రమక్కతో ముచ్చట్లు- 33

దుష్మన్లు అయితున్న అమ్మలు

అందరికీ శనార్థులు మంచిగున్నర.
ఈయాల నేను మీకు ఒక కథ చెప్త ఇనుండి. మా గల్లీల ఒక పెద్ద డాక్టర్ ఉంటడు డాక్టర్ బిడ్డ సుత డాక్టరే.ఇంకొక డాక్టర్ సంబంధం చూసి లగ్గం చేసిండు. అయినంక ఇగ అల్లుడ్ని సుత ఈ ఊరికే వచ్చి ఆళ్లదౌకానలనే పనిచేయుమన్నరు. ఒప్పుకోలే అల్లుడు. రోజొక్క తీరు లొల్లి, మాటలు పెరిగినయ్.కాకి పండు బ్రహ్మ రాక్షసి లెక్క అయ్యింది. ఆలమ్మ గట్టిపట్టు పట్టింది నా బిడ్డకు ఏం కర్మ పట్టింది. డాక్టర్ చదివింది. రాణి వాసం లెక్క పెంచినం, గంత చాకిరి చేయిస్తరు. ఇంత సుత చదువుకున్న పిల్లకి ఇజ్జత్ లేదా, అని రోజు బిడ్డెకు మూడు పూటల కాల్ చేసుకుంట,
ఆ పిల్ల దిమాక్ అంత తిన్నది. ఆ పోరి నిజంగ గంత సదువు చదివి సుత తెలివితేటలు లేకుండ మొగడ్ని ఇడశి పెట్టి వచ్చింది. చుట్టుపక్కలోల్లు మస్తు చెప్పిన్డ్రు కానీ వాళ్ళ అమ్మ ఒకటే జిద్దు మీద కూసున్నది. నా బిడ్డకు ఏం తక్కువయింది అని. ఏమైంది.. మామిడి ఆకులు పోయి విడాకులు వచ్చినయి.
ఒక్క ఆరు నెలలు మంచిగనే ఉంది అనిపించింది. అవ్వ వండి పెట్టుడు బిడ్డ దినుడు ముద్దుగనే అనిపించింది. చెల్లెకు లగ్గమైంది. తమ్ముడు-మరదలు, అందరు జంటలు జంటలు తిరుగవట్టిన్రు. ఎన్ని రోజులని పని పాట లేకుండ పూస పెట్టుకుంటరు ఇంట్ల.
గంత గనం రాణి వాసం అని పోకడలు పోయిన తల్లి సుత మాటలనుడు, “ఊకే ఏం కూసుంటవ్ బిడ్డ నువ్వు బువ్వ వండు,ఇల్లు ఊకు” అని మొదలు పెట్టింది. కన్న తల్లిదండ్రులకు తోడబుట్టి నోళ్లకు,మరదలు కు, ఈమె రోజుకింత దూరమైకుంట వచ్చింది ఇంట్ల.

అవ్వగారింట్ల పని చేస్తేనేమో బాధ్యత ఇగురం, అత్తగారింట్ల పని చేస్తేనేమో చాకిరా..?! పిల్ల అత్తగారింట్ల ఉంటదా శాశ్వతంగా అవగారింటి ఉంటదా..! ఇది ఈ డాక్టర్ పిల్లకు అర్థమైందా లేదా వేరే కత.
దీనిని మనం ఎట్ల అర్థం చేసుకోవాలి మన బిడ్డల సంసారంల ఎట్ల జొర్రొద్దు, ఎంత అవసరమంటే అంతనే సలహా
ఇయ్యాలి. అందరు చదువుకున్నరు. మన అతి తెలివి వాడొద్దు అన్నది మనం నేర్చుకోవాలి, అని నాకు అనిపిస్తది. మీకు ఎవల్ల కన్న బాధ అనిపిస్తే నన్ను క్షమించుండి కానీ ఇది నిజమే చెబుతున్న!

ఇగ ఇంకొక పొల్ల సంగతి చెప్త ఇనుండి…. ఈ పొల్ల పెళ్లి చేసుకుని మొగని తోని దుబాయ్ పోయింది. ఆడ ఆ పిల్లగాడు దుబాయిలా పెద్ద కొలువు చేస్తడు మంచిగ సంపాదిస్తున్నడు. ఆ పిల్ల పొద్దుగాల లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఆడ ఏమి జరుగుతుందో పూస గుచ్చినట్టు అవ్వకు చెప్పాలి. మధ్యాహ్నం సాయంత్రం వీడియో కాల్ వస్తనే ఉంటయి. ఇగ ఆమె ట్రైన్ కు సిగ్నల్ ఇచ్చే గార్డు లెక్క. తల్లి పచ్చ జెండ ఊపితేనే దుబాయిల బిడ్డ బతుకు జట్కబండి కదుల్తది. ఆ పిల్లగానికి అదే మొగనికి కోపమొచ్చి మాటలన్నడని ఏడుచుకుంటా కూసింది, నేను చచ్చిపోతా అని. ఇక్కడ వీళ్ళు మేము పోలీస్ కేసు పెడతము దుబాయ్ కొంచబోయి నా బిడ్డను చంపుతా అన్నడు అని, ఆ పిల్లగాని అమ్మ నాయినల ఇంటికి పోయి మస్తు లడాయి పెట్టుకున్నరు. ఇక అది సుత ఇంతింత కోతి పుండు బ్రహ్మ రాక్షసి లెక్క తయారై విడాకుల దాకా పోయింది. ఏమన్న రీతి మాటనా ఇది, ఈ ముచ్చట ఇంటున్న మీరన్న చెప్పుండి జర.

గిట్ల నాకు అర్థమైనంత కాడికి నేను చూస్తున్నంత కాడికి చెబుతున్న శాన మందికి తెలివి మొత్తం లేకుండ పోతుంది. ఆడపిల్లల జీవితాలను, తల్లులే నాశనం పట్టిస్తున్నరు వారీ.
విడాకులు అంటే అల్కగ అయిపోయింది. దానికి ఇజ్జతే లేదు.
ఈ కాలం పిల్లలు మస్తు చదువుకున్నరు పెద్దపెద్ద కొలువులు చేస్తున్నరు.
హ్యూమన్ సైకాలజీ అంటరు. లైఫ్ స్కిల్స్ అంటరు. మరి అవన్నీ ఊకే చదువుకొనుడేనా చదువుకున్నయి జర మన జీవితంల సుత ఉపయోగపడేటట్టు చూసుకోవాలి కదా! ఏమంటరు మీరు, అప్లికేబుల్ అంటరు కదా మరి అప్లికేబుల్ చేసుకోరా సదువుకున్న జ్ఞానంను. ఇదేనా చదువు ఇచ్చిన తెలివి.
మొగని తల్లి ఒక శత్రువు, అక్క చెల్లెలు శత్రువులు ఆయన చుట్టాలు శత్రువులు. అనుకుంటే ఎట్ల?! ఇంకా మీదికెంచి ఒక మాట మాట్లాడుతుండ్రు అది ఏందంటే
‘ఈ కాలంలో అందరు విడిపోయే ఉంటున్నరు,విడిపోతేనే గొప్ప,’ గిదా గొప్ప?! ఈ కాలంల అందరూ నాశనం అయితుండ్రని నువ్వు సత నాశనం అయితవా?! ఇంకో మాట ధైర్యం చేసి చెప్తున్నా.. ముందు వీళ్లు కుటుంబంల కెళ్ళి విడి పోతరు, ఆ తర్వాత వీళ్ళు మొగోడు-పెండ్లా అన బంధంల నుంచి విడిపోతరు. అవునా కాదా…నిజం చెప్పండి. ధైర్యంగ మాట్లాడుతున్న, కొన్ని మాటలు. ఎంతమంది నాతోని ఒప్పుకుంటరు.
ఆడపిల్లల్ని భార్యలను గోస పెట్టి, హింసలు పెట్టెటోళ్లు ఉన్నరు. అత్తగారింట్ల గోస పోసుకునేటోళ్ళు ఉన్నరు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఆ ముచ్చట కాదు గనుక వాళ్ళ సంగతి ఇప్పుడు వద్దు.
ఎవడో దుర్మార్గుడుంటే ఆన్లెక్క అందరూ ఉండరు కదా!
భార్యాభర్తల బంధం – తల్లి బాధ్యత ఏందో జెర సూత్తాం.., మార్గదర్శనం, మాయాజాలం మధ్య సున్నితమైన రేఖ ఉంటది.
మన భారతీయ సంస్కృతిల వివాహం అనేది కేవలం ఇద్దరు మనుషులు కలయిక కాదు; అది రెండు కుటుంబాల, రెండు మనసుల, రెండు జీవితాల సమన్వయం. “వివాహం” అనే పదం itself ఒక వ్రతం. జీవితాంతం ఒకరికొకరు తోడుగ ఉండే ఒక పవిత్ర సంకల్పం. ఈ బంధాన్ని నిలబెట్టుకునుట్ల భార్యాభర్తల పాత్ర ఎంత ముఖ్యమో, తల్లిదండ్రుల పాత్ర, ముఖ్యంగ తల్లి పాత్ర సుత! కర్మకు తల్లులు ప్రేమ పేరుతోని , రక్షణ పేరుతోని, ఆల్లకు తెల్వ కుండనే లేదా భావోద్వేగంతోని తీసుకునే కొన్ని నిర్ణయాలు వాళ్ళబిడ్డెల జీవితాలను ప్రభావితం చేస్తున్నయి. ఇది ఒక సున్నితమైన అంశం, కాబట్టి దీనిని విమర్శగ కాకుండ, జెర అవగాహనగ సూద్దాం.ఏమనుకోకుండి, సుట్టు పక్కల సూసి యాష్ట పడి చెబుతున్న!
పురాణాలల్ల భార్యాభర్తల బంధం గురించి మాట్లాడితే రామాయణం తీసుకుంటం.మరీ..రామాయణంల
సీతమ్మ వనవాసంల ఎన్నో కష్టాలు అనుభవించింది. కానీ ఆమె తల్లి సీతకు ఒక విషయం నేర్పింది“జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు పారిపోవడం కాదు, నిలబడి ఎదుర్కోవడం నేర్చుకో” అని చెప్పింది.
అంతేగాని “నీకేం పట్టింది బిడ్డ! మహారాజు బిడ్డవు రాముని ఏంట అడవిలకు పోయే కర్మ నీకేం పట్టింది, నడు మన ఇంటికి పోదాం, రామునికి విడాకులు ఇచ్చేయి.”అని నేర్పలేదు కద.
తల్లి ఒక దీపస్తంభం లాంటిది. ఆమె పని మార్గం చూపడం. కానీ ఆ మార్గంల నడవడం కుమార్తె బాధ్యత.
తల్లి తన కుమార్తెకు ఆశ్రయం ఇవ్వాలి. కానీ ఆమె జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం కాదు.
చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూక్తి యాది జేసుకుందాం మనం
‘మాతా శత్రుః పితా వైరీ యేన బాలో న పాఠితః॥’
అంటే…పిల్లలకు సరైన మార్గం చూపని తల్లిదండ్రులే వారి శత్రువులు. చూసిన్రా ఎంత గొప్ప నీతి ఉన్నది ఈ మాటల.
సరైన మార్గదర్శనం అంటే నియంత్రణ కాదు. అది అవగాహన.
తల్లి తన కుమార్తెకు ఒక సత్యాన్ని నేర్పాలి,
“నీ జీవితం నీది. నీ నిర్ణయాలు నీవి. కానీ ప్రతి నిర్ణయం ముందు ఒకసారి ఆలోచించు.”
మార్గదర్శనం మరియు జోక్యం మధ్య తేడా ఉంటది.
తల్లి ప్రేమ అనేది ఒక వృక్షం నీడలాంటిది. అది రక్షిస్తది. కానీ అదే నీడ ఎక్కువ ఉంటే మొక్క ఎదగదు.’అతి సర్వత్ర వర్జయేత్’ ఇది సుత చాణుక్యని సూక్తినే.
అతి ఏ విషయంల నైన హానికరమే!
అతి ప్రేమ, అతి జోక్యం,ఇవి సుత కొన్నిసార్లు జీవితాన్ని దెబ్బతీస్తయి.
తల్లి బాధ్యత ఏదంటే, సమస్య వచ్చినప్పుడు “వెనక్కి రా” అని చెప్పడం కాదు. “ఎట్ల పరిష్కరించుకోవాల్నో నేర్చుకో” అని చెప్పడం.
పార్వతీదేవి తన తండ్రి ఇంట్ల రాజకుమార్తెగా పెరిగింది. కానీ శివుడిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె శివమయమైంది
ఒకసారి ఆమె తల్లి ఆమెను అడిగిందిట “నీవు ఇన్ని కష్టాలు పడుతున్నవు, తిరిగి ఇంటికి రావాలనిపించదా అని”
పార్వతి దానికి
“ఇది నా జీవితం. ఇక్కడే నా సత్యం, ధన్యత ఉంది అన్నదట .”
ఇది తల్లిని తిరస్కరించుడు కాదు, తన బాధ్యతను అంగీకరించుడు,
ఆడపిల్లలు తమ స్వాభిమానాన్ని కాపాడుకోవాలి. కానీ నీ సంబంధాన్ని నాశనం చేసుకోవద్దు.అన్యాయాలను ఎదురుకోవాలి కానీ అపార్థాలు చేస్కొని బతుకు పాడు చేస్కోవద్దు.
వివేకానందుడు చెప్పిన ఒక గొప్ప సూక్తి
“Strength is life, weakness is death.”
బలం అంటే గొడవ చేయడం కాదు.
సమస్యను పరిష్కరించగల సామర్థ్యం.
భగవద్గీతల శ్రీకృష్ణుడు చెప్పిన ఒక గొప్ప శ్లోకం:
“జీవితంలో సమస్యలు సహజం. వాటిని పరిష్కరించుకోవడం నేర్చుకో.”
ఉద్ధరేదాత్మనాఽత్మానం నాత్మానమవసాదయేత్॥
అంటే :మనమే మనల్ని పైకి తీసుకోవాలి. మనమే మనల్ని కిందికి లాగకూడదు.
తల్లి తన కుమార్తెకు ఈ బలం ఇవ్వాలి.
ఇక్కడ ఒక విషయం స్పష్టంగ అర్థం చేసుకోవాలి. ప్రతి సందర్భం ఒక్క తీరే ఉండదు. కొన్నిసార్లు నిజంగ అన్యాయం జరుగుతది. అప్పుడు తల్లి తన కుమార్తెకు అండగ నిలబడాలి.ఎవల్ల నన్న సరే ఎదురించి తన బిడ్డె ను కాసుకోవాలే.
తన రెక్కల కింద భద్రంగ పొదుముకోవాలె.
కానీ ప్రతి చిన్న సమస్యను “జీవితం ముగిసింది” అని సూడకూడదు, పిల్లకు అది నేర్పకూడదు.
రామాయణంల ఒక గొప్ప సూత్రం ఉంది:
“క్షమా వీరస్య భూషణం ”
అర్థం: క్షమించగలగడం ఒక వీరుని లక్షణం.
క్షమించడం బలహీనత కాదు. అది బలం.
భార్యాభర్తల బంధం ఒక మొక్క లాంటిది. అది ఎదనీకి ప్రేమ, సహనం, అవగాహన ఈ మూడు అవసరం. తల్లి ఆ మొక్కకు నీరు పోయాలి. కానీ వేర్లు తీసి తన చేతిల పట్టుకోవద్దు. ఏమంటరు?
అప్పుడు మాత్రమే ఆ కుటుంబం అనే వృక్షం పచ్చగ పదికాలాలు ఉంటది. సమాజం అనే తోట అందంగ ఉంటుంది.
ఎటు తిరిగి మనమంతా ఒక సమాజంల బతుకుతున్నం.ప్రతి ఇల్లు ధర్మము, ప్రేమ, ఆప్యాయత, భారతీయ సంస్కృతికీ ఆలవాలమై ఉండాలె. అప్పుడే మన జీవితాలు కళకళ లాడుతయి. అప్పుడే మన దేశం మంచిగుంటది కదా. ఏమంటరు తమ్మి! ఏమంటవు చెల్లె!!
యాష్ట పడకండి.
నచ్చితే మెచ్చుకోండి.
లేకుంటే మర్చిపోండి.

ఉంట మరీ. పైలెం.
మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓ ప్రేమ కథ (మోహనరాగం) – 6 భాగం

దాతృత్వ సంపద