మనుషులందరికీ మెప్పు పొందాలని ఉంటుంది కానీ, ఇతరులను మటుకు ఓ మంచి పని చేసినప్పుడు కూడా మెచ్చుకోవడం ఇష్టం ఉండదు . అదే ఇతరులు తమను మెచ్చుకున్నారు అంటే పొంగి ఆకాశవంత ఎత్తుకు వెళ్ళిపోతారు . తమకు ఏ మాటల వల్ల ఆనందం కలిగిందో అదే మాటలు ఇతరుల గురించి అంటే వారు తమలాంటి ఆనందమే పొందుతారు అనే విషయం చాలామందికి తట్టదు .
పైగా నోటి మంచితనం లేక తమకు ఆప్తులు లేరు, స్నేహితులేరు, అంటూ అసంతృప్తిగా కాలం గడిపేస్తారు . ఒకరిని ప్రేమస్పదుల కింద చేసుకోవాలంటే ఒక్క హృదయమే ప్రధానం కాదు. నోరు కూడా మంచిదై ఉండాలి .అప్పుడే నలుగురు స్నేహితులుగా మారతారు. దయతో, ప్రేమతో ,ఆప్యాయంతో మాట్లాడడమే సరిపోదు . ఒక్కొక్క సమయంలో ఎదుటివారి ప్రజ్ఞను గుర్తించి అది గుర్తించినట్లు మాటల్లో తెలియపరచా లి .అలా మాటల్లో చెప్పినప్పుడే, ఎదుటివారు ఆనందిస్తారు ఎదుటివారు ఆనందించినప్పుడు మనకి కొంత సంతోషం కలుగుతుంది .
ప్రశంస అనేది ఒక్క స్నేహితుల మధ్యే కాదు , భార్యాభర్తల మధ్య ,తండ్రి పిల్లల మధ్య , తోబుట్టువుల మధ్య ,తల్లి పిల్లల మధ్య ఇలా అతి సన్నిహితులైన వారి దగ్గర నుంచి కూడా కొన్ని సమయాల్లో పొందాలనిపిస్తుంది . పైకి చెప్పుకోకపోయినా అంతరాంతరాలలో ఆ ప్రశంస ఓ కాంతి కిరణంలా ఉండిపోతుంది .
కొందరైతే భర్తకి ఇంక్రిమెంట్ రానీయండి తమ ప్రయోజకతం వల్లనే వచ్చినట్లు ,ఆయనకు ఎంత మాత్రం యోగ్యత లేనట్లు మాట్లాడుతారు . తమ వంట మెచ్చుకోకపోతే ,తనకు ఎంత కష్టం వేసిందో ,అతని ప్రయోజకత్వాన్ని మెచ్చుకోకపోతే అతనికి మట్టుకు అంత కష్టం వెయ్యదా ?. ఇలా అతి చిన్న విషయాల్లో చాలామంది అవకాశం జా ర విడుచుకుంటారు .
చీర నీ కు చాలా బాగుంది అంటే ఎంత అందంగా ఉంటుంది . కొందరు భర్తలు భార్య ఎంత కష్టపడుతున్నా , చాకిరీ చేస్తున్న ఎరగనట్లు ఊరుకుంటారు . ఆ విషయం గమనించనే గమనించరు . చాలామంది స్త్రీలు వంట వాళ్ళు కావాలని , పనివాళ్ళు కావాలని ,కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలని అనుకోరు .అయితే అయ్యో పాపం కష్టపడుతున్నావ్ అనే మాట వింటే పరమానంద భరితులవుతారు .కానీ ఆ ఒక్క మాట అనరు చాలా మంది పురుషులు .నోటితో పొగడక్కర్లేదు .చేష్టలతో తమ హృదయంలోనే భావాన్ని ఎంతో సున్నిహితంగా చెప్పవచ్చు.
అవతలి మనిషిలోని సుగుణాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్న నాడు ,మనలోని సుగుణాల్ని ఇతరులు చూడగలుగుతారు .అప్పుడే అందరు ఆప్తులు అవుతారు .తాము చేసే పనిని ఇతరులు గుర్తించాలని తనని ప్రశంసా వాక్యాలతో మెచ్చుకోవాలని తహతహ లాడిపోతుంటారు చాలామంది .తగినంత మెప్పులేక నిజంగా ప్రజ్ఞ్య గలవారు కూడా నిరాశతో , జనసామాన్యంలో కలిసిపోవడం కాదు . అటువంటి వారికి మన నోటి నుంచి వచ్చిన ఏ ఒక్క అనునయ వాక్యమైనా కొండంత శక్తినిస్తుంది .అసలు తమ మీద తమకి ఆత్మవిశ్వాసం కలుగుతుంది .అటువంటి ఆత్మవిశ్వాసం మన మాటల ద్వారా అందించగలిగినప్పుడు ఆ మాటలు పైకి అనకుండా నోరు కట్టేసుకోవడం ఏమంత మంచి పని ఆలోచించండి .ప్రశంస అనేది మానసిక అవసరం . దాన్ని గుర్తించాలని మన ఆలోచన ధోరణిలో మార్పు చేసుకుంటే ,మన చుట్టూ సానుకూల దృక్పథం సుగంధంలా వ్యాపిస్తుంది .