వంటిల్లు – వొడవని ముచ్చట

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వంటలు బాగా చేసుకుంటున్నారా? ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా!

నేను బాగానే వండుతున్న కానీ పోస్టింగ్ పెట్టడమే కుదరటం లేదు.

ఈరోజు ఏం చేద్దాం చెప్మా!????.. అర్థం అయ్యే ఉంటుంది ఇంకేం చేద్దాం సులభంగా అయ్యే ఉప్మా.

చాలామంది ఉప్మా అనగానే ముఖం రకరకాల ఎక్స్ప్రెషన్ పెడతారు. అసలు ఉప్మా గురించి వాళ్ళకి ఏం తెలుసు?

వినండి చెప్తా ఉప్మా ఇష్టం లేని వాళ్ళు మాత్రమే సుమా! ఇష్టం ఉన్నవాళ్లు నామీద కారాలు మిరియాలు నూరకండి!????

చిన్న పాపాయి నుండి పెద్దవారి వరకు సులభంగా జీర్ణం అయ్యే మహా ప్రసాదం ఉప్మా. అందులో తొందరగా అయ్యే వంటకం. మహిళలకి దోస్తీ.

రకరకాలుగా ఉప్మా లు చేస్తున్నారు. ఆ సోది చెప్పి విసిగించనులే. పెళ్లిళ్లలో చేసే ఉప్మా మాత్రం భలే ఉంటుంది. ఇప్పుడు అన్ని కూరగాయలు ఇంకా ఏవేవో వేస్తున్నారు కానీ, అప్పుడైతే అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు, పోపు గింజలు మాత్రమే వేసి చేసేవాళ్లు. ఎంత రుచిగా ఉండేదని! ఈ బొంబాయి రవ్వ రాకముందు బియ్యం పిండితో ఉప్పుడు పిండి చేసేవాళ్ళు. ఇంటికి ఎవరైనా వస్తున్నారు అంటే, రవ్వ తెప్పించి చేసి పెట్టేవాళ్ళు. ఏదో మిగిలితే పిల్లల ముఖాన పడేసే వారు.అందుకే ఆ ఉప్మా నాకు ఇష్టం.కసితో ఎప్పుడూ ఉప్మా నే చేసే దాన్ని.సరే విషయానికి వస్తాను.

కార్పోహైడ్రేట్స్ ఎక్కువ అండి, మేము బియ్యప్పిండితో, బాంబే రవ్వతో చేసిన ఉప్మా తినమండి బాబు! అని సన్నగా ఎక్కడి నుండో ఒక గొంతుక నాకు వినిపించింది లెండి. అందుకే ఈరోజు నేను రాగి పిండితో ఉప్మా చూపిస్తాను. అదిగో ఫేస్ మారిపోయింది. చేసుకుని తిన్నాక మాట్లాడండి అప్పుడే ఇలా అంటే ఎలా?

కావలసిన పదార్థాలు
******

ఎంతో కొంత రాగి పిండి తీసుకోండి.
పోపు దినుసులు ,
ఇష్టముంటే పల్లీలు ,
అల్లం కొత్తిమీర కరివేపాకు ,
నూనె ఉప్పు కూడా చెప్పాలా ఓకే

నిన్న సాయంత్రం ఏం టిఫిన్ తినాలా! అని ఆలోచన వచ్చింది. ఎదురుగా రాగి పిండి కనబడింది అంతే..

స్టవ్ మీద గిన్నె పెట్టేసి పోపు వేసి ఒకటి వెనక ఒకటి వేసి వేయించుకొని కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు..

ఉప్మా తెలుసు కదా ఎలా చేయాలో ఏం చెప్తాను చెప్పండి.

నీళ్లు మరిగాక రాగి పిండిని వేసి మూత పెట్టి, కాసేపు మగ్గించి తర్వాత కలిపి సన్నటి సెగ మీద కలుపుతూ ఉంటే, చక్కని బ్రౌన్ రంగు ఉప్మా తయారవుతుంది.

ఇంకేం చూస్తారు.. ప్లేట్లో పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని లేదా పెరుగు వేసుకొని గుట్ట గుట్ట మింగడమే!

ఎలా ఉందో చెప్పండి
******

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు – నాగచంద్రిక

సజీవం, దృశ్యాత్మకం, భావాత్మకం`శీలా సుభద్రాదేవి కవిత్వం..