నదీమతల్లి-9వ భాగం

అప్పుడే వచ్చిన ప్రణవ్ కి “చూడండి మనకి పిల్లలని పెంచే తాహతు లేదుట.డబ్బుదుబారా చెస్తున్నామట. మీ అమ్మగారు ఇచ్చిన డబ్బుతోనే మన ఖర్చులు వెళ్తున్నాయట.”అంది సమీర . వెంటనే ప్రణవ్ ఒక్కనిమిషం ఆలోచించక గబగబా రూములోనించీ రాధ సూట్కేస్ తీసుకొచ్చి నమస్కారం పెట్టి,”అమ్మా ఆఖరి బస్ కి బయలుదేరు” అన్నాడు.

రాధ విస్తుపోయింది ప్రణవ్ ప్రవర్తనకి.

ఆ గొడవకి ‘ నానమ్మా’ అంటూ తొమ్మిదేళ్ళ శ్రుతి,ఏడేళ్ళ లయ రాధ రెండు కాళ్ళు పట్టుకుని ఏడవటం మొదలుపెట్టారు.

ఇద్ధరినీ దగ్గరకు తీసుకుని నానమ్మకి ఆఫీసుంది.నేను లేటుగా వెళ్తే ఆఫీసు వాళ్ళు కోప్పడుతారుకదా.అందుకు నాన్న నన్ను
ఫాస్ట్ఫాస్ట్ గా వెళ్ళమంటున్నాడు. అంటూ వాళ్ళకి నచ్చచెప్పి కేబ్ బుక్చేసుకుంది ఇంట్లో రెండు కారులున్నప్పటికీ.
★★★

కాలానికి కళ్ళేలు లేవు.నెల్లూరు వచ్చిన రాధకి రాగిణి ఫోన్ చేసి,”అమ్మా!సంతోష్ మాట్లాడుతారట.” అంటూ ఫోనిచ్చింది.

“అత్తయ్యా శుభ వార్త.మీరు అమ్మమ్మ కాబోతున్నారు.రాగిణి చాలా వీక్ గా ఉంది.రెస్ట్ కావాలి.నేను ఆఫీసుపనిమీద ఖరగ్ పూర్ వెళ్ళాలి.మీరు హైదరాబాదువచ్చి ఉండగలరా నేను వచ్చే వరకూ.”అన్నాడు.

“సారీ సంతోష్!బ్యాంకులో ఆడిటింగ్ జరుగుతోంది నాకు రావటం కుదరదు.రాగిణిని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళండి.”అంది.

“సరే ఆంటీ”అన్నాడు సంతోష్.

రాధకి సంతోష్ చెప్పిన వార్త ఎంతో సంతోషం కలిగించింది.’నా అమ్మూ అమ్మవుతోంది.’ అనుకుని మురిసి పోయింది.తాత్కాలికంగా ప్రణవ్ అవమానాన్న మరచి పోగలచింది.

ఎంతో అపురూపంగా చూసుకుంది రాధ రాగిణిని.
తొమ్మిది నెలలు నిండగానే పండంటి పాపాయిని కన్నది రాగిణి.

సంతోష్ కి పట్టలేని ఆనందం.సంతోష్ తల్లి తండ్రి అదేం పెద్ద విషయం కాదన్నట్లు నిర్లిప్తంగా ఉన్నారు.

పాపాయికి వైష్ణవి అని పేరు పెట్టారు.

వైష్ణవి పుట్టిన వేళావిశేషం సంతోష్ త్రీ బెడ్రూం అపార్టమెంట్ తీసుకున్నాడు.కొంత హౌసింగ్ లోను పెట్టి.
“ఆంటీ రిటైర్మెంటు తరువాత మీరు మాదగ్గిరే ఉండాలి.అందుకే త్రీ బెడ్రూం అపార్ట్మెంటు తీసుకున్నా. మీ చేతుల్లో వైషూ మీ అంతడైనమిక్ గా పెరగాలి వాళ్ళమ్మలా ముద్దపప్పు లా కాకుండా.” అంటూ రాగిణిని ఆటపట్టించేవాడు.

చిరునవ్వు నవ్వేది రాధ .సంతోష్ కి ప్రణవ్ మనస్తత్వం బాగా తెలుసు.అత్తగారంటే గౌరవం ఒక ప్రత్యేక స్థానం ఉంది సంతోష్ కి.

అప్పుడప్పుడు అత్తగారిని రాగిణి వైష్ణవిలని తీసుకుని టూర్స్,యాత్రలకి వెళ్ళే వారు. రాగిణి పన్నెండేళ్ళ వైవాహిక జీవితం పెద్ద ఒడిదుడుకులు లేకుండా సాఫీగా గడుస్తోంది.

★★★

వైష్ణవి సెవెంత్ స్టాన్డర్డ్ చదువుతోంది.

శ్రుతి ఇంటర్ సెకండ ఇయర్ స్టేట్ లెవెల్ ఫస్ట్ ర్యాంకు తెచ్చకుంది.మీడియా ఇంటర్వ్యు లో తనకి ఇన్స్పిరేషన్, గైడ్ మా నాయనమ్మ అని చెప్పింది. ప్రణవ్,సమీరలకి కడుపు మండింది.

మెడిసిన్ ఎన్ట్రెన్స్ లో స్టేట్ ఐరవై ఐదో ర్యాంకు వచ్చింది శ్రుతికి.
లయ ఇంటరు మొదటి ఏడాదిలో చేరింది. అక్క లా తనూ మెడిసిన్ చేయాలని కోరిక.

శ్రుతికి ‘కెంపెగౌడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ లో సీటు వచ్చింది. వెంటనే కేవలం ఫీజు మాత్రం రెండులక్షలు వెంటనే కట్టాలి.
తండ్రి దగ్గరకెళ్ళి విషయం చెప్పింది శ్రుతి.

“ఇంటర్వ్యూలో మీ నానమ్మ పేరు చెప్పావుగా.పో! పోయిఆవిడనే అడుగు అన్నాడు.”ప్రణవ్.

“నాన్నా! మీరు ఇంటరు ఒక్కసెమిస్టర్ కయినా ఫీజు కట్టారా! కనీసంఎలాచదువుతున్నామో కనుక్కున్నారా! అమ్మకి కిట్టీపార్టీలు షాపింగులు.ఈవాతావరణంలో మేము ఈ లెవెల్కి వచ్చేమంటే నాయనమ్మ ప్రోత్సాహం కాక మీరా! ఆవిడ గురించి చెప్పక మీగురించి ఎలాచెప్పం నాన్నా! తల్లిదండ్రులుగా జన్మ నిచ్చారు కానీ జీవితాన్నివ్వలేదు. తండ్రిగా మీమీదున్న గౌరవం తో అడిగా!” అంతే మీనించి వచ్చే సమాధానం తెలిసి కూడా అంది శ్రుతి ఎంతో బాధతో.

వెంటనే రాధకి ఫోన్చేసి నానమ్మా !స్టడీ లోను కు ఎలా అప్రోచ్ అవాలి” అని అడిగి తండ్రికి తనకు జరిగిన సంభాషణ చెప్పింది.అదీ తండ్రి ఎదురుగా.

మనుమరాలి విజయం విని. మనసు ఎగిరి పడింది సంతోషంతో కెరటంలా రాధకు.

“అమ్మడూ శ్రుతి !ముందు నాన్నకి సారీ చెప్పు.తప్పుతల్లీ .పెద్ద వాళ్ళు చేసిన తప్పు చిన్నవాళ్ళు చేయరాదు. నీకు ఇమ్మీడియట్ గా ఫీజు ఈనాయనమ్మ సంతోషంగా కడుతుంది.ఇది నీ సక్సెస్ కి ఈ నానమ్మ గిఫ్ట్.అంతేకాదు బట్టలు బుక్స్ అన్నీ నేను చూసుకుంటారా! తల తాకట్టు పెట్టయినా.
అలాగే స్టడీ లోను కోసం ట్రై చేద్దాం నాన్న తో గొడవపడకు.”అంటూ మనుమరాలి విజయంలో పాలుపంచుకుంది రాధ.

‘ఇంకొక ఏడాదిలో లయ సంగతి తేలిపోతుంది.
వైష్ణవికి మేథ్స్,సైన్సెస్ అంటే ఇంట్రెస్ట్.ఇంకా ఐదేళ్ళుంది.అయినా వైషూ గురించి తనకి బాధ్యతలేదు.సంతోష్ బాధ్యత గలతండ్రి.’అనుకుంది మనసులో రాధ.

★★★
మరోసారి రాగిణిని కాలం కాళిందీ సర్పమై కాటేసింది.
ఎప్పటిలానే ఖరగ్పూర్ ఆఫీస్ కి మటీరియల్ తీసుకొని కొలీగ్ హరిశర్మతో కలసి ట్రావెల్ చేస్తున్నాడు సంతోష్.తన జీవితంలో వెలుగు నింపిన నీలిమ వైష్ణవిల గురించి కొంచెం ఎక్కవగానే మాట్లాడుతున్నాడు.

ఇంతలో”శర్మా నాకు అనీజీగా ఉంది అర్జెంటుగా వాష్రూమ్ కివెళ్ళాలి ట్రైన్ అవుటర్లో ఉందికదా.స్టేషన్ రావటానికి అరగంట పట్టచ్చు,వస్తే పోర్టర్ హెల్ప్ తో మటీరియల్ నా లగేజ్ దించు నేవస్తా నంటూ వెళ్ళాడు సంతోష్.
సమీర తండ్రి కర్కోటకుడు పోతూ పోతూ ఆస్థి అంతా చిన్నకూతురుకి ,కొడుకుకి వ్రాసి కాలంచేసాడు.పుట్టింటి నించీ పూర్తిగా వెలివేయబడిందని తండ్రి వీలునామాతో అర్ధం అయింది సమీరకి.ఇప్పుడు

ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తోంది. సంతోష్ రాలేదు.అప్పటికే సంతోష్ వెళ్ళి ఇరవైఐదు నిమిషాలయింది మొబైల్నించీ కాల్ చేస్తూ అన్ని వాష్రూం లు వెతికాడు శర్మ.ఎందులోను లేడు.ఫోన్ ఆన్లో ఉంచి సామానంతా దించాడు. ఇంకో ఇరవై నిమిషాలైనా సంతోష్ జాడ తెలియలేదు.రాత్రి పదకొండైంది.ఎందుకో శర్మకి భయం వేసింది.ట్రైన్ నించీ కాలు జారి పడలేదుకదా అని.వెంటనే ఆర్.పి ఎఫ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాడు.ట్రైను కదిలి ఢిల్లీ వైపు ప్రయాణమైంది .
ఆర్.పి.ఎఫ్ వాళ్ళు అన్ని స్టేషన్సలకి
మెసేజ్ పంపారు.లాస్ట్ హాల్టింగ్ ఢిల్లీ.

చేసేది లేక సంతోష్ లేండ్ లైనుకి ఫోను చేసాడు శర్మ.

మంచి నిద్రలో ఉంది రాగిణి.అప్పటివరకూ శ్రుతి గురించి ఎంతో సంతోషంగాతల్లి తో మాట్లాడి పడుకొంది.టైము చూసింది రాత్రి రెండుగంటలైంది. ఈ టైములో లేండ్ లైనుకి ఎవరై ఉంటారనుకుంటూ ఫోను ఎత్తింది.సంతోష్ చేరిం తరువాత చేస్తున్నాడనుకొంది.అవతలనించీ కొత్తగొంతువిని “ఎవరండీ?”అంది.

“నేను హరిశర్మ నండీ. “అన్నాడుశర్మ.

“ఆఁనమస్కారమండీ! చెప్పండి.చేరారాఅండి.తను బిజీగా ఉన్నాడా.ఫరవాలేదు .మార్నింగ్ చేయమనండి .”అంది రాగిణి.

హరిశర్మకి ఎలా చెప్పాలో తెలియలేదు.
“మేడం కొంచెం నిదానంగా వినండి.టెన్షన్ ఏంలేదు.”అని మాట పూర్తకాకుండానే
“ఏమైంది?తొందరగా చెప్పండి .”అంది రాధ మనసు పరిపరివిధాల కీడు శంకించగా.

“ఏంలేదు మేడం సంతోష్ గారు కనపడుట లేదండీ ”

“ఏమిటండీ మీరు మాట్లాడుతున్నది.” అంది రాధ.
“అవునండీ !”అంటూ జరిగిన దంతా వివరించాడు హరిశర్మ.

క్రెడిల్ పెట్టేసింది రాధ.తల్లికి ఫోన్ చేసి అంతాచెప్పింది.
వెంటనే ఆ అర్ధరాత్రి తెలిసిన టాక్సీ తీసుకుని నెల్లూరునుంచీ హైదరాబాదు బయలు దేరింది.అన్నలకి అక్కకి తెలిపింది .

ప్రణవ్ ఫోను ఎత్తకపోతే శ్రుతి కి చెప్పి నాన్నని హైదరాబాదు రమ్మంది.

హైదరాబాద్ చేరిన రాధకి మూర్తీభవించిన శోకదేవతలా ఎదురువచ్చింది రాగిణి .
రాగిణి అత్తగారు మామగారు పండు ముసలివారు.అయోమయంగా సోఫాలో ఒకమూల ఒదిగి కూర్చున్నారు .
నెమ్మది నెమ్మదిగా అన్నావదినలూ అక్కబావ హైదరాబాద్ చేరారు.

వరుసగా మూడు రోజులు రాత్రి పగలూ ఆర్.పి ఎఫ్ వాళ్ళకి సంతోష్ ఫోన్ కి కాల్ చేస్తూనే ఉన్నారు. పొరపాటున సంతోష్ ఫోను ఎత్తుతాడేమో అనే ఆశతో.

సంతోష్ ఆచూకీ కానీ బాడీ కాని దొరకలేదని మెసేజ్ వచ్చింది.

మొదట్లో తెలియలేదు వైష్ణవికి నెమ్మదిగా తెలిసే సరికి తండ్రి ఫొటో పట్టుకుని ఏడ్చే ఏడుపుకి చూసిన వాళ్ళ హృదయాలు బద్దలయ్యాయి.

నాలుగు రోజుల తరువాత డిజెనరేట్ అయి,గుర్తు పట్టలేని ఒక బాడీ దొరికిందని అది డి.ఎన్.ఏ టెస్ట్ ద్వారా గుర్తుపట్టి తీసికెళ్ళవలసిందిగా ఢిల్లీ ఆర.పి.ఎఫ్ ఖరగ్ పూర్ ఆర్.పి.ఎఫ్ కి తెలపగా ఆ మెసేజ్ ఫీసువాళ్ళద్వారా రాగిణికి చేరింది.
డి.ఎన్.ఏ.టెస్ట్ కు ఆబాడీ అన్నదమ్ములు రావాలన్నారు.

దానికి సంతోష్అన్నగారు సుముఖంగాలేరు.ఫ్లైటులో తీసికెళ్తే వస్తా నన్నాడు.

బంధువులందరూ నచ్చచెప్పగా ప్రణవ్, శ్రీనివాస రెడ్డి,సంతోష్ అన్నగారు ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళారు.

డి.ఎన్.ఏ టెస్ట్ మ్యాచ్ అయింది.పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో మాసివ్ హార్ట్ఎటాక్ అని తేలింది.

ఆకంపార్టమెంటు వాష్రూం ఎంగేజ్ అవటంతో నెక్స్ట్ కంపార్ట్ మెంటు లోకి వెళ్ళటంతో హరిశర్మ తెలుసుకో లేకపోయాడు.

ఢిల్లీ లో కంపార్ట్ మెంటు క్లీనింగ్ లో బాడీ బయట పడింది.
బాడీని సీల్డ్ కంటైనర్ లో ఇంటికి తెచ్చారు.
వైష్ణవి ని పట్టు కోవటం కష్టమైంది.

రాగిణి స్వరతంత్రులు తెగిన వీణలా స్థాణువయ్యింది.

రాధ అన్కాన్షస్ లోకి వెళ్ళింది.

రాజారెడ్డి మేనకోడలిని ఆచెంప ఈ చెంప కొట్టాడు.
“సంతోష్ చనిపోయాడు ఏడు అమ్మూ ఏడు.”అంటూ.

అయినా కంటిలో నీళ్ళచుక్కలేదు.

సంతోష్ వైపు వాళ్ళొచ్చి”తల్లి అదృష్టమే బిడ్డకు వచ్చిందని సూటి పోటి మాటలు మాట్లాడసాగారు.
కోపిష్టి అయిన ప్రణవ్ “ఎవరైనా నోరెత్తారంటే ఈ శవంతో పాటు వాళ్ళశవాలు కూడా లేస్తాయంటంతో
నోళ్ళు మూసుకున్నారు.

జరగవలసిన తంతు జరిగి పోయింది. బ్యాంకుకి మూడునెలలు సెలవుపెట్టింది.నెల్లూరునించీ తిరుపతి రిక్వెస్ట్ ట్రన్సఫర్ పెట్టుకుంది.

రాధ పరిస్థితి తెలిసిన రీజనల్ మేనేజర్ రాధ రిక్వెస్టు ఆమోదించాడు.
వైష్ణవికి మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి రాగిణిని వైష్ణవిని తిరపతి తీసుకొచ్చింది.

అన్నిటికంటే రాధ షాక్ తిన్నది ప్రణవ్ ఫ్లైట్ చార్జెస్ బెంగుళూర్ చార్జెస్ తో పాటు ఢిల్లీ కేబ్ మరియు హోటల్ చార్జెస్ క్లైమ్ చేసినప్పడు.

మళ్లీ పోనీలే టైముకి వచ్చాడుకదా అని సరిపెట్టుకుంది.

యాంత్రికంగా రోజులు గడుస్తున్నాయి.సమ్మర్ వెకేషన్ అయిపోవచ్చింది.

“వైష్ణవిని తిరుపతి లో జాయిన్ చేద్దాము.”అంది రాధ రాగిణితో.
“వద్దమ్మా !నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను.అది మంచి స్కూలు. అక్కడే కంటిన్యూ చేస్తుంది.” అంది.రాగిణి

సంతోష్ ది ప్రైవేటు కంపనీ అవటంతో మానిటరీ బెనిఫిట్స్ లేవు.ఉన్నడబ్బు కొంత అపార్టమెంటు ఇంటీరియర్సకి అయిపోయింది.

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అద్దరి ఇద్దరి

ఈ సంత్సరమైనా…