విజయది చాలా సింపుల్ జీవితం. పల్లెటూరు, భర్త, ఇరుగమ్మ, పొరుగమ్మ, పెళ్ళై పట్టణాలలో స్థిరపడిన ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి. రోజూ పొద్దున వంటా వార్పు, మధ్యాహ్నం రెండు గంటలు పక్కింటి సమీనాతో కబుర్లు, సాయంత్రం 5 నుంచి 7 వరకు ఊరి చివరిదాకా భర్తతోను సమీనాతోను వాకింగ్, ఎనిమిదింటికి భోజనం, తొమ్మిదింటికి నిద్ర. ప్రతి శుక్రవారం రామాలయం, రెండ్నెల్లకో మారు రాజమండ్రిలో సమీనా కూతురింటికి వెళ్ళటం, ఏమైనా అవసరమైనవి ఉంటే కొనుక్కోవటం, రెండేళ్ళకోసారి పిల్లలింటికి వెళ్ళి ఓ రోజు ఉండటం, మూడేళ్ళకోమారు పిల్లలు ఇంటికొస్తే సరదాగా గడపటం ఇంతే. ఏ విషయం విపరీతంగా ఆలోచించే అలవాటు లేదు. కానీ ఇప్పుడు ఆలోచించాల్సి వచ్చింది.

విజయ, జిల్లా పరిషత్ స్కూల్లో సంగీతం టీచర్ గా చేసి రిటైర్ అయింది. ఆమె భర్త హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. పక్కింటి సమీనా కూడా హెడ్ మిస్ట్రెస్ గా చేసి రిటైర్ అయ్యారు. విడో. ఆమెకు ఒక్కతే కూతురు. బావగారు, తోటికోడలు ఆక్సిడెంట్ లో పోతే, వాళ్ళ ముగ్గురి పిల్లలని తన సొంత పిల్లలు లాగే పెంచింది. ఆ నలుగురూ సమీనా పిల్లలే అనుకుంటారు అందరూ. కూతురు, కొడుకు రాజమండ్రిలో ఉంటారు. మిగతా ఇద్దరు కొడుకులు విజయవాడ లో ఉంటారు. విజయ, సమీనా ఇరుగు పొరుగు కాబట్టి ఒకరి యోగక్షేమాలు ఒకరు చూసుకుంటూ, కాలక్షేపం చేస్తున్నారు.
ఊర్లో ఒకప్పుడు మూడొందల ఇళ్ళ దాకా ఉండేవట. ఇప్పుడో పట్టుమని వంద ఇళ్ళు కూడా లేవు. ఉన్నా ఎక్కువ శాతం భర్త పోయిన భార్యలే. నలభై యాభై ఏళ్ళగా ఎటువంటి రిపేర్లు చేయని ఇళ్ళల్లో తోడుగా ఓ ఆడమనిషిని పెట్టుకుని ఎలాగో బతికేస్తున్నారు. దీనికి కారణం కొంతవరకు పెద్దవారి చాదస్తమైతే, కొంతవరకు పిల్లల అశ్రధ్ధ. కొత్తకు అలవాటుపడలేని పాత బతుకులు. పాతని ఇముడ్చుకోలేని కొత్త పరుగులు.
పిల్లలు ఎన్ని సార్లు పిలిచినా వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి విజయ, విజయ భర్త ఇష్టపడేవారు కాదు. ఒక అబ్బాయి హైద్రాబాద్లో, మిగతా ఇద్దరూ బెంగుళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. ముగ్గురూ పిల్లలకి బాగుంటుందని గేటెడ్ కమ్యూనిటీలలోనే ఉంటున్నారు. మొదటిసారి బెంగుళూరు కొడుకు దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఆ పద్ధతులు అలవాటు చేసుకోవటం ఇద్దరికీ చాలా కష్టం అయింది. చీరలు ఆరేసుకోవటానికి తను పడ్డ ఇబ్బందులు విజయ ఎప్పటికీ మరిచిపోలేదు. చీర బాల్కనీ రైలింగ్ మీద ఆరేస్తే, కింద అపార్టుమెంట్ ఆయన పెద్ద గొడవే చేసాడు. ఆ చీర గాలికి ఎగురుతూ ఉంటే ఆయన కాన్సంట్రేషన్ దెబ్బతింటుందట. అందుకని కోడలు రెండు పంజాబీ డ్రెస్సులు, రెండు నైటీలు కొనిచ్చింది.
అలవాటు లేకపోవటం వలన ఇబ్బందిగా అనిపించినా అలాగే వేసుకుని, మనవడిని పైకి తీసుకురావటానికి కింద ప్లేగ్రౌండ్ కి వెళ్ళినప్పుడు వాడి ఫ్రెండ్స్ మీ ఆయమ్మ వచ్చింది అని అంటుంటే సగం చచ్చిపోయినట్లయింది. అవును మరి, గొప్పోళ్ళ భవంతులాయే, ఎంత తక్కువ బట్టలేసుకుంటే అంత ఆస్థిపరులన్నట్లు, ఒంటి నిండా కప్పుకునేవాళ్ళు పేదవాళ్ళు అన్నట్లు కమ్యూనిటీ పిల్లలకి అర్థం అయింది. ఇంకా చాలామంది తన వయస్సు వాళ్ళే వాళ్ళ మనవళ్ళని మోయలేక మోస్తూ, వెనక పరుగులుతీస్తూ ఆడిస్తుంటే, ఇదేం జీవితంరా బాబోయ్ అని భయపడిపోయింది.
అక్కడ్నుంచి కూతురు దగ్గరికి వెళ్ళటానికి 4 గంటలు పట్టింది, ప్రయాణం ఓ గంట, ట్రాఫిక్ లో మూడు గంటలు! అటూ ఇటు తిరగలేమని చెప్పి అక్కడే ఓ రెండు రోజులు ఉన్నారు. కూతురు కొడుకు చిన్న పిల్లాడు. స్కూల్ బస్సు కమ్యూనిటీ లోపలికే వస్తుంది. కూతురు చెప్పింది కదా అని ఆ రోజు వాడిని బస్సు దగ్గర దింపటానికి ఇద్దరూ బయల్దేరారు. తాతగారు వెళ్ళనని మొరాయిస్తున్న పిల్లవాడిని ఎత్తుకుని, అమ్మమ్మ వాడి స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్ మోసుకుంటూ బస్సు బే దాక వెళ్ళారు. కూతురు, అల్లుడు, ఇంతకు ముందు ఓ అమ్మాయిని పెట్టుకున్నారు ఈ పనులు చేయటానికి. ఇప్పుడు అమ్మమ్మ తాతగార్లకు బోర్ కొట్టకుండా ఉండటానికి వాళ్ళకి అప్పగించారు. “ఈ బ్యాగ్లు మోయలేను, ఈ తిండి తినలేనని వెంటనే ఊరు వెళ్ళిపోదాం” అని, మొదటి రోజు రాత్రే విజయ భర్త దగ్గర ఏడ్చేసింది. మొహమాటానికి ఇంకో రోజు ఉండి ఆ రాత్రే ఊరికి బయల్దేరారు.
తరువాత రెండో కొడుకు దగ్గరికి హైదరాబాద్ వెళ్ళారు. తెలుగు రాష్ట్రమే కదా బాగానే ఉండొచ్చు అనుకున్నారు. కొడుకు, కోడలు ఇద్దరూ ఉద్యోగాలే. పిల్లలు లేరు. ఇంట్లో పనికి ఓ మనిషి, వంటకి ఓ మనిషి, కుక్కల్ని తిప్పటానికి ఇంకో మనిషి సాయంత్రం వస్తాడు. వాళ్ళ కిచ్చే జీతాలు విన్నపుడు ఓ చిన్న షాక్. నెల మెయింటెనెన్స్ పది వేలు, పనివాళ్ళకి ఇరవై వేలు. ఓ కుటుంబం బతికేయచ్చు! ఇవి కాక హౌస్ లోన్లు, ఇఎంఐలు, క్రెడిట్ కార్డులు, లగ్జరీస్, లావిష్ లైఫ్ స్టయిల్స్. పిల్లల లైఫ్ స్టైల్ దగ్గర్నుంచి చూసి దూరంగా ఉంటేనే బెటర్ అనుకుని వచ్చేసారు.
అనుకోకుండా హార్ట్ అటాక్ తో భర్త పోయేసరికి విజయకి జీవితం తలకిందులైనట్లు అనిపించింది. పిల్లలు వెంటనే వచ్చారు. కార్యక్రమాలు ఐదో రోజే ముగించేశారు. లీవ్ వన్ వీకే తీసుకున్నారట. ఆ తరువాత మొదలయింది షో. అమ్మని ఏం చేయాలి? ముగ్గురు పిల్లలున్నాం, ఊర్లో ఒక్కదాన్నే ఎలా వదిలేస్తాం? నలుగురూ ఏమనుకుంటారు? పెద్దకోడలు, “మీకు చేంజ్ చాలా అవసరం అత్తయ్యా, ఇప్పటికైనా మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, డైట్ మెయింటైన్ చేయండి, ఆక్టివ్ గా ఉండాలి, మా కమ్యూనిటీలో జిమ్, జుంబా ఉన్నాయి, మీకు చాలా నచ్చుతుంది,” అన్నది. రెండో కోడలు, “మీరు డైట్ ఫాలో అవ్వాలంటే మంచి డైటీషియన్ అవసరం, నా డైటీషియన్ బాగా చూస్తుంది, నేను గత నాలుగేళ్ళలో ఓ కిలో కూడా వెయిట్ ఫుట్ ఆన్ చేయలేదు,” అన్నది. కూతురు, “అమ్మా, నీకు నా కొడుకుతోనే మంచి ఎక్సరసైజ్ అవుతుంది. మంచి టైంపాస్ కూడా, నువ్వు నా దగ్గరకే వచ్చేయ్,” అన్నది.
ముగ్గురూ అమ్మని తీసుకుపోదామనే నిర్ణయం తీసుకున్నారు. ఎంతకో అంతకు ఇల్లు, ఉన్న రెండెకరాలు అమ్మేసి, ఊరికి గుడ్ బై చెప్పేయమని అంటున్నారు. కూతురు, “అమ్మని నేనే చూసుకుంటా, అమ్మకి నా దగ్గరే బాగుంటుంది, అమ్మని నేను చూసుకుంటాను కాబట్టి, ఇల్లు, పొలం అమ్మిన డబ్బులు నాకే రావాలి” అని అన్నది. అది విన్న పెద్ద కోడలు గయ్ మని లేచింది. తల్లి పెద్ద కొడుకు దగ్గరే ఉండాలని, అయినా ఇల్లు, పొలం అమ్మితే ఈ పల్లెటూరిలో ఏమాత్రం వస్తుంది, ఆ డబ్బులు అమ్మ పేరు మీదే డిపాజిట్ చేస్తాం, ఆవిడకి ఆరోగ్యం బాగో లేనప్పుడు పనికొస్తాయి అన్నది. రెండో కోడలు, “మా ఇంట్లో ఏ పనీ ఉండదు, అత్తగారు ఫుల్ రెస్ట్ తీసుకోవచ్చు, ఆ డబ్బులేవో మాకు హోసింగ్ లోన్ తగ్గించుకోవటానికి పనికి వస్తాయి కదా” అన్నది.
ఇలా ఎవరి మనసులో మాట వాళ్ళు చెబుతుంటే, అర్థం అయ్యిందేమంటే, ఊరిలో కాబట్టి, ఇంటికి పొలానికి ఎక్కువ డబ్బులేమీ రావు. అమ్మని చూసుకుంటున్నాం కాబట్టి ఆ వచ్చిన డబ్బులేవో చూసుకున్న వాళ్ళకే చెందుతాయి. ఈ విషయాలన్నీ ఓ రోజులో తేలిపోతే వెంటనే ఎవరి ఊర్లకు వారు బయల్దేరవచ్చు. అమ్మ ఒక్కతే అయిపోయింది కాబట్టి జిమ్ కెళుతూనో, డైటింగ్ చేస్తూనో, పిల్లల్ని చూసుకుంటూనో గడిపేయచ్చు.
విజయకి ఒక్క విషయం బాగా అర్థం అయ్యింది. ఊరు కాదు చిన్నగా ఉన్నది, మనుషుల మనస్సులేనని. ఇంతకు మునుపెప్పుడూ పట్టించుకోని విషయాలు తన దాకా వచ్చేసరికి ఆలోచన మొదలయ్యింది.
మధ్యాహ్నం పూట భోజనాలయ్యాక సమీనా వచ్చింది. సమీనాని చూడగానే భోరుమని ఏడ్చింది. భర్తతో కలిసి బతికిన నలభై ఐదేళ్ళ స్మృతులు, స్మృతులుగానే మిగులుతాయని, ఆయన ఇంక లేరని, తను ఒంటరి ప్రయాణం చేయక తప్పదని అర్థమైన విజయని ఊరడించటం సమీనా వల్ల కాలేదు. మెల్లగా తనే కంట్రోల్ చేసుకుని, పిల్లల మనోభావాలు ఆవిడతో ఏకరువు పెట్టుకుంది. సమీనా ఏమీ మాట్లాడలేదు. ఈ లోపు పిల్లలు కూడా తల్లి దగ్గిరకి వచ్చారు, “మీరైనా మా అమ్మకి చెప్పండి ఆంటీ, ఇరవై నాలుగు గంటలూ ఏడుస్తూ కూర్చుంటే ఆరోగ్యం ఏం కావాలి? పోయిన మనిషి తిరిగి రారు కదా. ఈ పల్లెటూరిలో ఏముంది? మా దగ్గర ఉంటె మేము చూసుకుంటాం కదా. పద్దాక సెలవలు పెట్టుకుని రాలేము. ఈ ప్రాపర్టీస్ ఫైనల్ చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. నాన్నగారు ఉన్నపుడు అయితే వేరు. ఒకరికి ఒకరు ఉండేవారు. ఇప్పుడు ఒక్కతే అయిపోయింది కదా. బలవంతం ఏమీ లేదు, తనకి నచ్చిన వాళ్ళ దగ్గరే ఉండమనండి. లేదా ముగ్గురం ఉన్నాం కదా, నాలుగు నెలలు ఒక్కొక్కరి ఇంట్లో గడిపినా అయిపోతుంది.”
“నలభై ఐదేళ్ళ బంధం తెగిపోతే ఏడవకుండా ఎలా ఉంటుంది? ఏడిస్తే ఆ బాధ తగ్గుతుంది. మీ అమ్మ చిన్న పిల్ల కాదు కదా, తనకి ఏం కావాలో తను డిసైడ్ చేసుకుంటుంది. నేను ఎవరిని చెప్పటానికి?” అని సమీనా అన్నది.
“రేపేదో రోగం వచ్చి ముదిరి పోతే మా వల్ల కాదు ఇక్కడికి పరిగెట్టుకుంటూ రావటానికి,” మనసులో మాట బయట పెట్టింది రెండో కోడలు.
“ఇప్పట్నుంచే ఆరోగ్యాలు చూసుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు,” పెద్ద కోడలు వత్తాస్సు పలికింది.
ఏమంటే ఏమవుతుందనో కూతురు నోరు తెరవలేదు.
సమీనా నిట్టూర్చింది. వాళ్ళు వెళ్ళిపోయింతరువాత, “బాగా ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రా, తొందర పడకు, నీకు ఎం కావాలో నువ్వే ఆలోచించుకోవాలి, నీ గురించి ఎవరూ ఆలోచించరు,” అని చెప్పి ఆవిడా వెళ్లిపోయింది.
విజయ ఆలోచిస్తూ ఉండిపోయింది. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఒంటి గంటకు తలనొప్పికి తాళలేక కాఫీ కలుపుకుందామని, పాలు పోసే గంగరాజుకి ఫోన్ చేసింది. ఏమనుకున్నాడో ఏమో గంగరాజు ఓ పది నిమిషాల్లో వెచ్చటి పాలు తీసుకుని వచ్చాడు. వచ్చి వసారాలో మెట్ల మీద కూర్చుని, “ఏమ్మా, పిల్లలతో వెళ్ళిపోతారంట కదా, అందరూ చెప్పుకుంటున్నారు,” అని అడిగాడు. “ఇంకా ఏమీ అనుకోలేదు గంగరాజు, ఉండు నీక్కూడా కాఫీ కలుపుతా” అని వంటింట్లో కెళ్ళింది. పక్క ఇంటి వసారాలో లైట్ వెలగటం చూసి సమీనా బయటికి వచ్చింది. ముగ్గురూ కూర్చుని కాఫీ తాగి ఊరిలో వచ్చిన మార్పులు నెమరేసుకోసాగారు.
నల్లటి రాత్రి, ఒకే ఒక్క వీధి లైట్, ఆకాశంలో సగం చందమామ, పక్కన నా అనుకున్నవాళ్ళు, చేతిలో కాఫీ గ్లాసులు, గాలిలో సప్తపర్ణి సువాసనలు. ఇంతకన్నా జీవితానికి ఏం కావాలి? ఇంకా ఏమిచ్చినా బోనసే. ఇంటి పక్కన సప్తపర్ణి ఎంత సహజంగా, ఎంత అందంగా ఉంటుంది. విజయ పెళ్ళప్పుడు, చిన్న మొక్క. ఇప్పుడో మహా వృక్షం అయింది. జనవరి నుంచి తొమ్మిది నెలలు నిండగానే అక్టోబర్ లో, చెట్టు నిండా పువ్వులే, సాయంత్రం అయితే ఇంక వీథి అంతా సౌరభాలే. ఎక్కడ గాటు పెడితే అక్కడే చిగురిస్తుంది. దీన్ని ఎలా వదులుకోగలదు?
సమీనా వాళ్ళ ఇంట్లో ఇటువంటి ప్రాబ్లెమ్ ఎప్పుడూ లేదు. పిల్లలు చిన్న చిన్న ఇళ్ళలోనే ఉంటారు. కానీ మనసు మాత్రం విశాలం. ఎవరింటికైనా ఎప్పుడైనా వెళ్ళచ్చు. సమీనాని రమ్మనరు, పొమ్మనరు. ఇల్లు వాటాలు కూడా అడగరు. వాళ్ళకున్నంతలో సంతోషంగా ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు కారు బుక్ చేసి సమీనాతో పాటు విజయ వాళ్ళని కూడా అక్కడికి ఇక్కడికి సరదాగా తీసుకెళ్ళేవాళ్ళు. గుళ్ళకీ వెళ్ళారు, దర్గాలకి వెళ్ళారు.
ఓ అరగంట కూర్చుని సమీనా, గంగరాజు వెళ్ళిపోయారు. ఇలాంటివాళ్ళు నాకు సిటీలో దొరుకుతారా అని విజయ ఆలోచనలో పడింది. స్విగ్గీ మీద బతికే పిల్లలకి స్నేహం విలువేం తెలుస్తుంది అనుకుని నిట్టూర్చింది. పిల్లలు ఎవరి గదిలో వాళ్ళు తలుపులు పెట్టుకుని పడుకున్నారు. తన గదిలోకి వెళ్ళిన తరువాత కూడా విజయకి ఆలోచనలు వదలలేదు. ఆ ఇంటికి విజయ వచ్చి నలభై ఐదు ఏళ్ళు అయింది. తన పెళ్ళి కాగానే కాపురానికి వచ్చినపుడు, ఇంట్లో నాలుగు గదులే. ఇప్పుడో, రెనొవేట్ చేసి, పైన ఓ నాలుగు గదులు వేసి అద్దెకు ఇచ్చారు. కింద విశాలంగా హాల్, కిచెన్ కట్టి, అటాచడ్ బాత్రూములు కట్టారు. మొక్కలంటే ప్రాణం కనుక చుట్టూరా మొక్కలూ, చెట్లే. ఒకటని కాదు, కూరగాయలకు గాని, పండ్లకి గాని బయటకు వెళ్ళాల్సిన పనే లేదు. ఏ కాలం పళ్ళు ఆ కాలంలో చక్కగా పండుతాయి. తాము తినగా, ఊరిలో తెలిసినవారందరికి పంచేవాళ్ళు.
ఊరిపక్కన సాగే ఎర్ర కాలువే ఒక్కపుడు మంచినీళ్ళకు ఆధారం. ఇప్పుడు ఊరిలోకూడా వాటర్ క్యాన్లు సప్లై చేస్తున్నారు. ఊరిని, పాత తరాన్ని వదిలేసి కొత్త తరం వలస వెళ్ళిపోతుంది. ఏ రెండు మూడేళ్ళకో ఓ సారి రాక, రాక తప్పనపుడు. కొన్ని ఇళ్ళు పరిరక్షణ చేసే వాళ్ళు లేక పాడైపోయాయి. శిధిలాలు మాత్రమే మిగిలాయి. ఊరిలో ఏం తక్కువో విజయకి ఎంత ఆలోచించినా పాలుపోలేదు. కాలుష్యరహితమైన గాలి, తిండి, మనసులు పుష్కలంగా లభిస్తుంటే జనాలు బయటకెందుకు పరిగెడుతున్నా రో అర్థం కావటం లేదు. కొత్త తరం కోరుకునే కొత్తలో ఏముందో? రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు తగలేసి, అప్పులు చేసి బతికే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమిటో? ఇంట్లో మనిషికి మనిషికి సంబంధం లేని జీవితాలు, జీతాల పై ఉన్న శ్రద్ధ భావి తరాల మనుగడపై ఉండదు.
“నన్ను ఏడవద్దని చెప్పటానికి వీళ్ళు ఎవరు? నా భర్త పోతే ఏడ్చే హక్కు కూడా నాకు లేదా? ఆ దుఃఖానంతా గుండెల్లో దిగమింగుకుని ఉండాలా? ఎందుకు? నలభై ఐదు ఏళ్ళు నేను ఇంట్లో చాకిరీ చేసి, పిల్లల్ని పెంచి, పెళ్ళిళ్ళు చేసిన తరువాత, నన్ను ఇల్లు అమ్మేయమని చెప్పటానికి వీళ్ళు ఎవరు? ఈ ఇంటి మీద నాకేం హక్కు లేదా? సమీనా చెప్పింది కరెక్టు. నేను కదా నిర్ణయం తీసుకోవాలి. నాకు అరవై ఆరు ఏళ్ళు. నాకు ఒకరు చెప్పేదేంటి? నేను కదా నాకు ఏది మంచో డిసైడ్ చేసుకోవాల్సింది. వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఇప్పుడు రమ్మంటున్నారు. రేపు నేను మంచాన పడితే, డాక్టర్లు, హాస్పిటళ్ళు అని తిప్పుతారా? ఈ పల్లెటూరే నయం కదా, అందరూ డాక్టర్ దగ్గిరకి తీసుకెళ్దాం అనుకునే లోపే ఎంచక్కా పోవచ్చు. ఇంత కాలం బాగానే బతికాను, ఉంటేనేం, పోతేనేం? దానికి హాస్పిటళ్ళకి డబ్బులు పోసి, నన్ను నరకయాతన పెట్టటం ఎందుకు?
ఆ ఆకాశ సౌధాల్లో కూర్చుని, ఆయమ్మని అనిపించుకుంటూ, ఎవరితోనూ సంబంధాలు లేకుండా ఎలా గడపాలి? ఆ పిల్లల చాకిరీ ఈ వయసులో నాకెంత కష్టం? తల్లితండ్రులకే కష్టం అనిపిస్తుంటే, నా కెలా ఉంటుంది? చివరికి ఇంటి ముందు చెట్ల రూపు రేఖలు వారికి నచ్చినట్లు మార్చి, ఇదే అందం అని భ్రమలో ఉంటారు. గాలికి, వానకి, చలికి, ఎదురొడ్డి నిలిచే మొక్క తత్వమే వేరు. ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచి ఓ అద్భుత ప్రకృతి సౌందర్యంగా పరివర్తనం చెందే వృక్షం మహాజ్ఞాని. కుక్కల్ని మనుషులని సమానంగా చూస్తారు. కాదు కాదు, కుక్కలకే ప్రాధాన్యం ఎక్కువ. ఈ వయసులో లైఫ్ స్టైల్ మార్చుకుని కొత్త అలవాట్లు ఏం నేర్చుకుంటాను? మహా అయితే ఇంకో ఐదో పదో ఏళ్ళు బతుకుతాను, అంతే కదా. నాకు రోగం వస్తుందేమోనని, చూసేవాళ్ళు ఎవరూ ఉండరని, ఇప్పట్నుంచే వాళ్ళ దగ్గరకి వెళ్ళి రోజూ చస్తూ ఎందుకు బతకాలి? పోవటం ఖాయం. బతికినన్నాళ్ళు ఇక్కడే బతికి, పోతా. ”
“ఊర్లో సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కనిపిస్తాడు, చుక్కలు లెక్కెట్టొచ్చు. పక్కన ఎర్ర కాలువ, ఎప్పుడైనా గోపిని పిలుస్తే, వాడి పడవలో గోదారి దాకా తీసుకెళ్తాడు. ఓ రోజు ఒకళింట్లో, ఇంకో రోజు ఇంకొకరింట్లో భోజనాలు చేయచ్చు. చేసుకోలేని రోజు ఏ అమ్మయినా ఓ గ్లాసు బియ్యం పోసి వండి పెడుతుంది. మామిడి తోటల్లోకి వనభోజనాల కెళ్ళచ్చు. రిటైర్డ్ జనాభా ఈ మధ్యే ఇండోర్ గేమ్స్ ప్రారంభించారు, షటిల్ కోర్ట్ కూడా గీసారు. అంతా రూపాయి ఖర్చు లేకుండానే. కోట్లు పెట్టి కొన్న ఆ డబ్బా ఇళ్ళలో ఈ ఫెసిలిటీస్ ఏవి? రూపాయి చెల్లిస్తే కానీ ఏ ఫెసిలిటీ దొరకదు. ఇక్కడ అర్థరాత్రి కూడా వెచ్చని పాలు దొరుకుతాయి, పక్కన కూర్చుని మాట్లాడే నేస్తాలుంటారు. జున్ను పాలు, మామిడి కాయలు, మామిడి పండ్లు అడకున్నా తెచ్చి ఇస్తారు. ‘మా కార్లో రాజమండ్రో, విజయవాడో వెళ్తున్నాం, వస్తారా’ అని అడిగి తీసుకెళ్తారు. ”
“ఈ ఇంటికి నేను పెట్టిన శ్రమ ఎంత? నలభై ఐదు ఏళ్ళ శ్రమ ధారపోశాను. ఈ ఇల్లు, నాది అనుకుని నేను పడ్డ కష్టం, నేను ఇష్టంగా పెంచుకున్న బంధం. ఈ ఇంటి ఇల్లాలిని నేను. ‘ఇల్లు అమ్మేయి’ అనటానికి వీళ్ళు ఎవరు? నాకేం కావాలో, నా ఇష్టాలేమిటో తెలుసుకోటానికి ఇష్టపడని నా పిల్లలు, నన్ను వంతులు వేసుకుని చూసుకుంటారట. అలా బతకటం నాకెందుకు ఇష్టం అనుకుంటున్నారు? నా భర్త లేడనా? నేను ఇంకా బతికే ఉన్నానుగా, నాకు ఇష్టాలు ఉండవా, ఉండకూడదా? అదేమిటో తల్లీ తండ్రి అవసరం అయిపోగానే, వాళ్ళ జీవితాలు ఎలా గడపాలో ఈ పిల్లలు డిసైడ్ చేస్తారు. వాళ్ళని పెంచిన తల్లీ తండ్రికి తమ జీవితాలు ఎలా గడపాలనే అవగాహన ఉండదని వారి నమ్మకమేమో. దేశంలో చాలా శాతం తల్లీ తండ్రి ఎదురుకునే సమస్యే ఇది. పిల్లలు పెరగగానే, ఆస్తులు అమ్మించి తల్లీ తండ్రులను సిటీలకి తీసుకుపోతారు. వాళ్ళు అక్కడ ఉండలేక విలవిలలాడ్తారు. ఇంకొంత మంది అసలు తల్లీ తండ్రినే పట్టించుకోరు. తల్లీ తండ్రులు కూడా ఓ రకమైన లైఫ్ స్టైల్ కి అలవాటుపడ్డారని, వీలైతే వారికి సాయంగా ఉండాలని అర్థం చేసుకోరు. ఎప్పుడూ ‘రోగం వస్తే ఎలా? మేము చూసుకోలేం?’ అని గొణుక్కోవటమే తప్ప. తల్లీ తండ్రులు కూడా అలాగే ఆలోచించి పిల్లల్ని కనకపోతే వీళ్ళు ఎక్కడ ఉండేవారు? ఇప్పటి భార్యాభర్తలు అలాగే ఆలోచిస్తున్నారు కూడా.”
“తను కస్టపడి తీర్చిదిద్దిన ఇంటి నుంచి తాను పెంచిన పిల్లలే వెళ్ళగొట్టటం అనేది ఏ తల్లీ తండ్రికి రాకూడని సమస్య. ఓ తల్లినే గాని తండ్రినే గాని శాసించే హక్కు పిల్లలకి లేదు. ఇల్లు నాది, నాకిక్కడ ఉండటం ఇష్టం. నన్ను సపోర్ట్ చేయగలిగితే చేయండి. లేదా వదిలేయండి. నాకు పెన్షన్ వస్తుంది. మీకు లాగా నాకు ఖర్చులు లేవు, అప్పులు లేవు. చేసుకున్నంత కాలం చేసుకుంటా, లేకపోతే ఓ మనిషిని తోడు పెట్టుకుంటా. మీ ఆకాశ సౌధాలలో అవకాశవాదుల మధ్య అవమానాలు, వయసుకి మించిన భారాలు, నాకు తగని మార్పులు చేసుకోవటం నా వల్ల కాదు. ఎవరి కోసం, ఎందు కోసం? నేను నా కోసం బతకాలని అనుకుంటున్నా. నా ఇష్టప్రకారం బతకాలని అనుకుంటున్నా. నన్నిలా బతకనివ్వండి.”
ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చాక గానీ విజయకి నిద్ర పట్టలేదు. రేపు పిల్లలతో తన నిర్ణయం చెప్పాలని అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. మర్నాడు పొద్దునే లేసి భర్త కిష్టమైన రవ్వ కేసరి, పెసరట్లు, ఉప్మా చేసింది. భర్త ఫోటో దగ్గర పెట్టి దణ్ణం పెట్టుకుని పిల్లల్ని పిలిచింది. “ఒరేయ్, నేను గోదాట్లోనూ, కృష్ణ లోనూ మీ నాన్న అస్తికలు కలుపుదామనుకుంటున్నా. ఆ తరువాత కాశీకి వెళ్ళాలని ఉంది. సాయానికి సమీనా, సమీనా పిల్లలూ ఉన్నారు. ఈ పనులు పూర్తి అయిన తరువాత వీలు చూసుకుని మీ ఇళ్ళకి వస్తా. రేపో మాపో పోయేదాన్ని, నన్ను ఈ వయసులో ఇబ్బంది పెట్టొద్దు. నాకిక్కడే ఉండాలని ఉంది. కుదరకపోతే అప్పుడు చూద్దాం.” అని తన నిర్ణయాన్ని నిస్సంకోచంగా తెలియచెప్పింది.