తోడూ  నీడ

కథ

టింగ్, టింగ్,  బెల్ అదే పనిగా మోగుతుంటే.” ఏమండీ మీరు ఇక్కడే ఉన్నారు బెల్ మోగుతుందివెళ్లి  తియ్యొచ్చు  కదా! వంట గదిలో ఉన్న నేను పరిగెత్తుకుంటూ రావాలేంటి,  ఒరేయ్ ఈ పిల్లలు మీరు మీ వీడియో గేమ్ తప్ప

ఇవతల  ఏమవుతున్నా   చూసేది లేదు   ఒంటి మీద ధ్యాస  లేకుండా ఆడుకుంటారు, ఇంతరాత్రిపూట ఏం కొంపలు మునిగిపోయాయనిఎవరు వచ్చారో,” భర్తను  పిల్లలను విసుక్కుంటూ చెక్కిన చీర  కుచ్చిళ్ళు కిందకు లాగి  తలుపు తీసింది రమణి.

చీకట్లో నిలుచుకున్న వ్యక్తి అటువైపు తిరిగి ఉంది పోల్చుకోలేక ‘‘ఎవరు కావాలండి‘‘ అడిగింది అనుమానంగా.

‘‘రమణి నేనమ్మా‘‘  అంటూ ఇటువైపు తిరిగిన మనిషిని చూసి ఆశ్చర్యంతో పాటునోట మాటరాలేదు  రమణికి.

“బాగున్నారా అందరు,”   కూతురుని గట్టిగా కౌగిలించుకొని అడిగింది రమణి తల్లి వరలక్ష్మి,

“అమ్మా  నువ్వు ఇలా ఒంటరిగా ఇంత రాత్రి పూట వచ్చావేంటి?  కబురుపెడితే నేనే వచ్చి తీసుకవచ్చేదాన్ని కదా! అయినా నాన్నెందుకు రాలేదు నీ కూడా,  పోనీ అన్నయ్యకు చెబితే

వాడు దిగబెట్టేవాడు   సరే  నువ్వు ముందు లోపలికి రా ,”  ఏదో జరిగినట్టుంది  అమ్మను

నాన్న బాధపెట్టాడో  లేకపోతే   వదిన గుణం మంచిది కాదు ఏదో అని ఉంటుంది  అనుకుంటూ తల్లి చేతిలోని బ్యాగు తీసుకుంటూ ఇంకో చేత్తో   తల్లిని పట్టుకుని లోపలకు వస్తూ.

“ ఒరేయ్ పిల్లలు ఏవండీ చూడండి ఎవరు వచ్చారో,

“ అరే  అత్తయ్య మీరా!  బాగున్నారా మీరు ఒక్కరే వచ్చారా మామయ్య ఎక్కడ తలువైపు చూస్తూ అడిగాడు భాస్కర్.

“అమ్మమ్మ,”  అంటూ ఇద్దరు పిల్లలు  వినయ్ విజయ్  వచ్చి వరలక్ష్మమ్మ ను  పట్టుకున్నారు.

తన్నుకొస్తున్న బాధను దిగమింగుకుంటూ “ బాగున్నారా అల్లుడుగారు,” భాస్కర్  అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా అడిగింది.

“ అమ్మను ఏమీ అడగకండి,” అన్నట్టుగా సైగ  చేసింది రమణి.

“ఆ  అత్తయ్య మేము  బాగున్నాము  రమణి మీ అమ్మా ఎప్పుడైనగా  బయలుదేరారో  ఏమో లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టు,”  చెప్పాడు  భాస్కర్.

“అలాగే అమ్మ  కాళ్ళు  కడుగుకొని  రా  ఈ లోపు వేడివేడిగా దోషలు  వేస్తాను,”

దోసెలు తింటున్నంతసేపు  ఏమి  మాట్లాడకుండా మౌనంగా  తిన్నది. రమణి అడిగినదానికి

పొడిపొడిగా సమాధానం చెప్పింది. రమణి కూడా  ఎక్కువగా  మాట్లడించకుండా  ఊరుకుంది.

గదిలోకి వెళ్ళి పడుకుందామనుకుంటుండగా మనవలుఇద్దరు  వచ్చారు .

“ అమ్మమ్మా మేము నీతోనే పడుకుంటామంటే   అమ్మకు చెప్పు  వద్దంటుంది,” తల్లిమీద షికాయితు చెబుతూ చెరోవైపు  దుప్పటికప్పుకుని పడుకున్నారు.

“ ఓరేయ్  అమ్మమ్మ అలసిపోయి వచ్చింది  రేపటినుండి పడుకుందుకురుగాని  రండిరా,”

“ పోనిలే  రమణి  పిల్లలు సరదా పడుతున్నారు పడుకోనివ్వు,  నాకేం అలసట లేదు నేను బాగానే ఉన్నాను నువ్వెళ్ళి పడుకో,” మనవలను ప్రేమగా నిమురుతూ చెప్పింది.

“ అదికాదమ్మా  నువ్వు ప్రయాణం చేసి వచ్చావు  వీళ్ళు  నిద్రలో  మాములుగా పొర్లరు,

వీళ్ళును సవరించడమే నీకు సరిపోతుంది  నీకు  నిద్రపట్టదు , రేపటినుండి  నీ దగ్గరనే పడుకోని నాకేం బాధలేదు,”

“ ఏం పర్వాలేదు నాకు అంతగా నిద్ర పట్టదు లేవాళ్లను ఏమనకు వెళ్లి పడుకో తల్లి ‘‘

ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది.

“ రమణి…   ఏమిటి  మీ అమ్మ  ఎన్నడు లేనిది  ఒంటరిగా  రావడం ఆశ్చర్యంగా లేదు? పైగా మీ నాన్నని విడిచి ఎక్కడికి వెళ్లదు అలాంటిది  ఇలా  రావడం‘,”

“ అవునండి నాకు అదే అర్థం కావడం లేదు ఏం జరిగిందో రేపు మెల్లగా అడుగుతాను ,  ఒకవేళ నాన్నగారు రాను  అంటే గనుక మనను  చూడడానికి వచ్చేదేమోమనం వెళ్ళి కూడా  రోజులైంది కదా, ఏమో నాకు ఏమి   తోచడం  లేదు  ఒకవేళ మా వదిన గుణం  మంచిది కాదు ఆమెతో ఏమైనా గొడవ అయిందేమో,”

“సరేలే   రేపు  మీ అమ్మ మనసు  నొప్పివ్వకుండా  అడిగి తెలుసుకో,”  భార్యను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు.

కళ్ళుమూసుకుని  పడుకున్నదన్నమాటే  కానీ  కంటిమీద కునుకు రావడం లేదు. ఎంత వద్దనుకున్నా  తన గతమంతా  కళ్ళముందు   రీళ్ళలా గిర్రున తిరుగసాగింది.

చాలా బీద కుటుంబం తల్లితండ్రులకు ఆరుగురు ఆడపిల్లల్లో తాను పెద్దది. చదివించడానికి తాహతులేదు అలాగని మంచి సంబంధాలు చూసి  పెళ్ళి  చేసే స్థోమతలేదు.  పన్నెండెళ్ళు

రాగానే  గంతకు తగ్గ బొంత అన్నట్టుగా  మాములు పరిస్థితి  అయినా కుటుంబం వాళ్ళను చూసి పెళ్ళి చేసేసి  చేతులుదులుపుకున్నారు.కృష్ణమూర్తికి వరలక్ష్మీకి   ఇరవై ఏళ్ళు తేడా    చిన్నతనంపెళ్ళి  అంటే తెలియని ఆనందమే తప్పా  కష్టాలు కన్నీళ్లు  ఉంటాయన్న విషయం తెలియని అమాయకత్వం  వరలక్ష్మిది . కృష్ణమూర్తి  భార్యను  ప్రేమగా  చూసుకునే వాడు కాకపోతే అతను పట్నంలో ఉద్యోగం  వారానికొకసారి వచ్చేవాడు . చిన్నపిల్ల కదాని  అత్తమామలతో  ఉండేది. చిన్న పిల్లని కూడా చూడకుండా  ఇంటెడు చాకిరి చేయించేది  కృష్ణమూర్తి తల్లిమామను చూస్తే భయంతో వణికిపోయేది.

ఒకరోజు కృష్ణమూర్తి   పట్నం నుండి వస్తూ మల్లెపూలు మిఠాయి తెచ్చి  భార్య చేతికిచ్చాడు.

వరలక్ష్మి సంతోషంతో చక్కగా తయారై  నెత్తినిండా మల్లెపూలు పెట్టుకుని మిఠాయి పట్టుకుని

ఇవ్వడానికి వచ్చింది. అది చూసి వరలక్ష్మీ అత్త కళ్ళు భగ్గుమన్నాయి.

“ ఏమిట్రా  ముందొచ్చిన కొమ్ములకంటే  వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా  నిన్నగాక మొన్న వచ్చిన  నీ పెళ్ళాం  మీద ప్రేమ  పొంగిపోతుంది, మిఠాయి నీ భార్య చేతికిచ్చి  పంచమన్మావాఇప్పుడే  నిన్ను చేతిలో పట్టుకుందంటే  రేపు రేపు మా చేతికి చిప్పే ఇస్తుందిఏమయ్యా  చూసావా,” భర్తను రెచ్చగొడుతూ  కోడలివైపు కొరకొరా చూస్తూ అడిగింది.

“ ఏరా  మీ అమ్మ చెప్పింది  నిజమేనా ? చూడు  మన ఇంటావంటా లేదు పెళ్ళాం చేతిలో కీలుబొమ్మగా అవడం , నువ్వు తనకు  అలసిచ్చావనుకో  రేపు అన్ని పనులు నీతో చేయిస్తుంది  అంతేకాదు  వాళ్ళ వాళ్ళను  తీసుకొచ్చి నీ నెత్తిన రుద్దుతుంది,  నువ్వు నీ భార్య కాళ్ళకు మడుగులొత్తావంటే  నిన్ను చాతకాని దద్దమ్మను చేసి  ఆడుకుంటుంది,

ఇప్పటికి మీ అమ్మ నేను గీచిన  గీతదాటదు తెలుసా ? ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో

జాగ్రత్త,” కోడలువైపు   ఉరిమిచూస్తూ  కొడుకును గట్టిగా మందలించాడు.  వరలక్ష్మీ భయంతో వణుకుతూ  తన చేతిలో ఉన్న మిఠాయి అక్కడే పెట్టి   ఏడుస్తూ  తన గదిలోకి పారిపోయింది.

తండ్రి చెప్పిన మాటలు కృష్ణముర్తి   మెదడు మీద బాగా పని చేసాయి.  అవును భార్యను

అదుపులో పెట్టుకోకపోతే  తన స్నేహితుడి భార్యలాగా  అడిగిందల్లా కొనిపెట్టాలి . ఎక్కడికంటే

అక్కడకు తీసుకెళ్ళాలి  డబ్బుల గురించి ఆలోచించదు పాపం వాడు ఎన్నిసార్లు నాతో చెప్పుకుని  బాధపడినాడో  నేను అలా కాకూడదు. నాన్న చెప్పినట్టు  ఈరోజునుండి జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు.

గదిలో  వెక్కి వెక్కి  ఏడుస్తున్న తనను  భర్త వచ్చి ప్రేమగా తనను ఊరడిస్తాడేమోనని ఎదురుచూసిన వరలక్ష్మీకి  ఖంగుమని భర్త కంఠం వినగానే  పై ప్రాణాలు  పైనే పోయాయేమో అనిపించింది.

“ ఇంకా ఎంతసేపు  ఏడుస్తావు? బయటకు వచ్చి  వంట సంగతి  చూసేది  ఉన్నదా లేదా,”

ఉరిమిచూస్తూ   అడిగాడు గది చేరేడు పట్టుకుని.

వస్తున్న ఏడుపును  పళ్ళబిగువున దాచి  వంటగదిలోకి వెళ్ళింది. ప్రేమగా చూసుకునే భర్తను   తండ్రి మాటలతో  మార్చాడు ఇక  తనకు   కష్టాలు  కన్నీళ్ళు తప్పా  ప్రేమకు నోచుకునే  అదృష్టం లేదు  గుండెరగిలిపోతుంది. అయినా నోరు మెదపకుండా  పనులన్నీ  చేసుకుపోతుంది. ముగ్గురుకలిసి ఏం ఆలోచించారో కానీ   భర్తతోపాటు  పట్నం పంపించారు.

ఊహించని ఈ పరిణామానికి  వరలక్ష్మీ  భర్తకు  మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది.

తల్లి తండ్రి మాటలకు ఎదురుచెప్పకూడదని  అలా కోపంచేసాడేమో . నామీద ప్రేమ లేకపోతే

నన్ను  ఎందుకు ఇప్పుడే తనతో పాటుగా  తీసుకవస్తాడు . పోనిలే ఇప్పటికైనా  నా అదృష్టం

పండినందుకు  ఆనందంగా ఉంది. నా భర్తతో   నేను సంతోషంగా కాపురం చేసుకుంటాను

మనసులో పొంగిపోయింది వరలక్ష్మీ.

“ ఏమండి  నా  మీద ఇంతప్రేమ  ఉన్న మీరు  ఆరోజు   కోపగించుకుంటే  నాకు చాలా భయమేసింది,  నేను  ఉన్నదాంట్లో  తృప్తిగా నడుచుకుంటాను  మీకు కష్టం కలిగించను,

మీరు ఎలా  చెబితే అలా  నడుచుకుంటాను  మీ ప్రేమ ఉంటే చాలు,” భర్త కౌగిలిలో ఇమిడిపోతూ  చెప్పింది.

“ అబ్బా లక్ష్మీ ఇప్పుడు  మాటలతో  టయం వృధా చెయ్యకు,” తనలో పెల్లుబికి వస్తున్న

ఉద్రేకాన్ని  చల్లారేవరకు  భార్యకు  ఊపిరాడనివ్వలేదు  ముద్దులతో ముంచెత్తుతూ.

భర్త ప్రేమలో  తలమునకలౌతున్న  వరలక్ష్మీ  తన  అదృష్టానికి మురిసిపోయింది. అలసట తీరగానే  ఇద్దరు పడుకున్నారు.

“ లక్ష్మీ నేను ఆఫీసుకు  వెడుతున్నాను  జాగ్రత్తగా  ఉండు  ఇరుగుపొరుగు  వాళ్ళతో  పనికిరాని  ముచ్చట్లువేసుకోకు  తలుపేసుకుని  ఇంట్లోనే  ఉండు,” కరకుగా  చెబుతూ వెళుతుంటే.

“ ఏమైందండీ  అంత కోపంగా ఉన్నారు ,”

“ఒకసారి  చెబితే  అర్థంకాదా! నేను  చెప్పినట్టు వినాలి  ఎదురు ప్రశ్నలు  వెయ్యొద్దు,

చెప్పింది విని నోరు మూసుకుని  పని చేసుకో,” బూట్లు టకటకలాడించుకుంటూ వెళ్ళిపోయాడు  కృష్ణమూర్తి.

తలమీద  ఎవరో  పెద్ద బండరాయి  వేసినట్టు కూలబడిపోయింది  వరలక్ష్మీ. రాత్రి  ఆయన చూపిన  ప్రేమ వట్టిదేనా  అవసరం కోసం  అలా ఉంటాడన్నమాట. ఈయనలో నేనాశించిన మార్పు కాదు   పంజరంలో బంధించాడన్నామాట. అంటే  ఇక తను  యాంత్రికమైన జీవితం గడపాలి . మెల్లిగా  తననుమార్చుకునే  ప్రయత్నం చేస్తాను  అనుకుంది మనసులో.

రోజులు సంవత్సరాలు గడిచిపోతున్నాయి  ఇద్దరు పిల్లలు పుట్టి  వాళ్ళ చదువులు  ఉద్యోగాలు  పెళ్ళిళ్ళు అయ్యాయే కానీ   తను కోరుకున్న మార్పు భర్తలో  ఇసుమంత కూడా రాలేదు.  మగవాడిని పైగా  మొగుణ్ణి అన్న అహంకారం  రోజు రోజుకు పెరిగి పెద్దదయిందే తప్పా  తగ్గలేదు.  అరవైయేళ్ళు   వచ్చి రిటైర్మెంట్  తీసుకున్నాక  ఇంటిపట్టునే ఉంటాడు.

అప్పుడైనా  మనిషిలో  నేను కోరుకున్న  ఫలితం  దొరుకుతుందనుకున్న  నా ఆశ అడియాసగానే మిగిలిపోయింది. చెప్పాలంటే   చాదస్తం కూడా   ఎక్కువే  అయిందని చెప్పాలి.

ప్రతిరోజు ఎంత కమ్మగా వండిపెట్టినా  మెచ్చుకుంటే నేనెక్కడ పొంగిపోతానోనని  ఉప్పెక్కువయిందనో  పప్పు ఉడకలేదనో  రసం పుల్లగా ఉందని కాపురానికి  వచ్చినప్పటి నుండి వంకపెట్టడం  ఇప్పటికి మారలేదు.  నలుగురిలో  తన భార్యను అదుపులో పెట్టుకుంటున్నానని తెలియడం  కోసం  చెడామడా  తిట్టడం .  పోని తరవాతనైనా  ప్రేమగా మాట్లాడుతాడ అంటే  అదీలేదు  ఇక భరించుకోలేకపోతుంది .  ఆలోచనలతో ఎప్పుడోగాని నిద్రపట్టలేదు వరలక్ష్మీకి.

“ రమణి  ఇంకా ఎంతసేపు పడుకుంటావు  లే లేచి  మీ అమ్మగారు  లేచినట్టున్నారు చూడు,” భార్యను తట్టిలేపుతూ అన్నాడు భాస్కర్.

“ అబ్బా  అప్పుడే  తెల్లవారిందా?   ఈ రోజు ఆదివారమే కదండి  కాసేపు  పడుకుంటాను  మీరు  కూడా  రండి పడుకోండి,   పిల్లలు కూడా  ఇప్పుడే లేవరు  అమ్మ లేచినా  తన పని తాను చేసుకుంటుంది లెండి ,” మగతగా చెబుతూ దుప్పటికప్పుకుని పడుకుంది రమణి.

“ సరేలే  నువ్వు పడుకో  నేను అలా వాకింగ్ కు వెళ్ళి వస్తాను,” చెప్పులేసుకుని  బయటకు

వెళ్ళిపోయాడు. వరలక్ష్మీ లేచి  కాలకృత్యాలు తీర్చుకుని పూజా చేసుకుని టిఫెన్ తయారుగా

పెట్టింది .

“ అమ్మా  … నన్ను లేపలేదు  ఎందుకు  ఎంత టయం అయిందో చూడు, అన్ని ఒక్కదానివే చేసావు  ఇద్దరం కలిసి చేసుకునే  వాళ్ళం కదా,” తన పనులన్నీ  చేసుకుని వచ్చి తల్లితో అంది  రమణి.

“ పోనిలేమ్మా  ఈరోజు  అందరికి సెలవు కదా  తొందరేముంది చెప్పు, పిల్లలను  అల్లుడిని అందరిని పిలువు  వేడి వేడిగా పూరీలు తిందురుగానీ,” స్టౌ వెలిగిస్తూ చెప్పింది .

“ ఏమంటుందత్తయ్యా మీ అమ్మాయి ? తనను లేపలేదనేనా  నేను ఎన్నిసార్లు పిలిచినా లేవనని  దుప్పటి కప్పుకుని పడుకుంది, పైగా  మా అమ్మా ఉంది  నాకు రెస్ట్ అని కూడా చెప్పింది  ఇప్పుడేమో ప్రేమ ఒలకబోస్తుంది చూడండి  గడుసమ్మాయి,” డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ  నవ్వుతూ  అన్నాడు .

“ పోనిలే బాబు  రోజు అదే చేసుకుంటుంది  నేనున్నప్పుడే   కదా దానికి  విశ్రాంతి,”

“ అలా చెప్పమ్మా మీ అల్లుడికి  ఒక్కపనిలో  కూడా సహాయం చెయ్యరు గానీ నేను పడుకుంటే మాత్రం  కుళ్ళు,” బాగయిందా అన్నట్టు భర్తవైపు  చూసి కనుబొమ్మలెగరేసింది .

“ అబ్బా అమ్మమ్మా గుమగుమలు వస్తున్నాయి,  అమ్మమ్మా  మా అమ్మ చెప్పిన మాటలు అబద్ధం  రోజు మా నాన్న ఎన్ని పనులు చేస్తాడునుకున్నావు,” తల్లిమీద చాడీలు చెప్పుకుంటూకమ్మగా ఉన్నాయంటూ తింటున్నారు పిల్లలు.

“ అది అలా చెప్పండిరా మీ అమ్మ  గురించి  ,” రమణిని వెక్కిరిస్తూ అన్నాడు.

“ వార్నీ  మీరు నా పిల్లలేనట్రా ! మీకు  మీ అమ్మ ఎంత కష్టపడి  ఎన్ని చేస్తున్నా  మీ నాన్నకే  సపోర్టిస్తారా,” పిల్లల చెవి మెలిపెడుతూ అంది.

“ పోనిలేమ్మా ఏదో సరదాగా నిన్ను ఆటపట్టిస్తున్నారు ఇంకో పూరి వేసుకో ,” చిన్నబుచ్చుకున్న కూతురు  ముఖం చూస్తూ  నవ్వుతూ అంది వరలక్ష్మీ.

“ అత్తయ్యా  పూరీ …కరి చాలా బాగున్నాయి తృప్తిగా తిన్నాము, మీరు కూడా రండి  నేను వేస్తాను వేడిగా,”

ఆశ్చర్యంతో అల్లుడివైపు చూస్తూ.  “ మీరు వేస్తారా,” అడిగింది.

“ అదేంటండీ  నేను చెయ్యగూడని  పని అన్నట్టుగా  ఆశ్చర్యపోతున్నారు, నాకు పనులన్నీ  అలవాటే మీ అమ్మాయి  దయవలన అన్ని వంటలు వచ్చు,” నవ్వుతూ చెప్పాడు.

“ అవునమ్మా  ఆయన పూరీలు చాలా బాగా వేస్తారు రా ఇలా వచ్చి కూర్చో,” అంది .

పూరీ తింటుంటే టపటప కన్నీళ్ళు జారిపడినాయి వరలక్ష్మీకి.

“ అమ్మా … ఏడుస్తున్నావా  నాన్న గుర్తుకు వచ్చారా? నాన్న  వచ్చింటే  బాగుండేది,”

తల్లి కళ్ళు తుడుస్తూ అంది.

“ ఏం లేదమ్మా  నేను కాపురానికి  వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ఒక్కరోజైనా  తిన్నావా

తింటావా  అని కానీ అన్న పాపాన పోలేదు మీ నాన్న,  ఎన్ని చేసినా బాగుందని ఏనాడు చెప్పలేదు  అల్లుడు అలా అడిగేసరికి తట్టుకోలేకపోయాను,”

“ అమ్మా … నాన్న గురించి తెలిసి కూడా  ఎందుకు బాధపడతావు  ఆ మనిషంతే, అమ్మా నాన్నకు నీకు ఏమైనా గొడవయిందా? నువు ఏనాడు నాన్నను  విడిచి ఒంటరిగా  రావడం చూడలేదు, నాన్నకు ఇబ్బంది అవుతుందని  ఎక్కడకు వెళ్ళనిదానవు  ఏమైందమ్మా,”

తల్లి చబుకం పట్టుకుని అడిగింది రమణి.

“ ఏం చెప్పమంటావు తల్లి … మీ నాన్నను భరించడం నావల్ల కావడం లేదు , నాకు ఏభైఏళ్ళు వచ్చాయి వయసైపోయింది  ఇంకా  నన్ను మాటలతో  చంపుతుంటే  నా మనసు తట్టుకోలేకపోతుంది, ఆయన నా మీద ప్రేమ చూపకపోయినా పరవాలేదు  నన్నో మనిషిగా

చూస్తే చాలనుకున్నాను, ఇంత వయసొచ్చినా కూడా   భార్యను అదుపులో పెట్టుకోవాలనే

అహంకారం వదలట్లేదు, ఏమన్నంటే  నువ్వు  ఎక్కడకు వెళతావో వెళ్ళు నేను హాయిగా బతుకుతాను అంటాడు, ఈ వయసులో కూడా ఆ బింకం మాటలు  వినలేక  కావాలనే

వెళ్ళి వచ్చాను,” చెప్పడం ఆపింది గుండెలోని బాధ ఎగతన్నుకు వస్తుంటే.

“ అమ్మా  ఊరుకో  ఇన్నాళ్ళు భరించనదానివి  ఇప్పుడేంటమ్మా   కొత్తగా బాధపడుతున్నావు,  నాన్నకు నువ్వంటే  ప్రేమ లేక కాదుతాతయ్య చెప్పిన మాటలు

బాగా నాటుకుపోయాయి, వాటినుండి బయటపడలేకపోతున్నాడు  మనసులో నీమీద చాలా ప్రేముందమ్మా,” తల్లిని ఓదారుస్తూ అంది రమణి.

“ ఆ ఆ  ఉంది  నాకు తెలియదేంటి   మీ నాన్న ప్రేమ? ఏం మీ నాన్నను అనగానే రోషంపొడుచుకొస్తున్నట్టన్నది, అవున్లే మీరందరు మీ నాన్న వైపే మాట్లాడుతారు  నేను చాకిరికి  మాత్రమే పనికొస్తాను,” కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అంది వరలక్ష్మీ.

“ అదికాదమ్మా  నాన్న  చాలాసార్లు నాతో చెప్పేవాడు  తెలుసా!  పాపం మీ అమ్మ అమాయకురాలు  నేను ఎన్ని మాటలన్నా నోరెత్తదు  నా కోసం ఎంతో చేస్తుంది, ఏమి అనొద్దు

అనుకుంటాను  కానీ  మా నాన్న గుర్తుకువస్తాడు  మా నాన్నకిచ్చిన మాటను జవదాటలేక

లక్ష్మీని  తిడతాను   తనంటే నాకు ప్రేమలేక కాదు,   అని ఎన్నోసార్లు చెప్పి బాధపడినారమ్మా

నీ ముందు బయటపడలేకపోతున్నారు, ఇప్పుడు నువ్వు ఇలా వచ్చావు కదా  నాన్న నిన్ను వెతుక్కుంటూ వస్తారా లేదా చూడు,”  తల్లి   ముఖం వైపు చూస్తూ అంది.

విప్పారిన మోముతో “ రమణి  నువ్వు చెప్పేది నిజమా ! మీ నాన్నకు  నా మీద అంత ప్రేముందా ? అయ్యో  పిచ్చిదాన్ని నేనే అర్థం చేసుకోలేకపోయానే  అయన్ని, ఏమిటో ఆయన

నన్ను ఈనాడు కొత్తగా అన్నట్టు  కోపంగా  వచ్చేసాను  పాపం ఆయన తిండికోసం ఎంత బాధపడుతున్నారో, నా చేతి  వంటకు  వంకపెట్టినా  ఇంకెక్కడా ఆయనకు భోజనం సహించదు, ఈ వారం రోజుల్లో ఎంతగా చిక్కిపోయారో ఏంటో  రమణి  నేను బయలుదేరుతానమ్మా ,” మనసంతా వ్యాకులపడుతుండగాతినేదల్లా లేచింది.

“ అయ్యో అమ్మా  తినకుండానే  లేచావేంటి?  ముందు పూరి తిను తరువాత ఆలోచిద్దాము

మీ అల్లుడు దింపి వస్తారు  కూర్చో, ఏమండి  మా అమ్మ వెళతానంటుంది  మీరు దింపండి

సరేనా,” అత్తగారు బాధపడుతుంటే ఆమెనే చూస్తూ కూర్చున్న భర్తతో చెప్పింది.

“ అలాగే  రమణి… అత్తయ్యా  మీరేంటి  ఇలా బాధపడుతున్నారు, మా అందరికి ధైర్యం నూరిపోసే  మీరిలా మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా ఉంది,  ఎలాగు వచ్చారు  ఓ నెలరోజులపాటు  ఉండండి  మామయ్యకు కూడా  మీ మీద  ప్రేమ పెరుగుతుంది, మీరు లేని లోటు బాగా తెలిసి వస్తుంది  ఇంకెప్పుడు  మిమ్మల్ని  పల్లెత్తు మాటనడు,” ఊరడింపు మాటలు చెప్పాడు   భాస్కర్.

“ అయ్యో  అన్ని రోజులుండలేను బాబు  ఏదో మనసు బాగాలేక వచ్చాను, మీ మామయ్య ఒక్కరు ఏం ఇబ్బందిపడుతున్నారో ఏమో ,  మీరేమనుకోకపోతే నన్ను  ఇంటికి దగ్గర దింపిరండి  ఎలాగు  సంక్రాంతి పండుగ వస్తుంది కదా  రమణి పిల్లలు కూడా వస్తే  పండుగవరకు ఉంటారు  పండక్కు మీరూ రండి,” తను అలా రావడం తప్పు చేసిన దానిలా సిగ్గుతో  తలవంచుకుని చెప్పింది అల్లుడితో.

“  అవును  నువ్వు నాలుగు రోజులు కాలేదు మీ ఆయన వదిలి వచ్చి అప్పుడే బెంగపెట్టుకుని వెళ్ళిపోతానంటున్నావు, నన్నేమో  ఇంకా ఇరవై రోజులన్న సంక్రాంతి పండక్కి రమ్మంటున్నావు,  పాపం మా ఆయన ఒక్కడు ఎలా ఉంటాడనుకున్నావమ్మ అన్ని రోజులు,” నవ్వుతూ అడిగింది రమణి.

“ అబ్బే నాకేం ఇబ్బందిలేదు  రమణి  నువ్వు వెళతానంటే  సంతోషంగా  వెళ్ళిరా  నా కష్టాలేవో

నేను పడతాలే,” మోహంలో బాధకనపరుస్తూ అన్నాడు భాస్కర్ .

“ అవునవును నేను లేకుంటే  మీకు సంతోషమే నాకు తెలియదు మీ సంగతి,  క్లబ్బుకు వెళ్ళడం పేకాట ఆడుకుంటూ రోజులన్ని వెళ్ళబుచ్చుతారు అందుకే కదా నన్ను వెళ్ళమంటున్నారు,” భర్తను దెప్పుతూ  కాలుమీద గట్టిగా నొక్కింది తన కాలుతో అడిగింది.

“అయ్యో  అయ్యో చూసారా అత్తయ్యా మీ ముందే నన్నెలా  బాధపెడుతుందో,” గట్టిగా అరిచాడు .

“ రమణి ఏంటమ్మా ఇది  అల్లుడిని వదిలెయ్యి మీరెవ్వరు నాతో రానక్కరలేదుగాని నన్ను వెళ్ళనివ్వండి,” ఆరాటంగా అడిగింది.

తలుపు చప్పడవుతుంటే  వెళ్ళి తలుపుతీసాడు   భాస్కర్  ఎదురుగా  నిలుచున్న మామను చూడగానే సంతోషంతో . “ ఏయ్ రమణి ఎవరొచ్చారో చూడు,” అంటూ పిలిచాడు.

“ ఆ ఇంకెవరొస్తారు  మా నాన్నే వచ్చింటాడు అమ్మా మీ ఆయనొచ్చాడు చూడు,” తల్లి చేతిని పట్టుకుని  హాలులోకి తీసుకవచ్చింది . ఆశ్చర్యంతో భర్తను కూతురిని మార్చి మార్చి చూసింది. ఈయన వస్తాడని నీకు ముందే తెలుసా అన్నట్టుగా.

“ లక్ష్మీ బాగున్నావా?  ఏంటి అలా చిక్కిపోయావు  ఒంట్లో బాగాలేదా,” భార్యను చూడగానే ఎంతో  ఆప్యాయంగా  అడిగాడు .

“ ఏమండి  మీరు మీరు నాకోసం వచ్చారా ?  నన్ను  ఎలా ఉన్నావని అడుగుతున్నారా,

నేను మీకు చెప్పకుండా వచ్చానని నన్ను తిడతారేమోనని భయపడుతున్నాను,  నా మీద కోపంలేదా మీకు,” గొంతు తడబడుతుండగా భర్త మాటలు నమ్మకం కలగలేనట్టుగా అడిగింది.

“ లక్ష్మీ … నేను ఇన్నాళ్ళు నీ మనసును కష్టపెట్టాను కదూ ! ఇక నుండి నిన్ను ఒక్కమాటనను  పద మనింటికి  వెళదాము, నిన్ను కోపంతో తిడతానే కానీ నువ్వులేని ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను, మన పెళ్ళైన నాటి నుండి  నువ్వు నన్నువదిలి వెళ్ళిందే లేదు  నేను తిట్టినా నిన్ను పట్టించుకోకపోయినా  నా మీద ఎన్నడు నువ్వు ద్వేషం చూపలేదు, నీకు  ఏలోటు రాకుండా చూసుకున్నాననుకున్నానే గానీ నీ మనసులోపలకు  చూడలేకపోయాను, నువ్వడగకుండానే  నగలు కొనిపెట్టాను పండుగలకు  నాకు నచ్చిన చీరలు నీకు తెచ్చి ఇచ్చాననుకున్నానే గానీ  ప్రేమగా  నీ కళ్ళల్లోకి చూడలేకపోయాను, అయినా నువ్వు నన్ను ఎప్పుడు ఈసడించుకోలేదు అంటే నీకు నా మీద  ఎంత ప్రేముంటే  నన్ను భరించుకున్నావు చెప్పు, నిన్నర్థం చేసుకోలేని నేను నిజంగా  మూర్కుడినే  నీ ప్రేమకు నేను అర్హుడను కానుకానీ  నువ్వు లేకుండా ఉండలేను, లక్ష్మీ నువ్వు నన్ను  వదిలి రాగలిగావంటే  నీ మనసెంత  గాయపడిందో  నేనూహించగలను,

నీతోడు లేకుండా నేను నాతోడు లేకుండా నువ్వండలేవు  మనం ఒకరికొకరు తోడునీడగా కలిసుందాము,” లక్ష్మీ రెండు చేతులుపట్టుకుని తన మనసులో ఉన్న ఆవేదనను బయటపెట్టాడు.

“ ఏమిటండి ఇది  చిన్నపిల్లల్లా…  మీరు బాధపడడమేంటి   తప్పుచేసింది  నేను, మీకు చెప్పకుండా  రావడం నాదే పొరబాటు  చిన్న మాటంటే పడలేని భార్య   భర్తకు ఏం గౌరవం ఇచ్చినట్టు చెప్పండి, నేనే  మీ మనసు అర్థంచేసుకోలేదు   మీకు నా మీద ఎంత ప్రేముందో  నా చాటుగా  మీరు అమ్మాయితో ఎన్నోసార్లు చెప్పారట, మీరు   మీ ప్రేమను మనసులో దాచుకున్నారు  నేను బయటకు కనపరచాను, ఏమండి ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడకు వెళ్ళను,” అంది  ప్రేమగా భర్త వైపు చూస్తూ.

“  చూసావా రమణి మీ అమ్మ గొప్పతనం  నేను  తనను  బాధపెట్టినా  కూడా  నన్ను నిరపరాధి అంటుంది,  నేను బాధపడితే సహించలేదు అందుకే తనదే తప్పంటుంది  ఇంత మంచి మనసున్న నిన్ను  ఎంతో ప్రేమగా చూసుకోవలసింది, మా నాన్న మాటకు కట్టుబడి నిన్ను  అణిగిమణిగి ఉండేలా చూసాను,  నువ్వు చెప్పినట్టు  నేను వింటే ఎక్కడ   నామీద పెత్తనం చెలాయిస్తావోనని నిన్ను ప్రతిదానికి  కించపరిచినట్టు  మాట్లాడడం నేర్చుకున్నాను అదే అలవాటైపోయింది,  నిన్ను చూస్తుంటే  ఎన్నో సార్లు బాధనిపించి  దగ్గరకు తీసుకుని ఓదార్చాలని  ప్రేమగా  నాలుగు మంచి మాటలు మాట్లాడాలనిపించేది, కానీ వెంటనే మా నాన్నా నా వెనకనే ముల్లుకర్ర పట్టుకుని  నన్ను గుచ్చినట్టు అనిపించి   తగ్గేవాడిని, కట్టుకున్న భార్యను హింసించే మగడిని  ఏ మగువ క్షమించదేమో , కానీ నా వరలక్ష్మి నా పాలిటి  ప్రేమమూర్తి   ఇంతటి దయామయిని   పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను ఇకనైనా,” భార్యను దగ్గరగా తీసుకుని గుండెలకదుముకుంటూ చెప్పాడు.

“ మీరిద్దరు  మీ తప్పులను మీరు ఒప్పుకోవడాలేనా మమ్మల్ని  పట్టించుకునేది ఉందా?

ఆదర్శ దంపతులు  ఒకరిమీద ఒకరికి పట్టేంత ప్రేమ ఉన్నా  పాము ముంగీసల్లాగా పోట్లాడుకుంటారు, పోనీలే ఇప్పటికైనా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు  మాకు చాలా సంతోషంగా  ఉంది కదండి,” తల్లిని తండ్రిని చేరోవైపు  పట్టుకుని అడిగింది రమణి.

“ అవునవును  నాకు చాలా సంతోషంగా ఉంది చెల్లాయి , నేను ఎన్నోసార్లు చెప్పాను నాన్నతో అమ్మను అలా తిట్టకండి  పాపం మనకోసం ఎంతో ఓపికతో  ఎన్నో చేసి పెడుతుంది,  తన మనసు ఎంత బాధపడుతుందో మీరు అర్థం చేసుకోవడంలేదని  చెప్పాను,  నన్నే తిట్టారు. నేను భార్య విధోయుడనని  నన్ను నా భార్య ఆడిస్తుందని  తనను అంటుంటే  విసిగిపోయి ఇంటికి రావడం మానేసింది తను,  అమ్మా … నాన్న మారిపోయారు కదా ఇక అందరం కలిసే ఉందాము సరేనా,” తల్లిని ఆర్తిగా పట్టుకుంటూ  చెప్పాడు రవి.

“ రవి  నువ్వెప్పుడు వచ్చావు ,” బావమరిదిని  అతని భార్యను చూసి అడిగాడు భాస్కర్.

“ నేనే రమ్మన్నానండి … నాన్న బయలుదేరగానే వాడికి ఫోన్ చేసి చెప్పాను, మా ఫ్రెండ్‌తో చెప్పాను నాన్న  గురించి  కాస్త కనిపెట్టుకుని ఉండమని, నాన్న గురించి  నాకు తెలుసు.

అమ్మ లేకపోతే ఉండలేడని  నాకు ఫోన్ చేసి  అడిగాడు అమ్మ  ఇంట్లో లేదు  ఎక్కడికి వెళ్లిందో  నాకు చెప్పలేదు , రాత్రి వరకు చూసి నాకు ఫోన్ చేస్తే చెప్పాను ఆరోజు, వెంటనే వస్తానంటే  నాలుగుకోజులాగి రమ్మని చెప్పాను, అప్పుడే  అన్నయ్యను కూడా రమ్మన్నాను

వాడు వచ్చే సమయానికి  అమ్మా నాన్నలు మాట్లాడుకుంటుంటే  తలుపు పక్కనే నిలబడి

చూడడం నేను చూసాను అంతే కదా అన్నయ్యా,” నవ్వుతూ అడిగింది రమణి.

“  మొత్తానికి  మీ అమ్మ నాన్నల మనసులు  మబ్బులు విడిపోయి  చల్లటి  వెన్నెల కురుస్తున్నట్టుగా  ఉంది , మామయ్య ఈ శుభసందర్భంగా మనందరం కలిసి పార్టీ  చేసుకుందాము, అందరు త్వరగా తయారవండి  సినిమాకు వెళ్ళి హోటల్‌లో  భోజనం

చేసి వద్దాము,” నవ్వుతూ చెప్పాడు భాస్కర్.

“ అలాగే బాబు  కానీ  మొత్తం ఖర్చు నేనే పెట్టుకుంటాను మీరెవ్వకు ఒక్క పైసా పెట్టకూడదు,

అలాగే నా మనవలు మనవరాండ్రు  వాళ్ళకేది కావాలన్నా నేనే కొనిపెడతాను ఏమంటార్రా

పిల్లలు,” పిల్లలను దగ్గరకు తీసుకుంటూ అడిగాడు ప్రేమగా.

“ అవును తాతయ్యా  మాకిష్టమైనవన్ని కొనిపెట్టాల్సిందే , ఎందుకంటే అమ్మమ్మ

నువ్వు సంతోషంగా ఉన్నారు కదా,” కిలకిలా నవ్వుతూ అంది పెద్దమనవరాలు.

ఆమెతోపాటు అందరు నవ్వుకున్నారు సేదతీరిన మనసులతో.

॥॥ శుభం॥॥

Written by Lakshmi Sharma Trigulla

॥॥ రచయిత్రి పరిచయం॥॥

పేరు- లక్ష్మీశర్మ త్రిగుళ్ళ
గృహిణి
భర్త పేరు- మెట్రామ్ శర్మ
(HMT రిటైర్మెంట్ )
ప్రవృత్తి –కథలు కవితలు రచనలు
4/10/2021కిన్నెర ఆర్ట్ ధియేటర్స్ ఆద్వర్యంలో
( మబ్బులు వీడిన ఆకాశం) కథల సంపుటి
మన తెలుగు కథలు డాట్ కామ్ వారి నుండి
(30/10/2022) ఉత్తమ రచయిత్రి బిరుదు
(సందెపొద్దు గూటిలోకి) కథకు (ప్రథమ బహుమతి)
( విశిష్ట బహుమతి) ఉత్తమ కథ బహుమతి ఓకే కథకు మూడు
రావడం
వివిధ పత్రికలలో మరిన్ని కథలు ప్రచురణ జరిగింది
మీ అందరి అభిమానంతో మరిన్ని మంచి కథలు రాయాలన్నదే
నా ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నృత్యకేకి

మూడో సీత కథ – సమ్యక్పరిశీలన