చదువుకున్న చదువుతో ఉపాధి కోసం పరుగులు తీసేటప్పుడు రకరకాల అనుభవాలు ఎదురవ్వడం సహజం. అందులో ఎవరికీ మినహాయింపు ఉండదు.ఎవ్వరైనా కోరుకునేది ఒక్కటే అదే భద్రత గల ఉద్యోగం. అందులో నేను కూడా ఉన్నాను.ఉపాధ్యాయినిగా ప్రభుత్వ ఉద్యోగం రావడం. ఆనందానికి అవధులు లేవు.డిసెంబర్ 19-1990న మొదటి సారిగా ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమైన ఉద్యోగ ప్రస్థానం.సైకిల్ మీద ప్రయాణం.అనుభూతి కొత్త కొత్తగా ఉంది.
బుజ్జి కన్నమ్మలు, బుజ్జి కన్నయ్యల గురించి చెప్పకుండా ఈ సోదంతా ఏమిటి? అనుకుంటున్నారు కదూ!
కానీ దానికీ దీనికీ సంబంధం ఉందండోయ్.
నేను అప్పటి వరకూ పని చేసి వచ్చిన బడిలోని బుజ్జి కన్నమ్మలు బుజ్జి కన్నయ్యలు నా మీద బెంగ పెట్టుకొని అటు ఇంట్లో,ఇటు బడిలో ఎవరికీ చెప్పకుండా ఓ ఇరవై మంది నడుచుకుంటూ నేను పనిచేసే బడికి వచ్చారు. ముప్పై ఆరేళ్ల క్రితం ముచ్చట.అప్పట్లో ఫోన్ సౌకర్యం లేదు.
సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరం. ఎలా నడిచి వచ్చారో తలుచుకుంటే ఇప్పటికీ కళ్ళూ మనసు చెమ్మగిల్లుతాయి.
వచ్చి ఆ చిట్టి చేతులతో నన్ను లేలేత లతలై అల్లుకు పోయారు. హత్తుకుని వదిలి పెట్టకుండా ఒకటే ఏడుపు.’మన బడికి పోదాం పా!’ రమ్మని ఒకటే బతిలాడటం.”నువ్వు రాకపోతే మేం ఆ బడికి పోము” అని దిగులు చూపులు ఏడుపు కళ్ళతో అంటుంటే వారి స్వచ్ఛమైన ప్రేమానురాగాలకు నాకూ దుఃఖం ఆగలేదు.
పొద్దు పొద్దున్నే అంత దూరం నడిచొచ్చిన ఆ బంగారు తల్లులు, బంగారు తండ్రులు నన్ను చూడాలనే కోరికతో సరిగా తిన్నారో? అసలు తినకుండానే వచ్చారో ఆ ఆలోచన రాగానే నాలోని అమ్మ మనసాగలేదు.
వెంటనే మా హెచ్చెం గారిని అడిగి ఆ వూరిలో నాకు బాగా పరిచయమైన లక్ష్మికి విషయం చెప్పగానే నా పట్ల పిల్లలకు ఉన్న ప్రేమకు ఆశ్చర్యపోయింది. ఉప్మా రవ్వ తెమ్మనగానే వాళ్ళ అబ్బాయి నా కొత్త శిష్యుడితో తెప్పించింది. వేడి వేడిగా రుచికరమైన ఉప్మా చేసి పిల్లలకు పెట్టింది.వాళ్ళ కడుపు నిండిన తర్వాత గాని నా మనసు నిండలేదు.
అమ్మానాన్నలు, బడిలో టీచర్లు మీరేమయ్యారో నని భయపడతారని చెప్పి మెల్ల మెల్లగా ఆ బుజ్జి కన్నమ్మలు బుజ్జి కన్నయ్యలను ఒప్పించి మా హెచ్చెం గారిని అడిగి వారిని తీసుకుని బడికి చేర్చాలని బయలుదేరుతుండగా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చారు.
వాళ్ళకు ఆ స్కూల్ హెచ్చెం గారి ద్వారా విషయం తెలియగానే నా వద్దకే వస్తారని ఊహించారట. అందుకే సరాసరి నేను పని చేసే ఊరికే వచ్చారు.
వాళ్ళని తమతో తీసుకుని వెళ్తూ ఓ మాట అన్నారు.
“మేడం!అప్పుడప్పుడూ వాళ్ళ స్కూల్ కి వెళ్ళి పలకరించిరండి.లేదంటే వాళ్ళు గుండెబలుగుతారు.”
అవును కదా!
నేనీ కొత్త బడిలో పిల్లల్ని చూసినప్పుడల్లా ఆ చిన్నారి పొన్నారి బుజ్జి కన్నమ్మలు బుజ్జి కన్నయ్యలు గుర్తొచ్చి, వాళ్ళ ఆత్మీయమైన మాటల స్పర్శ లేక ఎంతగా గుండెబలుగుతున్నానో…
వారానికి ఒకసారైనా బడి వదిలిన తర్వాత వాళ్ళని చూడాలని నిర్ణయించుకున్నాను. అలా వెళ్ళినప్పటికీ బుజ్జి బుజ్జి బంగారాలు నా గురించి బెంగ బెట్టుకొని జ్వరాలు తెచ్చుకున్నారు, నన్ను కలవరించారని తెలిసి ఎంత దుఃఖించానో…
వాళ్ళు నా కోసం గుండెబలిగారు. నేనూ వాళ్ళ కోసం గుండెబలిగాను.
ఇది కదా! మరిచిపోలేని గురుశిష్య సంబంధం.తల్లీబిడ్డల మధ్య ఉన్న మమతానుబంధం.
మనసు మందారం – హృదయం సుకుమారం
ఆ బుజ్జి కన్నమ్మల గురించి చెప్పుకోవాల్సిందే. లేకపోతే చాలా వెలితిగా ఉంటుంది. ఆ ఇద్దరూ ఒక్క ఇంటి బంగారాలే. చిన్న కన్నమ్మకు ఎంత ధైర్యమో పెద్ద కన్నమ్మకు అంత భయం. ఒకరి మనసు మందారం. మరొకరి హృదయం సుకుమారం.
మరి సుకుమార హృదయం గల బుజ్జి కన్నమ్మ స్వభావం ఎలా ఉండేదంటే…ఏ పిల్లల్ని గట్టిగా మందలించినా ఆ రోజంతా తప్పిపోయిన లేడి పిల్లలా బిక్కు బిక్కు మంటూ కనిపించేది.ఏ టీచర్ ను,సారును చూసినా గడగడలాడుతూ ఉండేది.
ఇక ఆ రోజంతా ఆ చిట్టితల్లి నోటినుండి ఒక్క జవాబు కానీ, మాట గానీ రప్పించడం ఆ బ్రహ్మ తరం కూడా అయ్యేది కాదు.
తనకు ఏది చెప్పినా చాలా మృదువుగా చెప్పాలని కోరుకుంటుంది.ఎవరైనా సరే ప్రేమగా పలకరించాలని అనుకుంటుంది.
ఓరోజు ఎందుకో గానీ లెక్కల హోం వర్క్ చేయకుండా వచ్చింది. లెక్కల టీచర్ గట్టిగా మందలించారు. ఇంకేముంది గుడ్లనిండా నీళ్ళు. భయం భయంగా కూర్చుంది.
భీత హరిణేక్షణలా ఉన్న తనను చూడగానే మనసంతా బాధగా అనిపించింది.దగ్గరకు తీసుకుని ఏమీ తెలియనట్టు”చెప్పురా నాన్నా!ఎందుకలా ఉన్నావు? ” అన్నాను. ఆ కొంచెం ప్రేమ పూరితమైన ఓదార్పు మాటకే చిల్లులు పడిన కుండ అయ్యింది. “ఏంటిరా బంగారూ! అలా ఏడవకూడదు. ఏం జరిగిందో చెప్పు?”అన్నాను. తను హోం వర్క్ చేయలేదన్న విషయం చెప్పింది. మరి అలా చేయకుండా రావద్దు కదా!బడిలో నేర్చుకున్నవి మరికొన్ని ఇంటి దగ్గర చేస్తే బాగా గుర్తు ఉంటాయని హోం వర్క్ ఇస్తారు. మీ మంచి కోసమే నాన్నా! అలా ఇచ్చేది. అవునా?కాదా? మృదువుగా అడిగే సరికి అవునని తల ఊపింది. “మరెప్పుడూ నువ్వు హోం వర్క్ చేయకుండా రావద్దు మరి” అనగానే ‘అలాగే టీచర్!’అంది.
ఇక అప్పటి నుంచి నన్నో స్నేహితురాలిగా భావించి ప్రతి విషయాన్ని నాతో పంచుకోవడం మొదలు పెట్టింది. ఎప్పుడైనా హోం వర్క్ రాయలేని పరిస్థితి వస్తే కారణం చెప్పడం, వీలుంటే లీజరు పీరియడ్ లో చేసుకోవడం నేర్చుకుంది.
బడిలో ఎవరు ఏమన్నా, ఏమాత్రం తన మనసుకు కష్టం కలిగినా వెంటనే నా కోసం ఆ కళ్ళు వెతికేవి. నన్ను చూడగానే తారల్లా తళుక్కున మెరిసేవి.
ప్రభుత్వ ఉద్యోగ రీత్యా తరచూ ఆ బడికి వెళ్ళడం కుదరలేదు. ఆ బుజ్జి తల్లి నా కోసం బెంగ పెట్టుకొందని వాళ్ళ అమ్మ నాన్నలు కలిసి చెప్పినప్పుడు ఆ పసి ప్రేమకు దూరమైనందుకు బాధ,అదే సమయంలో ఆ పసి హృదయం నుండి అంతటి ఆత్మీయతా అభిమానం పొందినందుకు సంతోషం కలిగింది.
ఒక టీచర్ గా విద్యార్థుల నుండి పొందాల్సింది ఇదే కదా అన్న వాస్తవం ఓ ఆనంద కెరటమై హృదయ తీరాన్ని తాకి ఓ తీయని సంతృప్తి సంతకం చేయించి, నా బాధ్యత మరింత పెంచింది.