
వి . మధుసూధనరావు గారి దర్శకత్వంలో కృష్ణంరాజు , శ్రీదేవి , అంజలీదేవి , కైకాల సత్యనారాయణ , షావుకారు జానకి ముఖ్య తారాగణంగా రూపొందిన పులిబిడ్డ చిత్రంలోని పాట ఇది . నిర్మాత ఎన్ . శేషగిరిరావు , సంగీతం చక్రవర్తి , గీత రచయిత ఆచార్య ఆత్రేయ , గానం ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం .
ఇక పాట విశ్లేషణలోనికి వెళితే ….
విశాలాక్షి – విశ్వనాథ్ దంపతుల సంతానమైన కథానాయకుడు కొన్ని కారణాలవల్ల బాల్యం నుంచే అన్నపూర్ణ – శశిభూషణ్ రావు దంపతుల బిడ్డగా పెరిగి పెద్దవాడవుతాడు. అనుకోని పరిస్థితుల్లో విషయమంతా తెలుసుకుని అటు కన్న ప్రేమను పొందలేకా , ఇటు పెంచిన ప్రేమను వదులుకోలేకా నలిగిపోతూ ఉంటాడు.
ఈ పాట మొత్తం ఇదే ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని చిత్రీకరించబడింది.
కాశీ విశ్వనాథ తండ్రీ విశ్వనాథ
నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి ….. అంటూ
కాశీక్షేత్రంలో గంగాస్నానమాచరించి వస్తున్న తల్లిని , క్షేత్రదైవాలైన విశాలాక్షి విశ్వనాథులను అడుగుతున్నట్లుగా (చిత్రంలో కథానాయకుడి తల్లిదండ్రుల పేర్లు కూడా విశ్వనాథ్ – విశాలాక్షి కావడం వల్ల) హృదయ విదారకంగా వేడుకుంటూ, మరుసటి క్షణంలో ఆవేశంతో కూడిన నిలదీసే ధోరణితో , నిజాన్ని అంగీకరించి, తల్లి ప్రేమను పంచమని అర్థిస్తూ ఉంటాడు.
కడుపున వుండి కాలదన్నితే జన్మము ఇచ్చింది
కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది
పేగును తెంచిన అదే త్యాగం ప్రేమను తుంచిందా
అది అంతరాత్మనే నులిమేసిందా
ఇక సత్యమన్నదే కరువవుతుందా
ఇంతకాలం అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన స్త్రీ తనకు జన్మనివ్వలేదనీ, నవ మాసాలు మోసి కన్న స్త్రీ మరొకరని తెలిసి, పైగా ఆ స్త్రీ కళ్లెదుటే ఉండి కూడా తానే కన్నతల్లి నన్ను విషయాన్ని అంగీకరించకా, మాతృ ప్రేమని పంచకా దూరంగా జరిగిపోతూ ఉంటే దుర్భరమైన వేదనన నుభవిస్తూ , ప్రేమ పాశానికై రోదిస్తూ ఉంటాడు.
దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి భిక్ష
అన్నెం పున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష
ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డకు ఇది అగ్ని పరీక్ష
ఒడి చేర్చుకోవా అమ్మా నన్ను
గుడిలోని తండ్రే మనకు తీర్పు….
పేగు తెంచి ఒక తల్లి జన్మనిస్తే,
ప్రేమను పంచి మరో తల్లి జీవితాన్నిచ్చింది .
కన్నతల్లికి పెంచి పెద్ద చేయలేకపోయానన్న బాధ, పెంచిన తల్లికి ఎక్కడ తనను వదిలి కన్నతల్లిని వెతుక్కుంటూ వెళతాడేమోనన్న భయం.
రెండు హృదయాల్లోని అమృతభాండాలు తనపై ప్రేమామృతాన్ని కురిపిస్తున్నప్పటికీ ఆ యువకుడి హృదయం వేదనతో అల్లాడి పోతుందే తప్ప ఏ విధమైన ఆనందానికి అతడి హృదయంలో చోటు దక్కడం లేదు.
కారణాలేవైనప్పటికీ తన కన్న బిడ్డను అపురూపంగా పెంచిన ఆ స్త్రీపై ఉన్న ఎల్లలెరుగని కృతజ్ఞతాభావం (ఆమెలోని అభద్రతా భావానికిగానీ, ఆమె కన్నీటికి గానీ తాను ఎంత మాత్రం కారకురాలు కాకూడదని, ఎన్ని జన్మలెత్తినా ఆమె రుణం తీరేది కాదని) గుండెల్లో సుడులు తిరిగే కన్నీటిని కూడా లెక్క చేయకుండా పక్కకు తప్పుకునే విధంగా ఆమెను ప్రేరేపిస్తుంది.
ఇటు పెంచిన హృదయం మానవత్వం మూర్తీభవించిన మహోన్నత శిఖరమే అయినప్పటికీ, అభద్రతాభావంతో బాధపడుతూ, తనకు తాను సర్ది చెప్పుకోనూలేక , అవతలి వైపు ఉన్న ఆ స్త్రీ (కన్నతల్లి) పై కారుణ్యాన్ని తట్టుకోనూలేక విలవిల్లాడిపోతూ ఉంటుంది.
మంచితనం , మానవత్వం కలగలిసిన ఈ ముగ్గురినీ బ్యాలెన్స్ చేసే పాత్రలో కైకాల సత్యనారాయణ గారు అద్భుతంగా రాణించారు.
దేవకియశోదమ్మల మధ్య నలిగిపోయే అభినవ కృష్ణులెందరో మన మధ్య తిరుగుతూనే ఉంటారు. ఇటువంటి సంఘటనలు మన బంధువర్గంలో గానీ, ఇరుగుపొరుగు ఇళ్లలో గానీ మనం చూస్తూనే ఉంటాం.
కొన్ని సందర్భాల్లో పిల్లలు లోలోపల బాధ పడినప్పటికీ, విషయాన్ని మౌనంగా అంగీకరించి , క్రమంగా మామూలు స్థితికి వస్తారు, మరికొందరు పిల్లలు హఠాత్తుగా తెలిసిన విషయాన్ని జీర్ణించుకోలేక, నానా గందరగోళం సృష్టించి, కాస్త నెమ్మదిగా శాంతిస్తారు (అంగీకరిస్తారు).
కానీ సంతోషించాల్సిన విషయమేమిటంటే , నాకు తెలిసినంతవరకు ఎక్కడ కూడా పిల్లలు పెంచిన ప్రేమను తుంగలో తొక్కి వెళ్లిన సందర్భాలూ లేవు , కన్న తల్లిదండ్రులని (తమను వదిలేశారని) ద్వేషించిన సందర్భాలూ లేవు.
మొదట్లో అనుశ్చితికి గురైనా, క్రమక్రమంగా విషయాన్ని అర్థం చేసుకొని రెండు వైపులా బంధాలను సమన్వయం చేసుకున్న చిన్నారులను మనం చూస్తూ ఉంటాం.
ఈ రకమైన సమస్య తలెత్తిన చోట బంధువులు , ఇరుగు పొరుగు వారు అత్యంత సమయస్ఫూర్తితో, సుతి మెత్తగా ఆ పసి మనసులను సాంత్వన పరిచిన తీరు , మానవతా దారుల వెంట నడుస్తున్న మనుషులు రేపటి తరానికి తీయని ఫలాలను అందించే విత్తనాలు అవుతున్నారనే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది.
పాటలోని సాహిత్యానికి అనుగుణంగా హావభావాలను ఒలికించిన కృష్ణంరాజు గారి నేత్రద్వయం, ఆర్తిని పలికించిన బాలసుబ్రహ్మణ్యంగారి గళం, ఈ రెండింటికి అంజలీదేవి గారి నటన తోడై పాటను అజరామరం చేశాయి.
చిత్ర దర్శకనిర్మాతలకు, తారాగణానికి, గాయకులకు, గీత రచయితకు, సాంకేతిక బృందానికి, అందరికీ పేరుపేరునా వందనాలు.
( ‘మదర్స్ డే ‘ ని పురస్కరించుకుని)