రమక్కతో ముచ్చట్లు -30

రైలు పయనం

అందరికీ శనార్థులు!
మంచి గున్నర
జర ఊర్లె పొంటి తిరుగుతున్న, అందుకనే మీతోని ముచ్చట పెట్టనీకి పుర్సత్ దొర్కలేదు.
ఎంకన్న కాడికి పోయినం, ఆడికెళ్ళి మర్కపురం పోయినం, మర్కపురంల మా శిన్న మేనత్త ఉంటది. ఆల్లను అటకాయించి, ఇగ పట్నం అచ్చినం. ఈ తిరుగుడు సల్లగుండ కాల్ జేతులు మస్తు గుంజుతున్నయి. ఇగ మా అత్తమ్మ అద్దనంగ అచ్చింది. ఎంకన్నకు మొక్కు ఉంది, జుట్టు ఇయ్యాలి అని. ఇప్పుడు మొత్తానికి అడ్డంపడ్డది!
పిల్లలు మంచిగనే అన్ని సౌలతులు చేసి, రైలుకు ఏసీ టికెట్లు కొని తోలిన్రు. అయినా మానాయే ఇంత నన్న రెస్టు లేదు అలసిపోయినం బాగ.

“చుకు చుకు రైలు వస్తుంది పక్కకు పక్కకు జరుగుండి ఆగినంక ఎక్కుండి.. ” ఈ పాట పాడని చిన్న పిల్లలు ఎవరైన ఉంటరా చెప్పుండి. మేము సుత మా చిన్నతనంల ఒక్కల అంగీలు ఒక్కల్లు పట్టుకొని, కూ.. చుకు చుకు చుకు అనుకుంట పాట పాడుకుంట ఆడుతుంటిమి. ఎంత సంతోషమో అసలు. రైలు అంటే పిల్లలకు ఒక సంబురం.

మన జీవితమే ఒక ఒడువని ప్రయాణం. ఆ ప్రయాణంల ఎన్ని కతలు, ఎన్ని అనుభవాలు, ఎన్ని ముచ్చట్లు ఎన్ని అచ్చట్లు. ఈడికెల్లి ఆందాక ఇంత పొడుగ్గ నాగుంబాము లెక్క పాకే రైలు ప్రయాణం అంటే శాన ఇష్టముంటది జనాలకు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని కలుపుకుంట, కొత్త కొత్త పరిచయాలు చేసుకుంట, ముందుకు నడిశే బతుకు తొవ్వకు గొప్ప నిషాని ఇది!
ఎంతమంది జనాలు, ఎన్ని అనుభవాలు. ప్లాట్ ఫాముల లొల్లి మొదలైతే, గమ్యం చేరేదాకా లొల్లి…లొల్లి ఆగమాగం, ముచ్చట్లు, సందడులు తినేటోళ్లు తింటుంటరు, పండేటోళ్ళు పంటుంటరు. చాయి సమోసలు బిస్కెట్లు అమ్ముకునేటోళ్లు, పిల్లలు వాటికోసం చేసే ఆగం. “వేడి చాయ్ చాయ్.. కాఫీ కాఫీ ” అనుకుంటా ఒక పోరడు, “హా.. వాటర్ బాటిల్ అనుకుంట ఇంకొకడు,వేడి బొండాలు, వడలు, పనసపండ్లు, జాంకాయలు, బోరీమిక్స్ అనుకుంట ప్యాలలు అమ్ముటోళ్ళు, గింతల కొంచం దూరంకెంచి చేతిల గజ్జెలు కొట్టుకుంట,పాటలు పడుకుంట అచ్చే అడుక్కునేటోళ్లు…మొత్తం దేశం నక్షా ఆడనే కానోస్తది ఇగ. గిట్ల ఒక శిన్న పండుగ వాతావరణంలెక్క గొడ్తది.

గీడ ఇచ్చెంత్రం ఏందంటే రిజర్వేషన్ ఉన్నోళ్లు సుత రైలు ప్లాట్‌ఫాంల ఆగుడు ఆలస్యం దిగేటోళ్ళని దిగనీయకుండ తొక్కుకుంట, బాగేజీలు లాక్కుంట కానొస్తరు, ఇగ ఆ పయ్యల సూటికేసులయితే ఎవల్ల కాలును ఖతం జేస్తయో చెప్పలేము. పక్కోడు కుయ్యో మొర్రో అని మటుకున్నా సూటికేసు గుంజుక పోయేటోళ్లకు సోయి సుత ఉండదు. ఇగ ధ్యానం చేసినట్టే ఉంటది ఆల్ల ఏకాగ్రత!
శిన్న లొల్లి గాదు ఈల్లది.
ఇగ ముచ్చట్లు మొదలైతయి.
ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కత. ఒకప్పుడు ఒకళ్ళు తెచ్చుకున్న పలారాలు ఇంకొకళ్లకి పెట్టేటోళ్ళు, ఇప్పుడు ఇది కానొస్తలేదు. జరుగుతున్న గోరాలు మోసాలు గట్లున్నయ్ మరి. ఎవ్వళ్ళను నమ్మేటట్టు లేదాయె మరి.

ఇగ కొట్లాటలు సుత షురూ అయితయి. ఒక నాలుగు గంటల పయనంకు ఆస్తులు జప్తు జేసినట్టు తిట్టుకుంటరు.ఇది సరికాదు కదా తమ్మీ.
జెర్ర తసల్లి ఉండాలే. కొంచం ఓపిక పట్టాలే.
రైలు పట్టాల మీద మన పయనం, మన జీవితానికి ఒక రూట్ మ్యాప్ లెక్క.
ఒకల్లకు కిటికీ కావాలి, ఇంకొకల్లకి గాలి సరిపోదు, ఇంకొకళ్లకు బెర్త్ షేరింగ్ గొడవలు, నిద్రపోద్దాం అనుకునేటోళ్లకు ఆద్దరాత్రి దాక ముచ్చట్లు, ఆటలు- లొల్లులు జేసేటోళ్ళు పెద్ద నెత్తినొప్పి లెక్క తయారైతరు. ఇది జెర ఆలోచించాలి అందరూ. మన ఆనందం కోసం పక్కోళ్లను కష్ట పెట్టొద్దు. రైలు పయనంల అన్ని వయసులోళ్ళు ఉంటరు.రైలు జాతి సొత్తు. దానిని మన సొంత ఆస్తిలెక్క వాడుకోవద్దు కదా!
మన ప్రయాణం అందంగుండాలి. మన మనస్సులెక్క. మంచి చెడు, కోపం సహనం మన ఆలోచనల కెంచెల్లే పుడతయి. జెర్ర ఓర్సుకుంటే పొయ్యేదానికి సర్రున కోపం తెచ్చుకోవద్దు.

రైలు కిటికీ పక్కన కూసోని బయట కనిపించే పంట పొలాలు, చెట్లు, నిలువెత్తు కొండలు, చిన్న ఇళ్లు అన్నీ కదులుతున్నట్టుగ కనిపిస్తయి. నిజానికి మనమే కదులుతున్నం. జీవితం సుత గంతే. మన చుట్టూ అన్నీ మారుతున్నయి, మారాలి అనిపిస్తది, నిజానికి మారేది, మారాల్సింది మనమే అన్నది పచ్చి నిజం! ఇది సమజయితే జీవితం అల్కగుంటది.

స్టేషన్ రాంగానే దిగిపోతం.ఇట్ల ఎన్నో మనస్తత్వాలను పరిచేయం చేస్తది రైలు మనకు.
అందుకే రైలు పయనం ఒట్టి ప్రయాణం కాదు. అది మన జీవితానికి ప్రతీక. జీవితం సుత ఇట్లనే. ఎవల్లనూ శాశ్వతంగా నిలుపుకోలేం. ఎవల్లతోనూ శాశ్వతంగా ఉండలేం. కానీ ప్రతి కలయికల ఒక అర్థం ఉంటది. ప్రతి విడిపోవడంల ఒక పాఠం ఉంటది. ప్రతి ప్రయాణంల మనం కొత్తవాళ్లం అవుతం. మనలోని లోకం విస్తరిస్తది. మన గమ్యాలు మారుతయి సుత.

రైలు ప్రయాణం మనల్ని మన జీవితం వైపు తిరిగి తీసుకవస్తది. మనం ఎక్కడికి పోతున్నమో కాదు, ఎట్ల పోతున్నమో సుత ముఖ్యం అన్నది ఇది నిరూపిస్తది.

అందుకే మన జీవితాలను అందమైన పయనం లెక్క. దానిని అందంగ సాగెటట్టు సూస్కోవడం మన చేత్లనే ఉంటది.
ఎంత ఉర్కినా… ఎన్ని ఊళ్ళు తిరిగినా రైలు తన పట్టాల మీదకు ఎట్ల నమ్మకంగ సాగుతూ.. చివరికి స్టేషన్ల వచ్చి ఆగుతదో, జీవితం సుత ధర్మం అనే పట్టాలమీద నడిపితే గమ్యం ధర్మమార్గం అయితది.

ఇది సదివిన మీ అందరికీ శనార్థులు.
ఇప్పటికెంచెల్లి రైల్ల ఎవల్ల తోని లొల్లి పెట్టుకోనని, అద్దరాత్రి అపరాత్రి దాంక ముచ్చట్లు వెట్టుకుంట పన్నోళ్లను సతయించానని ఈ అక్కకు మాటియ్యుండి!

ఉంట మరి పైలం

మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చిత్ర కళా చిద్విలాసం

వొంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)