స్వయం శిక్ష

జూలై నెల 2025 తరుణి పత్రిక సంపాదకీయం

ప్రేమలు, స్త్రీ పురుష సంబంధాలు, ఆకర్షణలు ఈ పదాలన్నీ ప్రతినిత్యం వినేవే.. ఒక జంట కలిసి ఉండడం అనేది ఒక పెద్ద సవాలుగా మారుతున్న ఈ సమాజంలో స్వయం శిక్ష వేసుకుంటున్నట్టుగానే కనిపిస్తున్నది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే పాత సామెతనే కొత్తగా ముందు వేసుకుంటూ కొన్ని విషయాలను చర్చించుకుందాం.

పెళ్లి నూరేళ్లపంట. పెళ్లి ప్రధాన ఉద్దేశ్యం లైంగిక సంబంధాలు  కేవలం భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండాలనే నియమంతో ఏర్పరిచినది. సంతాన ప్రాప్తి కలగాల్సింది కేవలం భార్యాభర్తలకే .పెళ్లి లో మొట్టమొదటి సూత్రం పెళ్లికూతురైనా పెళ్లి కొడుకైనా ‘అవిశ్వాసిని’ పెళ్లి చేసుకోకూడదు అని ఎన్నో మత గ్రంథాల్లో రాసి ఉన్నాయి. భార్య భర్తను గౌరవించాలి భర్త భార్యను గౌరవించాలి. ఈ గౌరవంలో సన్మాన భావం ఉండడం, ప్రేమ బద్ధులై ఉండడం, కుటుంబపరంగా మంచి కీర్తిని మాత్రమే పొందాలనుకోవడం, సుఖదుఃఖాల్లో ఒకరికొకరు అండగా ఉండాలనుకోవడం, నూరేళ్లు ఉన్నంతవరకు ఒకరికొకరు బద్ధులై ఉండాలని కోవడం  వంటివన్నీ పెళ్లి బంధంలో ఇమిడి ఉంటాయి.  ఒక్క పురుషుడు ఒక్క స్త్రీనే పెళ్లి చేసుకోవాలి. ఒక్క స్త్రీ ఒక్క పురుషుడినే పెళ్లి చేసుకోవాలి.

ఇట్లా జరిగిన పెళ్లి ప్రేమను పుట్టిస్తుంది ఈ ప్రేమ తో ఇద్దరు ఒక్కటి అవ్వాలి. ఈ ప్రేమ లోంచి సంతానం కలగాలి, కుటుంబ వృద్ధి జరగాలి.అదే నిజమైన పెళ్లి.పెళ్లి ఓ సాంస్కృతిక బంధం. ఒక చట్ట పరమైన బంధం.ఇదీ పెళ్లి తంతు వెనక గల కథా కమామీషు.

ఎప్పుడో  పూర్వ కాలంలో mariage అనే  పదం నుంచి వచ్చిన marriage  మ్యారేజ్ అనే పదం గురించి చాలా వాడుకలో ఉంది దీనికన్నా ముందు ఈ పదం లేదా? ఎందుకు ఉండదు? జన బహుళ్యంలో తప్పకుండా ఉండే ఉంటుంది . అక్షర రూపంలో వచ్చే వరకు తెలియదు. క్రీస్తు పూర్వం1300 లో ఫ్రెంచ్ పదం అయిన matremoine నుండి matrimony అనే పదం వచ్చింది అంటారు. మ్యాట్రిమోనీ అనే పదం పెళ్లికి సంబంధించిన పదం.

క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు ఇలా ఏ మతం వారైనా వారి వారి మతాచారాల ప్రకారం పెళ్లి ని జరిపిస్తుంటారు. ఇట్లా పెద్దలు నిశ్చయించిన ఈ పెళ్లిలను arranged marriage అంటాం. దేశ దేశాన పెళ్లిళ్లకు ఒక్కో పద్ధతి ఒక్కో విధానం. ఉద్దేశ్యం మాత్రం పైన చెప్పినదే! జీవన ప్రయాణంలో ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు వచ్చిన, మనస్పర్ధలు వచ్చిన మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకటిగా ఉండాలి అంటే శరీరాలు రెండైనా ప్రాణం ఒక్కటిగానే ఉండాలి అని.

హిందూ వివాహాన్ని సప్తపది, అని కూడా అంటారు. శుభ ముహూర్తంలో ఏడు అడుగులు కలిసి నడిస్తే తప్పకుండా వధూవరుల ఇద్దరి మధ్యన సన్నిహిత భావం మిత్రత్వ భావం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. అగ్నిహోత్రం దగ్గరగా నిలబడి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒకరినొకరు చేతులు  పట్టుకొని నడిచే సఖమైన, నిర్భయమైన … భావంతో నడిచే ఈ ఏడడుగులలో ఉన్న అర్ధాన్ని తెలుసుకుంటే, మన ఇద్దరినీ ఒక్కటి చేస్తుంది ఈ అడుగు అని మొదటిది, మన ఇద్దరికీ శక్తి సంపద లభిస్తుంది అని రెండోది, ఆనందంగా ఉంటామని మూడవది, నాలుగవది పశుసంపదతో సకల సౌకర్యాలతో జీవిస్తామని… ఎందుకంటే ఆ రోజుల్లో కేవలం వ్యవసాయ ఆధార కుటుంబాలు ఉండేవి కాబట్టి, ఆరు ఋతువులలో సుఖంగా ఉంటామని ఆరోది, గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణతో జీవించడానికి పంచభూతాలు, భగవంతుడు, పెద్దల సాక్షులుగా   నడుస్తున్నాం అని ఏడు అడుగులు  పూర్తి చేస్తారు. ధర్మార్థ కామ మోక్షాలలో కామం అనే విషయాన్ని ధర్మబద్ధంగా నడిపించడానికి పూర్వీకులు  నిర్ణయించిన మార్గమే వివాహ బంధం. ఇట్లా జరిపే పెళ్లిళ్లను పెద్దలు కుదిరించి చేసిన నిశ్చయ వివాహం అంటాం .

ఇట్లా జరిపించే పెళ్లితంతుకన్నాముందు పెళ్లి చూపులు నిర్వహించుకోవడం ఒక ముఖ్యమైన ఘట్టం. కాబోయే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు, అమ్మాయి అబ్బాయి ఒకరిని ఒకళ్ళు చూసుకుని పరిచయం చేసుకోవడం, ఇరువైపులా బంధువులు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సన్నిహితత్వం పెంచుకోవడం అనేది ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళ ఇళ్లల్లోనూ ఉంటుంది. ఒకరినొకరు నచ్చిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అనే పేర్లు స్థిరపడిపోతాయి. వివాహం అంటేనే

విశేషమైనటువంటి వాహము అని. వాహము అంటే అనుభవించవలసినది పొందగలిగినది అని అర్థం. ఇద్దరికీనూ! రెండు కుటుంబాలు మంచిగా కలిసుండడానికి వాహకం లా అన్నట్టు. మంచి చెడు సుఖసంతోషాలు ఏవైనా ఇద్దరూ జంటగా అనుభవించగలిగే వి అని. ఇట్లా పాదులు పడిన స్త్రీ పురుషుల సహజీవనానికి ఆరంభం  అనే ఓ మహావృక్షం గా కావాలంటే పెద్దల సమక్షంలో మంచి చెడుల పరామర్శ తర్వాత నిర్ణయించడం  ఒక సంప్రదాయం.ఈ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. పూలు, పళ్ళు, అక్షతలు, కలశం, ధూప దీపాల పరిమళాలు వెలుగులు పిల్లాపాపల చిరునవ్వులు పెళ్లి మంటపం కనిపించే దృశ్యాలు.ఇవన్నీ ఎందుకు అంటే, నూరేళ్లు కలిసి జీవించాల్సిన ఈ జంటకు ఇంతటి ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణంలో అభినందనల చందన మందారాలు వేయడానికి వస్తారు . ఒక అద్వితీయమైన ప్రేమ బంధం పూలబాటలా సాగాలని అక్కడికి వచ్చిన బంధుమిత్రులంతా ఆశీర్వదిస్తారు.అంటే, వెడ్డింగ్ విషెస్ చెప్తారు. ఈ అలంకరణలు ఈ ఆర్భాటాలు ఈ ఆచారాలు వేరైనా అన్ని మతాల్లోనూ ఇలాగే జరుపుతారు.

సహజీవనం అంటే coexistence , living together , live – in relationship అంటున్నారు .దీనికి పెళ్లి తో సంబంధం ఉండదు. శారీరక సంబంధం మాత్రమే. దాదాపు ఇరవై వ శతాబ్దం నుంచి మొదలైంది .

ఎవరికి నచ్చిన వాళ్ళతో ఎన్నాళ్ళైనా కలిసి ఉండొచ్చు, వద్దు అనుకున్నప్పుడు విడిపోవచ్చు. సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది అనుకోని ఈ పద్ధతి లో జీవిస్తున్నారు. ఇందులో విశ్వాసం పాత్ర ఎంతనో ఏమిటో సహజీవనం చేస్తున్న ఆ ఇద్దరి పైన ఆధారపడి ఉంటుంది.

ఎంత ఎందుకు రాయాల్సివస్తుందంటే,

అందరికీ తెలిసిందే ఈమధ్య సహజీవనం అనే మాట ఎక్కువ వినిపిస్తున్నది. అంత మంచి పదం నూరేళ్ల పంటగా వెలుగొందాల్సినటువంటి ఇంత చక్కని పదం ఇప్పుడు వాడుకలో ఎలా కాల దోషం పట్టిందో, ఎలా అర్థం విపరిణామం చెందిందో చూస్తూ ఉంటే బాధ కలుగుతున్నది. ఇలాంటి జీవితాన్ని ఎంచుకున్న వాళ్ళు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఏ సమాజం అండి? ఎవరికి ఎందుకు సందేశాలు ఇవ్వాలండి? అని ప్రశ్నలు వేస్తారేమో!

సహజీవనంలోనూ ఉండాల్సింది జంటనే కదా స్త్రీ పురుషుల ఇద్దరిలో ఎవరు నిజాయితీగా… వాళ్ళనుకున్న నియమాలకు కట్టుబడి ఉండరో వాళ్లు తర్వాతి కాలంలో బాధపడడమే కాకుండా ఆపోనెంట్ ను కూడా ఇబ్బందుల్లో పడేస్తున్నట్టే కదా! జీవితానికి ఒక అర్థం లేని ఈ సహజీవనం ఎందుకు? స్వేచ్ఛ ప్రయత్నం అనేది మంచిదే కానీ శృతిమించకూడదు.

ఒక కట్టుబాటులో లేకుండా ఉన్న వాళ్లకు పుట్టిన పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత సమాజానికి కీడు చేసేవాళ్ళుగా తయారవుతున్నారు.వాళ్ళని పసికట్టడం కూడా చాలా కష్టమైపోతున్నది ఎంత విపరీతమైన పోకడలో రావడానికి కారణం ఏమై ఉంటుంది అని తప్పకుండా విచారించే ముందు ముఖ్యంగా చూడాల్సింది ఈ సహజీవనంలో కష్టాల పాలవుతున్నది ఎక్కువ శాతం ఆడవాళ్లే.

ఈ సహజీవనం చేస్తున్న వాళ్లలో చాలామంది వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ పెద్దలు పెట్టిన, పెద్దలు పడిన ఇబ్బందులకు విసుగుచెంది ఇటువంటివి కోరుకుంటున్నారేమో అని అనిపిస్తున్నది. కానీ, ఇదీ సత్య దూరమే. ఎందుకంటే ఓపిక గా ఉండటంలో తప్పు లేదు, కాస్త కష్టాలను భరిస్తే నష్టమేమీ లేదు అనే అభిప్రాయం ఉన్నవాళ్లకి కుటుంబం అతిపెద్ద కుటుంబమైనాకూడా భరింపుతో విజయం సాధిస్తారు. ఒకటే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జీవితానికి ఉద్యోగం అవసరమే ఆర్థిక వనరుల కోసం వ్యాపారమో ఉద్యోగాలలో అన్నీ నచ్చినవే చేస్తున్నారా?  నచ్చకున్నా, కష్టంగా ఉన్నా ఓర్చుకొని డబ్బు సంపాదన కోసం కష్టపడి కొలీగ్స్ తో మానవ సంబంధాలను నిలుపుకుంటూ బ్రతుకుతున్నారు కదా!  అటువంటిది కుటుంబంలో భార్య భర్త తల్లి తండ్రి పిల్లలు ఇటువంటి వాళ్ళ తో ఆప్యాయత అనురాగాల మధ్య హాయిగా గడవాలనుకునే ఉద్దేశం ఉన్నప్పుడు ఈ కష్టాలను ఎలాగైనా ఓర్చుకోగలమనుకుంటే సరి. ఈ ఆలోచనలు లేకనే సహనం లేకనే కుటుంబాలు విచ్చిన్నం కావడాలు చూస్తున్నాం.ఇలా బాధ్యతల నుంచి తప్పించుకుని ఒంటరి జీవితం గడపడానికి స్వేచ్ఛ అనే ఒక ముసుగును తొడిగి సహజీవనం అనే మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

దీనివల్ల వాళ్ళు సాధిస్తున్నది ఏమీ లేదు సమాజంలో గౌరవప్రదమైన

జీవితం లేదు ఎప్పటికప్పుడు అనుమానంతో బ్రతుకుతున్నారు. బ్రతుకుతున్నారు అనేకంటే బ్రతుకు ఏడుస్తున్నారు అనవచ్చు.ఎవరి లోనూ భద్రతాభావం లేదు, సహజానందాలు కొరవడి అభద్రతలో భయం భయంగా జీవిస్తున్నారు .ఇది స్వేచ్ఛ కాదు. ఈ రకమైన స్వేచ్ఛ అనేది కేవలం నిజంగానే ముసుగు.  ఒక కవరింగ్…ఒక కన్నింగ్ ముసుగేస్తున్నారు. ఒక అబద్ధపు జీవితాన్ని గడుపుతున్నారు.

అందుకే  ఈ విపరీత ధోరణులవల్ల ఇప్పుడు వయసు పెరుగుతున్నా పెళ్లిళ్లు కానీ అమ్మాయిలు అబ్బాయిలు తారసపడుతున్నారు. పెళ్లి చేసుకోవాలంటేనే జడుసుకునే  కొత్త సమాజాన్ని చూస్తున్నాం. కోరికలు ఎక్కువై,కండిషన్స్ ఎక్కువై తల మీద జుట్టు రాలిపోయే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. దీనికి కారణం ఈ అధ్యాధునిక  అమానవీయ అవినీతి పరులు చుట్టూ ఉండడమే! ఒకళ్ళ ప్రభావం ఒకళ్ళ మీద పడి విడివడి కలబడి తిరగబడి జీవిత బరిలోనే కాదు బడిలోనే చెడు అలవాట్లను నేర్చుకుంటూ ఓ పాడు లోకం అశాంతికి గురి చేస్తున్నది.

కానీ ఏదైనా పెరుగుట విరుగుట కొరకే! ఈ అతిపెరిగి… పెరిగి… తర్వాత విరుగుతుంది, వెలుగుతుంది. ప్రణాళికాబద్ధమైన నియమబద్ధమైన సద్భావనలతో కూడిన వివాహ బంధానికి మళ్లీ మంచిదారులు తప్పకుండా పడతాయి కొంతకాలం వరకు, కొన్ని తరాల వరకు వేసుకున్న ఈ స్వీయ శిక్షను అనుభవించవలసిందే!

_____****___

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సుఖాసి పానం సెకేసి పోయింది!

ఆషాడ మాసం ప్రత్యేకత విశ్వ నియమాల ననుసరించి