సజీవం, దృశ్యాత్మకం, భావాత్మకం`శీలా సుభద్రాదేవి కవిత్వం..

​‘‘సాహితీ కన్యకు/ సహజసిద్దమైన జుట్టూ గోళ్ళూ కత్తిరించి/సాహిత్య విలువల్ని పిండిబొమ్మగా చేసి/ కాగితం నేలలో/ కలంతో తవ్వి/ నిలువునా పాతిపెట్టి/ చేతబడి చేయిస్తున్నారు కాష్మోరాతో/ పత్రికలశ్మశానాల్లో/ సాహిత్య మంత్రగాళ్ళుకొందరు’’ ‘‘ఏ చిగురు అంచునో/కొద్దిపాటి ఆవేశపు ఎరుపు చూసి/అహంకారం మాటల పిడుగుల్ని కక్కేసరికి/ధనాతిశయం మెరుపుల కొరడాని రaుళిపించేసరికి/నిబ్బరంగా తలెత్తి చూసే లోపునే/ నేలతల్లిని కావలించుకుని/ కన్నీటి కాలవలో తేలే పేద గడ్డిపరక/ ఎగతాళికి కేంద్రమౌతుంది’’ అంటూ కాస్త అనుభూతిని, మరికాస్త అనుభవాన్ని క్రోడీకరించి, వాద,ప్రతివాదాలకు ఎక్కడా తావివ్వకుండా కవిత్వాన్ని కవిత్వంలా చూపే సుప్రసిద్ధ కవయిత్రి శీలా సుభద్రాదేవి.
​శీలా సుభద్రాదేవి తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన కవయిత్రి, కథారచయిత్రి, చిత్రకారిణి. 1949లో విజయనగరంలో జన్మించిన వీరు, కుటుంబ బాధ్యతలతో పాటు సాహితీ సేవను కొనసాగిస్తూ నాలుగు దశాబ్దాల కంటే ఎక్కువ కాలం సృజనాత్మక కృషి చేశారు. చేస్తున్నారు కూడా.  ప్రముఖ రచయిత, చిత్రకారుడు శీలా వీర్రాజు ఈమె జీవిత సహచారి. ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ, విస్తృత పఠనశీలి అయిన వీరు అక్కింటి గ్రంథాలయంలో అనేక రచనలను చదివి జ్ఞానాన్ని విస్తరించుకున్నారు. ఆ పఠనమే వీరి సాహిత్య ప్రయాణానికి పునాది వేసింది. రచన అనేది సమాజోద్ధరణకై ఉండాలని నమ్మిన వీరు, కేవలం కళాత్మక ప్రక్రియకే పరిమితం కాకుండా సామాజిక సమస్యలను ఎత్తి చూపే అక్షరాలను సృష్టించారు.
​1970లో కథారచనతో ప్రారంభమైన వీరి సాహిత్య ప్రస్థానం 1975లో తొలి కవితతో కొనసాగింది. అప్పటి నుండి తెలుగు సాహిత్యంలో స్త్రీ స్వరాన్ని బలంగా వినిపించిన రచయిత్రిగా గుర్తింపు పొందారు. స్త్రీవాద కవిత్వోద్యమం పూర్తిస్థాయిలో రూపుదాల్చకముందే పురుషాధిక్య సమాజాన్ని సవాల్‌ చేస్తూ కవిత్వం రాసిన ఘనత సుభద్రాదేవిదే. ‘‘నా పేరు జనం/ నా వాడ సోషలిజం’’ అంటూ ధైర్యంగా పలికిన ఈమె కవిత్వంలో సమానత్వం, శ్రమజీవుల వేదనలు, సామాజిక న్యాయం వంటి అంశాలు ప్రాధాన్యంగా కనిపిస్తాయి. వీరి కవిత్వ భాష నిర్మలత, స్పష్టత, భావోద్వేగపూర్ణతతో నిండి ఉంటుంది. సూటిదనం, నిరాడంబరమైన శైలి, సామాజిక అవగాహనతో కూడిన పదప్రయోగం వీరి కవిత్వ ప్రత్యేకత. సాహిత్యాన్ని కేవలం వ్యక్తిగత ఆవేదనను వ్యక్తం చేసే వేదికగా కాకుండా, సమాజంలో మార్పు కోసం ఆయుధంగా ఉపయోగించిన అరుదైన కవయిత్రి సుభద్రాదేవి.
​సుభద్రాదేవి రచించిన కవితాసంపుటాలలో ఆకలి నృత్యం, మోళి, తెగిన పేగు, ఆవిష్కారం, ఒప్పుల కుప్ప, యుద్ధం ఒక గుండె కోత, ఏకాంత సమూహాలు, బతుకుబాటలో అస్తిత్వరాగం, నా ఆకాశం నాదే వంటి సంకలనాలు ప్రస్తావనీయమైనవి. ఈ కవితాసంపుటాలలో స్త్రీ స్వేచ్ఛ, వ్యక్తిత్వ గౌరవం, సామాజిక న్యాయం, అణచివేతకు వ్యతిరేక నిరసన ప్రధానాంశాలుగా కనిపిస్తాయి. ‘‘యుద్ధం ఒక గుండె కోత’’ అనే దీర్ఘకావ్యం పై మధురకామరాజు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్‌ పరిశోధన జరగడం ఈ కవిత్వ ప్రాముఖ్యతకు నిదర్శనం. అదేవిధంగా ‘‘దేవుడుబండ’’, ‘‘రెక్కలచూపు’’, ‘‘ఇస్కూలుకతలు’’ వంటి కథాసంపుటాలు, ‘‘నీడల చెట్టు’’ అనే నవల, ‘‘డా. పి. శ్రీదేవి’’, ‘‘నిడదవోలు మాలతి రచనాసౌరభాలు’’ వంటి మోనోగ్రాఫులు ఈమె సాహిత్య వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
​సుభద్రాదేవి కవిత్వంలో స్త్రీవాద దృక్పథం స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. ‘‘నా ఆకాశం నాదే’’ కవితలో ‘‘నా స్వేచ్ఛకు హద్దులు పెట్టకు’’ అన్న పిలుపు స్త్రీ స్వాతంత్య్రాన్ని ప్రతిబింబిస్తుంది. వీరి కవిత్వం స్త్రీ విముక్తి, సమానత్వం కోసం నిరంతర పోరాటాన్ని తెలియజేస్తుంది. స్త్రీని అణచివేసే సంప్రదాయపు తాళ్లను తెంచాలని, సమాజం విధించే బంధనాలను ధ్వంసం చేయాలని కవిత్వంలో ఆవేదనతో పాటు తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తాయి.ఈ కవితలో వ్యక్తమయ్యే స్త్రీవాద దృక్పథం కేవలం వ్యక్తిగత హక్కుల పిలుపు మాత్రమే కాదు, సామాజిక మార్పుకు పునాది వేయాలనే సంకల్పం. గృహకర్తవ్యాలకే పరిమితం చేసిన స్త్రీకి వ్యక్తిత్వ వికాసం, నిర్ణయం తీసుకునే హక్కు ఇవ్వాలని ఈ కవిత గట్టిగా వినిపిస్తుంది. అందుకు  ‘‘సంప్రదాయపు తాళ్లతో మా చైతన్యపు కాళ్లు కట్టేశారు’’ అన్న వాక్యం ఆ ధోరణికి నిదర్శనం. ఈమె స్త్రీవాదాన్ని కేవలం పురుష ద్వేషంగా కాకుండా స్త్రీ సాధికారత, ఆత్మగౌరవం, సమానత్వకాంక్షలతో కూడిన సాహిత్య ఉద్యమంగా తీర్చిదిద్దారు.1970ల తర్వాత స్త్రీవాద ఉద్యమాలు వేగం పుంజుకున్న సమయంలో ఈ కవిత స్త్రీ హక్కుల పోరాటానికి ప్రేరణగా నిలిచారు. ఆ కాలంలో సమాజం స్త్రీని నియంత్రించే ధోరణి బలంగా ఉండేది. అలాంటి సందర్భంలో స్వేచ్ఛ కోసం చేసిన ఈ ప్రకటన విప్లవాత్మకమైంది..భాషా శైలిలో కవయిత్రి సూటితనాన్ని పాటించారు. భావానికి తగిన పదాలను మాత్రమే ఉపయోగించారు. ఎంత ఆవేదన, ఆవేశం ఎక్కువైనా పదోచ్ఛారణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. ముఖ్యంగా అలంకారాలకంటే భావోద్వేగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ధైర్యం, తిరుగుబాటు, ఆత్మవిశ్వాసం ఈ కవితలో మిశ్రమంగా వినిపిస్తాయి. కవితలో ప్రతి పంక్తి ఒక నిరసన స్వరం, ఒక ఆశావహ గళం వీరిది.
​వీరు రచనలు కేవలం సాహిత్య కృతులు మాత్రమే కాదు, ఒక యుగాన్ని ప్రతిబింబించే అక్షర సాక్ష్యాలు. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతర పోరాటాన్ని తెలియజేసే సుభద్రాదేవి సాహిత్యం తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయంగా నిలుస్తారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా, ఎప్పుడూ చిరునవ్వుతో, విశ్వాసంతో రచన కొనసాగించిన వీరు, మహిళా రచయిత్రులకు మార్గదర్శకురాలిగా నిలిచారు. సమాజాన్ని సవాలు చేస్తూ అక్షరాల అగ్నిని రగిలించిన ఈమె కవిత్వం యుగయుగాల పాటు ప్రేరణనిస్తూనే ఉంటుంది.
​శీలా సుభద్రాదేవి గారి ‘‘మా చెడ్డ కన్నీళ్ళు’’ కవితలో మనిషి అంతర్ముఖ వేదనను అత్యంత సున్నితంగా, కానీ శాస్త్రీయమైన నిర్ధారణలా ప్రతిబింబించారు. ‘‘కన్నీళ్ళు మహా చెడ్డవి’’ అని మొదట వినిపించే మాట ఒక వ్యంగ్యపూరిత విమర్శగా అనిపించినా, అంతరార్ధంలో అది కన్నీళ్ల అంతర యాత్రకు, వాటి ప్రభావానికి సంబంధించిన లోతైన విశ్లేషణగా మారుతుంది. కన్నీళ్ళు మనిషి హృదయానికి సన్నిహితమైన భావ ప్రక్రియ. అవి బాధ, కోపం, ప్రేమ, నిరాశ, అణచివేత, వేదన ఇవన్నింటి సమ్మేళనమైన వ్యక్తీకరణ. కవయిత్రి వాటిని కేవలం నీటిబొట్లుగా కాకుండా, శరీరమంతా సంచరించే జీవశక్తిగా చిత్రించింది. కవితలో ‘‘రెప్పలకు లాకులు బిగించేసరికి / వేగం పుంజుకుని వెనక్కి పరుగులు తీసి / గుండె తలుపులన్నీ తడతాయి’’ అనే పాదాలు ఆ అంతర్గత ఉద్వేగాన్ని సజీవంగా చూపిస్తాయి. ఇక్కడ కవయిత్రి కన్నీళ్ళను వ్యక్తిత్వం కలిగిన సజీవప్రాణులుగా రూపకల్పన చేసారు. ఇది పర్సానిఫికేషన్‌ యొక్క చక్కటి ఉదాహరణ.అది మనిషి యొక్క భావదౌర్బల్యంపై ఒక తాత్విక వ్యాఖ్య.
​కన్నీళ్లు బయటకు రాకుండా ఆపడం అంటే దుఃఖాన్ని అదిమిపట్టుకోవడం. ఆ ప్రయత్నం వలన లోపలి మానసిక ఒత్తిడి పెరిగి రక్తం వేడెక్కి, గుండె స్పందన వేగం పెరగడం వంటి శారీరక స్పందనలను కవయిత్రి కవితాత్మకంగా, శాస్త్రీయంగా మిళితం చేసింది. ‘‘రక్తంతో జతకలిసి లబ్‌ డబ్‌ నినాదాలతో’’ అనే వాక్యం కవిత్వంలో శాస్త్రీయ భాషను చక్కగా ఆవిష్కరించిన నూతనతకు నిదర్శనం. తరువాతి పాదాలలో కన్నీళ్ళు మెదడులో తవ్వుకుంటూ పోయి ‘‘జీర్ణావస్థలో ఉన్న దుఃఖజ్ఞాపకాలను’’ బయటకు తీస్తాయని చెబుతుంది. ఇక్కడ శీలా సుభద్రాదేవి కన్నీళ్ళను ఒక లిఆత్మశోధన యంత్రంలాలి చిత్రిస్తుంది. అవి గతపు బాధలను పునఃప్రజ్వలింపజేసి, మనిషి తన అంతరాన్ని చూసుకునేలా చేస్తాయి. దుఃఖం కేవలం భావావేశం మాత్రమే కాకుండా, మనిషి తనను తాను అర్థం చేసుకునే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా మారుతుంది.
​‘‘దుఃఖపు సెగకు కన్నీరంతా ఆవిరై / వర్షమేఘాలై నిలువెల్లా కమ్మేస్తాయి’’ అనే రూపకం కవయిత్రి సృజనాత్మక ప్రతిభను చూపిస్తుంది. హృదయాన్ని ఆకాశముగా, కన్నీటిని వర్షమేఘాలుగా, స్నేహాన్ని గాలిగా పోల్చడం ఇది అంతర్ముఖ కవిత్వానికి చక్కని రూపక స్థాయిని ఇస్తుంది. ఒక్క ‘‘స్నేహసమీరం’’ తాకినా అణచుకున్న కన్నీళ్ళు ఉప్పెనలా బయలుదేరి చెంపలమైదానాల మీద జారిపోవడం ఈ దృశ్యం సజీవం, దృశ్యాత్మకం, భావాత్మకం.
​ముగింపు పాదాలలో ‘‘మనం ఎంత గాంభీర్యపు ముసుగు వేసుకున్నా / నిలువునా తడి జ్ఞాపకాలతో / శరీరాన్ని ముంచేయాలని చూస్తాయి’’ అనే వాక్యాలు కవయిత్రి మనోవిశ్లేషణాత్మక దృష్టిని చూపిస్తాయి. ఇక్కడ ‘‘గాంభీర్యపు ముసుగు’’ అంటే సమాజం మనపై పెట్టిన కట్టుబాట్లు, భావాలను బయటపెట్టకూడదనే అణచివేత భావం. కానీ, ఆ ముసుగు వెనక మానవత్వం తడిచిన జ్ఞాపకాలు ఉడికిపడతాయి. ‘‘కన్నీళ్ళు మనల్ని అబలల్ని చేయాలనే చూస్తూనే ఉంటాయి’’ అనే చివరి పాదం, కవిత అంతా వ్యాపించిన వ్యంగ్యమయమైన వాస్తవ దృష్టికి పరాకాష్ఠ.
​వరకట్న విషపునాగుకాటుకు గురై/ దహింపబడుతూనే ఉన్నారు.నవ వధువులు కాటు తెప్పించుకోవాలన్న/తపనతో దారి తప్పి/ నవ నాగరికారణ్యంలో / మృగాలా వేటుకు చిక్కుతునే ఉన్నారు /కోరికలు అణచుకోలేని పేద కన్యలు / అడవిలో యధాప్రకారం పెరుగుతూనే ఉన్నాయి / అనుభూతులు ఎరుగని మానులు (రోజువారీ దృశ్యం కవిత)ఈ కవితలో శీల సుభద్రాదేవి సమాజంలోని స్త్రీ స్థితిని అత్యంత గాఢమైన ప్రతీకలతో ఆవిష్కరించారు. ‘‘వరకట్న విషపునాగు కాటు’’ అనే రూపకం ద్వారా వరకట్నం అనే సామాజిక వ్యాధి స్త్రీ జీవితాన్ని ఎలా దహింపజేస్తుందో చూపించారు. విషపాములా కాటు వేసి చావు తెస్తున్న ఆ వరకట్న వ్యవస్థ, కొత్త వధువులైన స్త్రీలను నిరంతరం బాధపెడుతూ ఉంటుందని కవయిత్రి స్ఫష్టపరుస్తుంది. ‘‘నవ వధువులు కాటు తెప్పించుకోవాలన్న తపనతో దారి తప్పి నవ నాగరికారణ్యంలో మృగాలా వేటుకు చిక్కుతూనే ఉన్నారు’’ అనే పంక్తులు ఆధునిక నాగరికతలో స్త్రీ స్వేచ్ఛ కోసం వెళ్ళే మార్గాలు కూడా ప్రమాదకరమని సూచిస్తున్నాయి. ఆధునికత వాగ్దానం చేసిన సమానత్వం, స్వేచ్ఛలు స్త్రీలకు వాస్తవంగా మృగాల వేటలా మారుతున్నాయి.
‘‘కోరికలు అణచుకోలేని పేద కన్యలు అడవిలో యధాప్రకారం పెరుగుతూనే ఉన్నాయి’’ ఈ పంక్తి పేదరికం, అసమానత, అజ్ఞానం ఇంకా సమాజాన్ని విడువలేదని చెప్పుతుంది. స్త్రీల కోరికలు సహజమైనవే అయినా, వాటిని సమాజం అణచేస్తూ వస్తోంది. ‘‘అనుభూతులు ఎరుగని మానులు’’ అనే ముగింపు వాక్యం సమాజంలోని అసంవేదన, నిర్లక్ష్యం, పురుషాధిక్యతను ఎత్తి చూపుతుంది. స్త్రీల బాధను అనుభూతి చెందని మానవులు ఉన్నంతకాలం ఈ పరిస్థితి మారదని కవయిత్రి బాధతో చెప్పింది. మొత్తం కవితలో శీలా సుభద్రాదేవి ఆధునిక స్త్రీ సమస్యలను విషపాముల కాటు, మృగాల వేట, అడవి వంటి శక్తివంతమైన ప్రతీకలతో ఆవిష్కరించారు. ఇది కేవలం స్త్రీ యాతనకథ కాదు  అది సమాజపు నైతిక పతనాన్ని, మనుష్యత్వం కోల్పోవడాన్ని ప్రతిబింబించే సామాజిక కవిత ఇది.
​మనుగడ సూత్రం కవితలో ‘‘నేను భూదేవిని సౌశీల్యం నా కవచం’’ ఈ వాక్యం స్త్రీ స్వరూపాన్ని భూదేవితో పోలుస్తారు. భూమి లాగానే స్త్రీ కూడా భరించే శక్తి, సహనశీలత, సృజనాత్మకత కలిగినది. ఇక్కడ స్త్రీ తన మనుగడను తన విలువల ద్వారానే నిలుపుకుంటానని గర్వంగా ప్రకటిస్తుంది. ‘‘కలల ముక్కలు’’ ‘‘రాస్తూ రాస్తూ ఉన్న కలం ఇంకిపోయి ఆగిపోయినట్లు, కదుల్తూ కదుల్తూ ఉన్న స్వప్నం చటుక్కున తెగిపోతుంది’’  ఇది జీవితపు అసంపూర్ణతను, స్వప్నాల విఫలతను ప్రతిబింబించే రూపకం. కలం ఇంకిపోయి ఆగిపోవడం అంటే సృజన ఆగిపోవడం అలాగే స్వప్నం తెగిపోవడం అంటే ఆశలు మధ్యలోనే విరిగిపోవడం. జీవితం నిరంతర ప్రయాణం అయినా, అనూహ్య అడ్డంకులు ఆ స్వప్నాలను ఆపేస్తాయని కవయిత్రి బాధతో చెబుతుంది.
​‘చిన్ని నా పద్యం’ కవిత్వంలో ‘‘చిన్ని నా పద్యం గుండె లోతుల్లోనే అతి భద్రంగా బిక్కు బిక్కుమని నక్కి కూర్చుంది’’
ఇది కవయిత్రి యొక్క అంతరంగ కవిత్వ భావాన్ని తెలియజేస్తుంది. ఆమె రాయాలనుకునే భావం, వ్యక్తీకరించాలనుకునే పద్యం గుండె లోతుల్లో నక్కి కూర్చుంది అంటే, చెప్పాలనుకున్న బాధలు, భావాలు, సున్నితత మాటలుగా బయటికి రావలసి ఉన్నా, ఇంకా లోపలే అణచుకుని ఉన్నాయని సూచిస్తుంది. ఇది సృజనాత్మక తపన, కానీ అణచిన అనుభూతి. ‘‘ఇంటి దీపం’’ లేత వెలుగులో అందమైన వెలుగు నీడలా జాడల్లో అందాలు వెదజల్లుతూనే ఉన్నాయి  ఈ పాదం సౌందర్యం మరియు సాన్నిధ్యాన్ని సూచిస్తుంది. ఇంటి దీపం కేవలం వెలుగు కాదు..  అది మనుగడలో ఉన్న నిశ్శబ్ద ఆనందం, స్నేహం, సాంత్వనకు ప్రతీక. చెత్తకుండీలో చిట్టిపాప కవితలో ‘‘గాజుతొట్టిలో ఈదులాడినట్లు ఉమ్మనీటిలో చేపపిల్లనై తొమ్మిది నెలలు నిశ్చింతగా పెరిగి చివరికి అమ్మ ఒడిలో సుతిమెత్తని పొత్తిళ్ళను బదులు కుప్పతొట్టిలో పడినందుకు కుమిలి కుమిలి ఏడుస్తున్నావా’’
​ఇది శీలా సుభద్రాదేవి కవిత్వంలోని అత్యంత మానవీయమైన, సామాజికంగా గాఢమైన దృశ్యం. ఇక్కడ కవయిత్రి పసిబిడ్డను గర్భంలో పెరిగిన ‘‘చేపపిల్ల’’గా పోల్చారు. మాతృగర్భంలోని నిశ్చింత నుంచి బయటకి వచ్చేసరికి చెత్తకుండీలో పడిన దయనీయ పరిస్థితి. ఇది సమాజంలోని క్రూరత్వం, ఆడబిడ్డల పట్ల నిర్లక్ష్యం, మానవత్వం నశించిన స్థితిని ప్రశ్నించే కవిత. ఇక్కడ లిమాతృత్వం, దయ, దౌర్భాగ్యం, సానుభూతిలి అన్నీ ఒకచోట కలిసిపోయాయి.
​మొత్తంగా ఈ పంక్తులన్నీ కలిసి చూస్తే శీలా సుభద్రాదేవి కవిత్వం ఒకే సమయంలో వ్యక్తిగత భావావేశం, సామాజిక బాధ్యత, స్త్రీ మనసు, మానవ విలువలులి అన్నింటినీ మేళవిస్తుంది..ఆమె పదాలు సున్నితమైనవైనా, వాటి వెనక ఉన్న భావాలు గాఢమైనవి. ప్రతి కవితలో ఒక అంతరంగ నిశ్శబ్దం ఉంది. కానీ అదే నిశ్శబ్దం మనసును కదిలించే శబ్దంగా మారుతుంది.అంతకంటే ముఖ్యంగా ఎంత ఎత్తు ఎదిగినా అంత ఒదగివుండాలనే మాటకు వీరు నిదర్శనం.​​

Written by Shailaja Mitra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వంటిల్లు – వొడవని ముచ్చట

చాయ గిన్నె కష్టాలు