ఇద్దరు వర్ణ వాళ్ళ ఇంటికి వచ్చారు …అక్కడ వర్ణ అమ్మగారు చేసిన వంటలు అన్ని ఎంతో ఇష్టంగా తిన్నది సౌదామిని…
ఇద్దరు మళ్లీ కలుసుకుందామని అనుకున్నారు.. వర్ణ కూడా గోపాలపురం వస్తానని చెప్పింది..
సౌదామిని ఇంటికి వచ్చి తెల్లవారి గోపాలపురం వెళ్లడానికి తన బట్టలు అన్ని సర్దుకుంది. ఆరోజు తల్లి విజయమ్మ దగ్గర పడుకొని సౌదామిని ఎంతో సేపు మాట్లాడింది అదే సందర్భంలో చూచాయగా సాగర్ గురించి చెప్పింది. నీలాంబరి కుటుంబం అంటే రవీంద్ర మరియు విజయమ్మకు కూడా ప్రత్యేకమైన అభిమానం. అందుకని విజయమ్మ విషయం కొంతవరకు గ్రహించింది సంతోషాన్ని వ్యక్తపరిచింది ..అది గమనించిన సౌదామిని మనసు కొంచెం తేలికయ్యింది .. తండ్రి కూడా ఒప్పుకుంటాడని ధైర్యం వచ్చింది.
తెల్లవారి లేచి నిత్య కృత్యాలు తీర్చుకొని టిఫిన్ చేసి గోపాలపురం వెళ్లడానికి తయారయ్యింది వర్ణ…
రవీంద్ర వచ్చి “సౌదామినీ! నేను కార్లో నిన్ను అక్కడి వరకు డ్రాప్ చేసి వస్తాను “అని చెప్పాడు..
” వద్దు నాన్న బోలెడన్ని బస్సులున్నాయి.. నేను బస్సులో వెళ్తాను’ అని చెప్పి తన బ్యాగ్ తీసుకుంది..
రవీంద్ర బస్ స్టాప్ వరకు వచ్చి బస్సు ఎక్కించి ఇంటికి వెళ్లిపోయాడు.
సౌదామిని గోపాలపురం చేరేవరకు మధ్యాహ్నం రెండు గంటలు అయింది. గడికి వెళ్లే వరకు మరో అరగంట పట్టింది.
ఇంట్లోకి వెళ్లిన సౌదామినికి సౌందర్యలహరి గుక్క పట్టి ఏడుస్తున్న శబ్దం వినిపించింది… గబగబా లోపలికి పరిగెత్తింది సౌదామిని.
సుధీర్ ఆఫీస్ మీటింగ్ లో ఉన్నాడు అక్కడ ఎవరూ కనిపించలేదు.. వెంటనే సౌందర్యాన్ని ఎత్తుకొని వంటింటి వైపు వెళ్తుంటే అలేఖ్య గబ గబ బయటకు వస్తూ కనిపించింది.
” వదినా! సౌందర్య ఒక్కతే ఉంది అక్కడ” అన్నది సౌదామిని.
” ఇప్పుడే ఉగ్గు తీసుకొద్దామని వంటింట్లోకి వెళ్లాను” అని సౌందర్యను చేతిలోకి తీసుకుంది.
” ఓ అలాగా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తుందోనని భయపడిపోయాను” అన్నది సౌదామిని.
” అవునూ నువ్వు వస్తున్నట్లు చెప్పలేదు ఎలా వచ్చావు”? అని అడిగింది అలేఖ్య.
” బస్సులో వచ్చాను.. బస్టాండ్ నుండి ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చాను”అన్నది సౌదామిని.
” ఫోన్ చేయొచ్చు కదా సౌదామినీ బస్టాండ్ కి డ్రైవర్ వచ్చేవాడు కదా” అన్నది అలేఖ్య.
” నేనే అలా సరదాగా నడుచుకుంటూ వచ్చాను ఊళ్ళోకి ఎప్పుడు వెళ్లలేదు కదా అలా వీధులన్నీ చూసుకుంటూ వచ్చాను” అన్నది సౌదామిని.
” సరే నువ్వు వెళ్లి మొహం కళ్ళు చేతులు కడుక్కొని రా భోజనం చేద్దువు గాని మహేశ్వరి వడ్డిస్తుంది” అన్నది అలేఖ్య.
” అత్తయ్య ఎక్కడ ఉంది పడుకున్నారా!” అని అడిగింది సౌదామిని.
” అమ్మకి చాలా జ్వరం రెండు రోజుల్లోనే పూర్తిగా నిరసించిపోయింది” అన్నది అలేఖ్య.
” అయ్యో మొన్న పొద్దున్న నాతో బాగానే మాట్లాడారు జ్వరం ఎప్పుడు వచ్చింది” అన్నది కంగారుగా..
” నీతో ఫోన్లో మాట్లాడేటప్పటికీ కొంచెం జ్వరం ఉంది కానీ ఆ తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది నిన్న రాత్రి నిద్రలో విపరీతమైన కలవరింతలు చాలా భయమేసింది ..ఈరోజు డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్ చేసి సెలైన్ కూడా పెట్టారు ఏమీ తినడం లేదు అందుకని” అన్నది అలేఖ్య బాధగా.
” నేను వెళ్లి చూస్తాను అత్తయ్యను” అని లోపలికి వెళ్లి కాళ్లు చేతులు కడుక్కొని నీలాంబరి గదిలోకి వెళ్ళింది సౌదామిని.
కళ్ళు మూసుకుని పడుకుని ఉంది నీలాంబరి ముఖంలో నీరసం కనిపిస్తుంది. గదిలోకి వెళ్లిన సౌదామిని డిస్టర్బ్ చేయడం ఎందుకని వెనుతిరిగింది.. కళ్ళు తెరిచి చూసిన నీలాంబరి “సౌదామినీ!ఎప్పుడు వచ్చావు ఇలా రా” అని పిలిచింది.
” లేచారా అత్తయ్య .. ఇప్పుడే వచ్చాను” అని దగ్గరికి వెళ్లి నీలాంబరి చేయి పట్టుకుని కూర్చుంది.
” ఏంటి ఇంత సడన్గా జ్వరం వచ్చింది మీకు” అని అడిగింది.
” ఏమో తెలియదు సౌదామినీ! ముందు రోజు పెరట్లో రాత్రి వరకు తిరిగాను ఎందుకో నిద్ర పట్టక చాలాసేపు అక్కడే ఉన్నాను కొంచెం దోమలు కుట్టినట్టు అనిపించింది మరి దానివల్లే జ్వరం వచ్చిందో ఎందుకో తెలియదమ్మా!” అన్నది నీలాంబరి నీరసంగా.
సౌదామిని చేయి పట్టుకుని పల్స్ చూసి డాక్టర్ రాసిచ్చిన మందులను ఒకసారి చెక్ చేసి..
” అవసరమైతే ఈరోజు బ్లడ్ టెస్ట్ చేద్దాము ఇప్పుడైతే టెంపరేచర్ నార్మల్గానే ఉంది కానీ మీరు మంచి ఆహారం తీసుకోవాలి” అని చెప్పింది.
” అలాగే” అంటూ సౌదామిని ముఖం లోకి చూసి చిరునవ్వు నవ్వింది నీలాంబరి.
సౌదామిని లోపలికి వచ్చి బట్టలు మార్చుకొని కంచంలో అన్నం పెట్టుకొని భోజనం చేసింది.
” వదినా! అత్తయ్యకు అవసరం పడితే బ్లడ్ టెస్ట్ చేద్దాం.. సాయంత్రం వరకు నార్మల్ కాకుంటే నేను బ్లడ్ శాంపిల్ తీసుకెళ్లి చేయిస్తాను” అని చెప్పింది
” సరే సౌదామిని సుధీర్ కూడా అదే అన్నాడు ఈవినింగ్ బ్లడ్ టెస్ట్ చేద్దామని ఇంక నువ్వు వచ్చావు కదా నాకు టెన్షన్ లేదు” అన్నది అలేఖ్య సౌందర్యకి ఉగ్గు తినిపిస్తూ..
” టెన్షన్ పడాల్సిన పనేం లేదు వదిన ఇది నార్మల్ ఫీవర్ నాకు తెలిసీ సాయంత్రం వరకు అత్తయ్య మామూలుగా అవుతుంది… నేను బాలసదనం వరకు వెళ్లి వస్తాను.. నాలుగు రోజులుగా వెళ్లలేదు కదా” అన్నది సౌదామిని.
” ప్రయాణం చేసి అలసిపోయావు కదా రేపు వెళ్లొచ్చులే” అన్నది అలేఖ్య.
” చిన్నపిల్లలు కదా వదినా వేరే డాక్టర్ ఉన్నా కూడా సరిపోదు వాళ్లను బాగా చూసుకుంటేనే కదా మనకు తృప్తిగా ఉంటుంది… వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు” అన్నది సౌదామిని.
” నువ్వు అచ్చం అమ్మ లాగానే ఒకసారి కమిట్ అయ్యారంటే ఆ పని కావాల్సిందే! మంచిదే ఇంత మంచి ఆలోచన ఉండడం అభినందించదగ్గ విషయం” అన్నది అలేఖ్య.
” సరే వస్తాను వదిన” అని చెప్పి సౌందర్యాన్ని ముద్దు పెట్టుకుని స్కూటీ మీద బాలసదనం కు బయలుదేరింది సౌదామిని.
ఇంకా ఉంది