అందరికీ శనార్థులు
ఎట్లున్నరు.
మస్తు రోజులైంది మీతో ముచ్చట్లువెట్టి అనిపిస్తుంది నాకు. మస్తు
యాదికొస్తున్రు. గీ ప్రేమల గురించే ముచ్చట చెప్పుకుందాం!
“సుట్టాలు వచ్చిన్ర్రు ఇంటికి, నా బామ్మర్ది పెళ్ళాం చిన్నత్త తమ్ముని మనుమనికి ఏందో పరీక్ష ఉందంట ఈడ. మా ఇంటికి వచ్చిండు వాళ్ళమ్మ తోని” ఫోన్ల చెప్తున్నడు నరసింహ దోస్తు మల్లేష్ తోని!
“మంచిమాట..ఉంటరా..”
“రేపు గుట్టకు తొల్కపోయి దర్శనం చేపిస్తం”
గిట్ల తోక సుట్టంకు సుత మర్యాదలు చేసేటోళ్లు ఒకప్పట్ల. ఇప్పుడు అంత ఇక్మత్ లేదు.
ఇంటికి బావ వస్తే సుత పల్కరించుడు కరువైతాంది. ఫోన్ జేసి రావాలే, గిదేం వచ్చుడు అని చిటచిటలాడుతరు.ఏమంటరు తమ్మీ.!
గట్లయిపోయింది ఆగమాగం బతుకులు.
ఒకప్పుడు ఒకల్ల బిడ్డె పెండ్లి అంటే ఊరంత పండుగ. తలో చేయి ఏసెటోలు ఎవ్వరికి ఏ పని వస్తే, ఆ పని చేసేటోళ్లు అట్లా అందరు కలిసి ఒక కష్టం వచ్చిన, సుఖం వచ్చిన గట్టెక్కిస్తుండే జనాలు. ఇప్పుడు ఫోన్ల మాట్లాడి “నువ్వే ముందుగా కాల్ చేయలేదే!” అని పగ పెంచుకునే కాడికి వచ్చిన్రు. లాభం లేకుంటే ఒక్కళ్ళకు ఒకళ్ళు సహాయపడకుండ తయారయ్యిన్రు. ఏమన్న లాభం ఉందంటేనే వస్తున్డ్రు. లేకపోతే వస్తలేరు జనాలు. ఒక సామెత ఉండే “అడ్ల కల్లెం కాంగనే, అడ్కతినేటోళ్లు మోపైతరు” అని! కళ్ళెం కాడ గింజలు దించగనే అడుక్కతినేటోళ్ళు వస్తరు అని ఒకప్పుడు వ్యవసాయదారులు వాడుకునే మాట ఇది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్న అంటే… ఎవరితోని ఏదన్న అవుసరం పడితెనె వస్తరుతప్ప, మనిషికి మనిషితోని పట్టే లేదు. ప్రేమలు ఒర్సలు
ఒడిశిపోతున్నయి. మనుషులను వాడుతున్నం, వస్తువుల్ని ప్రేమిస్తున్నం. ఎక్కువ ఆలోచన జేస్తే గుండెల కలుక్కు మంటది. మస్తు మనాది అయితది.
ఎందుకు గిట్ల తయారైతున్రు. ఊరు మనదైతే, ఊర్లే మనోల్లు ఉంటే..బండమీద సుత నాలుగుగింజలు పుట్టించుకుంటం. అన్నట్టుండే జనాలు. ఇయ్యల్ల ఎట్లుంది జనారణ్యం,కాంక్రీటు జంగల్ అంటున్రు.
ఎంత యంత్రాలల్ల మస్లినా.. ఎప్పటికైనా మనిషికి, మనిషే తోడైతడు. ‘బంధాలు బలంగ ఉంటె జీవితం హాయిగ ఉంటది. బంధాలు బలహీనమైతే , హృదయం ఒంటరితనంల నిశ్శబ్దంగ ఏడుస్తది.’
మనిషి సమాజంల జీవించే ఒక సామూహిక ప్రాణి. అయితే, సమాజాన్ని నడిపించే గొప్ప శక్తి –బంధాలవె. ఒకరి జీవితానికి మరొకరు ఆధారమవ్వుడు ఆనందాన్ని పంచుకునుడు, తక్లీఫ్లల్ల భరోసాగ ఉండుడు అనేటివే బంధాలను నిలవెట్టేటివి.
ఆధునికత పెరిగిన కాడ్నించి ఈ బంధాలు బలహీనమైతున్నయి. పర్రెలు వాశి పోతున్నయి.. స్వార్థం, ఉర్కుల బతుకు, టెక్నాలజీ ప్రభావం – గివన్నీ సుత మధ్య ఉన్న అనుబంధాలను అసహజంగ మార్చేస్తున్నయి అనుకోక తప్పదు శెల్లె!
మన భారతీయ సంస్కృతి అంటెనే కుటుంబ కేంద్రిత సంస్కృతి అని దునియాలనే పేరుంది. “వసుధైవ కుటుంబకం” అనే భావన మన పురాణాలకెంచే వచ్చే. పూర్వం ఉమ్మడి కుటుంబాలల్ల ప్రతి ఒక్కళ్లు మిగత వాళ్లతోని కలుపుక పోయేటోళ్ళు. మామ, మేనమామ, చెల్లె, తమ్మీ , చిన్నమ్మ పెద్దమ్మ అత్తమ్మ అనుకుంట అందరితోని కలుపుకొని ఉండేటోళ్ళు. ఒట్టిగ మాటపొంటి అనుడే కాదు గుండెల్ల సుత ప్రేమ ఉండేది. కోపం- ప్రేమ అన్ని భావోద్వేగాలతోని మనిషి సహజమైన జీవితం గడిపెటోళ్ళు.అట్ల కాకుండ అన్ని ప్లాస్టిక్ నవ్వులు, ప్లాస్టిక్ ప్రేమలు అయిపోతే ఎట్ల!
ఇప్పుడు ప్రపంచం జెల్ది జెల్ది ఉరుకుతుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, లాభల పొంటి ఉరుక్కుంట మనల్ని మనమే యాది మర్షిపోతున్నం. ఇంగ సుట్టాలు పక్కాలు యాడ యాది కొస్తర్ అక్కా అంటవ..!? నిజమే..దాదాపు ప్రతి వ్యక్తి టైం లేదు, టైమ్ లేదు అనుకుంట బాధపడుతున్నరు. దగ్గరి సూట్టాలకు కాల్ జేయనీకి, కలవనీకి పురుసత్ దొరుక్త లేదు. ఒడిశిపోవా మరి ఒర్సలు గిట్లయితే!
ఇంకో ముచ్చట సోషల్ మీడియా, మొబైల్, వర్చువల్ కనెక్టివిటీ బాగ పెరిగి, మన మధ్య actual emotional connectivity తగ్గిపోతుంది. “Like”, “Comment” culture తోని మానవీయ సంబంధాలు శూన్యంలకి పోతున్నయి.
ఈపొద్దు జీవన లక్ష్యాలు అంటే “నేను”, “నాది”, “నాకోసం” గిదే భావనలు జొర్రీగల లెక్క సుట్టూ తిరుగుతున్నయి. సంబంధాలు అంటే పరస్పర వినయం, సాకర్షణ, త్యాగం, సహనంతోని కొనసాగుతయి. కాని ఇవన్నీ తగ్గిపోయినప్పుడు, బంధాలు సుత మెల్లగ ఒడిశిపోతున్నయి.
అప్పట్లే పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను, పాలింపును గౌరవంగ స్వీకరించేటోళ్లు. ఇప్పుడు స్వేచ్ఛ, ప్రైవసీ అనే పదాల పేరుతోని దూరమయితున్రు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు, పుట్టిన ఊరి నుంచి పెద్దలు… విడిపోతున్రు.
దీనితోని..ఒంటరితనం పెరుగుతుంది శానమటుకు పెద్దోళ్లు ఒంటరిగ జీవిస్తున్నరు. పునరావాస కేంద్రాలు నిండిపోతున్నయి. పెళ్లైన తరువాత తల్లిదండ్రులను మరచిపోతున్న యువత ఎక్కువైయిన్రు. ఇగో… దీనివల్లనే శానా మంది పెద్దోళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటుర్రు. వార్తలు సదివినప్పుడు కడుపుల చేయి వెట్టి తిప్పినంత బాధ అయితది. కానీ ఎవ్వల్లము మారము. మళ్లీ మనం మన ప్రేమలను కాపాడుకోము. సామాజిక మద్దతు లేకపోవడంతోని ఒంటరిగా భావించి గిసొంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నరు. డిప్రెషన, ఒత్తిడి వంటి సమస్యలు బంధాల వెలితి వల్లనే వస్తయి.
పెద్దోళ్ళే కాదు బంధాల హీనత పిల్లలను సుత ఆగం చేస్తుంది. ఎట్ల ప్రేమను పంచుకోవాల్నో తెలుస్తలేదు. పిల్లలకు ప్రేమంటే..’అమ్మ నాన్నలు, తాతలు అవ్వ ప్రేమ గాదు. ఊరు మీద ప్రేమ కాదు. ప్రేమంటే వాళ్ళకి యువత ఒకళ్ళ మీద ఒకళ్ళు ఐలవ్యూ చెప్పుకుని ఎర్ర గులాబీ ప్రేమ తప్ప, నిజమైన ప్రేమ అంటే ఏందో అర్థం అయితలేదు వాళ్లకు. సంయమనభావం, పరస్పర గౌరవం, సహనము గిసొంటి విలువలుపూర్తిగ మాయమైతున్నయి.
“ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః” అని భగవద్గీతల శ్లోకం ఉంది
అన్నీ జీవులల తనను తాను చూసుకునే వాడు (అత్మవత్ భావించే వాడు) నిజమైన పండితుడు. అంటరు కృష్ణభగవానులు.
బంధాలు అనేవి మనం వేరేటోలల్ల సూడ గలుగుతేనే అవి పండుతయి. ఈపొద్దు సంబంధాల శూన్యతకు కారణం, మానవతా దృష్టి లేకపోవుడే.
“న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్”
అంటరు శ్రీకృష్ణ పరమాత్మ
ఏ మనిషీ ఒక్క క్షణమైనా క్రియారహితుడిగా ఉండలేడు. మన బంధాల్లోనూ అట్లనే, సంబంధాల పరిరక్షణ కోసం మనం నిరంతరం క్రియాశీలులమవ్వాలి అని, మన బంధాలు మన ప్రేమను కాపాడుకోడానికి కూడా ప్రతి మనిషి క్రియ చేయాలి, అంటే మాట్లాడాలి. ఈగోలు తగ్గించుకోవాలి. మనుషులను మనుషుల లెక్క గుర్తించాలి. అందరిని సమదృష్టితోని చూడాలి. దేవుడు అందరిలోపల ఉన్నడని గుర్తుపెట్టుకోవాలి అని కృష్ణ భగవానుడే చెప్పిండు.
‘ఎట్లున్నవ్ మంచిగున్నవా ‘అని వారానికో నెలకో ఒక్క చిన్న మాట మాట్లాడితే.. మనసులు చాలా దగ్గరైతయి. కనుక సంభాషణలు- మాటలే ముఖ్యం! మంచి మాట తేనెలక్క మనసును తాకుతది. ఆనందం ఇస్తది. అనుబంధాలు ఒడిసిపోకుండ ఆపుతది.
దునియాల ఏదైనా.. పెద్దోళ్ళని చూసే పిల్లలు నేర్చుకుంటరు. పిల్లలకు బంధాల గురించి నేర్పాలి. పెద్దల మీద గౌరవం, మామ-అత్త, అక్క-బావ గిట్ల బంధాలకు విలువ కలిగించేటట్లు పిల్లలు ఒదిగి ఉండేటట్లు చేయాలి.
ఒక్కసారి ఆలోచిద్దాం..!
ఈ దునియాల ఎన్నేండ్లు బతుకుతామో ఏమో! మన తాతలు ముత్తాతలు ఉన్నారా చెప్పుండి. చానమందికి లేరు. గట్లనే మనము ఎన్ని రోజులు ఉంటామో కూడా లెక్క తెల్వదు. ప్రేమగ ఆప్యాయతగ ఉండాలి. ఉండేటట్టు పిల్లలకు నేర్పాలి. మనల్ని ఎవరు కాపాడిన్రు? మన బాధ్యత ఏంది? మనం తీసుకున్న సాయంకు బదులు మంచి చెయ్యాలె..ఇట్లా అన్ని మంచి గుణాలు పిల్లలకు నేర్పాలి. కుటుంబం విలువ ఏంది? ఒకలని ఒకళ్లు ఎట్ల
గౌరవించుకోవాలి, మన బాధ్యత ఏంది? అని నేర్పుకోవాలి మన పిల్లలకు అప్పుడు ఒర్సలను ఒడిసిపోకుండ కాపాడుకుంటం!
ఉంట మరి పైలం
మీ
రమక్క