తెలుగు భాషా చైతన్య సభ జరుగుతున్నది.. హాల్ అంతా కిక్కిరిసి ఉన్నది. ఇసుకేస్తే రాలనంత జనం…పక్కనే ఉన్న కిటికీలో నుండి ఒక అమ్మాయి సరోజన ఆ సభలో మాట్లాడే మాటలు వినాలని, చూడాలని కిటికీకి వేలాడుతున్నది.
అక్కడి చౌకీదారు ఆ అమ్మాయిని వెళ్లిపొమ్మని కోపంతో కేకలు వేస్తున్నాడు…. ఆ అమ్మాయి పొట్టిగా ఉండడం వల్ల లోపల జరిగే కార్యక్రమం కనపడక చౌకీదార్ మాట వినకుండా అలాగే వేలాడుతున్నది.
ఇదంతా వేదికపైన కూర్చున్న ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ గారు చూస్తున్నది.. చివరకు ఆ చౌకీదార్ కు సైగ చేసి, ఆ అమ్మాయిని లోపలికి పంపమని చెప్పింది.. చౌకీదారు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి, ఒక కుర్చీలో కూర్చొమ్మన్నాడు.అట్లాగే కూర్చున్నది.
రంగనాయకమ్మ సభ ముగియగానే తాను బస చేసిన గదికి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళింది.
ఆ అమ్మాయి చేతిలోచెమటతో తడిసి, నలిగిపోయి ఉండ చుట్టుకున్న పేపరు కనపడుతున్నది… “ఏమిటమ్మా? నీ చేతిలో ఏదో ఉంది?” అని అడిగింది.
“ఏం లేదు… ఏం లేదు” .. అని మొహమాట పడుతూ తన చేతిని పరికిణి చాటుకు దాచుకుంది.
ఇలా ఇవ్వు చూస్తానని అనునయంగా అడిగింది.
ఆ వుండ చుట్టిన కాగితం ఆమె చేతిలో పెట్టింది. తీసి చూస్తే అది ఒక కవిత! ఆశ్చర్యంగా అమ్మాయి వైపు చూసింది. ఇది నువ్వే రాసావా? అని అడిగింది… భయం భయంగా ఆ అమ్మాయి తల ఊపింది ఔనన్నట్టుగా….
ఆ కవిత ఇలా ఉంది.
ఓనమాలు దిద్దేవేళ- పేడ పిడకలే చేసి,
అమ్మ ఓనమాలు గుండ్రంగా రాయమననేలేదు
పిడక గుండ్రంగా ఉండాలనే
పడికట్టు మాట విని ధిని విసుగాయె!
రంగు రంగుల బట్టలు కట్టే వేళ-
పాతపరదాలే పరికిణీలాయె!
బడి ఫీజుల కోసం బతిమిలాటలేనాయె!
బడికి వెళ్ళే వేళ- బలువు పనులే అడ్డమాయె!*
లెక్కలు చేయాలను కుంటే
లెక్కలేని తిట్లు తినవలసి వచ్చే!
ఒకరి నీడన బతికిన నాకు
ఒంటినిండా బట్టనే లేకపాయె!
చిరుగుల బట్టల నుండి లేత యవ్వనమే కాన పచ్చె
బతికె ఛిద్రమైన వేళ- బట్టలొకలెక్కనా?
అనునయ మాట వినక- తిట్లు తినడమే బతుకాయె!
బండెడు చాకిరీ చెయ్యలేక చేతులే విరిగిపోయే!
మనసులోని భావాలకు అక్షర రూపమిద్దామంటే,
రక్కసిచూపులే గుచ్చబట్టే!
ఏనాడైనా మనసు పరచే అవకాశమొచ్చేనా?
ఈనాటి కవిలోలె సత్కారం అందుకునే భాగ్య ముందా?
ఆకవిత చదివి రచయిత్రి స్థాణువైపోయి, ఈ కవిత ఎవరు రాశారు? అని అడిగితే ఆ అమ్మాయి నేనే అని, మీకుచూపెట్టాలనుకున్నాను..అలాగే చదవాలనుకున్నాను కానీ లోపలికి రానివ్వడం లేదుఅని అన్నది.
ముందే చెప్తే చదివే అవకాశం ఇచ్చేవాళ్ళం… అన్నది రచయిత్రి రంగనాయకమ్మగారు.
భయమైంది అన్నది.
నీ పేరేమిటి?మీ అమ్మ పేరు ఏమిటి? ఎక్కడుంటారు? అడిగింది రంగనాయకమ్మ.
నా పేరు సరోజన. మా అమ్మ పేరు శకుంతల. ఇప్పుడు లేదు చచ్చిపోయింది. నేను మా మేనమామ ఇంట్లో ఉంటున్న…అన్నది.
వెంటనే రంగనాయకమ్మ కు కవిత లోని సారాంశం అర్థమై, ఈ అమ్మాయి జీవిత చరిత్రే అది అనుకున్నది. చాలా బాధ కలిగింది. పైకి కనపడనీయకుండా సరోజా! నీవు చక్కగా చదువుకోవాలి… మంచి రచయిత్రి అయ్యే లక్షణాలు కనబడుతున్నాయి. అంటూనే రంగనాయకమ్మకు తన బాల్యం ఒక్కసారి కంటి ముందు కదలాడింది… అవన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి…
“తనకు తల్లి తండ్రి ఉన్నా సమిష్టి కుటుంబంతో మారుమూల పల్లెటూర్లో ఉండడం…. అక్కడ పాఠశాలలోఐదవ తరగతి వరకే ఉండడంతో చదువు ముందుకు సాగలేదు. పక్కనే ఉన్న బస్తీలో ఎవరింట్లో అయినా ఉంచి చదివించడానికి అమ్మకు ఇష్టం లేకపోయేది. ఆడపిల్ల ఎవరింట్లోనో ఉండడం ఎందుకని చదువు మాన్పించింది.. తన తర్వాత ఇద్దరు చెల్లెళ్లు ఉండడంతో చిన్నప్పుడే వివాహం చేసి అత్తగారి ఇంటికి పంపించింది… భర్త సహకారంతో ఇంట్లోనే చదువుతూ ప్రైవేటుగా పరీక్షలు రాసి FA వరకు చదివి, ఇలా రచయిత్రిని కాగలిగాను అనుకుంది మనసులో … కాలంలో మార్పు వచ్చినా,సమాజం ఎంతో ఆధునికతను అనుకరించినా… ఆడవారి జీవితాలు అక్కడ అక్కడా ఇలాగే ఉన్నాయి… అని నిట్టూర్చింది.
ఇక సరోజన తన మేనమామ భార్య తనను చిత్రహింసలు పెట్టడం, 24 గంటలు పని చెప్పడం, బడికి పోయి నప్పుడు మాత్రమే తనకు విశ్రాంతి, మాస్టార్లు ఇచ్చిన హోంవర్క్ అక్కడే స్కూల్లో రాస్తేనే తప్ప ఇంట్లో వీలు చిక్కదు.మామ మాత్రంచాలా మంచోడు… అత్త తనను బాధ పెడుతున్న సంగతి అతనికి తెలియదు.. సరోజన చెప్పదు. కొద్దిరోజుల తర్వాత సరోజనకు తన భార్య అన్నం కూడా సరిగా పెట్టడం లేదని తెలిసింది చాలా బాధపడ్డాడు. మాఅక్క దేవత… ఆమెమీది ప్రేమతో సరోజనను తీసుకోని వచ్చిన…ఇప్పుడెలా? అని అనుకుంటాడు.
సరోజనకున్న అదృష్టమల్లా తెలుగు మాస్టారు ఎంతో మంచి వారు.. చదువు చెప్పడం మాత్రమే కాకుండా… స్కూలు సావనీరులో కవితలు రాయమని, వ్యాసరచన పోటీలో పాల్గొనాలని, ముగ్గుల పోటీలో పాల్గొనమని ప్రోత్సహించేవారు. సరోజన స్వతహాగా తెలివైనది కాబట్టి ఎన్నో బహుమతులు వచ్చేవి. తల్లి లేని పిల్లని చాలా ప్రేమగా చూసే వాడు. ఒక్కసరోజననే కాదు మిగతా పిల్లలకు కూడా పద్యాలు శ్రావ్యంగా చదవడం, నాటకాలు వేయడం, ఏకపాత్రాభినయం చేయించడం మొదలైన ఎన్నో నేర్పేవారు. అలా భాష మీద ఎంతో పట్టు వచ్చింది సరోజనకు. మాస్టారు ఉద్దేశం కూడా అదే… అంత చిన్న వయసులోనే చిన్న చిన్న కథలు రాసేది. అదే విషయం రంగనాయకమ్మతో చెప్పింది.
ఆ మాస్టారి చిరునామా ఇవ్వమని, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు చెప్తానని,చిరునామా తీసుకుని , కవితను చాలా జాగ్రత్తగా దాచి పెట్టు! అనగానే “మా అత్త ఎక్కడికి పంపడానికి ఒప్పుకోదు. చింపి పారేస్తుంది.. నీ బతుకుకు కవితలు ఒకటే తక్కువయినవని హేళనగా తిడుతుంది” అని చెప్పింది సరోజన.
సరే ఈ కవిత నా దగ్గరే ఉండనివ్వు! నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు! అని పంపించింది.
కొంత కాలం గడిచిపోయింది.
సరోజన స్వతహాగా అందంగా ఉంటుంది కాబట్టి, పక్క పట్టణంలోని ధనవంతుడు వరకట్నం లేకుండానే సరోజనను తన కొడుకుకు ఇచ్చిపెళ్లి చేస్తాడు.
సరోజనకు అత్తవారిల్లుబావుంది. ఎవరూ తనను అంక్షలు పెట్టే వారు లేరు. ముఖ్యంగా మరిది, ఆడపడుచు చాలా స్నేహంగా ఉంటూ మంచి పుస్తకాలు వాళ్లు చదివి, సరోజకి చదవమని ఇచ్చేవాళ్ళు.
పుస్తకాలు చదువుతూనే తానూ మెల్లిగా చిన్న చిన్న కథలు రాయడం మొదలు పెట్టింది. ఒక పత్రికకు కథల పోటీకి పంపించింది.
ఆ పత్రిక సంపాదకులు పోటీ కథలు నిర్ణయించడానికి న్యాయనిర్ణేతగా ప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మగారికి బాధ్యత అప్పగిస్తారు. ఆమె ఆ కథలు చదువుతూ చదువుతూ… సరోజన రాసిన కథ తన కంట పడుతుంది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఆ కథ తానే కాదు ఏ జడ్జి అయినా తప్పక ప్రధమ బహుమతికి సిఫారసు చేస్తారని, తను కూడా ఆ కథకి ప్రథమ బహుమతి అని ప్రకటించింది.
చాలాసంవత్సరాల క్రితం కలిసిన సరోజన పేరు మరిచిపోయిది రంగనాయకమ్మ. అందునా ముదిమి వయసులో సహజంకూడా!
తెలుగు భాషాచైతన్య సంఘం వారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, బహుమతులు పొందిన రచయిత(త్రు)లకు ఆహ్వానాలు పంపించి, పురస్కారాలు అందచేయాలని నిశ్చయించుకుంది.
కానీ మంచి మంచి కథలు రాసి పంపిస్తున్న ఆ రచయిత్రి తన పూర్తి చిరునామా కానీ, అసలు పేరు కానీ ఎక్కడా రాయకుండా, కేవలం కలం పేరుతో రచనలు పంపిస్తున్నది. ఆమెను ఎలా ఆహ్వానించడమా?అని ఎంతో మధన పడతారు. ఆమెను ఎలా గుర్తు పట్టడం? కనీసం ఒక ఫోటో కూడా కథతోపాటు పంపించదు…
అలా అని ఆమెను వదిలేయకూడదు… ఆమెను సత్కరించి, ప్రోత్సహిస్తే మరిన్ని మంచి రచనలు వస్తాయని రంగనాయకమ్మ అనడంతో… పేరున్న రచయిత్రి, పెద్దావిడ ఆమె మాటనుతోసి వేయలేక పోస్టు మాస్టర్ ద్వారా ఆమె చిరునామా కొనుక్కొని వెళ్ళి అమ్మా! మీరు ఇంత సహజంగా ప్రేరణాత్మక కథలు రాస్తున్నారు.. మీకు ఆ ప్రేరణ కలిగించింది ఎవరు? అని అడుగుతారు.
ప్రతి సమస్య నేను, నా తరం ఎదుర్కొన్నవే! అందుకే హృదయం స్పందించి, మాకు ఎలాంటి పరిష్కారాలు కావాలనుకున్నామో? ఆ పరిష్కారాలను సూచిస్తూ… ఆయా సమస్యలను చర్చిస్తూ… కొంత కల్పన చేస్తూ సాగిన రచనలవి. ఆ సమస్యలన్నీ ఎంతోమంది అనుభవంలో నుండి వచ్చినవే. అందుకే మీకు నచ్చాయనుకుంటాను. కవి, రచయితల బాధ్యత ప్రజలకు హితవు చేసే రచనలు చేయాలని, దానితో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఊరట చెందాలని, అప్పుడే అర్ధాంతరపు ఆత్మహత్యలు ఆగుతాయని నా నమ్మకం… అందుకే గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఎదుర్కొనే ప్రతి సమస్యను నా రచనల్లో జోడించాను. అన్నది సరోజన!
తెలుగు భాషా చైతన్య సభ్యులు కరతాళ ధ్వనులు చేస్తూ మీకు సన్మానం చేయదలచుకున్నాము. మీరు తప్పక రావాలి! అనగానే..అబ్బో….నేనేమంత గొప్పదాన్ని కాదు! సన్మానాలు అవి ఏమీ వద్దు… ఏ సభలకు రాలేను అంటుంది సరోజన.
సరే! మీరు సభలకు రాలేకపోయినా మిమ్మల్ని కలవాలని రంగనాయకమ్మ గారు తహతహలాడుతున్నారు. వారు చాలా పెద్దమనిషి అయ్యారు. వారిని గౌరవించి అయినా సరే మీరు ఒకసారి వచ్చి వారిని కలవాలి .. అని అంటారు. అప్పుడు సరోజనకు తన చిన్నప్పుడు కలిసిన రంగనాయకమ్మ గారు గుర్తుకు వచ్చి, సంతోషంతో సరేనని అంటుంది.
ఆహ్వాన పత్రం పంపిస్తారు.
అలా సరోజన ఆహ్వానం అందుకుని వస్తుంది. ఆ రోజే రంగనాయకమ్మ గారికి ప్రభుత్వము ప్రతిష్టాకరమైన జీవిత సాఫల్య పురస్కారం అందిస్తున్నది.
ఆ కార్యక్రమముప్రారంభమైంది. రంగనాయకమ్మ ప్రభుత్వ అధికారులతో ఒక విన్నపం చేసింది. తాను ఎలాగూ ముదుసలినైనాననీ, ఇక ముందు రచనలు చేసి సమాజానికి సేవలు చేయలేనని, నా గుర్తుగా ఈ అవార్డును మంచి సాహిత్యాన్ని సమాజానికి అందిస్తూ ఎందరికో ప్రేరణగా నిలిచిన సరోజనకు బహుకరించమని కోరుతుంది. ఎంతో తర్జనభర్జన పడిన తరువాత సరే అని, జనరంజక కథలు రాస్తున్న రచయిఅరి సరోజనగారు ఈ పురస్కారం అందుకోవాలనీ ఆహ్వానించారు నిర్వాహకులు.
సభ రచయితలతో, రచయిత్రులతో, పాఠకులతో కిక్కిరిసిపోయింది. ఇంతకాలంగా పాఠకులను ఉర్రూతలూగిస్తున్న ఆ రచయిత్రి ఎలా ఉంటుందో చూడాలని కొందరు, ఎలా మాట్లాడుతుందో వినాలని మరికొందరు ఎదురుచూసారు.
సభాధ్యక్షుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వక్తలంతా మాట్లాడారు. చివరకు రంగనాయకమ్మ గారు లేచి నిలబడి, నా గొంతు పూడుకుపోయింది ఏమి మాట్లాడలేను.. కానీ ఒక కవిత చదువుతాను. మన తెలంగాణ ప్రాంతంలో ఒక యాభై సంవత్సరాల క్రితం ఆడవాళ్ళ పరిస్థితి ఏమిటో? అందునా ముఖ్యంగా తల్లి లేని ఆడ పిల్ల చదవాలని అనుకున్నా, చదివే శక్తి ఉన్నా పరిస్థితులు ఎలా సహకరించలేదో అద్దంపట్టేలా ఉన్న ఒక భావకురాలు, కాబోయే రచయిత్రి అంతరంగాన్ని ప్రతిబింబించిన ఈ కవిత మాత్రమే చదువుతాను…
ఈ కాలపు రచయిత్రులు రాసే సత్తా ఉన్నా కూడా సమయం లేదనో, ఇంకా ఏవో సాకులు చెబుతూ రాయడానికి బద్ధకిస్తున్న ఎందరికో కనువిప్పు కలిగే మార్పును తన జీవితంలో తానే సంపాదించుకొని, నిలదొక్కుకొని, సాటి మనుషులకు ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, వాటిని ఎలా ఎదుర్కోవాలో చూపెట్టిన ప్రత్యక్ష సాక్షి ఈ రచయిత్రి. ఈమెకు వచ్చిన కష్టాలుఏ ఇతరులకు వచ్చినా వారు ఎప్పుడో ఆత్మహత్యలు చేసుకుని కీర్తిశేషులు అయ్యేవారు… అలా కాకుండా ఒక ప్రేరణగా నిలిచిన ఈ సరోజన ఈ బహుమతికి అర్హురాలు… అంటూ కవితను చదివి వినిపించింది.
వేదిక ముందు కూర్చున్న మహిళలందరి కళ్ళల్లోనూ నీరు ఉబికింది… ఒక్కసారిగా తారాస్థాయిలో కరతాళధ్వనులు మోగాయి…
నిర్వాహకులు తనను మాట్లాడమని మైకు ఇస్తే…కాస్త మొహమాటపడుతూ…
అందరికీ నమస్కారం!!
నేను కేవలం నా మనసులోని భావాలను రాస్తాను…కానీ అది రచన అనికూడా తేలియని నేను ఎన్నడూ వేదిక మీదకు కాదుకదా! దరిదాపుల్లో కి కూడా రాలేదు.అందుకని నేను వక్తను కాను! మంచి ప్రసంగం చేయలేను! కానీ నా వలె అవకాశాలు రాని – లేని నా సాటి మహిళలకు వేదిక మీదనుండి నాలుగు మాటలు చెబుదామని ఆరాటం అంతే!
అవకాశం రాలేదని, ఇవ్వలేదనీ ఎవరినీ నిందించకుండా ,ఖాళీ సమయంలో ఊరికే కూర్చోకుండా..సాటి మహిళల కష్టనష్టాలను, సమస్యలను- వాటి పరిష్కారాలనూ సూచిస్తూ…ఎన్ని అవరోధాలొచ్చినా మన పని మనం చేస్తూ పోవాలనీ మన దైన శైలిలో రచనలు కొనసాగిస్తూ…ఇతరులలోని ప్రతిభలను గుర్తించి- గౌరవిస్తూ . వారిని ప్రోత్సహిస్తూ…. మన మహిళలం ఎందులోనూ తక్కువ కాదనీ, మీలోని ప్రతిభా పాటవాలను అదను దొరికితే ప్రదర్శించడంలో తప్పులేదనీ, అదే సమయంలో మీ..మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే మీరనుకున్నది సాధించవచ్చని నేను రచనా రంగంలో ఆలస్యంగా ప్రవేశించినా కూడా చివరకు మంచి ఫలితాన్ని పొందగలిగానని.. అరకొరా పరిజ్ఞానంతో రాసిన నా అక్షరాలను గౌరవించి, సన్మానించినందుకు అనేక కృతజ్ఞతలంటూ ముగించింది.
అమ్మాయీ! అలా అరాకొరా చదూవనుకోవద్దు! విశ్వ విద్యాలయంలో చదివిన దానికన్నా చుట్టూజరిగే పరిస్థితులను అవగాహన చేసుకోవడం , దాన్ని విశ్లేషించడం, తగురీతిన సూచనలివ్వడం జీవిత పాఠాలు…వాటికన్నా విద్య్లయ చదువులేమీ గొప్పకాదు అని ఆశీర్వదించారు రంగనాయకమ్మ గారు.
సర్వేజనాః సుఖినోభవంతు