రమక్కతో ముచ్చట్లు – 28

గురువువా…! గురిగివా…!!

అందరికీ శనార్థులు.మంచిగున్నరా!

వ్యాసం కు పైన శీర్షిక చూసిన్రు కదా! విననీకే..ఎంత బాధ అనిపిస్తుంది. ఏమన్న రీతి అనిపిస్తుంద వాక్యం.

“గురువువా…! గురిగివా!!” – ఈ పిలుపు మన సమాజంల ఉన్న చేదు నిజాన్ని బయటపెడుతుంది. ఒకప్పుడు దునియ దేవునికంటే గురువు గొప్పోడు అని నమ్ముతుండె. మరి గిప్పుడు అద్మాన్నం అయిపోయింది. గురువులంటే భయం లేదు. చదువు చెప్పే టీచర్ అంటే, ఇజ్జత్ లేదు. మంచి చెప్పేటోల్లను జోకర్ లెక్క చూస్తున్నరు. జ్ఞానం, విలువలు, మానవత – ఇవన్నీ ఒక గురువే నేర్పుతడు. కాని ఈ కాలంల గురువును కేవలం ఉద్యోగి, మార్కుల తరాజ్ వేసే యంత్రంలెక్క మాత్రమే చూసే పరిస్థితి ఏర్పడింది.
పిల్లలు మాటినరు, సదుకోరు, క్రమశిక్షణ ఉండదు. కానీ టీచర్ వాళ్ళను ఒక్క మాట అనొద్దు. చెయ్యెత్తి కొట్టొద్దు. అట్ల చేస్తే తల్లిదండ్రులు ఉర్కొచ్చి చాలా స్కూళ్లల్ల, టీచర్లను కొట్టినోళ్లు ఉన్నరు. ఏం చేస్తం…! వాళ్ల బతుకులు ఎట్లా..? పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయితది అన్న సోయి లేదు.
గురువును గౌరవించని సమాజం, విలువలను కోల్పోయిన యువతను తయారు చేస్తది. ఆ విలువలేని యువత దేశ భవిష్యత్తును పాడు చేస్తది. గురువుల స్థితి… యువత స్థితి,జాతి స్థితి ఇవన్నీ పరస్పరంగ అనుసంధానమై ఉంటయి. చానా పెద్దగా ఆలోచించాల్సిన ముచ్చట ఇది. ఇది దిమాక్ల పోతే పిల్లల్ని ఎట్ల పెంచాలి, గురువులకు ఎట్ల గౌరవం ఇయ్యాలి అన్నది ప్రతి ఒక్కరికి తెలుస్తది.

మనదేశంను విశ్వగురువు అన్నరు. భారతీయ సంస్కృతిల గురువు స్థానం గొప్పది. మన పురాతన సంప్రదాయంల గురువు దేవునికన్న గొప్పోడు.
‘ఆచార్యదేవో భవ” అన్నది ఉపనిషత్తుల మాట. గురువు శిష్యునికి ఉట్టి పాఠ్యాంశం మాత్రమే కాదు, జీవన సారం, నైతిక విలువలు, ధర్మబోధ చేసేటోడు.
గురుకుల వ్యవస్థ ఉండేటిది. శిష్యుడు గురువు సేవల ఉండి, జీవన విధానం నేర్చుకునేటోడు.
కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. గురుకులంలేదు. హాస్టల్లు వచ్చినయ్. పైసల పరమైపోయింది సదువు. గురువు స్థానం పూర్తిగ మారిపోయింది, గురువు గురిగి అయిపోయిండు.

విద్యాసంస్థలు వ్యాపారమయి పోయినయ్ . సదువు వస్తువు అయిపోయింది. పైసలిస్తున్నం, కొంటున్నం కాడికి వచ్చింది లెక్క! ఇగ గురు సేవకు ఎక్కడున్నది ఖ్యాల్. తొవ్వ బంద్ అయిపోయింది. సదువు అంటే ‘మార్కులు – ర్యాంకులు – సీట్లు’ ఈ గీత దాటితే గురువు పనికిరాడు ఇప్పటి వ్యవస్థల.

“నా పిల్లగాడు మంచి మార్కులు తెచ్చిండా లేదా?” అనే కోణంలనే గురువు స్థాయిని కొలుస్తున్నం.
ఇంటర్నెట్, గూగుల్, యూట్యూబ్లు అందుబాటులకు వచ్చినయ్ ఇప్పుడు AI కూడా మోపయ్యిందాయే! “గురువు అవసరమేంది?” అన్న ఆలోచన వచ్చేసింది.
కానీ తమ్మీ….! సమాచారం ఇచ్చుడు వేరు,మార్గదర్శనం చేసుడు వేరు! ఈ తేడా విద్యార్థులు తల్లిదండ్రులు గుర్తుపట్టాలి. మనిషి అంటే జ్ఞానమున్న యంత్రం కాదు. హృదయమున్న మనీషి. మానవత్వం ఉన్న ఒక దేవుడు. అలాంటి నిర్మాణము గురువులు – తల్లిదండ్రులు అంటే.. విద్యాసంస్థలు- కుటుంబము చెయ్యాలి. లేకుంటే వాడు గొప్ప వ్యక్తిగ ఎట్ల తయ్యారైతడు. సమాజాన్ని ఏం బాగుజేస్తడు? వాడిని, వాడు ఏం ఉద్ధరించుకుంటడు?
మీడియా, సినిమాలు సుత గురువులను వ్యంగ్యంగ జోకర్ల లెక్క చూపుతున్నరు.సమాజం గురువులను గౌరవించడం మర్చిపోతుంది.
నాకు మస్తు ఎరుకున్న ఒక ముచ్చట చెప్త వినుండి. ఒక పిల్లగాడు పోయి,వాళ్ళ అమ్మా నాన్నలను ‘టీచర్స్ డే ఉంది. మా టీచర్ యాభై రూపాయలు తెమ్మన్నది. మేము సన్మానం చేస్తము’ అని ఒక తల్లిని అడిగితే.. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఏమన్నరో ఎర్కనా శెల్లె..? ‘మస్తు ఫీజు కడుతున్నం,మీ టీచర్ చెప్పే సదువుకి ఒక గిఫ్ట్ సుతనా! ఏం వద్దు. పైసలు ఇయ్యపో’ అని గెదిమిన్రు. అంటే ఇక్కడ ముచ్చట యాభై రూపాయలది కాదు. పిల్లగానికి ఏమి అర్థం అయితది.. ఏం అర్థం చేస్తున్నమూ.. ఫీజు కడుతున్నము వాళ్ళు సదువు జెప్తున్నరు గంతే. దుకాణంల సేల్స్ మెన్ లెక్క! అందుకే పిల్లలు సుతా.. ఇప్పుడు టీచర్లకు ఇజ్జత్ ఇయ్యరు, పెరిగి పెద్దగైనంక కన్న అవ్వ-అయ్యలకు సుత ఇజ్జత్ ఇయ్యరు! సమాజంల ఎవ్వరికీ ఇజ్జత్ ఇయ్యరు. ప్రస్తుతము మీరు గమనించుండి. అదే జరుగుతున్నది సమాజంల! దీన్నే ‘కూసున్న శెట్టుకొమ్మను నరుక్కునుడు అంటరు’
గౌరవించుడు, నమస్కారం చేసుడు, గురువుల మీద భక్తి కలిగి ఉండుడు, తప్పు చేస్తే క్షమించమని అడుగుడు, పెద్దవాళ్ళను గౌరవించుడు, ఇవన్నీ క్రమశిక్షణ పేరుతో స్కూల్ల పిల్లలకు చిన్నప్పటినుంచి చెప్పుకుంటూ వస్తరు. కనుక పిల్లలు సక్క తోవలు పోతరు. వాళ్ళను సక్కని తొవ్వల పోకుండ పెద్దోళ్ళే ఖరాబ్ చేస్తున్నరు. పిల్లలు తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టైనా సరే.. సరైన మార్గంల నడపాలి. డాక్టర్ చేదు మంది ఇచ్చి రోగం తగ్గియ్యడా..అట్ల!
లేకుంటే ఏముంది.. నిజాయితీ, గౌరవం, క్రమశిక్షణ వంటి విలువలు యువతల తగ్గిపోతయి. పోరలు బలాదూరైనంక, నెత్తి మీద శేతులు పెట్టుకొని కూసుంటరు అమ్మ నాయనలు. విజయం అంటే డబ్బు, పదవి మాత్రమే అన్న ఆలోచన చిన్నగున్నప్పటి నుంచే దిమాక్ల విత్తనమేసి, నీళ్ళేసి పెంచుతున్నరు. పైసలు సంపాదించడానికి వాడు యంత్రం మాత్రమే కాదు. మనిషి సుత.
గురువు మాట వినని విద్యార్థులు క్రమశిక్షణల వెనుకబడి, చదువుల నిర్లక్ష్యం పెంచుకుంటున్నరు.
“అన్నీ నాకే తెలుసు” అనే కాడికి ఆలోచన చేస్తున్నరు. కొంచెం కష్టం వస్తే తట్టుకునే శక్తి సుత ఉండదు. అందుకే ఆత్మహత్యలు సుత జరుగుతున్నయి పిల్లలయి.గురువు ప్రోత్సాహం ఉండదు,
చెప్పేటోళ్ళుండరు.మానసిక ఒత్తిడి గివన్నీ
చిన్నప్పటినుంచి సరైన తొవ్వ చూపించేటోళ్లు లేక,ఒకవేళ తొవ్వ చూపించే గురువులు ఉన్నా.. మనం వాళ్ళని ‘గురుగులు’ చేయడం వల్ల పిల్లల బతుకులు ఖరాబ్ అవుతున్నయి అన్నది మాత్రం నూటికి నూరు శాతం నిజం.
గురువు – మార్గదర్శి ఇది మర్వద్దు.
దీపస్తంభం లేకుంటే నావ దారి తప్పినట్లే, గురువు లేకుంటే యువత దారి తప్పుతది. చదువు విజ్ఞానంతో పాటు సంస్కారము.. మానవ విలువలు నేర్చుకోవాలి. అవి గురువులు నేర్పుతరు. లేకుంటే బాగా డబ్బు సంపాదించే ఉద్యోగాలు దొరుకుతయి. గాని మనిషిని అర్థం చేసుకునే హృదయం ఉండదు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగ మారరు.
ఒక గురువు నిర్లక్ష్యం వల్ల ఒక తరగతి పాడు అవుతది. అది సమాజాన్నే ప్రభావితం చేస్తది. అందుకే గురువు బాధ్యతగ ఉండాలి. గురువుకు గౌరవము విలువ, తన బతుకుకు అర్థం లభిస్తే గురువు బాధ్యతగ అయితరు.
గురువులను గౌరవించే విధానాలు తీసుకురావాలి. ప్రభుత్వ రంగం- ప్రైవేటు రంగం సుత సదువు చెప్తున్న టీచర్లను గౌరవించాలి. ఇజ్జత్ ఇయ్యాలి. పిల్లలు తమకు చదువు చెప్పే పంతుళ్లను గౌరవించేటట్టు తల్లిదండ్రులు చూడాలి.
గురువు అంటే జోకర్ కాదు. వస్తువుల అమ్ముకునే సేల్స్ మాన్ కాదు. స్ఫూర్తి ప్రదాత! మన బతుకుకు ఒక దారి సూపెట్టే దీపం! కార్పొరేట్ సంస్థలు వాణిజ్య ధోరణిని తగ్గించి గురువుల విలువను పెంచాలి.సమాజానికి ఉపయోగపడే యువతను అందించాలి.
పిల్లలూ…! మీకు విద్యా దానం చేసే గురువులు మీ శత్రువులు కాదు. మిమ్మల్ని మీ తల్లిదండ్రుల లెక్క ప్రేమించి, సరియైన మార్గంల మిమ్మల్ని నిలబెట్టాలని తపన బడే మీ శ్రేయోభిలాషులు. గురువును శత్రువుగా కాక, గౌరవనీయమైన బంధువుగా సూడండి.
“గూగుల్ అన్నీ నేర్పుతుది” అన్న తప్పుడు భావన మానుకోవాలి. అన్ని నేర్పుతది.. సరే కానీ,నీకు బతుకు మీద ఆశ సచ్చిపోతే, నీకు ఆశ చిగురింప చేసేది మాత్రం గూగుల్ కాదు. గురువు మార్గదర్శకత్వం లేకుంటే జ్ఞానం అసంపూర్ణం అని గుర్తించాలి.
“గురువు లేకుంటే జ్ఞానం లేదు, జ్ఞానం లేకుంటే భవిత లేదు” – ఈ మాట నేటి పరిస్థితికి అద్దం పడుతది. గురువును గౌరవించకపోతే యువత దారి తప్పుతుది, యువత దారి తప్పితే జాతి పాడు అవుతది. మన సమాజం మొత్తం గ్రహించాల్సిన నిజం ఇది. గురువుకు గౌరవం ఇవ్వడం అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు, భవిష్యత్తు రక్షణ.
గురువులను గౌరవించే సమాజమే అభివృద్ధి దిశగా సాగుతది.
అందుకే చెల్లే… తమ్మీ…!!
ఇది సదివిన అందరికీ నేను చేసే విన్నపం ఏందంటే… గురువులను గురుగులను చేసి ఒక మూలకు కూస వెట్టకండి. వాళ్ళు బతుకుకు దారి దీపాలు.

సదివిన అందరికీ కోటి దండాలు.

ఉంట మరి పైలం.
మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అట్లతద్ది

వొంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)