ఒడిపిళ్ళు- 23 వ భాగం

గ్రామంలోని వారంతా తమ తమ పనుల్లో ఉన్నారు. సాలీ, మాలీ నిరాసక్తంగా ఉన్నారు .ఈసారి వారికి పండుగ ఉత్సాహమే లేదు. ఎటువంటి తయారీ లేదు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడాను చూసి బాధ పడుతున్నారు. పోయినసారి వసంతోత్సవం ఊపిరి పీల్చే తీరిక లేకుండా తండ్రికి అన్నలకు పనుల్లో సాయపడ్డారు. అలా పని చేయడం వారికి ఎంతో ఆనందాన్నిచ్చింది. రేపటి కలలతో ఆ పండగ, ఇప్పుడు ఒక స్మృతి మాత్రమే .

భూక్యా, టీక్యా ఆ పని ఈ పని చెయ్యమని చెల్లెళ్ళను తరుముతుంటే, సోమ్లా వాళ్లను విసుక్కునే వాడు. పండుగ పనిలో అందరూ అలా కలిసి పని చేసుకోవడం వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. కానీ ఇప్పుడు ఈ పండగకు ఏ అవకాశం లేకుండా పోయింది.

గత సంవత్సరం పండుగకు తమ తండ్రి తమ కోసం తళతళలాడే కొత్త చీరలు, కాలి గజ్జలు, పసుపు పచ్చ పూసల నెక్లెస్లు, చేతి కడియాలు అన్నీ కొని ఇచ్చాడు. కానీ ఈ సంవత్సరం డబ్బు లేదు. కనీసం మిఠాయిలు కూడా లేవు.

గ్రామంలో ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు తెచ్చుకున్నారు పండగ కోసం. అమ్మాయిలు గర్వంగా కొత్త జాకెట్లు తెచ్చుకొన్నారు. సరస్సు దగ్గర స్నానం చేసే చోట కొండ జాతి స్త్రీలు అందరూ తమ తమ కొత్త బట్టలను ధరించి చూసుకున్నారు. ఎవరికి వారు డాన్స్ చేసేటప్పుడు తామే ఉత్తమంగా ఉండాలని అనుకున్నారు. సాలీ , మాలీ వారి బట్టలను ప్రశంసించారు. నిశ్శబ్దంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వారి పరిస్థితిని అర్థం చేసుకున్నట్టు ఇల్లు చేరారు.

పండుగకు ముందు కొన్ని రోజుల క్రితం వీధి వ్యాపారులు కొండ ప్రాంతానికి తమ సరుకులతో వచ్చారు. బట్టలు, మెటల్ గాజులు, రంగుల పూసలు ఇంకా రకరకాల నగలు తెచ్చారు. అమ్మాయిలు అబ్బాయిలు వారి చుట్టూ మూగి వారి గంపలు కాళీ చేశారు. సాయంకాలం అమ్మాయిలందరూ కొత్త బట్టలు వేసుకుని సీతాకోక చిలుకల్లా సందడిగా అటు ఇటు తిరిగారు. సాలీ ఇంటి గుమ్మం దాటి వీధి వ్యాపారుల వైపు వెళ్లలేదు. కనీసం తన స్నేహితులంతా వారి చుట్టూ మూగిన అటు వైపు వెళ్ళలేదు. కానీ మాలీ తన ఉత్సాహాన్ని ఆపుకోలేక బయటకి ఎగురుకుంటూ వీధి వ్యాపారుల వద్దకు వెళ్ళింది. వ్యాపారులు చేస్తున్న వ్యాఖ్యానాలకు వస్తువులు కొనమని ఆహ్వానించే తీరుకు తట్టుకోలేక, ఒక చక్కని నగను తీసుకొని అక్క దగ్గరికి వచ్చింది “ఇది చూడక్కా ఎంత బాగుంది ఎంత అందంగా ఉంది” అంటూ చూపించింది.

తన చెల్లి ఉత్సాహాన్ని చూసి సాలీ గ్రామపెద్ద వద్దకు వెళ్లి ఒక రూపాయి అప్పు పెట్టమని అతి త్వరగా తన తండ్రి రాగానే తిరిగి చెల్లిస్తానని అడిగింది. కానీ గ్రామ పెద్ద గట్టిగా నవ్వుతూ నమ్మలేనట్టు “నీకేమన్నా పిచ్చా ఒక రూపాయి ఎక్కడి నుంచి తేగలను” అని తిరస్కరించాడు, ఊర్లో పెద్దలందరినీ సాయం అడగాలని ఆలోచించింది. కానీ ఆమె మనసు అంగీకరించలేదు.

మాలీ హేమ్లాను అడగుదామా అన్నది. నువ్వు కనుక హేమ్లాను డబ్బు అడిగితే నేను నీతో అసలే మాట్లాడను అని సాలీ ఆమెను బెదిరించింది.

సాలీ చాలా రోజులుగా డాన్స్ చేయడం లేదు రాత్రిపూట తన స్నేహితులు అందరూ డాన్స్ చేస్తుంటే మాలీ తన డాన్స్ తో తమ పేదరికాన్ని గెలుపుగా మార్చుకునేందుకు వెళ్ళి ఆవేశంగా డాన్స్ చేసింది.

గ్రామం మొత్తంలో ఒకేఒక్క మనిషి వారి యోగక్షేమాల గురించి ఆసక్తి చూపించేవాడు. అతడే కాక్లా. వీధిలోనే నిలబడి సాలీ, మాలీలను ఉద్దేశించి “మీ నాన్న అన్నలు ఎప్పుడు వస్తారు, ఈ పాటికి ఇంటికి వచ్చి ఉండాలి కదా ” అని అడిగేవాడు. తన వికారమైన ముఖాన్ని చిట్లించి అతడు వారిపట్ల బాధ్యతను వ్యక్తపరచే వాడు.

ఊరు మొత్తం లో అతని వంటి కురూపి మరొకడు లేడు. అతడి ముఖం ఒక కోతి లాగా, ముక్కు ఒక పిండి ముద్ద లాగా కిందకు జారి , ఏటవాలుగా ఉబ్బెత్తుగా ఉండే నుదుటిపై చిందరవందరగా వెంట్రుకలతో తలపై జుట్టు పైకి లేచి కొబ్బరి పీచు లాగా కనిపించేది. అందులో అతను పువ్వులని అలంకరించే వాడు. అతని అవయవాలు సాగి పోయినట్టు గిడసబారి వికారంగా ప్రేత కళ ఉట్టి పడుతూ ఉండేవాడు.

కానీ అతనిలో చాలా నైపుణ్యాలు ఉన్నాయి అతని జ్ఞాపకశక్తి చాలా గొప్పది. ఎవరైనా సమాచారాన్ని వేరొకరి చెప్పమని పంపిస్తే అక్షరం పొల్లు పోకుండా చెప్పగలిగే వాడు. కాకపోతే అతని భాష మోటుగా ఉండేది. కొన్నిసార్లు విసుగు పుట్టించేది. కానీ అతనిలో ఎటువంటి అపకారబుద్ధి లేదు. ఎంతమంది అతనిని అసహ్యించుకున్నా చీదరించుకున్నా అతడు మాట్లాడడం ఆపేవాడు కాదు. కాక్లా అనుక్షణం సాలీ, మాలీలకు సాయంగా రక్షణగా ఉంటూ వచ్చాడు. వారి తండ్రి అన్నలు వెళ్ళిన తరువాత అతను వారి బాధ్యతను వహిస్తున్నాడు. అంతకుముందు సోమ్లా అతనిని కొట్టిన దెబ్బలు అన్నింటిని మర్చిపోయాడు. సోమ్లా, అతని కొడుకులు, కాక్లా లాగే ఇప్పుడు గోటీలు. వారికి తనకు తేడా లేదనే విషయాన్ని అతను గ్రహించాడు. వారిలో ఎవరు పెద్ద కాదు, ఎవరు గొప్ప కాదు. సాంఘిక కొలమానాలు, అంతరాలు వారి మధ్య లేవు. ఇప్పుడు అకస్మాత్తుగా అతనికి ఒక కొత్త ఆలోచన వచ్చింది సాలీ, మాలీలలో ఒకరు తనకు వధువుగా సరైన వారు అనే భావన కలిగింది. ఉన్న ఊరి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే పెళ్ళి ఖర్చు తక్కువ అవుతుంది. అంతేకాదు కన్యాశుల్కం కూడా తక్కువే ఉంటుంది. అయితే సమస్య ఏంటంటే, ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలి అనేది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కాక్లాకు ఆనందాన్ని కలిగించింది. ఎన్నో పగటి కలలు అతన్ని చుట్టుముట్టాయి. అదే సమయంలో అతని వంటి అనాకారి రూపం గుర్తుకొచ్చింది. అతని కల చెదిరి నట్టయింది ఒక్కసారిగా… ఇంతసేపు ఆనందంగా ఊహించుకున్నవన్నీ అదృశ్యమయ్యాయి. సంధ్యా సమయం మసక చీకట్లు వ్యాపించాయి.

కాక్లా ఈమధ్య సాలీ, మాలీ పనిచేసే చోట ఎక్కువ తిరుగుతున్నాడు. పొలం నుండి ఇంటికి అనేకసార్లు తినడానికి వెళ్తున్నాడు. అతను వెళ్ళిన ప్రతి సారీ, మిగిలినవారికి స్నానాల సరస్సు దగ్గర నుండి వెళ్తున్నట్టు అందరికీ చెబుతున్నాడు. ఇంతలో అతనికి అతని యజమాని పొయ్యిల కట్టెలు తెమ్మన్న సంగతి గుర్తుకు వచ్చింది. అతడు అడవిలో సాలీ, మాలీ ఆకులు దుంపలు తెంపే చోట చిక్కటి అడవి ఉన్నట్టు గుర్తు తెచ్చుకున్నాడు. ఆ అమ్మాయిల వెంట అతను ఎటు వెళ్ళినా అడిగే వారు ఎవరూ లేరు. అతని వికారమైన ముఖం ఆ అవకాశాన్ని కలిగించింది. వారు అడవికి బయలుదేరగానే వారి వెంట నడవడం మొదలుపెట్టాడు.

మాలీ తరచూ తనను ఏడిపిస్తూ ఉంటుంది. కాక్లాను వెక్కిరిస్తూ ఉంటుంది. అందుకని ఆమె తనకు సరైనది కాదని అనుకున్నాడు అతడు. అంతేకాదు ఆమె మరీ చిన్నది, చిన్న పిల్ల కనుక ఇంటి పనులు చేయగలిగిన బలం ఆమెకు లేదు, తనకు సరైన గృహిణి కాదు అనుకున్నాడు.

అవును సందేహం లేదు సాలీనే తనకు సరైనది, అందమైనది, ఆరోగ్యవంతమైనది. ఆమె మాత్రమే తనకు సరైన సంతానాన్ని ఇవ్వగలదు. అంతేకాదు ఆమె అన్నీ అర్థం చేసుకోగలదు. ఎవరిని బాధ పెట్టే స్వభావం కాదు ఆమెది. ఆశ్చర్యం కలిగించే నిజమేమిటంటే ఆమెను పెళ్ళాడుతానని వెంటాడే ప్రత్యర్థి ఎవరు లేరు. అందుకని కాక్లాకు అడ్డు ఎవరూ లేరు. అతని మార్గం సుగమం అయింది.

అతడు సాలీని అనుసరిస్తూ ఉన్నాడు, ఒక వికృతమైన నీడలాగా, చందమామ వెనుక నల్లని మబ్బుల్లాగా. ఆ నీడ దూరంగా ఉన్నా అది మాత్రం వికృతమైన నీడే కదా.

ఒకరోజు మధ్యాహ్నం ఎండ తళతళలాడుతూ ఉంది. అతడు సాలీ దగ్గరికి వెళ్ళాడు. ఆమె తన తోటలో కూర్చుని చిక్కుడు తీగలను చూస్తూ ఉన్నది. ఏదో ఆలోచిస్తూ ఉంది. అతడు వచ్చిన విషయం ఆమె గమనించనే లేదు.

కాక్లా నిశ్శబ్దంగా వచ్చి ఒక కొత్త చీరను ఆమె ముందు పడేసి, తన ముఖం పై చెమటను తుడుచుకుంటూ నిలబడ్డాడు.

“ఇదిగో… ఇది నీకోసమే తెచ్చాను” అన్నాడు. చాలా సర్వసాధారణం అన్నట్టు.

“ఎందుకు తెచ్చావ్, ఇది నాకు” అని బలహీనమైన గొంతుతో, కళ్ళు వాల్చి అడిగిందామె.

“ఇది నువ్వు కట్టుకోవాలి, అది నా కోరిక” అన్నాడు.

“సరేలే, తిరిగి తీసుకునిపో. నాకు అవసరం లేదు” అన్నదామె.

వెంటనే ఆ చీర తీసుకొని వెళ్ళిపోయాడు అతడు. ఒక శిల లాగా అలాగే కూర్చొని ఉండపోయిందామె. దేనికీ చలించని దేవతా విగ్రహం లాగా కదలకుండా కూర్చున్నది. కాక్లా వెళ్లిపోయినా సాలీ అవమానంగా భావించి ఏడుస్తూ ఉండిపోయింది. చాలా నెలల తర్వాత ఆమె మళ్ళీ ఏడ్వగలిగింది.

…….

ఊరి మధ్యలో ఉన్న జోడి చెట్టు కింద, పెద్ద పండుగమంట వేసేందుకు స్థలం కేటాయించబడింది. చీకటిలో చెట్టు ఆకులు చిత్రాలు వేసినట్టుగా ఉన్నాయి. డాన్స్ మొదలైంది పెద్ద మంట కారణంగా ఏర్పడిన నీడలు నృత్యం చేస్తూ పక్కనే ఉన్న అరటి చెట్ల నీడలతో కలుస్తున్నాయి. సాలీ తన ఇంటి వరండాలో నిలబడి ఆ పాటలను, నవ్వులను వింటున్నది. కానీ అవేవి ఆమె మనసుకు తాకడం లేదు.

కొద్ది సేపటి తరువాత మాలీ వచ్చి “మనం కూడా వెళ్దామా డాన్స్ వేయడానికి” అని అడిగింది. వెంటనే తన కూడా వెళ్లి ఏ ఆలోచన లేకుండా నాట్యం చేస్తున్న గుంపులో చేరింది సాలీ. అమ్మాయిలందరూ చుట్టూ ఒకరి చేతులు ఒకరు వెనక వైపు నుండి పట్టుకొని వృత్తంలా ఏర్పడి నృత్యం చేస్తున్నారు. పురుషులు ఎర్రటి తలపాగా ధరించి, రంగురంగుల ధట్టీలను భుజాలపై వేసుకొని ఉన్నారు.

సాలీ ఒక్కసారిగా వచ్చి గుంపులో చేరింది. ఆ వృత్తంలో ఉన్న బృందం గుండ్రంగా తిరుగుతూ ఉంటే నీడలు రెపరెపలాడుతూ ఉన్నాయి. ఆ నాట్యం వేగానికి ఆవేశం తోడయింది. ఆమె అడుగులు సహజంగానే అలవాటు పడిన లయకు అనుగుణంగా నాట్యం చేస్తున్నాయి. అడవిలోని చెట్లన్నీ తమ తలను సాగదీసి నృత్యాన్ని చూస్తున్నాయి. రాత్రి ఉన్నట్టుండి అద్భుతంగా మారింది.

ఆ రాత్రి హేమ్లా తన గంభీరమైన కంఠంతో పాట పాడుతున్నాడు వర్షాన్ని ఆహ్వానిస్తూ. ఈసారి వర్షాలు జూన్, జూలై వరకు రాలేదు. గిరిజనులంతా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారి ఆటలు, పాటలు, నటనలు అన్నీ కూడా ఋతువులను ఆహ్వానిస్తూ ఉంటాయి. అదంతా తమ ఉనికి కొనసాగడానికే.

హేమ్లా గంభీర స్వరంతో పాడే పాట ఈ విధంగా కొనసాగుతోంది…

“ఓ నా ప్రియమైన జాయ్ పుష్పమా..

మధురమైన మల్లె మొగ్గా..

నీ నల్లని కురులలో

తెల్లని నక్షత్రాల పువ్వులు ధరించుకొని రా..

నేను నీకోసం వేచి ఉంటాను

నాకు తెలుసు నువ్వు వస్తావని

నువ్వు తప్పక రాకమానవు

మృత్యువు కూడా రాకమానదు కదా

నాకు రెండే రెండు నిజాలు తెలుసు

ఒకటి నీ ప్రేమ, రెండవది మృత్యు భయం

నేను రోజూ మృత్యువుతో ఆడుకుంటాను నువ్వొస్తావని..

నీ నల్లని కురులు, దట్టమైన మేఘాలే

వర్షం వచ్చేందుకు అవి సూచనలు

ఆకాశం అంధకారం అవుతుంది

ఉరుములు మెరుపులతో

నా కళ్ళు మసకబారు తున్నాయి

చంద్రుని వెన్నెల దాహాన్ని కలిగిస్తుంది

నక్షత్రాలన్నీ తొంగిచూస్తున్నాయి

భూమి చీకటిలో తడుముకుంటుంది

వర్షపు దారలు దబదబమని

పూరి గుడిసె చూరు నుండి జారుతున్నాయి

నది పాడుతున్న పాటకు

పర్వతాలు కోరస్ అందిస్తున్నాయి

కప్పలు సంగీతాన్ని జోడించగా

కదంబ వృక్షాలు పరవశంతో వింటున్నాయి

వాటి పుష్పాలు నిక్కబొడుచుకొని

రోమాంచితమౌతున్నాయి

నువ్వు ఆ వర్షంలో వస్తున్నావు

వధువు ఇంటి నుండి వస్తున్నట్టుగా

నవ వధువుగా ఇంటి పెద్దల పాదాలను కడుగుతున్నది వర్షం

మన గిరిజన సంప్రదాయంగా

నువ్వే వర్షానివి నువ్వే నవ వధువువి

నీ వర్షపు జల్లే

నా హృదయంలో ఆనందాన్ని నింపేది..”

పాట మధురంగా సాగుతోంది..

*** *** *** ***

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

లోకాభిరామాయణం (కాలమ్)

నృత్యకేకి