జరిగిన కథ
రాగ మాలకి కొత్త ఇంట్లో అడ్జస్ట్ కావడానికి కొంచెం సమయం పడుతుంది. అందరితో కలిసి పోవడానికి ప్రయత్నం చేస్తుంది. సెలవులకు ఊరికి వెళ్ళినప్పుడు కళ్ళ చకప్ కోసం అన్న అను రాగ్ తో హైదరాబాద్కు వస్తుంది. అక్కడ మోహన్ ను చూస్తుంది. ఇద్దరు కొత్త కళ్లద్దాలతో కాలేజీకి వస్తారు. మోహన్ వాళ్ళ అక్కకు పెళ్లిచూపులు ఉన్నాయని ఇంటికి పిలుస్తాడు
ఇక కథలోకి వెళ్దాం!
మోహన్ రమ్మని చెప్పాడు. కానీ వాళ్ళ ఇంటికి వెళితే బాగుంటుందా? అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందు మోహన్ మాట్లాడనే మాట్లాడడు. మరి వాళ్ళు ఏమనుకుంటారు? శుభశ్రీ అక్క పెళ్లి చూపులనీ తాను చెప్పలేదు. మోహన్ వాళ్ళ అమ్మగారు ఎక్కువ మాట్లాడరు. ఎలా వెళ్లాలి?” అని ఆలోచిస్తూనే..
‘వెళ్లకుంటే మోహన్ కి కోపం వస్తుంది. సరే! ఎలాగైనా వెళ్తాను. ఎవరూ సరిగా మాట్లాడకుంటే వెంటనే వచ్చేస్తాను’ అని అనుకొని, ముఖం కడుక్కుని బట్టలు మార్చుకొని ..
“అత్తయ్యా! నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బుక్ తెచ్చుకోవాలి వెళ్లి వస్తాను”అని చెప్పింది రాగమాల.
“సరే అమ్మ వెళ్ళిరా”అన్నది సుమిత్ర.
ఎక్కడ త్రిష వెంట పడుతుందో అని భయంతో త్రిషని చూడకుండానే బయటకు వచ్చేసింది రాగమాల.
రాగమాల ఉండే ఇంటికి మోహన్ వాళ్ళు ఇల్లు పెద్ద దూరమేం కాదు. వాళ్ళ ఇంటికి వెళ్లింది. ముందు గదిలో ఎవరూ లేరు. అసలు పెళ్లి చూపులు ఉన్నట్లు వాతావరణం కనిపించలేదు. మెల్లిగా లోపలికి వెళ్ళింది.
లోపలి గదిలోకి వెళ్ళిన రాగమాలకి, చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడ మోహన్ వాళ్ళ అక్క శుభ శ్రీ పెళ్లి చూపుల కోసం తయారైనట్లుగా లేదు. మామూలుగా రోజు ఇంట్లో ఉన్నట్లుగానే ఉంది. మోహన్ ముగ్గురు తమ్ముళ్లు అక్కడే ఉన్నారు. అక్కడ వాళ్ళ బంధువుల పిల్లలు ఇద్దరు ఉన్నారు.
వాళ్లందర్నీ చూసేసరికి బోలెడంత భయమేసింది రాగ మాలకి.
“రా, రాగ మాలా!”అని పిలిచింది శుభశ్రీ.
మోహన్ అక్కడ గడప మీద కూర్చున్నాడు. మోహన్ ని కోపంగా చూసింది రాగమాల.
“ఏం కాదు” అన్నట్లుగా మోహన్ చూశాడు. వాళ్లందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. కబుర్లు చెప్పుకోవడం కన్నా నవ్వడమే ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో. అసలు అంతగా నవ్వెందుకు వస్తుందో రాగ మాలకి అర్థమే కాలేదు. చిన్న చిన్న మాటలకే నవ్వేస్తుంటారు. రాగమాల మాత్రం కొంచెం సీరియస్ గానే కూర్చుంది
అప్పటికి మోహన్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఈసారి కొంచెం మామూలుగానే మాట్లాడాడు.
కాసేపు కూర్చున్నాక టీ తాగి “నేను వెళ్తున్నాను” అని చెప్పింది.
“కొంచెం సేపు అయ్యాక వెళ్ళు. కూర్చో”అన్నది శుభశ్రీ.
“లేదక్కా! నాకు కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది. చదువుకోవాలి .ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది “అని చెప్పి కళ్ళతో మోహన్ కు వెళుతున్నాను అని చెప్పి బయలుదేరింది.
ఇల్లు చేరుకుంటుంది అనే సమయంలో మోహన్ సైకిల్ మీద వచ్చాడు.
“రాగా!కోపం వచ్చిందా?”అని అడిగాడు మోహన్.
“రాదా మరి! పెళ్లిచూపులు అని చెప్పి నన్ను అలా పిలిచావు. వాళ్ళందరిని చూసి నాకు ఎంత భయమేసింది”అన్నదిరాగ మాల.
“పెళ్లిచూపులు ఊళ్లోనే జరిగాయట. అక్కకి ఇంట్లో ఉండి, ఉండి విసుగు వస్తుందని వచ్చింది. నువ్వు కూడా అక్కని కలిసినట్లు ఉంటుంది అని చెప్పి పిలిచాను. మరో విషయం తెలుసా? అక్క నువ్వు రాసిన ఉత్తరం చదివింది .నన్ను చాలా తిట్టింది.”అన్నాడు మోహన్.
“అవునా! మీ అక్క ఉత్తరం చదివిందా? ఎలా ఇప్పుడు?”అని భయపడింది రాగమా ల.
“నేను ఏదో ఒకటి చెప్పాలే. ఇప్పుడు టెన్షన్ పడకు. ముందైతే ఎగ్జామ్ కోసం చదువుకో. అంత నార్మల్ గా ఉంటుంది”అని చెప్పి వెళ్ళిపోయాడు మోహన్.
ఎంత వద్దనుకున్నా ఆమె ఉత్తరం చదివింది అని తెలిసి నప్పటినుండి భయమేసింది రాగ మాలకి.
“ఒకపక్క ఎగ్జామ్ టెన్షన్, ఇంట్లో చిన్నపిల్లల అల్లరితో చదువుకోవడం కుదరడం లేదు. మరో నాలుగు రోజుల్లో ఎగ్జామ్ ఉంది” అంటూ టెన్షన్ పడసాగింది రాగమాల.
ఇంటికి వచ్చిన రాగ మాలకి కిషన్ రావు గారి పెద్ద కూతురు వాణి బట్టలు సర్దుతూ కనిపించింది.
“ఏంటి అక్క! బ్యాగ్ సర్దు తున్నావు”?అన్నది రాగ మాల.
“మా అత్తగారికి ఒంట్లో బాగా లేదట. నేను రేపు ఉదయం ఊరికి వెళుతున్నాను. అయినా పిల్లలతో నీకు కూడా చదువు సాగడం లేదు కదా”అన్నది వాణి.
“అయ్యో! అదేమీ లేదక్కా. అయినా మీ పుట్టింటికి నువ్వు వచ్చావు. నా గురించి ఇంత ఆలోచించడం ఎందుకు? అయినా కూడా ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. చదువు కుంటాను”అన్నది రాగమాల.
తెల్లవారి ఉదయం వాణి పిల్లలతో వెళ్ళిపోయింది.
“అయ్యో! పిల్లలు ఉండటం వల్ల చదువు సాగడం లేదు అనుకున్నాను. కానీ పాపం వాళ్లకి ఇక్కడే కదా సంతోషంగా ఉండ గలిగేది”అని అనుకున్నది రాగమాల.
ఆరోజు రాత్రి ఎక్కువ సమయం చదువుకుంది. దాదాపు రెండున్నర కావస్తుంది. కడుపులో మెలి పెట్టినట్లుగా ఆకలి అవుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడు గంటలకే తినడం వల్ల, అందులో ఎక్కువ సేపు చదువుకుంటూ ఉండటం కారణంగా ఆకలి వేసింది.
త్రిష, వీణ ,రాజు పడుకుని ఉన్నారు. ఎందుకో రాజు లేచి కూర్చున్నాడు.
“ఏంటి అక్క! ఇంకా పడు కోలేదా?”అని అడిగాడు.
“లేదు రాజు! ఆకలి వేస్తుంది. కడుపులో మంటగా ఉంది”అని చెప్పింది రాగమాల.
“సరే ఉండు ఇప్పుడే వస్తాను”అని చెప్పి వంటింట్లోకి వెళ్ళాడు.
అటుకుల్లో ఉప్పు, కారం నూనె వేసి కలుపుకొని తీసుకొని వచ్చి ఇచ్చాడు.
“ఇవి తినక్కా!నాకు ఇంకా ఏది చేయడం రాదు”. అన్నాడు రాజు.
“ఇవి చాలు నాకు. నిజంగా నీకు థాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు”అంటూ గబగబా అటుకులన్నీ తినేసింది. ఆకలి తీరాక తృప్తిగా పడుకుంది రాగమాల.
మోహన్ కూడా నాలుగు రోజులు కాలేజ్ కి వెళ్లకుండా చదువుకున్నాడు.
ఇద్దరు పరీక్ష బాగా రాసారు. చాలా అలసటగా అనిపించింది. ఇంటికి వెళ్లి పడుకుందాము అనుకుంది.
ఇంటికి వెళ్లి భోజనం చేసేవరకు నాలుగు దాటింది.
ఆ రోజు కిషన్ రావు గారు తొందరగా వచ్చారు.అసలు పడుకునే అవకాశం దొరకలేదు.
ఇంతలో ఇంటికి వచ్చే ఆధ్యాత్మిక ప్రవచన కర్త తాతయ్య వచ్చారు..
స్కూల్ పిల్లల లాగా అందరూ “నమస్కారం తాతయ్య “అంటూ నిలబడి దండాలు పెట్టారు..
ఆయన కూర్చున్న కాసేపటికి మోహన్ వచ్చాడు.
మోహన్ ను చూసిన రాగ మాల భయపడింది. వీళ్ళ ఇంటికి అతను వస్తే బాగుండదు కదా! వేరే వాళ్ళ ఇంటికి పిలవడానికి తనకు హక్కేం ఉందని?”ఇలా అనుకుని అతన్ని చూసింది .
లోపలికి వచ్చిన మోహన్, తాత గారిని చూశాడు. అంతకుముందే అతని గురించి తెలియడం వల్ల..
దగ్గరికి వెళ్లి “నమస్కారం తాతయ్య! మీ గురించి చాలా విన్నాను. ఎన్నో మంచి విషయాలు చెప్తారని రాగమాల నాకు చెప్పింది. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా మీ గురించి తెలుసని చెప్పారు. మీలాంటి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం నాకు అవసరం” అన్నాడు .
ఒక్కసారి ఆశ్చర్యపోవడం రాగమాల వంతయింది.
“మోహన్ కి ఇలా మాట్లాడటం కూడా వచ్చా? అలక, కోపం ఆ రెండే వచ్చని అనుకున్నాను”అని అనుకుని చిరునవ్వు నవ్వింది .
“ఎవరు బాబు నువ్వు నీ పేరేంటి”అని తాతయ్య అడిగారు.
అప్పుడు సుమిత్ర చెప్పింది..
“ఇతను రాగమాల వాళ్ళ నాన్నగారి స్నేహితుని కొడుకు. వాళ్ళిద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తారు. వీళ్ళిద్దరూ ఒకే క్లాసు. అలా కుటుంబ పరిచయాలు కూడా ఉన్నాయట. ఈమధ్య మాకు పరిచయం అయ్యాడు”అని చెప్పింది.
కిషన్ రావు గారు మాత్రం మోహన్ వైపు గుర్రుగా చూడసాగాడు. అతను రావడం ఆయనకు నచ్చలేదు. బుంగమూతి పెట్టుకుని అలాగే కూర్చున్నాడు
“అవునా! సంతోషం నాయన! బాగా చదువు కుంటున్నావా?”అని తాతయ్య అడిగారు.
“అవునండి! బాగా చదువుకుంటున్నాను. నేను ట్యూషన్స్ కూడా చెప్తున్నాను. నా ఫీజులు నేనే కట్టుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇటువైపు వస్తుంటే రాగమాల దగ్గర బుక్స్ అడగాలని గుర్తుకొచ్చి వచ్చాను” అని అతను అన్నాడు .
“అవునా! ఇటు చదువుకుంటూ, ట్యూషన్స్ చెప్తున్నావా? చాలా మంచి విషయం బాబు” అని తాతయ్య అన్నారు. ఆయనకు మోహన్ అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది. అతనికి కూడా అదే కావాల్సింది.
సుమిత్రకు కూడా ఆ విషయం నచ్చింది. “ఇలా కష్టపడుతూ చదువుకోవడం ఎంతమంది చేస్తారు”? అని అనుకుంది.
తాతగారు పేరుకు ఆధ్యాత్మికవేత్త అని చెప్పుకుంటారు. కానీ ఆయనను ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి. భజన చేస్తూ ఉండాలి. ఆయనకు తెలిసిన విజ్ఞానం ఆవగింజంత. కానీ చూపించేది గుమ్మడికాయ అంత. ఎవరైనా ఆయనకు నమస్కారం పెట్టకపోయినా, దగ్గరికి వచ్చి పలకరించక పోయినా, చాలా కోపం వస్తుంది. కోపంతో వాళ్ళని తిడతారు .
కానీ అవన్నీ మోహన్ కి ఏం అవసరం? రాగ మాలను కలుసుకోవడానికి ఒక దారి దొరికిందని సంతోష పడ్డాడు.
ఉన్న కాసేపట్లో మోహన్, త్రిషకి మ్యాత్స్ లో డౌట్ ఉందంటే, క్లియర్ చేశాడు. రాజుకు మాత్రం కొంచెం వీళ్ళ విషయం అర్థం అయింది.
అందరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత మోహన్ , తాతయ్య వెళ్లిపోయారు. అందరూ భోజనాలు చేసిన తర్వాత, అలసిపోయిన రాగమాల వెంటనే నిద్రలోకి జారుకుంది.
” ఒరే మోహన్! నేను ఎల్లుండి ఊరికి వెళ్ళిపోతాను. మంచి సినిమా వచ్చిందట. చూద్దామంటే నాకు తోడు ఎవరూ లేరు. రాగమాల వస్తుందేమో అడుగుతావా”? అన్నది శుభశ్రీ.
“అడుగుతాను. కానీ వాళ్ల చుట్టాల ఇంట్లో ఉంది కదా! తనంతట తను బయటకు రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. అందులో ఫస్ట్ షో. అందుకని నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగి ,కలిసి వెళ్ళండి “అన్నాడు అతను.
“మీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్ట పడుతున్నారు.ఇప్పుడే నేనిలా అనకూడదు. కానీ అసలు తానే, నన్ను వచ్చి తీసుకొని వెళ్ళాలి. నువ్వేమో నన్నే వెళ్ళ మన్నావు. ఏంట్రా ఇది?”అన్నది శుభశ్రీ.
అతను అక్క అంతరార్థం తెలుసుకుని, “అంటే తను రాగమాల విషయంలో పాజిటివ్ గానే ఉందన్నమాట” అని అనుకున్నాడు.
“మోహన్! ఒక విషయం చెప్తాను విను. ఇంకా నాపెళ్లి కాలేదు. ఇప్పుడే నువ్వు పెళ్లికి తొందరపడటం బాగాలేదు. ఈ ప్రేమలు అవసరమా? అసలు మీ ప్రేమ పెళ్లి వరకు వస్తుందా”? అన్నది.
“ఇప్పుడే మంచిగా మాట్లాడింది అనుకుంటే ,మళ్ళీ ఇదేమి ఫిట్టింగ్?” అనుకున్నాడు మోహన్.
ఏమీ మాట్లాడకుండా, అతను,అలాగే నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
“ఇప్పుడైతే ఇద్దరూ చదువు మీద దృష్టి పెట్టండి. చదువు మాత్రం పాడు చేసుకోవద్దు. నా పెళ్లి సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాం”అన్నది శుభశ్రీ.
అతను మౌనంగా తల ఊపాడు .
“సరే , వాళ్ళ ఇల్లు నాకు చూపించు. నేనే వెళ్లి తనని అడిగి, ఇద్దరం కలిసి సినిమాకు వెళ్తాం”అని చెప్పింది .
అతను సంతోషంగా తయారయ్యి, ఆమెను వాళ్ళ ఇంటి వరకు పంపించి వెళ్లిపోయాడు.
శుభశ్రీ రావడం చూసి, రాగమాల ఆశ్చర్యపోయింది.
“రండి అక్క! ఏంటి ఇలా వచ్చారు, కూర్చోండి ?”అన్నది.
“నేను రేపు ఊరికి వెళ్ళిపోతున్నాను. మంచి సినిమా వచ్చింది. చూద్దామని అనుకున్నాను. నాకు తోడు ఎవరు లేరు. అందుకే నువ్వు వస్తా వేమోనని వచ్చాను”అన్నది శుభశ్రీ.
అక్కడే ఉన్న సుమిత్రన్ని చూసి..
“అత్తయ్య! తను మోహన్ వాళ్ళ అక్క. సినిమాకు వెళ్దామని అడుగుతుంది. వెళ్ళనా”అని అడిగింది .
“మోహన్ అక్కనా? ఏమ్మా, నీ డిగ్రీ కంప్లీట్ అయిందట కదా? రాగ చెప్పింది ఎక్కడ ఉంటున్నావ్?”అని సుమిత్ర అడిగింది.
“అయి పోయిందండి. నేను ఊర్లో మా అమ్మమ్మ, తాతయ్య తో ఉంటున్నాను. మా నాన్నగారు వేరే ఊళ్ళో జాబ్ చేస్తున్నారు. అమ్మ,నాన్న అక్కడే ఉంటున్నారు. అదే రాగమాల వాళ్ళ ఊరే”అని చెప్పింది శుభశ్రీ.
“అవునా? మరి సినిమాకి వెళ్తారేమో కదా! వెళ్ళండి. లేట్ అవుతుంది” అన్నది సుమిత్ర.
ఇద్దరు కలిసి సినిమాకు వెళ్లారు.
సినిమా మొదలైన కాసేపటికి, మోహన్ వచ్చి పక్క లైన్ లో కూర్చున్నాడు. శుభశ్రీ అది గమనించింది.
ఇంటికి వెళ్లేటప్పుడు మోహన్ ని చూసి “మన ఇల్లు కొంచెం రోడ్డుకే ఉంది కదా, నాకు భయం లేదు నేను వెళ్ళిపోతాను. కానీ రాగమాల ను ఇంటి వరకు పంపించి,రా”అని చెప్పింది శుభశ్రీ .
ఇది ఇంకా ఆశ్చర్యం అనిపించింది మోహన్ కి.
బుద్ధిమంతుడు లాగా.. “సరే అక్క” అని అక్కను కొంత దూరం వరకు పంపించి రాగ మాలతో వచ్చాడు.
“మీఅక్కకి మన విషయం తెలుసు అన్నావు కదా! తను బాగానే మాట్లాడుతుంది కదా”అన్నది రాగమాల.
“తను కొంచెం అర్థం చేసు కున్నట్లుగానే అనిపించింది. అయితే చదువు పాడు చేసుకోవద్దు అని హెచ్చరించింది. మనం చదువు ఏమి పాడు చేసుకోవడం లేదు కదా! చదువుకున్న తర్వాతే ఆలోచిద్దాం. ఇప్పుడే అంత తొందరగా ఎందుకు”? ఉన్నాడు.
.”సరే ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ఇల్లు వచ్చేసింది. నేను వెళ్తున్నాను”అని చెప్పి ఆమె లోపలికి వెళ్ళిపోయింది .
వారం రోజుల్లో శివరాత్రి వస్తుంది. ఇక్కడ గుడిలో కోటి లింగాలతో, తయారు చేసిన పెద్ద లింగం ఉంటుంది. ఆ గుడి కూడా చాలా పెద్దది. శివరాత్రికి రాగమాల ఆ గుడికి వెళ్లాలని అనుకుంది.
శివరాత్రికి రెండు రోజుల ముందు కిషన్ రావు గారు, సుమిత్ర ఊరికి వెళ్లారు.
ఇంట్లో విధేయురాలుగా ఉండే వీణకు, సుమిత్ర బాధ్యత అప్పగించింది . అలాగే రాగ మాలకి కూడా చెప్పింది.” నువ్వు అందరికన్నా పెద్ద దానివి, అందరూ జాగ్రత్తగా ఉండండి. వంట చేసుకుని తినండి”అని చెప్పి వెళ్లారు.
రాగ మాలకి వంట వచ్చు కాబట్టి, పెద్ద సమస్య లేదు. పొద్దున్నే పప్పు ,అన్నం చేసేది.అందరూ తిని కాలేజీకి, స్కూలు వాళ్లకు వెళ్లిపోయే వాళ్ళు .
రాగమాల ఒకరోజు రాత్రి చదువుకుంటూ కూర్చుంది.
వీణా, త్రిష ఇద్దరూ పడుకున్నారు.
ఒక ఆడ, మగ ఉన్న పెయింటింగ్ తీసుకొని వచ్చి మోహన్, రాగమాల అని పేర్లు బొమ్మల కింద వ్రాసి, రాజు ఆమెకు తెచ్చి ఇచ్చాడు. ఆ రెండింటి మధ్య లవ్ సింబల్ పెట్టాడు .
“ఏంటిది రాజు, ఎందుకిలా పేర్లు రాశావు? అన్నది.
“అక్క, ఏమి అనుకోకు. మీరిద్దరి గురించి నాకు తెలుసు. నాకే కాదు అమ్మకు కూడా తెలుసు. నువ్వు లేనప్పుడు నీ లెటర్స్ చదివారు”అని రాజు చెప్పాడు .
రాగ మాలకి టెన్షన్ తో చెమటలు పట్టాయి.
“అమ్మకి కొంచెం కోపంగా ఉంది. కానీ నీ లైఫ్ నీ ఇష్టం కదా అక్క” అని అతను అన్నాడు .
“సరే, ఇకనుండి నా జాగ్రత్తలో నేనుంటాను” అన్నది ఆమె.
“నా తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను నేను దుర్వినియోగం చేస్తున్నానా?” అని ఆమె ఒక్క క్షణం ఆలోచించింది .
మనసంతా చికాకుగా అనిపించింది. “ఎలాగైనా అమ్మకు చెప్పాలి “అనుకుంది. ఆలోచిస్తూ నిద్ర పోయింది.
ఆనాడే శివరాత్రి. ఇంట్లో ఎవరు ఉపవాసం చేయలేదు. వాళ్లకి రాగమాల అన్నం, పప్పు చేసి పెట్టింది.తాను మాత్రం ఉపవాసం చేసింది.
సాయంత్రం ఆరు గంటలకు వీణ, త్రిషతో కలిసి గుడికి వెళ్ళింది. మోహన్ కూడా వస్తానని చెప్పాడు. గుళ్లో అందరూ కలుసుకున్నారు. ముందే పరిచయం ఉండటం వల్ల వీణా, త్రిష బాగానే మాట్లాడారు.
ఇలా ఇద్దరు కలిసి గుడికి రావడం వాళ్ళిద్దరికీ బాగా నచ్చింది. మనసులో ఉన్న చిరాకు అంత పోయి ప్రశాంతంగా అనిపించింది.
అందరూ ఇంటికి వచ్చారు. వీళ్ళతో పాటు మోహన్ కూడా వచ్చాడు. అందరూ ఇంటికి చేరుకున్న కాసేపటికి ఆధ్యాత్మికవేత్త తాతయ్యగారు వచ్చారు. అతను కొంచెం మోహన్ వైపు విచిత్రంగా చూశారు. అతను వెళ్ళాక కాసేపు అందరూ కలిసి క్యారం బోర్డు ఆడుకొన్నారు. ఎనినిది గంటల సమయంలో మోహన్ ఇంటికి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళాక, రాగ మాల దేవుడికి పండ్లను నైవేద్యం పెట్టీ, అందరికీ ప్రసాదంగా ఇచ్చి, తాను కూడా తీసుకుంది.
రెండు రోజుల తర్వాత సుమిత్ర, కిషన్ రావు గారు ఊరి నుండి వచ్చారు. మోహన్ వచ్చాడని వాళ్లకు వీణ చెప్పింది. వాళ్లకి చాలా కోపం వచ్చిందని సాయంత్రం రాజు చెప్పాడు.
“ఇకనుండి అతన్ని ఇంటికి రావద్దని చెప్తానని” మనసులో అనుకుంది ఆమె.
రాగ మాలకు ఊరికి వెళ్ళాలని అనిపించింది. అమ్మని చూడాలని, అమ్మతో విషయం మాట్లాడలని అనుకుంది. కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు.
ఆమె ఈధ్యాసతో అన్నం తినడం పూర్తిగా మానేసింది. చాలా చిక్కి పోయింది. మోహన్ మాటలు ఒక్కొక్కసారి బాధను కలిగిస్తున్నాయి. తొందరపాటు మాటలు ఎలాగూ మాట్లాడుతాడు .కానీ కొన్నిటికి అర్థం తెలియడం లేదు.
ఇద్దరూ ఒక రోజు పెళ్లి విషయం మాట్లాడుకుంటే అతను అన్నాడు..
“నేను లైఫ్ లో సెటిల్ అయ్యేవరకు చాలా టైం పడుతుంది. అప్పటివరకు నేను పెళ్లి చేసుకోను. అంతవరకు నువ్వు నా కోసం ఎదురు చూడటం ఎందుకు?”అని అన్నాడు.
“అదేంటి అట్లా మాట్లాడుతున్నావ్?,ఇన్ని రోజులు ఇంత సన్నిహితంగా ఉన్నది విడి పోవడానికేనా? అసలు నువ్వు ఏమంటున్నావ్?”అన్నది.
“అట్లా అని కాదు.
అన్ని రోజులు నాకోసం ఎదురు చూడటం ఎందుకని అన్నాను”అని అతను అన్నాడు.
ఈ విషయం గురించి ఇద్దరికీ వాదన నడిచింది. ఆ తర్వాత ఆటాపిక్ కొన్ని రోజుల వరకు మాట్లాడుకోలేదు. ఇప్పుడు మాట్లాడు కోవాల్సిన సమయం వచ్చింది. కొందరికి ఇప్పటికే తెలిసింది. వేరే వాళ్ళ ద్వారా ఇంట్లో తెలిస్తే బాధపడతారు”ఇలా ఆలోచిస్తూనే ఉంది.
ఒక రెండు రోజుల తర్వాత మోహన్ కాలేజీ దగ్గర కలిసి..
“ఎల్లుండి మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. అమ్మా, అక్క అమ్మమ్మ వాళ్లతో పాటు ఊర్లోనే ఉంటారట. నాన్న రోజు స్కూటర్ పైన ఉద్యోగానికి వెళ్లి వస్తారని చెప్పారు. ఇల్లంతా రిపేర్ చేయించి కలర్స్ వేయించారు. అందుకని వ్రతం చేస్తున్నారు. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. మా ఇల్లు చూడాలి. మా ఇల్లు చాలా బాగుంటుంది.అసలు అలాంటి ఇల్లు ఎక్కడా ఉండదు.అక్క కూడా నిన్ను రమ్మని మరీ మరీ చెప్పింది”అన్నాడు.
“మీ ఇంటికా? అలా వస్తే బాగుండదు. నేను రాను”అని ఆమె అన్నది.
“నువ్వు తప్పకుండా రావాలి. రాకుంటే ఊరుకోను.మర్చిపోయాను అక్క ఉత్తరం కూడా ఇచ్చింది. ఇదిగో చదువు”అని ఒక ఉత్తరం ఇచ్చాడు.
అందులో సారాంశం “వాళ్ళ ఊరికి వ్రతానికి రమ్మని “రాసింది.
“సరే! నేను ఆలోచించుకొని చెప్తాను”అంటూ ఆమె వెళ్ళిపోయింది.
“ఆలోచించు కోవడానికి ఏమీ లేదు. నువ్వు రావాల్సిందే! నేను ఈరోజు రాత్రికి ఊరికి వెళ్ళిపోతున్నాను”అంటూ అతను వెళ్ళిపోయాడు.
తెల్లవారి కాలేజీ నుండి వచ్చిన కాసేపటికి మోహన్ తమ్ముడు రఘు వచ్చాడు.
“నేను ఊరికి వెళ్తున్నాను. అన్నయ్య నిన్ను నాతో తీసుకొని రమ్మని చెప్పాడు”అని అన్నాడు.
ఆ విషయమే సుమిత్రకి చెప్పి, రఘు తో బయలుదేరింది. వాళ్ల ఊరికి చేరుకునేసరికి రాత్రి ఎనిమిది అయ్యింది. చాలా చిన్న ఊరు కావడం వల్ల ఊరంతా చీకటిగా ఉంది. అప్పటికే అందరి ఇళ్ల తలుపులు వేసి ఉన్నాయి. ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. పాతకాలం నాటి ఇల్లు. లైట్లు చాలా మసకగా వెలుగుతున్నాయి. లోపలికి వెళ్ళిన రాగ మాలను ఇంట్లో అందర్నీ పరిచయం చేసింది శుభశ్రీ.
వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య అందరూ బాగానే పలకరించారు. శుభశ్రీ తో పాటు భోజనం చేసింది. మోహన్ మాత్రం ఎవరూ లేని సమయంలో పలకరించి వెళుతున్నాడు.
అందరి భోజనాలు అయ్యాక, మధ్య వాకిలిలో ఉన్న పెద్ద అరుగు మీద అందరికీ పరుపులు వేశారు. అక్కడే శుభశ్రీతో పాటు పడుకుంది రాగమాల.
శుభశ్రీకి ఎన్నో పెళ్లి సంబంధాలు చూస్తుండటం వల్ల, ఆమె వాటి గురించి చెప్తూ ఉంది. చూసిన సంబంధాలలో ఒక సంబంధం ఆమెకు బాగా నచ్చింది. ఆ ఫోటోలు మెల్లగా ఎవరూ చూడకుండా తీసుకొచ్చి చూపించింది.
“నిజంగానే ఇతను బాగున్నాడు” అన్నది రాగమాల.
“వాళ్ల రిప్లై కోసం ఎదురు చూస్తున్నాము. ఇప్పటికి ఎన్నో సంబంధాలు చూశారు. నాకు చాలా విసుగొస్తుంది”అన్నది శుభ స్త్రీ బాధగా.
అలా మాట్లాడుతూ నిద్రలోకి జారుకున్నారు….
తెల్లవారి….
సశేషం