” ఆదినుండి ఆధునికం వరకు” అంటూ దామరాజు విశాలాక్షి గారు ఈ సమాజంలో ఉత్తమ మైన కార్యక్రమాలు చేసిన స్త్రీ లను గురించి ప్రతి మాసం తరుణి పాఠకులకు అందిస్తున్నారు . సరైన విషయం, మంచి విశ్లేషణ, చక్కని వాక్య నిర్మాణ శైలి విశాలాక్షి గారి రచనా విధానం. చదవండి , తెలుసుకోండి ఆనందించండి.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకులు
అపరాజిత ,ఆదిపరాశక్తి, అమ్మ అని అతివలను ఆరాధించే స్థితి నుండి, ఆడది, యీడది, యేడది?
అని అపహాస్యం చేసే దుస్థితికి దిగజారిన ఈ సమాజంలో,ఆడదాని విలువ తెలియాలంటే !ఆదికాలం నుండి ఆధునిక కాలం వరకు అతివల అత్యుత్తమ చరిత్రలు తెలుసుకోవాల్సిందే.ఆ ప్రస్థానంలో వనితలు
వేద కాలంలో ఎలా వెలుగొందారు? పురాణ కాలంలో ఎలా ప్రసిద్ధి చెందారు? ఆధునిక కాలంలో ఎలా అద్భుతాలు చేస్తున్నారు? అన్నది తెలుసుకోవాలి.
ఆ ప్రయత్నమే ” ఆది నుండి ఆధునికం వరకు” అనే ఈ శీర్షిక.
ముందు మహిళల గురించి మహనీయులు ఏమన్నారు తెలుసుకొని, ఆ మహిళల చరిత్రలను చదివి మనసారా ఆస్వాదిద్దాం.
“యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా:
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రా ఫలాః క్రియాః”
ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు పచ్చట దేవతలు ప్రీతి చెందుతారు. ఎచ్చట స్త్రీలు గౌరవింపబడరు. అచ్చట
చేసే సర్వకార్యాలు నిష్ఫలం అవుతాయని మను ధర్మ శాస్త్రం చెబుతోంది. ఇది ఒక సనాతన భావము.
శ్రీ శక్తి- స్త్రీ శక్తి
“యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమ:”
సమస్త భూతాల్లో వ్యాపించిన చైతన్యము శక్తి.
శక్తి లేనిదే ఏ కార్యం చేయలేము. సమస్తజీవులూ నిత్యం జరిపే దైనందిక కార్యక్రమాలన్నిటికీ శక్తి కావాలి
శక్తి లేనిదే సృష్టి స్థితి లయములు జరగవు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మూడు శక్తులకు మూలపు శక్తి ఆదిపరాశక్తి. అమ్మలగన్న అమ్మ ఆ జగదంబ. మనకు ఆహారాన్ని అందించే శక్తి అన్న పూర్ణాదేవిగా, ఐశ్వర్యాన్ని అందించే శక్తి లక్ష్మీదేవిగా, ఆలోచనను, మంచి బుద్ధిని ప్రసాదించే శక్తి సరస్వతీ దేవిగా, ఆ పరాశక్తిని భావించి సేవించడం జరుగుతుంది. హిందూ ధర్మం ఈవిధంగా స్త్రీని మాతృమూర్తిగా , జన్మనిచ్చిన తల్లిని, జన్మ భూమిని, పచ్చని ప్రకృతిని, పాలిచ్చే గోవులను, ప్రవహించే నదులను, మాతృ స్వరూపాలుగా గౌరవిస్తుంది. ఇదే మన సంస్కృతి.
స్త్రీని భోగ వస్తువుగా, మోహించి, కామించి, పీడించే
సంస్కృతి మనది కాదు. చరాచర సృష్టి అంతా శక్తి ప్రధానంగా సాగుతుంది.. కోటాను కోట్ల జీవరాశుల్లో ఉండే జీవరూప శక్తి ఈ చైతన్యమే. ఈ సృష్టి నిరాటంకంగా సాగడానికి ఆధారభూతమై నిలుస్తుంది..
మనం నమ్మినా నమ్మకపోయినా ఆ పరాశక్తి తన ధర్మాలను తాను నిర్వహిస్తూ అందరినీ కాపాడుతుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంది. అనంత తేజోవ్యాపకమైన ఈ శక్తి యొక్క భౌతిక రూపాన్ని, ఆదిపరాశక్తిగా మన ప్రాచీన ఋషులు దర్శనం చేశారు.
ఈ పరాశక్తి పార్వతి, లక్ష్మీ ,సరస్వతి అంటూ అనేక రూపాల్లో అనుగ్రహిస్తూ ఉంటుంది.
శ్రీ శక్త్యై నమః . శక్తి ఒక్కటే.
అయినా !అవసరాన్ని బట్టి అనేక అవతారాలు ఎత్తి, ప్రాణికోటిని రక్షిస్తుంది. ఆదిపరాశక్తి అనంత విశ్వానికి అధినేత్రి. రూపం లేనిది. నిర్గుణ బ్రహ్మము అని కూడా అంటారు. పరాశక్తి ఒక దివ్యమైన స్వచ్ఛమైన శాశ్వతమైన చైతన్యం. ఆదిమ కాలం నుంచి ఉన్న శక్తి కనుక, ఇతర దేవతలకు కూడా ఆదిపరాశక్తి మూలం
“ఆదిపరాశక్తి నిజమైన నిజం. తనకు తానే సంపూర్ణం. జగత్తుకి శివుడిని ఆహ్వానించడానికి తాను, స్త్రీ
రూపంలో జన్మమెత్తింది”. ఆదిపరాశక్తి తను నుదుట సత్య లోకాన్ని, తన కురులలో విశ్వాన్ని, తన నేత్రాలుగా సూర్య చంద్రులను, తన కర్ణాలుగా నాలుగు దిక్కులను , తన పలుకులుగా వేదాల్ని, తన దంతాలు గా మృత్యువును, అనురాగ భావోద్రేకాలను చిరునవ్వుగా, ఎవరూ చూడని, వినని ,తెలియని, తన విశ్వరూపాన్ని, హిమాలయ పర్వత మహారాజుకు చూపించింది. అటువంటి ఆదిపరాశక్తి పార్వతిగా, హిమవంతుడికి కుమార్తెగా జన్మించింది.
స్త్రీలందరూ శక్తి స్వరూపిణులు గానే పిలవబడతారు .
అట్లే దేవి శబ్దం కూడా. కానీ, శక్తి, దేవి అన్నప్పుడు ప్రధానంగా శివుని పత్నిగానే ప్రసిద్ధం.. శివుడు మహా దేవుడైతే మహాశక్తి. సృష్టి, స్థితి, లయకారిణి.
హిమాలయాలు ఆకాశాన్ని చూపిస్తాయి ఆకాశం పంచభూతాలలో మొదటిది కదా! మేనాదేవి బుద్ధిని సూచిస్తుంది. కనుక వారి తనయ యైన పార్వతి విశ్వంలో ఉన్న ఎరుకను లేదా చైతన్యాన్ని సూచిస్తుంది. అందువల్ల ఆమె “ఉమ” అంటే “కాంతి” అని పిలవబడుతుంది.
ఈ చరాచర ప్రకృతి అంతా నిండి ఉన్న దేవి, విశ్వమైనది.
ప్రాచీన కాలం నుంచి మన భారతదేశంలో నాగరిక, ఆటవిక జాతులు వాళ్ళు అందరూ, తమ తమ శక్తి కొలది ఆది పరాశక్తిని గ్రామదేవతలుగా, చెట్టు పుట్టగా అనేక రూపాల్లో ఆరాధిస్తూనే ఉన్నారు. పంచభూతాలు దేవీ స్వరూపం. దేవీ అంశాలు మూర్తి త్రయమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అవే శక్తి త్రయము .
ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు, గుణత్రయమైన సత్వ రజస్తమో గుణాలు. త్రికూటము లు. భార్గవ కూటమి, కామరాజ కూటమి ,శక్తి కూటాలు, నామరూపాత్మకమైన శక్తి త్రయము, మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి .
త్రిపుటీ అనబడే జ్ఞాపక జ్ఞాన అజ్ఞానములు కూడా.
దేవి యొక్క అఖండ తేజోమయ స్వరూపంలో అంతర్లీనంగా ఉన్నాయి.
పలుకబడేది శబ్దార్థము. మాట్లాడే శక్తి కాంతిస్వరూపము. పరాశక్తి జ్యోతి అంటే దీప్తి స్వయం ప్రకాశము. వెలుగు కిరణం. రూపము, శోభ, కాంతి అని అర్థము. కాంతి స్వరూపిణి ఆమె. పరంజ్యోతి. ఆ జ్యోతిని హృదయాకాశంలో సందర్శించగలిగిన వాళ్ల ముఖం, శరీరం, వాక్కు, సమస్తమైన పనులు తేజోమయంగా ఉంటాయి. కవులు వ్యక్తా వ్యక్తంగా ఇటువంటి కాంతిని దర్శించిన మహానుభావులు.
కాబట్టే వాళ్లు జ్యోతిర్మయమైన వాఙ్మయమును పఠించి జ్ఞాన తేజంతో విరాజిల్లుతారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి అయిన అమ్మను గూర్చి ముందుగా, ముచ్చటించుకోవడం మన భాగ్యం.
*స్త్రీ వ్యక్తి కాదు శక్తి *
మన జాతి ఇంతగా దిగజారి పోవడానికి కారణం శక్తిస్వరూపిణులైన స్త్రీలను గౌరవింపకపోవడమే! అన్నారు స్వామి వివేకానంద .వేద కాలంలో స్త్రీలు బ్రహ్మ వాదినులుగా, మంత్ర ద్రష్టలుగా ప్రసిద్ధి చెందారని కొన్ని దృష్టాంతాలు చూపుతున్న్నాయి. మధ్య యుగాలనాటికి స్త్రీల పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. పితృస్వామ్య సమాజంలో కట్టుబాట్లకు కారణంగా స్త్రీ భావదాస్యానికి గురైoది. సమాజం శాసించిన విలువల చట్రాలలో బిగింపబడింది.
తన శరీర ధర్మాల వల్ల, సహజధర్మాల వల్ల అణచివేతకు గురైంది. ఈ చారిత్రక నేపథ్యంలో ఆ సంధ్య కాలంలో చీకట్లను పారద్రోలి, స్త్రీల కోసం ప్రగతి బాటలు వేయాలని నడుము కట్టిన సంస్కర్తలు, మహనీయులు కొందరు ఉన్నారు. విద్య ద్వారా మనసుపెట్టి వికసించిన స్త్రీ, తన అభ్యుదయ మార్గాన్ని తానే నిర్దేశించుకోగలరని అన్నారు స్వామి వివేకానంద.
స్త్రీల పురోభివృద్ధికి పాటుపడ్డ వారంతా స్త్రీ సమగ్ర
అభివృద్ధిని కాంక్షించారు. స్త్రీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, విద్యావంతురాలు కావాలని, స్త్రీ వ్యక్తిత్వం వికసించాలని ,సంస్కర్తలు నినదించారు.
తెలుగు మహిళా వికాసంలో వీరేశలింగం పంతులుగారు గురజాడ వారి పాత్రలు చిరస్మరణీయాలు .ఆధునిక మహిళ భారత దేశ చరిత్రను తిరిగి రాస్తుందని విశ్వసించారు గురజాడ అప్పారావు గారు.
సృష్టిలో స్త్రీ ఉన్నతురాలు. ఆమె అబల అన్న మాట అర్థరహితం. రైతు కుటుంబాల్లో, శ్రామిక కుటుంబాలలో
స్త్రీ; పొలంలో పనిపాట్లు చేసే సమయంలో కునికి పాట్లు పడే పురుషుని కంటే, చాలా రెట్లు ఎక్కువైనదిగా, బలమైనదిగా తెలుస్తుంది. శ్రామిక స్త్రీ నాట్లు వేసేది, కలుపు తీసేది, కోతలు చేసేది,దoచేది,విసిరేది,
రుబ్బేది వంట వoడేది, వడ్డించేది స్త్రీలే. శ్రామిక వర్గ స్త్రీలే కాక, నాగరిక స్త్రీలు కూడా పురుషుని కంటే చాలా ఎక్కువగా శ్రమిస్తున్నారు అన్నారు గురజాడ. సామాజిక మార్పుల అవగాహనతో ఆధునిక మహిళ ప్రగతి సాధించింది. ఆమె ఆలోచనలు, తన శరీరం మీద, మనసు మీద, ఆలోచన మీద, తనదైన హక్కు సాధించడానికి, వ్యక్తిత్వ పోరాటానికి, ఉపయోగించడం మొదలుపెట్టింది .తన అనుభూతిని స్వేచ్ఛగా
వ్యక్తికరించుకోవడానికి, సమాజం ఏ విధంగా నియంత్రిస్తుందో గుర్తించి, నిరసించింది. తనను వస్తువుగా చేసిన వ్యాపార సంస్కృతిపై తిరగబడింది .
స్త్రీ పట్ల వివక్షతను, స్త్రీల జీవితాన్ని చీకటిమయంగా మార్చిన వ్యవస్థను, ప్రశ్నించింది.
క్రమేపి స్త్రీ ఇప్పుడు సమాజాన్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాన్ని ,ప్రశ్నించడం నేర్చుకొన్నదో అలా ఉద్యోగిని, కవయిత్రి అయింది . సంస్కర్త అయింది. సేవాస్ఫూర్తి అయింది. కళాకారిణి అయింది. ఉద్యమ నేత అయింది.ఇప్పుడు ఆకాశంలో సగం భూమి మొత్తం తాను అయింది. అంతరిక్షం లోకి వెళ్ళింది.శత్రువులను చావు దెబ్బ తీస్తున్నది. విద్యా వైద్య వ్యవసాయ శాస్త్రీయ సాంకేతిక సైనిక సహకార సైన్యాధి రంగాలలో అన్నింటాతానై అంతా తానై అభివృద్ధి పథంలోకి దూసుకెళుతోంది అడుగడుగునా అవరోధాలను ఎదుర్కొంటూ అవమానాలను సహిస్తూ చైతన్య స్రవంతిలా సాగి పోతున్నది. ఒక మార్గదర్శి అయింది స్వచ్ఛమైన ప్రవర్తనతో సహజ సహన సౌశీల్యాలతో సౌభాగ్యంతో సమాజాన్ని శాంతి సౌభ్రాతృత్వాలనే సన్మార్గంలో నడిపించడానికి శాయాశక్తుల కృషి చేస్తున్నది అలాంటి స్త్రీలందరికీ అభినందనలు
తెలియజేస్తూ ఆషాడ మాసంలో వెలసి ఆదిపరాశక్తి పూజలకు ఆరంభగీతం పాడిన అంబా జగదంబను అతివలకు ఆత్మస్థైర్యాన్ని కల్గించి అత్యున్నత పదాలలో నడిచేందుకు ఆసరాగా ఉండమని వేడుకుంటూ ఆదర్శప్రాయులైన అతివల మార్గాలలో పయనిద్దాం ఆనంద సామ్రాజ్యాలను పాలిద్దాం.
_**_