హరిచందన – 10వ భాగం

ధారావాహిక నవల

” కుంకుడు కాయలతో తలంటు పోసుకోనంటే నానమ్మ….
నానమ్మ……. ”
“నాన్నమ్మ ఏం చేస్తుందో తరువాత చెబుదువుగాని.. పెరట్లోకి పద ”
సుశీల బంటిని చెయ్యి పట్టి లాక్కెళ్లింది.
“పండుగ సరదాగా ఎంజాయ్ చెయ్యాలని వచ్చి, ఆ ఆచారాలని పాటించక పోతే ఎలా? మధ్యలో కళ్ళు తెరిస్తే షాంపూ తో పోసుకున్నా కళ్ళు మండుతాయి. పద కళ్ళలో పడకుండా నేను పోస్తా ” శైలజ చెయ్యి పట్టుకుని తీసికెళ్ళింది.
పనమ్మాయి కుంకుడు కాయలు నాన బెట్టిన గిన్నె, ఒక ప్లేట్ లో చిన్న నూనెగిన్నె, మరో గిన్నెలో సున్నిపిండి తీసుకొచ్చి ఇచ్చింది.
“బాప్రే! ఇప్పుడు నలుగు పెట్టుకుని, ఈ కుంకుడు కాయలతో తలస్నానం చెయ్యాలా?” కళ్ళు పెద్దవి చేసి, చూసింది శైలజ.
“నేను షాoపూతోనే చేస్తా ” చెప్పేసింది సోనీ.
“పద, నేను పోస్తా నీకు ” చందన చీర కుచ్చేళ్ళు పైకి దోపుకుంటుంటే “వద్దులే తల్లీ. నేను చేస్తానులే ” చెప్పేసి, బాత్ రూంలో దూరి తలుపేసుకుంది శైలజ.
నవ్వుకుంటూ ఇద్దరు స్నానం చేశాక కట్టుకునే బట్టలు తీసి పెట్టింది చందన.
********************

స్నానం చేసి పట్టుచీరలు కట్టుకున్నారిద్దరూ.
రెండు చేతులనిండుగా మేచింగ్ గాజులు, మెడలో లాంగ్ చైన్ వేసుకున్నారు. సోనీ మాత్రం నాకు చీర కట్టుకోవడం రాదు అంటూ డ్రెస్ వేసుకుంది. ఒకచేతికి రిస్ట్ వాచ్ మరోచేతికి కంకణం లాంటి గాజు వేసుకుని జుట్టు దువ్వుకుని ఫ్రీ గా వదిలేసింది.
మేడ దిగి వస్తున్న చందనని హరి గుడ్లప్పగించి చూస్తుండి పోయాడు. పక్కనే ఉన్న జగదీష్ మోచేత్తో పొడుస్తూ, ఏంటీ కథ అన్నట్లు చూశాడు.నవ్వుతూ భుజాలు ఎగరేశాడు హరి.
పూలదండలు తెచ్చి తల్లో పెట్టుకోమని ఇద్దరికీ ఇచ్చింది సుశీల.,శైలజ తలలో తను పెట్టి. తనకి శైలజని పెట్టమందిచందన .
“మా అన్నయ్య జగదీశ్ ప్రసాద్,హైదరాబాద్ లో ఎలక్ట్రిసిటీ బోర్డు లో జూనియర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.”అందరికీ అన్నగారిని పరిచయం చేసి, వారిని అన్నగారికి పరిచయం చేశాడు.
“నమస్తే!బంటీ ఫాదర్ అట కదా. ఇందాక సుశీల చెప్పింది. ”
మిగిలిన వాళ్ళు కూడా అతనిని విష్ చేశారు.
“అమ్మడు! వాళ్ళని దేవుని గదిలోకి తీసికెళ్లి దణ్ణం పెట్టుకోమని, కుంకుమబొట్టు పెట్టుకోమను ” చెప్పింది సీతమ్మ.
సుశీల వారిని వంటగది పక్కనున్న దేవునిగది దగ్గరికి తీసికెళ్ళింది. అప్పటికే పూజ ముగిసినట్లు ఫోటోలకి చేమంతులు గులాబులు పెట్టి ఉన్నాయి. దీపాలు వెలుగుతున్నాయి. ధూపo వలయాలుగా తిరుగుతూ గది అంతా పరుచుకుంటోంది.
సుశీల కుంకుమ తీసి ఆడవాళ్ళ ముగ్గురికి కనుబొమల మధ్యలో చిన్నగా బొట్టు పెట్టి, మగవాళ్ళని పెట్టుకోమని ఇచ్చింది.
“లక్షణంగా లక్ష్మీదేవిలా ఉన్నారు.రోజు అలా కుంకుమ పెట్టుకోండమ్మా . మన సంప్రదాయం అది. ఇప్పటి కాలాన్ని బట్టి స్టిక్కర్స్ పెట్టుకున్నా, కింద కుంకుమ పెట్టుకుంటే నిండుతనం వస్తుంది.” చెప్పింది సీతమ్మ.
“పెదబాబూ!చినబాబూ!వెళ్లి తాతయ్య, నానమ్మల ఆశీర్వాదం తీసుకోండి ” చెప్పింది రుక్మిణి.
ఇద్దరూ వెడుతుంటే “ఆంటీ!మేమూ వెళ్ళచ్చా?” అడిగింది శైలజ.
“వెళ్ళండమ్మా.. దానిదేముంది “చెప్పింది సీతమ్మ.
హరి, జగదీశ్ వెనుకనే మిగిలిన వాళ్ళందరూ పెద్దవాళ్లిద్దరూ ఉన్న గదిలోకి వెళ్లారు.
“తాతయ్యా,! నానమ్మా!మమ్మల్ని ఆశీర్వదించండి “అంటూ వెళ్లి, ఇద్దరూ వారిద్దరికీ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
“తాతయ్యా గారూ!మమ్మల్ని కూడా ఆశీర్వదించండి “అంటూ చందన, శైలజ కూడా వెళ్లి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. మిగిలిన వాళ్ళు కూడా అయ్యాక ” తాతయ్యా! మీ ఇద్దరితో కలిసి ఒక ఫోటో తీసుకోవాలని ఉంది ప్లీజ్ “అడిగింది చందన.
అప్పటికే స్నానాలు పూర్తి అయి, ఇద్దరూ పట్టుబట్టలు కట్టుకుని
ఆదిదంపతుల్లా ఉన్నారు. వారిని చూడడానికి రెండుకళ్ళు చాలడం లేదు
తన సెల్ ఇచ్చి “శైలు తియ్యి”. అని చెప్పి, తాతయ్య గారి బెడ్ కి బామ్మ గారి కుర్చీకి మధ్యలో నిలబడింది చందన.
సెల్ సోనికి ఇచ్చి తనూ వచ్చి, చందన పక్కన నిలబడింది శైలజ.
మిగిలిన అందరూ కూడా ఆ వృద్ధదంపతులతో గ్రూప్ ఫోటో తీసుకున్నారు.
“మీ పిచ్చిగానీ మాతో ఫోటోలెoదుకర్రా…. మీ సిటీలో బోలెడన్ని వింతలు విడ్డూరాలు ఉంటాయి “అన్నారాయన నవ్వుతూ.
“వింతలు ఉండచ్చు కానీ, లక్ష్మీ నారాయణుల్లాంటి ఆది దంపతులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎక్కడున్నారు అని మేమూ వెతుక్కుంటూ వెళ్ళలేము. బిజీ లైఫ్ లో మాకు అంత
తీరిక కూడా ఉండదు తాతయ్యగారు. హరి పుణ్యమా అని పండుగ పూట మీవంటి పెద్దల ఆశీర్వాదం దొరికింది “అన్నాడు రమేష్.
బోసినోటితో నవ్వారిద్దరూ.
“అసలు సిటీల్లో ఇప్పుడు పెద్దవాళ్లలో చాలా మంది వృద్దాశ్రమాల్లో ఉంటున్నారు. ఇద్దరం ఉద్యోగస్థులం టైమ్ లేదు వారిని చూసుకోడానికి అని సమర్థింపు “అంది చందన.
“ఏమో!ఇక్కడ మా తాతయ్యని నాన్న, బాబాయిలే చూసుకుంటారు. నాన్నమ్మని అమ్మ, పిన్ని చూసుకుంటారు. చేతికి అందేలా బెడ్ పక్కన బెల్ ఉంది. అవసరం అయితే బెల్ నొక్కుతారు. సాధారణంగా నాన్న, బాబాయ్ ఇక్కడే కూర్చుంటారు.” చెప్పాడు హరి.
బయటికి రావడానికి వెనుతిరుగుతూ గది అంతా చుట్టూ చూస్తున్న చందన సుమారుగా సుశీలంత వయస్సు, పోలికలతో ఉన్న ఫోటోకి దండ వేసి ఉండడం చూసి,”ఆ ఫోటోలు …”సందేహంగా హరి వంక చూసిందిచందన.
“ఆ పెద్దవాళ్ళు మా తాతయ్య గారి తల్లీ తండ్రి. ఆ పక్కనున్నది మా పెదనాన్న.. అదే జగదీశ్ అన్నయ్య వాళ్లనాన్న రాజేంద్ర ప్రసాద్., ఆ పక్కనున్నది మా అత్తయ్య అలివేలు మంగ తాయారు.. మానాన్న చెల్లెలు ”
“దండవేశారు. కానీ ఆవిడని ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది”
“ఆవిడ చనిపోయి ముప్పై ఏళ్ళు అయిపొయింది చందనా” అన్నాడు హరి, నవ్వుతూ.
బయటికి వచ్చి అందరూ దగ్గరలో ఉన్న వెంకటేశ్వరస్వామి గుడికి, శివాలయం,రావిచెట్టు, అత్రి మహాముని విగ్రహం, ప్రధాన రహదారి మీదుగా కొంతదూరం వెళ్ళి చూసి,.వస్తూ దారిలో పూత రేకులు, మామిడి తాండ్ర కొనుక్కున్నారు.
తిరిగి వస్తున్నప్పుడు జట్లు జట్లుగా విడిపోయి కబుర్లు చెప్పుకుంటుంటే, చందన పక్కగా వచ్చిన హరి “చందూ!రాత్రి, బాబాయ్, నాన్నతో చెప్పేశాను మన విషయం “అన్నాడు.
“ఏమన్నారు “? ఆత్రంగా అడిగింది.
” ఆలోచించి చెప్తామన్నారు. మా అత్తయ్య కులాంతర వివాహం చేసుకుందని ముప్పై ఏళ్లుగా…. దాని ముఖo చూడలేదు తాతయ్య దానికి నువ్వులు, నీళ్లు వదిలేశారు అంటూ…. ”
” హరీ! నా ఉద్దేశ్యంలో మీ అత్తయ్యా.. పేరు…. ”
“అలివేలు మంగ తాయారు….”
“ఆ ఫోటోలోని వ్యక్తిని ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది
హరీ!… మీ జగదీశ్ అన్నయ్యకి, శ్యామల కి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది కదా!ఈ రోజుల్లో విడాకులు తీసుకోవడం ఎవరoతట వాళ్ళు, నచ్చిన వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకోవడం సహజం అయిపొయింది ”
“గుడ్ ఐడియా చందూ! ముందు నాన్నతో మాట్లాడతాను చూద్దాం… వాళ్ళందరూ ముందుకెళ్లిపోయారు. మనం వెనకపడ్డాo ” గబ గబా వెళ్లి ముందువాళ్ళతో జాయినయ్యారు.
“ఏంటే సీక్రెట్స్ ఎక్కువయ్యాయి ” కళ్ళు ఎగరేసి నవ్వింది శైలజ.
“నీ మోహo!సీక్రెట్స్ ఏముంటాయి? “అంటూ జరిగిన మాటలు చెప్పింది.
“ఇదేదో బాగుందే!
ఇల్లు చేరాక లోపలికి వెళ్లకుండా ఇంటి చుట్టూ ఉన్న గార్డెన్ తిరిగి చూశారు.అందమైన పూల మొక్కలు క్రోటన్స్, మధ్యలో మధ్యలో లాన్స్, మధ్యలో సిమెంట్ సోఫాలు, చిన్న టీపాయ్ చూడముచ్చటగా అనిపించింది.
కుడి పక్కనుంచి ఇంటి వెనక వైపుకి తీసికెళ్లాడు హరి. అక్కడ అన్నీ కూరగాయల మొక్కలు, పాదులు, ఆకుకూరల మడులు ఉన్నాయి.
పశువులపాకలో రెండు ఆవులు ఒక గేదె, ఒక చిన్న ఆవు దూడ ఉన్నాయి. బంటీ, చిన్నూ ఆవుదూడతో ఆడుతూ ఉంటే, సుశీల వారిద్దరికీ అన్నం తినిపిస్తోంది.

అందరూ బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికెళ్లారు. చందన, శైలజ పట్టుచీరలు మార్చి, మాములు చీరలు కట్టుకుని వచ్చారు.
అందరికీ కూర్చోడానికి చాపలు వేసి,అరటిఆకుల్లో భోజనాలు వడ్డీంచారు. సుశీల మంచినీళ్లు, నెయ్యి వడ్డిస్తూ అటు ఇటు తిరుగుతోంది.
“మేమందరం వచ్చి మీకు చాలా శ్రమ ఇస్తున్నాం ఆంటీ ” అంది చందన.
మామిడికాయపప్పు, వంకాయ కూర, గోంగూర పచ్చడి, అరటికాయవేపుడు బొబ్బట్లు, పులిహోర, వేడి వేడి అన్నం ఆవిర్లు వస్తోంది.
“మాకు ఇది అలవాటేనమ్మా….ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మొహమాట పడకుండా తినండి “అంది సీతమ్మ పప్పు మారు వడ్డనకి చూపిస్తూ.
ఇంటివాళ్ళు రాంప్రసాద్, కృష్ణ ప్రసాద్, జగదీశ్,హరి ఒకపక్కన
కూర్చుంటే, అతిధులు మరోపక్క వరసగా కూర్చున్నారు.
రామ్ ప్రసాద్, కృష్ణప్రసాద్ భోజనం చేస్తున్నపుడు మాట్లాడరు. వద్దు అనుకుంటే చెయ్యి అడ్డుపెడతారు. అందుకని జగదీశ్, హరి కూడా మౌనం గానే తింటున్నారు.
కూర వడ్డిoచడానికి వస్తున్న రుక్మిణిని చూసి “ఆంటీ!మీరు తిరగకండి.కావాలంటే అడుగుతాం. ముందు వడ్డీంచినవి పూర్తి అయ్యేదాకా ఇంకేమి వడ్డిoచవద్దు ” అన్నాడు కార్తీక్.
“అవునాంటీ!ఇవే ఎక్కువ ” అంది సోనీ.
భోజనం ముగించి లేవగానే పనిపిల్లవచ్చి ఆకులన్నీ ఒక బకెట్ లోకి పెట్టుకుని తీసుకెళ్లి, బట్టతో నేలంతా శుభ్రంగా తుడిచింది.
సుశీల తమలపాకులు వక్కపొడి సున్నండబ్బా ఒక ప్లేట్ లో పెట్టి తెచ్చి పెట్టింది. గానీ, మాకు అలవాటు లేదు అని ఎవరూ అవీ తీసుకోలేదు. రామ్ ప్రసాద్, కృష్ణ ప్రసాద్ మాత్రం రెండేసి ఆకులు తీసుకుని సున్నం రాసుకుని వక్కపొడితో కలిపి వేసుకున్నారు.

భుక్తాయాసంతో కూర్చోలేక ఇబ్బంది పడుతున్న మిత్రబృoదాన్ని చూసి……………

(సశేషం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు 28వ భాగం

ఒక విజేత మంగళ దాయిని