జరిగినకథ:
ఆమని మనవడి పుట్టినరోజు వేడుకను పూర్తి చేసుకున్న మైథిలి, మాలిని అదే ఊళ్లో ఉంటున్న పద్మిని, చంద్రిక ,హాసినిలను కూడా కలుస్తారు .గతంలో తామంతా ప్రైవేటు జూనియర్ కళాశాలలో కలిసి పని చేసిన కాలపు ముచ్చట్లతో పాటుగా ఇప్పటివరకు తమ పిల్లలపెండ్లిండ్లు మనవళ్ళు, మనవరాండ్ర ముద్దు మురి పాలను కూడా ఒకరితోమరొకరు పంచుకుంటూ తమ సమయాన్ని ఆనందమయం చేసుకొని తృప్తిగా ఎవరిళ్లకు వాళ్లు తిరిగి వెళ్లిపోతారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించలేని మైధిలి, మాలినితమ పాత ఉద్యోగంతోనే కుస్తీలు పడతారు.ఇటు ఇంట్లోనూ అటు బయట సమాజంలోనూ కూడా ప్రభుత్వోద్యోగి కాలేనందున మైధిలి ఎంతో వివక్షకు గురవుతుంది. భర్త అకాల మరణంతో వారసత్వపు క్షేత్రంలో అస్వతంత్రతకు బందీ అవుతుంది.అనుభవసారం ఒంటబట్టించుకున్న రామారావు దంపతుల జీవితం నిత్యవసంత మవుతుంది. హాసిని, చంద్రిక ,శాలిని మేడం గార్లు తమ జీవితాలను ఆక్రమించుకో జూస్తున్న ఆత్మ న్యూ నతా భావాలను సానుకూల దృక్పథంతో తట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు .భర్త యొక్క అనుమానపు జబ్బుకు విసిగి వేసారిన సువర్ణ బొటీక్ పెట్టుకుని స్వావలంబనతో జీవించాలనే స్థిర నిశ్చయంతో బెంగళూరులో ఉంటున్న తన కొడుకులు దగ్గరకు వెళ్ళిపోతుంది.
నానా తిప్పలు పడుతూ చంద్రిక ఎట్లాగైతేనేం ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సంపాదించుకుని కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లల్ని చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది.భర్త శుక్లపక్షపు చంద్రుడే ఎప్పుడూ.పరాధీనగా ఇబ్బందులు పడుతున్న మాలిని తన స్వంత ఇంటికి వచ్చేస్తుంది.మాయాద్వీపాన్ని తలపించే అత్తారింటి బంధువర్గంతో తులసి మొక్క లాంటి మైథిలి పలు వివక్షలకు,అవమానాలకు గురౌతుంది.ధైర్యంచేసి భర్త ప్రకాష్ ముందు అతని అక్కా,చెల్లెళ్ల నిజస్వరూపాలను బైట పెట్టటంతో కనువిప్పు కలిగి నిజానిజాలను చూడగలుగుతాడు.సువర్ణయొక్క టైలరింగ్ దుకాణం దినదినాభివృద్ధి చెందుతుంటుంది. మైథిలి వుంటున్న ఊరికే కమలకు ప్రమోషన్ వస్తుంది.భార్యలేనిలోటు ఏనాటికీ పూడ్చలేనిదని ఆలస్యంగానైనా తెలుసుకున్న నాగూ పశ్చాత్తప్తుడై భార్య సువర్ణ వద్దకే చేరుకుంటాడు.)
ఇక చదవండి..
‘‘నాగూ… ఒరేయ్ నాగూ’’ అని తలుపు తట్టినా, తీయకపోయేసరికి, గట్టిగా కాలింగ్ బెల్ నొక్కారు.
నెమ్మదిగా వచ్చి, తలుపు తీశాడు నాగూ ఉరఫ్ నాగేశ్వర్రావు, లోపలికి రమ్మని సైగ చేశాడు దోస్తులకు.
వీళ్లు తరచుగా బైటో లేదా ఏ సెంటర్లోనో, కాఫీ కేఫ్‌లోనో కలుస్తుంటారు. ఏ రెండు మూణ్ణెల్లకో ఒకసారి ఇండ్లకెళ్లి కలిసి మాట్లాడుకోవటం, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యుల్ని పరామర్శించటం మామూలే. అందులో భాగంగానే ఇప్పుడు నాగేశ్వర్రావు ఇంటికొచ్చారు ఆ ముగ్గురు ఫ్రెండ్స్.
మా ఆవిడ లేదు, పిల్లల దగ్గరకు వెళ్లిందని చెప్పటంతో వీళ్లింటికి రాక చాలా రోజులైంది. ఇదిగో ఇప్పుడొచ్చారు.
‘‘ఏరా! ఏంటి అంత డల్‌గా ఉన్నావ్?’’ అని ఆ దోస్తుల్లో ఒకరైన ఫణిభూషణం అడిగాడు నాగూని.
‘‘అవును. బాగా నీరసంగా ఉంటోంది. ఎలాగూ మూడు నెలలకు ఓసారి, రెగ్యులర్‌గా అన్ని చెకప్స్ చేయించుకుంటాగదా! అలాగే నాల్గు రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్లొచ్చా’’ అని చెప్పాడు నాగూ, ఫణిభూషణంతో.
‘‘అన్నీ నార్మల్‌గానే వచ్చాయా రిపోర్ట్స్’’ అని అడిగాడు ఇంకో దోస్త్ శివరావు.
‘‘ఆ… బి.పి. నార్మల్‌గానే ఉందిగాని, షుగర్ రొండొందలు ఉంది. చెడు కొలెస్ట్రాల్ కూడా ఉండాల్సిందానికంటే నలభై పాయింట్లు ఎక్కువ ఉంది’’ అని చెప్పాడు నాగూ, శివరావుతో.
‘‘అసలు నీకు షుగర్ లేదు కదరా?’’ అని అడిగాడు మరో దోస్తు విజయారావు.

‘‘అవున్రా… ఈమధ్య హోటల్ ఫుడ్డు తింటున్నా. పడటం లేదు. ఈ షుగర్ కంట్రోలవటం కోసం మందలు వాడుతున్నా, డాక్టరుగారు రాసిచ్చినవి’’ అని జవాబు చెప్పాడు నాగూ.
‘‘ఏరా? చెల్లెమ్మ ఇంకా రాలేదా ఊరినుంచి?’’ అన్నాడు ఫణిభూషణం.
‘‘లేదురా’’ అన్నాడు మొహమంతా గంటు పెట్టుకుని. అసలు ఈ ప్రసక్తి రావటమే, వినటమే ఇష్టంలేని వాడిలాగా.
‘‘అదేంటిరా? మరి చాలా రోజులైందిగా’’ ఫోన్ చెయ్యలేదా రమ్మనమని?’’ అని నిలదీశాడు శివరావు.
జవాబేం ఉందని చెప్పటానికి నాగేశ్వర్రావు దగ్గర. మొహం వేలాడేసుకుని కూర్చున్నాడు, తప్పుచేసినవాడిలాగా.
ఇల్లంతా పరికించటం మొదలుపెట్టాడు విజయారావు. ఇల్లాలు లేని ఇల్లు ఎంత కళా విహీనంగా ఉంటుందో అలాగే ఉంది అచ్చు ఆ ఇల్లు.
‘‘చెల్లెమ్మ ఉంటే, ఈపాటికి టీ వచ్చేదిరా మనందరికీ’’ అని అన్నాడు శివరావు నవ్వుతూ.
‘‘ఇంటి గేటుదాటి లోపలికి వస్తుంటే, చెత్తాచెదారం కనపడిరది. అదే చెల్లెమ్మ ఉంటే ముగ్గులు వేసి కళకళలాడుతుండేది’’ అన్నాడు మళ్లీ శివరావు కావాలనే.
పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటంలాగా ఉంది నాగూ పరిస్థితి. ఏ జవాబూ చెప్పలేకపోతున్నాడు నాగూ.
‘‘ఏంట్రా మళ్లీ మీ భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలైనాయా? అని అడిగాడు విజయారావు.
ఏం లేదురా… అన్నట్లు చూశాడు నాగేశ్వర్రావు.
ఒకసారిలాగే బాగా పెద్ద గొడవలైపోయి పుట్టింటికి వెళ్లిపోతానని సువర్ణ పట్టుబట్టటంతో పెద్ద మనుష్యులని పిలువబడే ఈ ముగ్గురు మహామహులే సర్దిచెప్పి, ఈసారి ఇలాంటి గొడవ రాదని నాగూ తరపున హామీ ఇస్తే ఆగిపోయింది సువర్ణ వాళ్లమీద నమ్మకంతో.
కానీ దాలిగుంటలో కుక్కబుద్ధి లాంటిది నాగూది. కుక్కది ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం. అందరూ ఛీ… ఛీ… అని తిడుతున్నారు.
ఇక నేను ఏ ఇంట్లోనూ జొరబడనని అనుకుంటుందట ఆ గుంటలో పడుకుని తోకవూపుకుంటూ. ఆ గుంటలోంచి పైకి రాగానే తోకకున్న మట్టిని దుపులుకుంటూ చేసుకున్న నిర్ణయాన్ని కూడా దులిపేసుకుని మర్చిపోయి మళ్లీ మొదటికే వస్తుందట. అలా ఉంటుంది ఎప్పుడూ నాగేశ్వర్రావు ప్రవర్తన.
‘‘ఈ నాగేశ్వర్రావుగాడికి అనుమానమెక్కువ. మనిషి బంగారమే కాదు, అందకంటే మంచి మనసున్న చెల్లెమ్మ సువర్ణ దొరకటం వీడి అదృష్టమని ఆ దోస్తులు ముగ్గురూ విడిగా ఉన్నప్పుడు అనుకుంటారు. తిట్టుకుంటూనే ఉంటారు సదరు నాగు గురించి. కానీ మొదటిసారంటే సర్ది చెప్పారు ఆ అమ్మాయి సువర్ణకు. ఎన్నిసార్లని సర్దిచెబుతారు. చెప్పినా నమ్ముతుందా తమని.
‘‘సరేరా! జాగ్రత్తగా మందులు వాడుకో. టైం ప్రకారంగా అన్నం, పండ్లు అవీ తింటుండు’’ అని జాగ్రత్తలు చెప్పి బైల్దేరారు అక్కడి నుంచి ఫణిభూషణం, శివరావు, విజయారావులు.

‘‘వీడి ధోరణే వీడిది. ఏదన్నా చెబితే ఊ… కొడతాడు, వినడు చావడు వెధవ’’ అని పైకే తిట్టాడు శివరావు, నాగూని.
‘‘వీడి అనుమాన రోగం వదిలితేనే వీడి జీవితం బాగుపడుతుంది. అందాకా వీడిగతి ఇంతే’’ అన్నాడు ఫణిభూషణం.
‘‘ఇప్పటికైనా బుద్ధొస్తుందో రాదో వెధవకి’’ అని కసురుకున్నట్లుగా అన్నాడు విజయారావు.
ఏదిఏమైనా వీడిగా వీడికి బుద్ధొచ్చేవరకు వీణ్ణి కలవటానికి వెళ్లినా దండగే. ఆ అమ్మాయిని బ్రతిమాలి తెచ్చి, కూర్చోపెట్టి మాట్లాడినా అనవసరమే. అనవసరంగా చెప్పితే మన పరువే పోతుంది’’ అన్నాడు శివరావు గతంలో పంచాయితీ పెట్టి మాట్లాడినప్పుడు లేడీస్ గదా! మనతో మనసు విప్పి అన్నీ ఫ్రీగా మాట్లాడలేరు అనుకుని అప్పుడు తన భార్యను కూడా తీసుకెళ్లాడు నాగూ వాళ్లింటికి.
పంచాయితీకి ముందు శివరావు భార్య వర్ధని సువర్ణను ఒక గదిలోకి తీసుకెళ్లి అన్ని వివరాలు అడిగి తెలుసుకుని, సువర్ణతో మాట్లాడటం అయిపోగానే శివరావును పక్కకు పిలిచి విన్న విషయాలన్నీ చెప్పింది వర్ధని.
ఆ విషయాలన్నీ శివరావు, ఫణిభూషణం, విజయారావులతో చెప్పగా నాగూ మీద ఏహ్యభావం కలిగినా స్నేహితుడు కదా, వదులుకోలేరు! ఆ ఒక్కటి తప్ప… అని అంటారే అలాగ… అనుమానం తప్ప, అన్నీ మంచి గుణాలే నాగూగాడిలో అనుకుంటారు అప్పుడప్పుడూ.
ఎందుకో ఇదివరకు లాగా నాతో మంచిగా మాట్లాడలేదు మావాళ్లు అనుకున్నాడు మనసులో. వాళ్లు తనతో మాట్లాడిన సంభాషణంతా కండ్ల ముందు సినిమా రీళ్లలాగా మెదలసాగింది. అవును… నేనేమన్నా సువర్ణ కిమ్మనకుండా నాకేది కావాలో అది టైముకి సమకూర్చేది. నేను కసురుకున్నా, తిట్టినా తిరిగి పల్లెత్తు మాట కూడా రువ్వేది కాదు. పైపెచ్చు నేనెక్కడ అన్నం తినకుండా పస్తుతో పడుకుంటానేమోనని అన్నీ నా గదిలో టీపాయ్ మీద సర్దేసి వెళ్లేది. కనీసం మంచినీళ్లు తాగుతావా? అని అడిగే నాధుడే లేడు ఇప్పుడు. ఇంతకుముందు క్లోజ్‌గా, ఆప్యాయంగా మాట్లాడే ఫణి, శివరావు, విజయారావులుకి ఫోన్ చేస్తే మొక్కుబడిగా మాట్లాడుతున్నారు. పనమ్మాయిల్ని పెట్టుకున్నా ఒక్కళ్లు తిన్నగా పదిరోజులైనా చెయ్యకుండా మానేస్తున్నారు. హోటల్ తిండి పడట్లేదు. తలగడ కిందనే ఉన్నాయి మాత్రలన్నీ. తీసి వేసుకోవాలనే ఇచ్చ కూడా ఉండటం లేదు. భోజనం ఆర్డర్ పెట్టుకుంటున్నాడుగాని, రోజూ ఒకేరకం కూరలు నోటికి పోవట్లేదు. పచ్చిపులుసు బాగా ఇష్టం. కానీ ఏ హోటలు వాడు పోస్తాడు పచ్చిపులుసు. ఇంత రసం పార్శిల్ కట్టిపడేస్తాడు మొహాన. రోజూ బైట తిండి మూలంగా ఉన్న జబ్బులకు తోడుగా గ్యాస్ చేరి చాలా అవస్థ పడాల్సొస్తోంది అని వాపోతున్నాడు మనసులో నాగేశ్వర్రావు.
ఇంతలో కరెంటు పోయింది. జెనరేటరుందిగదా… ఫ్యాన్లు ఎందుకు తిరగట్లేదోననుకుని పైన ఫ్యాన్‌ని చూశాడు. డిస్ట్రిల్ వాటర్ అయిపోయినట్లుంది జెనరేటర్లో. సువర్ణ ఉండి ఉంటే తనే చూసుకునేది అన్నీ… నా మట్టిబుర్రకు ఇంత చిన్న విషయం కూడా తట్టనందుకు తనమీద తనకే కోపం వస్తోంది. ఇదేకాదు ఏ విషయం ఆలోచించినా కోపం, చిరాకు, విసుగు ఎక్కువై నిస్సహాయంగా మారిపోతున్నాడు. అంతా శూన్యంలా అనిపిస్తోంది మనసుకు. వరండాలోకి వచ్చి కూర్చున్నాడు నాగూ.
సువర్ణ వెళ్లిపోయి దాదాపు పదినెలలు దాటిపోయింది. ఫోన్ చేసినా పిల్లలు కడా ఏదో బొటాబొటిగా మాట్లాడి పెట్టేస్తున్నారు. ఇంతకుముందు ఎంతో ప్రేమగా మాట్లాడే పిల్లలు… చీదరింపు స్వరంతో మాట్లాడుతున్నారు తప్పదన్నట్లుగా. చిన్నోడు నవీవనయితే ఒక్కోసారి కాల్ కూడా లిఫ్ట్ చెయ్యట్లేదు. ఇవన్నీ తలుచుకుని తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవటంలోకి జారిపోయాడు నాగు.
అవును నేను క్షమించరాని తప్పులు ఎన్నో చేశాను సువర్ణ విషయంలో. ఎన్నో విధాలుగా నావైపే మనును గాయపరిచాను. అనుమానం అనే దయ్యం పట్టి పీడిరచిందిన్నాళ్లూ నన్ను. ఇటు స్నేహితులు, అటు కుటుంబ సభ్యులు అందరూ తన వేపే వేలు చూపించి హేళన చేస్తున్నారు. ఇంటి చుట్టుపక్కలవాళ్లు, వీధిలో వాళ్లు కొంతమంది చూసీ చూడనట్లు తప్పుకు తిరుగుతుంటే, ఇంకొందరు ఛీత్కార భావంతో చూస్తున్నట్లు తనకు తెలిసిపోతోంది.
ఫ్యాన్ తిరుగుతున్న శబ్ధం వినిబడుతోంది. కరెంటు వచ్చిందనుకుంటా అనుకుంటూ లేచిన నాగు కాళ్లకింది వడిలిపోయి, ఎండిపోయి రాలిన ఆకులు తగులుతుంటే నా బ్రతుకు కూడా ఇలాగే రాలిపోతుంది కొద్దిరోజులు ఇలాగే
ఉంటే. నో… నో… అలా కాకూడదు. నేను రేపే సువర్ణ దగ్గరకెళ్లి క్షమించమని ప్రాధేయపడతాను. క్షమించేవరకు అస్సలు ఆ గుమ్మం వదిలి రాను అని గట్టిగా తీర్మానించుకున్నాడు మనసులో. పశ్చాత్తాపం మొదలైంది నాగేశ్వర్రావులో. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరేదీ లేదంటారు, అది నాగూ విషయంలో మరోసారి ఋజువయింది.
ఎప్పుడైతే నాగేశ్వర్రావు తన తప్పులు తెలుసుకుని పశ్చాతప్తగా మారాడో అప్పుడు అతనికి వెయ్యి ఏనుగుల బలం వచ్చి చేరినట్లయింది. దబదబా నాల్గు జతల బట్టలు ఇస్త్రీ చేసుకుని, ఓ చిన్న బ్యాగ్‌లో సర్దుకుని, ఆ నైట్‌కే బెంగుళూరు బస్సెక్కేశాడు. రైలుకు రిజర్వేషన్ చేయించుకుందామనిగానీ, లేదా వేరే ఆలోచన ఏమీ చెయ్యలేకపోతున్నాడు. ఒక్కటే ఆలోచన. సువర్ణ… సువర్ణ. ఎంత త్వరగా వెళ్లి ఆమె సమక్షంలో వాలి క్షమార్పణ కోరదామా అనే తపన ఉంది నాగేశ్వర్రావులో.
***
పేదరికంలో పుట్టినా కమల చిన్నప్పటినుండి చదువులోనూ, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిట్లోనూ చురుకే. పాటలు కూడా వినసొంపుగా పాడుతుంది, సంగీతం నేర్చుకోకపోయినా. ఇన్ని విషయాల్లో నైపుణ్యం సాధించినా, కించిత్తు గర్వమనేది పొడసూపని వ్యక్తిత్వం. నాకు ఇంటర్‌లో పరిచయమైంది. నాలుగైదు మార్కుల తేడాతోటే ఉండేవాళ్ల అన్ని సబ్జెక్టులలో. అందులోనూ మా ఇద్దరిదీ ద్వితీయ భాష హిందీ అవ్వటంతో మా గ్రూపు బై.పి.సి నుండి ముఖ్యంగా అమ్మాయిల నుండి, మేమిద్దరమే హిందీ తరగతికి కలిసివెళ్లి, కలిసి రావటంతో కొద్ది రోజుల్లోనే జిగరీ దోస్తులమైపోయాము ఇద్దరం.
కమల తండ్రిది చాలా చిన్న ఉద్యోగం. వాళ్లమ్మగారు పచ్చళ్లు తయారుచేసి, అమ్మటం, విస్తళ్లు కుట్టి అమ్మటం లాంటివి చేసేవారు. ఏదో వేన్నీళ్లకు, చన్నీళ్ల మాదిరిగా కమల వాళ్ల నాన్నగారి సంపాదనకు, వాళ్ల అమ్మగారి చిరు సంపాదన ఆదరువుగా మారేది. మేం చదువుకునేటప్పుడు వాళ్ళింటికి వెళ్తుండేదాన్ని. గడిపేది బీదరికమైనా ఇంటికొచ్చిన వారిని ఆదరించటంలో అభిమానంగా చూడటంలో ఈ కుటుంబానిదే పైచెయ్యి అన్పిస్తుంది నాకు. కమల వాళ్ల నాన్నగారు కూడా అంతే! ఏరా మైథిలీ బాగున్నావారా? ఎలా చదువుకుంటున్నారని పలకరించి మాట్లాడేవారు వాత్సల్యంగా. కమలా, నేను కాలేజీ కబుర్లు చెప్పుకుంటుండగానే వాళ్ళమ్మగారు చిరుతిండి ఏదో ఒకటి తెచ్చిచ్చి మేం తినేవరకు వదిలేవారు కాదు. ఇక పది నిముషాలు అవుతుంతో లేదో అంతలోనే వాళ్ళ నాన్నగారు బైటికెళ్లి ఆలూ బజ్జీలో, పకోడీలో ఏదో ఒకటి తెచ్చిచ్చేవారు మాకు. ఆయన బయటకు ఎప్పుడు వెళ్ళేవారో ఏమో తెలిసేది కాదు మాకు. మేము అంతగా కబుర్లలో పడి మునిగిపోయే వాళ్లము.
తెచ్చిన పొట్లాలు విప్పి, మాకు ప్లేట్లలో పెట్టి తినమనేవారు మళ్లీ ఆంటీ. ‘మా నాన్నగారంతే… చిటికలో వెళ్లి తీసుకొచ్చేస్తారు తినటానికి. తినాల్సిందే. తప్పదన్నట్లుగా నా ముందు పెట్టిన ప్లేటు వైపు, నా ముఖం వైపు పదే పదే మార్చి చూస్తూ నవ్వేది కమల.
తియ్య తియ్యని కబుర్ల పాకంలో వేడి వేడి స్నాక్స్‌ను అద్దుకుని తింటుంటే ఆ మజానే వేరప్పా!…
డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా హార్ట్ ఎటాక్ వచ్చి, కమల వాళ్ల నాన్నగారు చనిపోవటంతో, గత్యంతరం లేని స్థితిలో వాళ్ళ మేనమామ పంచన చేరారు కమల, వాళ్లమ్మగారు.
మేనత్త గయ్యాళీ రకమైనా, మేనమామ గంగాధరం మంచి మనస్తత్వం వల్ల కమల డిగ్రీ పూర్తి చేసుకోగలిగినట్లుగా అర్థమైంది తర్వాత.
అప్పుడప్పుడు లెటర్సు రాసుకునేవాళ్లం కమలా, నేనూ. తనకు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా, మేనమామ నచ్చచెప్పటంతో పెద్దలు తెచ్చిన సంబంధం చేసుకుంది కమల. పెండ్లయ్యే నాటికి కమల వయస్సు ఇరవయ్యో, ఇరవై ఒకటో ఉంటాయి అంతే. ఇప్పటి పిల్లలతో పోల్చి చూస్తే కనీసం పై చదువులు కూడా పూర్తికావు. కానీ మా అప్పుడు అట్లా కాదుగా!
కమల నుండి క్రమం తప్పకుండా వచ్చే ఉత్తరాలు, కమలకి వివాహం అయిన తర్వాత క్రమేపీ తగ్గుతూ వచ్చాయి.
ఉన్నవాళ్ళ సంబంధం. కోరికోరి వచ్చారు. పిల్ల సుఖపడుతుందని ఇచ్చిచేశాం గానీ, అల్లుడిరత శాడిస్టు అని తెలిసి, మా అమ్మ బాధపడుతోందని, ఇంటికి తీసుకు వచ్చేద్దామంటే అప్పటికే కమల గర్భిణీ అని తెలిసిందని ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నట్లుగా తన మేనమామ బాధపడుతున్నట్లుగా తెలిసి మౌనంగానే బాధల్ని దిగమింగుకుని రోజులు గడుపుకుంటానని ఒక ఉత్తరంలో రాసింది కమల మైథిలికి.
మరోసారి కమల నుండి వచ్చిన ఉత్తరం నన్ను బాగా గాబరాకు గురిచేసింది. వెంటనే నేను ‘చేబ్రోలు’కు ప్రయాణమయ్యాను. కమలావాళ్ల అమ్మమ్మగారి ఊరదే. వాళ్ళ మామయ్య గంగాధరం గారు ఉండేది కూడా అక్కడే. ఉమ్మడి కుటుంబం. బాగా కలిగిన కుటుంబం కాదుగానీ, కమలా వాళ్ళంత పేదరికమూ కాదు. మధ్యస్థంగా ఉంటుంది.
వెళ్లగానే నన్ను చూసి అమాంతం వాటేసుకుని ఎక్కెక్కి ఏడ్చింది కమల. భుజం తడుతూ ఊరడిరచాను. కమలా వాళ్లమ్మగారు మంచంలో పడ్డారు, మనోవ్యాధితో. మన స్వంతిల్లు గాకుండా ఎక్కువ రోజులు ఎక్కడవున్నా, ఆదరణ స్థానంలో అనాదరణే దక్కుతుందనటానికి చిహ్నాలుగా మిగిలిపోయారు కమల వాళ్లమ్మగారు. మంచివాళ్లకే ఆ దేవుడు పరీక్షలు పెడతారంటారు. ఇది కమల విషయంలో ఋజువైంది.
‘‘ఒంట్లో బాగున్నప్పుడు అమ్మ కూడా కష్టపడి పదో, పరకో ఎంత వచ్చినా మావయ్యకి ఇచ్చేసేది. అవి మా అత్తకు చేరేవి నేరుగా. అంతవరకూ రోజులు ఫరవాలేదు, కుంటినడకగానైనా నడిచేవి. ఇప్పుడు అది కూడా లేదు’’ అని బాధ పడిరది కమల నాతో చెప్పుకుంటూ.
ఇంటికి వెళ్లిన నాకు మర్యాదకైనా కనీసం ‘టీ’ తెచ్చివ్వలేదు కమల వాళ్ల మేనత్త అయిన నాగమణమ్మ. వాళ్ల మామయ్య మాత్రం పలకరించి కుశల ప్రశ్నలు వేసి, భోజనం చేసి వెళ్లమ్మా… అని చెప్పి తాను ఎప్పుడూ చేసే కార్పెంటరీ పనికి వెళ్లిపోయాడు.
కమల పిల్లలిద్దరూ బైటవున్న వేపచెట్టు క్రింద ఆడుకుంటున్నారు. ఎంతో అపురూపంగా పెరగాల్సిన పిల్లలు దుమ్ములో, ధూళిలో మాసిపోయిన గుడ్డలతో చిన్న చిన్న రాళ్ల ముక్కల్ని పేర్చుకుంటూ ఆడుకుంటున్నారు. బట్టలకే మాలిన్యం అంటింది గానీ, ఆ పిల్లల మొహాల్లో మచ్చుకైనా మలినం లేదు. చీకూ, చింతాలేని బాల్యం అంటారు అదేనేమో. వాళ్లను చూడగానే ఉసూరు మనిపించింది. నేను కొనుక్కెళ్లిన బొమ్మలు, బిస్కెట్ ప్యాకెట్లను వాళ్ల చేతికిచ్చా.
‘అయ్… బొమ్మ… బొమ్మ. ఆలుకుంతాం’ అని చెరోబొమ్మ తీసుకుని తుర్రుమంటున్న వాళ్లని పిలిచి ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి, చెరో నాలుగు బిస్కెట్లిచ్చింది కమల పిల్లలిద్దరికీ.
‘‘ఒక్కసారి వాష్‌రూమ్ కెళ్లాలి కమలా’’ అని అనటంతో కమల గాబులోంచి ఒక లోటా నీళ్ళు ముంచి మైథిలి చేతికిచ్చి, వాష్‌రూమ్‌వైపు వేలుపెట్టి చూపుతూ, ఏమన్నా విడిచిన బట్టలున్నాయేమో… బాగోదు… తీసేద్దామనే ఉద్దేశ్యంతో కమల వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. ఏదో చెప్పాలనుకుని చెప్పలేక, వెక్కిపడుతున్న కమలని చూసి మైథిలి కూడా లోనికెళ్లి సముదాయించింది కమలని.
కమల తన వీపు వెనుక వైపున ఉన్న జాకెట్టును నెమ్మదిగా పైకి జరిపి మైథిలికి చూపించింది. వీపునిండా కాల్చిన సిగరెట్ గుర్తులు. వాటిని చూడగానే మైథిలి కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. మోకాళ్ల క్రింది భాగంలో పిక్కల మీద, పైభాగాల్లో తొడల మీద ఉన్న కాలిన గుర్తులను కూడా చూపటంతో కమల భర్త ఎంత శాడిస్టో అర్థమైంది నాకు. వక్షోజాల మీద కూడా ఖాళీజాగా అనేది లేకుండా ఎలా సిగరెట్‌తో కాల్చాడో చెప్పి ఏడ్చింది కమల.
ఇవేకాదు మైథిలీ, ఒక్కడే కొడుకు. తల్లి మాట కూడా లెక్కచేయనంత గారబం, మా ఆయనలో మఠం వేసుకుని కూర్చుది. పెళ్లైన పదహార్రోజుల పండుగ వరకు నాతో బాగున్నాడేమో అంతే. తర్వాత వాడి నిజస్వరూపం బైట పడిరది. తప్పతాగి రావటం, బూతు సినిమాలు చూసి రావటం, అందులో చూసినవి చూసినట్లుగా నాతో ప్రవర్తించటం, ఒప్పుకోకపోతే చెయ్యి చేసుకోవటం, సిగరెట్లతో కాల్చటం, ప్రైవేటు పార్ట్సు మీద మందుబోసి పుండ్లు పడేట్లు కొరకటం… నానా చిత్రహింసలూ పెట్టటం చేసేవాడు. మా అత్తగారితో చెబుతుంటే ‘ఆ… ఏం కాదులే’ అన్నట్లు తీసిపారేసి మాట్లాడుతుండేది. అన్నీ పంటి బిగువున భరించా మైథిలీ…’’ అని చెబుతూ,
‘‘నెలతప్పిన విషయాన్ని చెప్తే, ఆనందిస్తాడనుకున్నా, ఒక్కరోజే ఆ మురిపెం. మళ్లీ మామూలే. ఆ తల్లి ఏం తల్లోగానీ… కొడుకుని ఏమాత్రం గద్దించేది లేకపోగా పైగా నాకే సర్దిచెప్పేది. రాను రాను నాకు అర్థమైపోయింది, ఆ ఇంట్లో మా అత్తకు నేనొక పనిమనిషినని. నా మొగడికొక అవసరాలు తీర్చే భోగవస్తువునని. చివరకు ఏమాత్రం తమ ప్రవర్తనను మార్చుకోవటానికి ఇష్టపడని ఆ మనుష్యుల మధ్య
ఉండటం కన్నా, బిచ్చమెత్తుకుని బ్రతకటం నయమని వచ్చేశా ఇక్కడికి’’ అని చెప్పింది కమల, కండ్ల నీళ్లు తుడుచుకుంటూ.
‘‘తీరా ఇక్కడికొచ్చాక చూస్తే అమ్మ మంచంలో. అత్తయ్యేమో మామయ్య నెత్తికెక్కి కూర్చుంది. తిరిగి ఆ నరకంలోకి వెళ్లలేను. ఇదీ పరిస్థితి అని విడమరచి చెప్పినా మా అత్తయ్య మనసు కరగలేదు సరికదా! మరీ పెడసరంగా ప్రవర్తిస్తోంది ఇంట్లో. మామయ్యది అగమ్యగోచరం. మీ అత్తయ్యతో గట్టిగా మాట్లాడితే నీకు ఈ ఆసరా కూడా ఉండదన్నట్లు చూస్తాడు నావైపు జాలిగా. మామయ్య మాత్రం ఏం చేస్తాడు చెప్పు’’ అంది నాతో వేదనగా.
‘‘నేను డిగ్రీ సర్టిఫికెట్‌తో చిన్న ఉద్యోగాలైనా సరే అని ప్రయత్నం చేస్తున్నా. స్పోర్ట్ కోటాలో మెరిట్ పాయింట్స్ మీదుగా వస్తాయి గదా జాబ్స్’’ అంది కమల నాతో.
అవును. ‘ఆర్చరీ’లో వేరే స్టేట్స్‌కు కూడా వెళ్ళి గెలిచి మెడల్సు సాధించిన కమల, ఈరోజు ఖాళీ చేతులతో నిలబడటం చూస్తే గుండె తరుక్కుపోయింది నాకు.
నాగమణమ్మ వంటగదిలోంచి గిన్నెలు డబడబా కావాలనే పడేస్తూ చేస్తున్న శబ్దం నా చెవులకు సోకింది. అయిష్టాన్ని గ్రుమ్మరించే సిగ్నల్ అది. అర్థమైంది మాకు, నెమ్మదిగా ఇంట్లో కొచ్చాము ఇద్దరం.
మంచంలో పడుకున్న వాళ్లమ్మగారికి పండ్లు కొనుక్కోమని రెండువేలు చేతిలో పెడుతుంటే, ససేమిరా వద్దంటే వద్దంది. నేనే బలవంతంగా ఆమె తలగడ కింద ఆ డబ్బు పెట్టేసి, బాగోదని కమల వాళ్ల మేనత్తకి ‘వెళ్లొస్తా ఆంటీ’ అని చెప్పి బైల్దేరాను.
చెట్టు క్రింద ఆడుకుంటున్న పిల్లలిద్దర్నీ లోపలికి వాళ్ళ అమ్మగారు పడుకున్న మంచం దగ్గరకు తీసుకొచ్చి, ఇక్కడే కూర్చోండి, బైటకు రావద్దని చెప్పి నన్ను సాగనంపటానికి నాతోపాటు వాకిట్లోకి వచ్చింది కమల.
‘‘మరి మీ అత్తగారూ వాళ్లు, మీ ఆయన గానీ ఎవరూ రాలేదా మిమ్మల్ని తీసుకువెళ్లటానికి’’ అనడిగాను కమలని.
‘‘రెండుసార్లొచ్చారు, పంచాయితీ పెట్టారు. నువ్వు పిల్లల్ని తీసుకుని రాకపోతే మావాడికి ఇంకో పెళ్లి చేస్తానని బెదిరిస్తూ వాళ్ల బంధువులతో ఉత్తరం కూడా రాయించింది’’ అంది కమల.
‘‘మరి మీ మామయ్య ఏమన్నాడు’’ అని అడిగా కమలని.
‘‘ఏం అవసరం లేదు అక్కడకి! శుభ్రంగా చదువుకున్న పిల్ల, కాస్త పిల్లలు పెద్దవాళ్లయితే అదే ఏదో చిన్నో చితకో ఉద్యోగం సంపాదించుకోలేకపోలేదు. పంపమని తేల్చి చెప్పేశాడు వాళ్ళకి.’’ అంది కమల.
‘‘దీనికి మీ మేనత్త రెస్పాండ్ ఏవిధంగా ఉంది కమలా?’’ అంది మైథిలి అనుమానంగా.
‘‘ఇప్పుడు మా అమ్మతోపాటుగా మా ముగ్గుర్నీ కూడా అదనంగా పోషించాలంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. మా అత్తయ్య కూడా అదే అభిప్రాయాన్ని వెళ్లగక్కింది అక్కసుతో. నేను ఇక్కడుండటం ఆవిడకి ఏమాత్రం ఇష్టం లేదు’’ అంది కమల.
‘‘అమ్మకి కొంచెం ఒంట్లో నయం కాగానే నా ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తా. అప్పుడు పిల్లల్ని చూసుకోవటానికి అమ్మ ఉంటుంది. ఏ ఇబ్బందీ ఉండదు మైథిలీ’’ అన్నది కమల.
‘‘ఏమిటీ పిచ్చి వాలకం. తైల సంస్కారాన్ని మానేసిన జుట్టు ఎర్రగా ఒకలాంటి జేగురు రంగులోకి మారిపోయింది. నీమీద నువ్వు శ్రద్ధపెట్టు. చిన్న పిల్లలిద్దరున్నారు. వీరి బాధ్యత నీమీదే ఉంది. గుర్తు పెట్టుకో. బలవంతంగానైనా నాలుగు ముద్దలు తినాలి. ఇలా చిక్కి శల్యమైపోతే ఎట్లా? చెప్పు’’ అన్నా కొంత అనునయిస్తూ మందలింపుగా.
‘‘ఊ…’’ అని ఒక జీవం లేని నవ్వు నవ్వింది.
‘‘అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు’’ అని చెబితే
‘‘చిన్నపిల్లలిద్దరితోటి, అమ్మతోటి నాకు కుదరదేమో. నువ్వే రాస్తుండు మైథిలీ’’ అని స్నేహ పూర్వకంగా నా అరచేతిని నొక్కి వదిలింది.
సరేనని నేను బస్టాండుకు దారి తీశాను. కమల తమ ఇంటివైపు నీరసంగా అడుగులు వేయసాగింది.
ఒండ్లు ఓడలు, ఓడలు బండ్లు కావటం అంటే ఇదేనేమో.
లి లి లి
నాగూ బెంగుళూరులో దిగేసరికి ఉదయం పదిగంటలైంది. ఆర్.టి.సి. బస్సు ప్రయాణం గదా! సుమారుగా పదకొండు గంటలు పట్టింది ప్రయాణం. తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని పిల్లలుండే ‘మారత హళ్లి’కి చేరుకోవటానికి గంటపైగానే పట్టింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలుండే ఏరియా అది, అందరూ ఆఫీసులకు వెళ్ళే సమయం, భార్గవ్, నవీన్‌లు ఉన్నారో, ఆఫీసుకు వెళ్లిపోయారోనని అనుకుంటూ కాలింగ్ బెల్ కొట్టాడు.
అంజనమ్మగారు ప్రత్యక్షమైంది. సడన్‌గా తల్లిని చూసేసరికి ఆశ్చర్యము, తనను వదిలేసి సువర్ణ ఇక్కడికి వచ్చేసిన విషయం తల్లికి తెలిసిపోయే ఉంటుందనే తత్తరపాటు, ఎక్కడ చీవాట్లు పడతాయోననే భయం ఒక ప్రక్క. ఇలా వివిధ రకాల భావాలు ముప్పిరిగొనగా `
‘‘అమ్మా! బాగున్నావా? ఇక్కడికి నువ్వెప్పుడొచ్చావు? నీ ఆరోగ్యం బాగుంటోందా? పిల్లలు బాగున్నారా?’’ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు నాగేశ్వర్రావు.
అంజనమ్మగారు ఏమీ మాట్లాడలేదు. లోపలికి రావటానికి దారిచ్చింది. తల్లి నోట్లోంచి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాకపోవటం గమనించి `
‘అవును నాలాంటి వాణ్ణి భార్య కాదుగదా, ఏ కన్నతల్లీ క్షమించదు’ అనుకుంటూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు హతాశుడై.
‘అయినా నా పిచ్చిగాని… పిల్లలెందుకుంటారు ఇంట్లో. ఆఫీసు టైమిది. ఇంట్లో ఎందుకుంటారు?’ అనుకున్నాడు మళ్లీ మనసులో.
ఎంతైనా తల్లి ప్రాణం గదా! వాటర్ బాటిల్ తెచ్చి కిందపెట్టింది తాగమన్నట్లుగా. తల్లి తనవైపు కనీసం చూడనైనా చూడనందుకు చాలా బాధనిపించింది నాగూకు.
బ్రష్ చేసుకుని వస్తానంటూ వాష్‌రూమ్‌లోకి దారితీశాడు. అతని కండ్లు పదే పదే భార్య కోసం ఇల్లంతా పరికించటాన్ని అంజనమ్మ వంటదిలో నుండి తన పని తాను చేసుకుంటూనే గమనిస్తోంది. కొడుకు ముఖం కడుక్కుని వచ్చేలోపుగా టీకప్పు తెచ్చి టీపాయ్ మీద పెట్టేసి, ఏమీ ఎరగని దానిలా వంటగదిలోకి వెళ్లిపోయింది. ముఖం కడుక్కుని వచ్చేసరికి నాగేశ్వర్రావుకి కొంచెం ప్రాణం తెరిపిన పడ్డట్టు అన్పించింది. టీకప్పు చేతుల్లోకి తీసుకుని తాగటం మొదలు పెట్టాడు. తన మీద తల్లికి చాలా కోపంగా ఉందనే విషయం బాగా అర్థమైంది. ఏం చేయాలో పాలుపోలేదు. నెమ్మదిగా వంటగదిలో వాళ్ళమ్మ దగ్గరకెళ్లి కండ్లనీరు నింపుకుంటూ తల్లిని ప్రాధేయపడటం మొదలెట్టాడు.
మనసు విలవిలలాడుతూ మెత్తబడుతున్నా, కఠినంగానే ఉండాలని నిర్ణయించుకుంది అంజనమ్మ. ఇట్లా ఉంటే తప్ప దారికి రాడు. కొడుకులు పెండ్లీడుకు వచ్చినా వీడికి బుద్ధి రావట్లేదు. అన్నీ తండ్రి పోలికలే దరిద్రమైనవి వచ్చాయి వీడికి. వీడి అన్నయ్య రఘుకి, వీడికి నక్కకు, నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది. వీళ్ల నాన్న అనుమానపు బుద్ధులే వీడిక్కూడా వచ్చాయి. రిటైరయ్యాడు. పిల్లలు ఉద్యోగస్తులయ్యారు, మారతాడులే అని ఎదురు చూస్తుంటే… మార్పు లేదూ పాడూ లేదు. నానాటికీ ఎక్కువైపోతోంది పచ్చకామెర్ల రోగం. నా కోడలు సువర్ణ బంగారం. దానిది ఎంత మంచి మనసో. పెట్టుపోతల్లో పెద్దచెయ్యి దానిది. నేను మావారి ద్వారా పడ్డ కష్టాలు, అవమానాలు సువర్ణ పడకూడదింకా. ఇంటికి సువర్ణ చిన్న కోడలే కావచ్చు కానీ, ఔదార్యంలో సువర్ణే మా ఇంటి పెద్ద కోడలు ఎప్పటికీ అనుకుంది మనసులో అంజనమ్మ.
నాగూ వచ్చిన వెంటనే ‘‘మీ తమ్ముడు వచ్చాడురా! నువ్వు మీ ఆవిడా కలిసి రండిరా సాయంత్రం…’’ అని ఫోన్ చేస్తే, సరేనన్నాడు రఘు.
‘‘ఆఫీసు కాగానే నేరుగా మేమిద్దరం మీదగ్గిరకే వచ్చేస్తామమ్మా’’ అన్నాడు రఘురామ్.
‘‘సరే…’’ అంది తల్లి.
సువర్ణ గురించి తల్లిని అడగాలని తహతహలాడుతున్నాడు కానీ, అడగటానికి ధైర్యం చాలటం లేదు నాగూకి.
కొడుకుల దగ్గిరకు బెంగుళూరు తప్ప వాళ్ల పుట్టింటికి కూడా వెళ్లదు. మరి కనపడదేంటి ఇంకా అని మదన పడుతున్నాడు మనస్సులో, ప్రాణం అన్యమనస్కంగా ఉంది నాగూకి.
వంటగదిలో లేదు అమ్మ. ఇంకో బెడ్‌రూమ్‌లోగానీ ఉందా అని లోపలికి తొంగి చూశాడు. తలుపు దగ్గరిగా వేసి ఉంది. గోడవైపుకు తలపెట్టి పడుకుని
ఉంది. తల్లిని డిస్ట్రర్బ్ చేయటం ఇష్టం లేదు. అమ్మ తనమీద ఇంత కోపంతో
ఉండటం ఇంతకు మునుపెన్నడూ చూడలేదు నాగూ. రాత్రి ప్రయాణం తొందరలో ఏమీ సహించలేదు. పొద్దున్న తాగిన టీనే. షుగర్ వల్ల వెర్రి నీరసం వస్తోంది నాగూకి ఒక్కొక్కసారి.
ఇది తన కొడుకులుండే ఇల్లేగదా! అని మనసుకు సర్దిచెప్పుకుంటూ, డైనింగ్ టేబుల్ దగ్గరకెళ్లి కుర్చీలాక్కుని ప్లేటు తీసుకుని డిష్‌లన్నీ మూతలు తీసి చూశాడు. చాలా రోజుల తర్వాత ఘుమఘుమలాడే సువాసనలు ముక్కుపుటాల్ని తాకాయి నాగూకి. బాగా పరిచయమున్న సువాసన. వెజ్ పులావ్ ఒకదాంట్లో, పన్నీర్ బటర్ మసాలా కూర ఒకదాంట్లో, కీర్, కేరట్, సన్నని ఉల్లిపాయ తరుగుతో చేసిన రైతా ఒకదాంట్లో, ముక్కల పులుసు ఒకదాంట్లో… నోరూరిస్తున్నాయి నాగూకి.
అన్నింటినీ కొద్దికొద్దిగా వడ్డించుకుని, రుచి చూశాడు. అన్నీ అచ్చుగుద్దినట్లు సువర్ణ చేతివంటకాల్లాగే ఉన్నాయి. తాను సువర్ణ పట్ల చేసిన అపరాధ భావనతో కండ్లు చెమ్మగిల్లి, అంతా అలికేసినట్లుగా ఏదీ స్పష్టంగా కనిపించటం లేదు. గొంతు పొలమారినట్లయింది. ప్రక్కనే ఉన్న నీళ్ల జార్‌ను తీసుకుని గ్లాసులోకి వంచుకుని తాగబోతుంటే గ్లాజు జారి కింద పడిపోయింది. వంగి తీసుకుని లేవబోతుంటే టేబుల్ చివర భాగం నుదిటికి కొట్టుకోగా ఒక్కసారిగా ‘అమ్మా!’ అని మూలిగినట్లుగా వచ్చింది నాగూ గొంతునుండి. మాగన్నుగా నిద్ర పట్టిందో ఏమో అంజనమ్మకు… ఈ శబ్దానికి ఉలిక్కిపడి లేచి డైనింగ్ టేబుల్ వైపుగా వచ్చి చూసింది.
కొడుకులో మార్పు కోసమే ఆలోచిస్తూ ప్రాణాలుగ్గబట్టుకుని లోపలున్న ప్రేమని అదిమిపట్టి, పైకి పట్టించుకోనట్లుగా, కోపంగా నటిస్తోంది ప్రొద్దుటినుండి. కొడుకు నుదుటికి తాకిన దెబ్బను చూసి, ఆ బొబ్బను చూసి అమాంతం దగ్గరగా వచ్చి, చీర కొంగుతో ఆవిరి పట్టి, నుదుటికి అద్దుతోంది అంజనమ్మ. తలెత్తి తల్లి మొహంలోకి చూసే ధైర్యం లేక తలవాల్చేసి, చిన్నపిల్లాడిలా కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు నాగూ.
ఇదే తగిన సందర్భంగా భావించిన అంజనమ్మ కొడుకు నాగూతో `
‘‘ఏరా! బంగారం లాంటి పెండ్లాన్ని ప్రతి చిన్నదానికీ నీ అనుమానపు బుద్ధితో హింసించి ఏడిపించావ్! ఎన్నోసార్లు సహించిందిరా నీ తిట్లను, ఏవగింపునూ. ఇప్పుడు పిల్లలైతే పడతార్రా భర్త అన్నేసి మాటలంటుంటే? అంతెందుకురా… మీ వదిన అన్ని మాటలు పడుతుందారా, మీ అన్నయ్య తిడితే? ఇప్పటికీ నాకీ కష్టముంది నా భర్త వల్ల అని సువర్ణ వాళ్ల తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేదురా. నేను అన్నీ గమనిస్తున్నానురా. నీవు మారాలని, నీలో మార్పు రావాలని మేం అందరం వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నాంరా.
ఇప్పటికే నీ కొడుకులు నీతో మాట్లాడటం మానేశారు. అన్నా, వదినలతో మాటామంచీ ఎప్పుడో పోయింది. ఇక నీలో మార్పు రాకపోతే నువ్వు నాతో మాట్లాడద్దురా… నేనూ నీతో మాట్లాడను. నువ్వు మన ఊరుగానీ, నా ఇంటికి గానీ రావద్దురా…’’ అని నాగూకి గడ్డి పెట్టింది గట్టిగా.
వేడిమీద ఉన్నప్పుడే ఇనుమును సాగదీయాలన్నట్లుగా…
‘‘ఈ పదినెలలూ అనుభవించావుగా. ఎవరైనా నిన్ను నాలుగు రోజులు పిలిచి ఇంతముద్ద పెట్టారురా? నీకు ఒంట్లో బాగోలేనప్పుడు నీ గొంతులో ఎవరైనా పంచి మంచినీళ్ళైనా పోశారారా నాగూ? నీ పెండ్లాం దేవతరా! చాలా అమాయకురాలు అది. ఇంకా దాని ఉసురు పోసుకోకురా!’’ అని ఎడాపెడా కడిగేసింది. అప్పుడుగానీ అంజనమ్మ గారికి కోపం తగ్గి శాంతించలేదు.
‘‘అమ్మా ప్లీజ్ అమ్మా నన్ను క్షమించు. నేను మారిపోయానమ్మా! నేను ఇదివరకటి నాగూను కాదమ్మా… నా తప్పేంటో నేను తెలుసుకున్నాను’’ అన్నాడు డగ్గుత్తికతో.
‘‘నేను కాదురా నిన్ను క్షమించాల్సింది. నీ భార్యరా, క్షమించాల్సింది. పోయి దాన్నడుగు. అది క్షమిస్తే నేను క్షమించినట్లే’’ అంది.
‘‘అమ్మా ఏదమ్మా సువర్ణ? కనపడట్లేదే?’’ అని అడిగాడు.
‘‘ఏమోరా! ఇన్నాళ్లాగావు ఇంక కొద్దిసేపాగలేవా? ఏం అంత ఆత్రంగా ఉందా నాగులూ’’ అని చిరునవ్వు నవ్వింది కొడుకు మొహంలోకి చూస్తూ.
ముద్దొచ్చినప్పుడల్లా పెద్ద కొడుకును రాముడూ అనటం, చిన్న కొడుకును నాగూలూ అని పిలవటం అలవాటు అంజనమ్మకు.
ఎప్పుడైతే తల్లి నోట్లోంచి ‘నాగూలూ’ అనే పిలుపొచ్చిందో అప్పుడు ‘హమ్మయ్య’ నన్న నమ్మింది మా అమ్మ అనుకున్నాడు నాగూ.
ఇక అసలైన దేవేరి నమ్మాలి, నన్ను కనికరిస్తుందో లేదోననే ఆలోచనలతో సతమతమవుతున్నాడు నాగూ మనసులో. అసలెక్కడికెళ్లింది? ఎప్పుడొస్తుంది? లాంటి ప్రశ్నలతో జవాబులు దొరకక ఉక్కిరిబిక్కిరి అవుతోంది నాగూ మనసు. క్షణాలు యుగాల్లా నడుస్తున్నాయన్పిస్తోంది. చూడగానే నాతో మాట్లాడుతుందా? కోపంగా చూస్తుందా? లేకపోతే గుమ్మంలోంచి నన్ను చూడగానే అటునుంచి అటే వెళ్ళిపోతుందా? అంతా తికమకగా మనసంతా గుబులు గుబులుగా ఉంది నాగూకు. ఇక్కడుంది కాబట్టి ‘కాసేపాగలేవా?’ అంది అమ్మ నాతో. అనుకోగానే ఎంతో హుషారొస్తోంది. ప్రాణానికి హాయిగా అనిపిస్తోంది. ఏదో పనిమీద తల్లి దొడ్లో కెళ్లింది. తను ఎంతసేపలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడో సోయే లేదు. టైం చూసుకుంటే నాలుగవుతోంది సాయంత్రం. కడుపు నిండిపోయింది తల్లి క్షమించినందుకు. సువర్ణను చూడబోతున్నాననే ఆత్రంలో. అన్నం తినబుద్ధి కాక చెయ్యి కడిగేసుకుని లేచాడు.
కిందపడి పగిలిపోయిన గాజుముక్కల్ని జాగ్రత్తగా చిరునవ్వుతో ఊడ్చి, ఎత్తి పారబోశాడు డస్ట్‌బిన్‌లో.
నెమ్మదిగా రూమ్‌లోకెళ్లాడు. చేసిన తప్పులు ఒప్పుకుంటే మనసు ఎంత తేలిక పడుతుందో స్వానుభవం ద్వారా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు నాగూ. ఇంతకాలం వేధించిన, ఒంటరితనం దూరమైపోయి, నేను నా భార్యా పిల్లలతో కలిసి గడపబోతున్నాననే ఆలోచనే ఎంతో తియ్యగా అనిపించసాగింది నాగూకి.
లేచి మళ్లీ ఫ్రెష్‌గా స్నానం చేసి తెచ్చుకున్న డ్రస్సుల్లో మంచి ఫ్యాంటు, షర్ట్ వేసుకున్నాడు. వెయిటింగ్ రూమ్‌లో కొచ్చి కూర్చుని టీపాయ్ మీదున్న మేగజైన్స్‌ని తిరగేస్తున్నాడు. కానీ ఏ కొద్దిగా మెస్ డోర్ శబ్ధమైనా సువర్ణే వస్తోందా? అన్నట్లుగా ఉలికిపాటుతో చూస్తున్నాడు. ఎవరూ లేకపోయేసరికి నిరాశపడుతున్నాడు. దొడ్లో పని ముగించుకుని వచ్చిన అంజనమ్మగారు నేరుగా వంటగదిలోకెళ్లి టీ తయారు చేసే పనిలో పడిరది. కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు అటునుంచి ఇటు, ఇటునుంచి అటు నాగూ. అన్నీ ఓరగా గమనిస్తూనే ఉంది అంజనమ్మగారు. పగిలిన గాజుపెంకులు ఎత్తి పారబొయ్యటం, భార్య రాకకోసం ఎదురుచూడటం, ఎప్పుడూ చిటపటలాడుతున్నట్లుండే మొహం, దాని స్థానంలో ఉత్సాహంగా ఉండటం… ఇవన్నీ చూస్తుంటే తన మంత్రం పారినందుకు లోలోపల సంతోషపడుతోంది. కొడుకు బుద్ధిమంతుడవుతుంటే ఏ తల్లి సంతోషపడకుండా ఉండగలదు!
ఇటు భార్గవ్, నవీన్‌లతోటి అటు పెద్ద కొడుకు, కోడలు అయిన రఘురామ్, పూజితలతోటి… నాగూ ఇంటికొచ్చినప్పటి నుండి జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది అంజనమ్మగారు. తండ్రిలో పశ్చాత్తాపం వచ్చినందుకు పిల్లలు, ఇన్నాళ్లకైన తమ్ముడి ప్రవర్తనలో మార్పు వచ్చినందుకు రఘురామ్, తనతోటి కోడలుకి ఇకనైనా సంతృప్తికరమైన జీవితం లభించబోతున్నందుకు పూజిత ఆనందిస్తున్నారు.
నాగు యొక్క ప్రవర్తనలో కొట్టొచ్చినట్లుగా కనబడుతున్న మార్పు, తప్పులను ఒప్పుకుని పశ్చాత్తాపపడిన విధానాన్ని కోడలు సువర్ణకు వివరంగా విడమరచి చెప్పింది అంజనమ్మగారు షాపుకు ఫోన్ చేసి.
మొదటినుంచి అత్తగారంటే వల్లమాలిన అభిమానం సువర్ణకు. బహుశా ఒకేరకమైన స్థితి గతులను ఇరు జీవితాల్లో ఎదుర్కొంటున్నందుకో ఏమో తెలవదు, అంజనమ్మగారు సువర్ణను తల్లిలాగా ప్రేమగా ఆదరించినందుకా! లేక ఉమ్మడిగా, ఉన్నప్పుడు ఇంటిపనుల్లో తోటికోడలు పూజితకంటే సువర్ణ ఎక్కువగా సహాయపడినందుకా? మొదట్నుంచి అత్తగారు, కోడలు అనే భావన ఇటు అంజనమ్మగారి మనసులోగానీ, అటు సువర్ణ మనసులోగానీ ఉండేవికావు.
‘‘అత్తయ్యగారూ నిజమేనంటారా? ఆయన పూర్తిగా తన లోటుపాట్లు తెలుసుకుని సరిjైున మార్గంలోకి వచ్చారంటారా?’’ అని అడిగింది అత్తగార్ని సంశయంతో.
అత్తగారి మీద సందేహంతో కాదు సుమా! ఎటొచ్చీ భర్తలో వచ్చిన మార్పు గురించే ఏదో ఓ మూల చిన్న సందేహం మనసులో. అదే మాటల్లో వ్యక్తపరిచింది సువర్ణ.
‘‘నిజమేనమ్మా సువర్ణా! మనమెప్పుడూ ఊహించని మార్పు కనబడుతోంది ఇంతకాలం నిన్ను అనుమానంతో ఏడిపించి, హింసించాననే భావన, దానికి వాడు పడుతున్న పశ్చాత్తాపం నేను కండ్లతోటి, మనసుతోటి చూసే చెబుతున్నానమ్మా… వాడి తల్లి లాగా కాదు! సాటి స్త్రీగా…’’ అంది అంజనమ్మగారు కోడలు సువర్ణతో.
సువర్ణ దృష్టిలో తన కన్నతల్లి, అత్తగారూ వేరు కాదు. ఒక్కటే. సువర్ణ మనసు ఆనంద డోలలాడుతోంది. భర్తంటే చాలా ఇష్టం సువర్ణకు. ఏనాటికైనా మారకపోతాడా? అనే ఆశతోటి అతనికి కనువిప్పు కలగాలని, నేను కావాలంటే అతగాడు చేసిన తప్పులన్నీ తెలుసుకుని తన దగ్గరకు వస్తాడనే నమ్మకంతోటి, అదీగాక పిల్లలున్న దగ్గరే ఉండాలనే ఆలోచనతోటే ఇక్కడికొచ్చి టైలరింగ్ షాప్ ప్రారంభించుకున్నది.
***
కాలింగ్ బెల్ మ్రోగటంతో వెళ్లి తలుపు తీశాడు నాగూ. ముందుగా అన్నయ్య రఘురామ్, వదిన పూజిత… ఇద్దరూ లోపలికొచ్చారు.
వాళ్లను చూసి నాగూ ఆశ్చర్యపోయాడు. ఆ వెనుక భార్గవ్, నవీన్ ఒకరి తర్వాత మరొకరు లోపలికొచ్చారు. చాలా రోజులకు తన వాళ్లను తృప్తిగా చూసుకున్నాననే ఆనందం తొణికిసలాడుతోంది నాగూ మొహంలో. కానీ మొహంలో ఓ మూల సువర్ణ రాదా? కనపడదా ఇకనాకు? అనే బాధ తొంగి చూస్తోంది.
అమ్మ ‘ఇంకా కొద్దిసేపు ఆగలేవా?’ అందిగా ప్రొద్దున్న నాతో. నిజంగానే ఆగలేక… ఛా… ఛా… అమ్మ నాతో అబద్ధాలాడదు, నిజంగానే సువర్ణ వస్తుందనుకుంటే ఎంతో హాయిగా ఉంటోంది మనసుకు.
అందరూ లోపల హాల్లో కూర్చున్నారు. కావాలనే కొంచెం బెట్టు ప్రదర్శిస్తున్నారు నాగూతో. పెద్ద కొడుకుకి, కోడలికి జ్యాస్ తెచ్చిచ్చింది అంజనమ్మగారు. నాగూకి స్ప్రైట్ ఇష్టమని స్ప్రైట్ తెచ్చిచ్చింది.
భార్గవ్, నవీన్‌లు ‘‘ఇప్పుడే వద్దు నానమ్మా! దార్లో చెఱకు రసం తాగొచ్చాం’’ అన్నారు.
ఒకలాంటి గిల్టీనెస్ ఫీలవుతున్నాడు వాళ్లందరి మధ్యన నాగూ. అందరూ నాగూను ఓ కంట గమనిస్తూనే ఉన్నారు. తండ్రిని చూసి భార్గవ్, నవీన్‌లు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. వాళ్ల చూపుల్నుంచి తప్పించుకోవాలని, వాళ్లవేపు సూటిగా చూసే ధైర్యం లేని నాగూ టీపాయ్ మీదున్న పేపర్ తీసి ముఖానికి అడ్డంగా పెట్టుకుని తెగ అవస్థపడుతున్నాడు. ఇకలాభం లేదు, నావల్ల కాదనుకుని లేచి మంచినీళ్లు తాగే నెపంతో కిచెన్‌లోని ఫ్రిజ్ దగ్గరకెళ్లాడు. ఇదే సందనుకుని నవీన్ నెమ్మదిగా శబ్దం రాకుండా మెయిన్ డోర్ తీశాడు. అంతే నిశ్శబ్దంగా, ఏమాత్రం అలికిడి తెలియనివ్వకుండా సువర్ణ నెమ్మదిగా అడుగులేసుకుంటూ లోపలికొచ్చి, మెయిన్ డోర్‌ను ఆనుకుని ఉన్న పిల్లల బెడ్‌రూంలోకి వెళ్లిపోయింది.
ఇంతలోకి పిల్లలూ, రఘురామ్, పూజితలు కలిసి టీపాయ్‌మీద అంతవరకూ కనపడకుండా జాగ్రత్తగా దాచిన కేక్‌ను తీసుకొచ్చి టీపాయ్ మీదపెట్టి డెకరేషన్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే డియర్ నాగ్’ అని స్పెషల్‌గా స్టిచ్ చేయించిన క్లాత్‌ను కేక్ కటింగ్ చేసే టీపాయ్‌కు వెనుకగా అలంకరించారు. అగ్గిపెట్టె, కొవ్వొత్తులు రడీగా అమర్చుకున్నారు.
‘‘నాన్నమ్మా రా…’’ అని పెద్ద మనవడు భార్గవ్ అంజనమ్మగార్ని హాల్లోకి తీసుకువచ్చాడు. తమ ప్లాన్‌లో భాగంగా రఘురామ్, పూజితలు మెయిన్ ఆఫ్ చేసేశారు. ఇన్వర్టర్‌ను కూడా స్విచ్ఛాఫ్ చేశారు. ఒక్కసారిగా ఇల్లంతా చీకటి అలుముకుంది. కరెంటు పోయిందనుకున్నాడు నాగూ.
‘‘ఒరేయ్ నాగూ బైటికి రా? కరెంటు పోయింది. సమయానికి ఇన్వెర్టర్ కూడా పనిచేయటం లేదు. ఏంటో ఏమో ఆఫీసు, ఆఫీసు అంటూ ఈ పిల్లలు దాన్ని పట్టించుకోరు’’ అని కావాలనే దీర్ఘాలు తీస్తూ అంజనమ్మగారు నాగూ ఉన్న గదిలోకెళ్ళి ‘‘రారా… అలా బైటికి. కరెంటు పోయిందిగా. ఒక్కడివే ఎంతసేపు
ఉంటావ్ గదిలో?’’ అంటూ నాగూని బైటికి తీసుకొచ్చింది అంజనమ్మగారు.
కరెంటు పోయిందిగా అందుకే కొవ్వొత్తి వెలిగించారనుకున్నాడు నాగూ.
‘‘బావగారూ అటు చూడండి కొంచెం…’’ అంటూ వెలుగుతున్న కొవ్వొత్తిని అటువేపు చూపించింది.
నిజమా? కలా? ఆశ్చర్యంతో కూడిన సంతోషం తాండవించింది నాగూ మొహంలో. సువర్ణ అందమైన రూపం. ఇన్నాళ్లూ తాను దేన్నైతే కోల్పోయాడో అది కండ్లెదుటే సాక్షాత్కరించిన మధురమైన ఘట్టం. రఘురామ్ తమ్ముణ్ణి చెయ్యిపట్టి సువర్ణ పక్కకి తోశాడు చిలిపిగా. వెంటనే తల్లిదండ్రులిద్దరికీ చెరో పక్కగా చేరిపోయారు భార్గవ్, నవీన్‌లు. ప్రతి సందర్భాన్నీ ఒడిసి పట్టే విధంగా పూజిత చకచక ఫోటోలు క్లిక్ మనిపిస్తోంది.
కొడుకు నాగూ కండ్లలోని సంతోషాన్ని, కోడలు సువర్ణ ముఖంలో అలుముకున్న నును సిగ్గులను, మనవళ్ల మొహంలో తాండవిస్తున్న హర్షాతిరేకాలను, పూజిత చలాకీగా ఫోటోలు తీసే విధానాన్ని, రఘురామ్ పెద్దరికంగా నిలబడి హుందాతనాన్ని ప్రదర్శిస్తున్న తీరుని చూస్తుంటే అంజనమ్మ మనసు నిండిపోయిది.
అసలు విషయం చెప్పాడు రఘు తమ్ముడు నాగూతో.
‘‘నాగూ ఈరోజు నీ పుట్టినరోజురా!’’ అన్నాడు రఘురామ్.
‘‘కొవ్వొత్తులు ఆర్పే సాంప్రదాయం కాదు మనది’’ అంటూ అంజనమ్మగారు కేకు మీదుగా అమర్చిన క్రొవ్వొత్తులను తీసేసింది. తీసేసిన ఆ క్రొవ్వొత్తులను అందంగా ఒక అందమైన ఆకారంలో పేర్చి టీపాయ్ మీద అమర్చిన కేక్ పక్కన డెకరేట్ చేశాడు చిన్నవాడు నవీన్.
‘‘నాన్నగారూ, అమ్మా… మీరిద్దరూ కలిసి వాటిని వెలిగించాలి’’ అన్నాడు నవీన్.
మంత్రముగ్దుడిలా నడిచి కొవ్వొత్తులు వెలిగించటానికి టీపాయ్‌కి దగ్గరగా వచ్చి, సువర్ణను కూడా కండ్లతో రమ్మని సైగ చేశాడు. కొత్త పెండ్లికూతురులా నడిచొచ్చింది సంతోషం మరియు నును సిగ్గుల కలబోతతో సువర్ణ.
ఇద్దరూ కలిసి వాటిని వెలిగించారు.
(ఇంకా ఉంది)