..శిశిరవసంతం……

కథ

దబదబ తలుపు చప్పుడు,”అయ్యగారండీ, పాలు” అంటూ అరుపు లాంటి పిలుపుతో మెలకువ వచ్చింది
రామానికి. పక్కకు తిరిగి చూసాడు సీత కోసం,
కన్పించలేదు స్నానానికి వెళ్ళిందేమో.ఇంక లేవక తప్పలేదు రామానికి.
‘అయినా,వీడికింత ప్రేమేమిటో నా మీద,నన్నే పిలుస్తాడు’ అనుకుంటూ మంచం దిగి,వంటింట్లోకి
వెళ్ళిపాలగిన్నె వెతుక్కుని తీసుకెళ్ళేలోపు ఇంకోసారి దబదబ చప్పుడు.
‘ఏమిట్రా,మరీనూ,వచ్చేదాకా ఆగలేకపోతున్నావా?
బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు’తలుపు తీస్తూనే విసుక్కున్నాడు రామం. అయ్ బాబో,లేటైతే ఎట్టాగండీ? ఇంకా పదిళ్ళలో పొయ్యాలి మరీ’ అంటూ గబగబ కేన్ లో పాలు గిన్నెలో దిమ్మరించి, ఈ పక్క అరుగు మీద ఎవరో పడుక్కున్నారు, సూడండి బాబూ..’ అంటూ వెళ్లిపోయాడు రంగడు.
రామం గుమ్మం దిగి పక్క అరుగు మీదకి చూసాడు.ఎవరో ఒక పెద్దాయన,ఒక అమ్మాయి షాల్ కప్పుకుని పడుకుని ఉన్నారు. ఎవరబ్బా?ఇలా పడుకున్నారు? అనుకుంటూ దగ్గరకు వెళ్లి చూసాడు.
ఏమండీ..మాష్టారూ..
అంటూ రెండుసార్లు పిలిచేటప్పటికి ఆయన లేచి ఇటు తిరిగాడు.ఆయన ముఖాన్నిపరిశీలనగా చూసిన రామం సంభ్రమంగా మాష్టారూ.. మీరు ఇక్కడ?…అంటూ ఆగిపోయాడు.
‘తెల్లవారుజామున బస్సుకు వచ్చాను బాబూ,మంచి నిద్ర లో ఉన్న మిమ్మల్ని లేపటం ఎందుకని అరుగు మీద గోడకు ఆనుకుని కూర్చుంటే నిద్రపట్టేసినట్లుంది’
‘అయ్యో,నన్ను లేపవలసింది’ అని నొచ్చుకుంటూ ‘ముందు లోపలకి రండి, ఇదుగో సీతా ఎవరొచ్చారో చూడు’అని గట్టిగా కేక వేసాడు.లోపల నుండి వస్తున్న సీత కూడా ఆయన్ని చూసి ‘ఎన్నాళ్ళయ్యింది మాష్టారు మిమ్మల్ని చూసి..’ అంటూ ఆనందించింది.
‘సీతా,మాష్టారు ఎందుకో దిగులుగా ఉన్నట్లున్నారు,గమనించావా?’ అన్నాడు రామం
మధ్యాహ్నం భోజనాలయ్యాక.’అవునండీ,నాకు అలాగే అన్పించింది,లేచాక నెమ్మదిగా కనుక్కోండి’
అంది మాష్టారు పడుక్కున్న గది వేపు చూస్తూ.
సాయంత్రం టీ తాగుతూ నలుగురు వీధి అరుగు మీద కూర్చున్నప్పుడు, ‘ అమ్మగారిని కూడా తీసుకువస్తే బాగుండేది మాష్టారూ,చంద్రం,
రోహిణి ఎలా ఉన్నారు?’అంటూ కుశల
ప్రశ్నలు వేసాడు రామం. అది వింటూనే కళ్ళు
కండువాతో ఒత్తుకుంటూ చేతిలో కప్పు పక్కన పెట్టాడు రాఘవరావు.
‘ఏం చెప్పను రామం? వాళ్ళు మనకు అందనంత దూరం వెళ్లిపోయారని ఎలా చెప్పగలను?’ దుఃఖంతో ఆయన గొంతు పూడిపోయింది.రామం ఉలిక్కిపడ్డాడు.ఏంటి మాష్టారు మీరంటున్నది?
అంటే…ఇంక మాట్లాడలేకపోయాడు.
‘ అవును రామం, మన జీవితం మన చేతిలో ఉండదు కదా! మూడు నెలల క్రితం… ఆరోజు మా జీవితాల్లో అత్యంత దురదృష్టకరమైన రోజు.చంద్రం,రోహిణి సుభద్రను తీసుకుని బంధువుల అబ్బాయి పెళ్లికి బయలుదేరారు.
స్కూలులో పరీక్షలు ఉండటంతో నేనూ,సుధ ఇంట్లోనే ఉండిపోయాము. గంటలోపే వాళ్ళు వెళుతున్న రైలు పట్టాలు తప్పి ఘోర ప్రమాదానికి గురి అయిందన్న వార్త పిడుగుపాటులా తాకింది.చంద్రం,రోహిణి, సుభద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. జరిగిన దారుణానికి మా మతులు పోయాయి.ఈ వయసులో జరిగిన నష్టాన్ని తట్టుకోవటం,సుధను సముదాయించటం నా వల్ల కాలేదు. కొన్నాళ్ల పాటు సుధ,నేను జీవవచ్ఛవాల్లా పడి ఉన్నాము.
సుభద్ర,చంద్రం,కోడలు లేని ఆ యింటిలో గడపటం నరకప్రాయమైంది.అందుకే కొంత మార్పుగా ఉంటుందని సుధను తీసుకుని ఇక్కడకు వచ్చాను’
అన్నాడు రాఘవరావు.
చంద్రంతో,ఆ కుటుంబంతో తనకి ఉన్న అనుబంధం తలపుల్లో మెదులుతుండగా,జరిగిన
విషాదానికి వికలమైన మనస్సును అదుపులో పెట్టుకుంటూ,చమర్చిన కళ్ళను ఒత్తుకుంటూ,
నెమ్మదిగా తేరుకుంటూ,’ ఇక్కడకు వచ్చి మంచిపని చేసారు మాష్టారూ ఇది మీ ఇల్లే కదా ,ఇక్కడే ఉండండి,నన్నే చంద్రం అనుకోండి’ అంటూ ఓదార్చాడు రామం.
‘చాలా ఘోరం జరిగిపోయిందండీ,మంచి వాళ్ళనే తొందరగా తీసుకుపోతాడు ఎందుకో ఆ దేవుడు,!భవిష్యత్తంతా ముందే ఉన్న సుధ కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి.మీరు ఇక్కడ
ఉంటే మాకూ పెద్దవాళ్ళు లేని లోటు తీరుతుంది’ అంది సీత.
రాఘవరావు వచ్చాడని తెలిసి మరునాడు పాత మిత్రులు,ఉపాధ్యాయులు,శిష్యులు వచ్చి పలకరించారు.జరిగిన విషయం తెలిసి బాధపడ్డారు,ఓదార్చారు. తన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నతోద్యోగాల్లో,పదవుల్లో ఉన్నారని తెలిసి ఎంతో సంతోషించాడు రాఘవరావు రోజూ మిత్రులతో కలిసి వాకింగ్ చేయడం,చదువుకునే పిల్లలను చేరదీసి వాళ్ళకి తెలియని విషయాలు బోధించడం మొదలుపెట్టాడు. సుధ కూడ వాళ్ళందరి పరిచయంతో,రామం,సీతల ఆదరణతో
తేరుకుంటోంది.
ఆ ఇంటిని, పరిసరాలను చూస్తుంటే
రాఘవరావుకి పాతరోజులన్నీ గుర్తుకు
వస్తున్నాయి.పైసా పైసా కూడబెట్టి తాను,సుభద్ర ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఇది.పెళ్ళయిన మూడేళ్ల లోనే తాను ఇల్లు కట్టగలిగాడు.అదంతా
సుభద్ర ఇంట్లో అడుగు పెట్టిన వేళావిశేషమని అమ్మ తరుచూ అనేది.నాన్నకి కూడా కోడలంటే ఎంతో అభిమానం.సుభద్ర కూడా అత్తమామలను ఎంతో గౌరవించేది.ఈ ఇంట్లోనే చంద్రం పుట్టాడు.వాడి బాల్యం,ఆటపాటలు,స్నేహితులతో
చదువుసంధ్యలు,చిలిపి తగాదాలు,పెళ్లి వేడుక,ముచ్చట్లు …అన్నీ ఇక్కడే కదా!ఆలోచిస్తుంటే అవన్నీ సినిమా రీలులా కళ్ళ ముందు కదిలాయి రాఘవరావుకి.అమ్మానాన్నలు పోయినప్పుడు తనకంటె సుభద్రే ఎక్కువగా బాధపడింది.ఆ దుఃఖం నుండి తేరుకోవటానికి తమకు చాలా కాలం పట్టింది.చంద్రం ఉద్యోగ రీత్యా హైదరాబాదు వెళ్ళవలసి వచ్చింది.తనను,సుభద్రను వదిలి విడిగా ఉండటం ఇష్టం లేక చంద్రం తమను కూడా వాళ్ళతో పాటే ఉండమని,స్థలం మారితే కొంత ఉపశమనం ఉంటుందని పట్టుబట్టటంతో వెళ్ళక తప్పలేదు.ఈ ఇంటిని వదిలి వెడుతుంటే తమ ఆరో ప్రాణాన్ని వదిలి వెళుతున్నట్లు బాధ పడుతుంటే చంద్రం ఇంటిని తన ఆప్తమిత్రుడైన రామానికి అప్పగించి,
‘మళ్ళీ మేము తిరిగి వచ్చేదాకా ఇంటిని
ప్రాణంలా చూసుకోవాలి సుమా’ అని మాట తీసుకున్నాడు.రామం,చంద్రం చిన్ననాటి స్నేహితులు,సమ వయస్కులు,కలిసి ఒకే స్కూల్లో, అదీ తన దగ్గరే చదువుకున్నారు.
ఆలోచనల్లోంచి బయటపడి ఇంటిని, ముందున్న చెట్లను,మొక్కలను గమనించసాగాడు రాఘవరావు.
విశాలమైన ఈ ఎత్తరుగుల ఇల్లు అంటే తనకు ప్రాణ సమానం. ఈ ఇంటితో ముడిపడి ఎన్ని జ్ఞాపకాలో! మండువాలో ఆ ఉయ్యాలబల్ల మీద నాన్న కూర్చుంటే ఎంత నిండుగా ఉండేది!
చంద్రం పాకుతూ ఈ ఎత్తు గడపకి గడ్డం కొట్టుకుని గాయం చేసుకొన్నప్పుడు ఇంటిల్లిపాది ఎంత హడావిడిపడ్డారు!అరుగుల మీద ఉన్న ఈ స్తంభాలు పట్టుకునే కదా పిల్లలు నాలుగు స్తంభాలాట ఆడేవారు! ఆ స్తంభాల మీద చెక్కిన అందమైన లతలు చూస్తుంటే తన జీవితమనే పందిరిని లతలా అల్లుకుపోయి అంతా తానై పోయిన సుభద్రే గుర్తుకు వస్తోంది.అసలు మర్చిపోతేనే కదా,గుర్తుకు రావటం అనే మాట.సదా మదిలో కొలువు ఉన్న రూపం ఎలా మరపుకు వస్తుంది?
ఈ ముద్దమందారాలంటే సుభద్రకెంతో ఇష్టం.పొద్దున్నే స్నానం చేసి,’ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు,పూలిమ్మని రెమ్మరెమ్మకు..,’ అని కూనిరాగాలు తీస్తూ పూలు కోస్తుంటే,’నువ్వేమైనా సినిమా హీరోయిన్ వి అనుకుంటున్నావా’ అని తాను ఆటపట్టించేవాడు.
తనకు హెడ్ మాష్టారుగా ప్రమోషన్ వచ్చినపుడు పెరట్లో పెరిగిన బంతులు,చామంతులు,
గులాబీలు అన్నీ గుచ్చి తన మెడలో వేసి హడావిడి
చేసింది సుభద్ర.
ఇదుగో,ఈ వేపచెట్టు దగ్గర కూర్చునే కదా
తానూ సుభద్ర ప్రొద్దున్నే కాఫీ తాగుతూ లోకాభిరామాయణం మాట్లాడుకునే వారు!సాయంకాలం ఆ మల్లె పందిరి దగ్గర కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు.
అప్పటి రోజులు ఎంత బాగుండేవి! మళ్లీ ఆ రోజులు,పోయిన మనుషులు తిరిగిరారు కదా! ఏమిటీ పిచ్చి? ఇంత వయసు వచ్చినా చిన్నపిల్లాడిలా ఆలోచిస్తున్నాను అనుకుంటుంటే రాఘవరావుకి నవ్వు వచ్చింది.
“ఏమిటండీ మాష్టారూ! మీలో మీరే ఆనందపడిపోతున్నారు,కాస్త మాకు కూడా ఆ ఆనందాన్ని పంచండి” చివాలున తలెత్తి చూసాడు
రాఘవరావు.అదే గొంతు,అదే నవ్వు,అదే రూపం…పమిట కొంగు నడుంచుట్టూ తిప్పి దోపుకుని ఒక చెయ్యి స్తంభానికి ఆన్చి చిలిపిగా చూస్తూ సుభద్ర. ‘ఓహో, సుభద్రా! నీ రూపం ఎప్పుడూ నా కనుల ముందు సజీవంగా కదులుతూనే ఉంటుంది కదా, ఇంక నువ్వు లేకపోవడం ఏమిటి?’ అనుకుంటుంటే కళ్ళు నీటితో నిండిపోయి,చూపు మసకబారుతుంటే, ఆ రూపం ఎక్కడ కనుమరుగైపోతుందో అనే భయంతో కళ్ళజోడు తీసి పంచె కొంగుతో కళ్ళు తుడుచుకొని మళ్లీ తనివితీరా చూడసాగాడు. “అరె,మాష్టారూ, ఇక్కడ నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పరేమిటి?”అదే దబాయింపు,చనువు. రాఘవరావు కళ్ళు గట్టిగా నులుముకుని మళ్లీ చూసాడు,ఆ రూపం మాయం కాలేదు.
ఇంతలో, “మాష్టారూ, మా వాళ్ళను మీరు క్షమించాలి.మా వల్ల ఒక పొరపాటు జరిగింది” ఆ ఊరి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్,రాఘవరావు శిష్యుడు
అయిన సూర్యం మెట్లెక్కి అరుగు మీదకి వస్తూ అన్నాడు.రాఘవరావుకు అంతా అయోమయంగా ఉంది.ఏమీ అర్థం కావటం లేదు.సుభద్ర రూపం వంక, సూర్యం వంక మార్చి,మార్చి చూస్తున్నాడు. ఈ హడావిడికి రామం బయటకు వచ్చాడు.
సూర్యం గబగబ రామం దగ్గరకు వచ్చి, రైలు ప్రమాదంలో మరణించింది సుభద్రమ్మ కాదని, వేరే స్త్రీ అని,ఆమె కూడా ఇదే వయస్సు,ఇదే ఎత్తు ఉండటం,సుభద్రమ్మ షాల్,హ్యాండ్ బ్యాగ్ ఆమె దగ్గర దొరకటం వల్ల పొరపడటం జరిగిందని,
ప్రమాదంలో తలకి దెబ్బ తగిలి,స్పృహ కోల్పోయి దాదాపు కోమాలోకి వెళ్లిపోయిన సుభద్రమ్మ హాస్పటల్లో నెల్లాళ్ళ పాటు మంచం మీదే ఉందని, డాక్టర్లు ఆమెకు తిరిగి ప్రాణం పోసారని,ఆమె కోలుకుంటున్న దశలో అనుకోకుండా స్నేహితుడిని
చూడటానికి అదే హాస్పిటల్ కు వెళ్లిన తనకు ఆమె కన్పించిందని,ఆమెతో విషయం చెప్పి,డాక్టర్లతో మాట్లాడి వెంటనే ఆమెను తీసుకువచ్చేసాననీ చెప్పాడు.
ఆనందంతో రామం మాటలు తడుముకుంటూ ‘ మాష్టారూ,అ..మ్మ అమ్మ వచ్చేసింది..సుధా సీతా ఇలా రండి’ అంటూ ఒక కేక పెట్టాడు.విషయం తెలుసుకున్న సీత,సుధ ఆశ్చర్యానందాలతో ఉక్కిరిబిక్కిరయ్యారు.

అయోమయంగా ముందుకు నడిచి వచ్చిన రాఘవరావు ‘ సుభద్రా, నువ్వు…నువ్వు బ్రతికే ఉన్నావా? తడబడుతూ ఆనందం,ఏడుపు కలిసిపోయిన గొంతుతో అన్నాడు. ఆనందబాష్పాలు కారుస్తూ సుభద్ర కూడా అవునంటూ తలూపింది.

ఒక పక్క పచ్చని చేలు,ఒక పక్క గలగల పారే ఏరు, చల్లటిగాలి. శీతాకాలం కావటంతో సూర్యాస్తమయం తొందరగా అవుతోంది. ఈ ఊరు వచ్చాక రోజూ సాయంత్రం పొలం గట్ల మీద నడవడం రాఘవరావుకు అలవాటైంది. రోజూ ఈ సాయం సంధ్యను చూస్తుంటే ఆయనకి ఏదో చెప్పలేని గుబులుగా,గుండెల్లో దిగులుగా ఉండేది.కానీ ఈ రోజు ఎంతో ప్రశాంతంగా,హాయిగా ఉంది.తన పక్కనే నడుస్తున్న సుభద్ర ముఖంలోకి చూసాడు అతడు.
పసిడి వన్నెలో ఉండే ఆమె ముఖంపై నీరెండ పడి ఇంకా పచ్చగా మెరుస్తోంది. నుదుట దిద్దుకున్న కుంకుమ బొట్టు సూర్యబింబంతో పోటీపడుతోంది.
స్వచ్ఛంగా,కాంతివంతంగా ఉన్న ఆమె కళ్ళు తాను చేరుకోవాల్సిన శాంతి తీరాల్లా ఉన్నాయి.
“సుభద్రా,ఈ నిజాన్ని నేనింకా నమ్మలేకపోతున్నాను.ఇన్నాళ్ళకి మళ్ళీఇలా నా పక్కన నువ్వు నడుస్తుంటే నాకు ఎంతో ధైర్యం వచ్చినట్లుగా,జీవితాన్ని తిరిగి ఎదుర్కోగలనన్నట్లుగా అన్పిస్తోంది,జీవితంలోభార్యకి భర్త సాహచర్యం ఎంత అవసరమో భర్తకి భార్య సాహచర్యం కూడా అంతే అవసరం.నిజం చెప్పాలంటే ఇంకా ఎక్కువేమో కూడా.భర్త లేకపోయినా భార్య జీవితాన్ని గడపగలదు,కానీ భార్య లేని భర్త జీవనం దుర్భరం.నువ్వు తిరిగివచ్చావు,నా జీవితం మళ్ళీ చిగిర్చింది,శిశిరంలో వసంతంలా వచ్చిన నువ్వు మళ్ళీ మంచులా కరిగిపోవు కదా” అంటూ సుభద్ర చేతులను తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు రాఘవరావు ఆమె మళ్లీ ఎక్కడ దూరమవుతుందో అన్నట్లుగా.జీవన సంధ్యా శిశిరంలో వడలిన బ్రతుకు తోటను చిగురింప చేయటానికి తరలివచ్చిన వసంతంలా నవ్వింది సుభద్ర.

Written by Jyotsna Tatiraju

Jyothsna Tatiraju
M.A.(Telugu),M.A.(Sanskrit),B.Ed.
ఉపాధ్యాయురాలిగా 28 ఏళ్ల అనుభవం ఉంది.
శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూలు,శ్రీ చైతన్య టెక్నో స్కూళ్లలో పనిచేసాను.
2005 నుండి కథలు వ్రాస్తున్నాను.నా మొదటి కథ "తరలిరాదా తనే వసంతం" ఆంధ్ర భూమి దినపత్రిక లో,రెండవ కథ " "వెన్నెలవాన" నవ్య వీక్లీ లో ప్రచురింపబడ్డాయి.
ఇంకా కొన్ని కథలు 'నవ్య' వీక్లీలలో, 'రచన' మాసపత్రికల్లో ప్రచురింపబడ్డాయి.'సెల్ ఫోన్' అనే కవిత 'కవితాప్రస్థానం' అనే వచన కవితా సంకలనం లో ప్రచురింపబడింది.
మొదట్లో ' వెన్నెల ' అనే కలం పేరుతో కొన్ని రచనలు చేసాను.,Facebook లో వ్రాస్తూ ఉంటాను.(దేనికీ పంపించక పోవటం,ఊరికే వ్రాసి పెట్టుకోవడం వల్ల అముద్రిత కవితలు,కథలు చాలా ఉంటాయి)
పుస్తకాలు చదవటం అంటే చాలా ఆసక్తి.తెలుగు,సంస్కృత సాహిత్యాలు, సాంఘిక,చారిత్రాత్మక నవలలు అన్నీ చదువుతాను.ప్రవచనాలు,
సినిమా పాటలు,లలిత సంగీతం,సెమీ క్లాసికల్ ఆసక్తిగా వింటాను.తెలుగు పజిల్స్ ఆసక్తిగా పూర్తిచేస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పరిణత — పాళీ

ఒడిపిళ్ళు-22