వెన్నెలా.. వెన్నెలా…

సాహిత్య వ్యాసం

“వెన్నెల”.. ఆహా! ఈ పదం అంటున్నా, వింటున్నా ఏదో తెలియని హాయి కలగదూ? ఒక తెల్లని, చల్లని కాంతి కనుల ముందు పరచుకోదూ? వెన్నెలలోని హాయిని అనుభవించని, మనసారా ఆనందించని మనిషి ఉంటాడంటారా?

వెన్నెల అంత అందమైన వర్ణనీయమైన వస్తువు మరొకటి ఈ ప్రపంచంలోనే లేదేమో! పండువెన్నెల, పిండి వెన్నెల, వెండి వెన్నెల,పాల వెన్నెల,తెలి వెన్నెల, పుచ్చపువ్వు లాంటి వెన్నెల అంటూ వెన్నెలని వర్ణిస్తూ,ఆ హాయిని అనుభూతి చెందుతూ కవులు అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతారు.

“ఇంటికి పాపాయి అందము,
మింట దాయిదాయి చందము”

“చల్లని వెన్నెల సోనలు..
మా పాపాయి బోసి నవ్వులు ..”

అంటూ పసిపిల్లలను చందమామతో, వారి నవ్వులను వెన్నెలతో పోలుస్తారు.

ఒకప్పుడు, అన్నం తినటానికి మారాము చేసే పిల్లలను బుజ్జగించటానికి,

“చందమామ రావె, జాబిల్లి రావె..”అని పాడుతూ చందమామను చూపిస్తూ అన్నం తినిపించే వారు.

(ఇప్పుడు ఆ చందమామ మీదకే పిల్లలను తీసుకెళ్ళే రోజులు రావచ్చేమో!

కాని ఇక్కడ నుండి చందమామను చూసి పొందే అనుభూతి అక్కడకి వెళ్ళాక ఉంటుందంటారా?)

రాముడంతటి మంచి బాలుడే చందమామ కోసం పేచీపెట్టి,తన పేరుకి చంద్రుడిని జత చేసుకున్నాడంటే ఆ వెన్నెలరేడు యొక్క ఆకర్షణ శక్తి తెలియటం లేదూ?

ఆ చంద్రుని చక్కదనానికి, చల్లదనానికి వశుడై పోయిన శివుడు అతడిని తలమీదికి ఎక్కించుకుని “చంద్రమౌళి,ఇందుమౌళి, చంద్రశేఖరుడు,రాజశేఖరుడు,శశిశేఖరుడు” అంటూ వివిధ పేర్లతో పిలిపించుకోవటం తెలిసినదే. అమ్మవారి నుదురు అష్టమి నాటి చంద్రునిలా ఉంటుందట.
అందుకే అమ్మ “అష్టమీచంద్రవిభ్రాజదళిక స్థలశోభిత”. మరి
లక్ష్మీదేవి అక్షరాలా చంద్ర సహోదరి.ఇంక ఆ కడలిరేడు మాట చెప్పేందుకు ఏముంది! పున్నమి నాటి చంద్రుడిని చూసి పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బయిపోతాడు.

కొన్నేళ్ల క్రితం చిన్నతనంలో వేసవికాలం డాబా మీద పడుకుని
చందమామను,చుక్కలను చూస్తూ తాతయ్య,బామ్మ, అమ్మమ్మ చెప్పిన కథలు మన తరం వాళ్ళు అందరూ వినే ఉంటారు. అవి గుర్తుకు రావటం లేదూ మీకు?

శరత్కాలంలో చందమామ అందం రెట్టింపు అవుతుంది. ఆదికవి నన్నయ భట్టారకుడు శారదరాత్రులు.. పద్యంలో చంద్రుడు కర్పూరపుపొడిలా వెన్నెలను వెదజల్లుతున్నాడు అని వర్ణిస్తే, ఎఱ్ఱాప్రెగడ వెన్నెల పాలసముద్రంలా ఉందన్నాడు.

ప్రబంధ కవులు తమ వర్ణనలలో వెన్నెలకు పెద్దపీట వేసారు.సినీకవులు కూడా తమకు అవకాశం దొరికినప్పుడల్లా తనివితీరా వెన్నెల సోయగాన్ని తమ పాటల్లో పొదిగారు.

“చల్లని రాజా ఓ చందమామా
నీ కథలన్ని తెలిసాయి నా చందమామా..”

“ఆకాశవీధిలో అందాల జాబిలి
వయ్యారి తారనుజేరి ఉయ్యాలలూగెనే,సయ్యాటలాడెనే..”

“ఈ వెన్నెల, ఈ పున్నమి వెన్నెల,
ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల…”

“ఇది తీయని వెన్నెలరేయి, మది వెన్నెల కన్నా హాయి..”

వెన్నెలా వెన్నెలా
మెల్లగా రావే
పూవుల తేనెలే తేవే…

ఈ పాటలు వింటుంటే మనమే వెన్నెల్లో ఉన్నట్లనిపించదూ?

చంద్రుడు ఏయే మాసాల్లో ఎలా ఉంటాడో ఎంత
అందంగా వర్ణించారో శ్రీశ్రీ , చూడండి.

“కార్తీకమాసాన ఆకాశమార్గాన
కనువిందు చేసేను జాబిల్లి,
ఆషాఢమాసాన మేఘాల చెరలోన అల్లాడిపోయెను జాబిల్లి,
వైశాఖమాసాన భూదేవి సిగలోన మరుమల్లె చెండౌను జాబిల్లి
శ్రావణమాసాన జడివాన ఒడిలోన కన్నీటి కడవౌను జాబిల్లి”

సినిమాల్లో నాయికా నాయకులు తమ గాథలను,బాధలను,
అనుభూతులను చెప్పుకోవటానికి చందమామే బంధువు, రాయబారి కూడా.

“రావోయి చందమామ మా వింత గాథ వినుమా..”

“మామా, చందమామా వినరావా నా కథ..”

నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా, ఎప్పుడుంటావు?

“ఒహో చందమామా,ఒక్క మాటుందమ్మా,నింగి దిగి రావమ్మా నీకు చోటుందమ్మా..”

నాయిక మోమును చంద్రబింబంతో,దరహాసాన్ని వెన్నెలతో పోల్చని కవులెవరు?

“ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ?ఆ కారణమేమి చెలీ?వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి, నిండు పున్నమి జాబిలి..”

అని ఆత్రేయ అంటే,

” పగటిపూట చంద్రబింబం అగుపించెను ఏది? ఏది?
అందమైన నీ మోమే, అదిగాక ఇంకేది?”

అని సి.నారాయణ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసారు.

“సిరిమల్లె సొగసు,
జాబిల్లి వెలుగు
నీలోనె చూసానులే”

అని..

పెరిగీ తరిగేను నెలరాజు..
వెలుగును నీ మోము ప్రతిరోజు…

అనీ.. దాశరథి గారు మురిసిపోతే,

“నేల మీది జాబిలీ,
నింగిలోని సిరిమల్లీ,
నా చెలీ,నెచ్చెలీ…”

అంటూ ఆత్రేయ ఈసారి
జాబిలినే నేల మీదకు దింపేసారు.

“వెన్నెలా, వెన్నెలా వెన్నెలా ఈ రేయి కాచింది వెన్నెలా అమ్మాయి నీలాల
కన్నులా”

అని..,

“మంచుకొండల్లోన ఎండ కాసినట్లు మల్లెపూలు జల్లె వెన్నెల పిల్లదాని వాలుకన్నులా..”

అని..
వేటూరి అమ్మాయి కన్నుల నుండి వెన్నెలని
కురిపించారు.

ఇక వెన్నెల్లో గోదావరి అందం మరీ మెరిసిపోతుందట..

“కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా,
మెరిసే గోదారిలో విరబూసిన నురగలా..”

అసలు వెన్నెల చల్లగా ఉంటుందా?వేడిగా ఉంటుందా?విరహంలో ఉన్నవాళ్ళకి వెన్నెల వేడిగానే ఉంటుందట.ఈ విషయం ప్రబంధ సాహిత్యం లోని విరహవర్ణనలు చదివితే
తెలుస్తుంది.అంతేకాదు,
ఆ వేడిని భరించలేక కావ్య నాయికా నాయకులు కొందరు ఆ చలువరేడును నిందించారు,నిలదీసారు కూడ.

ఈ విషయంలో సినీ కవులు మాత్రం తక్కువా?

“వెన్నెలలోనె వేడి ఏలనో?వేడిమిలోనె
చల్లనేలనో?ఈ మాయ ఏమో జాబిలీ!”

“వెన్నెలకేల నాపై కోపం?,సెగలై ఎగసినది?”

“అలా మండిపడకే జాబిలీ..”

“వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడీ నీవే..”

అంటూ విరహగీతాలకు వెన్నెలను తోడు తెచ్చుకున్నారు.

ఇంత విరహార్తిని కలిగించే చందమామకు కూడా వియోగం ఉందండోయ్!ఎవరితో?ఇంకెవరితో? వెన్నెలతో.
చంద్రుడు వెన్నెల విరజిమ్ముతూ
ఎప్పుడూ నిండుగా కళకళలాడుతూ ఉంటే బాగుండును అని మనం అనుకుంటామా! కానీ అలా ఉండడు కదండీ! చంద్రుడు దినదినాభివృద్ధి చెందుతూ పూర్ణరూపంతో దర్శనమిచ్చేది పౌర్ణమి రోజు అయితే క్రమకమంగా కళలు కోల్పోతూ మాయమై పోయేది అమావాస్య రోజు.అమావాస్య నాడు కనీకన్పించకుండా ఉండే సన్నని నెలవంకను “సినీవాలి” అంటారు.

చంద్రుని కళలు పదహారు. అందుకే చంద్రుడిని షోడశకళాపూర్ణుడు,
షోడశ కళానిధి అంటారు. అంటారు.అమృత,
మానద,పూష,
తుష్టి, సృష్టి, రతి, ధృతి,శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న , శ్రీ ,ప్రీతి,
అంగద,పూర్ణ,పూర్ణామృత
అనే పదహారు కళలకు నిధి చంద్రుడు.

ఎంతవారలైనా కష్టాల
నుండి తప్పించుకోలేరు కదా!చంద్రుడినీ గ్రహణాల
రూపంలో కష్టాలు పీడిస్తూనే ఉంటాయి.
అయితే గ్రహణం విడిచాక చంద్రుడు రెట్టింపు కాంతితో ప్రకాశిస్తాడు.
అందుకే కష్టాలు,
అపవాదుల నుండి బయటపడిన వారిని “గ్రహణం విడిచిన చంద్రుడు”లా ప్రకాశిస్తున్నాడు అంటారు.

అసలు చంద్రుడు అంటేనే మనసును సంతోషింప చేసేవాడు అని అర్థం. మనసుకు
స్వస్థత చేకూర్చి,ధైర్యాన్ని
ఇచ్చేవాడే చంద్రుడు.
అందుకే కృతజ్ఞతగా
ఆ “చంద్రునికో నూలుపోగు” సమర్పిస్తాము.

80 ఏళ్ళకు పైగా
(80 ఏళ్ల 8 నెలలు)
జీవించిన వ్యక్తికి
“సహస్ర చంద్ర దర్శనం”
వేడుక నిర్వహిస్తారు.

ఇలా చందమామ,
వెన్నెల మనిషి జీవితంతో
విడదీయరానంతగా పెనవేసుకుపోయాయి. ఆ
చల్లనయ్య అందానికి దాసుడైపోయిన మానవుడు ఆ చందమామ మీదే కాపురం పెట్టేయాలి అనుకుంటున్నాడు.

ఇన్ని విన్నాక,మరి ఇంకెందుకు ఆలస్యం? ఒక చల్లని వెన్నెల వేళ అలా డాబా మీదకు వెళ్ళి వెన్నెల జల్లులు కురిపించే ఆ పూర్ణచంద్రబింబాన్ని తిలకించండి.వెన్నెల సముద్రంలో మునకలు వేయండి.ఆ హాయిని అనుభూతి చెందండి.ఏదో తెలియని ఆనందం, శాంతి కలుగవూ? జీవితంపై మమకారం పెరగదూ?? మీ శరీరం మాత్రమే కాదు మనసు, ఆత్మ కూడా ఆ వెన్నెల వానలో తడిసి ముద్దయిపోవూ.

Written by Jyotsna Tatiraju

Jyothsna Tatiraju
M.A.(Telugu),M.A.(Sanskrit),B.Ed.
ఉపాధ్యాయురాలిగా 28 ఏళ్ల అనుభవం ఉంది.
శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూలు,శ్రీ చైతన్య టెక్నో స్కూళ్లలో పనిచేసాను.
2005 నుండి కథలు వ్రాస్తున్నాను.నా మొదటి కథ "తరలిరాదా తనే వసంతం" ఆంధ్ర భూమి దినపత్రిక లో,రెండవ కథ " "వెన్నెలవాన" నవ్య వీక్లీ లో ప్రచురింపబడ్డాయి.
ఇంకా కొన్ని కథలు 'నవ్య' వీక్లీలలో, 'రచన' మాసపత్రికల్లో ప్రచురింపబడ్డాయి.'సెల్ ఫోన్' అనే కవిత 'కవితాప్రస్థానం' అనే వచన కవితా సంకలనం లో ప్రచురింపబడింది.
మొదట్లో ' వెన్నెల ' అనే కలం పేరుతో కొన్ని రచనలు చేసాను.,Facebook లో వ్రాస్తూ ఉంటాను.(దేనికీ పంపించక పోవటం,ఊరికే వ్రాసి పెట్టుకోవడం వల్ల అముద్రిత కవితలు,కథలు చాలా ఉంటాయి)
పుస్తకాలు చదవటం అంటే చాలా ఆసక్తి.తెలుగు,సంస్కృత సాహిత్యాలు, సాంఘిక,చారిత్రాత్మక నవలలు అన్నీ చదువుతాను.ప్రవచనాలు,
సినిమా పాటలు,లలిత సంగీతం,సెమీ క్లాసికల్ ఆసక్తిగా వింటాను.తెలుగు పజిల్స్ ఆసక్తిగా పూర్తిచేస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సాహిత్యస్ఫూర్తి రజితగారికి అక్షరనీరాజనం

చుట్టపు దయ్యం