మహిళా సమస్యలపై నవ’తరాన’ -మిస్సెస్ ఫలాన

50 కవితల ఈ సంపుటిని పలకరిద్దామని చేతుల్లోకి తీసుకున్నాను .కవితా గంధం జారిపడింది .హృదయం గొప్ప అనుభూతితో పరవశించింది. నామని సుజనాదేవి నాకు 25 ఏళ్ళ క్రితం పత్రికల ద్వారా, పరోక్షంగా…ఫోను ద్వారా స్వర పరిచయంగా … తర్వాత ఆకాశవాణి ద్వారా ప్రత్యక్ష పరిచయంగా ..అక్షరయాన్ ద్వారా వ్యక్తిగత పరిచయం గా దఫ దఫాలుగా నా మనసుకు దగ్గరయ్యింది .
తెలుగులో ఏ ప్రక్రియలో పోటీ జరిగినా తన పేరు ఉండడాన్ని గత రెండు దశాబ్దాలుగా నేను చూస్తూనే ఉన్నాను. ఆగని సాహిత్య కర్మగారాన్ని వృద్ధి చేస్తుందా? లేక అక్షర సేద్యం చేస్తుందా? అన్నది నాకు ఒక ప్రశ్నగానే ఉండి
పోయింది. తన సాహితీయానాన్ని రెండు దశాబ్దాలుగా ప్రత్యక్షంగా పరిశీలిస్తూ వస్తున్న నాకు తనని తానే అధిగమిస్తూ, తనని తానే గెలుచుకుంటూ ముందుకు సాగుతున్న తన జీవన ప్రయాణం ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంది. నిజం చెప్పాలంటే నామని నా సాహితీ యానం మీద పరిశోధన చేయాలనుకున్న విద్యార్థి. తన సాహిత్యం మీద అప్పటికే ఒక పీహెచ్డీ జరిగినప్పటికీ ఎందుకో తాను నన్ను బాగా అభిమానించేది.
నేను చేసే వైవిధ్యభరిత కార్యక్రమాలంటే తనకి ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా ప్రసారమైన నా ‘కొత్త ప్రేమలేఖలు’ విని మొదట ఫోన్ చేసేది సుజనా, వారి భర్త సంపత్ గారే! మా ఇంటికి కూడా వచ్చారు. ఆ ఆటైంలో నా ఇంటర్వ్యూ, నా రచనల మీద సమీక్షలు రాసారు కూడా .
తాను తన తోటి రచయిత్రుల పట్ల ఎంతో గౌరవం చూపిస్తుంది. అది నాకు బాగా ఇష్టం. ఓపిక, వినయం , నేర్చుకోవాలన్న తపన తన వ్యక్తిత్వాన్ని సాన పడితే … నిరంతరం సమకాలీన సాహిత్యాన్ని చదవటం వల్ల తన రచనా వ్యాసంగం మరింత పదును తేలింది అని నాకు అనిపించేది . అందుకే తాను మా అందరికీ ఇష్టురాలు కాగలిగింది అనిపిస్తుంది .
నామని సుజన కథలు ఎన్నో మార్లు ఎన్నో చోట్ల పరిశీలనకు రావటం .. అందులో నేను న్యాయ నిర్ణేతగా ఉండటం అప్పుడు మిగతా వాళ్ళు సుజన కథల పట్ల ఎలా స్పందిస్తుంటారో చూస్తూ వచ్చాను. ఎంచుకునే అంశంపట్ల .. రాసే కథనం పట్ల ..వస్తూ పోయే పాత్రల పట్ల తనకి గొప్ప క్లారిటీ ఉంటుంది. అదే తన విజయ రహస్యం నిజానికి.
కవిత్వంలోకి ఒదగని సంఘటన, సన్నివేశం ఉన్నప్పుడే నా కలం కథని ఎంచుకుంటుంది. కానీ సుజనకి కథ అంటే చాలా సులువు. తన కథల్లో ఒక స్పార్క్ ఉంటుంది. మనింటి కథే కదా అనిపిస్తుంది. లేదా మన ఎదిరింట్లో జరిగిందో లేక, ఎక్కడో వినిందో అనిపిస్తుండటం తన ప్రత్యేకత. కథ నేపథ్యాలు అందరూ చెప్పలేరు. కానీ సుజన రాసే ప్రతి కథ నేపథ్యం బాగా చెప్పగలదు. నిజానికి తనంతటి స్పీడ్ రచయిత్రిని నేను ఇంతవరకు చూడలేదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి వ్యక్తి పుస్తకానికి …అందునా ఒక కవితా సంపుటికి నేను ముందుమాట రాయగలగటం అంటే కత్తి మీద సాము చేయడమే కదా అనిపించింది. కానీ నాకెంతో ఇష్టమైన కవిత్వం… నా ప్రాణమైన కవిత్వం .. నా అస్తిత్వమైన కవిత్వంతో అందునా మరొక సమవుజ్జి కవిత్వాన్ని తూచడం అంటే భలే మజాగా ఉంటుంది కదా !దాన్ని ఆస్పాదిస్తూ ముందుకెళుతుంటే ఎన్నెన్ని రవ్వలు దొరికాయో! ఎన్నెన్ని రత్నాలు కవిత్వపు పంక్తుల్లో ఒలికాయో ..చెప్పలేను. కవిత్వాన్ని ఆస్వాదిస్తూ ఒకసారి… ఆలోచిస్తూ ఒకసారి… పరిశీలిస్తూ ఒకసారి… పరిశోధిస్తూ ఒకసారి… ఇలా నాలుగు, ఐదు సార్లు ఈ సంపుటిని చదివాక నాకు ఒక స్పష్టత ఏర్పడింది. నిస్సందేహంగా ఇది మహిళ సమస్యలపై నవ’తరాన’ మిస్సెస్ ఫలానా అని….

‘తరాన’ అనేది పర్షియన్ పదం… అంటే ఒక రాగాన్ని అల్లటం… స్త్రీల సమస్యల మీద తాను సరికొత్త స్వరాల్లో… విభిన్న బాణీల్లో, చిక్కటి కవిత్వాన్ని మనకి వినిపించే ప్రయత్నంలో తాను మొదటి స్థానంలో నిలిచిందనే నిస్సందేహంగా నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఏ బేషజాలూ ఉండవు. మంచిని మంచిగా, గొప్ప కవితని గొప్పగా ఎప్పుడు చెప్పుతూనే ఉంటాను. నాకు గొప్పగా అనిపిస్తే సత్కరించటం… ఎక్కడ విన్నా పిలిచి సన్మానించడం… నిరంతరం అక్షరయాన్ ద్వారా చేస్తూనే ఉన్నాం. ఇక్కడ అక్షరయాన్ ప్రసక్తి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అక్షరయాన్ అనేది ఒక నిశ్శబ్ద విప్లవం. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 1508 మంది రచయిత్రుల్ని ఒక వేదిక మీద కి తీసుకొచ్చిన తెలుగు సంస్థ అక్షర యాన్. తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్. దీంట్లో నిరంతరం చాలా ఉత్సాహంగా… ఉత్తేజంగా పనిచేస్తూనే ఉంటుంది నామని సుజన. అక్షరయాన్ లో కూడా తనకి బహుమతులు రావటం జరిగింది. ఎన్నో సందర్భాల్లో తన కథల ఫలితాన్ని, తన ఇంటర్వ్యూని కూడా మేమందరం కూడా కలిసి పంచుకొని, అభినందించిన సందర్భాలు కూడా లేకపోలేదు. అందుకే తాను బహుముఖీన ప్రజ్ఞావంతురాలు అంటారు అందరు. నేను మాత్రం తన రచనంత గొప్ప మనసు తనది అంటూ ‘మానవి ‘గా చూస్తాను .
నామని సుజనాదేవి సమకాలిన కవిత్వంలో తనదైన ముద్రని వేసుకుంటున్నమంచి కవయిత్రి. సమకాలీన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను ,సవాళ్లను ఆకలింపు చేసుకుని వాటి వెనక ఉండే సామాజిక ,ఆర్థిక, రాజకీయ పరమైన కారణాల విశ్లేషణ చేయగలిగే సామర్థ్యం ఉన్న మంచి కవయిత్రి. ఒక కవికి
సమకాలీనత, సామాజికత, సార్వత్రిక అనే లక్షణాలు ఎంత అవసరమో ఆమె కవిత్వాన్ని చదివితే మనకు అర్ధమవుతాయి.
అనాదికాలం నుంచి స్త్రీలకు వేరువేరు రూపాలలో సమస్యలు, ఆటంకాలు, ప్రతిబంధకాలు సామాజికంగా కుటుంబపరంగా ఎదుర్కొన్నప్పటికీ, ప్రతి యుగంలో, ప్రతి దశలో ఆమె ఆ సమస్యలను అధిగమించిన తీరు ఎప్పటికప్పుడు ఆశ్చర్యమే అనిపిస్తుంది. అలాంటి అసమానతలను తన కవితల్లో, తన అక్షరాలలో, తన వాక్యాలలో పొదిగి స్త్రీ తాలూకు హృదయ వేదనని అందంగా అక్షరీకరించిన కవయిత్రి సుజనాదేవి.
సున్నితత్వం, సృజనాత్మకత, సార్వత్రిక అనే అంశాల ప్రాతిపదికగా ఆమె రాసిన ఈ కవిత్వం అందరినీ ఆలోచింపజేస్తుంది. అయితే ప్రతి కవికి తనకంటూ ఒక జీవన తాత్వికత ఉంటుంది. తన పూర్వకవుల ప్రభావమో, చూసిన ప్రపంచమో, సన్నివేశాలు… సందర్భాలు… వ్యక్తులు… వాటి ప్రభావం …. మరొకవైపున తన అంతరంగం …హృదయంలో… మస్తిష్కంలో జరిగే సంఘర్షణల తాలూకు సంఘర్షణ కూడా తోడవుతాయి. అలాంటి సంఘటనే మనకు నామని కవితల్లో స్పష్టంగా… ప్రస్ఫుటంగా కనిపిస్తుంది .
ఇలా తనదైన ఒక స్త్రీవాద కోణాన్ని, స్త్రీ హృదయం ఆవిష్కరణ చేస్తున్న క్రమంలో ఆమెని ఒడిసిపట్టే గల కవిత గా నాకు అర్థమైన కవిత ‘ఆమె ‘అనే శీర్షిక గల కవిత.

తను ‘ఫలానా’ గా మిగిలి పోవడానికి కారణం అవుతున్న సామాజిక, కుటుంబ, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను… దాని వెనక ఉన్న కుట్రలను కూడా చాలా ఆలోచనాత్మకంగా మనకు అందిస్తూ వచ్చింది ఈ కవిత. అందుకే ఈ కవిత నా మనసుకు నచ్చిందేమో? భారతీయ చింతనకి.. తాత్వికతకి కొలమానంగా సాగే క్రమంలో …

పల్లేరు కాయలు ఆమె దారివెంట ఉన్నాయని అవి సహజంగా పెరిగినవి కాకుండా పరిచినవి గా ఉండటం అనే మాట చెప్పడం వల్ల ఇది సమాజము పురుషుల్లో లేదా వ్యవస్థలో స్త్రీ ప్రగతికి ఆటంకాలని …కుట్రతో చేసినఅంశంగా ఉన్నాయని అంతర్లీనంగా ఆమె తొలి వాక్యాల లోనే మనకు చక్కగా చెబుతుంది. అలాగే చాలా సమాజాలలో ఆడపిల్లని భారంగా… బరువుగా భావిస్తూ ఆమె పుట్టగానే వడ్లగింజ వేసి చంపారనే ఉదంతాలన్నీ, సంఘటనలన్నీ మనం నిత్యజీవితంలో చూస్తూ వస్తున్నాం. అలాంటి ఒక దయనీయమైన అమానవీయ జ్ఞాపకాలతో, పుట్టినప్పుడే వడ్లగింజతో తీయాలనుకున్న ప్రాణాన్ని నిలబెట్టుకున్న దాన్ని అందుకేనేమో తలవంచుకొని వెళ్ళడం అలవాటయ్యింది అన్న వాక్యాల్లో ఆమె చాలా ఆలోచనాత్మకంగా తన ఆవేదనని వ్యక్తీకరిస్తుంది .అంతేకాకుండా ప్రతి చోటా జరుగుతున్న వివక్షను ..పక్షపాతాన్ని కూడా ఎండకడుతుంది .
కూలి పని లో వంట పనిలో అన్నిటిలో అసమానతల్ని ఆమోదిస్తూ, తన జీవితంలో అంతర్భాగంగా జీర్ణించుకున్న విషయాన్ని కూడా ఇక్కడ వ్యక్తీకరిస్తుంది
మరొకవైపున వంట పాత్రల పైన తన పేరు లేనితనాన్ని
ఎంతో హృద్యంగా… మరెంతో వేదనతో ఈ కవితలో ఆమె వ్యక్తీకరించిన తీరు చదివి తీరాల్సిందే!

స్త్రీత్వం ..స్త్రీ తత్వం ..
తనదైన అస్తిత్వాన్ని పోగొట్టుకొని కుటుంబం కోసం పిల్లల కోసం సమాజం కోసం బ్రతుకుతూ

మానవీయ తత్వాన్నికొనసాగిస్తూ సాగే మానవి నైజాన్ని ఆమె ఎంతో చక్కగా ప్రస్తావిస్తుంది .ఇలాంటి తత్వాన్ని కలిగి ఉండటం ఉదాత్త భావనగా కనిపించినప్పటికీ ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర పరిమాణం లోకి మారిపోయే స్థితికి రావడం తన ఆత్మగౌరవాన్ని… తన వునికిని పోగొట్టుకోవడంగా ఆమె కొత్త కోణంలో మనకు పరిచయం చేస్తుంది .ఇలా ఈ కవిత మొత్తం స్త్రీ తాలూకు అస్తిత్వ వేదనగా… అంతర్గత పరివేదన గా సామాజిక అణచివేత నుంచి ఏర్పడ్డ దుఃఖం గా నకు ప్రతి పదంలో కనిపిస్తుంది .
మన హృదయాల్ని కన్నీటితో తడుపుతుంది .అయినప్పటికీ ఒక ఆశావహ దృక్పథం, మరొక అచంచలమైన విశ్వాసం ఇంకొంచెం జీవనో త్సాహం ఈ కవితలో కనిపించకుండా ఉండదు .ఆమెలో ఉప్పెన ఎగిసే ఉత్సాహం ఉంది .మెరిసే మేఘ లాంటి పట్టుదల ఉంది .ఆగ్రహిస్తే అగ్నిలా దహించే ఆవేశం ఉంది .అన్నిటినీ భరించే ధైర్యం ఉంది .అన్నిటిని మించి క్షమించే సహనం ఉంది .అన్నిటిని కలుపుకుపోయే గొప్పతనం ఉంది అంటూ ఒక గొప్ప ఆశావహ దృక్పథాన్ని చూపుతుంది నామని సుజనాదేవి.
వేదన, పరివేదన, సంవేదన, సంక్షోభం, సందిగ్ధత, సందేహం, సంఘర్షణ, పోరాటం ,విప్లవం ,తిరుగుబాటు ,చైతన్యం ,మార్పు ,ఆశ అనే అంశాల ని మనకు మరొక్కసారి సరికొత్తగా ఇంకొంచెం హృదయానికి హత్తుకునేలా
పరిచయం చేసి పాఠకులఅందరిలో ఒక నవ్య ఉత్సాహాన్ని నింపుతాయి తన కవితలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నామని సుజనమంచి కథకురాలే కాక మంచి కవయిత్రి గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది ఈ కవితా సంపుటితో అని చెప్పొచ్చు. ఇలాగే మరిన్ని మంచి రచనలు చేయాలని ఆకాంక్షిస్తూ…

ప్రతులకు సంప్రదించవలసిన చరవాణి…

7799305575&
9247577004

Written by Inampudi Laxmi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కాలభైరవాష్టమి ప్రాధాన్యత – విశ్వ నియమాల దృష్టి

అనుబంధం