జరిగిన కథ:
మగధ రాజాధినేత విక్రమసింహ, మారువేషంలో వినయవర్మగా రాకుమారికి శిక్షణనిస్తూ, గురువుగారు వచ్చారన్న వార్త వినగానే, శిరస్త్రాణం తీసి గురువుగారికి ఎదురెళ్ళాడు. వినయవర్మ మోమును మొదటిసారి గాంచిన ప్రమీలాదేవి, తన మనసును చూరగొన్న మహాభాగులు మహారాజేనని తెలుసుకొని, విక్రమసింహను కలుసుకోవడానికి ప్రయత్నించినా, అనుమతి లేకపోవడంతో, తాను వేసిన చిత్రపటాన్ని శయ్యాగృహంలో పెట్టి, పుట్టింటికి బయలుదేరుతుంది. ఆ చిత్రపటాన్ని గాంచిన, విక్రమసింహుడు ప్రమీలాదేవిని కలుసుకోవాలనుకున్నా, యుద్ధ ఏర్పాట్ల వలన కుదరక, సర్వసన్నద్ధమై యుద్ధానికి బయలుదేరుతాడు. అనంతుడు యుద్ధ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉంటే, వేగుల నాయకుడు తెచ్చిన సమాచారం విని కీడును శంకిస్తాడు.
తర్వాత ఏమైందో చూద్దాం రండి…
నరసింహుని మాటలు విన్న అనంతునికి మతిపోయినంత పనైంది. అతనికి తెలియని వారెవ్వరూ లేరు. అటువంటి వాడే, అనుమానాస్పద వ్యక్తులన్నాడంటే… అటువంటి వారితో, శిబిరంలో, యుద్ధ సమయంలో, ఏకాంతంగా… యిది ఉపేక్షించాల్సిన విషయం కాదు. ముప్పు జరగడానికి క్షణం చాలు. మనసెందుకో కీడును శంకిస్తుంది. వడివడిగా ప్రభువుల శిబిరానికి నడిచాడు అనంతుడు.
*
శిబిరానికి బయట ఒక వ్యక్తి ఉన్నాడు. అనంతునికి శిరసు వంచి, వందనం చేశాడు. లోపలకు వెళ్లబోయిన అనంతునితో “ప్రభూ! ఎవరినీ లోపలకు పంపించవద్దని మహారాజుల ఆజ్ఞ” అన్నాడు బొంగురు గొంతుతో.
ఆ మాట వినగానే పట్టరాని కోపంతో కరవాలాన్ని తీశాడు అనంతుడు.
దానితో వెనక్కు తగ్గిన ఆ వ్యక్తి “మహారాజులవారి ఆజ్ఞ మీకు మనవి చేస్తున్నాను ప్రభూ, అంతే!” అని ఊరుకున్నాడు.
ఆ మాటను లెక్కించకుండా శిబిరంలోకి ప్రవేశించాడు అనంతుడు. మహారాజుకు ఎదురుగా వున్న, ఒక ఆసనంపై ఆ రెండవ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆ వ్యక్తి పూర్తి కవచధారియై, ఆఖరికి ముఖం కూడా కనిపించకుండా… ఆ వీరుని చూస్తూ ప్రభువు, బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఉన్నారు. చుట్టూ ఏమవుతుందో తెలియనంత తన్మయావస్థలో… అటువంటి స్థితిలో వారినెప్పుడూ చూడలేదు. అనంతుడు వచ్చాడని కూడా గమనించలేదు. ఏమవుతుంది మహారాజుల వారికి?
“ప్రభూ!” అనంతుని స్వరం ప్రభువును ఈ లోకంలోకి తెచ్చింది.
ఎదురుగా ఉన్న వ్యక్తి, ఆసనం మీద నుండి లేచి అనంతునికి శిరసు వంచి నమస్కరించాడు. అంటే వీరికి తానెవరో తెలుసన్నమాట. శత్రువులెప్పుడు అనుపానులు తెలుసుకునే వస్తారు కదా! మహారాజుల వారినే నమ్మించగలిగారంటే వీళ్ళు సామాన్య వ్యక్తులు కారు
అనంతుడు ఏదో అనబోయేంతలో, అతనికా అవకాశం ఇవ్వకుండా, “అనంతా! ఈ వీరుడు నాకు అంగరక్షకుడుగా వుంటాడు. ఈ వీరుడు, ఇతని స్నేహితుడు నాకు అంగరక్షకులుగా ఉండడానికి నేను వారికి అనుమతినిచ్చాను. ఈ విషయం అందరికీ వార్త పంపించండి. మరొక్క విషయం… వీరి శిబిరాన్ని, నా శిబిరం ప్రక్కనే ఏర్పాటు చేయించండి. వీరికి సకల సౌకర్యాలూ అందాలి. ఇది నా ఆజ్ఞ” అని చెప్పాడు మహారాజు.
మహారాజుకు ఏమైనా మతిభ్రమించిందా! అన్న అనుమానం కలిగింది అనంతునికి. ఈ కాస్త సమయంలోనే వారేమైనా చేశారా? శత్రుదేశపు సరిహద్దుల్లో, యుద్ధసమయంలో అపరిచిత వ్యక్తులను అంగరక్షకులుగా పెట్టుకోవడం, తమ శిబిరం ప్రక్కనే, వారి శిబిరాన్ని ఏర్పాటు చేయమనడం, ఆత్మహత్యా సదృశం కాక వేరే ఏమిటి?
ప్రభువుకేమైనా గాలి, ధూళి సోకిందా? శత్రురాజు ఏమైనా చేతబడి చేశారా? లేకుంటే ఇలాంటి నిర్ణయాన్ని ప్రభువు ఎందుకు తీసుకుంటారు? అపరిచిత వ్యక్తుల ముందు ఏ మాట అన్నా అది ప్రభువులను అవమానించడమే అవుతుంది. అందుకని ఆ అపరిచిత వ్యక్తిని చూసి తల ఊపాడు, బయటికి వెళ్ళమన్నట్టుగా. ఆ వ్యక్తి ఇరువురికి నమస్కరించి బయటకు నడిచాడు.
“ప్రభూ! రాజాజ్ఞను తిరస్కరించలేను. మీకు చెప్పే వాడిని కాను. కాని, చిన్ననాటి స్నేహితునిగా ధైర్యం చేసి, నా ఆలోచనలను మీ ముందుంచుతున్నాను. ఈ సమయంలో అపరిచిత వ్యక్తులను, వారెంత వీరులైనా, అంగరక్షకులుగా పెట్టుకోవడం నాకెందుకో మనస్కరించటం లేదు. మీరు మరొక్కసారి మీ నిర్ణయాన్ని… “అని మాట మధ్యలోనే వదిలేసాడు అనంతుడు.
అదిచూసి మహారాజు చిరునవ్వుతో “అనంతా! నీ మనసు నాకు తెలియనిదా! నీవు నన్నెంతగా అభిమానిస్తావో, సర్వకాల సర్వావస్థల యందునూ నా క్షేమం కోసమే యెంత తాపత్రయ పడతావో నాకు తెలియనిదా! కాని, ఈ ఒక్క విషయంలో నువ్వు నా నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించు. నీవు అనుకున్నదేదీ జరగదు. మనం జైత్రయాత్రను దిగ్విజయంగా ముగించుకొని, తొందరలోనే మన రాజ్యానికి చేరుకుంటాం. నన్ను నమ్ము” అని పలికాడు.
మహారాజుగారి నమ్మకాన్ని చూసిన అనంతుడు యింకేమైనా అనడానికి సాహసించలేదు. మహారాజుల వారు దీర్ఘాలోచన కలిగిన వారు. వారిని నమ్మించడం అంత సులభం కాదు. ప్రభువు వారిని విశ్వసించారంటే, వారు సామాన్యులై ఉండరు. గాని, తమ వేగుల వారి నిఘా నేత్రం నుండి తప్పించుకున్న ఈ కొత్త వ్యక్తులెవరు? ఇవన్నీ సమాధానాలు దొరకని ప్రశ్నలే అయ్యాయి అనంతునికి. ఇప్పుడివన్నీ చర్చించేంత సమయం కూడా లేదు. రేపు యుద్ధం ఇంకెలా ఉండబోతుందో? ఆ ఆలోచనలతో, మహారాజుకు నమస్కరించి తన శిబిరంలోకి నడిచాడు.
కాని, ఎన్నో అనుమానాలు… ఈ అపరిచిత వ్యక్తులెవరు? హఠాత్తుగా ఎలా ఊడిపడ్డారు? తన కళ్ళతో చూస్తే తప్ప దేనినీ నమ్మని అనంతుడు, విక్రమసింహ నమ్మకంతో పూర్తిగా ఏకీభవించలేదు. అందుకనే, నరసింహుడిని పిలిచి వాళ్ళిద్దరి మీద నిఘా ఉంచమన్నాడు. మహారాజును అనుక్షణం వేయికళ్ళతో కాపలా కాయమన్నాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో, ఏ విధమైనటువంటి తప్పిదానికి అవకాశం తీసుకోదల్చుకోలేదు. అందుకే, ఏమి జరిగినా, వాళ్ళిద్దరూ తప్పించుకోవడానికి వీలు లేకుండా, మహారాజు రక్షణను మరింత పటిష్టం చేశాడు.
ఆ మరుసటి రోజు, అనంతుడు మహారాజ శిబిరానికి వెళ్లేసరికి, ఆ వీరులిద్దరూ సర్వ సన్నద్ధమై, శిబిరం బయట నిలుచున్నారు. మహారాజు రాగానే, అతనిని అనుసరించి, యుద్ధభూమికి సాగారు. యుద్ధంలో మహారాజుని వేయికళ్లతో కనిపెట్టుకుని ఉన్నారు. మహారాజు మీద కత్తి దూసిన ఎవరినైనా, నిర్దాక్షిణ్యంగా దునుమాడారు. అందులో ఒక వీరుడు మహారాజుకు రక్షణ వలయంగా నిలిస్తే, ఇంకొక వీరుడు మొదటి వీరుడికి రక్షణ కవచమయ్యాడు. యుద్ధంలో వాళ్ళిద్దరూ కదిలే వేగాన్ని చూసి, వీళ్ళిద్దరూ సామాన్యులు కారు. యుద్ధంలో ఆరితేరిన వారు. మహారాజుకు అనుమానం రాకుండా వీరి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని తనకు తానే హెచ్చరించుకున్నాడు అనంతుడు. మొత్తానికి ఆ రోజు యుద్ధం ముగిసింది.
ఈరోజు మహారాజు చెలరేగి యుద్ధం చేశారు. శత్రుపక్షంలో నష్టం అధికంగా ఉంది. యుద్ధ వ్యూహాలను మహారాజుతో చర్చించిన అనంతరం, శిబిరానికి చేరుకున్న అనంతుడు, ఆ వీరులను తన శిబిరానికి పిలిపించాడు. ఆ వీరుల బదులు “వారు మహారాజు శిబిరంలో… అంతరంగిక భవనంలో… ఏకాంతంగా ఉన్నారన్న” వార్త తెచ్చాడు భటుడు.
*
ముందుగా నమ్మకాన్ని చూరగొని, ఆపైన మట్టుపెట్టడమనేది యుద్ధ వ్యూహాలలో అతి ముఖ్యమైనది. ఇటువంటి విషయంలో రాజులందరూ చాలా అప్రమత్తంగా ఉంటారు. అటువంటిది ఏమైంది ప్రభువుకు? తెలియని వ్యక్తులను ఇంతగా నమ్మడమా? వారు ఏ రకంగా ప్రభువులను నమ్మించ గలుగుతున్నారు. తన మాటకు కూడా విలువ ఇవ్వకుండా మహారాజు వారిపై ఆధారపడడం ఏమిటి? ఇదేదో మాయలా ఉంది. మహారాజుకు నచ్చకపోయినా, వారినిక్కడ నుండి పంపించెయ్యాలనే ధృడనిశ్చయంతో హుటాహుటిన మహారాజు శిబిరానికి చేరుకున్నాడు అనంతుడు.
అడ్డుకోబోయిన ఆ రెండవ వీరుని మెడ మీద కత్తి ఉంచాడు. ఆ వీరుడు వెనుకకు తగ్గాడు. కత్తిని అలాగే పట్టుకుని, ఏకాంత మందిరంలోకి వెళ్లిన అనంతునికి, ఒక్క క్షణం ఏమౌతుందో తెలియలేదు. ప్రభువు తన ఆసనంపై కూర్చుని, తదేకంగా ఆ వీరుని చూస్తున్నారు. ఆ వీరుడు తల దించుకొని కూర్చున్నాడు. మధ్యమధ్యలో తల ఎత్తినా, ప్రభువుల చూపులు కలవగానే తలదించుకుంటున్నాడు. ఏ రక్షణా లేకుండా ప్రభువు… నిన్నటిలాగే పూర్తి కవచధారియై ఆ వీరుడు… ఏ మత్తు చల్లారు వీరు?
ఇక తన ఆందోళనను అణుచుకోలేక పోయిన అనంతుడు, తన కరవాలాన్ని ఆ వీరుని మెడపై పెట్టి, “మీరు ప్రభువుల శిబిరంలోనికి రావటానికి వీలులేదు. సర్వ సైన్యాధిపతిగా ఇది నా ఆజ్ఞ” అని ప్రభువు వైపు తిరిగి “ప్రభూ! మీరు మన్నించాలి. యుద్ధ సమయంలో సర్వసేనాధిపతి ఆజ్ఞను అందరూ పాటించవలసి ఉంటుంది. మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను”, తలవంచి నమస్కరిస్తూ అన్నాడు.
ఈ హఠాత్పరిణామానికి వారిద్దరూ మ్రాన్పడిపోయారు. ముందుగా తేరుకున్న ఆ వీరుడు “ప్రభూ! మేము సెలవు తీసుకుంటున్నాం. సర్వసేనాధిపతి వారి ఆజ్ఞను మేము శిరసావహిస్తాం.” అని ప్రభువులకు, అనంతునికి నమస్కరించి బయటకు నడిచాడు.
మహారాజు, అనంతుడు ఇద్దరే శిబిరంలో మిగిలిపోయారు. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు.
చివరకు ప్రభువే “అనంతా! నీవు అనుకున్నట్లే కానీ!” చిరునవ్వుతో అన్నాడు. ఇటువంటి సమయంలో కూడా ప్రభువుకు చిరునవ్వు ఎలా వస్తుంది? ఆ చిరునవ్వు వెనక ఉన్న అర్థమేమిటి? అయోమయంగా ఉంది అనంతునికి. మాట్లాడకుండా తన మందిరానికి వెనుతిరిగాడు
*
మొదట్లో ఎవరిని వరించాలో నిర్ణయించుకోలేనట్టుంది విజయలక్ష్మి. అందుకే ఇరువర్గాల మధ్య దోబూచులాడింది విజయం. ఒకరోజు, వైరివర్గం వైపు నాశనమెక్కువగా ఉంటే, మరో రోజు మగధరాజ్యపు సేనలు నేలకూలుతున్నాయి. ఐనా విక్రమసింహలో విశ్వాసం సడలడంలేదు. విజృంభిస్తూనే ఉన్నాడు. అదనపు సేనలు తెప్పిద్దామన్న అనంతుడి ఆలోచనలను కొట్టి పడేస్తున్నాడు. విజయలక్ష్మి మనల్నే వరిస్తుందని అనంతుని ఉత్సాహ పరుస్తున్నాడు.
వారం రోజులుగా యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. ఇరువర్గాలూ విజయం తమదంటే తమదనుకుంటూ ఒకరితో ఒకరు తలపడుతున్నారు. కొత్తగా వచ్చిన ఆ ఇరువురిలో, చిన్నవాడైన వీరుడు చూపులతోనే సందేశమిస్తున్నాడు విక్రమసింహకు. అది గమనించిన అనంతునికి, యుద్ధం చెయ్యడంతో పాటు ఆ వీరులనొక కంట కనిపెట్టడం విధిగా మారింది.
ఇదిలా ఉంటుండగా, అంతవరకు ఆరోగ్యంగానే ఉన్న, నారాయణచార్యుల వారు హఠాత్తుగా వచ్చిన రుగ్మతతో యుద్ధభూమి నుండి వెనుకకు మరలాల్సి వచ్చింది. దాంతో కుంతల దేశానికి నూతన ఊపిరిలు అందినట్లై, విజృంభించ సాగింది. దానికి తోడు స్థానిక రాజ్యమవ్వడంతో, క్షతగాత్రులైన సైన్యం స్థానంలో కోటనుండి సైన్యాలు వచ్చి చేరుతున్నాయి. అదే సమయంలో క్షతగాత్రులైన సైనికుల స్థానంలో, మగధరాజ్యం నుండి అదనపు సైన్యం రాకుండా అడ్డుకోవడంలో కుంతలరాజు సఫలీకృతుడవ్వడంతో, విజయలక్ష్మి అటువైపు మొగ్గు చూపుతున్నట్టు అనిపించింది.
అనంతుని మనసులో వేల సందేహాలు. నారాయణచార్యుల వారి రుగ్మతకు, మగధరాజ్యం నుండి అదనపు సేనలు రాకుండా అడ్డుకోవడంలోనూ, కొత్తగా వచ్చిన ఈ వీరుల ప్రమేయముందేమో అన్న అనుమానం అనంతుని వ్యాకుల పరుస్తుంది. ఎంత ప్రయత్నించినా నరసింహుడు కూడా వారి ఆనుపానులు పసికట్ట లేకపోతున్నాడు. ఇది మరిన్ని సందేహాలకు తావిస్తుంది. అనంతుని అనుమానాలను ఏమాత్రం పట్టించుకోకుండా, మహారాజు అరివీర భయంకరంగా శత్రువులపై విరుచుకుపడుతున్నాడు. మహారాజు క్షేమం గురించి ఆలోచిస్తూ, అనంతుడు పూర్తిస్థాయిలో యుద్ధం చెయ్యలేకపోవడంతో ఆరోజు, ఇటువైపు సైన్యానికి భారీగా నష్టం వాటిల్లింది. ఐనా విక్రమసింహ అధైర్యపడలేదు. సైన్యాన్ని ఉత్సాహపరిస్తూనే ఉన్నాడు.
*
ఆ మరుసటి రోజు, అనంతుని సందేహాలకు మరింత బలం చేకూర్చేలా, మరొక పదిమంది వీరులు. విక్రమసింహ, అనంతుని చుట్టూ రక్షణ వలయంలా… ఎవరు వీరంతా అన్నట్టు చూసిన అనంతునికి, మనవాళ్లే అన్నట్టు కళ్ళతోనే విక్రమసింహ సమాధానమిచ్చినా, విశ్వసించ లేకపోయాడు అనంతుడు. ఏమిటీ విపరీత ధోరణి? యుద్ధభూమిలో ఆగంతకులపై అంత విశ్వాసమేమిటి? ఏమవుతుంది మహారాజుకు? ఇటువంటి ఆలోచనలు తొలుస్తుంటే, యుద్ధంపై మనసును కేంద్రీకరించ లేకపోతున్నాడు. నిన్నటిలాగే ఈరోజు కూడా విక్రమసింహ, మధ్యాహ్న సూర్యుడిలా శత్రు సైన్యంపై విరుచుకుపడుతున్నాడు. అనంతుని దృష్టి మాత్రం మహారాజు చుట్టూనే తిరుగుతుంది. అటువంటి సమయంలో, శత్రు సైన్యాధ్యక్షుడు వేసిన బాణం అనంతుని గుండెల్ని చీల్చడానికి, సూటిగా ముందుకు దూసుకు వస్తుంది. అనంతుడు తేరుకునేటప్పటికే ఆలస్యమైపోయింది. అది చూసిన వైరిపక్షంలో ఆనందోత్సాహాలు…
తరువాయి భాగం మలి సంచికలో