పక్కా పల్లెలో పుట్టి ఆటపాటలతో పెరిగి స్వశక్తితో ఎదిగారు ఆమె. మెట్రిక్ నుంచి ఎం.ఇడి. వరకు అండగా నిలిచారు ఆమె మేనమామ కొడుకు శ్రీబొడ్డు దామోదరంగారు. ఆమె ఒక విద్యావేత్త, అనేక రేడియో ప్రోగ్రాంలలో పాల్గొన్నారు. 44 పాఠశాల విద్యకు సంబంధించిన పుస్తకాలు రాశారు. 10పుస్తకాలు ప్రచురించారు. ఆమె అందుకున్న సన్మానాలు, సత్కారాలలో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి పురస్కారం, ఆటా, నాటా సత్కారాలు కొన్ని మాత్రమే. భర్త శ్రీకడారి కనకయ్యగారు అభ్యుదయ భావాలున్న నిస్వార్థ ఉత్తమ ఉపన్యాసకుడు. ఆంగ్ల రచయిత్రి అయిన వీరి కుమార్తె అపర్ణ కడారి ప్రస్తుతం అమెరికాలో సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతో ఆమె పరిచయం అనుబంధం 1962నుంచి ప్రారంభం! ఆనాటి న్యాయపతి దంపతులు సుధామగారు భరద్వాజగారు శ్రీమతి తురగా జానకీరాణి, శ్రీమతి ఉషారాణి డా.కె. విజయగార్లతో పరిచయాలు, బాలానందం, యువవాణి, వనితా లోకం ప్రోగ్రాంలలో ఆమె ప్రసంగాలు, గేయాలు, లచ్చుమమ్మ ముచ్చట్లు..ఇలా ఆమెకి మరిచిపోలేని అనుభవాలు మధురస్మృతులు.

సరోజనగారి తమ్ముడి స్నేహితుడు చిత్రకారుడు చంద్రగారి ప్రేరణ, ప్రోత్సాహంతో రాశారు, కాని అది అముద్రితం. ఎండ్లూరి సుధాకర్, దేశపతి శ్రీనివాస్, డా. సుద్దాల అశోక్ తేజ, డా. పత్తిపాక మోహన్, డా. వెల్దండి శ్రీధర్, రంగి కమల, చెరకు మహేశ్వర్ శర్మ, కామని లక్ష్మన్ వంటి ఎంతో మంది వీరి విద్యార్థులు సాహిత్య, సినిమా రంగాలలో రాణిస్తున్నారు.
83 ఏళ్ల సరోజనమ్మగారు అరమరికలు లేకుండా తన జీవిత విశేషాలను ‘తరుణి’తో పంచుకున్నారు. ఆమె జీవితం పూలపాన్పుకాదు. కష్టపడి పైకి వచ్చారు. ఆల్ రౌండర్ గా ఎదిగారు. ఆనాటి నల్గొండ జిల్లాలోని మారుమూల పల్లె అయిన లద్నూర్ లో పుట్టారు. ఇప్పటికీ ఆమె భాషలో ఆ యాస పలుకుబడి ఘుమాయిస్తూనే ఉన్నాయి. ఇంటి నిండా ధాన్యపు రాశులు. ఒక రోజు బడికి వెళ్ళి నాలుగు రోజులు డుమ్మా కొట్టేవారు. తమ్ముడి కోసం వెళ్తూ 4వ క్లాస్ దాకా అలా అలా సాగింది ఆమె చదువు. బడికి పోకుండా నిద్ర నటిస్తే నాన్నమ్మ ఏమనేదికాదు. లంగాలో బొమ్మలు, కచ్చకాయలు దాచి ఆడుకున్న బాల్యం. ఒక ముల్లుకర్ర, లిక్కిడి, జొర సంచి, పెద్ద బాలశిక్ష, చందమామ, బాలమిత్ర పత్రికలు సంచీలో వేసుకుని చేనుకు పయనం! బడిఫీజు ఒక ముద్దపైసా/3చిన్నపైసలు/తూటుపైసలు. తల్లి డబ్బ గిన్నెలో వార్పు బువ్వ, మామిడికాయ, చింతకాయ తొక్కు, గడ్డపెరుగు కల్పి పెట్టేది. గొడ్లను కాస్తూ తిరిగే చిన్నారి. జిట్ట రేగుపండ్లు తెచ్చి కుచ్చాలు పెట్టి ఒంట్ల లెక్కలు నేర్చుకున్నారు. సీతాఫలం, చింతగింజలు, గులకరాళ్ళతో కూడికలు, తీసివేతలు నేర్చుకున్నారు. గాలిలో అక్షరాలు రాసి దాన్ని గుర్తించడం ఓ ఆట! తమ్ముడితో ఇసుకలో అక్షరాలు రాయడం ఓ సరదా! ఒకరోజు జొరసంచి పరిచి అక్క తమ్ముడు చందమామ కథలు బొమ్మలు చూస్తున్నారు. వారు బర్రెంకచెట్టు కింద కూచుండగా ఒక నాగుపాము వచ్చి పడగెత్తి ఆడటం చూసి ఇక ఆ ప్రాంతానికి వెళ్లడం మానేశారు. ఈమె మంచె ఎక్కి వడిసెల విసిరి పొలం కాపలా కాసే వారు. తండ్రి రాత్రి పూట పడుకున్నప్పుడు పిల్లలు ఆయన కాళ్ళు తొక్కుతుంటే తెలుగు భాష సాహిత్యం, పద్యాలు, పాటలు తండ్రి విన్పించేవారు. నిజాం కాలంలో 5వ క్లాస్ వరకే చదివిన ఆయన పిల్లలకి భాషపై మక్కువ కల్గించారు. ఈమె 6, 7 క్లాసుల్లో చురుకుగా చదువు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంతవరకు ఒక ఎత్తు అయితే 9వ ఏట నాయనమ్మ పోరుతో మేనత్త కొడుకుతో పెళ్ళి జరిగింది. ఆనాడు 116 రూపాయలు కట్నంగా ఇచ్చారు. అక్కడ అత్తరికం, ఇంటి చాకిరీతో సతమతమైన మనవరాలిని నానమ్మ తీసుకుని వచ్చేసింది. లద్నూరు గ్రామంలో ఆరు, ఏడు తరగతులు లేక పోవడంతో ఆ రోజుల్లో ఆమె తండ్రి 600రూపాయలు విరాళం ఇచ్చి గ్రామ పాఠశాలలో ఆరు, ఏడు క్లాసులు ఏర్పాటు చేయించారు. ఇక ఆర్థిక బాధలు మొదలవడంతో దొవ్వానా కూలిపని కెళ్ళింది ఈ చిన్నారి. 1960-62లో సిద్ధిపేటలో ఎలిమెంటరీ బేసిక్ ట్రైనింగ్ చేసి 1963లో బోయిగూడా ప్రాథమిక పాఠశాలలో నెలకి 81 రూపాయల జీతంతో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. రైలు పాస్ ఒక రూపాయి పది అణాలు. డబీర్పురా నుంచి బోయిగూడాకి ఆమె యాత్ర ఆర్ధిక బాధలు వర్ణనాతీతం. తమ్ముడి చదువు, సంసార భారం, ఆమె పై పడింది. అంచెలంచెలుగా ఎం.ఏ., ఎం.ఇడి. చేశారు.
లీడ్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి మూడు నెలలు అధ్యయనం నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్లారు. నవోదయ పాఠ్యపుస్తకాలు బాపు రమణల ఆధ్వర్యంలో ‘కొత్త దీపం’ అనే వీడియో పాఠాలు, గిరిజన పాఠ్య పుస్తకాలు, CBSCకి 1 నుంచి 8వ క్లాస్ దాకా పాఠ్యపుస్తకాలు ధిల్లీ వారికి, తెలుగు అకాడమీకి, ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య వారికోసం తెలుగు బోధనా పద్ధతులు. ఇంకా సంపాదకురాలిగా ఎన్నో ఎన్నెన్నో ఆమె చేసిన పనులు! 44 ఏళ్ళ టీచర్ సర్వీస్ లో 37 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ‘పాఠ్యపుస్తకాలలో స్త్రీల బాలికల హోదా, చిత్రణ’ అనే అంశంపై పి.హెచ్.డి.చేశారు. ఆల్ రౌండర్ సరోజనగారు నిండ నూరేళ్ళు చల్లగా ఉండి మనకు ఆనాటి ముచ్చట్లు ఇంకా చెప్పాలని ఆశిస్తూ తరుణి తరఫున శుభాభివందనాలు అమ్మా మీకు.
విశ్రాంత ఆచార్యులు IASE మాసాబ్ టాంక్ లో పనిచేసిన సరోజనమ్మ గారు అరమరికలు లేకుండా తన స్వవిషయాలు ఫోన్ చేసి నాతో పంచుకున్నారు.ఆమెకి ధన్యవాదాలు