అమాయకత్వం రూపుదిద్దుకున్న అమ్మాయినై
దిక్కులందని ఆకాశంలా విస్తరిద్దామని
నలువైపులా ఎల్లలెరుగని సముద్రమై చొచ్చుకుపోయాను
ఎన్ని చూపులకో నర్తించే నెమలీకనయియితే
మరెందరి కళ్ళకో అందమైన పాదాలకు అలదుకున్న
లాక్షారుణ రస దీపికను
అచ్చంగా వెన్నెల మడుగులా కదిలే హంస నడకల ఊహలమీద
గుప్పెడు చీకటిని చిమ్మి
కళంకాల కథలు రాయాలని పలవరించిన విషజ్వర జీవులు ఎన్నో
భళ్ళున పగిలి ముక్కలైన ఎన్ని అనుభవల్లోంచో పుట్టుకొచ్చినా
కొత్తగా రెక్కలుతొడుక్కున్న సీతాకోకచిలుకనైపోయి కలల పరిమళాలను
గుప్పిళ్ళతో వెదజల్లుతూ సాగే అక్షర ప్రవహాన్ని
ఎన్ని ఎదురు దెబ్బలు తగిలి
ప్రాణం జివ్వుమంటూ జిలార్చుకు పోయినా
నాకు నేనే ఓదార్పునై తేమ తాకగానే తేరుకునే
దేవగన్నేరు పువ్వై సౌరభాలూ సౌందర్యాలను
అడుగడుగునా సింగిణీ పతాకాలుగా ఎగరాసును కదా.
సీమంతాల పరువంలో ఏకాంత సీమంతినై
ఎన్నయుగాలు అడుగడుగునా జీవితం పుటలను తిరగెయ్యలేదు.
ఎన్ని సార్లు నరికి ముక్కలు చేసినా
చినుకు రక్తపు బొట్టునుండి కొత్త జీవితాన్నై మొలకెత్తలేదు?
విసిగి వేసారిన క్షణాల్లో తీయని మౌన సరగాల వలలోపడి
ఉదయం వెలుగుల్లో బాహాటంగా దోచుకు వెళ్ళిపోయే
నీ నీడను కూడా అందుకోలేక పరితపించలేదు?
ఎంత బుద్ధి కుశలతా, ఎంత తెగువా ఎంత స్థిరచిత్తం
చిత్తు చేసే నటసార్వ భౌములకు బాగాతెలుసు ఏరు దాటి తెప్ప తగలెయ్యడం
అలవితప్పిన క్షణం తిరస్కారం సయనైడ్ రుద్దిన చూపును గుచ్చి
ఒకప్పుడు నువ్వే లోకమన్న జీవితాన్ని తృణీకరించడం.