తేది: 27-8-24 & 28-8-24 కిందటి భాగం తరువాయి …
స్విస్ బాంక్, లయన్ మోనోమెంట్ స్విట్జర్లాండ్
టిట్లీ పర్వతం చూసాక మమ్మల్ని జూరిచ్ లోని అత్యంత ప్రధానమైన లూసర్న్ కూడలికి తీసుకెళ్ళారు. చాలా పాష్ గా కనబడే షాప్లున్నాయి. అక్కడే మనకు ఎంతో చిరపరిచిత మైన, ప్రతీ ఎలక్షన్ ల సమయంలో రాజకీయంగా ప్రభుత్వం, ప్రజలనోళ్ళలో ఆడే స్విస్ బాంక్ అక్కడ కనబడింది. అందరం దాని ముందు నిలుచుని ఆ భవనం అందాల్ని చూస్తూ ఉండి పోయాము.
Credit Suisse స్విట్జర్లాండ్‌లో స్థాపించబడిన ఒక ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ. ఇది 19వ శతాబ్దం నుండి ప్రపంచ ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆ ప్రసిద్ధ స్విస్ బ్యాంక్ కార్యాలయం భవనం పైన తెలుపు క్రాస్, ఎరుపు నేపథ్యంలో స్విస్ జెండా రెపరెప లాడుతుంది. భవనం నెయోక్లాసికల్ శైలి (పురాతన రోమన్ శైలి పోలికతో ఉంటుంది) భారీ స్తంభాలు, శిల్పాలు, ఫ్లవర్ బాక్సులతో అలంకరించబడిన కిటికీలు కనిపించాయి. క్రెడిట్ సూయిస్ ప్రధాన కార్యాలయాలు జ్యూరిచ్, జెనీవా వంటి స్విట్జర్లాండ్ లోని పెద్ద నగరాల్లో ఉన్నాయట. Credit Suisse బాంక్ 1856 సంవత్సరం లో, ఆల్ఫ్రెడ్ ఎస్చర్ (Alfred Escher) – స్విస్ పార్లమెంటేరియన్ పారిశ్రామికవాది చేత స్థాపించబడింది. మొదట Schweizerische Kreditanstalt (SKA) అని పేరుతో ప్రారంభించినట్లు తెలిసింది. స్విట్జర్లాండ్‌లో రైల్వే నిర్మాణానికి, పారిశ్రామిక అభివృద్ధికి ఆర్థిక మద్దతు అందించేందుకు దీన్ని స్థాపించిన ముఖ్య ఉద్దేశ్యం.

అంతర్జాతీయ విస్తరణ1900ల ప్రారంభంలోనే జర్మనీ, అమెరికా వంటి దేశాల్లో కార్యకలాపాలు ప్రారంభించింది. 1970-1990 మధ్యకాలంలో అనేక అంతర్జాతీయ సంస్థలను కొనుగోలు చేసింది (ఉదా: First Boston – USA లో). Credit Suisse First Boston అనే పేరు కూడా ఉపయోగించింది ఒక కాలంలోనే. వ్యక్తిగత బ్యాంకింగ్, నిధుల నిర్వహణ (Asset Management), ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్ (ఉన్నత ఆస్తి కలిగిన వ్యక్తులకు) సేవలకు ఉపయోగింపబడింది.
2023లో తీవ్రమైన నష్టం, పెట్టుబడిదారుల విశ్వాస హీనత వల్ల, స్విస్ ప్రభుత్వ మద్దతుతో Credit Suisse ను UBS (ఇంకొక పెద్ద స్విస్ బ్యాంక్) చేత కొనుగోలు చేశారు. ఇప్పుడు UBSలో భాగంగా ఉంది. కొన్ని శాఖలు కొనసాగుతుండవచ్చు, కానీ దాదాపు మిళితమైనవి.

అందరూ అక్కడే ఉన్న పెద్ద పెద్ద మాల్సులో షాపింగ్ కోసం పరిగెట్టాలని చూసారు. వాళ్ళకి షాపింగ్ చేసే అవకాశాన్ని తరువాత ఇస్తానని ముందు మనం చూసే గొప్ప మోనొమెంట్ దగ్గరికి వెళ్దామని వైదేహి అటువేపు మమ్మల్ని తీసుకెళ్ళింది. ఆ కూడలికి దగ్గర్లో ఉన్న లూసెర్న్ సింహ శిల్పం (Lion Monument of Lucerne) దగ్గరికి వెళ్ళాము. ఒక పార్క్ లాంటి ప్రదేశం అక్కడ ఒక చిన్న రాతి కొండ, దాన్ని ఆనుకుని చిన్న సరస్సు చుట్టూ వృక్షాలు పక్షుల కిలకిలారావాలు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది.
దాని గురించి ఒక ఆసక్తికరమైన, కొంచెం వినోదాత్మకంగా చెప్పబడే పురాణపు కథ ఉందిని వైదేహి చెప్పింది. ముందు మమ్మల్ని ఆ ప్లేస్ కి తీసుకెళ్ళి నిలబెట్టి ఆ శిల్పాన్ని ఫొటోలు తీసుకోమని, దాన్ని జూమ్ చేస్తూ నిశితంగా పరిశీలించమని, ఏంకనిపిస్తుందో చెప్పమని అంది. అందరం పొలో మంటూ పిక్చర్స్ తీసాము. కాని మాకు ఒక గూట్లో సింహం తప్ప ఏమి కనబడ లేదు. దాని గురించి వివరిస్తూ, ఈ శిల్పాన్ని ప్రాణత్యాగం చేసిన స్విస్ సైనికుల జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసారని, మొదట శిల్పి తన కళను తక్కువ అంచనా వేసారని రాతి మీద పంది ఆకారాన్ని చెక్కాడని తరువాత నిర్వాహకుల కోరిక మేరకు సింహాన్ని చెక్కాడని చెప్పింది.
కళాకారుడు, ఆయన నైపుణ్యం పట్ల ప్రజల అభిప్రాయాల మధ్య సాగిన చిన్న హాస్యపూరిత సంఘటనలా చెప్పబడుతుంది. ఈ కథ చరిత్రలో వాస్తవంగా జరిగిందా అన్నది నిర్ధారించలేకపోయినా, ఈ కథ చాలా ప్రాచుర్యం పొందింది. చెక్కడం ప్రారంభించే ముందు, అహోర్న్ ఒక పంది ఆకారంని పర్వతంలో చెక్కాడు. ఇది తాత్కాలికం మాత్రమే. నిర్వాహకులు (లూయిస్ పఫ్ఫెర్ సహా) ఈ పంది చూడగానే షాక్‌కు గురయ్యారట. సైనికుల ధైర్యసాహసాలు వారి కర్తవ్యనిర్వహణానికి, స్వామి భక్తికి నిదర్శనంగా శిల్పం కావాలంటే పిరికితనానికి గుర్తుగా పంది శిల్పం చెక్కడంపై విస్మయానికి గురైయ్యారట. అదే అహోర్న్ ని అడిగినపుడు ఆయన వారితో “మీరు నన్ను ఎంత విలువ లేని కళాకారుడిగా భావిస్తున్నారో చూశాను. ఇప్పుడు నిజమైన కళాకృతిని ప్రారంభిస్తాను.” అన్నాడట. ఆ తర్వాతే పంది ఆకారంలోనే అందమైన సింహాన్ని చెక్కడం ప్రారంభించాడట. కళాకారుడి నైపుణ్యాన్ని అవమానించిన వారికి వినూత్నంగా ప్రతిస్పందించారట. ఇది ఒక “don’t judge too soon” కథలా భావించవచ్చు. ఏ కళాకారుడిని లేదా పనిని పూర్తిగా అర్థం చేసుకోకుండా విమర్శించకూడదని చెప్పే హాస్యరూప సందేశం. “పంది నుంచి సింహం” అనే మార్పే ఈ కథను మరింత జ్ఞాపకాలుగా మార్చింది. ఈ కథకు ఎటువంటి ప్రామాణిక చారిత్రిక ఆధారాలు లేవు. ఇది స్థానికంగా, పర్యాటకులకు వినిపించే ప్రజల నోటి మాట కథ మాత్రమే. కానీ కథ వినడానికి మాత్రం ఆసక్తికరంగానే ఉంటుంది!
ఇక అసలైన చారిత్రక విశేషాలను గమనిస్తే.. స్విట్జర్లాండ్‌లోని లూసెర్న్ (Lucerne) పట్టణంలో ఉన్న ప్రఖ్యాత Lion Monument (Löwendenkmal) అనేది ఒక దుఃఖాత్మక శిల్పం, ఇది 1792లో ఫ్రాన్స్‌లోని ట్యూలెరీస్ మఠం వద్ద ప్రాణత్యాగం చేసిన స్విస్ గార్డుల జ్ఞాపకార్థంగా నిర్మించబడింది. ఈ స్విస్ సైనికులు ఫ్రెంచ్ రాజు లూయీ XVIను రక్షించేందుకు పోరాడి ప్రాణాలు విడిచారు.

ఈ శిల్పానికి కార్ల్ పెఫ్ఫర్ వాన్ ఆల్తెన్ (Carl Pfyffer von Altishofen) కారకుడు. డేనిష్ శిల్పి Bertel Thorvaldsen 1820–1821 లలో రూపకల్పన చేసారు. తర్వాత లూకాస్ అహోర్న్ అనే జర్మన్ శిల్పి దీన్ని చెక్కాడట. ఆయన దీనిపై “HELVETIORUM FIDEI AC VIRTUTI” అని లాటిన్ భాషలో చెక్కారు. అంటే “To the loyalty and bravery of the Swiss” (స్విస్ జాతీయుల విశ్వాసానికి మరియు ధైర్యానికి నివాళి) అని అర్థం. శిల్పంలో ఉన్న సింహం గాయపడి, మరణిస్తున్న దుఃఖదాయక దృశ్యాన్ని చూపుతుంది. సింహం పక్కన రాజుకి చెందిన ఫ్రెంచ్ రాయల్ హౌస్ శ్రేణి చిహ్నం (shield with fleur-de-lis) ఉంది. పక్కన స్విస్ కవచం (shield with a cross) కూడా ఉంది – ఇది స్విస్ గార్డులను సూచిస్తుంది. ఇది యుద్ధంలో మరణించిన సాధారణ జ్ఞాపక చిహ్నం మాత్రమే కాదు, స్విస్ వారి నిస్వార్థమైన సేవ, విధేయత, ధైర్యానికి గౌరవ సూచకంగా నిలుస్తుంది. ఇది లూసెర్న్‌లో అత్యంత సందర్శించదగిన చారిత్రక ప్రదేశాలలో ఒకటి.
1792 సంవత్సరం. ఫ్రాన్స్‌లో ప్రజల మధ్య పెద్ద నిరసనలు, హింసలు జరుగుతున్నాయి. ప్రజలు రాజుల మీద విరక్తి చెందారు. రాజు “లూయీ XVI (Louis XVI)” ను తొలగించాలని నిర్ణయించుకున్నారు. అలాంటి సమయాల్లో, ఫ్రెంచ్ రాజు తనను రక్షించేందుకు ప్రత్యేకమైన సైనికులను ఉంచాడు వారు స్విట్జర్లాండ్ నుండి వచ్చిన స్విస్ గార్డులు. ఈ గార్డులు అత్యంత విధేయతతో, ధైర్యంతో పనిచేసేవారు. “రాజు అంటే దేవుని ప్రతినిధి” అనే నమ్మకంతో వారు సేవచేసేవారు. 1792, ఆగస్ట్ 10న, ప్రజలు ట్యూలెరీస్ మఠాన్ని (Tuileries Palace, ఫ్రాన్స్ రాజమహలు) అరుపులతో, ఆయుధాలతో చుట్టుముట్టారు. వారు రాజును అరెస్టు చేయాలని ఆదేశించారట. రాజు తన కుటుంబంతో వేరే ప్రదేశానికి పారిపోయాడు. కానీ తన కోసం విధేయంగా ఉండే 700 మందికిపైగా స్విస్ గార్డులు అక్కడే ఉండిపోయారు. అయినా వారు తమ స్వామి భక్తిని నిలబెట్టుకున్నారు. ఆ గార్డులు అసమానంగా పోరాడారు. చివరకు వారి దగ్గర బుల్లెట్లు, ఆయుధాలు తక్కువవడంతో ప్రజలు వారిని చంపేశారు. కొన్ని అంచనాల ప్రకారం, దాదాపు 760 స్విస్ గార్డులు అప్పుడు మరణించారు. వారి జ్ఞాపకార్థంగా ఈ శిల్పం రూపొందించబడిందన్న మాట.
స్విస్ అధికారి కార్ల్ పెఫ్ఫర్ వాన్ ఆల్తెన్ (Karl Pfyffer von Altishofen) అనే వ్యక్తి ఆ సంఘటనను చూసి ఎంతో కలతపడ్డాడు. ఆయన స్విట్జర్లాండ్‌కి వచ్చి, వారి త్యాగాన్ని గుర్తుండిపోయేలా ఓ శిల్పాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే 1821లో లూసెర్న్‌లో కొండను చెక్కించి, ఒక గాయపడి, ప్రాణం విడుస్తున్న సింహాన్ని రూపొందించారు.
ఈ సింహం, స్విస్ గార్డుల ధైర్యం, విధేయతను, త్యాగాన్నిభీకరంగా చూపుతుంది. ఆ ప్రత్యేకతను చూపుతూ “HELVETIORUM FIDEI AC VIRTUTI” “స్విస్ ప్రజల విశ్వాసం మరియు ధైర్యానికి” అని లాటిన్లో వ్రాయించాడు. క్రింద మరో వాక్యం వారు మరణించిన తేదీలను సూచిస్తుంది “DIE X AUGUSTI II ET IIII SEPTEMBRIS MDCCXCII” (10 ఆగస్టు & 2, 4 సెప్టెంబరు 1792) అని. ఈ విధంగా తమ శాంతిమయ నివాళిని అర్పించాడు.
ఈ శిల్పం ముందు నిల్చున్న ప్రతీ ఒక్కరికి ఒక తీవ్రమైన భావోద్వేగం కలుగుతుంది. అది ధైర్యానికి, విధేయతకి ఇచ్చే నిజమైన గౌరవం. అది యుద్ధాన్ని గౌరవించదు, కానీ వారిని గౌరవిస్తుంది. వారు జీవితాన్ని త్యాగం చేసిన సైనికులను. ఈ శిల్పం ఇప్పుడు లూసెర్న్కి వెళ్లే ప్రతీ పర్యాటకుడి తప్పనిసరి దర్శనీయ స్థలం. ఇది ప్రపంచంలోనే అత్యంత భావోద్వేగానికి లోను చేసే శిల్పాలలో ఒకటిగా గుర్తించబడింది. ఇలాంటి చారిత్రక శిల్పాలు, మనకు గతాన్ని గుర్తు చేయడమే కాక, విలువలను మెరుగుపరచడానికి ప్రేరణనిస్తాయనే భావన అక్కడి ప్రజల్లో.

లూసెర్న్ సింహ శిల్పం (Lion Monument) పక్కన ఉన్న సరస్సు/చిన్న కుంట (Pond) కూడా ఈ స్థలానికి ఒక ప్రత్యేక శాంతియుత వాతావరణాన్ని ఇస్తుంది. దీనికి ప్రత్యేకమైన చారిత్రక పేరు లేకపోయినప్పటికీ, ఇది శిల్పాన్ని ఆనుకుని ఉండే ఆవరణలో భాగంగా ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది.
ఈ నీటి కుంట శిల్పం ప్రతిబింబాన్ని స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. ఇది శిల్పాన్ని మరింత భావోద్వేగంగా చూడడానికి సహాయపడుతుంది. ఉదయం, సాయంత్రం సమయంలో నీటిలో ప్రతిబింబంతో పాటు చుట్టూ పడే చాయలు దృశ్యాన్ని ఎంతో అందంగా మారుస్తాయి. శిల్పం వెనక చరిత్ర ఎంతో రక్తపాతం ఉన్నదిగా ఉన్నా, ఈ చిన్న సరస్సు ఒక శాంతి, ధ్యానం శాంతి చిహ్నం గా నివాళి గుర్తుగా నిలుస్తుంది. పర్యాటకులు ఇక్కడ కూర్చొని, మౌనంగా తమ శ్రధ్ధాంజలి ఘటిస్తారు. అది త్యాగానికి ఇచ్చే మౌన గౌరవం. సరస్సు చుట్టూ చిన్న చెట్లు, పూలు, పచ్చదనం ఉంటుంది. ఇది ఒక సహజ పార్క్ వాతావరణాన్ని కలిగిస్తుంది. కొన్ని పక్షులు, చేపలు కూడా ఇందులో కనిపిస్తాయి, ఇది అక్కడి జీవవైవిధ్యాన్ని సూచిస్తుంది. ఇది నివాళి మూడ్‌ను బలపరిచే నిర్మాణం. ఈ సరస్సు, శిల్పం కింద కొంచెం లోతుగా ఉండేలా రూపొందించారు. ఇది “ఒంచిన తలతో నివాళి అర్పించడం” అనే భావనను కలిగిస్తుంది. పక్కనే చిన్న చిన్న బంచులు, రాళ్ళపై కూర్చునే ఏర్పాట్లు ఉండటంతో పర్యాటకులు సైలెంట్ గా గడిపేందుకు అనువుగా ఉంటుంది.
ఈ సరస్సు ముందు నిలబడి తీసే ఫోటోలు, శిల్పంతో పాటు ప్రతిబింబాన్ని కలిపేలా చాలా కళాత్మకంగా కనిపిస్తాయి. పచ్చని వాతావరణం మధ్యలో ఈ సింహం శిల్పం మరింత గొప్పగా కనిపిస్తుంది. ఈ సరస్సు చిన్నదైనా, అది Lion Monument కి శాంతి, భావన, గౌరవాన్ని మరింత బలపరచే భాగం. ఇది కేవలం నీటిగుంత కాదు అది ఒక చలించిన చరిత్రకు చినుకంత తేజం.

బరువైన మనసుతో అక్కడినుండి బయలు దేరి మళ్ళీ లూసర్న్ సెంటర్ వచ్చాము. ఎవరికి వారు మాల్స్ లోకి పరుగులు తీసారు. ఎప్పటిలానే ప్రణయ్ ఏదో షాపింగ్ చేయటానికి వెళ్ళి పోయాడు. జ్యోతి, జూలియా వాళ్ళు కనబడలేదు. నేను మిథాలి వాళ్ళతో పాటు ఒక షాపులోకి వెళ్ళాను. ఏం కొనాలో తెలియలేదు. ఎన్నో అందమైన గిఫ్ట్స్ కనబడుతున్నాయి. అక్కడి గుర్తుగా ఉంటుందని చిన్నసైజు మాగ్నెట్ తో ఉన్న కుకూ గడియారం ఫ్రిజ్ పై పెట్టటానికి కొన్నాను. చిన్న చాక్లెట్స్ పౌచ్ కూడా తీసుకున్నాను. అంతే నా షాపింగ్. మేము షాపు బయటకు వచ్చినా అక్కడ ఎవరూ కనిపించలేదు. వెళ్ళి బస్‌లో కూచున్నాక చాలా సేపటికి గాని షాపింగ్ బాగ్లను పట్టుకుని మిగిలిన వాళ్ళు వచ్చారు. ఆ రోజే చివరి రోజు కావటంతో షాపింగ్ మెండుగానే చేసారంతా. హోటల్ చేరుకుని డిన్నర్ చేసి కాసేపు లాంజ్ లోనే మేమంతా గడిపాము. పక్కనే ఉన్న మరో షాపింగ్ మాల్ లోకి వెళదామంటే మిథాలి, జ్యోతి, అహమ్మదాబాద్ తల్లి కూతుళ్ళు కాజల్ బేన్, ప్రాచీ నటావర్బాయ్ లతో నడుచుకుంటూ వెళ్ళాము. అది టాంపా అమెరికాలో ఉన్నట్టుగానే ఉన్న చాలా పెద్ద మాల్. కాసేపు అలా తిరిగి వచ్చేసాము. కలిసి కొన్ని ఫొటోస్ తీసుకుని మా మా గదుల్లోకి వెళ్ళి పోయాము. నేను ప్రణయ్ బాగ్ లన్ని సర్దుకుని మరునాడు ప్రయాణానికి వేసుకోవలసిన డ్రెసెస్ బయట పెట్టుకుని అన్ని పాక్ చేసుకున్నాము. పర్ఫ్యూమ్ బాటిల్స్ పగిలి పోకుండా బట్టల మధ్యలో పెట్టేసాము. మేము పెద్దగా షాపింగ్ లు ఏమి చేయక పోవటం, లండన్ లో ఉన్న మా అన్నయ్య మనవడు అక్షర్ కోసం తెచ్చిన వస్తువుల చిన్న బాగ్ ఖాళీగానే ఉండటం వల్ల మాకు బాగ్స్ పాకింగ్ పెద్దగా బాధపెట్టలేదు. ఒకసారి ఉజ్వలతో మాట్లాడి ఫొటోలు ఫార్వర్డ్ చేసి పడుకున్నాము. జ్యోతి, మిథాలి వాళ్ళతో పాటు చాలా మంది ఉదయమే వెళ్ళే ఫ్లైట్ లో వెళ్ళి పోతున్నారు. వాళ్ళు మళ్ళీ ఇక కలవమనే బాధ మనసుని కలచి వేస్తుంది. ముంబాయి రమ్మని పదేపదే చెప్పారు మిథాలి తల్లికూతుళ్ళు. తాను హైదరాబాద్ పోచంపల్లి సారీస్ కోసం వస్తానంది. ఆ అమ్మాయి సారీస్ బిజినెస్ చేస్తుంది. అలా మాట్లాడుకున్నాము కాని అది అయ్యేపని కాదని నాకు తెలుసు. కాని విడిపోతున్నందుకు చాలా బాధగా అనిపించింది. అలా ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్ళి పోయాను.
మరునాడు పొద్దుటి బాచ్ ని తీసుకుని బస్సు ఆరున్నరకు తిరుగు ప్రయాణానికి జూరిచ్ ఏర్పోర్ట్కి వెళ్ళి పోయింది. మిగిలిన అందరం బ్రేక్ ఫాస్ట్ లో కలిసాము. కొత్తగూడెం తెలుగు ఫామిలీతో కలిసి మార్నింగ్ టిఫిన్ అయిందనిపించాము. స్నానం చేసాక, మరోసారి బాగ్లన్ని సర్దుకుని రూమంతా చెక్ చేసుకుని కింద లాంజ్ లోకి వచ్చేసరికి పన్నెండయిపోయింది. హోటల్ నుంచి ఏర్పోర్ట్ కి బయలు దేరాము. ఇన్ని రోజులు అందరితో సరదాగా గడిపి ఇప్పుడు విడిపోతున్నందుకు మనసు బాధగా అనిపించింది. లంచ్ ఏర్పోర్ట్ రెస్టారెంటులో కానిచ్చాము. వైదేహి మా అందరితో కలిపి ఫోటోలు తీసింది. అందరం డిల్లి ప్లేన్ లో ఇండియా బయలు దేరాము. రెండు గంటల తరువాత వైదేహి పారిస్ తిరిగి వెళ్తానని చెప్పింది. మా జర్నీముగిసినా, ఆమె తిరిగి ఇంకో కొత్త గ్రూప్ తో మళ్ళీ ప్రయాణం. అది ఆమె ఉద్యోగం మరి.
ఉదయం రెండు గంటల లేట్ అయి ఉదయం 8.44 కి డిల్లీ చేరాము. నెక్స్ట్ కనెక్టెడ్ హైదరాబాద్ ప్లైట్ 9.30 కే. మిస్ అవటం వల్ల ఏర్ ఇండియా పదకొండున్నర ఫ్లైట్ మాకు అరేంజ్ చేసారు. మేము, కొత్తెగూడెం వాళ్ళు హైదరాబాద్. మిగిలిన వారంతా ఎవరికి వారు విడిపోయారు. మన భాగ్యనగరంలో కాలు మోపేసరికి మధ్యాహ్నం 2.40 అయింది. టాక్సీలో ఇల్లు చేరేసరికి నాలుగు దాటిపోయింది.
ప్రయాణం మొదట్లో ఎంతో కంగారు పడ్డాను. కాని అంతా ఆనందంగా సంతోషంగా గడిచిపోయింది. థామస్ కుక్ ట్రావెల్ ఏజెన్సీకి, ప్రత్యేకంగా ట్రూప్ మేనేజర్ వైదేహి కి, నాతో ప్రయాణం లో భాగమై ఎంతో ఆత్మీయతను పంచిన తోటి ప్రయాణీకులకు మనస్పూర్తి గా కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేక పోయాను. ఈ యూరోప్ జర్నీ అంతా జీవితంలో ఎన్నో కొత్త కొత్త అనుభవాలు కలిగించింది. మళ్ళీ అవకాశం వస్తే మిగిలిన యూరోప్ దేశాలు చుట్టి రావాలని కలలు కంటున్నాను.
చివరగా నా, ఈ మరచిపోలేని అనుభవాలను మీతో పంచుకోనిచ్చినందుకు తరుణి పత్రిక యాజమాన్యానికి, ప్రతీ ఎపిసోడ్‌ని చదివి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన పాఠక దేవుళ్ళకు మనస్పూర్తిగా కృతజ్ఞాభివందనాలు.
ముగిసింది.