చాలా రోజులైంది అని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
. “రా సుహాసిని, కూర్చో” అంటూ సోఫా చూపించింది. అయితే అక్కడ ఎలా కూర్చోవాలో అర్థం కాలేదు. సోఫాల నిండా కొరియర్ కవర్స్.
ఇంతలో వాళ్ళ కోడలు వచ్చి ఆ కవర్ లన్నీ తీసి పక్కనే ఉన్న దివాన్ మీద పెట్టింది. కూర్చుని చుట్టూ చూసాను. ఒక పక్కగా అట్ట పెట్టెలు, టీవీ ఎదురుగా బీన్ బ్యాగ్, ఆ పక్కనే పిల్లల కోసం చిన్న చిన్న చైర్స్. పెద్ద హాలే గానీ సామానుతో నిండిపోయి ఇరుకుగా అనిపించింది.
“ఆంటీ సరిగ్గా సమయానికి వచ్చారు. ఈ రోజే మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన టీ కప్పు సెట్ కొన్నాను. మీరే ఓపెనింగ్” అంటూ కొరియర్ పాకెట్ ఓపెన్ చేసింది కోడలు దీప్తి.
నిజంగానే చాలా అందంగా ఉన్నాయి. నేను అదే మాట అన్నాను. దీప్తి కిచెన్ లోకి వెళ్ళింది.
“దీప్తి మంచి టేస్ట్ ఉన్న పిల్ల” అన్నాను.
ఆమాట వినగానే చిన్నగా నిట్టూర్చింది. తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉండగా, దీప్తి కొత్త కప్పుల్లో కాఫీ ఇచ్చి,
“అత్తయ్యా, నేను బైటికి వెళ్ళి వస్తాను. బై ఆంటీ” అంటూ వెళ్ళింది.
దీప్తి అటు వెళ్ళగానే తన గోడు వెళ్ళబోసుకుంది మా ఫ్రెండ్.
“ఏంచేయాలో అర్ధం కావటం లేదే హాసినీ. ఆ షాపింగ్ కి అంతూపొంతూ లేదు. అవసరమైనవి,లేనివీ కొని పడేస్తుంది” అంటూ గంట సేపు ఏకరువు పెట్టింది.
మా ఫ్రెండ్ చెప్పినవన్నీ చేదు నిజాలే. నిజానికి ఈ రోజుల్లో అందరి పరిస్థితి అలాగే ఉంది. ఏవి కావలసిన వస్తువులో ఏవి అనవసరమో ఆలోచన లేకుండా పోతున్నది.
ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది. ఎకౌంట్ లో డబ్బులు ఉంటాయి. గూగుల్ పే ఫోన్ పేలు అందరికీ అలవాటైపోయింది. దాంతో మార్కెట్లోకి ఏ వస్తువు వస్తే అది కొని పారేయటమే.
ఒకప్పుడు ఇది మా తాత గారి కాలంనాటి సోఫా సెట్టు, లేదా మంచం ఇలా చెప్పుకోవటం గర్వంగా,గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయితే డైనింగ్ టేబుల్,సోఫా సెట్లు ఏ ఫర్నిచర్ అయినాసరే పాతది అయిపోతుంది. అవి తీసేయటం కొత్తది కొనటం.
ఇక పిల్లల ఆట వస్తువులు అయితే చెప్పే పని లేదు. వాళ్ళ కోసం ఒక రూము. అది కూడా సరిపోదు .
కిచెన్ లోకి వెళితే ఆ సామాన్లు ఏమిటో అర్థం కాదు.
అంతకుముందే మనం చెప్పుకున్నాం ఈ రిటర్న్ గిఫ్ట్స్ పుణ్యమా అని కిచెన్ లో ఖాళీనే ఉండదు.
అలాగే బట్టలు కూడా. ఒకప్పుడు కుటుంబ అంతటికి కలిపి ఒకటి లేదా రెండు బీరువాలు. రోజువారి బట్టలు కి ఒకటి లేదా రెండు అరలు సరిపోయేవి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి కబోర్డ్స్ కబోర్డ్స్ సరిపోవటం లేదు. నాలుగు సార్లు కట్టడం తీసి పని వాళ్ళకి చేయటం.
ఇక ఫంక్షన్స్ , పెళ్లిళ్లు గురించి మాట్లాడుకోని రోజు లేదు . యాభై, అరవై రకాల ఫుడ్ ఐటమ్స్, అక్కరలేని ఎంటర్టైన్మెంట్లు. ( ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే మన కల్చర్ లో లేని సాంప్రదాయం) .
వీటన్నిటితో పాటు టూర్స్ అండ్ ట్రావెల్స్. ఒకప్పుడు పుణ్యక్షేత్రాలంటే వరసుమళ్ళిన వాళ్ళే వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు అప్పుడే పుట్టిన పసికందులతో సహా యాత్రకు వెళుతున్నారు. అవి యాత్రలా విహారయాత్రలా అర్థం కాదు. .
ఇలా ఏ విషయం తీసుకున్నా అతి అయిపోతున్నది.
అనవసరం లేదు అనవసరమే ఎవరికి పట్టటంలేదు
మా ఇష్టం మాకు డబ్బులు ఉన్నాయి మేము కొంటున్నాము, ఖర్చు పెడుతున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము అనుకుంటారు.
కానీ వ్యక్తిగతమైనటువంటి దుబారా మన సంఘానికి మన దేశానికి కూడా మంచిది కాదు. దేశ ప్రగతికి ఇది అడ్ఠంకి అనే ఆలోచన ఉండాలి .
రీసెంట్ గా మన ప్రధానమంత్రి ఒక ప్రకటన చేశారు. ఎవరు కూడా బంగారం కొనవద్దు, కొంతకాలం విదేశీ ప్రయాణాలు మానుకోండి అని.
ఇది చాలా మందికి కోపం వచ్చినా అతను మాట్లాడింది వాస్తవమే కదా! ఇక్కడ ఒక విషయం గమనించాలి బంగారం ఒక్కటేనే కాదు, మనం పెడుతున్న అనవసరమైనటువంటి ద్వారా కొనుగోళ్లు చాలా వరకు తగ్గించుకోవాలి. ఇందులో కొన్ని విదేశాల నుంచి తెప్పించుకుంటున్నవే. కాబట్టి , అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు , ఈ అతి కొనుగోళ్లవల్ల వ్యక్తిగతంగానే కాకుండా సమాజపరంగా కూడా అనర్ధమే కలిగిస్తుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించి పొదుపు మంత్రం పాటిస్తే బాగుంటుంది.
అవసరాలు ,కంఫర్ట్స్, లగ్జరీస్ లో మధ్య తేడా తెలుసుకొని అవసరాలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది.
ఇక నేను బయలుదేరుదాం అనుకుంటున్న సమయానికి దీప్తి వచ్చింది .
“ఆంటీ మీకు కూడా ఆన్లైన్ లో ఈ టీ కప్ సెట్ ఆర్డర్ పెట్టనా బావుంది” అన్నది. నాకు వద్దులే తల్లి అని అంటూ వచ్చేసాను