శివరాత్రి !!

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక వ్యాసం

శివరాత్రి పండగను ఫాల్గుణమాసం కృష్ణపక్షంలో మాఘ చతుర్దశి (14వ రోజున) జరుపుకుంటాం!
ఆది దేవుని అర్చించుకునే గొప్ప పండుగ శివరాత్రి. ఎందుకంటే? ఆది-అంతమూ తెలియని విరాట్ రూపంలో ఉన్న శివుడు పార్వతీదేవి యొక్క గొప్పతపస్సుకు మెచ్చి, లోకకల్యాణం కోసం వివాహం చేసుకున్న ఆ సమయంలో శివతత్త్వం భూమిని తాకుతుంది. శివతత్త్వం- ప్రకాశం మహాశివరాత్రి రోజు భూమి మూలకాన్ని తాకుతుంది కనుక ఆరోజు శివ సన్నిధిలో గడిపితే అత్యంత చైతన్యవంతులవుతారనీ, అలా ఎరుక కలిగిన వారు శివతత్త్వంలో ప్రశాంతతను పొందుతారనీ, అదే శరణు పొందడమనీ, లేదా శివుడిని ఆశ్రయించడమనీ పెద్దలు చెప్తారు.
ఈ శాంతి మూడు రకాలుగా ఉంటుంది
1-భౌతికశాంతి ;
2 మానసిక శాంతి;
3 ఆత్మ శాంతి…
ఈ మూడు పొందడానికి ఆధ్యాత్మికమార్గంలో నడుచుకునేవారు నియమనిష్టలతో స్నానం, ఉపవాసం, ధ్యానం వంటి వాటిని ఆచరించి ఈ ప్రశాంతతను పొందుతారు.
ఓం నమశ్శివాయ ( పంచాక్షరి) అంటే చాలు
మనసులోని భయాలు తొలగిపోయి, ప్రశాంతత ఏర్పడుతుంది. కానీ ఈ పంచాక్షరిని లింగం దగ్గరే స్మరించాలి! శివుని ప్రతిమ దగ్గర ఉచ్ఛరించకూడదు! ఇతర స్తోత్రాలు పఠించుకోవచ్చును. గర్భగుడిలోని శివలింగాన్ని స్వయంగా పూజిస్తే ధర్మపరమైన కోర్కెలు వెంటనే సిద్ధిస్తాయి.
శివ పార్వతుల వివాహమంటేనే చైతన్యం… స్తబ్దంగా ఉన్న ప్రకృతి మూలమైన భూమిని చేరడం… ఎందుకంటే శివుడంటే ఒక లింగాకారమో, లేక విగ్రహరూపమో అంత మాత్రమే కాదు! ఈ జగత్తులో అణువణువునా చైతన్య రూపంలోనిండి ఉన్నాడు.
సాధకులు శివుడిని మూడు దశలలో కొలుస్తారు ఒకటేమో రూపమే లేని వాడిగా , రెండు సుందరరూపుడుగా, మూడు నిరాకారం నుండి లింగ రూపంలో ఉద్భవించేగా సరూపంగా కొలుస్తారు!
శివుడికి శరీరమే లేదని భక్తులకు అర్థమయ్యేందుకు అగమ్యగోచరుడైన ఆ అనంతమైన దైవత్త్వాన్ని ఒక లింగాకార రూపంగా చూపెడతారని అందుకే
విరూపే- భ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమః అని వేద మంత్రం చెప్తుంది. ఏ రూపంగా కొలచినా తలచినా మనస్పూర్తిగా తలిస్తే చాలు ! భోళాశంకరుడు బోలెడు వరాలిస్తాడు.
శివుడు అంటేనే అంతటా నిండి ఉన్న ఒక చైతన్యం లేదా ఒక శక్తి! ఈ విశ్వం అనంతం! అందులో వ్యాపించిన శివతత్త్వం కూడా అనంతమే!


శివ శబ్దానికి ప్రశాంతమని, పాపరహితమని, దయగలవాడని అర్థం.
మరి ఆయన నివసించే చోటు కైలాసమని అందరికీ తెలుసు! కైలాసం అంటేనే ఆనందం. ఆ ఆనందం ఎలా వస్తుందంటే శివతత్త్వాన్ని తెలుసుకొని, ఆచరిస్తే ప్రతి ఇల్లూ కైలాసమే!
( మనలో శివుడు ఉంటే మనం… లేకుంటే శవం అని అంటారు కదా!) అలాగే ప్రకృతిలో ఏ చైతన్యమైనా శివుని వల్లే అలా ఉండగలుగుతుంది. ఈ తత్త్వాన్ని తెలుసుకుంటే మనం చక్కగా మనగలం.
ఈ శివరాత్రి సందర్భంగా శివుడు ఏం చెప్తున్నాడు? అని ఒకసారి ఆలోచిస్తే ఆయనను కొలవడం కేవలం కోరికలను కోరడం కోసమే కాదని, ఆయన ఆచరించి చూపిన మార్గాన నడిచి మనము మనలను ఉద్ధరించుకోవాలి! అని చెప్పే పండుగ శివరాత్రి.
శివుడి తత్త్వాలలో ముఖ్యమైనది త్యాగం, సేవ! ఆయన దగ్గరగా ఉంటూ.. ఈ త్యాగ గుణం మనం అలవర్చుకుంటే మనని మనం మంచి మనుషులుగా మలుచుకోగలుగుతాం! అంటే దేన్నైనా వదులుకొనేందుకు సిద్ధంగా ఉండాలి!
దీనికో నిదర్శనం సముద్ర మధనం జరిగినప్పుడు పుట్టిన హాలాహలం జీవకోటిని రక్షించేందుకు తన ప్రాణాన్ని కూడా లెక్కచేయక, గొంతులో పట్టి అలాగే ఉంచాడు.
ఇలా త్యాగ గుణం అలవర్చూకొని, మనని-మనం మలుచుకున్నప్పుడు కష్టాలు ఎన్ని వచ్చినా తట్టుకోగలం. అది సాధన చేస్తే ఏదీ శాశ్వతం కాదని తెలిసినప్పుడు మనసు కృంగిపోదు!
రెండోది దయాగుణం ఉండాలని శివతత్త్వం చెప్తుంది. దేవతలైనా- రాక్షసులైనా- మానవులైనా సరే ఆయనను కొలిస్తే, కోరిన వరాలిచ్చి, సంతోషంగా జీవించమనడం కొండంత దయాగుణమే కదా! అలా వరాలు పొందిన వారు ఎవరైనా తెలిసీ తెలియక తప్పు చేసినా క్షమించే గుణం శివతత్త్వం! అది తెలుసుకుంటే మనకు క్షమాగుణం అలవడుతుంది. అంతేకాదు ఆయనకున్న సమానత్వం అంటే భక్తులు ఎవరైనా సరే ఆడా-మగా అనే తేడా ఎక్కడాలేకుండా, వీడు తక్కువ వాడా? ఎక్కువ వాడా అనే దృష్టి శివుడికి లేదనీ, అదే సమానత్వ గుణం మనమూ అలవర్చుకోవాలని, చెప్తుందీ శివరాత్రి.
ఇందుకో ఉదాహరణ శివుని వాహనం నంది. ఏ దేవతలైనా జంతువులను, పక్షులను తమ వాహనాలుగా చేసుకోవడంలో అర్ధం వాటిని ప్రేమించి -జీవులన్నీ ఒకటే! అనే సమాన స్థాయి కల్పించడమే! తానే ఆచరిస్తే సామాన్య ప్రజలు కూడా ఆచరిస్తారని అలా చేస్తారు. ఎక్కువగా మనం పూజించే లేదా చూసే చిత్రాలలో శివుడు ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటాడు. ఆయనను యోగి మహరాజ్ అని అంటాము. అంటే ఆయన వలెనే మనమూ ధ్యానం లేదా పనుల పట్ల ఏకాగ్రతతో ఉండాలని ఆ మూర్తి సూచిస్తుంది.
శివరాత్రి రోజునే పరమేశ్వరుడు లింగరూపంలో ఏర్పడడం లోని ఆంతర్యం ఏమిటంటే ఎక్కువ-తక్కువలు పోల్చకూడదని అన్యాపదేశం.
దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు! కుబేరుడి సంపదనంతా తన అన్న రావణుడు లాక్కుని వెళ్ళగొడితే ఈశ్వరుడి శరణు జొచ్చితే, తక్కువ-ఎక్కువలు చూడకుండా మిత్రుడివలె చూస్తాడు. ఆ సన్నిహితంతో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదిగాడు కుబేరుడు.
ఎంత ధనమున్నా -అధికారమున్నా దైవబలం తోడులేకపోతే అంతా పోతుంది… మనం నమ్మినా- నమ్మకపోయినా గ్రహాల ప్రభావం జీవుల మీద ఉంటుంది. దానికి పరిహారంగా కాశీలోని శని స్థాపించిన శివలింగం దర్శించుకుంటే ఆయా దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తాయి.
ఎందుకంటే? మన ప్రవర్తనే మన ఉన్నతికి కారణమౌతుంది. శివుడిని ఆరాధించడం వల్ల లేదా పూజించడంవల్ల మన ప్రవర్తన మారిపోయి, ఆత్మశక్తి పెరుగుతుంది. దాంతో మనో ధైర్యం వస్తుంది… దాంతో ఇతరుల పట్ల స్వార్ధరహితంగా మారే అవకాశం ఉంటుంది. అలా దైవీగుణాలు మన స్వంతమౌతాయి. అప్పుడు అంతా సానుకూలతే ఏర్పడుతుంది…
జీవుల పరిణామ దశలో ఎన్నో మార్పులొస్తాయి..అవి సహజమనే తత్త్వం అలవరుచుకుంటే.. అవి కలిగించే సమస్యలను ఎదుర్కోగలం! అని గొప్ప సందేశ మిచ్చే రాత్రి -శివరాత్రి! ఆ రోజు శివ దర్శనం చేసుకుంటున్నప్పుడు మన మనసు కోతివంటిది కాబట్టి అది అటూ-ఇటూ పరుగులు పెడుతూనే ఉంటుంది. అలా ధ్యాస మరల్చుకోకుండా ఆ మహాదేవుడిమీదే మనసు లగ్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇలా ఉండాలంటే ఉపవాసం తోడ్పడుతుంది. పూజ, వ్రతం, యజ్ఞం, ఉపవాసం మొదలైనవన్నీ ఎంతో శక్తివంతమైనవి. కష్టకాలంలోనే కాదు! ఎప్పుడైనా వాటిని ఆచరించుకొని మరిన్ని మేళ్ళు పొందుదాం! అందుకే అభిషేకాలు, బిల్వార్చన, మారేడు దళాలతో అర్చనలు చేస్తే మంచిదని పెద్దలు చెప్తారు.
శివకేశవులొక్కటే ఐనా … శివుడు మహా శక్తిమంతుడు. ఎన్నో పనులు చేయడానికి దారి చూపుతాడు. కృషి- నిజాయితీ ఉండి దేవుడిని నమ్మితే సాధించ లేనిది ఏదీ లేదు.
అందుకే చక్కగా భక్తి-శ్రద్ధలతో ఈ శివరాత్రిని ఆచరించుకుందాము.

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

లోటికా సర్కార్

బర్డ్ ఫ్లూ