ఒడిపిళ్ళు

ధారావాహికం -13వ భాగం

గిరిజన తెగలలో వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు నాగరిక ప్రపంచానికి భిన్నంగా వుంటాయి. అందులో పరజ తెగ సంవత్సరంలో నాలుగు నెలలలో మాత్రమే పెళ్లిళ్లు చేస్తారు. ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నెలల్లో, మార్చి ఏప్రిల్ చైత్రం వారికి, వసంతోత్సవ పర్వం జరిగే కాలం. ఆ రోజుల్లో వాళ్లు రాత్రి పగలు నాట్యాలు చేస్తూ, వేటలతో విందులు చేసుకుంటారు.

ఈ వసంతంలో సాలీ హేమ్లాతో కలిసి అతని భార్యగా నాట్యం చేయాలి అనుకుంది. హేమ్లాకు తనకు కలసి ఒక సొంత ఇల్లు ఉంటుందని, వారిద్దరూ కలిసి అడవికి వెళ్లి ఆకుకూరలు దుంపలు తినడానికి వంటచెరకు తెచ్చుకోవాలనీ.. అతడు పొలానికి వెళ్ళినప్పుడు అతని కోసం మాండ్యా అంబలి సొరకాయ బుర్రలో తీసుకొని పోవాలని అనుకుంది. ఎన్నో కలలు కంటూవుంటుంది. అతనితో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లాలనీ, పెద్దతలలతో పొలుసులు లేకుండా మెత్తగా ఉండే చెంగా చేపలు పట్టి, వాటిని రుచికరంగా వండి, అడవి నుండి ఆకులు తెచ్చి మాండియా అంబలి కొంచెం ఉప్పు కలిపి అతనికి ఇష్టంగా వడ్డించాలని ఏవేవో ఊహించుకుంటుంది. వారిద్దరికీ.. తనకు హేమ్లాకు సొంత ఇల్లు ఉంటుందనే ఆలోచనతో తేలిపోతూ వుంటుంది సాలీ.

హేమ్లా కూడా ఆలోచనల్లో మునిగాడు. ఏమైనా సరే ఏదో ఒకటి చేసి కన్యాశుల్కం కోసం డబ్బు సంపాదించాలి. వడ్డీ వ్యాపారి దగ్గరికి పోవాలనుకున్నాడు. ఆ ఆలోచన భయాన్ని కలిగించింది. వెంటనే తనకు తాను “పెళ్లిబంధంలో ఇరుక్కుంటున్నానా… ఆ విధంగా స్వేచ్ఛ వదులుకోవాలా ?”అనుకున్ళాడు. ఏమో కచ్చితంగా ఇది అని నిర్ణయించుకోలేక పోయాడు. కానీ.. వణికే పెదవులతో కన్నీటితో నిండిన సాలీ ముఖం అతని మనసులో కదలాడింది. అతనిలో అపరాధ భావన కలిగింది. కానీ అతను నిద్రించగానే ఎందరో యువతులు తనకోసం పోటీ పడుతున్నట్టు, అనేక ముఖాలు అతని ఆలోచనల్లో కదలాడాయి.

*** *** *** *** ***

డిసెంబర్ లో వర్షాలు లేవు వడ్డీ వ్యాపారి రామచంద్ర పటేల్ పెద్ద ధాన్యపు గోదామును కొత్తగా తన పొలంలో కట్టిస్తున్నాడు. తనవద్ద ఉన్న చాలామంది గోటీలతోపాటు రోజువారీ కూలీలు కూడా చాలామంది కలిసి పని చేస్తున్నారు. అందులో అమ్మాయిలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సోమ్లా మట్టి గోడ కట్టేందుకు సాయం చేస్తున్నాడు. టిక్యా లోతుగా తవ్విన గుంట నుండి మట్టి ఎత్తే పనిలో ఉన్నాడు. బురద మట్టి ఇసుక మిశ్రమాన్ని తడిగా, జారుడుగా, కలిపి లెక్కప్రకారం కుప్పలుగా తయారు చేస్తున్నారు వారు. వాటిని గోడలు కట్టడానికి ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచుతున్నారు. టిక్యా అటువంటి మట్టి కుప్పల బాధ్యత తీసుకున్న పెద్ద పాలేరు. ఐదుగురు ఆడ కూలీలు మట్టి కుప్ప నుండి పని జరిగే చోటికి మట్టి మోసేందుకు వచ్చారు. వాళ్లు ఖాళీ గంపలతో వస్తే టిక్యా ఆ గంపలను జారుతున్న బురద మట్టితో నింపి వారి తలపైకి ఎత్తాలి .

టిక్యా వయసు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు. తాను మొగవాడిని అనే భావనలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి అతనిలో. బుట్టల నిండా బంకమట్టిని అమ్మాయిల తల పైకి ఎత్తుతున్నప్పుడు ఊహలలో తేలిపోయేవాడు. పనిచేస్తున్నప్పుడు ఆడ కూలీలు ముఖాలను పరిశీలించేవాడు. అతని చూపులు వారి ముఖాలపై వక్షాలపై గిరికీలు కొడుతూ ఉండేవి. పిల్లి కళ్ళ అమ్మాయి మంగ్లీ మట్టి తట్ట అతని చేతుల నుండి ఆమె తల పైకి ఎత్తుకునేప్పుడు పెదవులు సాగదీసి నవ్వు ఆపుకునేది. టిక్యా కూడా చిరునవ్వు నవ్వే వాడు. నువ్వు చాలా బలవంతుడివి అని వెక్కిరించేది అతనిని. ఎందుకు తట్ట మట్టి ఎత్తడానికి ఆయస పడతావు అని అడిగేది. టిక్యా పెదవి కొరుకుతూ నవ్వేవాడు, మంగ్లి వెళ్ళిపోయేది.

తర్వాత రేణి తన తట్టతో సన్నటి కాళ్లతో ఉరుకుతూ వచ్చింది. మట్టితట్ట తల పైకి ఎత్తేప్పుడు ఆమె చిరునవ్వుతో గుస గుస లాడింది. “నా పూలు జారి కింద పడ్డాయి తిరిగి నా తల లో పెట్టవా” అని.

“సరే సరే ఇప్పుడు నీ తట్టని తీసుకొని పో మళ్లీ వచ్చినప్పుడు సర్ది పెడతాను” అన్నాడు టీక్యా.

ఆమె తరువాత తారీ అనే ఆమె వచ్చింది. ఆమె శరీరం నిస్తేజంగా, నగ్నంగా నిలిచేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టున్నది. తన తట్ట తల పైకెత్తేప్పుడు అతని కోసం పడిపోయేట్టు అలసిన కళ్లతో లోతుగా చూసేది. తరువాత నెమ్మదిగా నడుస్తూ వెళ్ళిపోయేది. ఇది ఇలా కొనసాగుతూ ఉండేది. రేణి తిరిగి వచ్చినప్పుడు “నా పూల చెండు నాకు పెడతావా” అన్నది కింద పడ్డ అ పూలను తీసి ఆమె తలలో పెట్టబోయాడు టిక్యా. కానీ.. ఆమె వద్దని అతని మీద పడ్డట్టు అతని చేతిలో పూలను గుంజుకుని తన తలలో కుచ్చంకుంది సున్నితంగా. తన చీరను సర్దుకుంటూ నిలబడింది. కానీ ఊడిన ఆమె చీరను కట్టుకోవడం ఆమెకు కుదరలేదు. మళ్లీ మళ్లీ ఊడదీసి మళ్లీ మళ్లీ కట్టుకుంటూ.. ఇదంతా నీ వల్లే అన్నట్టు చూస్తూ “ఇప్పుడు చూడు ఈ చీరను ఏమి చేసావో ” అని గట్టిగా నవ్వింది.

టిక్యా ఆనందంగా తృప్తి పడ్డాడు. ఆ మట్టి కుప్పకు, ఆ ఆడ కూలీలకు తానే యజమానిగా, అదంతా వారికి పంచుతున్నట్టుగా అనుకొని ఆనందించాడు. రేణి తట్టలో తక్కువ మట్టిని, తారీ తట్టలో ఎక్కువ మట్టిని ఎత్తేవాడు. ఆ అమ్మాయిలు  పనిచేస్తూ కోరస్ గా పాట పాడే వారు. టిక్యా చేతుల నిండా కళ్ళనిండా మట్టితో పాట వింటూండే వాడు.

ఇప్పుడు అతడు ఎదిగాడు. ఆడవారితో మాట్లాడేటప్పుడు అతని రక్తంలో కొత్త తేడా ఏదో తెలుస్తున్నది అతనికి, భయం కూడా అనిపిస్తుంది.

మంగ్లి తన రెండు చేతులతో తన ఒంటిని గోక్కుంటూ, ఇప్పుడు చెప్పు యువకుడా నువ్వు నిజంగా కనిపించినంత బలవంతుడవేనా అంటూ పరిహాసం చేసేది. మిగిలిన వాళ్ళందరూ గట్టిగా నవ్వేవారు. అతని ముఖం మాడ్చుకుని ఉడుక్కునేవాడు. కానీ సర్దుకొని ఒకసారి ధైర్యం తెచ్చుకొని “నీకు నీవే ప్రయత్నించి తెలుసుకో రాదు” అని ఎదురు సమాధానమిచ్చాడు. దానితో అమ్మాయిలంతా గట్టిగా నవ్వారు. టిక్యా చేతులు కట్టుకొని మౌనంగా నిలబడ్డాడు. తన కంగారును కప్పి పుచ్చుకుంటూ..

రేణి ఉరుక్కుంటూ వచ్చి ఆమె రెండు చేతులతో అతని భుజాలు పట్టుకుని వూపుతూ “తొందరగా నా తట్ట నింపు అక్కడ అందరూ మట్టి కోసం నిలబడ్డారు” అన్నది.

అతడు తనమీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అతని నరాల్లో రక్తం అడవి జింకలా పరుగులు పెడుతూ ఉన్నది. లోపల గుండె గర్జిస్తోంది. సెలయేళ్ళు వరదలో కలుస్తునట్టు, అతని చెవుల్లో డప్పులు మోగుతున్నాయి. తల తిరుగుతోంది. ఒక నిమిషం అతడికి ఏమీ కనిపించలేదు కళ్ళముందు తెలుపు నలుపు మచ్చలు తప్ప. ఆ సమయంలో అతనికి అక్కడి నుండి పారిపోవాలనిపించింది.

సోమ్లా మంచి పనిమంతుడు. కానీ అతని పని అతనిని పీడించి ఓడించింది.. మట్టి గోడ కట్టేప్పుడు ఒక ముద్ద పై మరొకటి చేరుస్తూ గోడ పెంచుతున్నప్పుడు అతనికి గతంలోని తన ఆలోచనలు గుర్తుకు వచ్చాయి. తన పిల్లల కోసం ఎన్నో ఇళ్ళు కట్టాలి అనుకున్నాడు. వారి భవిష్యత్తు కోసం ఎన్ని కలలుకన్నాడు. ఇప్పుడు కొడుకుతో కలిసి శ్రమ పడుతున్నాడు. కానీ అవి యజమాని కొరకు కట్టే గోడలు మాత్రమే.. అవి పైకి పైకి లేస్తున్నాయి.. కప్పు కోసం కట్టే చట్రాలకు అడవి తీగలను చుడుతున్నారు. వరి గడ్డితో కప్పు తున్నారు. వడ్డీ వ్యాపారి కోసం కష్టమంతా చేస్తున్నారు..

అది మాత్రమే కాదు..

కొండల కింద పొలాల్లో ఒలిసి మొక్కలు పూలతో ఉన్నాయి. ప్రకృతి దృశ్యమంతా అందమైన వర్ణాలతో నిండిపోయింది. పసుపు రంగు ఒలిసి పూలు, లేత ఆకుపచ్చ రంగులో గడ్డి, నల్లటి బ్యాక్ గ్రౌండ్లో ఆడవి.. ఎత్తయిన పర్వతాలు పక్కనే లోతైన లోయలు కలిసి, జేగురు, కపిల, నీల వర్ణాల పట్టీలుగా కనిపిస్తోంది. కొండలపై గడ్డి మేస్తున్న పశువులు, పొలాల్లో పనిచేస్తున్న మనుషులు చిన్న చిన్న నల్లటి చుక్కల వలె కనిపిస్తున్నారు. అంత అందమైన దృశ్యాన్ని చూసినా.. సోమ్లాకు మాత్రం శూన్యమే కనిపించింది. యాంత్రికంగా పనిచేస్తున్న చేతులు ఒకదానిపై ఒకటి మట్టి వరుసలు పేరుస్తూ షావుకారు ఇంటిని ఎత్తుగా ఇంకా ఎత్తుగా చేస్తున్నాయి.

షావుకారు రామచంద్ర పటేల తలపై గుడ్డ కప్పుకుని, ఎండలో కూర్చుని కొత్తగా కడుతున్న ధాన్యపు కొట్టాన్ని చూస్తున్నాడు. షావుకారుకు పెరిగిన సంపదకు అధికారానికి చిహ్నము అది. అతని గుబురు మీసాలను నిమురుకుంటూ, అక్కడ పనిచేస్తున్న ఆడ కూలీల బిగుతైన దృఢమైన దేహాలను పరిశీలిస్తున్నాడు. వారు తమ మట్టి తట్టలతో నడుస్తున్నప్పుడు, అతని చూపులు వారితో కలిసినప్పుడు భయాన్ని గందరగోళాన్ని కప్పిపుచ్చుకోవడానికి తలవంచుకొని వెళ్ళిపోతారు వారు. కానీ షావుకారు ఎప్పుడూ నవ్వడు.

అప్పుడు సోమ్లా వినమ్రత ప్రదర్శిస్తూ షాహుకార్ దగ్గరకు నడిచాడు. గిరిజనుల వినయం మైదానాల్లో నివసించే వారితో ఏదైనా పని జరగాలంటే లేదా తనకంటే బలవంతులో ధనవంతులో ఎదురైనప్పుడు లేదా ఆ రెండు ఉన్న వారి వద్ద వినయం  ఉంటారు.

“దొరా రెండు రోజులు సెలవు కావాలి” అన్నాడు లోగొంతుతో సోమ్లా.

” ఎందుకు” అని గద్దించాడు షావుకారు.

” నా వరి పొలం కోసుకోవాలి దొరా, ఇది పొలాలు నూర్చుకునే కాలం కదా దొర” అన్నాడు వినయంగా.

“వెంటనే తిరిగిరావాలి.. తెలివి లేని వాడా” అని అరిచాడు షావుకారు.

“తప్పకుండా, నేను ఎక్కువ సెలవు తీసుకోను” అంటూ సోమ్లా తిరిగి తన పని వద్దకు పోయాడు.

షావుకారు తనకు జరిగిన అంతరాయానికి చీదరించుకుంటూ ఆడ కూలీల అర్ధనగ్న శరీరాలను చూడడంలో మునిగిపోయాడు.

మట్టితో నింపిన తట్టను తల పైకెత్తుతున్నప్పుడు ఒలిసి జారీ టిక్యా మీద పడింది. టిక్యా తనను తాను సంభాళించుకోలేక బురదలో పడ్డాడు. మంగ్లి చప్పట్లు కొడుతూ “ఆహా ఎంత గొప్ప బలవంతుడు” అంటూ అరిచింది. అందరూ గొల్లున నవ్వారు. టిక్యా ముఖం చిన్నబోయింది. కానీ చిన్న నవ్వుతో కప్పిపుచ్చుకున్నాడు.

***-*** *** ***

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్క తో ముచ్చట్లు -21

యూరోప్ ట్రిప్ – 12