“వైష్ణోదేవి ఆలయం”

ఇది జమ్మూ కాశ్మీర్లోని, కాట్రా నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తున, త్రికూట పర్వతంపై, ఉంటుంది. వైష్ణోదేవి ముగ్గురమ్మల- మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల శక్తితో, విష్ణు అంశతో శిష్టరక్షణకు భూలోకంలో జన్మించింది. జమ్మూకు 61 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఆలయం.

వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, బాన్ గంగా చెకింగ్ పాయింటు (బేస్ క్యాంప్) కి వెళ్ళాలి. చెకింగ్ పాయింట్ చేరుకుని, చుట్టూ చూస్తే పచ్చని వృక్షాలతో కొన్ని కొండలు, ఇంకా దూరంగా వరుస వరుసలుగా నీలిరంగులో విలసిల్లుతున్న మరికొన్ని కొండలు కనులకు విందు చేస్తూ ఉంటాయి. ఆ కొండల మధ్య దూరంగా, వైష్ణోదేవి భవన్ కనిపిస్తుంటుంది. ఎంట్రన్స్ లో వైష్ణోదేవి మూలవిరాట్ ఫోటో చాలా దూరానికి కనిపించేంత ఎత్తులో అమర్చారు. ఆటోలు అక్కడి వరకు వెళ్తాయి.

అక్కడ మన రిజిస్ట్రేషన్, ఆధార్ చెక్ చేసి, తర్వాత ఫిజికల్ గా కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. అక్కడ మనకి పోనీలు, పాలకీలు (డోలీలు) దొరుకుతాయి. నడిచి కూడా వెళ్లవచ్చు. 14 కిలోమీటర్ల దూరం. కొంతదూరం వరకు అందరికీ ఒకటే మార్గం. 6km దాటాక, ఆధ్ కువారి (Adhkuvari point) పాయింట్ వస్తుంది. అక్కడనుండి బ్యాటరీ కార్లు ఉంటాయి. క్యూలో నిలబడి టికెట్లు తీసుకోవాలి, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అక్కడనుండి బ్యాటరీ కార్లకు, మనుషులకు ఒక మార్గమైతే (హిమకోటి మార్గ్-5.5km), పోనీలకు పాలకీలకు వేరే మార్గముంటుంది (హాతి మఠ్ మార్గ్-6.5km). హాతిమఠ్ మార్గంలోనే హెలిపాడ్ కూడా ఉంటుంది. హెలిపాడ్ (సంజీచఠ్ పాయింట్) నుండి, ఆలయం (వైష్ణోదేవి భవన్) 2.5 km. దూరముంటుంది. అక్కడనుండి నడిచైనా వెళ్లవచ్చు. పోనీలు కూడా దొరుకుతాయి.

నడకమార్గం పైన దాదాపుగా పైకప్పు ఉంటుంది. అందుకని ఎండ, వాన భయముండదు. త్రోవకి ఇరువైపులా షాపులు, మసాజ్ (Chairs) రూమ్స్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్, త్రాగు నీటి సదుపాయం, వాష్ రూములుంటాయి. త్రోవపొడవునా జనముంటారు, కనుక భయముండదు. నడక మార్గంలో ఆలయాలు కూడా ఉంటాయి.

క్రింద బేస్ క్యాంపు నుండి ఒక కిలోమీటర్ పైకి వెళ్తే బాన్ గంగానది కనిపిస్తుంది. బాన్ గంగా నది కొండమీదున్న రాళ్ల మధ్య నుండి ఉరకలేస్తూ క్రిందికి జారుతూ, హోరు శబ్దం చేస్తుంటుంది. స్నానాలు చేసేందుకు వీలుగా, ప్రవాహ మార్గంలో గచ్చులా తీర్చిదిద్దారు. మెట్లు, బారికేడ్లతో యాత్రికులకు సౌకర్యంగా ఉంది. నదిని చూస్తూ, అది చేసే శబ్దం వింటూ అక్కడే ఉండి పోవాలనిపిస్తుంది. అక్కడ స్నానాలు చేసేవాళ్ళు స్నానం చేస్తుంటే, మరి కొంతమంది జలకాలాటలలో మునిగి తేలుతున్నారు. మాకూ దిగాలనిపించినా సమయాభావం వలన, శిరసు మీద నీళ్లు చిలకరించుకున్నాం.

అక్కడనుండి ఒక కిలోమీటర్ దూరంలో చరణపాదుక ఆలయముంది. అమ్మవారి చరణాలుంటాయి. మరో మూడు కిలోమీటర్లు పైకి వెళ్తే ఆధ్కువారి ఆలయమొస్తుంది. ఇది ఒక గుహ. భైరవ్ బాబా నుండి తప్పించుకొని అమ్మవారి ఈ గుహలో కొన్నాళ్లు తపస్సు చేసిందని భక్తుల విశ్వాసం.

నడుస్తూ క్రిందకు చూస్తే, దట్టమైన చెట్ల మధ్య నుండి, నీలి కొండల మధ్య కొలువైన కాట్రా నగరం అందంగా కనిపిస్తుంది. మీదకు చూస్తే, చుట్టూ దట్టమైన చెట్లతో నీలి కొండలు, తెలిమబ్బులతో నీలి ఆకాశం మైమరిపిస్తుంటాయి. నడక మార్గానికి ఒక వైపు కొండలు, ఇంకొక వైపు లోయ. యాత్రికుల భద్రత కోసం కొండలవైపు రాళ్లతో నిర్మించిన గోడ ఉంటే, లోయ వైపు ఆరేడడుగుల ఎత్తుతో, బలమైన కంచె వేసి ఉంటుంది.

కంచె పొడవునా భక్తులు కట్టిన సింధూరపు తోరణాలున్నాయి. హిమకోటి మార్గం శుభ్రంగా, వెడల్పుగా, పై కప్పుతో ఉండి, భక్తులు ప్రకృతిని ఆస్వాదిస్తూ, అలసట తెలియకుండా వైష్ణోదేవి ఆలయాన్ని చేరుకునేలా ఉంటుంది. వర్షాకాలంలో చిన్న చిన్న జలపాతాలు త్రోవ పొడవునా కనిపిస్తుంటాయి. ఆ నీరు మార్గంలోకి రాకుండా, కొండ ప్రక్కనే నిర్మించిన కాలువల ద్వారా మళ్లించబడుతుంది. మేమైతే మా నడకను చాలా ఆసాంతం ఆస్వాదించాం.

భూలోకంలో జన్మించిన వైష్ణోదేవిని, భైరవ్ బాబా మోహించి, పెండ్లి చేసుకోమంటే, నిరాకరించిన వైష్ణోదేవి తర్వాత అతని శిరస్సును ఖండించిందని, తప్పు తెలుసుకున్న భైరవ్ బాబా శరణు కోరగా, తనను దర్శించుకున్నాక భక్తులు అతనినీ దర్శించుకున్నాకే యాత్ర పూర్తవుతుందనే వరాన్నిచ్చిందని పురాణ కథనం. వైష్ణోదేవి భవన్ కు మూడు కిలోమీటర్ల దూరంలో కొండపైన ఉంటుంది భైరవ్ నాథ్ ఆలయం. ఇక్కడికి వెళ్లడానికి రోప్ వే ఉంటుంది. దాన్ని కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. లేకపోతే చాలా పెద్ద క్యూలున్నాయి. అందుకని మేమీ ఆలయాన్ని దర్శించుకోలేకపోయాం.

త్రికూట పర్వతం దట్టమైన చెట్లతో అడవిని తలపిస్తూ ఉంటుంది. అందుకని వన్యప్రాణులు నడక మార్గంలోకి రాకుండా ఉండడానికి, 8 అడుగుల ఎత్తున మెష్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు, మెష్ కు అవతల వైపు జింకలు, కుందేళ్లు కనిపించాయి. పాములు కూడా మనకి కొండవైపు కనిపిస్తాయి. మేము జూలైలో వెళ్ళాం కాబట్టి, వర్షం పడుతూ ఉంది. మెష్ నుండి చూస్తుంటే చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, తెల్లని మేఘాలు క్రిందికి వాలిపోతూ… నడుస్తున్నంత సేపూ కనులవిందే.

కొండ ఎక్కాక, ఆలయాన్ని చేరుకోవాలంటే చాలా దూరం నడవాల్సి ఉంటుంది. మార్గంలో వసతి భవనాలు, భోజనాలయాలు, తినుబండారాల, బొమ్మల అంగళ్లు కనిపిస్తుంటాయి. ఎక్కడికక్కడే సెక్యూరిటీ ఉంటుంది. మిలటరీ క్యాంపులు కూడా ఉంటాయి. ఉచిత భోజన సదుపాయాలున్నాయి.

వైష్ణోదేవి ఆలయం ఒక శక్తిపీఠం. ఇక్కడ ముగ్గురమ్మలు పిండి (రాయి) రూపంలో, గుహలోపల కనిపిస్తారు. మూడు పిండిలు ముగ్గురమ్మల తలలని… ఈ గుహ మనకు బయటకు కనిపించదు. మీదకు వెళ్లాక, చాలా క్యూలైన్లు దాటాక, లోపలికి వెళ్తుంటే గుహ కనిపిస్తుంది. దర్శనానికి రెండు మార్గాలున్నాయి. ఆ ముందు సంవత్సరం దర్శనం చేసుకున్న వాళ్ళ అనుభవం బట్టి… గుహలోపల, గర్భగుడి (గుహ)లో వెలిగించిన దీపాల వెలుగులోనే అమ్మవారిని దర్శించాల్సి వస్తుందని, మన కళ్ళు అక్కడ చీకటికి అలవాటు పడేలాగా, రద్దీ కారణంగా మనలను బయటకు నడవమంటారని, అసంతృప్తిగానే బయటకొస్తామని… అందుకని ఎక్కువ ఆశలు పెట్టుకోకని ముందే చెప్పారు. గాని మేమెళ్ళినప్పుడు విద్యుద్దీపాల వెలుగులో చక్కని దర్శనమయింది.

మేము అమర్నాథ్ యాత్రా సమయంలో వెళ్ళినందువలన రష్ చాలా ఎక్కువగా ఉంది. అందుకని అందరికీ దర్శనం బాగా అయ్యేటట్లు రెండు మార్గాలలో భక్తులను లోపలికి పంపించి, మరల వేర్వేరు మార్గాలలో వచ్చేటట్లుగా ఏర్పాట్లు చేశారు. బయటకు కనిపించదు గాని, గుహలో కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. కిందకి దిగుతున్నప్పుడు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుంటాం. దర్శనానికి క్యూలైన్లు చాలా ఎక్కువున్నాయి. దర్శనానికి వెళ్ళినప్పుడు మనీ, ఐడీ కార్డులు మాత్రమే వెంట తీసుకెళ్లాలి. మిగిలినవన్నీ అక్కడున్న లాకర్లలో డిపాజిట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చెకింగ్ ఉంటుంది.

ఈ కొండ పైన, శ్రీరాముని ఆలయముంది. అక్కడ నుండి వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ నీలి కొండలతో, వాటిని అల్లుకున్న దట్టమైన మేఘాలతో (మేము వెళ్ళింది వర్షాకాలం కనుక), అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది.

కొండపైన యాత్రికులకు వసతి సౌకర్యాలన్నీ ఉంటాయి. మేము ఉదయం నడిచి వెళ్లి, కిందకు వచ్చేటప్పుడు ఆథ్ కువారి వరకు నడిచి అక్కడ నుండి పోనీ ఎక్కి, రాత్రి ఏడింటికి క్రిందకు దిగాం.

మరుసటి రోజు ఉదయం, కాట్రాకు 80 కిలోమీటర్ల దూరంలో రాన్సూ ఊరికి సమీపంలో ఉన్న శివఖోరి (గుఫాలయం లేదా గుహాలయం)కి చేరుకున్నాం. అక్కడి నుండి మూడు కిలోమీటర్లు, కొండల మధ్య ప్రయాణం చేస్తే శివఖోరి (గుహ)కు చేరుకుంటాం. ఇది శివఖోరి ష్రైన్ బోర్డు ఆధీనంలో ఉంటుంది. నడిచైనా వెళ్లవచ్చు. బేస్ క్యాంపు నుండి పోనీలు, పాల్కీలు, పిట్టూలు కూడా ఉన్నాయి. త్రోవంతా చిన్నచిన్న షాపులు, చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. మొబైల్ ఫోన్లు లోపలకు తీసుకు వెళ్ళకూడదు.

ఇక్కడ గుహలో శివలింగం ఉంటుంది. ఇది కూడా పైనుండి నీరు చుక్కచుక్కగా పడితే (స్టాలగ్మైట్) ఏర్పడినదే! గుహ చాలా వెడల్పుగా ఉంటుంది. భాగాలుగా కూడా విభజించబడి ఉంటుంది. వాటిల్లో రకరకాల ఆకృతులు (స్టాలగ్మైట్స్) కనిపిస్తాయి మనకు. పై కప్పుపై చాలా చోట్ల ఏడుతలల వాసుకిలా కనిపిస్తుంటుంది. ఆ తలల నుండి చుక్క చుక్క నీరు క్రిందికి జారి రకరకాల ఆకృతులు కనిపిస్తున్నాయి. శివలింగం, పార్వతి మాత, గణేశుడు, శేష్ నాగ్, నంది… ఇంకా చాలా ఆకృతులు ఉన్నాయి. గుహ గోడలకు, పైకప్పుకు సహజంగా ఏర్పడిన ఆకృతులు… వాటన్నిటినీ వీక్షించాం.

అసలు శివలింగమున్న (శివలింగం, నాలుగడుగుల ఎత్తుతో గుహ పైకప్పు నుండి చుక్క చుక్కగా కారే సున్నపు నీటితో, పాలాభిషేకం చేసినట్లు ఉంటుందని అక్కడి వాళ్ళు చెప్పారు) గుహలోకి వెళ్లాలంటే, ఒక మనిషి మాత్రమే కష్టంగా పట్టేంత ఇరుకుదారి ద్వారా వెళ్లాలి. భద్రతా కారణాల దృష్ట్యా (లోపలకు వెళ్ళాక ఆక్సిజన్ చాలక ఇబ్బంది పడడం, లావుపాటి వాళ్లు మధ్యలో ఇరుక్కుపోవడం మొ॥ ) ఆ గుహను మూసేశారు.

శివఖోరికి వెళ్లే మార్గం కనులకు విందు చేస్తూ, మనసుకు ప్రశాంతత చేకూరుస్తుంది. ప్రకృతి అందాలు అడుగడుగునా ఆహ్లాదం కలిగిస్తాయి. మార్గానికిరువైపులా ఎత్తైన కొండలు, పచ్చని చెట్లతో శోభను చేకూరుస్తాయి. మధ్య మధ్యలో గలగల పారుతూ జలపాతాలు ఉరకలేస్తుంటాయి. వెళ్లే మార్గానికి కుడివైపున, త్రోవ పొడవునా నది మనలను అనుసరిస్తూనే ఉంటుంది. ఎక్కడికక్కడే కోతులు గుంపులు గుంపులుగా ఉంటాయి. భక్తులు వాటికి పళ్ళను ఆహారంగా అందిస్తుంటారు.

నడక మార్గాన్ని ఎంచుకునే వాళ్లకు, ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తుంటే, అలసట తెలియనే తెలియదు. అలా మేము వైష్ణోదేవిని, శివఖోరి గుహాలయాన్ని దర్శించుకొని చక్కటి అనుభూతులను మూట కట్టుకొని స్వర్ణ దేవాలయ దర్శనం కోసం పంజాబ్ చేరుకున్నాం. ఆ విశేషాలు మరోసారి.
*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“తొలి కథ”

ఆకాశ దర్పణంలో అసువులు బాసిన వీరాంగన – నీరా ఆర్య