ఆకాశ దర్పణంలో అసువులు బాసిన వీరాంగన – నీరా ఆర్య

పురాతన సాంస్కృతిక కేంద్రమ యిన పాతబస్తీలోని ఫలక్ నుమా ప్రాంతం అది. ఉర్దూ భాషలోని ఫలక్ నుమా అనే పదానికి తెలుగులో ‘ ఆకాశ దర్పణం ‘ అని అర్థం. వడలిన దేహం సహకరించకపోయినా సడలని తేజమే బ్రతుకు పోరులో విరామానికి ససేమిరా అంది. ముగ్గుబుట్ట వంటి తలకట్టును ముడివేసి వెదురుబుట్టలో పూల మ్ముకుని జీవించే వృద్ధురాలు. తడబడే అడుగులతో ఆఖరి మజిలీ చేరిన అనితర సాధ్యురాలు.

ఆకాశ దర్పణంలో ఆమె అందరికీ వసివాడిన శతపత్ర కమలంగానే కనిపించింది కానీ ఆమె మూలాల్లోని శతఘ్నుల మోత ఎవరికీ వినిపించలేదు. శత వసంతాల బోసి నవ్వుల వెనుక బందూకుల సహవాసాన్ని ఎవరూ ఊహించలేదు. సాహసమే ఊపిరిగా, స్వరాజ్య సాధనే లక్ష్యంగా నడుం బిగించిన భారతీయ మొట్టమొదటి మహిళా గూఢచారిణి అని ఎవరూ గుర్తించలేకపోయారు. ఎవరికీ తలవంచని ఆత్మగౌరవం, గుర్తింపు కోరని స్వాభిమానం తానెవరనే విషయం ఎక్కడా తెలుపనీయలేదు. వివరాల్లోకి వెళితే………

వారే నీరా ఆర్య. 05/03/1902 లో ఉత్తర ప్రదేశ్ లోని ఖేక్రానగర్ లో మహావీర్, లక్ష్మీదేవి దంపతుల తొలిఫలంగా జన్మించారు. ఎనిమిది సంవత్సరాల వయసులో ఉండగానే తల్లిదండ్రులు గతించడంతో కలకత్తా నగరానికి చెందిన సేట్ ఛజుమాల్ అనే అత్యంత సంపన్నుడైన వ్యాపారి దత్తత(సంతతి లేని కారణంగా) తీసుకొని అల్లారు ముద్దుగా పెంచారు.దేశవ్యాప్తంగా విస్తరించబడిన తన తండ్రి వ్యాపార సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన కలకత్తా నగరాన వీరు విద్యనభ్యసించారు. వ్యాపారాన్ని చక్కబెట్టుకునే నిమిత్తం దేశంలోని పలు ప్రాంతాలకు తరచుగా వెళ్లే తండ్రితో పాటు పర్యటించిన కారణంగా 12 సంవత్సరాల వయసు వచ్చేసరికే బెంగాలీ, హిందీ,ఇంగ్లీష్ వంటి భాషలపై పట్టు సాధించారు. ఆ క్రమంలోనే బ్రిటిష్ వారి దురాగతాలను కళ్ళారా చూడటం, స్వాతంత్ర్య సముపార్జ నే ఈ దాష్టీకాలకు చరమగీతమని తండ్రి చెప్పడం, దానికి తోడు బెంగాల్ విభజన చరిత్రను కూడా చదవడంతో స్వాతంత్య్రోద్యమం వైపు మళ్ళాలనే ఆలోచనకు బీజం పండింది. బాపూజీ, నేతాజీ వంటి దిగ్గజాల పిలుపుమేరకు స్వాతంత్ర్యోద్యమంలో చేరారు.
వీరిలోని క్రియాశీలత కారణంగా బ్రిటిష్ వారి దృష్టిని ఆకర్షించి రెండుసార్లు జైలుకు కూడా వెళ్లారు. పెద్దగా నేరం చేయలేదన్న కారణంగా విడుదల అయ్యారు.

ఈ క్రమంలోనే ‘ ఆజాద్ హింద్ ఫౌజ్ ‘(విడుదలైన యుద్ధ ఖైదీలతో కూడిన) సంస్థ వ్యవస్థాపకులైన నేతాజీ ఆశయాలకు ఆకర్షితురాలై ఆ సంస్థలోని ఝాన్సీ రెజిమెంట్ లో చేరారు. వారి చురుకైన వ్యవహార శైలి, తోటి సైనికుల్లో స్వాతంత్ర్య భావాలను పురికొల్పే వారి వాగ్దాటి బృందంలో నేతాజీ తో సహా పలువురిని ఆకర్షించింది. బృంద సభ్యులందరి అంగీకారంతో అధికారులు ఆమెను మహిళా గూఢచారిణిగా నియమించి, సుభాష్ చంద్రబోస్ గారి భద్రతా వ్యవహారాల పర్యవేక్షణను ఆమెకు అప్పగించారు.

ఐతే తన ఏడు మల్లెల ఎత్తు బంగారు తల్లి ఇలా ఉద్యమ బాట పట్టడం ఆ తండ్రి గుండెలో గుబులు రేపింది. ఎలాగైనా సరే ఆమెను ఒక అయ్య చేతిలో పెడితే, ఒక గృహిణిగా ఇంటిపట్టునే ఉంటుందన్న ఆలోచనతో సమీప బంధువైన శ్రీకాంత్ జై రంజన్ దాస్ అనే ఒక బెంగాలీ ఉన్నతాధికారితో వివాహం జరిపించారు. ఆమె ఛజుమాల్ గారి ముద్దుల తనయ అని మాత్రమే అతనికీ, అతనొక ప్రభుత్వ ఉన్నతాధికారి అని మాత్రమే ఆమెకు తెలుసు. పరస్పర విరుద్ధ భావాలు గల ఇద్దరు వ్యక్తుల నడుమ బిగిసిన ముడి దిగ్భ్రాంతి కరమైన విషయంగా చరిత్రపుటల్లో నిలిచిపోనుందని ఆ రోజుల్లో ఎవరూ(వారితో సహా) ఊహించి ఉండకపోవచ్చు. ఆశయ సాధనకు అవరోధంగా భావించి (పరస్పర అంగీకారంతో ) అమ్మతనాన్ని కూడా వద్దనుకున్నారు.దాంపత్య బంధంలో కాలం సజావుగా సాగుతూ ఉండగానే ఒకరి గురించి ఒకరికి తెలియడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఇద్దరూ కూడా విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ఏ విషయాలు కూడా ఒకరితో ఒకరు పంచుకునేవారు కాదు.

ఆజాద్ హింద్ ఫౌజ్ లోని కొందరు వ్యక్తులకు అతనిపై అనుమానం కలిగినా నీరాఆర్య పై ఉన్న గౌరవంతో మౌనం దాల్చేవారు.

స్వాతంత్ర్య పోరాటం తీవ్ర రూపం దాల్చిన ఆ రోజుల్లో బ్రిటిష్ నేర పరిశోధనా విభాగ అధికారిగా విధులు నిర్వర్తించే అతనికి (జై రంజాన్ దాస్) నేతాజీని అంతమొందించే బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. ఆజాద్ హింద్ ఫౌజ్ లో గూఢచారిణి ఐన ఆమెకు (నీరా ఆర్య) అతడిని(నేతాజీ) రక్షించే బాధ్యతను అప్పగించింది.

ఒక రహస్య సమావేశానికి నేతాజీ హాజరవుతున్నారన్న సమాచారం
అందుకున్న అతను, అతడిని (బోస్ గారిని) కాపాడే నిమిత్తం ఆమె ఇద్దరు కూడా నేతాజీ రాకకు ముందే అక్కడికి చేరుకున్నారు. కానీ ఆ విషయం (ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చామనే) ఇద్దరికీ తెలియదు.
ఇంతలో నేతాజీ కారులో అక్కడికి రావడం, అదే అదనుగా ఒక అజ్ఞాత వ్యక్తి కాల్పులు జరపడం ప్రారంభమైంది. నేతాజీ లక్ష్యంగా దూసుకొచ్చిన బుల్లెట్ గురితప్పి అతని కారు డ్రైవర్ కు తగలడం, అదే క్షణంలో అతను కుప్పకూలిపోవడం జరిగింది.
క్షణంలో అప్రమత్తమైన ఆమె నేతాజీని కాపాడే ప్రయత్నంలో ఉండగానే రెండో బుల్లెట్ ఆమె భుజాన్ని రాసుకుంటూ పోయింది. చీకటి పడిన కారణంగా కాల్పులు జరిపేదెవరో తెలుసుకోలేక పోయింది. సరిగ్గా మూడవ బుల్లెట్ పేల్చుతున్న సమయంలో ఆ వ్యక్తి ఎవరన్న విషయం ఆమెకు స్పష్టంగా తెలిసింది. అతని చేతిలోని తుపాకీ ఆధారంగా అతను బ్రిటిష్ సైన్యం లోని సి. ఐ. డి.అధికారి అనీ, ఆ వ్యక్తి తన జీవిత భాగస్వామి అన్న విషయం తెలిసి నిర్ఘాంత పోయింది.

పథకం ఫలించక అతనూ, సర్వశక్తులొడ్డి నేతాజీని రక్షించి ఆమె ఇద్దరూ ఇంటికి చేరారు. జరిగిన సంఘటన ఆమె మనసులో తీవ్ర సంఘర్షణను రేపింది.

భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి సర్వం త్యాగం చేసి పోరు బాట పట్టిన ఎంతోమంది దేశ భక్తులను అతను మట్టు బెట్టడం, పరాయి పంచన చేరి దేశ విద్రోహ శక్తిగా వ్యవహరించడాన్ని ఆమె తట్టుకోలేక పోయింది. నేతాజీని ప్రత్యక్షంగా చూసిన అతని వల్ల నేతాజీ ప్రాణాలకు ఎప్పటికైనా ముప్పే అని భావించింది. కుటుంబ సంక్షేమం కంటే దేశ శ్రేయస్సే ముఖ్యమనీ, ఆజాద్ హింద్ ఫౌజ్ పరిరక్షణే తన కర్తవ్యమనీ, నేతాజీని రక్షించడమే తన విద్యుక్త ధర్మమనీ స్థిర నిర్ణయానికి వచ్చింది. స్వాతంత్ర్య సముపార్జనకు అడ్డుపడే ఏ వ్యక్తి అయినా దేశద్రోహి మాత్రమే అవుతాడనీ, అటువంటి వారిపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదనీ, ఆ వ్యక్తి తన బంధువైనా, స్నేహితుడైనా, చివరికి తన భర్త అయినా ఉపేక్షించడం అనవసరమనీ నిద్రిస్తున్న అతనిపై కత్తితో దాడి చేసింది. దాంతో అతను అక్కడికక్కడే మరణిస్తాడు.
విషయం తెలిసిన నేతాజీ ఆమెను తీవ్రంగా మందలిస్తారు. తోటి సైనికులు ఆమెను తప్పించుకోమని సలహా ఇస్తారు. తాను తప్పించుకుంటే ఆ నేరం నేతాజీ పై పడుతుందని ఆమె దానికి అంగీకరించలేదు.

విషయం తెలుసుకున్న బ్రిటిష్ పాలకులు ఆమెను అరెస్టు చేసి(1945 – 1946 వ సంవత్సరం) ఎర్రకోటలో బహిరంగ విచారణ జరిపించారు. ఏమాత్రం భయపడకుండా ఆమె గర్వంగా నేరాన్ని ఒప్పుకుంది. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు, హత్యా నేరం అన్న కారణంగా బ్రిటిష్ పాలకులు ఆమెను అండమాన్ లోని కాలాపానీ జైలుకు పంపించారు. జైలు సిబ్బంది ఆమెను ఈడ్చుకుంటూ ప్రధాన అధికారి వద్దకు తీసుకెళ్లారు. ఆమె నేతాజీ అనుయాయురాలు కావడం వల్ల నేతాజీ ఆచూకీని చెప్పాలంటూ ప్రధాన అధికారి ఆమెను గద్దిస్తాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఆమె అతని గురించి ఏ విధమైన సమాచారాన్ని ఇవ్వకపోవడంతో ఆమె కాళ్లు, చేతులపై ఉన్న చర్మాన్ని ఒలిచి, తలపై బలంగా కొట్టి చిత్రహింసల పాలు చేస్తారు. నేతాజీ ఎక్కడున్నాడో చెబితే వదిలేస్తామని వారు అనడంతో ఆమె తన గుండెల్లో ఉన్నాడంటూ శివంగిలా గర్జిస్తుంది. అయితే ఆ గుండెల్లోంచే అతన్ని తొలగిస్తామంటూ ఒక పదునైన ఇనుప పరికరంతో ఆమె కుడి వక్షోజాన్ని చీలుస్తారు. అయినప్పటికీ ఆమె ఏ విధమైన సమాచారాన్ని ఇవ్వకుండా,ఆ హింసను భరిస్తూ “భారత్ మాతాకీ జై ” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది. బ్రిటిష్ రాణికీ జై అంటే వదిలేస్తామని వారు అనడంతో, ఆమె తిరిగి తెల్ల గుండెల్లో ఫిరంగుల మోతలా”భవానీ మాతాకీ జై” అన్నది. దాంతో వారు ఆమెను మరింత తీవ్రంగా హింసించడంతో స్పృహ కోల్పోతుంది.

తర్వాత కొంతకాలానికి భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంతో ఆమె జైలు నుండి విడుదలయింది. విడుదలయ్యాక ఆమె తన స్వస్థలమైన కలకత్తా నగరానికి వెళ్లకుండా, హైదరాబాద్ చేరింది. కారణం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్ మాత్రం ఇంకా నైజాం పాలనలోనే ఉంది. ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చడం లేదు. ‘నాగిని’ అనే మారుపేరుతో హైదరాబాద్ విమోచనోద్యమంలో చురుకుగా పాల్గొంటూ ఉండేది. ఆ తర్వాత హైదరాబాద్ కూడా భారతదేశంలో కలవడంతో ఆమె ఆశయం నెరవేరింది. చార్మినార్ ప్రాంతంలోని ఒక చిన్న ఇంట్లో ని వసిస్తూ, ఒక చిన్న దుకాణంలో పూలు, పళ్ళు అమ్ముకుంటూ వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో మురికి వాడల్లోని పిల్లలను చేరదీసి వారికి చదువు నేర్పిస్తూ, వారిలో దేశభక్తిని పాదు కొలుపుతూ ఉండేవారు. కొంతకాలానికి అది ప్రభుత్వ భూమి అన్న కారణంగా అధికారులు దాన్ని కూల్చివేసి, లోపల ఉన్న ఆమె సామాన్లను బయటకు విసిరేస్తారు. ఆమె వారిని ఏమాత్రం ప్రతిఘటించ లేదు, తానెవరనే విషయం చెప్ప లేదు. మౌనంగా అక్కడి నుండి కదిలి ఫలక్ నుమా లోని కాలిబాట (ఫుట్ పాత్) పక్కన ఒక చిన్న గుడిసె వంటి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుని, అందులో ఉంటూ ఒక చిన్న వెదురు బుట్టలో పువ్వులు తీసుకొని సంతకు వెళ్లి విక్రయిస్తూ జీవనం సాగిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒక రోజు ఆమె అస్వస్థత పాలవడంతో తోటి వారు ఆమెను ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించడంతో, జనరల్ వార్డులో చికిత్స పొందుతూ 96 ఏళ్ల వయసులో 26/07/1998 న శాశ్వత నిద్రలోకి జారుకుంది.

మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించే నిమిత్తం ఆమె నివాసాన్ని ఆరా తీస్తూ వెళ్లిన పోలీసు వారికి ఆ గుడిసెలో ఒక పాత ట్రంకు పెట్టె కనిపిస్తుంది. ఆమె వ్యక్తిగత వివరాల కోసం ఆ పెట్టెను తెరిచిన పోలీసులు, ఆ కాగితాల్లోని సమాచారాన్ని చూసి నిర్ఘాంత పోయారు. కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టు, పరిసరాలన్నీ గిరగిరా తిరుగుతున్న అనుభవానికి లోనయారు. ఆమె భారత దేశ మొట్టమొదటి మహిళా గూఢచారిణి అనీ, స్వాతంత్ర్య సముపార్జనలో అత్యంత క్రియాశీలక వ్యక్తి అనీ, ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రముఖ సైనికురాలనీ తెలిసి నిలువునా కంపించి పోయా రు.

ఈ విషయాలన్నీ తెలిసిన ఒక విలేఖరి తన స్వీయ పర్యవేక్షణలో ఆమె అంత్యక్రియలను నిర్వహించాడు.

ఒకానొక సందర్భంలో ఉర్దూ రచయిత ఐన ఫర్హానా తాజ్ కు తన వ్యధాభరిత జీవితంలోని కొన్ని అంశాలను గూర్చి చెప్పడంతో వారు ఆమె జీవితాన్ని రచించారు.

ఇంత ప్రముఖురాలైన వీరి వివరాలు గోప్యంగా ఉంచబడడానికి కారణాలు తెలియ రాలేదు. సరైన గుర్తింపు రాలేదు, అందవలసిన గౌరవం అందలేదు. నిస్వార్థ సేవే తప్ప గుర్తింపులు, గౌరవాలు కోరుకోని ఆమె స్వా భిమానమే అందుకు కారణమై ఉండవచ్చని పలువురు విశ్లేషకుల భావన.

వారు కోరుకోకపోయినా మనం పీల్చే స్వేచ్ఛా వాయువుల్లో వారి ఔన్నత్యానికి, ఆశయ సాధనకు కైమోడ్పులందుతూనే ఉంటాయి. వారు వద్దనుకున్నా 146 కోట్ల మంది భారతీయుల గుండెల్లో వారు పీఠం వేసుకొని ఉంటారు. నిత్య సుమాంజలి ఘటిస్తూ, నీలి మేఘాలలో, గాలికెరటాలలో ఆ విషయాన్ని వారికి చేరవేస్తూనే ఉంటారు. వారందించిన స్ఫూర్తితో “ఆగకోయి భారతీయుడా, కదలి సాగవోయి ప్రగతి దారులా ” అంటూ పదం, పదం కలిపి ముందుకు సాగుతూనే ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“వైష్ణోదేవి ఆలయం”

మా తరగతి గది