గుండెలోని నీటి చెలమ
అడుగు పొరల్లోంచి
అనుక్షణం ఉబుకుతూ
కనురెప్పల కింద
తలదాచుకుంటుంది అజ్ఞాతంగా
జ్ఞాపకాల ఉనికిని మాయ చేసి
గతాన్ని తనలో ఇముడ్చుకొని
పరుగులు తీసే కాలానికి
‘మరపు’ ఛాయలో
దుఃఖం నుంచి కాపాడానని
ఎంత పొగరో!!
గాయాల యాతనకు స్రవించే
వేదనా జలధి నుండి
దుఃఖం ఎక్కడికీ వెళ్లలేదని
బలహీన పడిన తుఫానులా
దిశను మాత్రమే మార్చుకుంటుందని
దానికేం తెలుసు??
ఆలోచనల అలజడులతో
ఎప్పుడూ పచ్చిగా తగిలే
అంతరంగ హిమపాతమది
విరుచుకుపడడం తెలుసు
ఘనీభవించడమూ తెలుసు
నిజానికి….
దుఃఖానికి దుఃఖించడమే
అసలైన ఓదార్పు!!