ఓ ప్రేమ కథ ( మోహన రాగం)

ధారావాహిక నవల

తరుణి పాఠకులకు బాగా పరిచయం ఉన్న కథా రచయిత్రి, నవలా రచయిత్రి లక్ష్మీ మదన్ కలం నుంచి జాలువారిన మరో కొత్త నవలను చదవండి. గత మాసమే ” దొరసాని” ధారావాహిక నవల పూర్తి అయ్యింది. పుస్తకం రూపంలో ముద్రణ లోనూ వచ్చింది. ఇప్పుడు ఈ 2025 ఆగస్ట్ నెలలో కొత్త నవల ” ఓ ప్రేమ కథ” ధారావాహిక నవల ప్రారంభమయ్యింది. చదవండి…

నవల నేపథ్యం:-

” ఓ ప్రేమ కథ” నవల ఏం చెబుతుంది? బాల్యం దాటి కౌమార్యంలో అడుగుపెడుతున్న పిల్లలకి ఒక రంగుల లోకం కనబడుతుంది. ఆడపిల్లలు మగ పిల్లల మధ్య ఆకర్షణ సహజం. కాని, అన్నీ విస్మరించి ఆ భ్రమలో పడితే జీవితం సుఖవంతమవుతుందా?

ఆ ఇద్దరి మధ్య ప్రేమ నిజమైనప్పుడు ఆ ఇద్దరూ వాళ్ళ చదువులను, బాధ్యతలను గుర్తించి, పెద్ద వాళ్ళకు ప్రేమ విషయం చెప్పి, అందరి ఆమోదంతో చేసుకున్న పెళ్లి అందంగా నిలబడుతుంది.

పెద్దవాళ్ళు ఏం చెప్పినా పిల్లల మంచి కొరకే చెప్తారు, ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉంటే నిలుస్తుంది, జీవితంలో విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకముండాలి. పెళ్లి చేసుకుంటే వీళ్లిద్దరి జీవితం ఆనందంగా ఉండటమే కాకుండా కన్నవాళ్ళకి తృప్తిని కూడా మిగిల్చిన వాళ్ళం అవుతామనే ఆలోచన ఉండాలి.

“ఓ ప్రేమ కథ” నవలలో ఈ యువ జంట మధ్య ప్రేమ ఎలా చిగురించింది? దాన్ని వాళ్ళు పెళ్ళి దాకా తీసుకొని వెళ్లారా లేదా ? గెలిచారా? ఓడారా ? జీవితంలో ఏం సాధించారు అనేదే ఉత్కంఠగా సాగడమే ఈ నవల ప్రత్యేకత.
                                                                                                 – సంపాదకులు

 

” ఏరా ! టెన్త్ రిజల్ట్స్ వస్తాయి పేపర్ తొందరగా తీసుకొని రా, చెల్లి రిజల్ట్స్ చూడాలి” అన్నాడు దక్షిణామూర్తి.

“తీసుకొచ్చాను నాన్న. రిజల్ట్స్ కోసమే నెంబర్ వెతుకుతున్న”అన్నాడు అనురాగ్.

పక్కనే కూర్చున్న చెల్లి రాగమాల టెన్షన్ పడుతూ ..

“అన్నా! తొందరగా చూడు” అని అంటుంది.

“చూస్తున్న చూస్తున్న” అంటూ పేపర్ అంతా తిరిగేస్తున్నాడు అనురాగ్.

“ఇక్కడ నీనంబర్ కనిపించడం లేదు” అన్నాడు అనురాగ్

“అవునా”అంటూ గట్టిగా ఏడ్చేసింది రాగమాల.

“అరెరే! ఏడవకు ఊరికే అన్నాను. నీ నెంబర్ సెకండ్ లిస్ట్ లో ఉంది. అంటే నువ్వు సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యావు”అని గట్టిగా అరిచాడు అనురాగ్

అక్కడే ఉన్న దక్షిణామూర్తి “ఎందుకురా దాన్ని అలా ఏడిపిస్తావు?”అంటూ రాగమాలను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు.

అక్కడే వత్తులు చేసుకుంటూ కూర్చున్న నాయనమ్మకు మాత్రమే ఏమీ అర్థం కాలేదు.
కానీ చెవులు రిక్కించి వినసాగింది.

“హూ! నాకు ఏది చెప్పరు. మీరే మాట్లాడుకుంటారు”అంటూ ఒక్క మూ లుగు మూల్గింది.

రాగమాల తల్లి కూడా లోపల ఎక్కడో పనిచేసుకుంటూ కూర్చుంది. వంటింటికి మనసాల కి మధ్య చాలా దూరం. వీళ్ళేమో భవంతిలో కూర్చున్నారు.

“ఒరే అనురాగ్! లోపలికి వెళ్లి మీ అమ్మని పిలుచుకొని రా! అలాగే వచ్చేటప్పుడు పంచదార డబ్బా తీసుకొని రా! అందరం నోరు తీపి చేసుకుందాం”అన్నాడు దక్షిణామూర్తి.

లోపలికి వెళ్లి అనురాగ్ తల్లిని తీసుకొని వచ్చి, విషయం తల్లికి చెప్తూ అలాగే నాయనమ్మకి కూడా చెప్పబోయాడు.

” నాయనమ్మ! విన్నావా? రాగ మాల కు” అని చెప్పే లోపల..

“ఏంట్రా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చూడాలి మరి.అప్పుడే పద్నాలుగు ఏళ్లు వచ్చాయి. నాకు ఐదేళ్ళకే పెండ్లి అయ్యింది” అన్నది నాయనమ్మ.

“అమ్మా! ఇది మీకాలమా? ఇప్పుడు చదువు ముఖ్యం. నీకెప్పుడు పెళ్లి ధ్యాసనే” అన్నాడు దక్షిణా మూర్తి.

తల్లి ఎంతో సంతోషపడింది. నాయనమ్మ బోసి నవ్వుతో ..

ఇంకేంటి ? పదవ తరగతి చదివింది కదా ఇక చాలు. ఇక మా రాగమాలకు పెళ్లి జరుగుతుందన్నమాట”అన్నది నవ్వుతూ.

“చి, చి పెళ్ళంట. నాయనమ్మ! చక్కగా నేను పాస్ అయ్యాను. కాలేజీకి వెళ్లి చదువుకోవాలి”అన్నది కోపంగా.

అదేమీ అర్థం కాని నాయనమ్మ లోపలే మాట్లాడుకుంటూ వత్తుల బుట్ట తీసుకుని లోపలికి వెళ్ళింది.

అప్పట్లో టెన్త్ క్లాస్ పాస్ కావడమే గొప్ప విషయం. క్లాస్ లో ఉన్న ఎనభై మందిలో పదిమంది పిల్లలు మాత్రమే పాసయ్యారు. అందులో ఇద్దరు ఆడపిల్లలు అంతే. అందుకే ఆ రోజుల్లో అది గర్వకారణమే. అసలు స్కూలుకు పంపడమే చాలా కష్టం. అందులో కాలేజీకి వెళ్లడం అంటే చాలా అరుదుగా ఉండేది.

రాగమాలకు టెన్త్ క్లాస్ పాసైన సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో కాలేజీ లేదు. దూరంగా ఉన్న టౌన్ లో చేర్పించాలని తండ్రి నిర్ణయించుకున్నాడు.

స్కూల్ లైఫ్ ఎంత బాగా గడిచింది.ఆడుతూ పాడుతూ నిన్నా మొన్నటి వరకు అందంగా గడిచింది.అందులో పుట్టిన ఊరు. స్థాన బలం ఎక్కువ. ఇప్పుడు వేరే చోటికి వెళ్ళాలంటే బాధగా ఉంది. తన స్నేహితులు అందరూ ఆ ఊళ్లో ఉంటారు.ఒక్క రోజు స్కూల్ మానకుండా వెళ్ళేది.చదువుతో పాటు ఆటలు.టీచర్స్ తో సాన్నిహిత్యం ఎంతో బాగుండేది.బాగా చదువుకునే పిల్లలంటే అందరికీ ఇష్టమే.చదువుతో పాటు అల్లరి కూడా బాగా చేసే వాళ్ళు.ఇవన్నీ గుర్తుకు వచ్చి..

“నాన్న నేను వేరే ఊర్లోకి చదువుకోడానికి వెళ్ళను. మన పక్క ఊర్లో కాలేజీ కొత్తగా అయ్యిందంట. రోజూ ఇక్కడ నుండి బస్సు వెళుతుంది. నేను అలాగే వెళ్లి వస్తాను నాన్న! నేను వేరే చోట ఉండను”అంటూ ఏడ్చింది రాగమాల.

“అలా అంటే ఎలా తల్లి! అది పెద్ద కాలేజ్. అందులో ఇంగ్లీష్ మీడియంలో నిన్ను చేర్పించాను. మన చుట్టాల ఇంట్లో ఉండాలి నువ్వు. వాళ్ళు నిన్ను మంచిగా చూసుకుంటారు”అని చెప్పాడు.

రాగమాలకు ఇంకా బాధ ఎక్కువైంది. కానీ ఎవరికీ చెప్పకుండా పెరట్లోకి వెళ్లి అప్పుడప్పుడు ఏడుస్తూ వచ్చేది.మొక్కలతో మాట్లాడుతూ ఉండేది.చిన్నప్పటి నుండి ఆమెకి ఇలా ప్రకృతి తో ముచ్చటించడం అలవాటు.

“నేను వేరే ఊరికి వెళ్లి చదువుకోవాలి. మీరు నన్ను వదిలి ఉంటారా? సెలవులకి వస్తాను” అంటూ కబుర్లు చెప్పేది.

ఇంటి గోడల మీద తన పేరు రాసుకుని మురిసి పోయేది.ఇంటి పక్కన ఉన్న గుడిలో కి వెళ్ళి పూలన్నీ ఏరుకుని వచ్చి దండలు అల్లి దేవుడికి వేసింది.దూరంగా వెళుతున్న అనే బాధ ఎక్కువయ్యింది.

చివరికి వెళ్ళాల్సిన రోజు వచ్చింది. అన్న సహాయంతో వేరే ఊరికి వెళ్లడానికి సిద్ధపడింది. బస్సులో అన్న పక్కన కూర్చుంది. కానీ ఏడుపు వస్తుంది. అలాగే ఏడుపు దిగమింగుకుని కిటికీలో నుండి చూస్తూ కూర్చుంది.

బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు రాగమాల అన్నయ్య అనురాగ్.

అప్పటివరకు ఊరు దాటని రాగమాలకి, ఆ వాతావరణం కొత్తగా అనిపించింది.

వాళ్ళందరూ పలకరిస్తున్నా కూడా మౌనంగా అలాగే కూర్చుంది. రాగమాల తో వచ్చిన అన్న అనురాగ్ రెండు రోజులు ఉండి తనకు సెలవు లేదని చెప్పి వెళ్ళిపోయాడు.

తెల్లవారి భయంగా ఇంటి పక్కన ఉన్న చుట్టాల అబ్బాయితో కాలేజీకి వెళ్ళింది రాగమాల.

వెతుక్కుంటూ వెళ్లి లేడీస్ లో రూం కూర్చుంది. ఎంతో మంది పిల్లలు ఉన్నారు.ఎవరి ధ్యాసలో వాళ్ళు ఉన్నారు.”స్కూల్ లో అయితే ఎంత బాగుండేది” అనుకుంది.

మెల్లగా క్లాస్ లోకి వెళ్ళింది. అలాగే కూర్చుంది. అందులో అది తెలుగు క్లాస్. ఆ పీరియడ్ అయ్యాక మరో నలుగురు ఆడ పిల్లలు వచ్చారు.వాళ్లతో పరిచయం చేసుకుంది.

కొన్ని రోజులు అయ్యాక అందరితో మాట్లాడటం మొదలు పెట్టింది.

అదే క్లాసులో కొన్ని నెలలు అయ్యాక, కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడు.

అబ్బాయి చూడటానికి తెల్లగా అందంగా ఉన్నాడు. హైట్ మాత్రం తక్కువ. కానీ అతని ముఖంలో కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. అసలు నా అంతటి వాళ్లు లేరు అన్నట్లుగానే ఉండేవాడు.

కాలేజీలో కి వచ్చిన కొన్ని రోజుల్లోనే అతను అందరికీ తెలిసిపోయాడు. దానికి కారణం ఒకటి ఉంది.

క్లాసులో లెస్సన్ అయ్యేటప్పుడు అందరూ నిశ్శబ్దంగా కూర్చునేవారు. క్లాస్ అయిపోగానే లెక్చరర్ “ఏమైనా డౌట్స్ ఉన్నాయా”? అని అడిగే వారు.

వెంటనే కొత్తగా క్లాసులోకి వచ్చిన అబ్బాయి మోహన్ లేచేవాడు.. తనకున్న డౌట్స్ అన్ని అడిగేవాడు.

అలా తొందరలో అతను ఎవరో అందరికీ తెలిసిపోయింది.

ఇంక ఆడపిల్లలు అందరూ మాట్లాడుకుంటుండేవాళ్ళు. క్లాస్ అయిపోతుంది అనగానే “ఇంక లేస్తాడే మాస్టర్ ఆఫ్ డౌట్స్” అని నవ్వుకునేవాళ్ళు.

అతను ప్రశ్నలు అడుగుతున్నంతసేపు ఆడపిల్లలంతా నవ్వుకునే వాళ్ళు. కానీ ఇవన్నీ ఏవి పట్టనట్టుగా అతను తన ప్రశ్నలు తాను అడిగేవాడు. అడిగి ఊరుకుంటాడా? అలాగే పుస్తకాలు పట్టుకొని లెక్చరర్ తో పాటు వాళ్ళ రూంలోకి వెళ్ళిపోయాడు..

“బాబోయ్ లెక్చరర్స్ తల తింటాడు ఇతను. ఏం డౌట్స్ అడుగుతాడబ్బా లోపలికి వెళ్లి కూడా” అని నవ్వుకునే వాళ్ళు.

అలా అతను “మాస్టర్ ఆఫ్ డౌట్స్” అయ్యాడు.

రాగమాల కొంచెం రిజర్వుడ్ గా ఉండే టైపు. అలాగని మరీ మూతి ముడుచుకుని కూర్చునే రకం కాదు. తన మనస్తత్వంతో అవతలి వారు కలిసిపోతే, వారిని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటుంది.

ఇంగ్లీష్ మీడియంలో చేరిన రాగమాలకి, అడ్జస్ట్ కావడానికి కొంచెం టైం పట్టింది. ఈ కొత్తగా వచ్చిన మోహన్ మాత్రం ఇంగ్లీషులో మాట్లాడుతూ అదరగొట్టేవాడు. అందులో మిస్టేక్స్ ఎన్ని ఉన్నాయో! తెలువదు. కానీ అతని కాన్ఫిడెన్స్ చూస్తే లెక్చరర్స్ కి ముచ్చట వేసేది. అలాగని అమాయక చక్రవర్తి ఏమి కాదు.

కొంత మంది అమ్మాయిలు క్లాసులో లంచ్ బాక్స్ తెచ్చుకునే వాళ్ళు.మగపిల్లలైతే సైకిల్ మీద ఇంటికి వెళ్లి తిని వచ్చే వాళ్ళు. అప్పటివరకు బాక్స్ తెచ్చుకోవడం అలవాటు లేని రాగమాల, ఉదయం భోజనం చేసి కాలేజీకి వచ్చేది .అందులో బంధువుల ఇంట్లో ఏదైనా అడగటానికి మొహమాటం. స్కూల్లో ఉన్నప్పుడైతే ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళే వాళ్ళు.

ఇప్పుడు కాలేజ్ చాలా దూరం. అందుకని ఆకలి వేసినా, అలాగే కూర్చునేది.

బంధువుల ఇంట్లో కూడా వాళ్ళ నాయనమ్మ లాగా ఒక ఆవిడ ఉండేది. చాలా బాగా పలకరించే వారు. మడి ఆచారాలు ఎక్కువ.ఆవిడ కొడుకు కోడలు చిన్న వయసు వాళ్ళు. ఒక బాబు ఉండేవాడు. వాడితో ఎక్కువగా ఆడుకునేది .ప్రతీ శుక్రవారం శ్రీచక్ర అర్చన జరిగేది. ఆ పూజలో పాల్గొనడం ఆమెకు చాలా ఇష్టంగా ఉండేది.ఇంటి ఎదురుగా సత్య నారాయణ స్వామి దేవాలయం.రోజు వెళ్లడం అలవాటు చేసుకుని, ఆ ఇంట్లో చక్కగా ఇమిడి పోయింది.

ఒకరోజు ఆ పెద్దావిడ.. “రాగా!అన్నం డబ్బా తీసుకెళ్ళు. ఆకలితో ఎలా ఉంటావు” అని చెప్పింది.

“సరే” అని తల ఊపింది రాగమాల.

కాలేజ్ కి వెళ్లే సమయానికి వాళ్ల కోడలు లంచ్ బాక్స్ఇచ్చింది. ఆ బాక్స్ చూశాక ఆమెకు పైప్రాణాలు పైకే పోయాయి.

అది ఒక పాత అల్యూమినియం బాక్స్. అది కూడా లోపల పడేసి ఉన్నది కాబోలు.నల్లటి మరకలు ఉన్నాయి. ఆ బాక్స్ చేతిలో పెట్టింది ఆమె కోడలు.

విధిలేక బాక్సును తీసుకుని వెళ్ళింది. లంచ్ టైంలో అందరూ టేబుల్ పైన బాక్సులు పెట్టుకొని భోజనం చేయసాగారు. తన బాక్స్ ఓపెన్ చేయడానికి రాగమాలకి ఇబ్బందిగా అనిపించింది. అప్పుడే తన స్కూల్లో చదువుకున్న ఒక ఫ్రెండ్ వచ్చింది.

“ఏంటే ఇంకా బాక్స్ ఓపెన్ చేయలేదు”? అన్నది.

మెల్లిగా తన బాక్స్ ఓపెన్ చేసింది.

అందరూ ఆ లంచ్ బాక్స్ ను వింతగా చూశారు. చాలా సిగ్గుగా అనిపించింది. అసలు అన్నం తినాలనిపించలేదు. రెండు ముద్దలు తినేసి, బాక్స్ క్లోజ్ చేసి బ్యాగ్ లో పెట్టేసుకుంది.

అంతే! ఆ రోజు నుండి తెనాలి రామకృష్ణుడి పిల్లికి పట్టిన గతి తలుచుకుని, లంచ్ బాక్స్ తీసుకెళ్లలేదు. కాలేజీ డేస్ మొత్తము ఆకలితో నకనకలాడుతూనే ఉంది. పిచ్చి గాని రాగమాలకు ఒక మంచి బాక్స్ కొనాలని ఆలోచన కూడా రాలేదు. అంతటి అమాయకత్వం.

ఒకసారి ఇంటి నుండి కాలేజీకి వెళ్తుంటే దారిలో ఒక స్కూల్ గ్రౌండ్ వచ్చేది. అలా మామూలుగా నడుచుకుంటూ వెళుతున్న ఆ అమ్మాయి పక్కకు తిరిగి గోడకేసి చూసింది. ఆ గోడ మీద తన పేరు క్లాసు ఊరు అన్ని రాసి ఉన్నాయి. ఒక్కసారిగా అది చూడగానే భయమేసింది అదే తన ఊర్లో అయితే ఇంత భయపడేది కాదు. కాలేజీకి టైం అవడం వల్ల తొందర తొందరగా వెళ్ళిపోయింది కానీ మనసులో అంతా అదే గుర్తుకు రాసాగింది. ఇంటికి వెళ్లేటప్పుడు మెల్లగా అటు ఇటు చూసి ఒక పేపర్ తీసుకొని అదంతా చక్కగా తుడిచివేసింది. అప్పుడు కొంచెం ఆందోళన తగ్గి నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయింది.

ఒకరోజు రెండు పీరియడ్స్ ఫ్రీ గా ఉన్నాయి. అప్పుడు కాలేజీకి దగ్గరలో ఒక శివాలయం నిర్మిస్తున్నారని తెలిసింది. స్నేహితులందరూ కలిసి ఆ ఆలయానికి వెళ్లారు. అక్కడ శివలింగం ప్రతిష్టకు ముందు మట్టితో చిన్న చిన్న శివలింగాలు కోటి వరకు చేసి ఆ లోపల వేసి ప్రతిష్ట చేయాలని సంకల్పం అందుకని వెళ్ళిన వాళ్ళందరూ వాళ్లకు తోచినన్ని శివలింగాలు చేసి వచ్చేవాళ్లు. అలా ఈ పిల్లలందరూ కలిసి శివలింగాలను చేసి ఇచ్చి వచ్చారు ఆ గుడికి వెళ్ళిన ప్రతిసారి రాగమాలకి శివలింగాలు చేసిన విషయం గుర్తుకు వచ్చేది.

అలా ఎన్నో సంఘటనలతో జరిగి ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసుకుంది. ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. సెలవులకు ఊరికి వెళ్ళిపోయింది రాగమాల.

ఊరికి వెళ్ళిన రాగమాలకి సెలవులు చాలా సంతోషంగా గడిచిపోయాయి. ఇంటికి దూరంగా లేని రాగమాలకి ఇల్లు వెలివేంటో తెలిసి వచ్చింది. ఆ సెలవుల్లో అక్క మాలతి అన్న అనురాగ్ కూడా వచ్చాడు.

రోజు నాయనమ్మ చేసే వంటలు ఆమెతో చిలిపి తగాదాలు చాలా బాగుండేది. సాయంత్రాలు నాయనమ్మ మంచి మంచి కథలు చెప్పేది. చక్కని పాటలు పాడేది. ఎన్నో యాత్రలు చేసి వచ్చిన నాయనమ్మ వాటిని కథలుగా ఎంతో అద్భుతంగా చెప్పేది. సోమనాథ్ లో ఆమె చూసిన సముద్రం గురించి వర్ణించి చెప్పేది. అలలు తీరానికి తాకి మళ్ళీ లోపలికి ఎలా వెళ్తాయో చక్కగా చూసినట్లు చెప్పేది అవన్నీ వింటుంటే రాగమాలకు ఎప్పుడెప్పుడు సముద్రం చూద్దామా అనిపించేది. వేసవిలో నాయనమ్మ పెట్టిన ఆవకాయ రుచి ఎంతో అద్భుతంగా ఉండేది. ఆరు బయటపడకలు, చుక్కలతో చక్కని ముచ్చట్లు, పున్నమి వెన్నెల ఆస్వాదన కొబ్బరాకుల గలగలలు ఇవన్నీ వేసవి వేడిని మరిపింప చేసేది.

మోహన్ వాళ్ళింట్లో కూడా ఎంతో సందడిగా ఉంది. సెలవుల్లో వారికి సంబంధించిన బంధువులందరూ వచ్చారు వాళ్ళ పిల్లలతో అసలు సమయమే తెలియలేదు.

పొలానికి వెళ్లడం, మామిడి చెట్ల కాయలన్నీ కోయడము, అక్కడి చెరువులో ఈత నేర్చుకోవడం ఇలాంటివన్నీటితో అద్భుతంగా సెలవులు అన్ని గడిచాయి. అమ్మమ్మ తాతతో గడపడం మోహన్ కి చాలా ఇష్టం. అమ్మమ్మ చేసే తపాలా రొట్టెలు ఇష్టంగా తినేవాడు. పెద్ద మనవడని కాసింత ప్రేమ ఎక్కువగానే ఉండేది. తాతతో కలిసి పొలానికి వెళ్లడం పక్క ఊళ్ళల్లో శ్రీరామనవమి చందాల కోసం వెళ్లడము ఇదంతా ఇష్టంతో చేసేవాడు.

సెకండ్ ఇయర్ కి వచ్చాక రాగమాల కజిన్ బ్రదర్ ఒకతను అదే కాలేజీలో జాయిన్ అయ్యాడు.

రాగమాల కన్నా మూడేళ్లు పెద్దవాడు. కానీ టెన్త్ క్లాసులో ఎక్కువ సార్లు ఫెయిల్ కావడంతో రాగమాలతో సమానంగా వచ్చాడు. ఆ విషయం అతనికి చెప్పుకోవడం ఇష్టం లేదు. అందుకని అందరికీ రాగ మాల మా అక్క అని చెప్పే వాడు. ఎందుకంటే సేమ్ క్లాస్ నుండి ఇంకా తక్కువ క్లాసులోకి వెళ్ళాడు. రాగమాల సెకండ్ ఇయర్ ఉంటే అతను ఇంటర్ ఫస్టియర్ లో ఉన్నాడు.

ఒకరోజు ‘రాగ మాల మా అక్క అని ఎవరికో చెప్తుంటే, అది విన్న ఆమెకి కోపం వచ్చింది. “నాకన్నా అంత పెద్ద వాడివి నన్ను అలా పిలుస్తావా” అనుకుని…

“ఒరేయ్ సూర్యం! ఇలా రారా! వెళ్లి టీ పెట్టుకుని రా?” అని చెప్పింది.

ఇది ఊహించని సూర్యం కోపంగా చూసి..

“వాళ్ళు వెళ్ళాక నీ పని చెప్తా !”అని సైగ చేశాడు వేలు చూపిస్తూ ..

వాళ్ళు వెళ్ళాక గొడవకు దిగాడు సూర్యం.

“నన్ను పేరుతో పిలుస్తావా? అందులో ఒరేయి అంటావా?” అన్నాడు.

“మరి నన్ను అక్క అని చెప్పావు కదా !మరి వాళ్లకు డౌట్ రాదా? అందుకని అలా పిలిచాను” అన్నది నవ్వును దాచుకుంటూ రాగ మాల..

జీవితంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతాయి కదా! అలాగే ఒక సంఘటన జరిగింది.

రాగమాల తండ్రి దక్షిణామూర్తి గారికి రాగమాల చదివే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. బంధువుల ఇల్లు కాలేజీకి చాలా దూరంగా ఉండేది. రోజు నడిచి వెళ్లడం చాలా కష్టంగా ఉండేది .ఈ అనుకోని సంఘటన రాగమాలకి ఎంతో సంతోషం కలిగించింది.

దక్షిణామూర్తి ఒక అద్దె ఇల్లు తీసుకున్నాడు. అది కాలేజీకి దగ్గరలోనే ఉంది. దక్షిణామూర్తికి కూడా ఆఫీస్ కి చాలా దగ్గర. వరుసగా పన్నెండు పోర్షన్లు ఉన్నాయి .అన్ని మూడు గదుల ఇళ్ళు. అప్పట్లో అద్దెకు ఇవ్వడానికి ఇలాగే కట్టేవారు. అందులో ఓనర్స్ కూడా ఉండేవారు. మూడో పోర్షన్ దక్షిణామూర్తి గారిది.

మూడు గదులు వైశాల్యంలో సమానంగా ఉండేవి. ముందు గదిలో ఎవరైనా వస్తే కూర్చోవడానికి రెండు ఇనుప కుర్చీలు ఉండేవి. మధ్య గదిలో బట్టల కోసం రెండు సూట్ కేసులు. పడుకునే బట్టలు. ఒక చిన్న అల్మారాలో డ్రెస్సింగ్ సంబంధించిన సామాను ఉండేది. ఇక చివరిది వంటగది. అందులో ఒక చిన్న కిరోసిన్ స్టవ్, చిన్న గిన్నెలు నాలుగు, గ్లాసులు ,చిన్న చిన్న డబ్బాలు కొన్ని అంతే. ఎందుకంటే ఉండేది ఇద్దరే కాబట్టి ఎక్కువ సామాను తెచ్చుకోలేదు.

రాగమాలకు ఎంతో సంతోషంగా అనిపించింది. తండ్రితో ఉండడం మరీ సంతోషంగా ఉంది. రాగమాలకు తండ్రి అంటే పంచ ప్రాణాలు. అలాగే భయం కూడా. దక్షిణామూర్తి కూడా చిన్న కూతురిని గారాబంగా చూసేవాడు. రాగమాల కన్నా పెద్ద అమ్మాయి మాలతీ కి చిన్నప్పుడే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు. అనురాగ్ పీజీ చేస్తున్నాడు. ఇక రాగమాల తల్లి, నాయనమ్మ చదువుకోవడానికి వచ్చిన బంధువుల పిల్లలు, ఊళ్లో ఉండేవాళ్లు. వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి ఇంటికి తాళం వేయడం ఉండదు.

ఇప్పుడు రాగమాలకి కాలేజీకి వెళ్లడం చాలా సులభం అయ్యింది. ఉదయమే తండ్రి చక్కగా వంట చేసి పెట్టేవాడు.

“నేను వంట చేస్తాను నాన్న! అందరూ నాకు వంట రాదు అనుకుంటారు. ఊరికే నువ్వే చేస్తే ఎలా?”అని అడిగేది రాగ మాల .

“పరవాలేదమ్మ! నువ్వు చదువుకో. పొద్దున్నే నాకేమీ పని ఉండదు కదా! వంట పని పెద్ద కష్టమేమీ కాదు” అని చెప్పేవాడు.

వంట పనే కాకుండా గిన్నెలు కడగడం కూడా అతనే చేసేవాడు. ఒక్కొక్కసారి కోపం వచ్చేది. పక్క పోర్షన్ల వాళ్ళు అడిగేవాళ్లు..

“ఏమ్మా రాగా! నీకు వంట రాదా? ఎప్పుడు మీ నాన్న చేస్తాడు”అంటూ వెటకారపు మాటలు మాట్లాడేవాళ్లు.

రాగమాలకీ నాన్న మీద అప్పుడు కోపం వచ్చేది?” ఎప్పుడూ ఇంతే నన్ను చేయనివ్వరు” అని అనుకునేది. ఒక్కొక్కసారి నాన్న స్నానం చేయక ముందే, తానే స్నానం చేసి ,స్టవ్ దగ్గర కూర్చోనీ, వచ్చి రాని వంట చేసేది.

ఇక అసలు విషయం ఇప్పుడే మొదలయ్యింది. అప్పట్లో గవర్నమెంట్ bఆఫీస్ వాళ్ళకి శని, ఆదివారాలు సెలవు ఇచ్చే వాళ్ళు. తండ్రి శుక్రవారం రాత్రి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయేవారు. రాగమాలను పక్కింటి బామ్మ గారి ఇంట్లో పడుకోమని చెప్పేవారు.

వాళ్ళ ఇంట్లోకి వెళ్లి పడుకునేది. కానీ చదువుకోవాలంటే కుదిరేది కాదు.బామ్మ,తాతయ్య చెడిపోయిన లారీ చప్పుడులా గురక పెట్టీ నిద్రపోయే వాళ్ళు.

కొన్నాళ్ళకి పక్క ఇంట్లో టెన్త్ చదివే అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చదువుకోవడానికి రాగమాల దగ్గరికి వచ్చేది. అలాగే దక్షిణామూర్తి గారు ఊరికి వెళ్ళినప్పుడు ఇక్కడే పడుకునేది. ఆమెకు పెద్ద సమస్య తీరిపోయినట్లయింది .

రాగమాల నాన్నగారు, మోహన్ నాన్నగారు రామారావు గారు ఒకే ఆఫీసులో పనిచేసే వాళ్లు. ఆ విషయం రాగమాలకి కానీ, మోహన్ కి కానీ తెలియదు.

ఒక రోజు సూర్యంతో మోహన్ వీళ్లింటికి వచ్చాడు. మోహన్ ను చూసి ఆశ్చర్యపోయింది రాగమాల.

“వీడు నా ఫ్రెండ్ మోహన్. వీడు కూడా మన కాలేజీనే”అని చెప్పాడు సూర్యం.

“ఆ!! అవును”అన్నది రాగమాల. ఆ అబ్బాయి మాత్రం తల అటు తిప్పి కూర్చున్నాడు.

“చెల్లి !ఇంతకు నేను వచ్చిన విషయం ఏంటంటే ,వీడికి ఫిజిక్స్ బుక్ కావాలట. నీ దగ్గర ఉందా”? అని అడిగాడు.

“ఉంది” అని తల ఊపి తెచ్చి ఇచ్చింది రాగ మాల.

అలా మొదటిసారి వాళ్ళిద్దరూ కలుస్తున్నారు.

ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేదు.

అలా మధ్య మధ్యలో సూర్యంతో బుక్స్ కోసం వచ్చే వాడు. కానీ ఒక్కరోజు కూడా బుక్స్ తీసుకున్నందుకు థాంక్స్ కూడా చెప్పేవాడుకాదు. ఈ విషయం లో రాగ మాలకు చాలా కోపం వచ్చింది.

ఒకసారి సూర్యంతో చెప్పింది.

” ఏంటి, అతను బుక్స్ తీసుకెళ్తాడు. కనీసం థాంక్స్ కూడా చెప్పడా? అయినా కూడా అతనికి నోరు లేదా? ఎప్పుడూ నువ్వే అడుగుతావు?”అన్నది రాగమాల.

ఈ విషయం మొహన్ కి చెప్పాడు సూర్యం.

అప్పుడు అతనికి కోపం వచ్చిందని సూర్య చెప్పాడు.

“వస్తే రాని” అని అనుకుంది రాగమాల.

ఒకరోజు ఉదయం కాలేజీకి వెళ్లడానికి తయారవుతుంది రాగమాల.

దక్షిణామూర్తి కూడా ఆఫీసుకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.

అప్పుడే ఇంటి ముందు సైకిల్ ఆగింది.

ఎవరో వచ్చారని బయటకు చూసింది రాగమాల.

ఇంటి ముందు సైకిల్ స్టాండ్ వేస్తూ లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి కంగారు పడింది రాగమాల..

సైకిల్ స్టాండ్ వేస్తూ మోహన్ కనిపించాడు.

“అదేంటి? ఇతను వస్తున్నాడు” అని కంగారు పడింది.

సశేషం

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆదిలోనే హంస పాదు

మహిళ