ఉషస్సు

కథ

ఆ రోజు చైత్ర శుద్ధ పాడ్యమి చల్లని పిల్ల తెమ్మెర ఉషోదయమై పలకరిస్తున్నది .ఉగాది పర్వదినం. ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా ఉంది. లేత చిగుళ్ళతో, పూత పిందెలతో, పచ్చని శోభలతో మురిసిపోతుంది. అక్కడక్కడ కొమ్మల చాటున కోయిలమ్మ పిలుపుల రాగాలు వినపడుతున్నాయి. ఆరోజు సునయన రోజు కంటే ముందే లేచి, పండగ పనులు మొదలు పెట్టేసింది. అందరూ లేచి స్నానాలు చేసి ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు.

కోడలు వంటింట్లో ఏదో పనిలో ఉంది. సునయన భర్త గుమ్మానికి తోరణాలు కడుతున్నారు . మనవడు మనవరాలు ఆడుకుంటూనే, అందరినీ గమనిస్తూ మధ్య మధ్యన ప్రశ్నలు వేసి వారి సందేహాలను తీర్చుకుంటున్నారు. వాళ్లను గమనిస్తూనే సునయన సోఫాలో కూర్చుని వెనక్కి వాలికళ్ళు మూసుకుంది.ఆమె ఆలోచనలు
నాలుగేళ్లు వెనక్కిజారిపోయాయి.

ఆ రోజు కూడా ఉగాది పండుగ ఇంట్లో ఎవరు లేరు. భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు. బాబు ఢిల్లీలో పెద్ద ఉద్యోగం. ఓ ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నాడు. గొప్ప సంపాదన ఇదంతా మామూలే! కానీ, వాడు పండక్కి రాలేదు.సెలవు లేదు.అమ్మాయి అత్తవారింట్లోనే ఉంది రాలేదు. పిల్లలు లేకుండా పండగ పండగలా అనిపించదు. సందడి అంతా పిల్లలతోనే కదా! పండుగ పనులన్నీ అన్యమనస్కంగానే పూర్తి చేసుకొని అలసటగా అలా కూర్చుండిపోయింది.ఆమెమనసంతా కొడుకు మీదే ఉంది.
వాడికి భక్ష్యాలు, పూర్ణాలు, ఉగాది పచ్చడి అంటే ఎంత ఇష్టమో! ఇంట్లో అందరికీ ఇష్టమే వాడికి మరీ ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడూ చేసిపెట్ట మనేవాడు. ఏ పండగ వచ్చినా ‘అమ్మ భక్షాలు చేస్తావా! ఈ పండక్కి’ అనేవాడు అప్పుడు సునయన ఏ పండక్కి ఏం చేస్తారో ఎందుకు చేస్తారో వివరించి చెప్తూ ఉండేది. ఇప్పుడామే మనసంతా బాధగా ఉంది. ‘బిడ్డ పండగ పూట ఏం తింటున్నాడో ఎలా ఉన్నాడో’ ఇలా ఆలోచిస్తున్నంతలోనే ఫోన్ మోగింది. ఫోన్ చేసింది అబ్బాయి ఆత్రంగా ఫోన్లో
నువ్వే గుర్తొస్తున్నావ్ రా పండగపూట రాలేదు. మనసంతా నీ మీదే ఉంది అంటూ మొదలెట్టింది. అమ్మా! నేను పండగ చేసుకున్నానులే! నువ్వేమి దిగులు పడకు అని చెప్తూనే “అమ్మ నేను ఉగాది పచ్చడి చేశాను. ఆఫీస్ కు కూడా తీసుకెళ్లాను. అందరికీ పెట్టాను. అందరికీ బాగా నచ్చింది. నన్ను మెచ్చుకున్నారమ్మ” ఆనీ చెప్తున్న కొడుకు మాటలు వినగానే ఆమెకు ఏనుగు ఎక్కినంత సంబరమైంది. గజమాలలు గండపెండెరాలు తొడిగినంత ఆనందం కలిగింది.ఇది కదా ఉగాది. ఇది కదా ఉషస్సుతనకు అనిపించింది. సెంటిమెంట్లు బలీయమైనవే!
ఆమెకు చాలా గర్వంగాకూడా ఉంది. అవసరమైన సందర్భాల్లో పెద్దల గురించి పండుగల గురించి చెప్పడం, ఇంట్లో పెద్దదిక్కు అత్తగారి మమతల మాటలు పిల్లలిద్దరూ బుద్ధిమంతులు కావడానికి కారణం అని ఆమె గట్టి నమ్మకం.యుగాలు గడిచినా, తరాలు మారినా, సాంకేతిక యుగంలో దూసుకుపోతున్నా, అనివార్యమైన తప్పని కొన్ని మార్పులు తప్ప, మారని మన ఉగాది పండుగ సంస్కృతి సంప్రదాయాలు. మూలాలేవీ మాసిపోలేదనిపించిందామెకు.

కాలం మారింది. పిల్లలు మారిపోయారు. మన సంస్కృతి సంప్రదాయాలు పాడైపోతున్నాయి అనుకోవడం సాధారణంగా అందరం చేస్తున్నదే కానీ, మనం ఎంతవరకు కారణమవుతున్నామో ఆలోచించము. ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలను గమనిస్తున్నామా? వారికి తగిన సమయం కేటాయిస్తున్నామా? అనుభవాలను కాచి వడపోసిన అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఇంట్లో ఉంటున్నారా! కారణాలు అనేకం ఉండొచ్చు. కలిసి ఉండలేని పరిస్థితులు ఉండొచ్చు. కుదిరిన వాళ్ళయినా కలిసి ఉంటున్నారా! ఎవరికి వాళ్లు ప్రశ్నించుకోవాలి. కారణం లేకుండా చర్యలు కూడా ఉండవు కదా!

‘అమ్మ అమ్మ’ అంటూ కుదుపుతున్న బాబు మాటలకు ఆలోచనలకు అంతరాయం కలిగి ఈలోకంలోకి వచ్చి పడింది. ఏమిటన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది. ‘అమ్మ ఉగాది పచ్చడి చేయాలి కదా నేను చేస్తాసామాన్లు ఇవ్వమ్మా’ పండగ సంబూరమంతా ఇంట్లో వెల్లివిరుస్తుంటే అలా కొడుకుని మురుపెంగా చూస్తూ ఆమె వంటింట్లోకి నడిచింది.

Written by G. Sulochana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని -67 వ భాగం

‘ ఆమె ‘ అంతరిక్షాన్ని జయించింది!!