రాక్ష వారిని ఎంతో ప్రేమ, అనురాగాలతో చేయి పట్టుకుని నడిపించిన తండ్రి అలా నిర్జీవంగా ఐస్ బాక్స్ లో చూసి బాధ ఆపుకోలేక సుశీలను గట్టిగా హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు.అక్కడ ఉన్న మోహన్ బాల్యమిత్రుడు ముకుందంగారు వారిని ఓదారుస్తూ, “బాబు గిరి, తల్లి తండ్రులు శాశ్వతంగా ఉండరు కదా, అందరూ ఒక రోజు వెళ్లాల్సిందే. గుండె నిబ్బరం చేసుకుని పెద్ద కొడుకుగా నువ్వు చేయవలసినవి ముందు చూడు” అని అన్నారు.
గిరి తండ్రి అంత్యక్రియల ఏర్పాట్ల విషయం మిత్రులతో మాట్లాడటం చూసిన సుశీల ఆయన వద్దకు వెళ్ళి,”బాబు గిరి, నువ్వు చేస్తున్న ఏర్పాట్లు ఆపు. మీ నాన్నగారి దేహాన్ని దహనం చేయవద్దు” అని అనడంతో గిరి ఒక్క క్షణం నిర్ఘాంతపోయి, తల్లి భర్త పోయిన బాధలో అలా అంటోందని అనుకున్నాడు. “అమ్మా, ఏమిటిలా అంటున్నావు? నాన్నగారు ఇక లేరు, మరణించి రెండు రోజులైంది. ఇక వారిని శాశ్వతంగా సాగనంపాలి” అని అనడంతో సుశీల,”నాకు తెలుసు గిరి, మీ నాన్నగారు ఇక తిరిగి రారు. కానీ వారి దేహాన్ని మనం దహనం చేయలేము. ఆయన శరీరాన్ని వైద్య కళాశాలకు దానం చేశారు. ఆయన దేహాన్ని వీలైనంత త్వరగా వైద్య కళాశాలకు చేర్చే ఏర్పాటు చేయి” అని కచ్చితంగా చెప్పింది సుశీల.
ఈ మాటలు వినగానే అక్కడ ఒక నిశ్శబ్దము నెలకొంది.గిరి తేరుకుని చెమర్చిన కళ్ళతో “అమ్మా, మాకు ఎవరికీ చెప్పకుండా ఎంత పని చేశారూ!పెద్ద కొడుకునైన నాకు తండ్రి అంత్యక్రియలు చేసే భాగ్యము కుండా, నాన్నగారికి పున్నామ నరకము నుండి విముక్తి లేకుండా చేశారు” అన్నాడు బాధగా.
“మీ నాన్నగారితో పాటు నేను కూడా నా శరీరాన్ని దానం చేశాను, గిరి,” అని సుశీల అనడంతో,
“ఏమిటి అమ్మా, మీకు ఏదైనా వెర్రి పట్టిందా? నేత్రదానం గురించి, అవయవదానం గురించి విన్నాను కానీ శరీరదానం చేయడం ఎప్పుడూ వినలేదు,”అన్నాడు గిరి కొంచెం అసహనంగా.
” నిజమే గిరి, నేను కూడా ఎప్పుడూ వినలేదు. అయితే, ఒకసారి మీ నాన్నగారు వార్తాపత్రికలో దేహదానం గురించి చదివారు. ఆ కథనం ఆయన మనస్సును ఎంతగా కదిలించిందంటే, వెంటనే తన దేహాన్ని దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయం నాతో చెప్పినప్పుడు, మొదట నాకు చాలా కోపం వచ్చి ఆయనతో మాట్లాడటం కూడా మానేశాను.
ఒక వారం గడిచాకా నా కోపం తగ్గిందని చూసి, ఆయన నా వద్దకు వచ్చి ‘సుశీలా, మనం చనిపోయాక ఈ నిర్జీవమైన శరీరం ఎవరికీ ఉపయోగపడదు. మన వాళ్ళు దాన్ని కాల్చి బూడిద చేస్తారు. కానీ దేవుడిచ్చిన ఈ శరీరాన్ని దానం చేస్తే, అది సమాజానికి ఉపయోగపడుతుంది. మెడికల్ కాలేజీకి దానం చేస్తే, వైద్య విద్యార్థులు శరీర నిర్మాణం గురించి, దాని పనితీరు గురించి తెలుసుకుంటారు. అంతే కాదు, మృతదేహాలని కొత్త శస్త్రచికిత్సా విధానాల అభివృద్ధిలో, పరిశోధనలో కూడా ఉపయోగిస్తారు. మెడికల్ కాలేజీలకి మృతదేహాలు స్వచ్ఛంద దానం ద్వారా లేదా పోలీసుల నుండి అనాథ శవాల ద్వారా అందుతాయి. కానీ సాధారణంగా దేహదానం చేయడానికి చాలామంది భయపడతారు, అందుకే మెడికల్ కాలేజీల్లో ఎప్పుడూ మృతదేహాలకొరత ఉంటుంది. నా శరీరం బూడిద కాకుండా, దానం చేద్దామని నిర్ణయించుకున్నాను. నువ్వే అది జరిగేలా చూడాలి’ అని చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డారు.ఆయన మాటలు నా హృదయాన్ని ఎంతగా కదిలించాయంటే,ఆయన చేస్తున్న ఈ గొప్ప కార్యంలో నేను కూడా పాలుపంచుకోవాలనుకున్నాను. ఐదు సంవత్సరాల క్రితం, మా దేహాలని దానం చేస్తామని మా వివరాలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని అనాటమీ విభాగంలో నమోదు చేసుకున్నాము,” అని దృఢమైన స్వరంతో చెప్పింది.
ఇంతసేపు మౌనంగా వింటున్న రుద్రాక్ష ఇలా అన్నాడు, “అమ్మా, నాన్నగారి శరీరాన్ని ఇలా దానం చేస్తే ఆయనకు ముక్తి ఎలా కలుగుతుంది? మన సనాతన ధర్మం కూడా ఇలాంటి కార్యాలను సమర్థించదు కదా!” అనడంతో సుశీల జాలిగా నవ్వి, “ఆ విషయాలన్నీ నాకు తెలియవురా రుద్రా. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ దేహాన్ని కాల్చి బూడిద చేస్తే లేదా మట్టిలో పూడ్చిపెడితే ముక్తి వస్తుందో లేదో నాకు కచ్చితంగా తెలియదు. కానీ నాకు తెలిసిన ఒక విషయం ఏమిటంటే, మనం ఈ లోకంలో జీవించినంత కాలం మన పుట్టిన దేశానికి, సమాజానికి ఏదో ఒక విధంగా సహాయం చేయడం చాలా ముఖ్యం.
కళ్ళు, గుండె, మూత్రపిండాలు వంటి అవయవాలను దానం చేసినట్లే, ఆరోగ్య సంస్థలు దేహాన్ని కూడా దానం చేయమని వేడుకుంటున్నా మనలో పాతుకుపోయిన నమ్మకాలు, భయాల వల్ల వేలల్లో ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఇంతటి విలువైన దేహాన్ని కాల్చి బూడిద చేస్తున్నారు. చూడు రుద్రా, నువ్వు మన ధర్మం అంగీకరించదని అంటున్నావు, కానీ మన పురాణాలలో దధీచి మహర్షి చేసిన త్యాగం ఒక గొప్ప ఉదాహరణ.
ఆయన తన ప్రాణాలను స్వచ్ఛందంగా వదిలి, తన ఎముకలతో ఇంద్రుని వజ్రాయుధాన్ని తయారు చేయడానికి అంగీకరించాడు. లోక కళ్యాణం కోసం ఆయన చేసిన ఆ దానం అమూల్యమైనది. ఇలాంటి దానం చేయడం పాపం కాదు, పుణ్యం.మీ నాన్నగారు మరణించే ముందు, మాట్లాడలేని స్థితిలో కూడా ఈ విషయాన్ని గుర్తు చేసి ఆయన చివరి కోరికను తెలియజేశారు” అని ఆమె చెప్పడంతో గిరి, రుద్రాక్ష ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.
సుశీల వారితో, “రుద్రా, మీరు చేస్తున్న పూజను జరగనివ్వండి; తరువాత ఆయన దేహాన్ని శ్మశానానికి కాకుండా మెడికల్ కాలేజీకి అప్పగించండి. అదే మీ నాన్నగారి కోరిక, నా ప్రార్థన” అంది చేతులు జోడిస్తూ.
ఆమె చెప్పినట్టే పిల్లలు, బంధుమిత్రులు కలిసి మోహన్ పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించి,
మెడికల్ కాలేజీకి అప్పగించారు. మోహన్ మరణించిన ఐదవ రోజు ఉదయం నుండి ఆయన నివాసంలో చుట్టాలు, పరిచయస్తులు, బంధువులు, మిత్రులు రావడంతో సందడిగా ఉంది.
గిరి, రుద్రాక్ష అందముగా ఫ్రేమ్ చేయించిన మోహన్ ఫోటోను టేబుల్ పై ఉంచి, పువ్వులతో అలంకరించి, దీపం వెలిగించారు. సుశీల మరియు కోడళ్ళు కలిసి మోహన్ కు ఇష్టమైన వంటలు చేశారు. రుద్రాక్ష తక్కువ వాల్యూమ్ లో తండ్రికి ఇష్టమైన రఫీ పాటలు పెట్టాడు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. వచ్చిన వారందరూ మోహన్ ఫోటోకు పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ముకుందంగారు మోహన్ ఫోటోకు నమస్కరించి, “మోహన్, నువ్వు ఈ మహాదానం చేసి నిజమైన ముక్తిని పొందావురా! నువ్వు ఈ విషయం నాకు ఒకసారి చెప్పినప్పుడు, నువ్వు నిజంగా ఇలా చేస్తావని అనుకోలేదు. సమాజానికి నువ్వు చేసిన సేవ అమూల్యమైనది. ఈ రోజుల్లో నేత్రదానం చేయడానికి కూడా సంకోచిస్తున్న సమయంలో, నువ్వు చేసిన దానం అనేకమందికి ప్రేరణగా నిలుస్తుంది. నా స్నేహితుడు ఇంతటి ఉత్తముడని నా హృదయం గర్వంతో నిండిపోతున్నది. మోహన్, నేను కూడా నీలాగే ఇవాళే వెళ్లి నా శరీరాన్ని దానం చేస్తున్నానురా,” అన్నాడు తడిబారిన కళ్ళతో.
ఆనాడు మోహన్ చేసిన దానం అనేక మందికి ప్రేరణగా నిలిచి, మరణానంతరం కనీసం అవయవ దానం చేయడానికి స్ఫూర్తిని అందించింది.