వృద్ధాశ్రమాలు – శాపాలా, వరాలా

ఒకప్పుడు వృద్ధాశ్రమాలు అంటే ఏమిటో ఎవరికి తెలియదు. వయసు పైబడిన వారు ఇళ్లల్లో కొడుకులు, కోడళ్ళు, మనవళ్లు మనవరాళ్ల సంరక్షణలో ఉండే వాళ్ళు. చాలా వరకు పెద్ద వారు ప్రాణం పోయే వరకు వారి పని వారు చేసుకునే స్థితిలోనే ఉండేవారు.

చిన్న, చిన్న అనారోగ్యాలు వచ్చినా, ఏ ఆయుర్వేదం మందో వేసుకొని అలాగే జీవితాన్ని సాగించే వారు. చాలావరకు పెద్ద సమస్యలు వచ్చేవే కావు. వయసు పైబడిన అలసట తప్ప వేరే ఏమీ ఉండేది కాదు. ప్రాణాలు కూడా హాయిగా సొంత ఇంట్లో చుట్టూ తన వాళ్ళ మధ్య వదిలే వాళ్ళు.

కానీ ఇప్పుడు శాస్త్రీయత పెరిగి, విపరీతంగా హాస్పిటల్స్ వెలసి, అందరికీ ప్రాణాలు అంటే ఎక్కువ మక్కువ కలిగి, చీటికిమాటికి హాస్పిటల్ కి వెళ్లడం పరిపాటి అయిపోయింది. అందుకు సంబంధించిన పరీక్షలు మందులు వాడకం కూడా ఎక్కువే అయిపోయింది.

అందులో అనారోగ్యాలు కూడా విపరీతంగానే కలుగుతున్నాయి. దానికి బలమైన కారణం లేకపోలేదు. రసాయన మందులు వాడిన పంటలు వాడడం ఒకటైతే, శారీరక వ్యాయామం తగ్గి రోగాలు కలగడం మరొక ఎత్తు.

మరో ముఖ్యమైనది ఈ మధ్య బయట ఆహారం తినడం ఎక్కువైపోయింది. దానివల్ల ఒళ్ళు విపరీతంగా పెరిగిపోవడంతో రక రకాల జబ్బులు రావడం జరుగుతుంది.

ఆరోజుల్లో ఇంటి యజమాని ఒక్కడే ఇంటి పోషణ కోసం కష్టపడేవాడు. ఆడ వాళ్లు ఇంట్లో ఉండి పిల్లలను, పెద్దవాళ్ళను చూసుకుంటూ వారికి తోచిన పనిని చేసుకొని ఉండేవారు.

ఎప్పుడైతే ఆడవారిని చిన్నచూపు చూడడం ప్రారంభం అయ్యిందో, పురుషాధిక్యత పెరిగిందో అప్పుడే ఆడవాళ్ళలో కసి పెరిగింది .మేము దేనికి తక్కువ? ఎందుకు ఉద్యోగాలు చేయకూడదు? మేము ఎందుకు సంపాదించకూడదు? అనే ఆలోచనలు రేకెత్తించి ప్రతి ఇంట్లో అందరూ ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు.

మహిళలు ఇలా ఉద్యోగాలు చేయడం మంచిదే. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు. మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ న్యాయం ఎవరికి జరిగింది?

వెన్నీళ్ళకి చన్నీళ్లు తోడు అన్నట్లు, ఆర్థికంగా భర్తకు సహాయం చేయడంతో పాటు ఉదయమే అన్ని పనులు చేసుకుని, పిల్లల బాధ్యత కూడా తమ మీదనే వేసుకొని, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి పనిని చూసుకోవడంతో ఇంకా బాధ్యతలు పెరిగాయి. అటు ఆఫీసులో కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మగౌరవం దొరికింది అని అనుకుంటున్నాము అది నిజమే కావచ్చు. కానీ పని వత్తిడి మహిళలకు ఎక్కువగా పెరిగింది. అలాగని ఇంత చదువుకొని మహిళలు ఇంటిపట్టునే ఉండాలని నేను అనుకోవడం లేదు. అందరూ మగవాళ్లు ఏమి పట్టించుకోకుండా ఉంటారని కూడా నేను అనుకోను .ఒక 50% ఆడవాళ్లు విపరీతంగా కష్టపడుతున్నారు అనేది మాత్రం నిజం.

ఎప్పుడైతే ఇల్లాలు ఆర్థికంగా తనకు సహాయపడుతుందో అప్పుడు భర్త కూడా ఆమెకు దైనందిన పనిలో సహాయం చేయాలి.

అందరూ అంటారు “ఏముంది మా కాలంలో లాగా నీళ్లు తోడటం, పిండి రుబ్బడమో విసురుకోవడము ఈ పనులన్నీ ఉన్నాయా? గ్యాస్ స్టవ్ ల మీద వంట, మిక్సీలో వేస్తే పిండి వస్తుంది. స్విచ్ నొక్కితే చాలు పనులన్నీ అయిపోతాయి అంటారు. అది అంత సులభమా చెప్పండి? ఒకప్పుడు ఇన్నిరకాల టిఫిన్స్ ఎవరు చేసుకునే వాళ్ళు కాదు. ఒక సమయంలో అందరూ కలిసి ఉపహారమైన, భోజనం అయిన ఒకే రకంగా చేసే వాళ్ళు. ఇప్పుడు మూడేళ్ల పిల్లవాడు కూడా వాడి కోరికల చిట్టా విప్పుతాడు. తినడానికి ముప్పు తిప్పలు పెడుతున్నారు. వంట చేసిన దానికన్నా ఎక్కువ సమయం పిల్లలకి తినిపించడం లోనే ఉంది.ఇప్పుడు దీని వల్ల ఎవరికి సుఖం లేదు.

ఇక పిల్లల ఫీజులు, ఖర్చులు చెప్పనవసరం లేదు. ఇద్దరి జీతాలు కావాల్సిందే.ఎంతో దూరంలో స్కూళ్లు. అందరూ 8 కల్లా బయట పడితే ,ఇక మిగిలేది ఇంట్లో ఉండే వృద్దులు.

ఇందులో తప్పు ఎవరిది? కాలంతో పాటు పరిగెత్త వలసిందే పిల్లలు. పెద్దవాళ్ళని దిక్కు లేని పక్షులను చేస్తున్నారు అని అంటారు. వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు అనే అపవాదు కూడా ఎక్కువగానే ఉంది.

కానీ చాలా మంది వృద్దులు వారికై వారు అందులో చేరుతున్నారు. రిటైర్మెంట్ హోమ్స్ గా పిలవబడే ఈ సదనాలు ఎంతో మందికి ఓదార్పు నిస్తున్నాయి.

రోడ్ల మీద వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు.అది వేరే విషయం.ఇప్పుడు డబ్బు కట్టి వాటిల్లో చేరే వారు మాత్రం ఇష్టంతో చేరుతున్నారు.

వారికి అక్కడ ఎంతో మంది స్నేహితులు అవుతున్నారు.నిద్ర లేచినది మొదలు వారి దినచర్య ఆరోగ్యకరంగా సాగుతుంది. వ్యాయామం చేయడం, ఇష్టమున్న దైవాన్ని ప్రార్థించుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, మరో ముఖ్యమైనది మందులు వేసుకోవడాన్ని గుర్తు చేస్తారు.

అందరితో కలిసి ఉండడం వల్ల ఒంటరితనం పోయి, సంతోషంగా ఉండ గలుగుతున్నారు.

ఇళ్లల్లో ఉంటే ఒంటరిగా బిక్కు బిక్కు మంటూ ఉండాలి.పిల్లలు విదేశాలలో ఉంటే మరీ సమస్యలు. ఒంటరిగా ఉండ లేక.సరైన రక్షణ లేక ఇలా రిటైర్ మెంట్ హోం లో చేరుతున్నారు.

బాధాకరమైన విషయం ఏంటంటే కొంత మంది ఆస్తులు రాయించుకుని రోడ్ల మీద వదిలేస్తున్నారు. అది దారుణం.

విదేశీ చదువులు కోరి పంపించిన తల్లి తండ్రుల కి మరో మార్గం లేదు. అలాగని అసంతృప్తిగా లేరు.

అంతే !ఎక్కడికో ఒక దిక్కు సర్దుకుని మనుగడ సాగించి తీరాలి. ఎవరి జీవితాలు పూల బాటలో పయనించవు.

ఎవరి వ్రాతని బ్రహ్మయ్య ఎలా రాస్తాడో తెలియదు. శివయ్య ప్రాణాన్ని ఎప్పుడు తీస్తాడో అంతకన్నా తెలియదు.

బతికినంత కాలం దుఃఖమైనా ,సంతోషమైన భరించాల్సిందే.

మళ్ళీ పూర్వపు వైభవం వచ్చి ఇళ్లన్నీ పిల్లలు,పెద్దలు, పాడి పంటలు, ఆల మందలతో విలసిల్లాలని కోరుతున్నాను.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విధివంచిత

యూరోప్ ట్రిప్ – 19