సంక్రాంతి పండగ రానే వచ్చింది.ఆ రోజు భోగి.శాస్త్రి గారి ఇల్లు పండుగ శోభతో కళకళలాడుతోంది.
ఏడాది పొడవునా నిశ్శబ్దంగా ఉండే ఆ ఇల్లు, వచ్చిన ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో ఇల్లంతా సందడిగా ఉంది.
చలి విపరీతంగా ఉంది. శాస్త్రి గారి భార్య కాంతమ్మగారు ఒకవైపు పెద్ద ఇత్తడి గిన్నెలో ఫిల్టర్ కాఫీ కలిపి, చల్లారిపోకుండా మూతపెట్టి, నిద్రలేచి ముఖం కడుక్కుని వచ్చిన వారికి కాఫీ అందిస్తున్నారు.
మరోవైపు, కట్టెల పొయ్యిలో కట్టెలు వేసి, రాగి బిందెలో స్నానానికి వేడి నీళ్లు కాచుతూ, “కాఫీ తాగి, వేడి నీళ్లు బకెట్టులో పోసుకొని, మళ్ళీ బిందెలో నీళ్లు నింపు,” అని పురమాయించింది పండగకి వచ్చిన అక్క కొడుకు కొండతో.
“అలాగే పిన్నమ్మా,” అంటూ గబగబా కాఫీ తాగి, వేడి నీళ్లు బకెట్టులో పోసుకుని స్నానాలగది వైపు నడిచాడు.
అప్పటికే అందరికోసం ముందు రోజు రాత్రే నుండే దంచి, నానబెట్టి ఉంచిన కుంకుడుకాయ రసం, వాసన సబ్బుతో స్నానం ముగించి, చలితో వణుకుతూ బయట వాకిట్లో వేస్తున్న భోగి మంట వద్దకు వెళ్ళాడు.
అలా ఒకొక్కరు స్నానాలు ముగించి భోగిమంట వద్దకు చేరుకుంటున్నారు.మంటలో ఇంటి మూలల నుండి సేకరించిన పాత సామాగ్రి, చెక్క వస్తువులు, పిడకలు వేస్తున్నారు.
ఈలోగా శాస్త్రిగారి పెద్దమ్మాయి కల్యాణి, ఎక్కడి నుంచో ఒక పాత మంచం కోడును మంటలో వేయడానికి తెచ్చింది.అనేక విధాలుగా విరవడానికి ప్రయత్నించి విఫలమైన ఆమె, చివరికి రైల్వేలో పనిచేస్తున్న తన భర్త రమణకు దానిని విరవమని సైగ చేసింది.ఆయన వల్ల కూడా అది సాధ్యం కాకపోగా, శాస్త్రిగారితో సహా అక్కడనున్న వారందరూ ఆ కర్రను విరవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
జరుగుతున్నదంతా ఒక పక్క నిలబడి నవ్వుతూ గమనిస్తున్న చిన్న అల్లుడు బాబురావు, “వదినగారు! నన్ను ఒక్కసారి ప్రయత్నించనివ్వండి,” అని ఆ కర్రను అందుకోవడాన్ని చూసిన శాస్త్రిగారు, మనసులో ‘మేమే విరవలేని దానిని, సన్నగా, పీలగా ఉండే బాబురావుగారు ఏమి విరవగలరు?’ అని అనుకుని బయటకు మాత్రం మొహమాటంగా, “మీకెందుకండీ శ్రమ, నేను చూసుకుంటానుగా,” అంటూ వారించినా, ఆనాడు శ్రీరామచంద్రుడు సీతాస్వయంవరంలో విల్లు విరిచిన విధంగా, పెద్ద శబ్దం చేస్తూ ఆ కర్రను రెండు ముక్కలు చేసి మంటలో వేస్తున్న అల్లుడిని ఆశ్చర్యంగా చూస్తూ, “కొన్న ఖరీదుకు తగ్గట్టుగా ఉన్నారండీ మీరు,” అన్నారు శాస్త్రిగారు అమాయకంగా.
వెంటనే బాబురావు కూడా “అవునా మావగారు? మరి ఎంత పెట్టి కొన్నారండీ నన్ను?” అని అన్నాడు చమత్కారంగా.
కళ్యాణి పరిస్థితిని చక్కదిద్దుతూ, “ఏమి అనుకోకండి, నాన్న ఏదో తమాషాగా అన్నారు,” అంటూ, “నాన్నా, మాట్లాడడం రాకపోతే మౌనంగా ఉండండి. బాబురావుగారితో ఏమిటలా మాటలా?” అని మందలించిందిశాస్త్రిగారిని.
“అల్లుడుగారు, మేము ఎవరూ చేయలేని పని మీరు అంత సులువుగా ఆ కర్రను విరవడం చూసి అలా అనేశాను. మీరు మరోలా భావించకండి,” అన్నారు శాస్త్రిగారు.
“మీరు నా తండ్రి లాంటి వారు, నేను ఏమి అనుకోలేదు. నేను మీరు అన్నదానికి గమ్మత్తుగా బదులిచ్చాను అంతే. మీరు బాధపడకండి,” అన్నాడు బాబురావు చిన్నగా నవ్వుతూ.
అలా అందరూ పాత వస్తువులను భోగి మంటలో వేసి, కొత్త ప్రారంభాలను స్వాగతించారు.
శాస్త్రి గారి చిన్న అమ్మాయి చిట్టి, రెండో అమ్మాయి మధు ఇంటి గుమ్మానికి పూలమాలలు, మామిడి తోరణాలు కట్టి, వాకిట్లో ఆవుపేడతో కళ్ళాపు జల్లి, అందమైన ముగ్గు వేసి, గొబ్బెమ్మలు పెట్టి, పసుపు, కుంకుమ, పువ్వులతో అందంగా అలంకరించారు.
మధ్యాహ్నం కాంతమ్మ గారు చేసిన కమ్మని పిండి వంటలతో భోజనాలు అయిపోయాక, సాయంత్రం చిన్నపిల్లలకు జరిగే బోగిపళ్ళకు పళ్ళెంలో రేగుపళ్ళు, చిల్లర డబ్బులు, చెరుకు ముక్కలు, పూవులు సిద్ధం చేశారు. వచ్చినవారు కూర్చోవడానికి చాపలు పరిచి, వారికి ఇవ్వడానికి తాంబూలం, శనగలు అమర్చి పెట్టారు. శాస్త్రి గారి ఆ చిన్న రెండు గదుల ఇంటిలో ఒక గదిలో బోగిపళ్ళ హడావిడి జరుగుతుంటే, మరో గదిలో మగవారి పేకాట సందడి సాగింది.
రాత్రి అందరూ వెళ్ళాక,కాంతమ్మ గారు ఇంటినంతా శుభ్రం చేసుకుని,మరుసటి రోజు సంక్రాంతి పండుగ కోసంపసుపు, కుంకుమ,పళ్ళు,తాంబూలం,పూలు అన్నీ సిద్ధం చేశారు.
సంక్రాంతి రోజున అందరూ స్నానం చేసి వచ్చాక, శాస్త్రి గారు, కాంతమ్మ గారు ప్రేమగా ఒక్కొక్కరి చేతిలో బట్టలు పెట్టారు. బాబూరావు మాత్రం బట్టలు తీసుకోనని మొండికేశాడు. “మామయ్యగారు, మీరు నాకు పెళ్లయినప్పటి నుండి ప్రతి ఏటా బట్టలు పెడుతూనే ఉన్నారు. మీరు రిటైర్ అయ్యారు కదా, ఇంకెన్నాళ్లు మా అందరికీ బట్టలు పెడతారు? మేము మీకు ఇవ్వాలి కానీ, మీరు ఇలా మా అందరికీ బట్టలు పెట్టడం సబబు కాదు,” అని అన్నాడు.
దానికి కాంతమ్మ గారు, “అల్లుడు గారు, అలా అనకండి. కొద్ది మొత్తంలో అందరికీ బట్టలు తీసుకున్నాము. ఏడాదికి ఒక్కసారి వచ్చే పండుగ కదా,” అన్నారు అనునయంగా.
“అది సరే అత్తయ్యగారు, కానీ మీరు ప్రతిసారీ ఇలా అప్పు చేసి బట్టలు పెట్టకండి. మాకు మీ ఆశీస్సులు ఉంటే చాలు,” అంటూ సూట్కేసు తెరిచి ఆయన కొని తెచ్చిన కొత్త బట్టలు శాస్త్రి గారికి, కాంతమ్మ గారికి అందించి, వారికి నమస్కరించారు చిట్టి, బాబూరావు దంపతులు. చిన్న అల్లుడు చూపిన ప్రేమ, అనురాగానికి ఆ దంపతుల మనసు సంతోషంతో నిండిపోయింది.
సరదాగా పండుగ మూడు రోజులు గడిచిపోయాయి.అందరూ తిరిగి వెళ్లే రోజు, శాస్త్రిగారిని ఎంత వారించినా వినకుండా, వారిని స్టేషన్ వరకు దిగబెట్టడానికి వణుకుతున్న చలిలో తెల్లవారుజామునే లేచి వారిని దిగబెట్టి వచ్చేసరికి ఆలస్యం అయింది.
ఇంట్లో ఒక నిశ్శబ్దత అలుముకుంది.చిన్న పిల్లల కేరింతలు, ఆటలు, ఆడపిల్లల నవ్వులు, ఎన్నెన్నో కబుర్లు ఏమీ లేవు.
వాలు కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్న శాస్త్రిగారు, వీధి గుమ్మాన పక్షుల కోసం పెట్టిన ధాన్యం, నీటి గిన్నెలు ఖాళీగా ఉండటం చూసి, కాఫీ గ్లాస్ అందిస్తున్న కాంతమ్మగారితో, “కాంతం, అటు చూడు! పక్షులు కూడా మన పిల్లల్లాగే కడుపు నిండా తిని ఎగిరిపోయాయి. ఇక మళ్ళీ మనది ఒంటరి బ్రతుకే,” అంటు ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి.
“అదేమిటండీ అలా బాధపడతారు. మళ్ళీ సంక్రాంతి పండగ రాదా, మళ్ళీ ఇంటికి పిల్లలు రారా?
అయినా మీరు రోజు చదివే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన అమూల్యమైన శ్లోకం గుర్తుచేసుకోండి:
“అసక్తరనభిష్వంగః పుత్రదారగృహాదిషు ।
నిత్యం చ సమచిత్తత్వమ్ ఇష్టానిష్టోపపత్తిషు ।। ”
పిల్లలు, భార్య, ఇల్లు మొదలైన వాటి పట్ల అధికమైన మమకారం ఉండకూడదని, అలాగే ఇష్టమైనవి, ఇష్టంలేనివి జరిగినా చలించకూడదన్నది మనకి కూడా వర్తిస్తుంది కదండీ,” అన్న కాంతమ్మగారి మాటలు విన్న శాస్త్రిగారు, ఒక కొత్త ఉత్సాహంతో లేచి, ఖాళీ అయిన గిన్నెలలో ధాన్యం, నీళ్లు నింపి, ఆకాశం వైపు చూస్తున్న ఆయన కళ్ళలో, మరునాడు వచ్చే పక్షులతో పాటు మళ్ళా సంక్రాంతి పండగకి వచ్చే పిల్లల కోసం ఎదురుచూపు ప్రస్ఫుటమయ్యింది.