అది ధర్మన్నపేట గ్రామం. సాయంత్రం నాలుగు గంటలు. కొమురయ్య ఇంటిముందు కిటకిట లాడుతూ జనమంతా పోగై ఉన్నారు. ఇంటిముందు పూలదండ వేసిన నిలువెత్తు ఫోటో పెట్టబడి ఉంది.
ఫొటోలో ఉన్నవ్యక్తికి 42 ఏండ్లు నిండినట్టు జనన మరణ తేదీలు చెబుతున్నాయి. కొమురయ్య కొడుకు హనుమంతు ఫోటో. అతను చనిపోయి సరిగ్గా సంవత్సరం అయింది. అంతగా జనం రావడానికి కారణం
అతడు రాజకీయ నాయకుడనో, సైనికుడనో, వ్యాపారవేత్త అనో, ఊరి పెద్ద అనో ఇట్లా ఏ రకంగానూ ప్రముఖ వ్యక్తి కాదు. కేవలం ఒక సామాన్యజీవి. కాదు కాదు మనసున్న మనిషి. అందుకే ఊరి జనాలు నిశ్శబ్దంగా నిలబడి అతని మరణం తాలూకు బాధను అనుభవిస్తున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
ఆ చిత్రపటానికి ఓ పక్క ఒక జంట నిలబడి ఉన్నారు. ఆ రోజే వారి పెళ్లి జరిగిన దానికి సూచనగా పసుపు బట్టలు, మెడలో దండలు కనిపిస్తున్నాయి. పెళ్లి జరిగిన సంతోషం వారి ముఖాల్లో లేదు. పెళ్లి కూతురు చెంపల నిండా కన్నీరు ఆగకుండా ప్రవహిస్తోంది. పెళ్ళికొడుకు విషాదవదనంతో ఆమె భుజం మీద చేయి వేసి ఊరుకోమని ఓదారుస్తున్నాడు.
హనుమంతు చనిపోయిన రోజే ఈ జంటకు పెళ్లి జరగడానికి, అతనికి వీళ్లకు మధ్య ఉన్న సంబంధం తెలుసుకోవాలంటే కాలాన్ని గతంలో చూడాలి.
** *** **
ఏడాదిన్నర క్రితం ఓ రోజు సాయంకాలం…
కమల బయట బియ్యం చెరుగుతున్నది. పొలానికి వెళ్లిన కొమురయ్య, భార్య రాజమ్మ ఇంకా రాలేదు. లోపలి నుండి భర్త మూలుగు వినిపించి పరుగెత్తుకొని లోపలికి వెళ్ళింది కమల.
శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ “కమలా! నా వల్ల కాదే. ఈ పాపిష్టి రోగం నన్ను తొందర్గ తీస్కవోతె బాగుండు! ఇంక రోజులు లెక్క పెట్టుకునుడు నాకు చేతనైత లేదే!” అంటూ భారంగా శ్వాస తీసుకుంటూ ఆగి ఆగి మాట్లాడుతున్నాడు హనుమంతు.
భర్త నోటికి చేయి అడ్డం పెడుతూ “అట్లా అనకయ్యా!
దవాఖాన్ల మన పోచాలు మామతోని పెద్ద డాక్టరు ఏం గాదని జెప్పిండు గద! నీకేం కాదయ్యా!”
అన్నది కమల.
పోచాలుది ఇంటి పక్క ఇల్లు. చిన్నప్పటి నుండీ హనుమంతుకు ఆ ఇంటితో అనుబంధం. చిన్నమ్మ, చిన్నాయిన అంటూ వాళ్ళింట్లో గడుపుతూ వాళ్ళ పిల్లలతో ఆడుకునేవాడు. అందుకే ప్రతీ విషయం పోచాలుకు చెప్పుకుంటాడు. హనుమంతును దగ్గరుండి దవాఖానకు తీసుకుపోయింది పోచాలే.
ఆమె మాటలకు మనసులో నవ్వుకున్నాడు హనుమంతు. పోచాలుతో డాక్టరు ఇక నెలలే మిగిలి ఉన్నదని చెప్పిన విషయం హనుమంతుకు, పోచయ్యకు మాత్రమే తెలుసు. అమ్మానాన్నలకు, భార్యకు చెప్పొద్దని పోచాలు దగ్గర ఒట్టు వేయించుకున్నాడు హనుమంతు.
పొలం నుండి తిరిగొచ్చిన కొమురయ్య, రాజమ్మ కొడుకు పరిస్థితికి దిగాలు పడిపోయారు. ఉన్న ఒక్క కొడుకు ఆరోగ్యం క్షీణిస్తుంటే తట్టుకోవడం వాళ్లకు సాధ్యం కావడం లేదు. లోలోపల కుమిలిపోతున్నారు.
** *** **
కొమురయ్య, రాజమ్మలకు పుట్టిన ఒక్క కొడుకు హనుమంతు. ఎకరం పొలం ఉంది. వరి పంట. జోడెడ్ల బండి కూడా ఉంది. సొంతంగా చిన్న ఇల్లు. ఎటువంటి చింతలు లేని కుటుంబం. ఊరిలో కష్ట సుఖాలకు ముందు నిలబడతారు దంపతులు. హనుమంతును ఊళ్ళో పదవతరగతి వరకు చదివించారు. తరువాత కాలేజీ అంటూ పైచదువులకు వెళ్లక వ్యవసాయ భూమిని చూసుకుంటున్నాడు.
తల్లిదండ్రుల గుణాలను పుణికిపుచ్చుకున్నట్లు అందరితో స్నేహంగా ఉండేవాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా “మన హనుమంతు ఉన్నాడు కదా!” అని అనుకునే వారు. హనుమంతుతో పాటు పదవతరగతి వరకు చదువుకున్న కోటి వాళ్ళ అమ్మా నాన్నలకు టౌన్ లో ఫ్యాక్టరీలో పని దొరికిందని ఊరు విడిచి వెళ్లిపోయారు.
అంతటితోనే వారి స్నేహం మటుకు ఆగిపోలేదు. ఇంటర్ వరకు పూర్తిచేసుకున్న కోటి అదే ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఊరికి వచ్చి కలిసేవాడు. హనుమంతుకు టౌన్ లో ఏదైనా పని ఉంటే కోటి ఇంట్లో భోజనం చేయాల్సిందే.
కమల, హనుమంతులకు అప్పటికి పెళ్ళై మూడేళ్ళు దాటింది. పుట్టింట్లో కమల పెద్దది. ఒక చెల్లెలు. వాళ్ళ ఊరికీ ధర్మన్నపేటకు చాలా దూరం. ఒక పెళ్లిలో హనుమంతు తల్లిదండ్రులు కమలను చూడడం, వెంటనే రాయబారం నడిపి మధ్యవర్తి ద్వారా సంబంధం కలుపుకోవడం వెంటవెంటనే నెలరోజుల్లో పెళ్లి జరిగిపోయింది.
*** *** ****
హాయిగా ఏ కలతలు లేని కాపురం. ఆనందంగా జీవితం సాగుతూ వారసుని కొరకు కోరిక మొలకలెత్తుతున్న సందర్భం. దేవుడు ఇచ్చే వరం కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకో హనుమంతుకు అడపాదడపా జ్వరం రావడం మొదలైంది. మామూలు జ్వరమనుకొని తోచిన మందు గోలీలతో సరిపెట్టారు.
ఒకనాడు జ్వరం బాగా రావడంతో పోచాలు దగ్గరుండి టౌన్ లో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. కోటి కూడా వచ్చాడు. “అక్యూట్ లింఫోసైటిక్ లుకేమియా”
(ALL) అనే భయంకర బ్లడ్ క్యాన్సర్ హనుమంతుకు సోకిందని చెప్పాడు డాక్టర్. టీనేజర్ల నుండి 39 ఏళ్ల వరకు వచ్చే అరుదైన వ్యాధి. అంతేకాదు బతకడానికి ఎక్కువ కాలం లేదని చెప్పాడు.
పోచాలు, కోటి గుండెలు చిక్కబట్టుకొని విన్నారు.
హనుమంతుని పట్టుకొని ఏడ్చారు. ముందుగా తేరుకున్న హనుమంతు ఇద్దరినీ రెండు కోర్కెలు కోరాడు. పోచాలును ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నాడు. కోటి ముందు చేయిచాచి అభ్యర్థిస్తూ “తన కోరిక సరైనది కాకపోయినా, తన భార్యను పెళ్లి చేసుకొని, ఆమె జీవితానికి తోడుగా నిలబడు”మని వేడుకున్నాడు. ఈ మాటలకు కోటి, పోచాలు బిగుసుకుపోయారు. ఎన్నో విధాలుగా నచ్చచెప్పి చూశారు. హనుమంతు మంకు పట్టు పట్టాడు.
ఆలోచించుకోవడానికి రెండురోజులు టైం కావాలని
అడిగాడు కోటి. తల్లిదండ్రులతో చర్చించాడు. కొడుక్కి రెండో సంబంధం పిల్లను చేయడానికి ఎవరొప్పుకుంటారు? తర్జనభర్జనలు జరిగిన తర్వాత స్నేహితుని ఆత్మశాంతి కోసం త్యాగం చేయడానికే సిద్ధపడ్డాడు కోటి. ఒప్పుకున్న ఆ తల్లిదండ్రులు అంతకంటే త్యాగధనులు.
నాలుగు రోజుల తర్వాత మళ్ళీ చెకప్ కోసం టౌన్ కు వెళ్ళినప్పుడు తాను చనిపోయిన ఏడాది మాసికం రోజున పెళ్లి జరుగుతుందని మాటిస్తే ప్రశాంతంగా కన్నుమూస్తానని మాట తీసుకున్నాడు. జనాలు నమ్మడం కోసం ఈ విషయమంతా తెలుపుతూ ఒక ఉత్తరం రాసి, తాను చనిపోయిన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అందరినీ పిలిపించి చూపించుమని పోచాలుకు ఇచ్చాడు.
ప్రత్యేకంగా కమలకు “తన ప్రాణం పోయినా ఆమె ఆనందంతో ఉండాలని, పుణ్యస్త్రీగానే ఉండాలని, కోటి మంచివాడు కనుక ఆమె జీవితం సుఖంగా ఉంటుందని,
అదే తన చివరి కోరిక అని చెబుతూ తన మనసుకు ఇష్టమైన పని ఆమెకూ ఇష్టమే కాబట్టి ఒప్పుకోమ”ని బతిమిలాడుతూ మరో ఉత్తరం రాసి కమలకు ఇవ్వుమన్నాడు. ముఖ్యంగా కమలను ఒప్పించడమే కష్టం కాబట్టి ఆమె తల్లిదండ్రుల ద్వారా వాస్తవాన్ని, ఆమె భవిష్యత్తు జీవితం గురించి తాను తీసుకున్న నిర్ణయాన్ని ఒప్పుకునేటట్లు చేయుమని చెప్పమని పోచాలుకు అన్ని జాగ్రత్తలూ చెప్పాడు.
** ** ***
తరువాత ఆరునెలలకు హనుమంతు చనిపోయాడు.
కర్మకాండలు అయిపోయిన తరువాత పోచాలు హనుమంతు తల్లిదండ్రులను, కమల తల్లిదండ్రులను, కోటి తల్లిదండ్రులనే కాక ఊరి పెద్దలందరినీ సమావేశపరచి హనుమంతు రాసిన ఉత్తర సారాంశాన్ని చదివి వినిపించాడు. కమలకు రాసిన ఉత్తరాన్ని ఆమెకు ఇచ్చాడు. అది చూసి తలబాదుకుంది. హనుమంతు కోరిక తీర్చడం తనవల్ల కాదని వెక్కి వెక్కి ఏడ్చింది.
మరోవైపు విషయం విన్న వెంటనే పెద్దవాళ్ళు అంతెత్తున లేచారు. ‘ఇదేం కోరిక?’ అని కొంతమంది గుసగుసలాడారు. ఎక్కడ లేని విడ్డూరమని ముక్కున వేలేసుకున్నారు. సంవత్సర దినం నాడే పెళ్లేమిటని కొందరు, ఇంటా వంటా లేదని మరికొందరు తోచినవిధంగా చర్చ చేస్తూనే ఉన్నారు. కొంతమంది స్నేహితునికి ద్రోహం చేశాడని కోటిని ఆడిపోసుకుంటున్నారు.
కొంత సద్దుమణిగాక పోచాలు ముందుగా హనుమంతు తల్లిదండ్రుల అభిప్రాయం అడిగాడు. కోడలు జీవితానికి ఒక ఆధారాన్ని కల్పిస్తూ కొడుకు తీసుకున్న నిర్ణయం సమ్మతమేనని, తాము ఎంతో పుణ్యం చేసుకుంటేనో అటువంటి కొడుకు పుట్టాడని ఏడుస్తూ చెప్పారు.
ఈ విషయం ముందే తెలిసిన కోటి తల్లిదండ్రులు స్నేహితుని కోర్కె తీర్చడానికి కోటి ముందుకు రావడాన్ని మొదట్లో కోపగించుకున్నా వాళ్ళ స్నేహాన్ని అర్థం చేసుకొని హనుమంతు చివరి కోరిక తీరుస్తూ ఒక అమ్మాయి జీవితాన్ని నిలబెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమోదాన్ని తెలిపారు.
ఇక కమల తల్లిదండ్రులు అమ్మాయి జీవితం వసివాడి పోకుండా కోటి ముందుకు రావడం, భర్తగా హనుమంతు భార్య జీవితం గురించి తీసుకున్న నిర్ణయానికి హర్షించారు.
హనుమంతు మంచితనం ముందు నుండి తెలిసిన పెద్దలు వీళ్లంతా ఒప్పుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి వెళ్లిపోయారు.
ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా కమల ఒప్పుకోకపోవడంతో కాలమే గాయాన్ని మాన్పుతుందని, ఆలోచించుకోవడానికి ఆమెకు కొంత సమయం ఇవ్వాలని అందరూ నిర్ణయించారు.
అందరి మధ్యలో ఏకాంతంగా కమల…??
పూర్తిగా అనుభవించకుండానే చేజారిపోయిన జీవితం.
ఎంతో ప్రేమను పంచి కలల రంగుల్లో ముంచిన భర్త అనుకోని మరణం. ఆ ప్రేమను నిజం చేస్తూ తిరిగి జీవితాన్ని కొత్తగా మార్చుకునేందుకు చేసిన ఏర్పాటు ఒకవైపు. ఆసరా ఇస్తానని చేయందించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి మరోవైపు. అతడు చాలా మంచివాడు. అది తనకు తెలుసు. అయోమయంలో ఆరునెలలు గడిచిపోయాయి.
*** *** ***
ఒకరోజు దిగ్గున లేచి కూర్చుంది కమల. కమల ఒళ్ళో తల పెట్టుకొని “కమలా! జర నా మాట ఇనవే. నేను చెప్పినట్టు చేసి నన్ను సంతోషపెట్టవే. కోటి చానా మంచోడు. నిన్ను పువ్వుల్ల వెట్టి సాత్తడు. నీ బతుకు బుగ్గిపాలైతే నేను సూడలేనే?” అంటూ బతిమిలాడుతుండు హనుమంతు. తాను చూసిందంతా కల అని అర్థమై పిచ్చి చూపులు చూసింది శూన్యంలోకి.
లేచి ముఖం కడుక్కొని అద్దం లోకి చూసుకుంది. బొట్టు, కాటుక లేక ముఖమంతా వాడిపోయినట్టు ఉంది. వెనుక నుండి హనుమంతు వచ్చి గట్టిగా పట్టుకొని నుదుట కుంకుమ అద్దుతున్నాడు. అట్లాగే నిలుచుండి పోయింది చాలాసేపు.
సరిగ్గా ఏడాది మాసికం రోజున వీరికి పెళ్లి జరిగింది. ఊరంతా కదిలి వచ్చి ఒకవైపు ఏడుస్తూనే మరొకవైపు దంపతులను ఆశీర్వదిస్తున్నారు. హనుమంతు మంచితనాన్ని పొగుడుతున్నారు. భోజనాలు అయిపోయిన తర్వాత కొమురయ్య, రాజమ్మ
కూతురిని సాగనంపినట్లు సారెతో కమలను సాగనంపారు.
ఆ దృశ్యానికి ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంది.
చేయి చాపిన కోటి చేతిని పట్టుకొని వెనక్కి తిరిగి ఏడుస్తూ హనుమంతు ఫోటో వైపు చూసింది. కన్నీటి పొరల మధ్య ఆశీర్వదిస్తున్నట్టు హనుమంతు చిరునవ్వు.
మెల్లగా అడుగులో అడుగు వేస్తూ ఊరికి వీడ్కోలు పలికి ముందుకు సాగింది కమల.
&&&&&